Thursday, September 27, 2018

144 ఓ బుల్లి కథ ---- అమెరికాలో వచ్ఛేస్తోంది చలికాలం




నా చిన్నప్పుడు మానాన్న గారు పళ్ళు తోముకోటానికి పందుంపుల్ల నోట్లోపెట్టుకుని మెట్లుదిగి భావి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. తిరిగి పైకి వచ్చేటప్పుడు ఆరోజు కూరగాయలు తుంపుకుని వచ్చే వారు. ఆ ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. బహుశ పల్లెటూరిలో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ దొడ్లో భావి లేదు, పందుంపుల్లలూ లేవు. కానీ అదేపని నేను చాలా ఏళ్ళు సాయంత్రం పూట చేసేవాణ్ణి. ఇప్పుడు మా ఆవిడ చేస్తుంది. ఆవిడ చెల్లెలు క్రిందటి సంవత్సరం ఇక్కడ ఉన్నప్పుడు రోజూ పెరట్లోనుండి ఒక దోసకాయ కోసుకువచ్చి పచ్చడి చేసేది. పిలిచినప్పుడు వెళ్ళి ఆరగించటమే మన పని.

సెప్టెంబర్ వచ్చేసింది దానితో చలికూడా వచ్చేసింది. ఇంక చికాగో లో చెట్ల ఆకులు రంగులు మారి రాలి పోవటం మొదలెడతాయి. అందుకనే వచ్చే మూడు నెలలని Fall అంటారు. పెరట్లో వేసిన మొక్కలన్నీ ఎండిపోతాయి అందుకని మొక్కల మీద ఉన్న కూరగాయలు అన్నీ కోసేస్తారు. పై ఫోటో నిన్న మా ఆవిడ కోసుకువచ్చిన ఈ సంవత్సరపు చివరి పంట.

మీరు గమనించారో లేదో పంట ఎక్కువ పండలేదు. దానికి కారణం ఉంది. ఈ సంవత్సరం పెరటి తోట గురించి నేను ఎక్కువగా పట్టించుకోలేదు. మొదట్లో నేల దున్నిపెట్టాను అంతే.  ఆ తర్వాత మొక్కలు పెట్టటంలో బేదాభి ప్రాయాలు తన్నుకోవటం దాకా వచ్చి పీసుఫుల్ గ తోటపని ఇంట్లో ఆడవాళ్ళకి అప్పచెప్పాను. ఎప్పుడో అప్పుడు మనకి ప్రియమయిన పనులు ఇంకొకళ్ళకి అప్పగించాలి కదా. మొక్కలన్నీ ఆవిడే పెట్టింది. ఈ సంవత్సరం అందరికీ పంచి పెట్టేటంత పంట రాలేదు. ఒకప్పుడు నా హయాంలో సొరకాయ పాదు పెరటంతా పాకి  ఏభయి అరవై కాయలదాకా ఇస్తే వాటిని  కారు ట్రంకు లో వేసుకుని గుడికి తీసుకు వెళ్ళి పంచాము.

మా చికాగో ప్రాంతంలో, పెరట్లో మొక్కలు వేసి పండించుకుని  తినే భాగ్యం సంవత్సరానికి ఆరు నెలలు కూడా ఉండదు ( మే నుండి సెప్టెంబర్). సెప్టెంబర్ వచ్చేసరికి చలి వచ్చేస్తుంది. పెట్టిన మొక్కలు ఎండిపోవటం మూలంగా కూరగాయలన్నీ కోసెయ్యాలి లేకపోతే పాడయి పోతాయి. కొందరి ఇళ్ళల్లో పంట (ఇంట్లో ఉపయోగించే దానికన్నా) ఎక్కువ పండుతుంది. వీరు మిగిలిన వాటిని చుట్టు పక్కల వాళ్ళకి పంచుతూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం వెంకట్ ఇంటినుండీ, శోభా వాళ్ళ ఇంటినుండీ వాళ్ళ పెరటి కాయగూరలు వచ్చాయి.

వెంకట్ పెరటి నుండి ఒక సొరకాయ,బీర కాయలు, పొదీనా ఆకు వచ్చింది. వెంకట్ నేను ఇమ్మిగ్రెంట్స్ కి ఇచ్చే క్లాస్ కి వస్తూ ఉంటాడు. మహారాష్ట్రలో ఎదో కుగ్రామంలో లెక్కల మాష్టారి ఉద్యోగం చేసి రిటైర్ అయి భార్యతో, పిల్లల దగ్గర ఉండటానికి వచ్చాడు. చిత్రం అమెరికాలో వాళ్ళది కంబైన్డ్ ఫామిలీ, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు. వెంకట్ వేదిక్ మాథ్స్ లో ఎక్స్పర్ట్. ఎప్పుడో ఆయన్ని ఇంటర్వ్యూ  చేసి ఒక పోస్ట్ వెయ్యాలి.

శోభా వాళ్ళ నుండి బీరకాయలు మిరపకాయలూ వచ్చాయి. వాళ్ళింట్లో బీరకాయ పాదు వేస్తే వెనకాల వాళ్ళింట్లోకి పాకి కాయలు కాచింది. సెప్టెంబర్ లో వెనకాల వాళ్ళింటికి వెళ్ళి బీరకాయలు కోసుకు వచ్చారు. ఎక్కువయితే అందరికీ పంచి పెట్టారు. మేము బీరకాయ తొక్కుతో పచ్చడి, బీరకాయ లతో కూర, పచ్చడి చేసుకున్నాము. మిరపకాయలు పొడుగ్గా మిరపకాయ బజ్జీలలో వాడేవి లాగా వున్నాయి కాకపోతే ఇవి జపనీస్ వేమో ఉట్టిగా తినచ్చు అసలు కారంగా లేవు. వాటితో మిరపకాయల బాజ్జీలు చేసుకుని తిన్నాము.

వచ్ఛే సంవత్సరం ఏమి చెయ్యాలో ఇప్పటినుండే ఆలోచించు కోవాలి. బహుశా పెరటితోట మళ్ళా నా చేతుల్లోకి తీసుకుంటాను. అక్టోబర్ లో ఇక్కడ  "ఇండియన్ సమ్మర్" అంటూ ఒక వారంరోజులు బయట ఉష్ణోగ్రత పెరుగుతుంది. నేల దున్ని (నా దగ్గర ఒక యంత్రం ఉంది), పెరటి తోటని వచ్ఛే సంవత్సరం పంటకి రెడీ చెయ్యాలి. వచ్చే సంవత్సరం పొట్లకాయ గింజలు ఎక్కడయినా దొరికితే పెరట్లో వెయ్యాలి. హెయిర్లూం టొమాటోలు తప్పకుండా వెయ్యాలి. ఇక ఉంటా మరి.