Thursday, June 25, 2015

114 ఓ బుల్లి కథ 102 --- మా పెరటి తోటతో ఇక్కట్లు

అమెరికాలో మేముండే ప్రాంతంలో ఏప్రిల్ మొదటి వారంలో బయట చెట్లన్నీ ఆకులూ గట్రా లేకుండా భూతాల్లాగా ఉంటాయి. ఏప్రిల్ చివరి వారం వచ్చేసరికి అవే చెట్లు ఆకులతో పువ్వులతో పచ్చగా నవ నవ లాడుతూ వుంటాయి. మాకు పెరటితోట వేసుకుని ఆనందించే భాగ్యం సంవత్సరానికి సెప్టెంబర్ లో చలి వచ్చే దాకా, మహా అయితే నాలు గైదు నెలలు మాత్రమే. అందుకని ఇంట్లో పెరిగిన మొక్కల్ని గార్డెన్ లో వేస్తే త్వరగా పంటని అనుభవించ వచ్చు అని, విత్తనాలు కొని ఏప్రిల్ లో ఇంట్లో నారు మడిలాగా వేశాం. మేము ఇంట్లో పెట్టిన గింజలన్నీ, టమాటో బీన్స్ సొరకాయ వంకాయ బెల్ పెప్పర్ అన్నీ మొక్కలుగా వచ్చాయి. ఇంకేం ఆనందం పరమానందం. కానీ ఇంతలో మొక్కల్ని వదిలేసి రెండు వారాలు న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చి చూసే సరికి ఆలనా పాలనా లేకపోయినా  మొక్కలన్నీ పచ్చగా బాగున్నట్లే ఉండటంతో చాలా సంతోషం వేసింది.

ఇక్కడ మామూలుగా మే మొదటి వారం లో వచ్చే "మదర్స్ డే" తో మొక్కల్ని పెరటి తోటలో వెయ్యటం మొదలెడుతారు. మా పెరట్లో ఒక పెద్ద "maple tree" ఉండటంతో ప్రతి సంవత్సరం "మే" వచ్చేసరికి అది  బోలెడన్ని విత్తనాలు వెదజల్లు తుంది. తన జాతిని  అభివృద్ది చేసుకోవాలనే కోరికని మనము కాదన లేము కానీ మన మొక్కలు వేసే ప్రదేశంలో maple tree విత్తనాలుంటే ఇంతే సంగతులు. అందుకని పెరట్లో  మొక్కలు వేసేముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి తోడు వాతావరణం సహకరించటల్లేదు. పగలు కొద్దిగా వెచ్చగా ఉన్నా రాత్రి ఫ్రీజింగ్ వాతావరణం, లేకపోతే రోజంతా వర్షం. అటువంటి సమయంలో మొక్కలు పెడితే బతకటం చాలా కష్టం అందుకని చాలా రోజులు waiting mode లోకి వెళ్ళాల్సి వచ్చింది.

వాతావరణానికి తోడు, గార్డెన్ లో ఇద్దరం కలసి పని చెయ్యాలనే షరతు ఉండటం తోటి, త్వరగా గ్రౌండ్ ని ప్రిపేర్ చెయ్యటం కుదరలేదు. ఇంట్లో పెంచిన మొక్కలు పచ్చగా ఉన్నాయి గానీ చాలా బలహీనంగా ఉన్నాయి. మొత్తం మీద రెండు వారాలకి ఇంట్లో మొక్కలని తీసి గార్డెన్లో వేశాము. వేసేటప్పుడు కలుపు మొక్కలు రాకుండా "weed and feed " కూడా వేశాము. అంతే ఒక వారంరోజుల్లో వేసిన మొక్కలన్నీ కాలంలో కలసిపోయాయి.

ఇంక ఏమి చెయ్యటం? నీదంటే తప్పు, నీదంటే తప్పు అని వాదించుకున్నా సమస్య పరిష్కారం కాదు కాబట్టి వెంటనే వెళ్ళి కొత్త మొక్కలని కొనుక్కుని వచ్చి వేశాం. స్నేహితులు ఇచ్చిన  ఆనపకాయ, బీరకాయ  విత్తనాల గూడా గార్డెన్ లో పెట్టాము. ఈ తడవ  weed and feed వాడలేదు. మొక్కలు త్వరగా పెరగటానికి "Miracle Grow" కూడా వేశాం. వేసి రెండు వారాలయింది. ఇప్పుడిప్పుడే మొక్కలు బతికి బట్ట కడుతున్నాయి.

 పై ఫోటో ప్రస్తుతం మా పెరటి తోటది. మీకు ఒక సంగతి చెప్పటం మరిచి పోయాను. ఫోటోలో ఎక్కువగా కనపడుతున్న మొక్కలు క్రిందటి సంవత్సరం వేసిన తోటకూర సంతానం. ఈ సంవత్సరం వెయ్యకపోయినా బోలెడన్ని తోటకూర మొక్కలు వచ్చాయి. అడవిలా అంతటా పెరిగింది. ఇప్పటికి మూడు సార్లు ఆకులు కోసి స్నేహితులతో పంచుకున్నాము. చూద్దాం ఏమవుతుందో, ఈ సంవత్సరం పెరటి లో పండిన కాయ గూరలు తినే భాగ్యం ఉందో లేదో. 

ఈ సంవత్సరం అనుభవం మీద తెలుసుకున్నవి, ఏప్రిల్ నెలలో గార్డెన్ మీద ఒక పట్టా వేస్తే maple tree విత్తనాలు త్వరగా వేరెయ్య వచ్చు, రెండొవది weed and feed గార్డెన్ లో వాడకూడదు, మూడవది ఇంట్లో నారుమడి వెయ్యటం కుదరదు (రోజూ నారుకి నీరు పొయ్యాలి), నాల్గవది గార్డెనింగ్ చేసేటప్పుడు భార్యా భార్తల సహకారం చాలా ముఖ్యం (భర్త చెప్పిన మాట భార్య వింటే చాలా బాగుంటుంది ).  

Saturday, June 6, 2015

113 ఓ బుల్లి కథ 101 --- హమ్మయ్య! మెమోరియల్ డే గండం గడిచి పోయింది

వేసవి వస్తోందంటే నాకు కొంచెం గాభరాగా ఉంటుంది. ఇంట్లో సణుగుడు ప్రారంభ మవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే "మే" మొదటి వారంలో వచ్చే మదర్స్ డే తో ప్రారంభ మవుతుంది. అది ఒక రోజే కాబట్టి ఆ మదర్స్ డే ని ఎల్లా గోల్లా నెట్టెయ్య వచ్చు. కానీ ఈ మెమోరియల్ డే తో పెద్ద సణుగుడు ప్రారంభ మవుతుంది. "త్రీ డే వీకెండ్ వస్తోంది ఎక్కడికన్నా వెళ్దామా". రోజూ ఏదో ఒక సందర్భంలో ఇదే పాట. నా ఖర్మ కాలి ఈవిడకి ఈ తడవ నాల్గో రోజు కూడా సెలవ కలసి వచ్చింది దానితో ఇంకొంచెం ప్రెజర్.

ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంత సణుగుళ్ళు ఉండేవి కాదు. మా స్కె డ్యుల్సు అన్నీ వాళ్ళ స్కె డ్యుల్సు మీద ఆధారపడి ఉండేవి. వాళ్ళు మా ఇద్దరి మధ్యన ఒక  "బఫ్ఫర్"  గా ఉండే వాళ్ళు. దానితోటి సణుగుళ్ళు, కోపతాపాల వ్యవహారం చాలావరకు తగ్గేవి. కానీ ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉండటంతో తప్పించుకు తిరగటం చాలా కష్టం. వరుసగా  అడిగిన దానికి "నో" అనే ఆన్సర్ తీసుకోని వాళ్ళు ఇంట్లో ఉంటే మాటల్లో మృదుత్వం దెబ్బతిని మూల కూర్చుంటుంది.

పోనీ పిల్లలతో ఎక్కడికన్నా వెళ్దామా అనుకుంటే ( వాళ్ళు వప్పుకుంటే), ఈ కాలంలో పిల్లలు చేసే పనులు మనకి కొంచెం ఇష్టంగా ఉండవు కష్టంగా ఉంటాయి.  స్విట్జర్లాండ్ లో "ఆల్ప్స్" పర్వతాల ఎదురుకుండా కాంప్ లో వారం పాటు గుడారము వేసుకుని పర్వతాల అందాలు వీక్షించే వ్యవహారం లేదు ( ఏదో పొద్దున్న కాఫీ తాగుతూ అలా పర్వతాల అందాలు చూడగలం గానీ రోజంతానా !). "పేరూ" దేశంలో ఉన్న "మాచు పీచు" నాగరికత చూడటానికి అంచెలంచలుగా గుడారాలు వేసుకుని కొండలు ఎక్క గలిగే వయసు కాదు. పోనీ బాక్ పాక్ వేసుకుని బస్ లొ వెళ్దామన్నా కుదరదు. "హవాయ్" లో బీచ్ వడ్డున అర్ధ నగ్నంగా కూర్చుని "డ్రింక్" లు సేవిస్తూ "చిల్" అవుతున్నామను కోవటం కూడా నా చేత కాదు. నేనెప్పుడు "హాట్" అయ్యాను గనుక "చిల్" అవటానికి. ఇంతెందుకు ఇక్కడ అమెరికాలో యాభై ఏళ్ళు ఉన్నా, "గ్రాండ్ కాన్యన్" కి  వెళ్ళటం కూడా పడలేదు. ముఖ్యంగా నాకు కొండ లోయ చూసే దేమిటిలే అనే చిన్న చూపు. ఇంతెందుకు పెళ్ళి అయిన కొత్తల్లో మా ఆవిడ  "నయాగరా ఫాల్స్" చూడా లనే కోరిక  వెలిబుచ్చింది. ఏముంది  "నయాగరా ఫాల్స్" లో, ఎత్తు అయిన కొండ మీదనుంచి నీళ్ళు పడుతుంటే, చూసేదేముంటుందిలే అన్నాను (అప్పటికే నేను ఏదో రూపేణా అయిదు ఆరు సార్లు అక్కడికి వెళ్ళాను. నాకు మళ్ళా అక్కడికి వెళ్ళాలని లేదు). తీసుకెళ్తానేమోనని ఇర్రవై ఏళ్ళు చూసి తనే పిల్లలని వేసుకుని వెళ్ళి చూసి వచ్చింది. నేను కర్కోటకుడి ననుకోవోకండి సమయం సందర్భం కలసి వచ్చినప్పుడు ప్రపంచంలో ముఖ్యమైన ప్రదేశాలన్నీ తిరిగాము. ప్రస్తుతం నాకెందుకో ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళాలనే కోరికల్లేవు. ఈ లాంగ్ వీకెండ్ లతో ఎప్పుడూ గొడవే.

వేసవిలో అమెరికాలో, శలవలు అందరూ ఆనందించే విధంగా సోమవారం వచ్చేటట్లు చేసి, దానిని శని ఆది వారాలతో కలిపి మూడు రోజులు గ శలవలు ఇస్తారు. దీన్ని లాంగ్ వీకెండ్ అంటారు. ఇది ప్రతీ సంవత్సరం మే నెల లో మెమోరియల్ డే తో మొదలవు తుంది. పార్కులూ బీచ్ లూ యమ్యూజ్మెన్ట్ పార్కులు, ఇంతెందుకు జనం సునాయాసంగా డబ్బులు ఖర్చు పెట్టటానికి వీలుండే వన్నీ సంవత్సరంలో మొదటిసారి ఇప్పుడు తెరుస్తారు. ఇంతవరకూ చలికాలంతో ఇంట్లో ముడుకుచు కూర్చున్న జనమంతా మొదటి రోజు మొదటి ఆట సినీమా వదిలితే బయట పడ్డట్లు, తండోప తండాలు గా వచ్చి తింటారు, తాగుతారు, సరదాగా తిరుగుతారు, సంబరం చేసుకుంటారు. అందరికీ తెలుసు, ఇవన్నీనాలుగు నెలలలో, సెప్టెంబర్ లో వచ్చే లేబర్ డే లాంగ్ వీకెండ్ తో మాయ మవుతాయని.  జీవితంలో ఎప్పుడో ఫుల్ స్టాప్ పడుతుందని జీవించ కుండా ఉంటామా ?

మేము సామాన్యంగా ఈ సమయంలో అమెరికాలో "సియాటిల్" అనే ఊరు వెళ్ళే వాళ్ళము. వాళ్ళ అక్కయ్య కూతురు ఉండేది అక్కడ. నా ప్రమేయం లేకుండానే అన్ని ఏర్పాటులు ఆవిడే చేసేది. నేను బుద్ధిమంతుళ్ళా మాట్లాడకుండా కారెక్కి ప్లేన్ ఎక్కి వాళ్ళని అనుసరించే వాణ్ని. సామాన్యంగా "సియాటిల్" నుండి అందరం ఇంకో చోటుకి కూడా వెళ్ళే వాళ్ళం. కెనడాలో  "వాంకూవర్" "విక్టోరియా" అలా చాలా చోట్ల తిరిగాము. నాకు చాలా బాగా నచ్చింది "సియాటిల్" దగ్గర ఒక ద్వీపం లో మకాం. బోటు లో కారు కూడా పెట్టుకుని తీసుకు వెళ్ళాము. మేము చిన్న పిల్లలతో సహా ఎనిమిది మంది. సముద్రపు వడ్డున ఒక పల్లెటూళ్ళో రెండు ఇళ్ళు అద్దెకు తీసుకున్నాము. నేనుంటే, నాకోసం రైస్ కుక్కర్ కూడా వెంట వస్తుంది. నా కెందుకో బయట తినటం ఇష్టం ఉండదు.  కమ్మటి గోంగూర ముద్దతో సవర్ క్రీమ్ ( మీగడ పెరుగు) నంచుకుంటూ తింటే వచ్చే ఆనందం ఎక్కడ ఏది తింటే వస్తుంది?.  ఆరోజు అందరూ ఎక్కడో రేస్టోరెంట్ కి వెళ్ళారు. సాయం సమయం. హాల్లో విండో లో నుండి సముద్రం మీద అస్తమించే సూర్యుడు కనపడుతున్నాడు. నేను అలాగే చూస్తూ కూర్చున్నాను. చూస్తుండగానే తెల్లటి సూర్య కిరణాలు రంగు రంగులు గా మారి, ఎర్రటి రక్త వర్ణంతో సముద్రంలో కలసి పోబోతున్నాయి. హాలు నిండా అస్తమించే సూర్యుని ఎర్రటి కిరణాలు!  ఏదో లోకంలో ఉన్నట్లు ఉంది. చిటికెలో అవి మాయమయిపోయి మళ్ళా ఈ లోకంలో పడేశాయి. ఆ అనుభవం కన్యాకునారి లో రెండుసార్లు సూర్యాస్తమయం చూసినా కలుగలేదు. ఆ మర్నాడు పొద్దున కాఫీ తాగుతూ ఇంటి బయట పచ్చికలో కూర్చుని మాట్లాడు కుంటూ ఉంటే, ఇంటి ఓనర్ వచ్చి హెచ్చరించేదాకా మాకు మద్యాహ్నం ఇల్లు ఖాళీ చెయ్యాలని గుర్తు రాలేదు.  ఏమిటో ఒక్కొక్కప్పుడు గంటలు నిమిషాలు గా గడచి పోతూ ఉంటాయి.

ఈ తడవ ఎక్కడకీ వెళ్ళే పరిస్థితి లేదు. క్రిందటి నెల న్యూయార్క్ వెళ్ళి పిల్లలతో రెండు వారాలు ఉండి వచ్చాము. శరీరం కూడా కొంచెం సహకరించటల్లేదు. వాతావరణం కూడా ఒక రోజు వేడి ఒక రోజు చచ్చే చలి. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలోకే వాళ్ళ తమ్ముడి కూతురు అమెరికా చూడటానికి వస్తోందని వార్త వచ్చింది. అంతే నా మీద ఎక్కడికి వెళ్ళాలనే ప్రెజర్ అంతా మాయమయింది. ప్రయాణ ఏర్పాట్లు  ఏవి చెయ్యాలి, ఎవరింట్లో ఎన్ని రోజులు ఉండాలి, ఏమేమి చూపెట్టాలి, అనుకున్నట్లు పనులు జరుగుతున్నయ్యా?. వీటితోటి ఆవిడ బిజీ బిజీ బిజీ. నాకయితే ఖుషీ ఖుషీ ఖుషీ . పుట్టింటి మమకారం ఎప్పటికీ తగ్గదు. ఆవిధంగా మెమోరియల్ డే వీకెండ్ గడిచిపోయింది.
"Time solves all the problems" అంటే ఇదే  నేమో !