Sunday, March 16, 2014

99 ఓ బుల్లి కథ 87 --- ఆర్కిటిక్ వింటర్ లో ఓ రోజు



ఫోటో చూసి ఇదేదో భూత ప్రేత లోకం లో ఒక దృశ్యం అనుకుంటున్నారా! పోద్దునపూట మా ఇంటి కిటికీ లోంచి బయటకు చూస్తే కనపడిన దృశ్యం అది . ఈ వింటర్లో అనుకోకుండా నిన్న బయట వెచ్చగా చాలా బాగుంది. షాపు లన్నీతిరిగేసి కూరలూ గట్రా తెచ్చుకున్నాము . సాయంత్రానికి వర్షం పడటం మొదలయ్యింది. కానీ తెల్లారి కిటికీలోనుండి చూస్తే పై ఫోటో లా ఉంటుందని ఊహించలేదు.

మేము ఉండేది అమెరికాలో చికాగో దగ్గర. దాదాపు నవంబర్ నుండీ బాగా చలి మొదలవుతుంది. డిసెంబర్ నుండి మార్చ్ దాకా ఆకాశాన్నించి ఎవరో ముగ్గు పోస్తూ ఉన్నట్లు స్నో పడింది ఈ సంవత్సరం. (నీళ్ళు గడ్డకట్టుకుని ఐస్ గ మారటం,  0 డిగ్రీలు సెంటీగ్రేడు లేక 32 డిగ్రీలు ఫారన్  హీట్ దగ్గర అవుతుంది. స్నో పడుతోంది అంటే ఉష్ణోగ్రత అంతకన్నా తక్కువగా ఉందన్న మాట.) ఈ వింటర్ లో దాదాపు వరుసగా డెబ్భై రోజులు అలా ఉంది. దానికి ఆర్కిటిక్ నుండి వచ్చే ఈదురు గాలి తగిల్తే ఉష్ణోగ్రత -40F లాగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం పడిన స్నో 80 అంగుళాలు (అంటే దాదాపు 7 అడుగులు లేక 2 మీటర్లు). ఇది ఒక రికార్డ్. రోడ్లమీద స్నో తీసిన తరువాత ఉన్న అవశేషం కరగటానికి వేసే ఉప్పు చివరి రోజుల్లో దాదాపు అయిపోయింది.

ఇక్కడ  చికాగోలో వాతావరణంలో చలి సెప్టెంబర్ తో ప్రారంభ మయి, జనవరి ఫిబ్రవరి లో ఉదృతంగామారి, మార్చికి చాలావరకు తగ్గి, ఏప్రిల్ లో చెట్లు చిగిర్చే విధంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా గడబిడ అయిపొయింది. "ఆర్కిటిక్ వర్టేక్స్" ట అనుకోని చలిగాలులతో రోజూ గొడవే. బయటికి వెళ్ళా లంటే శరీరం మీద కనీసం మూడు వరసల బట్టలు ఉండాలి. బయట అరవై రోజులు వరుసగా బిలో ఫ్రీజింగ్ (నీళ్ళు గడ్డ కట్టటానికన్న తక్కువ ఉష్ణోగ్రత). పైనించి ఎవరో వీభూతి చల్లుతున్నట్లు తెల్లగా స్నో పడింది. మునిసిపాల్టీ వాళ్ళు ట్రక్కు లను పంపించి స్నోని పక్కకి జరిపి రోడ్లన్నిటిమీదా కార్లు పోయేటట్లు చేస్త్హారు. ఈ సంవత్సరం రెండురోజుల కొకసారి స్నో పడుతూనే ఉంది. ఆ  స్నో ఎక్కడికి పోలేక రోడ్డుపక్క కొండల్లా తయారు అవుతాయి. వాతావరణం మరీ ఉదృతంగా ఉంటే జనాన్ని ఇంట్లో కూర్చో మంటారు. ఒకటి రెండు సార్లు మా ఊరి మేయర్ ఇంట్లో కూర్చోమని ఫోన్ చేశారు. ఇంతజరిగినా మా ఆవిడకు ఆఫీస్ వాళ్ళు ఒకరోజు మాత్రమే సెలవిచ్చి రావద్దన్నారు. ఆవిడ లైబ్రరీ లో పనిచేస్తుంది. లైబ్రరీ కొన్ని సమయాలలో ఉండటానికి చోటు లేని వారికి షెల్టర్ గ పని చేస్తుంది అది కారణ మవ్వచ్చు.

క్రింద మా వీధి ఫోటో చూడండి. అది మిట్ట మధ్యాహ్నం తీసినది. ఎండ ఉదృతంగా ఉంది కానీ చలి అంతకన్నా ఉదృతం. ఎండకీ చలికీ సంబంధం లేదు. ఇళ్ళ మీదా రోడ్లమీదా తెల్లగా కనపడేదల్లా పేరుకుపోయిన మంచు, మంచు దిబ్బలు. కొన్ని చోట్ల స్నో ని లారీలలో వేసి బయటికి పంపిన రోజులు కూడా ఉన్నాయి. ఇదే అనుకుంటే ఎయిర్ పోర్ట్ ల సంగతి ఇంకా గొడవగా ఉంటుంది. చికాగో ఎయిర్ పోర్ట్ లో కొన్ని సెకండ్ లకు ఒక ప్లేన్ లాండ్ అవటమో పైకి ఎగరటమో జరుగుతుంది. రన్వే లన్నిటి మీదా స్నోతీసేయ్యాలి. తీసిన స్నో ప్లేనులకు తగలకుండా దూరంగా ఉంచాలి. వచ్చిన ప్లేన్ ల మీద స్నోపడితే వెళ్ళే ముందర తీసెయ్యాలి (దీనిని డి ఐసింగ్ అంటారు). లేకపోతే రెక్కల మీద బరువుకి అవి ఎగర లేవు. అందుకనే ఈ సమయంలో చాలా ఫ్లైట్ లు కాన్సిల్ చేస్తారు. ఫ్లైట్ లు కాన్సిల్ అయి ఎక్కడికీ వెళ్ళలేక ఎయిర్ పోర్ట్ లో జాగారం చేసినవాళ్ళు ఎందరో.



వింటర్ లో స్నో కోసం పరితపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. "సోచి" లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ మీరు చూసే ఉంటారు. పిల్లలు స్నోమాన్ లు చేసి ఆడుకుంటారు. ఐస్ తో శిల్పాలు చెక్కుతారు.  ఇక్కడ మా గుళ్ళో శివరాత్రికి ఐస్ తో శివలింగం చెక్కుతారు. మా దగ్గరలో ఉన్న గ్రేట్ లేక్స్ లో ఒకటయిన లేక్ మిచిగన్ దాదాపు పూర్తిగా గడ్డకట్టుకు పోయింది. శని ఆది వారాల్లో కొందరు ఆ ఐస్ మీద గుడారాలు వేసుకుని గుంటలు తవ్వుకుని ఐస్ అడుగున ఉన్న నీళ్ళలో గేలం వేసి చేపలని పట్టుకుంటారు. దీనిని ఐస్ ఫిషింగ్ అంటారు. ఇంతెందుకు క్రిందటి వారం నీళ్ళు వచ్చేదాకా లేక్ లో గుంట తవ్వి చికాగో మేయర్ తో సహా చాలామంది స్కిన్ డిప్ చేశారు. అంటే బట్టలు లేకుండా నీళ్ళల్లో దూకటం అన్న మాట.

ఇంకా ఈ సంవత్సరం వింటర్ గురించి చెప్పాలంటే నయాగరా ఫాల్స్ ఈ వింటర్ లో రెండు సార్లు గడ్డకట్టుకు పోయింది. నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది. ఇంతెందుకు మా ఇంట్లో ఎప్పుడూ లేనిది నీళ్ళ పైపు పగిలి నరకం చూపెట్టింది. సామాన్యంగా ప్రతీ ఇంట్లోనూ ఒక చల్ల నీళ్ళు తీసుకు వచ్చే పైపూ ఒక వేడి నీళ్ళు తీసుకు వచ్చే పైపూ ఉంటాయి. జనవరిలో ఒక రోజు పొద్దున "వేడి నీళ్ళు రావటల్లేదు" అనే అరుపుతో నిద్దర లేచాను. అది మా ఆవిడ ఆర్తనాదం. చన్నీళ్ళ తో స్నానం ఐస్ నీళ్ళు పోసుకున్నట్లే. ఆవిడ చల్ల నీళ్ళతో స్నానం చెయ్యలేదు, తిట్టుకుంటూ వేడినీళ్ళు కాచుకుని స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళింది. నాకు ఏమయిందో తెలుసు నోరు ఎత్తలేదు. ఎత్తితే ఏమవుతుందో కూడా తెలుసు. ఇంట్లో ఉన్న గిన్నెలన్నిట్లో నీళ్ళు పట్టుకుని కూర్చున్నాను. మధ్యాన్నం కరెంట్ పోయింది. బ్యాటరీ లైట్లు వెతికి తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. థాంక్ గాడ్ మళ్ళా రెండు గంటల్లో తిరిగి వచ్చేసింది. ఇంట్లో చలి విపరీతం గా ఉంది. మా హీటర్ టెంపరేచర్ పెంచాను. కొంత సేపు తర్వాత మా ఇంటి క్రింద భాగం నుండి పెద్ద శబ్దం వస్తోంది. చూస్తే పైప్ పగిలింది. జరిగిన దేమిటంటే, చలికి పైప్లో నీళ్ళు గడ్డకట్టుకుపోయి పైపు పగిలి, నేను ఇంట్లో పెట్టిన వేడికి పైప్లో ఐస్ కరిగి, పగిలిన చోటి నుండి నీళ్ళు పెద్ద శబ్దం చేస్తూ రావటం మొదలెట్టాయి. వెంటనే ఇంట్లోకి నీళ్ళు రావటం ఆపేశాను. ప్లంబర్ ని పిలిచాం. మర్నాడు సాయంత్రానికి గానీ రానన్నాడు. ఈ పరిస్థుతులలో ఇంట్లో జరిగిన యుద్ధం గురించి నేను వ్రాయలేను. రామ రావణ యుద్ధం అని చెపుదా మనుకున్నా గానీ వర్ణన సరిఅయినదని అనిపించలేదు. మొగవాళ్ళు ఆడవాళ్ళు మధ్య యుద్ధ కాండ మన పురాణాలలో ఎక్కడయినా ఉంటే దాని వర్ణన అది అన్న మాట. ఒక రోజు నీళ్ళు లేక పోతే ఎంత గందరగోళం జరిగిందో మీ కర్ధం కాదు!. అదృష్ట వశాత్తూ చిన్నప్పుడు ఇండియా లో పెరిగాము కాబట్టి నిత్యావసారాలకి ఏమి చెయ్యాలో తెలియటం మూలంగా పెద్ద ఇబ్బంది పడలేదు. కాకపోతే కుళాయి తిప్పితే వచ్చే వేడి నీళ్ళ సుఖం ఒక రోజు లేదు. అంతకన్నా ఇంకేమీ లేదు.

మర్నాడు ప్లంబర్ వచ్చి బాగు చేసి, డబ్బులు తీసుకుని కొంచెం చివాట్లు పెట్టి పోయాడు. వాటి సారాంశం, ఉష్ణోగ్రత బాగా పడిపోతున్నప్పుడు కుళాయి లోనుండి నీళ్ళ ధార కొద్దిగా వదిలిపెడితే పైపులో నీళ్ళు ఫ్రీజ్ అవ్వవు. ఈ వారంలో వంద ఇళ్ళల్లో పైప్ లు బాగు చేశాడట!. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని సంతృప్తి పడ్డాము.

ఇంకొక వారం రోజుల్లో వసంతకాలం వస్తుంది. చెట్లు చిగిర్చి పూవులు పూయును. మళ్ళా వింటర్ దాకా,  ఒక ఆరు నెలలు జరిగినదంతా మరిచి పోవచ్చు.

1. క్రిందటి సంవత్సరం వ్రాసిన అమెరికాలో మా వీధి పోస్ట్
http://mytelugurachana.blogspot.com/2013/02/90-78.html