Monday, February 25, 2013

90 ఓ బుల్లి కథ 78 --- అమెరికాలో మా వీధి

నిన్న ఆదివారం మద్యాహ్నం  ఎండ బ్రహ్మాండంగా ఉంది. బయట చూడటానికి చాలా ముచ్చటగా ఉంది.  అమెరికాలో ఇది మిడ్ వింటర్.  ఉష్ణోగ్రత 33F అవటం తోటి చూసి ఆనందించటమే ( నీళ్ళు 32F దగ్గర ఐస్ గ మారుతాయి). మా ఆవిడ వింటర్ కోటు బూటు టోపీ మఫ్లర్ వేసుకుని ఉద్యోగానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. కొంచెం ఫోటోలు తియ్యమని బతిమాలితే ఫోటోలు తీసింది. వాటి ద్వారా నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.

మేము చికాగోకి ముఫై మైళ్ళ దూరంలో ఉంటాము. మా వీధి  cul-de-sac. జన సంచారం ఎక్కువగా ఉండదు. అందులో ఆదివారం మధ్యాహ్నం ఫ్రీజింగ్ ఉష్ణోగ్రత.  అప్పుడు అసలే ఉండరు. మధ్య ఫొటో మాయిల్లు (గరాజ్ మాత్రమే కనపడుతుంది). ఇంటికి రెండు పక్కలా ఫొటోలు పెట్టాను. పొటోలో మొన్నటి స్నోస్టాం లో పడ్డ స్నో తెల్లగా కనపడుతుంది. చెట్లు ఆకులు లేకుండా మోళ్ళుగ కనపడుతాయి. మళ్ళా అవన్నీ మే నెల వచ్చేసరికి ఆకులతో కళ కళ లాడుతూ ఉంటాయి, అప్పుడు నేల మీద పచ్చ గడ్డి కూడా కనపడుతుంది. ప్రతీ ఇంటి ముందరా ఒక పోస్ట్ బాక్సు ఉంటుంది. అది ఎంత ఎత్తు ఉండాలో ఎలా ఉండాలో ఎక్కడ పెట్టాలో వాటికి రెగ్యులెషన్లు ఉంటాయి. పోస్ట్ మాన్ ప్రతీ రోజూ కారులో వచ్చి కారు దిగకుండా పోస్ట్, బాక్సు లో వేసి వెళ్ళిపోతాడు. మా వీధిలో ఉన్న 17 ఇళ్ళలో నాలుగు ఇళ్ళల్లో వాళ్ళం మాత్రం, ఇల్లు కట్టించుకున్న దగ్గర నుండీ ఉంటున్నాము (25 ఏళ్లు). సామాన్యంగా అమెరికాలో ఏడు ఏళ్ళ కొకసారి ఇల్లు మారుస్తారు.

రేపు మళ్ళా స్నో వార్నింగ్. స్నో పడుతూ ఉంటే మా వీధి చూడటానికి ఇల్లా ఉండదు. అంతా తెల్లగా స్నో మయం తో ఉంటుంది. స్నో తీసే వాళ్ళతోటి హడావిడిగా ఉంటుంది. ఏదో నాకు నచ్చినవి మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం.








మళ్ళా ఈ వారం స్నో తుఫాను వచ్చింది. మంగళవారం ఉదయం 9 గంటల నుండీ రాత్రి 12 గంటల దాకా మూగ వాన లాగా మూగ స్నో పడుతూనే ఉంది. ఎవరో ఆకాశం లో కూర్చుని ముగ్గు చల్లుతున్నట్లు ఉంటుంది. రోడ్లు సరీగ్గా కనపడవు. కొద్దిగా కనపడినా డ్రైవ్ చెయ్యటం చాలా కష్టం. ఇసకలో డ్రైవ్ చేస్తున్నట్లు ఉంటుంది. ముందరే తెలుసు కాబట్టి స్కూళ్ళు ఆఫీసులు త్వరగా మూసేసి అందర్నీ ఇంటికి పంపించేశారు. రాత్రికి రాత్రే రోడ్ల మీద స్నో తీసేసి మర్నాడు ఆఫీసులకు వెళ్ళేటట్లు సరిచెసారు. రోడ్ అంచులలో స్నో కుప్పలు తయారు అవుతాయి. రోజూ  స్నో పడితే అవే కొంత కాలానికి స్నో కొండలుగా తయారు అవుతాయి. కొన్ని వింటర్ల లో నెలల తరబడి వాటిని చూడవలసి వస్తుంది. మళ్ళా మా ఆవిడ చేత ఫొటోలు తీయించాను.  వాటిని కింద చూడచ్చు.

ప్రపంచ వాతావరణ పరిస్థుతులు అందరికీ తెలుసు గానీ వాటిని మదించి ముందర ఏమి జరగబోతోంది చెప్పటం, కంప్యుటర్ మోడల్లింగ్, ఒక కళ. మొన్న వాషింగ్టన్ లో స్నో పడుతుందని అందరికీ శలవ ఇస్తే, పడలేదు. కానీ యూరప్ కంప్యుటర్ మోడల్స్ వాషింగ్టన్ లో పడదని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు అమెరికా మోడల్స్ సరీగ్గా చెప్పలేక పోతున్నాయనే దానిమీద చర్చ జరుగుతోంది. నేను చదువుకునే టప్పుడు (50 ఏళ్ళ క్రిందట) ఆంధ్రా యూనివర్సిటీ లో సాయంత్రం వాతావరణ బెల్లూన్ పంపించేవారు. అది పంపిన సమాచారం బట్టి వాతావరణం గురించి రేడియోలో చెప్పేవారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.