Monday, September 20, 2010

29 ఓ బుల్లి కథ 17-- మీరు గొప్పవాళ్ళు అవుతారా ? --

ముందు మాట: నేను చెప్పే రెండు ఉదాంతాలు ( కేసులు) పరిశీలించి మీలో/నాలో గొప్ప వాళ్ళ లక్షణాలు ఉన్నయ్యో లేదో తేల్చండి.


నా మొదటి తార్కాణం:
గుడ్ ఇయర్ "inventor  " అని పేరు పెట్టుకుని ఇంట్లో ఉంటాడు. ఇంట్లోపనులు అవీ చేస్తూ కొత్త వాటిని కని పెట్టటం కోసం పగళ్ళు రాత్రులు కష్టపడుతూ ఉంటాడు.  ఆయన చేద్దామనుకున్నది, రబ్బరు ని గట్టి పరచటం. దానికి ఒక బున్సెన్ బుర్నేర్ మీద రబ్బరు తో కనపడిన పదార్ధాలు అన్నీ కలిపి ఏమి జరుగు తుందో చూస్తూ ఉండేవాడు. కనపడిన వాటన్నిటి తోటీ ఎన్ని సార్లు  ప్రయత్నించినా ఫలితం కనిపించటల్లేదు. పాపం కొత్త సంగతులు కనుక్కోటం రోజూ జరిగే పని కాదుగదా, అందుకని కొత్త ideas కోసం అలా నిసీధం లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన గారి భార్య ఉద్యోగం చేసి సంసారం నడుపుతూ ఉంటుంది. భర్త గారు మాటా పలుకూ లేకుండా అలా చూస్తూ కూర్చోటం ఆవిడకి నచ్చ లేదు. కనీసం తనతోడి మాట్లాడటం కూడా లేదాయె. ఆవిడకి వళ్ళు మండింది. సంసారం గడిచేది తన మూలాన. ఆయన పరికరాలు అన్నీ ఒక డ్రాయర్ లో పడవేసి, ఇంక నుండీ నీ పరిశోధనలు లాభం లేదు ఎంతకీ తెగే టట్లు కనపడ లేదు, నేను ఈ సంసారం ఈదలేను, ఉద్యోగం చూసుకోమంది.

ఉద్యోగం రావాలంటే వెంటనే ఎక్కడ వస్తుంది, అందులో ఉద్యోగం చెయ్యటం ఇష్టములేని వాళ్లకి. ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిన తరువాత  డ్రాయర్ తీసి తన పరిశోధనలు ప్రారంభించే వాడు. ఒక రోజున బయటకు వెళ్ళిన ఆవిడ హటాత్తుగా తిరిగి వచ్చింది. వచ్చిందని గ్రహించి తన పరిశోధన సామగ్రిని డ్రాయర్ లో తోసి మూసేసాడు. మర్నాడు ఆవిడ పనికి వెళ్ళిన తరువాత తీసి చూస్తే రబ్బరు గడ్డకట్టి ఉంది. ఇంక నేను చెప్పక్కరలేదు. ప్రయోగం ఫలించింది. చాలా గొప్ప వాడయ్యాడు. మీరు చూస్తున్నారు కదా గుడ్ ఇయర్ టైర్లు.

నా రెండోవ తార్కాణం:
చాలా గొప్ప వేదాంతి అనబడే సోక్రటీస్ ఒక రోజు తన శిష్యులతో కూడి ఇంట్లో భోజనం చేస్తున్నాడు. చెప్పకుండా జనాన్ని భోజనానికి తీసుకు వచ్చాడని ఆయన భార్య గారికి చాలా మంటగా ఉంది. కోపము దిగమింగుకుని వడ్డిస్తోంది. చారు వేడి సరీగ్గా లేదు అని అన్నాడు సోక్రటీస్ గారు. అంతే ఆవిడ లోపలున్న కోపాన్ని పట్టలేక, ఆ గిన్నెడు చారుని ఆయన నెత్తిన  పోసింది.

ఇంక నా కేసు:
రిటైరయ్యి ఇంట్లో ఉంటూ నేనూ Good Year గారి లాగా బ్లాగ్స్ వ్రాస్తూ ఉంటాను, మా ఆవిడ పనికి వెళ్తుంది. నిన్న వేడి వేడి కాఫీ నా మీద వలకటం జరిగింది సోక్రటీస్ గారికి జరిగినట్లు.

చివరి మాట: నే నెప్పుడు గొప్పవాణ్ణి అవుతానో  !

Thursday, September 16, 2010

28. ఓ బుల్లి కథ 16 -- వరండా లో బల్ల ఎత్తుకు పోయారు --

మామయ్య గారింట్లో వరండాలో బల్ల ఎత్తుకు పోయారు అని వినం గానే నాకు చాలా బాధ వేసింది. ఆ బల్ల మీద కూర్చొని ఎంతమందికో చదువులు చెప్పారు మా మామయ్య గారు, వాళ్ళ పిల్లలు, అప్పుడప్పుడూ నేను. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతమందో ఆ వరండాలో కూర్చొని హోం వర్క్ లు చేశారు, తెలియనివి చెప్పించు కున్నారు. బాగా చదువుకునే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. పనికి  పంపిస్తే ఇంట్లోకి చేదోడు వాదోడుగా ఉంటాడు అనే మాటని అడ్డుకుని, భోజనం పెట్టి, పనిమనిషి కొడుక్కి చదువు చెప్పారు. ఇప్పుడు అతను సబ్ ఇనస్పెక్టరు అయ్యాడుట.


నాకు మా మామయ్య గారంటే ఎందుకు ఆత్మీయత పెరిగిందో అర్ధం కాదు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. మా నాన్న గారు, సీనయ్య, అంటే ఆయనకి చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు. బహుశా వారిద్దరూ దాదాపు ఒకటే వయస్సు అయి ఉండవచ్చు. అందుకని నేనంటే ఆయనకీ ఇష్టమేమో. 


మొదట్లో తెనాలిలో వాళ్ళింటికి పిల్లలం వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళినా బయట బల్ల మీద కూర్చునో, పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడో, మా వూరు కట్టేవరం సాయంత్రానికి జేరుకునే వాళ్ళం. ఒకసారి అత్తయ్య "కృష్ణా నీ అత్తయ్య నే  కదా ఎందుకు ఇక్కడ ఉండవు?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది . మేము అక్కడ ఉండక పోటానికి అసలు కారణం,  వాళ్ళింట్లో బయట బట్టలు కలపరు. బయటనుంచి వచ్చిన వాళ్ళు ఎవరయినాసరే వాళ్ళిచ్చిన ఉతికిన బట్టలు కట్టుకుని ఇంట్లోకి రావాలిసిందే. అప్పటినుండీ శలవలకి రేపల్లె నుండి వచ్చినప్పుడల్లా అత్తయ్య గారింట్లో  రెండు రోజులుండే వాణ్ని. అత్తయ్య దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం.


మామయ్య గారు అప్పుడప్పుడూ గమ్మత్తు గా మాట్లాడు తారు. నా చిన్నప్పుడు తెనాలి నుండి రేపల్లె వెళ్ళే ట్రైన్ ఎక్కించటానికి స్టేషన్ కి వచ్చారు. ట్రైను కదల బోతోంది. "కృష్ణా నీ రెండు రూపాయలు నీకు ఇచ్చేశాను. అవునా " అన్నారు. నేను వెంటనే ఇచ్చేశారండీ అన్నాను. ఆయనదగ్గర చిల్లర లేక పోతే నేను రెండు రూపాయలు ఇచ్చాను. తరువాత తిరిగి ఇచ్చేశారు. నాకు ఎందుకు అలా అన్నారో అర్ధం గాక మా నాన్నగారిని అడిగాను.


టూకీగా మా నాన్నగారు చెప్పినది ఇది, ఒకప్పుడు మా మామయ్య గారి ఇంట్లో ఏ గూట్లో చెయ్యి పెట్టినా రూపాయ నాణాలు ఉండేవిట. కొద్దిగా మీరు  డెబ్బై ఏళ్ళ క్రిందట పరిస్థుతులు గమనించాలి. ---- పల్లెటూళ్ళు, పెంకుటిళ్ళు, మట్టి గోడలు, ఇనప పెట్టెలు, గూళ్ళు.---- అప్పటి ఉన్నవాళ్ళ ఇళ్ళు అలా ఉండేవి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత, విడిపోయిన అన్నలు,  నాన్నగారికి అప్పిచ్చామని చాలా ఆస్తి తీసుకున్నారు. తరువాత  ఆయనకి వచ్చిన డబ్బుల్లో బంధువులకి వ్యవసాయానికి అప్పిచ్చారు. ఆ సంవత్సరం పంటలు పండక కరువుతో ఉంటే ప్రభుత్వము రైతుల అప్పును మాఫీ చేసింది. అంతే బంధువులయినా ఈయన డబ్బులు వారు తిరిగి ఇవ్వాలేదు. ప్రభుత్వం అప్పులని మాఫీ చేస్తే మునిగి పోయేవాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు. ప్రభుత్వం ఎంతమందిని ఇలా దివాలా తీయించిన్దో. 


అప్పటి నుండీ ఆయనకి అప్పులు ఇవ్వటం తీసుకోవటం అంటే భయం. చివరికి ఉన్న చదువుతో  ట్రైనింగ్ తీసుకుని బ్రతక లేక బడి పంతులు అయ్యారు. పల్లెటూరు నుండి తెనాలి వచ్చారు. నాకు ఇంకో సంగతి కూడా చెప్పారు ఆయన్ని గురించి. చిన్నప్పుడు ఆయన స్లీప్ వాకింగ్  చేసేవారుట. ఇంట్లో వాళ్ళ ఉపాయం, ఆయన పిలకని నులకమంచానికి కట్టేవారుట. కొంత కాలానికి స్లీప్ వాకింగ్ పోయిందిట.


ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా బాధ పడుతూ ఉంటాను. ఇంటి చుట్టూతా తడికల గోడ కన్నా, ప్రహరీ గోడ ఉంటే బల్లని ఎవరూ తీసుకు పోయే వారు కాదేమో అని. పిల్లలందరూ ఎవరికి వారు రెక్కలొచ్చి వెళ్లి పోయారు. బల్ల పోయింది. ఆ తరువాత మా అత్తయ్య పోయింది. చివరికి ఆయనా పోయారు. 


నా కెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మన ప్రభుత్వం పంతుల గార్లని ప్రోత్సహించి,  ఒక్కొక్క పంతులు గారు కనీసం ఒక్కొక్క పనిమనిషి పిల్లలకి చదువు చెప్పి పైకి తీసుకు వచ్చేటట్లు చేస్తే, మనదేశం ఎల్లా ఉండేదో!. 

Sunday, September 12, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే -- అనుబంధం --

ముందుమాట: నా క్రిందటి పోస్ట్ లో Bruce Rich గారి "To uphold the World" అనే పుస్తకము గురించి వ్రాశాను. పుస్తకము అశోక,  కౌటిల్యుల  రాజనీతి, ఆర్ధికశాస్త్ర సూత్రాలు, ఈ ఇరువది ఒక శతాబ్దము లో ఎంతచక్కగా పనికోస్తయ్యి అనే అంశము మీద.  పుస్తకము లోని విశేషాల గురించి వ్రాయలేదు. దానికి కారణము ఉన్నది.
నాకు రాజరికము అనే దాని మీద పెద్ద పరిచయము లేదు. నా పేరు లో రాజు ఉన్నాడని, భార్యా పిల్లల మీద రాజరికము చూపెడుదామంటే  ఎప్పుడూ ఫలించ లేదు.
అర్ధశాస్త్రములో నా పరిజ్ఞానము  అంతంత మాత్రమే. వచ్చే డబ్బులతో, అప్పులు చేయకుండా, సరిపెట్టుకుంటూ జీవించటము మాత్రమే తెలుసు. అది కూడా మా నాన్నగారి బోధన.

పెబ్బరాజు వారి కోరిక ప్రక్కరం ఈ క్రింద పుస్తక పరిచయం లింక్ ఇస్తున్నాను. ఏ కారణము వలన అయినా మీకు ఆ లింక్ రాకపోతే  దాని కింద లింక్ ను కాపీ చేసి ప్రయత్నించండి. రచయిత వివరాలు, పుస్తక వివరాలు గూగులమ్మ నడిగినా చెబుతుంది. amazon లో పుస్తకము దొరుకుతుంది. పుస్తక పరిచయం

http://www.indiatribune.com/index.php?option=com_content&view=article&id=3766:us-attorney-reiterates-relevance-of-ashoka-kautilya-to-21st-century&catid=25:community&Itemid=457

చివరిమాట: మూడు రోజుల పండగలు, వినాయక చవితి, రంజాన్, విశ్రాంతి తో చక్కగా గడిపారని తలుస్తూ విఘ్నాలు దాటి మీ జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.

Friday, September 10, 2010

27. ఓ బుల్లి కథ 15 -- అశోక, కౌటిల్య-- వీళ్ళు మనవాళ్ళే --

ముందు మాట: నా కెందుకో ఇవ్వాళ  చాలా గర్వంగా ఉంది. వందల సంవత్సరాల క్రిందట రాజరికం లో మనము వాడిన పద్ధతులు, ఆచారాలు, అర్ధశాస్త్రపు నీతులు,  ఈ కాలం లో గూడా పనికొస్తా యంటే, నా పూర్వీకుల తెలివితేటలకు నాకు చాలా గర్వంగా ఉంది.

US attorney reiterates relevance of Ashoka, Kautilya to 21st Century    by Ajay Ghosh(New York)
(పుస్తక పరిచయం --  సెప్టెంబర్ 11, 2010 India Tribune లో వ్యాసం)

నేను ఆ వ్యాసాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నము చేయటల్లేదు కానీ ఆ పుస్తకము గురించి క్రింద ఇస్తున్నాను.



To Uphold The World  ( A call for a New Global Ethic from Ancient India)    
by  Bruce Rich   

Forward by:             Noble Laureate Economist Amartya Sen
Afterword by:          His Holiness the Dalai Lama
Published by:           Beacon Press, April, 2010

చివరి మాట: ఎవరేమనుకున్నా మన భారతావనికి ప్రపంచాన్ని తీర్చి దిద్దే సంస్కృతులు ఉన్నాయి. మనము ఏళ్ళ క్రిందే వాటిని కనుగొన్నాము.  కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి వాటి గురించి మనకు గుర్తు చేస్తే తప్ప మనకు తెలియవు.