Monday, December 22, 2014

109 ఓ బుల్లి కథ 97 -- ఇటలీ లో ఓ వారం -- వెనిస్

"ఫ్లారెన్స్" నుంచి "వెనిస్" ట్రైన్ రైడ్ లో "రిజర్వేషన్" ఉండటం తో అందరం ఒక చోట కూర్చున్నాము. గుర్తు పెట్టుకునేవి ఏమీ జరగలేదు. కాకపోతే "వెనిస్" దగ్గరకొస్తుంటే ట్రైన్ సముద్రం మధ్య లోంచి పోతున్నట్టు ఉంటుంది. అటుపక్క ఇటుపక్కా నీళ్ళు, దూరంలోనూ దగ్గరా పెద్ద పెద్ద నౌకలు, పట్టపగలు, నీల ఆకాశం, దానిలో తెల్లటి మబ్బులు, ఏదో స్వర్గం లోకి ప్రవేశించు తున్నట్లు అనిపిస్తుంది.

"వెనిస్" కొన్ని ద్వీప సమూహంలో ఒక ద్వీపం. స్వతంత్రంగా చాలాకాలం రాజరికం లో ఉంది. చుట్టూతా సముద్రం ఉండటం మూలాన నౌకలు కట్టటం ఉపయోగించటంలో నిష్ణాతు లైనారు. దానితో వారి నౌకా సైన్యము ప్రపంచ విదితము. చికాగో మిచిగన్ లేక్ లో ప్రతీ సంవత్సరం "వెనీషియన్ నైట్" అని ఉంటుంది. ప్రపంచంలో ప్రసిద్ధ నౌకలన్నీ అక్కడకి వస్తాయి. చుట్టూతా నీళ్ళు ఉండటం మూలంగా ఉప్పెనలోస్తే తట్టుకునే విధంగా భవంతులన్నీ గట్టి పునాదులతో కట్టారు. దాదాపు అన్నీ 100 ఏళ్ళ క్రిందట కట్టినవే. చాలా వరకు  భవంతులన్నీ నీళ్ళతో ఆడుకుంటూ
ఉంటాయి. ఊరంతా కాలవలతో కలిపేశారు. ఉప్పెన లాంటివి వస్తే నీళ్ళు కాలవల ద్వారా సముద్రం ఒక వేపు నుండి ఇంకొక వేపుకు వెళ్లి పోతాయి. ఇక్కడ వీధులు కాలవలు. "Grand Canal" ముఖ్య వీధి. దానిలోనుండి చిన్న చిన్న కాలువలు ద్వీపం లోపల ఉన్న భవంతులకు తీసికు వెళ్తాయి. భవంతుల మధ్య ఉండేది సందులూ గొందులే. ఊళ్ళో తిరగటం పద్మ వ్యూహమే. నేనయితే వంటరిగా బయటికి వెళ్ళటానికి సాహసించలేదు. దాదాపు రోజు అవసరాలకి కావలసినవి అన్నీదొరుకుతాయి. వంటకి మాకు కావాల్సిన కూరలు ఇక్కడే కొనుక్కున్నాము. రెస్టోరెంటులు, కాఫీ షాపులు చిన్నవీ పెద్దవీ  చాలా ఉన్నాయి. దాదాపు కావలసినవన్నీ దొరుకుతాయి.

ఇక్కడికి చూడటానికి వచ్చే యాత్రికులు ఎక్కువ. నా ఉద్దేశంలో రోజుకి ఈ ఊరి జనాభా అంత మంది, యాత్రికులుగా వస్తారు. అందుకని ఇక్కడి మునిసిపాలిటీ ఒక రూల్ పాస్ చేసింది. 2015 నుండీ ఇక్కడి రోడ్లమీద (సందులూ గొందులూ) మీద చక్రాలున్న సూట్ కేస్ లు లాగుతూ తీసుకు వెళ్ళకూడదు. రాత్రీ పగళ్ళ లో ఆ శబ్దానికి ఆ ఊర్లో నివసించే ప్రజలకి నిద్రపట్టటల్లేదుట. దీనిని అతిక్రమిస్తే $500 జరిమానా. చూడండి ఎంతమంచి ప్రభుత్వమో.

ఇక్కడికి మనలాంటి వాళ్ళ నుంచి ఆగర్భ శ్రీమంతులు దాకావెకేషన్ కి వస్తారు. అందుకనే ఇక్కడ  "7 స్టార్ హోటల్" ఉంది. ధన కనక వస్తు వాహనాల నుండీ "ఫర్ కోట్లు" దాకా అన్నీ దొరుకుతాయి.

మేము ట్రైన్ స్టేషన్ లో దిగింతరువాత మా పాట్లు మొదలయినాయి. మా అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళే అమ్మాయి రెండు గంటలకి ఒక చోటుకి రమ్మంది. ఆ చోటుకు వెళ్ళాలంటే బోటు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ టాక్సీ లు లేవు రిక్షాలు
లేవు. సందులు గొందులూ తప్ప రోడ్లు కూడా లేవు. స్టేషన్ ఎదురుకుండా ఒక బోటు స్టేషన్ ఉంది (లాంచీ ఎక్కే చోటు). మాకింకా మా అపార్ట్మెంట్ కి వెళ్ళటానికి రెండు గంటల సమయము ఉన్నది. సరే సామాను లాగుకుంటూ అక్కడున్న సందుల్లో కొట్లు చూసుకుంటూ తిరిగాము. ఆకలవుతోంది. అక్కడ చాలా రెస్టోరెంటులు ఉన్నాయి. బయట నుంచుని మా రెస్టోరెంటు లో తినండి అని అడుగుతూ ఉంటారు. బయట ఉన్న మెన్యూ చూసుకుని ఒక రెస్టోరెంట్లో చతికిల పడ్డాము. ఇక్కడ చాలా రెస్టోరెంటులు, బయట షామినా వేసి క్రింద బల్లలూ కుర్చీలు వేసినవి. మేము తీరిగ్గా భోజనం చేసి లాంచీ ఎక్కి గమ్య స్థానానికీ చేరేటప్పటికి రెండు గంటలు దాటింది. మేము టైముకి రాలేదని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సరే ఆ అమ్మాయిని బ్రతిమాలాడితే ఒకగంటలో వచ్చింది. అప్పటిదాకా లాంచీ స్టేషన్ దగ్గర బికారుల్లాగా సామాను పెట్టుకు కూర్చున్నాము.

 సరే ఆ అమ్మాయి వచ్చి సందులూ గొందులూ తిప్పుకుంటూ మా అపార్ట్మెంట్ కు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ 100 ఏళ్ల క్రింద కట్టినవి. ఇక్కడ రోడ్లు లేవు. ఆ పిల్ల గబగబా వెళ్ళిపోతోంది. పెద్ద పెద్ద ఆవరణలూ వాటి చుట్టూతా బిల్డింగ్ లు. ఒక ఆవరణ లోనుండి ఇంకొక ఆవరణలోకి వెళ్ళటానికి సందులు. నాకయితే మాత్రం ఇది ఒక పద్మ వ్యూహం లాగా ఉంది. మా యపార్త్మెంట్ రిమోడల్  చేయటం తోటి చాలా మోడర్న్ గ  ఉంది. సరే కాసేపు విశ్రమించి తిరగటానికి బయల్దేరాము. మేము వెళ్ళాల్సిన చోటుకి టాక్సీ ని పిలిచాము. అక్కడ ఉండే వన్నీ వాటర్ టాక్సీలు. పక్క నున్న పిల్ల కాలవ దగ్గరకి రమ్మన్నాడు. మీరు మాత్రం టాక్సీలని పిలవకండి. డబ్బులు చాలా అవుతాయి.

"రైల్టో బ్రిడ్జి" (Railto Bridge ) దగ్గర టాక్సీ దిగాము. ఇది చాలా ఫేమస్ ఎందుకో నాకు తెలియదు. కాసేపు ఫోటోలు తీసుకుని పక్క నున్న షాపులు చూడటానికి బయల్దేరాము. ఈ షాపులు బయటినుండి చూడటానికే గానీ లోపలికి  వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి దాదాపు ప్రపంచం లోని కుబేరులందరూ వస్తారు. మనం వెళ్ళచ్చు పరవాలేదు అనుకున్న ఒకటి రెండు షాపులలోకి వెళ్ళి, ఒక అరగంట తిరిగి చిన్నవస్తువులేవో కొనుక్కుని లాంచీ ఎక్కి ఇంటికి చేరాము.

ఒకప్పుడు "వెనిస్" చిన్న రాజరికం. మంచి నౌకా దళం ఉంది. చుట్టుపక్కలకి పోయి యుద్ధాలు చేసే వాళ్ళు. రాచనగరూ వాళ్ళ పాలెస్ (Doge's Palace) చూడటానికి మర్నాడు పొద్దున్న బయల్దేరాము. నన్ను ఒక
చోట కూర్చోబెట్టి (మేము అమెరికా నుండి ఒక పోర్ట బుల్ కుర్చీ తెచ్చుకున్నాము) మా ఆవిడా పిల్లలూ పాలెస్ టిక్కెట్లు తీసుకు రావటానికి (తిరగటానికి) వెళ్ళారు . ఎప్పుడూ నసిగే వాళ్ళ తోటి ఎంతసేపు ఉంటారు! మా ఆవిడ నేను నసుగుతాను అంటుంది. కానీ నేను నసగను. మీరు నసిగినా ఎవ్వరూ పట్టించుకోరు అందుకని వెకేషన్ లో నసగటం అంత మంచిది కాదు.

పాలెస్ భవనాలు ఒక పెద్ద ఆవరణ చుట్టూతా ఉన్నాయి. కట్టడాలు నిజంగా చాలా బాగున్నాయి. రాజ ఠీవి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజరికం లేదు కాబట్టి ఆవరణలో చుట్టూతా రెస్టోరెంటులు ఉన్నాయి. వాటిల్లో ఆడుతున్నారు పాడుతున్నారు. అక్కడ కూర్చుని కాఫీ తాగితే అయిదు యురోలు టిప్ ఇవ్వాలిట. అది అక్కడ ఆడుతూ పాడుతున్న వాళ్లకి వెళ్తుంది. మధ్యలో పావురాలు చాలా తిరుగుతున్నాయి. వాటికి పిల్లలు గింజలు వేస్తున్నారు. పిల్లలున్నారు కాబట్టి పిల్లల ఆటవస్తువులు, తినే పదార్ధాలూ అమ్మే బళ్ళూ ఉన్నాయి. ఆవరణ అంతా చూడటానికి వచ్చిన జనంతో నిండి పోయింది. నిజంగా చెప్పాలంటే అదొక పెద్ద తిరణాల (Carnival ) లాగా ఉంది.

ఆ రాజు పాలెస్ చూశాం. వాళ్ళు ధరించే దుస్తులూ నగలూ నాణ్యాలూ చూశాం. ఆకాలంనాటి శిల్ప సౌందర్యాలు చూశాం. అంతా చూసిన తర్వాత రెస్టోరెంటులో భోజనం చేశాం. అలా తిరుగుతుంటే "ఆపరా" (Opera) అని కనపడితే  సంగతేమిటో కనుక్కోమని  "డిస్కౌంట్ క్వీన్" మా ఆవిడని పంపించాము. పిల్లలకి "ఆపరా" ఇష్టం. నేనెప్పుడూ వెళ్ళలేదు. డబ్బులు బాగా వదులుతాయి. "డిస్కౌంట్ క్వీన్" మా ఆవిడ శుభవార్త తో తిరిగి వచ్చింది. అక్కడున్న మేనేజర్, 50% డిస్కౌంట్ తో టిక్కెట్లు ఇస్తాను, రెండుగంటల్లో బాక్స్ ఆఫీసు ఓపెన్ చేస్తారు నేనిక్కడే ఉంటాను వచ్చి టిక్కెట్లు తీసుకొమందిట. రెండుగంటలు ఏమి చెయ్యాలి? ఇంకా తిరిగే ఓపిక
లేదు. మేము పొద్దున వచ్చే టప్పుడు లాంచీ లలో తిరగటానికి "డే టిక్కెట్" కొనుక్కున్నాము. 24 గంటల్లో ఎన్నిసార్లయినా లాంచీలలొ తిరగొచ్చు. మేము వచ్చిన వైపు కాకుండా ఇంకొకవైపుకి వెళ్ళే లాంచీలో ఎక్కాము. సాయం సమయం, ప్రశాంత వాతావరణం, చక్కటి గాలి, సూర్యాస్తమం సముద్రంలో(aedriatic sea) కళ్ళారా చూశాము. ఇంతలోకే ఆపరా గుర్తు కొచ్చింది. వెంటనే దిగి అటు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఆపరాకి సమయం అయిపోతోంది ఈ లాంచీ ప్రతి చోటా ఆగుకుంటూ నెమ్మదిగా పోతోంది. చివరికి తెలిసిందేమంటే రెండురకాల లాంచీ లున్నాయిట . "ఎక్స్ప్రెస్" అయితే అన్నిచోట్లా ఆగదు కానీ మేము ఎక్కింది అన్ని చోట్లా ఆగే పాసింజర్ లాంచీ. ఇంతకీ చెప్పొచ్చే దేమంటే నేను నా మొదటి  "ఆపరా" చూడటం పడలేదు. ఇంటికి జేరుకున్నాము. మర్నాడు పొద్దున్నే లేచి ట్రైన్ లో "రొమ్" కి బయల్దేరాము.

కొన్ని నెలల క్రిందట "క్లూనీ" (George Clooney, ప్రఖ్యాత హాలీవుడ్ యాక్టర్) "వెనిస్" లో పెళ్లి చేసుకున్నాడు. క్రింద వీడియో లో ఆయన వాటర్ టాక్సీ లో పెళ్ళికి వెళ్ళే వైభవం  చూడండి. కాకపోతే 7 స్టార్ హోటల్ కి వెళ్ళలేదు గానీ, ఆ ప్ర దేశాలన్నీ మేమూ చూశాము.

 

Monday, December 8, 2014

108 ఓ బుల్లి కథ 96 -- ఇటలీ లో ఓ వారం -- ఫ్లారెన్స్

పీసా నుండి ఫ్లారెన్స్ వెళ్ళటానికి మేము ఎక్కిన  ట్రైన్ పాసింజర్ ట్రైన్. అంటే రిజర్వేషన్లు ఉండవు. ప్రతీ స్టేషన్ లోనూ ఆగుతుంది. మేము ఆరుగురమూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సర్దుకున్నాము. నేను భోగీ మొదట్లో కూర్చున్నాను. అంటే ట్రైన్ వెళ్ళే వైపుకి ఎదురు ముఖం పెట్టి. బయట చీకటి ఏమీ కనపడటల్లేదు. పక్క వరసలో ఇద్దరు ఆడవాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటో  ఆ కబుర్లు, ఫ్లారెన్స్ దాకా వాళ్ళు అల్లా మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం దూరంలో ఒక జంట ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ప్రేమ చూపించు కుంటున్నారు. ఇంకా పెళ్ళి కాలేదల్లె ఉంది. వాళ్ళకేం తెలుసు, ముందున్నది ముసళ్ళ పండగ. స్టేషన్లలో ఆగినప్పుడల్లా జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఒకసారి టిక్కెట్ కలెక్టర్ వచ్చి టిక్కెట్లు చూసి వెళ్ళాడు. మా ఎదురుగుండా ఇద్దరు తెల్లవాళ్ళు మొగుడూ పెళ్ళాం అనుకుంటాను కూర్చున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లీషే మాట్లాడుతున్నారు గానీ వారి మాటలని బట్టి ఏదేశం వాళ్ళో తేల్చుకోలేక పోయాను. మా ఆవిడకు కూడా అంతుపట్టలేదు. ఎదురుగుండా మౌనంగా చూస్తూ కూర్చోటం బాధగా ఉంది. సరే వాళ్ళతో  మాట్లాడాలని ఉంది, ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి? చూస్తూంటే ఎదురుకుండా అయన hawaii టోపీ (cap) పెట్టుకున్నాడు. నాకు దొరికింది టాపిక్ . "Did you go to hawaii" అని అడిగాను. "Yaa we were there last year" అన్నాడు. మళ్ళా నిశ్శబ్దం. నేను అమెరికాలో "conversation" కోర్స్ ఒకటి చెబుతాను. వీళ్ళ చేత ఎల్లాగయినా మాట్లాడించాలి. ఆవిడ సెల్ ఫోనులో తను తీసిన ఫోటోలు వరసగా ఆయనకి  చూపెడుతోంది. "Is there a wifi in the train" అని అడిగాను. అంతే ట్రైన్లో wifi లేదు అని చెబుతూ వాళ్ళ సంగతులు చెప్పటం మొదలెట్టారు. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్లుట. నెల రోజుల బట్టీ ఈ దేశంలో తిరుగుతున్నారు. పిల్లలు కాలేజీ లో ఉన్నారుట. ఫ్లారెన్స్ లో కొన్ని రోజులు ఉండి లండన్ వెళ్తారుట. ఇంతలోకే ఫ్లారెన్స్ వచ్చింది బైబై చెప్పుకుని దిగి పోయాము.

స్టేషన్ లో దిగే సరికి రాత్రి 8 గంటలయ్యింది. టాక్సీ తీసుకుని మా అపార్ట్మెంట్ కి వెళ్ళాము. అపార్ట్ మెంట్ అమ్మాయి క్రిందకొచ్చి గేటుతీసి లిఫ్ట్ లో పైకి తీసుకు వెళ్ళింది. అపార్ట్ మెంట్ తలుపు తీసింది. అందరూ అదిరిపొయారు. ఎదురుకుండా nude పెయింటింగ్. అయ్యో రామ ఇంకెన్ని చూడాలో అనుకుంటూ దానికింద కుర్చీ ఉంటే కూలబడ్డాను. ఆ అమ్మాయి ఇంట్లోకి తీసుకు వెళ్లి ఇంట్లో అన్నీ ఎలా పనిచేస్తాయో చెబుతోంది. అపార్ట్ మెంట్ చాలా పెద్దది. 3 బెడ్రూమ్స్ 2 బాత్స్ (ఒకటి ఇండియన్ సిస్టం) పెద్ద కిచన్, వాషర్, పెద్ద డ్రాయింగ్ రూం, దానిలో పియానో. చుట్టూతా బాల్కనీ. ఇటలీ లో ఫ్లారెన్స్  కళలకి (painters, sculptures) ప్రసిద్ది. సీజన్ లో ఇక్కడ కళాకారులు ఉంటారుట. అందుకని ఇంటినిండా పెయింటింగ్స్.

ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంత వాతావరణంలో మునిగిపోతాం. ఆ చుట్టుపక్కల ఉండేదంతా కళాకారులుట (artists) అందుకని పెద్ద శబ్దాలు చెయ్యవద్దంది ఇంటావిడ. ఆ వాతావరణంలో మనమూ కళాకారులుగా మారిపోతాం. డ్రాయింగ్ రూం లో ఒక పెద్ద పియానో ఉంది. మా కోడలు పియానో మీద "బీతోవన్ బిట్" ఒకటి వాయించింది. ఎప్పుడో స్కూల్లో నేర్చుకున్న పాటట చాలా బాగా వాయించింది. అమెరికాలో స్కూల్లో అందరూ ఒక సంవత్సరం పాటు మ్యూజిక్ నేర్చుకోవాలి. సంవత్సరం ఆఖరికి పిల్లల చేత కాన్సర్ట్ కూడా చేయిస్తారు. ఆ నేర్చుకున్న విద్య ఎప్పుడో అప్పుడు ఇలా ఉపయోగ పడుతుంది. మా పిల్లలు స్కూల్లో వాయిలిన్ నేర్చుకున్నారు. నాకు బాగా గుర్తున్న వాళ్ళ పాట "Hot Cross Buns". మాకందరికీ ఆకళ్ళు అవుతున్నాయి. ఎందుకో రైస్ తినాలని పించింది. రైస్ కుక్కర్ లేదు. రైస్ కుక్కర్ లేకుండా రైస్ వండటం నా కొక్కడికే తెలుసు. పిల్లా పెద్దా అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను.

మర్నాడు పొద్దున్నే "Boboli Gardens " కి బయల్దేరాము. ఇది "Pitti Palace " లో ఒక భాగము. అసలు సంగతి చెప్పాలంటే ఇది ఒక రాజు గారి భవంతి. మామూలుగా రాజుగారి భవంతి చుట్టూతా తోటలు ఉంటాయి. కాకపోతే ఈ తోట ఒక కొండ కింద నుంచి పై దాకా ఆక్రమించింది. అక్కడ రాజరికం లో వాళ్ళు వేసుకునే బట్టలు అలనాటి  ఫాషన్స్ చూపించే ఒక గాలరీ
ఉంది. ఆ రోజుల్లో కళలను పోషించేది రాజులు కాబట్టి ఆనాటి ప్రసిద్ధ కళాకారులు వేసిన పెయింటింగ్స్ తో ఒక గాలరి కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇటలీ ఫాషన్ లకి పేరు. "Made in Italy " అని ఉంటే దానికి ఎక్కడలేని విలువా వస్తుంది. ఎప్పుడూ కొత్త కొత్త డిజైన్స్ కోసం పరిశోధనలు చేస్తూ ఉంటారు. అక్కడ ఒక డిజైనర్ మా ఆవిడ డ్రెస్ని చూడంగానే తన్మయత్వం
చెంది ముచ్చటపడిపోయి ఫోటో తీసుకుంటానని అడిగింది. మా ఆవిడ ఆనందంతో మెలికలు తిరిగిపోయి ok అంది. ఇంతకీ ఆవిడ డ్రస్స్ రోజూ కట్టుకునే మామూలు చీర. మా ఆవిడ ఆఫీసుకి తప్ప ప్రపంచంలో ఎక్కడున్నా చీరెలే  కట్టుకుంటుంది.
మాకు 11 గంటలకి మైకెలాంజిలో మ్యుజియం కి టిక్కెట్లు ఉండటం తోటి త్వరగా ముగించుకుని Academia Gallery కి బయల్దేరాము. ఇక్కడ డబ్బులు కొంచెం ఎక్కువ పెడితే క్యు లో నుంచోకుండా వెళ్ళొచ్చు. అంతా "యూరో" మహిమ.  ఈ మ్యూజియం లో మైఖెలాంజిలో తో పాటు చాలా మంది శిల్ప కారులు చెక్కిన శిల్పాలు ఉన్నాయి. Florence is the capital of art in Italy. మనం కళాకారులం కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా ఒకరకమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మైఖెలాంజిలో చెక్కిన,
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "డేవిడ్" శిల్పము ముఖ్య ఆకర్షణ.  ఇక్కడి నుండి గెలీలియో
మ్యుజియం కి వెళ్ళాము. గెలీలియో పరిశోధన లన్నీ అక్కడ ఉన్నాయి. చాలావరకు మనం తరచుగా వాడే వస్తువులు అక్కడ కనిపెట్టినవే.



గెలీలియో మ్యుజియం గురించి వ్రాయాలంటే ఈ పోస్ట్ సరిపోదు. క్లుప్తంగా చెప్పాలంటే గెలీలియో పుట్టినప్పుడు "సైన్స్" అనే పదం లేదు, కానీ ఆయన చనిపోయేటప్పటికి "సైన్స్" అనే పదం వాడుకలోకి రావటమే కాకుండా దాని అర్ధం కూడా సామాన్య జనానికి తెలిసింది. సూక్ష్మంగా చెప్తే, అప్పుడు ఉన్న సైన్స్ అనే పుస్తకానికి రెండు అట్టల మధ్యలో ఉన్నవి గెలీలియో పరిశోధనలు.

గెలీలియో మ్యుజియం చూసిన తరువాత ఒక వేదాంతిలా మారిపొయాను. మ్యుజియం ఎదురుకుండా సన్ డయల్ ఉంటే దాని ఎదురుకుండా కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఆలోచిస్తున్నాను. ఛా ! ఏమిటీ జీవితం. పోద్దుటనుండీ సాయంత్రం దాకా మనం ఉపయోగించేవి ఎవరో ఎక్కడో రాత్రిం బగళ్ళు ఎన్నో కష్టాల కోర్చి పరిశోధించి కనుక్కుని మనకోసం తయారు చేసినవే. కొత్తవి కనిపెట్టాలి అనే తపనతో, వారిలో  చాలామంది  జీవితాలు సాఫీ గా కూడా సాగలేదు. ఏమిటో ఒక చెత్త ప్రశ్నమనస్సులో మెదిలింది :   జీవితమంతా ఎవరో ఎక్కడో కనిపెట్టినవి అప్పనంగా వాడుకోటం తప్ప, మనంతట మనము కొత్తవి కనుగొందామని ఎందుకు ప్రయత్నించము ?

ఇక్కడ ప్రతి ఊళ్లోనూ ఒక కాలువ ఉంటుంది. కాలవ దాటటానికి బ్రిడ్జిలు ఉంటాయి. సామాన్యంగా వాటి మీద రోడ్డు తప్ప చెప్పుకోటానికి ఏమీ ఉండవు. ఇక్కడ ఒక బ్రిడ్జి మీద కొట్లు కట్టారంటే చూడటానికి వెళ్తున్నాము. ఫ్లారెన్సు కళలకు కాణాచి. దారిలో రోడ్డు మీదే పెయింటింగ్స్ పెట్టి అమ్ముతున్నారు. మా ఆవిడకి ఏదో పెయింటింగ్ నచ్చింది, ఎంత అని  అడిగితే 25 యురోలు అన్నాడు. ఈవిడ ఊర్కుండలేక 3 యురోలకి ఇస్తావా? అని అడిగింది. ఎలాగో వాడు ఇవ్వడని నడుస్తున్నాము. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి సరే తీసుకో మన్నాడు. నేను చస్తే చెయ్యలేని పని, ఇంకో బేరం, ఆవిడ చేసింది. వాడిని 2 యురోలకి ఇమ్మంది. వాడు నసుగుతూ ఇచ్చాడు. అలా పెయింటింగ్ తీసుకుని నడుస్తూ పోతుంటే ఇంకోడు చేతిలో పెయింటింగ్ చూసి తన పెయింటింగ్ కూడా కొనుక్కో మన్నాడు. ఎంతంటే 25 యురోలు అన్నాడు. నేను ఇది 2 యురోలకి కొనుక్కున్నాను ఇస్తే తీసుకుంటా నంది. వాడు ఇచ్చాడు. ఆవిడ అదృష్టమేమిటో మరి ! మనము ఇల్లా తక్కువకి అడిగితే చాలా సార్లు తిట్లు తినాల్సి వస్తుంది.

బ్రిడ్జి మీద షాపులు చూశాం. వాటిల్లో ఉన్న వజ్రాలూ వైడుర్యాలూ మనం కొనుక్కోటానికి అందేవి కాదు. చూచి ఆనందించటానికే. నేనయితే నేను, వెధవ 18 కారట్ గోల్డ్ ఆభరణాలు మనకి పనికిరావులే అని సంతృప్తి పడ్డాను. చీకటి పడింది. ఆకలవుతోంది. ఐఫోన్ లో వెతికితే ఇండియన్ రేస్టోరంట్ దగ్గరలో ఉంది. టాక్సీ ఎక్కి వెళ్ళాము. మర్నాడు పొద్దున్నే లేచి "వెనిస్" వెళ్ళటానికి ట్రైన్ స్టేషన్ కి వెళ్ళాము.

మీకు వీలుంటే క్రింద ఇచ్చిన సమాచారం కూడా చదవండి. మన కోసం కష్టపడ్డాడు ఆయన :
1. Michelangelo
2. The Museums of Florence, Italy
3. Galileo Museum
4. Museo Galileo Virtual Museum
5. http://solar-center.stanford.edu/galileo/

Tuesday, October 21, 2014

107 ఓ బుల్లి కథ 95 -- ఇటలీ లో ఓ వారం -- పీసా

పొద్దున్నే "రోమ్" సెంట్రల్  ట్రైన్ స్టేషన్ కు జేరుకున్నాము. "రోమ్" సెంట్రల్  ట్రైన్ స్టేషన్ దాదాపు చెన్నై సెంట్రల్, ముంబయి విక్టోరియా టెర్మినస్ లాగా ఉంటుంది. ఎక్కడికెళ్ళే ఏ ట్రైన్ ఏ ట్రాక్ (ప్లాట్ఫార్మ్ ) మీదకి వస్తుందో చెప్పే పెద్ద బోర్డులు ఉన్నాయి. మా ట్రైన్ ఫలానా ప్లాట్ఫారం మీద ఉందని చెప్పారు. మా కంపార్ట్మెంట్ దగ్గర ఒక అబ్బాయి నుంచుని మా సామాను చేతిలోనించి తీసుకుని మా క్యూబికల్ లో పెట్టాడు. చూడటానికి మన దేశస్థుడు లాగానే ఉన్నాడు. ఐదు "యూరోలు" (ఇక్కడ డబ్బులు) టిప్ కింద ఇస్తే ఇంకా కావాలని అక్కడే నుంచున్నాడు. చివరికి ఇంకో రెండు "యూరోలు"  ఇస్తే తీసుకుని నసుగుకుంటూ వెళ్ళిపోయాడు. ఛిన్నప్పుడి ఇండియాలో ప్రయాణాలు గుర్తుకు వచ్చాయి.

అసలు మేము ఇవ్వాళ  ట్రైన్ లో "ఫ్లోరెన్స్" అనే ఊరు వెళ్లాలని అనుకున్నాము. కానీ దారిలో  "Leaning tower of Pisa" ఉంటే అది కూడా చూసి పోదామని "పీసా" అనే ఊళ్ళో ఆగాము. పిల్లలు "Left Luggage" లో సామాను పెట్టటానికి వెళ్ళారు. నేను సరే తిరగటానికి ప్రిపేర్ అవ్వాలి కదా అని టాయిలెట్స్ అని రాసివుంటే అక్కడకి వెళ్ళాను. ఊళ్ళు తిరిగే టప్పుడు toilets కనపడితే చేతనయినంతవరకూ అవసరాలు తీర్చు కోవటం మంచిది. కొత్త ఊళ్ళో మనకి అవి ఎక్కడ ఉంటాయో తెలియదు కదా.

తలుపు తీయంగానే "వన్ యూరొ" అనే అరుపుతో హడలి పోయాను. అవి కంప్యూటర్  చూస్తున్న ఒక అమ్మాయి కంఠం నుండి వచ్చిన మాటలు అని గ్రహించాను. ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను కానీ toilets లో, కంప్యూటరు తో ఉన్నరిసెప్షన్ డస్క్ ఎక్కడా చూడలేదు. నా దగ్గర యూరోలు లేవు. చేసేది ఏమీ లేక బయటికి వచ్చి మా ఆవిడ నడిగి ఒక యూరో తీసుకుని నా పని కానిచ్చుకుని బయటికి వచ్చాను. ఆ కంప్యుటర్ అమ్మాయి రిసీట్ కూడా ఇచ్చింది. ఎప్పుడైనా ఆ దేశం చిల్లర దగ్గరుంచుకోవటం చాలా మంచిది. ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేము.

టాక్సీ వాడు ఊరు మధ్యకి తీసుకువచ్చి "అదిగో పీసా" అని చూపించి వదిలేసి వెళ్ళిపోయాడు. మంచి ఆకలిగా ఉంది. దోవలో ఇండియన్ రేస్తోరంట్ కనపడింది కానీ "ఇటలీ లో కూడా ఇండియన్ ఫుడ్డా" అనుకుని వెళ్ళ లేదు. ఇక్కడ మన దేశస్తులు చాలా మంది ఉన్నారని తరువాత తెలిసింది. ఇక్కడ తప్పక ఏదో యునివేర్సిటీ ఉండి ఉంటుందని అనుకున్నాను. అనుకున్నట్లుగానే ఇక్కడ University of Pisa ఉంది. ఇది ప్రపంచంలో 500 గొప్ప యూనివెర్సిటీలలో ఒకటి. గెలీలియో ఈ ఊళ్లోనే పుట్టారు. ఇక్కడే మాథెమాటిక్స్ ప్రొఫెసర్ గ పని చేశారు. (ప్రపంచ యూనివెర్సిటీల రాంక్ ల లిస్టు క్రింద లింక్ లో ఇచ్చాను)

ఆకలి మాడి పోతోంది. భోజన వ్యవహారాల in charge మా కోడలు మంచి రెస్టో రెంట్ కోసం iPhone లో వెతుకుతోంది. తినటానికి మంచిది దొరకలేదు. అక్కడే ఎదురుకుండా కనపడిన దాన్లో సర్దుకుని కూర్చున్నాము. ఇక్కడ  రెస్టో రెంట్ అంటే ఒక వంట గది. దాని ముందర పందిరిలో టేబుల్స్ కుర్చీలు వేస్తారు. నేను ఆ పూట తిన్నది ఉడికించిన శనగలు. కొంచెం తిరగమాత వేస్తే బాగుండేది. అంతా బాగుంది కానీ తిన్నతరువాత బిల్ చెల్లించటానికి క్రెడిట్ కార్డులు తీసుకోమన్నారు. థాంక్ గాడ్ మా దగ్గర కాష్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేదో. విదేశాల్లో, ఆదేశం డబ్బులు కాష్ రూపంలో దగ్గర పెట్టుకోవటం మంచిది.

మెల్లగా నడుచుకుంటూ Leaning tower of Pisa వేపు బయల్దేరాము. దీని ఎత్తు 184 అడుగులు. పైకి వెళ్ళాలంటే 296 మెట్లు ఎక్కాలి. అసలు దీనిని పక్కనున్న చర్చ్ (cathedral) గంటలు పెట్టటానికి (bell tower) కట్టారు. దీనిని కట్టటం Pisa మహారాజులు 1173 లో ప్రారంభించారు. ఆ కాలంలో యుద్ధాలు మూలంగా ఆలేశ్యమయ్యి, కట్టటం పూర్తి చెయ్యటానికి 119 ఏళ్ళు పట్టింది. దానికి తోడు క్రింద నేల సరీగ్గా లేక పోవటం మూలంగా (Marshy clay soil) టవర్ వరగటం మొదలెట్టింది. ప్రపంచంలో పెద్ద పెద్ద శాస్త్రవేత్త  లందరూ కూర్చుని దీనిని సరిచేసి పడకుండా ఆపగలిగారు. దీనిని అన్నీ సరిచేసిన తరువాత 2001 లో ప్రజలు చూడటానికి తెరిచారు. మొత్తం మీద దీనిని పూర్తి చెయ్యటానికి దాదాపు 800 ఏళ్ళు పట్టింది.  దీనికి బట్టకట్టి నిలబెట్టటానికి పడిన శ్రమ అంతా పక్క భవంతిలో వీడియో లో చూపెడుతున్నారు. మేము ఎక్కటానికి ప్రయత్నించలేదు కానీ మా అల్లుడు ఎక్కి పైనుండి "పీసా" సౌందర్యాన్ని చూసి వచ్చాడు. తరువాత మేమందరం టవర్ ని కట్టటానికి కారణమైన పక్కనున్న చర్చ్ (Cathedral) లోపలి వెళ్ళాము. చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చుని ప్రార్ధించు కోవచ్చు. మేము అదే చేశాము. దేవుడు ప్రతిచోటా ఉన్నాడు.

నేను Leaning tower of Pisa గురించి ఎప్పుడో హైస్కూల్  సోషల్ స్టడీస్ లో చదివాను. గెలీలియో భూమ్యాకర్షణ మీద ప్రయోగం ఇక్కడే చేశారు. ఇంకో సంగతి కూడా తెలుసుకున్నాను: ప్రసిద్దిచెందిన  Fibonacci Sequence,  Fibonacci (ఫిబొన్నాచీ) ఇక్కడే పుట్టింది.Fibonacci Sequence ని Stock Prices predict చెయ్యటానికి ఉపయోగిస్తారు దీనిని Fibonacci Retracement అంటారు. అసలు Fibonacci Sequence ని Fibonacci కనిపెట్టలేదు. అది హిందువులు కనిపెట్టింది. Fibonacci  Hindu/Arabic సంఖ్యా విధానం ప్రచారంలో రావటానికి చాలా శ్రమ పడ్డారు. ఎంతయినా పీసా తెలివితేటలకు పుట్టిల్లు.

ఈ క్రింద పేరా హిందూ మాథెమాటిక్స్ గొప్పతనం చూపెట్టటానికి   " life-and-numbers-fibonacci" అనే ఒక పోస్ట్ నుండి సేకరించినది.

Fibonacci (as we'll carry on calling him) spent his childhood in North Africa where his father was a customs officer. He was educated by the Moors and travelled widely in Barbary (Algeria), and was later sent on business trips to Egypt, Syria, Greece, Sicily and Provence. In 1200 he returned to Pisa and used the knowledge he had gained on his travels to write Liber Abaci (published in 1202) in which he introduced the Latin-speaking world to the decimal number system. The first chapter of Part 1 begins:

"These are the nine figures of the Indians: 9 8 7 6 5 4 3 2 1. With these nine figures, and with this sign 0 which in Arabic is called zephirum, any number can be written, as will be demonstrated."


ఒకప్పుడు Pisa మహారాజు చాలా బలవంతుడు. చాలా బలిష్టమైన నౌకా దళము ఉండేది. కానీ రాను రాను పొరుగు రాజులతో యుద్దాల మూలంగా బలహీనమయ్యి రాజరికము అంతరించింది. కానీ వారు 1343 లో ప్రారంభించిన University of Pisa ఇప్పటికీ చక్కటి చదువులు చెబుతోంది. డబ్బు అధికారం కాలక్రమేణా నశించ వచ్చు గానీ చదువుకున్న చదువులు నశించవనటానికి ఇదొక ఉదాహరణ.

సాయంత్రానికి Florence ప్రయాణానికి Pisa రైలు స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడి నుంచి గంటన్నర ప్రయాణం. తరువాత పోస్టులో Florence గురించి వ్రాస్తాను.







1. World University Rankings
2. All about Leaning Tower of Pisa
3. University Rankings
4. life-and-numbers-fibonacci
5. Fibonacci

Monday, October 6, 2014

106 ఓ బుల్లి కథ 94 -- ఇటలీ లో ఓ వారం - రోమ్

రోమ్ ఎయిర్పోర్ట్ లో దిగేసరికి సాయంత్రం నాలుగు గంటలయింది. మేము అమెరికా నుండి రిజర్వు చేసిన టాక్సీ లో మా మా అపార్ట్ మెంట్ కి బయల్దేరాము. ఇక్కడ కొద్దో గొప్పో ఇంగ్లీష్ మాట్లాడుతారు. మనమేం చెబుతున్నామో అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తారు. పారిస్ కన్నా బెటర్.

దోవంతా గలీజుగా ఉంది. చుట్టూతా ఉన్న బిల్డింగ్స్ మీద graffiti బాగా ఉంది. ఇంతలో కొన్ని శిధిలాలు కనబడ్డాయి. వాటి చుట్టూతా తిప్పాడు. ఇది coliseum అని చెప్పాడు. మేము రోమ్ లో చూడవలసిన వాటిలో అది ఒకటి. నాకు దాని మీద ఇంప్రెషన్ పోయింది.  డిల్లీ లో ఉన్న జంతర్ మంతర్ కి నాలుగు రెట్లు ఉంది. మనసులో దీనిని చూడవలసిన అవసరం లేదని నిర్ధారించు కున్నాను. ఇంతలో మా అపార్ట్ మెంట్ వచ్చింది. ఈ వీధి కూడా oneway. రెండు వేపులా పార్కింగ్. చాలా పాత బిల్డింగ్. గబగబా దిగి ఇంట్లోకి వెళ్ళాము. ఎత్తయిన సీలింగ్. ముగ్గురు మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచోవచ్చు. ఆశ్చర్య పోయాము రెండు పెద్ద పెద్ద బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ అల్ట్రా మోడరన్ కిచెన్, డ్రాయింగ్ రూం గోడల నిండా పెయింటింగ్స్ ఉన్నాయి.
Vatican City Model

స్నానాలు చేసి బ్రెడ్ వగైరా ఉంటే తినేసి కూర్చున్నాను.  దగ్గరలో షాపులూ, coliseum  ఉన్నాయి వెళ్దా మన్నారు. ఇక్కడ అంతా ఎత్తు పల్లాలు. అసలు మా ఇల్లు కొండ మీదికి ఎక్కే రోడ్ మధ్యలో ఉంది.  నేను రోడ్డు దిగగలను కానీ ఎక్కాలంటే ఆయాస పడాల్సి వస్తుంది. నేను రానన్నాను. పిల్లలు ఆవిడా వెళ్ళారు.

రాత్రి పది గంటలకి ఒక కప్పు mango  "జిలాటొ(Gelato)" తోటి తిరిగి వచ్చారు.  ఇటలీ లో "జిలాటొ" ప్రసిద్ది. ఇది చూడటానికి మిల్క్ షేక్ కి, ఐస్క్రీం కి మధ్యలో ఉంటుంది. రకరకాల ఫ్లేవర్లు. మా వాళ్ళు చేసిన పనులు క్లుప్తంగా చెప్పాలంటే  వాళ్ళు తాగారు, తిన్నారు, తిరిగారు, రాత్రిపూట లైట్లతో మెరిసిపోతున్న coliseum చూసి వచ్చారు. కాకపోతే నాకు  mango  "జిలాట" తీసుకురావటానికి చాలా కష్ట పడాల్సి వచ్చిందిట. ఒక పాతిక శాంపిల్ లు తింటే గానీ దాన్ని సెలెక్ట్ చెయ్యలేక పోయారుట. (ఇక్కడ ఫ్రీ శాంపిల్ లు ఇస్తారు. కొట్టు ఓనర్ ఇంక "జిలాటొ" శాంపిల్ లు ఇవ్వము అనే దాకా ఒక్కొక్కటే రుచి చూశారు.)
Museum

ఉదయం లేచాము. వర్షం బాగా పడుతోంది. ఆరవ అంతస్తు కిటికీ లోనుండి చూస్తున్నాను. గొడుగులమ్మేవాడు బజార్లో తడిసి వెళ్లే వాళ్ళ నందరినీ  కొనుక్కోమని అడుగుతున్నాడు. ఖరీదు ఎక్కువల్లేవుంది బేరాలు కుదరటల్లేదు. నాకు కొంచెం దిగులుగా ఉంది. మేము ఒకరోజే ఇక్కడ ఉండేది ఆ రోజు ప్లాన్ ప్రకారం ఇవాళ Vatican city చూడాలి. మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు మిగతావి చూడాలి. ఏమవుతుందో ఇవాళ అని విచారించి లాభంలేదు. నాకు ఎందుకో కాఫీ తాగుతూ కిటికీ లోనుండి వర్షం పడుతుంటే చూస్తూ ఉండటం ముచ్చటగా ఉంటుందని అనిపించింది. "కాఫీ" అని పెద్దగా అరిచాను. అంటే ఇది చాలా అర్జెంట్ విషయమని చెప్పటం. ఇక్కడ  కాఫీ మెషిన్ లేదు ఎలా చేస్తారో చేసుకోండి అని సమాధానం వచ్చింది. 

వర్షం బాగా వస్తోంది. దగ్గరలో రెస్టో రెంట్లు లేవు. నడిచి వెళ్ళే పరిస్థితి లేదు. పొద్ద్ఫున్నే కాఫీ టిఫిన్ లేకపోతే కొంచెం కష్టం. మేము ఇంటువంటి పరిస్థితి వస్తుందని కొంచెం ప్రిపేర్ అయ్యాము. instant ఉప్మా తయారు చేసి జిప్ లాక్ బాగ్ లో తీసుకు వచ్చాము. ఉప్మా రవ్వ (soji), పచ్చి పోయేట్లు కొంచెం దోరగా వేయించి, విడిగా చేసిన తిరగమోత కలపటమే. వేరుశనగ, జీడిపప్పు కూడా తిరగామోతలో వేసి వెయించచ్చు. నేనయితే ఒక కప్పుకి క్వార్టర్ స్పూన్ ఉప్పు వేసి కలిపాను. ఒకటిన్నర కప్పుల నీళ్ళు మరగపెట్టి ఒక కప్ ఈ mixture వేసి మూతపెట్టి స్టవ్ మీద మీడియం లో ఉంచితే అయిదు నిమిషాలలో ఉప్మా రెడీ.
Espresso Coffee Maker  

కాఫీకి మాత్రం పెద్ద ప్రాబ్లం అయ్యింది. అలవాటయిన కాఫీ మెషీన్  లేదు. కాఫీ ఫిల్టర్ లాంటిది ఒకటి కనపడింది. వెల్, గూగులమ్మని పట్టుకున్నాము. దీనిని espresso maker  అంటారు. కింద నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే, నీళ్ళు మధ్య filter లో  వేసిన కాఫీ పొడి ద్వారా, కాఫీగా రూపాంతరం చెంది పై భాగం లోకి వస్తాయి.

ఉప్మా, కాఫీ చాలా బాగా వచ్చాయి. ఇంతలో వర్షం బాగా తగ్గిపోయి సూర్యభగవానుడు వచ్చాడు. ubar taxi ని పిలిచి Vatican కి బయల్దేరాము. టాక్సీ రోమ్ వీదులకుండా వెళ్తోంది. రోడ్లన్నీ దాదాపు రాళ్ళతో పరిచినవి. Roman Empire ప్రపంచ చరిత్రలో ఎక్కువకాలం పాలనలో నిలిచిన సామ్రాజ్యం. ఈ కాలంలో వాళ్ళు చాలా యుద్ధాలు చేశారు. గెలిచినప్పుడల్లా ఒక రోడ్డు వేయటమో, ఒక ఫౌంటెన్ కట్టించటమో, ఒక స్థూపం కట్టించటమో, ఒక భవనం కట్టించటమో  చేశారు. చాలా వరకు వీటిని కొండ రాళ్ళతో నిర్మించటం మూలంగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇటలీ వెళ్ళి చూసేది అవ్వే. ఆ కట్టడాలు, ఆ శిల్పాలు చూసి ముచ్చట పడక తప్పదు.

River God (Arno)
ప్రపంచంలో మొదటి మతాలు Polytheistic Religions. అంటే వీటిలో చాలా  దేవుళ్ళు ఉంటారు.  ఆ కాలంలో మన మనుగడకు అవసరమయి (గాలి, వర్షం నీరు, సూర్య కాంతి మొదలయినవి) మన కంట్రోల్ లో లేని వాటికి, కంట్రోల్ చేసే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండవచ్చు అనుకుని, వాళ్ళను దేవుళ్ళుగా సృష్టించి ప్రార్ధించటం మొదలు పెట్టారు. అందుకనే   Polytheistic Religions లో అంతమంది దేవుళ్ళు ఉన్నారని నా ఉద్దేశం. తరువాత దేవుడు(సృష్టికర్త) ఒకడే, Monotheism, అనే  కాన్సెప్ట్ బయటికి వచ్చింది. యుద్ధాలు చంపుకోటాలు తరువాత ఎవరు గెలిస్తే వాళ్ళ కాన్సెప్ట్ రాజ్య మేలేది. ఒక యుద్ధంలో Constantine అనే Roman Emperor గెలవటం మూలంగా Monotheism గ ఉన్న Christianity కి Roman Empire లో ప్రోద్భలం వచ్చింది. అదే రాచరికపు మతమైంది. రోమ్ కి దగ్గరున్న Vatican అనే చోట మత పెద్దలతో కేంద్రీకరింప బడి ప్రపంచమంతా పాకింది. 1929 లో Vatican City  ఒక  దేశంగా గుర్తింపబడింది. దీని ముఖ్యాదిపతి Pope. దీని జనాభా 2013 లో 839. ఇక్కడ పనిచేసే దాదాపు 3000 మంది రోమ్ లో నివసిస్తారు.

Beautiful Paintings on the Dome
Vatican City లో చూడవలసినవి Vatican museums, Sistine Chapel, St. Peters Basilica. Vatican Museums లో చూసేవి beautiful sculptures, paintings. అన్నీ Christianity ఎల్లా evolve అయ్యింది దాని ప్రచారకులు వాళ్ళ కధలు. మీరు Sistine Chapel పేరు వినే ఉంటారు. Pope ని ఎన్నుకునే కమిటీ ఇక్కడే కలుసుకుని కొత్త Pope ని ఎన్నుకుంటుంది. ఇక్కడ చుట్టూతా బిబ్లికల్ కధల పెయింటింగ్స్, డోమ్ లోపల చక్కటి Michelangelo పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా పవిత్రమైన చోటు. చాలా మంది కూర్చుని ప్రార్ధిస్తూ ఉంటారు. మేము అదే చేశాము. ఇక్కడ నుండి St. Peters Basilica కి వెళ్ళాము. ఇది ఒక పవిత్రమైన చర్చి. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా కూర్చుని ప్రార్ధించవచ్చు. మేమూ అదే చేశాము. దేవుని ప్రార్ధించటానికి ఏ ప్రార్ధనా మందిరమయినా ఒకటే. అక్కడినుండి బయటకు వచ్చాము. విశాలమైన బహిరంగ సమావేశ స్థలము. పొప్ క్రిస్మస్ అప్పుడు ప్రజలని దీవించేది ఇచ్చటి నుంచే.

మేము తరువాత టాక్సీ ని పిలిచి రోమ్ లో Spanish steps దగ్గరకి వెళ్ళాము. దీనిని గురించి చాలా చెప్పాల్సినది ఉంది మళ్ళా రోమ్ వచ్చినప్పుడు చెప్తాను. ఆకలి దంచేస్తోంది దగ్గరలో ఉన్న మంచి రేస్టోరెంట్ కి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు ప్లేట్లోపెట్టే పోర్షన్ అమెరికా లో కంటే చాలా తక్కువ. పీజ్జా చాలా పల్చగా ఉంటుంది. ఒక్కళ్ళకి కూడా సరిపోదు. తర్వాత దగ్గరలో ఉన్న"జిలాటో" ప్లేస్ కి వెళ్ళాము.  మళ్ళా samples. ఎన్ని రుచి చూసినా నాకు నిరాశే మిగిలింది. mango జిలాటో లాంటిది అక్కడ లేదు.

రాత్రికి ఇంటికి జేరుకున్నాము. మర్నాడు ట్రైన్ లో ఫ్లారెన్సు కి ప్రయాణం.



Monday, September 29, 2014

105 ఓ బుల్లి కథ 93 -- ఇటలీ లో ఓ వారం - పారిస్

హెడింగ్ చూసి ఇటలీకి, ఫ్రాన్స్ లో ఉన్నపారిస్ కి సంబంధం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా ? నిజంగా ఏమీ లేదు, కానీ పారిస్, మేము వెళ్ళే ఇటలీ దోవలో ఉంది. అక్కడ మధ్యలో ఆగితే ప్లేన్ ఫేర్ తగ్గుతుంది. అందుకని మా ఇటలీ ట్రిప్ లో పారిస్ కలిసింది.

మేము Paris "Charles degaulle " ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అప్పుడే తెల్లవారుతోంది. (Paris లో రెండు airport లు ఉన్నాయి. Charles degaulle, Orly.) ఇమ్మిగ్రేషన్, సామాను కలెక్ట్, సెక్యూరిటీ అయిన తరువాత బయట రిజర్వ్ చేసిన మా టాక్సీ కోసం చూశాము. అక్కడ మా పేరు బోర్డుతో ఎవరూ నుంచోలేదు. సరే ఫోన్ చేస్తే ఇంగ్లీష్ భాగంలో అంతులేని మ్యూజిక్ రావటం మొదలెట్టింది, ఫోనులో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా పోర్టర్ ఫోన్ తీసుకుని ఫ్రెంచ్ బట్టన్ నొక్కగానే వెంటనే మనిషి పలికారు. లెస్సన్ నంబర్ వన్ ఇక్కడ జనానికి ఇంగ్లీష్ వచ్చు గానీ మాట్లాడారు. నో స్పీక్ ఇంగ్లీష్ అంటారు. ఇంతకీ తేలిందేమంటే మాకు రిజర్వేషన్ ఉంది గానీ ఎవరో కాన్సిల్ చేశారుట. అక్కడ కూర్చుని వాదించటం దండగ. సరే ఇంకొక టాక్సీ తీసుకుని ఇంటికి చేరాము.

"ఇల్లు" అనంగానే మీకు ఇంకొక భావన రావచ్చు. మాకు నిజంగా పారిస్ లో ఇల్లు లేదు. మాది ఒక రోజు ఇల్లు.  ప్రపంచంలో ఏ పెద్ద ఊర్లో అయినా సరే హోటల్లో ఉండాలంటే తడిసి మోపెడవుతుంది. ఇప్పుడు రోజూవారీ అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకోవచ్చు. హోటల్ కన్నా సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. దాదాపు మన ఇంట్లో సౌకర్యాలన్నీవంట గిన్నెలతో సహా ఉంటాయి. అర్ధ రాత్రి పూట కాఫీ తాగాలనుకుంటే కలుపుకుని తాగవచ్చు. మేము వెళ్ళే అన్నిఊళ్ళల్లో ఉండటానికి అపార్ట్మెంట్లు తీసుకున్నాము. అన్ని వివరాలూ తెలిపే ఆ వెబ్ సైట్ పేరు airbnb.com.

ఇంటికి వస్తూంటే దారిపొడుగునా అప్పుడప్పుడే కాఫీ దుకాణాలు తెరుస్తున్నారు.  ఇక్కడ breakfast ఫుడ్స్ crepes, croissants. క్రేప్స్ అంటే పల్చటి తీపి దోశలనుకోండి croissants అంటే మరీ తీపి కాని కేక్ లాంటి బ్రెడ్. పక్కనున్న ఫోటో పారిస్ లో మా వీధి. ఇంకో ఫోటో మా ఎదురుకుండా ఉన్న ఇల్లు. ప్రతీ బాల్కనీలో పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ! ఇక్కడి ఇళ్ళు ఎప్పుడో కట్టినవి. వీధులు కూడా ఎప్పుడో వేసినవి. రాజ వీధులు తప్ప, అన్ని వీధుల్లోనూ రెండువేపులా కార్లు పార్క్ చేస్తారు. సామాన్యంగా వీటిల్లో one way ట్రాఫ్ఫిక్. "నేను లోపలికి రావటం కుదరదు ఇది one way" అని వీధి మొదట్లో టాక్సీ వాడు దింపేశాడు. సామాను మోసుకుంటూ ఇంట్లోకి జేరుకున్నాము. ఇళ్ళు పాతవిగా కనపడ్డా లోపల remodel చెయ్యటం మూలంగా లోపల ఉన్నఅపార్ట్మెంట్లు అన్నిసౌకర్యాలతోటి ఉంటాయి.

మాకు 12:30 కి ఐఫుల్ టవర్ అప్పాయింట్మెంట్ ఉంది. మేము అక్కడ ఆ సమయానికి ఉంటే ఒకళ్ళు వచ్చి మమ్మల్ని క్యూలో నుంచోకుండా  ఐఫుల్ టవర్ లోపలకి తీసుకు వెళ్తాడు (లేకపోతే కనీసం రెండు గంటలు క్యూలో నుంచోవాల్సి వస్తుంది). కాకపోతే కొంచెం ధర ఎక్కువ. మేము 11 గంటలకల్లా ఇంట్లో రెడీ అయ్యాము. సరే అక్కడ చుట్టు పక్కల తిరగొచ్చని. uber car కోసం iPhone లో చూస్తే 5 నిమిషాలలో కారు వచ్చే టట్లా ఉంది. కారెక్కి  ఐఫుల్ టవర్ కి వెళ్ళాము.

ఇక్కడ కొన్ని సంగతులు చెప్పాలి. మా దగ్గర international calls చెయ్యగలిగే  iPhone ఉంది. ప్రపంచంలో పెద్ద పట్టణాలలో uber అనే సర్వీస్ ఉంది. (uber.com). వాళ్ళ కార్లు ఊరంతా తిరుగుతూ ఉంటాయి, వాటిని సెల్ ఫోన్ లో చూడవచ్చు. మనకు దగ్గరలో ఉన్న కారుని రమ్మంటే, వచ్చి మనము వెళ్ళ వలసిన చోటికి తీసుకు వెళ్తారు. ఇంకొక సంగతి చెప్పాలి. ఇక్కడ పారిస్ (యూరోప్) లో జేబు దొంగలు ఎక్కువ. చాలా జాగర్తగా ఉండాలి. నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన విధంగా పర్స్ జేబుకి పిన్నీసు పెట్టుకున్నాను.


ఒక గంటసేపు ఐఫుల్ టవర్ చుట్టూతా తిరిగాము.  ఫౌంటైన్స్, పార్క్ లు, సావనీర్ షాపులూ చాలా ఉన్నాయి. ఆ షాపుల్లోనూ, బయట అమ్మేవాళ్ళూ (మంచినీళ్ళు వగైరా) అందరూ ఇండియన్స్ లాగా కనపడే వాళ్ళే (ఇండియా శ్రీలంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్). సరీగ్గా 12:30 కి ఒకళ్ళు వచ్చి ఐఫుల్ టవర్ ఎలివేటర్ దగ్గరకి తీసుకు వెళ్ళాడు. మీరు మెట్లెక్కి వెళ్ళా లనుకుంటే ఇంకో ద్వారం ద్వారా టిక్కెట్ తీసుకుని వెళ్ళవచ్చు  (క్యూ దాదాపు ఉండదు). పైన ఎలివేటర్ దిగి ఐఫుల్ టవర్ మీద నుంచి చుట్టూతా తిరిగి చూడవచ్చు. Spectacular view of Paris. ఏమన్నా తినాలనుకుంటే అక్కడ రేస్టోరెంట్ కూడా ఉంది.


 ఐఫుల్ టవర్ నుండి దిగిన తరువాత పారిస్ మధ్య ప్రవహించే నది మీద క్రూజ్ కి వెళ్దా మనుకున్నాము కానీ చాలా మెట్లు దిగాలి, ఎక్కాలి. అందుకని బస్ టూర్ కి మార్చుకున్నాము. బస్ టూర్ "హాప్ ఆన్ హాప్ ఆఫ్". అంటే అది ఆగిన చోట ఎక్కడైనా సాయంత్రం లోపల ఎక్కవచ్చు దిగవచ్చు. గంటన్నరలో ఊరంతా తిప్పుతారు. పెద్దపెద్ద ఫ్రెంచ్ రాజ వీధులగుండా, ఫ్యాషన్, పర్ఫ్యూమ్స్ కంపెనీ లన్నీ చూస్తూ వెళ్ళొచ్చు.

పారిస్ మధ్యలో ప్రవహించే నదిని sein river అంటారు . దానికి వడ్డుకి రెండు వేపులా సిమెంట్ చేశారు. మీరు దాని మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చు కూర్చుని చల్లగాలిని ఆనందించవచ్చు. నడుస్తూ పోతూ ఉన్న చాలా మంది ప్రేమికులు కనపడతారు. చాలా మంది ప్రేమికులు పబ్లిక్ గా ప్రేమ చూపిస్తూ ఉంటారు. బాగా మైంటైన్ చేస్తారు కాబట్టి ఎప్పుడూ జనం తిరుగుతూనే ఉంటారు. మీరు చాలా ఇంగ్లీష్ సినీమాలలో ఈ sein river ప్రేమికులు ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ చెట్టా పట్టా వేసుకుని  చిందులాడటం చూసే ఉంటారు. ఇంకా ప్రేమ ఊరుతుంటే మెట్లెక్కి రోడ్డుమీదకి వచ్చి padlock కొనుక్కిని వాళ్ళ పేర్లు రాసుకుని అక్కడున్న ప్రేమికుల panel కి తాళం వేసి, తాళం చెవి నదిలో పారేసి వెళ్లి పోవచ్చు. మీరు అటువంటివి చెయ్యాలనుకుంటే త్వరగా వెళ్ళటం మంచిది. నాకు ఈ మధ్య తెలిసిన వార్త ఏమిటంటే ప్రేమికులు ఎక్కువవటం మూలంగా తాళాలు వెయ్యకుండా ఉండేటట్లు అక్కడ గ్లాస్ పానల్స్ పెడతారట.


నేను గమనించింది ఏమంటే ప్రపంచంలో అందరూ ఊళ్లు నిర్మించి ఏదో ఒక మూల పార్కులు కడతారు. కానీ పారిస్ లో ఏమనిపిస్తుందంటే ఒక పెద్ద పార్క్ నిర్మించి దానిలో కొన్ని చోట్ల ఇళ్ళూ కట్టారని. ప్రతి ఇంటి బాల్కనీలో ముచ్చటగా పూలు చూస్తారు. ఇక్కడ రాజరికం ఉన్నకాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు వస్తూ ఉండేవి. గెలిచినప్పుడల్లా రాజులు ఒక స్థూపమో, నది మీద ఒక బ్రిడ్జో, లేక పోతే ఒక ఫౌంటెన్ కట్టించేవారు (మన రాజులు గుళ్ళు కట్టించిన విధంగా). అవన్నీ వరసగా బస్ టూర్ లో చూడవచ్చు. మేము రెండు సార్లు ఊరు చుట్టూతా తిరిగి ఒక రేస్టోరెంట్ దగ్గర ఆగి భోజనం చేసి ఇంటికి జేరుకున్నాము.

అప్పుడే చీకటి పడుతోంది. పోద్దుటనుండీ తిరిగాము కదా నాకు కొంచెం బడలికగా ఉంది. ఇంతలోకే అమ్మా కూతురూ బయటికి వెళ్లాలని నిర్ణయించు కున్నారు. హటాత్తుగా అడిగితే నేను రానని చెప్పాను. నేను ఎంతసేపు నిద్రపోయానో తెలియదు కానీ తలుపు తీసే శబ్దమయితే లేచాను. అమ్మా కూతురూ ఆపిల్స్ తీసుకు వచ్చారు. దేశంగాని దేశంలో ఇంత సేపు ఏమి చేసారబ్బా అని మనసులో అనుకోకుండా పైకి అనేశాను. క్లుప్తంగా తేలిందేమంటే కాసేపు బజారులలో తిరిగారుట తరువాత ఐఫుల్ టవర్ రాత్రిపూట ఎల్లా ఉంటుందో చూడాలనిపించి ubar టాక్సీ పిలిచి వెళ్లి చూసి వచ్చారుట. నేను మళ్ళా అప్పుడు వెళ్ళే పరిస్థితి లో లేను. సరే అది మిస్ అయ్యాను. అనుకోకుండా ఆవిధంగా మిస్ అయిన దాన్ని, మొన్న ఒక హిందీ సినీమా లో చూశాను. దానిలో హీరోయిన్ రాత్రి పూట ఐఫుల్ టవర్ కి వెళ్లి చూస్తుంది. మీరు కూడా ఐఫుల్ టవర్ రాత్రిపూట ఎల్లా ఉంటుందో చూడాలనుకుంటే Queen అనే హిందీ సినిమాలో చూడవచ్చు.

సరే పొద్దున్నే లేచాము. అందరికీ ఆకలి దంచేస్తోంది. నడుచుకుంటూ ఒక హోటలికి వెళ్ళి breakfast కానిచ్చాము. మెనూ లో ఫ్రెంచ్ కింద ఇంగ్లిష్ కూడా ఉంటుంది కాబట్టి ఆర్డర్ చెయ్యటం తేలిక. మీకు మంచి నీళ్ళు కావాలంటే కూడా ఆర్డర్ చెయ్యాలి. లేకపోతే ఇవ్వరు. నీళ్ళల్లో రకాలు Tap water, sparkling water, Gas water (సోడా), మొదలయినవి. Tap water కి డబ్బులు ఇవ్వక్కర లేదు. అల్లాగే కాఫీ కూడా. espresso, cappuccino(కాపచినొ), americano. మీకు మన కాఫీ లాంటిది కావాలంటే "అమెరికానో" ప్లస్  క్రీమ్ ఆర్డర్ చెయ్యండి.

ఇంటికి వచ్చి బట్టలు సద్దుకుని Rome వెళ్ళటానికి Orly airport కి టాక్సీ తీసుకు వెళ్ళాము.

గమనిక: ఫోటోలు చాలావరకు మా ఆవిడ iPad తో తీసినవి. చాలా తీశాము గానీ పోస్ట్ లో ఎక్కువగా పెడితే, పోస్ట్ Internet లో రావటానికి చాలా టైం పడుతుందని ఎక్కువగా పెట్టలేదు. 

Monday, September 22, 2014

104 ఓ బుల్లి కథ 92-- అమెరికాలో ఐఫెల్ టవర్ ఉందా?

ఉంది. మనం రోజూ ఎన్నెన్నో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాటిలో కొన్ని ప్రపంచంలో ప్రశస్థ మైన వాటిని చూడాలని అనిపిస్తుంది. అవి వివిధ దేశాల్లో ఉంటే వెళ్ళాలంటే చాలా డబ్బు శ్రమతో కూడిన పని. అందుకని అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చాలా వాటికి డూప్లికేట్ లు తయ్యారు చేశారు. వాటి లిస్టు క్రింద ఇస్తున్నాను. మీరు వాటికి దగ్గరలో ఉంటే చూడటానికి ప్రయత్నించండి. కొంత కాకపోతే కొంతయినా త్రుప్తి పడవచ్చు. నేను కొన్ని ఊళ్ళకి వెళ్ళానుగానీ అవి ఉన్నయ్యని తెలియక వాటిని చూడలేదు. పక్కనున్న రెండు ఫోటోలు మొన్నీమధ్య (ఈ నెలలో Paris, France Pisa, Itali) తీసినవి. నా ఫోటో చాతుర్యం వలన ఐఫెల్ టవర్ వంగి నట్టు కనపడుతుంది గానీ నిజంగా వంగలేదు.

1. Eiffel Tower: Paris, Texas USA
అసలుది Paris, France లో ఉంది. అమెరికాలో  Texas రాష్ట్రంలో ఉన్న Paris అనే ఊళ్ళో ఉంది. అసలు దానికన్నా కొంచెం ఎత్తు ఉండాలని దీనిపైన ఒక టోపీ కూడా పెట్టారు.

2. The leaning tower of Pisa: Niles, Illinois USA
అసలుది Pisa, Italy లో ఉంది. దీనిని 1934 లో కట్టారు. అసలు దానిలో సగం సైజు ఉంటుంది. ఈ రెండు కట్టడాలు కట్టిన కారణాలు వేరు. పీసా లో కట్టినది పక్కనున్న చర్చ్ బెల్స్ ఉంచటానికి కాకపోతే Niles లో కట్టింది చూడ ముచ్చట కాని పక్కనున్న water tanks ని దాచి పుచ్చటానికి. 

3. The Parthenon: Nashville, Tennessee  USA
అసలుది Greece లో ఉంది. ఇది Nashville’s Centennial Park లో ఉంది. దీనిని Tennessee’s 1897 Centennial Exposition కోసం కట్టారు.

4. London Bridge: Lake Havasu City, Arizona USA
"లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ " అనే పాట మీరు చిన్నప్పుడు పాడి ఉంటారు లేకపోతే కనీసం వినయినా ఉంటారు.1968 లో ఈ బ్రిడ్జి అవసాన దశలో ఉంటే దాదాపు 2. 5 మిలియన్ డాలర్లకి లండన్ సిటీ దీనిని అమ్మింది. కొనుక్కున్న వాళ్ళు దాని రాళ్ళన్నీ జాగర్తగా తీసుకువచ్చి అమెరికాలో ఆరిజోనా రాష్ట్రంలో దీనిని కట్టారు.

5. The Titanic: Branson, Missouri USA
అసలుది సముద్రపు అడుగున ఎక్కడో ఉంది. ఇది టైటానిక్ కి కాపీ. దీనిలో ఆ షిప్ గురించి ఒక మ్యూజియం కూడా ఉంది.

6. Stonehenge: Natural Bridge, Virginia USA
అసలుది England లో ఉంది. దీన్ని అంతా Styrofoam తో చేశారు. అందుకనే దీన్ని Foamhenge అని కూడా అంటారు. ఇది Blue Ridge Mountains లో,  Natural Bridge అనే ఊళ్ళో Virginia రాష్ట్రంలో ఉంది.


మాతృక
https://www.yahoo.com/travel/copycat-travel-icons-across-the-usa-92756797352.html

Monday, September 15, 2014

103 ఓ బుల్లి కథ 91 --- అమెరికాలో మా పెరటి తోట





అప్పుడే సెప్టెంబర్ వచ్చేసింది ఇంక చలిమొదలెడుతోంది. చికాగోలో అలా చలి రోజు రోజుకూ పెరుగుతూ, ఉష్ణోగ్రత తగ్గుతూ జనవరి వచ్చేసరికి స్నో కురుస్తూ, అప్పుడప్పుడూ తుఫానులుగా వస్తూ, వింటర్ ప్రభావం చూపిస్తూంది. ఏప్రిల్ నుండీ మళ్ళా వెచ్చదనం మొదలెడుతుంది. అప్పటినుండీ ఆగస్ట్ దాకా వేడి  పెరుగుతూ ఉంటుంది. తోట పనులు చేసుకునే కాలం ఏప్రిల్ నుండీ ఆగస్ట్ దాకా. ఏకాలంలో చెయ్యాల్సిన పనులు ఆ కాలంలో చేయ్యా లాంటారే అది ఇక్కడ చాలా నిజం.

దాదాపు ఈ సంవత్సరానికి తోట తో పని అయిపోయినట్లే. ఇంకో నెల రోజుల్లో మీరు చూస్తున్న మా తోట ఫోటో ఇల్లా ఉండదు. వడలిపోయి నల్లగా నిర్మానుష్యంగా తయారు అవుతుంది. మళ్ళా తోటపనికి ఏప్రిల్ దాకా ఆగాల్సిందే.

ఇక్కడ మొక్కలు వెయ్యటం "మే" మొదటి వారంలో ప్రారంభ మవుతుంది. అసలు మార్చ్ ఏప్రిల్ లోనే ఇంట్లో విత్తనాలు వేసి మొక్కలని పెంచుతారు. మా లాంటి వాళ్ళయితే మేనెలలో షాపుల కెళ్ళి మొక్కలు కొనుక్కు వచ్చి పెరటి తోటలో వేసుకుంటారు. దాదాపు అన్నికూరలమ్మే కొట్ల దగ్గరా పూలు, కూరగాయల మొక్కలు అమ్ముతారు.

మేము ఈ సంవత్సరం మా తోటలో వేసినవి: టొమాటో, బెల్ పెప్పర్, థాఇ పెప్పర్ (సీమ పచ్చిమెరప), బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బీన్స్, వంకాయ, బీరకాయ, సొరకాయ, cucumber (కీరా), పెరుగు తోటకూర.

ఫోటోలో మధ్యలో ఎత్తుగా పెరిగినవి, brussels sprout చెట్లు. నాకు బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ అంటే ఇష్టం. అవి మినీ కాబేజీల్లా ఉంటాయి. ఒక పది తరిగి, నాన బెట్టిన ఒక స్పూన్ కందిపప్పు వేసి కొద్దిగా స్టీమ్ చేసి తిరగమోతతో మిళాయించి కూర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అదొక్కటే ఇంతవరకూ ఏమీ కాయలేదు. బహుశా డిసెంబర్ దాకా ఆగాలేమో. ఎక్కువగా వీటిని క్రిస్మస్ అప్పుడు ఉడకేసి డిన్నర్ లో తింటారు.

కుడివైపు పల్చగా ఉన్న చోట cucumber (కీరా) వేశాము. ఈ సమ్మర్ లో కొన్ని రాత్రుళ్ళు బాగా చల్ల పడ్డాయి. దానితో వాటికి  "ఫంగస్" పట్టుకుంది. ఆకులు పాడయి పోయాయి. "ఫంగస్" కి విరుగుడుగా baking soda నీళ్ళు చల్లాము గానీ పాడయిన ఆకులన్నీ తుంచి వేయటము మూలంగా ఎక్కువగా కాయలు కాయలేదు.

మీకు prominent గ కనపడేది పెద్ద ఆకులతో అల్లుకున్న సొర చెట్టు. అది టమాటో చెట్లు, బీరకాయ తీగల మీద పాకి తోటంతా ఆక్రమించుకుంది. దానికింద వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. లేత వంకాయలు తోటలోనించి కోసుకు వచ్చి కూర, పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటయ్యో చెప్పలేము.

మేము ఇంట్లో ఉండేది ఇద్దరం. ఇద్దరికి ఇంత తోట కావాలా అనిపిస్తుంది. కానీ ఆ సంతోషం ఆ త్రుప్తి వేరు. పండిన కూరగాయలన్నీ చాలా మందికి పంచి పెట్టాము. పచ్చి టొమాటోలు మనవాళ్ళకి చాలా ఇష్టం. పెరుగు తోటకూర బాగా వచ్చింది అందరికీ ఇచ్చాము. పెరుగు తోటకూర ఎల్లా చేసినా ఎప్పుడూ బ్రహ్మాండంగా వస్తుంది.

మా నాన్నగారు పొద్దున్నేమొహం కడుక్కోటానికి పెరట్లోకి వెళ్ళివచ్చేటప్పుడు, మా అమ్మకి ఆరోజు వంటకి కూరలు కోసుకు తీసుకు వచ్చేవారు. అప్పుడు అర్ధం అవలేదు. అప్పుడే కోసుకువచ్చిన కూరలతో వంట చేస్తే ఆ రుచే వేరు. చెట్టు నుంచి కోయటం అంటే వాటి పోషక రక్షణ నుండి వేరు చెయ్యటం. వాటిని వాడటంలో సమయ జాప్యం ఎక్కువయిన కొద్దీ వాటిలో రసాయనిక ప్రక్రియలు ప్రారంభమవుతాయి. రుచి తగ్గటానికి ఇది కారణం అవ్వచ్చు.

వచ్చే సంవత్సరం ఏమి వెయ్యాలో కొంచెం ఆలోచించాలి. మరీ దగ్గరలో మొక్కలు పెట్టాము కొంచెం దూరంగా మొక్కలు పెడితే బాగుంటుందేమో. దానికి తోడు కొన్ని మొక్కల నుండి ఎక్కువగా ఉత్పత్తి రాలేదు. వాటిని పెట్టక్కర లేదేమో. ఏదో ఉబుసుపోకకి మీకు చెబుతున్నా గానీ తోటలో నా బాధ్యత నీళ్ళు పోయటం, రోజూ కూరకి పెరిగిన కాయలు తుంచుకు రావటం వరకే. మా ఆవిడ, ఆవిడ సలహాదారులతో సంప్రదిస్తే గానీ వచ్చే సంవత్సరం ఏ మొక్కలు ఎక్కడ వెయ్యాలో తేలదు. పై ఫోటోలో ఉన్న సీతాకోక చిలుకలు మా ఆవిడ స్నేహితులు, సలహాదారులు. ఆ కుందనపు బొమ్మల సలహాలు ఎవరు వినకుండా ఉంటారు ?

Saturday, August 23, 2014

102 ఓ బుల్లి కథ 90 --- కంప్యూటర్ మూల పడితే

గత రెండు నెలల నుండీ నా కంప్యూటర్ సరీగ్గా పని చెయ్యటం మానేసింది. "ఈనాడు" వార్తలు లేవు "హిండూ" వార్తలు లేవు "మాలిక" బ్లాగులు చూడటం లేదు. పోనీ పని చెయ్యటం మానేసి గుట్టుగా కూర్చుంటుందా అంటే అదీ లేదు. "ఈనాడు" తీసుకు రావమ్మా అంటే ఒక అరగంటకి తీసుకు వస్తుంది. ఒక్కొక్కప్పుడు దానికోసం అలా చూస్తూ కూర్చోవాలి.

నేను ఇంటర్నెట్ ప్రొవైడర్ కస్టమర్ సపోర్ట్ కి ఫోన్ చేశాను. మీ ఇంట్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి అని అడిగాడు. మూడు ఉన్నాయి రెండు బాగానే పని చేస్తున్నాయి అని చెప్పాను. ఆ చెప్పటం తప్పయి పోయింది. మూడింట్లో రెండు పనిచేసి మూడోది పనిచెయ్యకపోతే మూడవది పాడయ్యి ఉంటుంది అని తేల్చాడు. ఇంక వాళ్ళు మాయింటికి వచ్చి నా ప్రోబ్లం సంగతి చూడటం సున్నా.

ఇంట్లో భర్త, ఏ పనీ చెయ్యకుండా కంప్యూటర్ స్క్రీన్ ఎదురుకుండా కూర్చుని జపం చెయ్యటం ఏ భారత నారీ మణికీ ఇష్టముండదు ! నాన్నగారి సమస్య గురించి మా ఆవిడ పిల్లల్ని అడిగింది. "కంప్యూటర్ పాతదయి పోయింది వైరస్ లు ఉండి ఉంటాయి కొత్తది కొనటం మంచిది" అని సలహా ఇచ్చారు.

నా కెందుకో కొత్త కంప్యూటర్ కొనటం ఇష్టం లేదు. నాలాంటివాడు  యాఫ్త్రాల్  ఓ జీవంలేని కంప్యూటర్ కి లొంగిపొవాలా ? అయినా కంప్యూటర్ కొన్ని రోజులు లేకపోతే జీవితం తల్లకిందులు అవదు కదా. దీనిసంగతి ఏదో   తేల్చుకోవాలని అనుకున్నాను.

పూర్వం ఇటువంటి పరిస్థితి వస్తే కంప్యూటర్ హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఫార్మాట్ చేసి వాళ్ళు ఇచ్చిన డిస్కులతోటి ఆపరేటింగ్ సిస్టం ని లోడ్ చేసేవాణ్ణి. కంప్యూటర్ దాదాపు కొత్త కంప్యూటర్ లాగా అయ్యేది. అలా ఏమన్నా చేయచ్చోమో అనే ఆశతో దాచిపెట్టిన కంప్యుటర్ file పైకి తీశాను.

ఈ laptop కొని 5 ఏళ్ళయింది. "Gateway " వాళ్ళు తయ్యారు చేశారు. windows 7 ఆపరేటింగ్ సిస్టం. కొత్త కంప్యుటర్ కొన్నప్పుడు వాటితో వచ్చిన వాటి నన్నిటినీ (మాన్యుయల్స్ వగైరా) ఒక పెద్ద కవర్ లో పెట్టి దాచి పెట్టాను. Instruction Manual,  "recovery " అని నా రైటింగ్ తో నాలుగు డిస్కులూ ఉన్నాయి. నేనే ఎప్పుడో వాటిని తయారు చేసి ఉంటాను. Instruction Manual లో కంప్యూటర్ ని పూర్వ దశకి తీసుకు రావచ్చేమో అని వెతికాను. recovery management అని ఒకటుంది దాని ద్వారా కంప్యూటర్ ని పాత టైం లోకి తీసుకు వెళ్ళచ్చు అని తెలుసుకున్నాను.

"start " icon ను క్లిక్ చేసి చూస్తే all programs లో Gateway అని ఉంది, క్లిక్ చేశాను. Gateway Recovery Management వచ్చింది. ఇంక నా పని నల్లేరు నడక నుండి పూల బాట మీద నడక అయ్యింది. ఇంక తనే చెప్పేసింది ఎల్లా recover అవ్వాలో(restore ద్వారా ). టైం మెషీన్ తో పాత కాలం లోకి పోయినట్లు దాదాపు ఒకటిన్నర గంటల్లో నా కంప్యూటర్ కి పూర్వ వైభవం తీసుకు రాగలిగాను. మీరు మీ laptop కి recovery డిస్క్ లు ఇంకా క్రియేట్ చెయ్యకపోతే తప్పకుండా వెంటనే చెయ్యండి. ఎప్పుడో అప్పుడు అవసరం రావచ్చు.

సరే కొత్త కంప్యూటర్ తోటి టెస్ట్ మొదలెట్టాను. కాసేపు Internet బాగా వచ్చింది కానీ తరువాత అంతా మామూలే. ఏమిటో అర్ధం కావటల్లేదు. ఒకరోజు నిద్రపట్టక పోతే రాత్రి 3 గంటలకి కంప్యూటర్ ఆన్ చేసాను. మీరు నమ్మరు blasting speed లో Internet వచ్చింది.

ఎన్ని రోజులని కంప్యూటర్ కోసం తెల్లవారు ఝామున లేచేది ? ఇంక విసుగు వచ్చేసి ఏమవుతుందో చూద్దామని కంప్యుటర్ ని మేడ మీద నుంచి కిందకి తీసుకు వచ్చాను. బ్రహ్మాండ మయిన స్పీడ్ తో Internet వచ్చింది. అప్పటినుండీ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఇంత సులువుగా నా ప్రాబ్లం సరి అవుతుందని అనుకోలేదు. ఒక విధంగా చూస్తే నా రెండు నెలల శ్రమా వృధాయే.

ఈ పోస్ట్ కి ఉపసంహారం ఏమి వ్రాసేది ? నాకు నేనే తిట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి.  ఈ పనిని నేను ముందరే ఎందుకు చెయ్య లేదు ? అనే ప్రశ్నకి సమాధానం లేదు. కానీ ఈ రెండు  నెలలలో laptop maintenance మీద చాలా తెలుసుకున్నాను. Windows లో కంప్యూటర్ ప్రొబ్లెమ్స్ సాల్వ్ చేసే tools చాలా ఉన్నాయి. మీరు క్రింద చెప్పిన విధంగా క్లిక్ చేసుకుంటూ పోతే వాటి గురించి చాలా తెలుస్తాయి. మీకు కంప్యూటర్ ప్రొబ్లెమ్స్ ఉంటే వాటినుండి బయట పడటానికి ఇవి చాలా పనికి వస్తాయి.

1. start -> control panel -> system and security

2. start -> right click on the computer -> properties

P.S: ప్రస్తుతం డైనింగ్ టేబుల్ మీద తిష్ట వేశాను. ఎంత కాలం సాగుతుందో తెలియదు. డైనింగ్ టేబుల్ కిచెన్ కిందకి వస్తుంది. కిచెన్ నా ఆధీనంలో లేదు. 

Saturday, August 16, 2014

101 ఓ బుల్లి కథ 89--- మీరు న్యూయార్క్ వెళ్తే - ఇవ్వాల్సిన ముడుపులు

క్రిందటి నెల జూలైలో మేము న్యూయార్క్ వెళ్ళటం జరిగింది. ఏ ఊరయినా వెళ్ళినప్పుడల్లా,  నలభై ఏళ్ళ క్రిందట యునివెర్సిటీ  చికాగోలో కలిసి తిరిగిన మా నలుగురు స్నేహితులం దగ్గరలో ఉంటే తప్పకుండా కలుసుకుంటాము. మేమందరం రిటైర్ అయ్యాము. మేమందరం చదువుకున్నదొకటి జీవితంలో భుక్తి కోసం చేసినది మరొక్కటి. మీరు కూడా ఇటువంటి పరిస్థుతులలో ఉంటే విచారించకండి. జీవితంలో అది మామూలే అని గ్రహించండి.

అసలు సంగతికి వస్తే మాలో ఒక స్నేహితుడు రామారావు "డిల్హై" నుండి మా ఇంటికి వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళాడు. అమెరికాలో "డిల్హై" ఏమిటా అంటారా! మీరు నమ్ముతారో నమ్మరో న్యూయార్క్ స్టేట్ లో DELHI అనే ఒక ఊరు ఉంది. ఎవరో ఎప్పుడో ఢిల్లీ వెళ్లి ముచ్చటపడి ఆ పేరు వాళ్ళ ఊరికి పెట్టుకున్నారుట. ఇంతెందుకు మనకి తెలిసిన పేర్లు "సేలం" "అశోకన్" "శోకన్" "గాంజెస్ సిటీ" లాంటివి ఎన్నో వున్నాయి.

ఇంకొక స్నేహితుడు మోహన రెడ్డి దగ్గరలో "లాంగ్ ఐలెండ్" లో ఉంటారు. మేము మెన్హాటన్ లో కలుసుకుందామని నిర్ణయించు కున్నాము. మేము జెర్సీ సిటీ నుంచి వచ్చే PATH ట్రైన్ స్టేషన్, ఆయన వచ్చే PEN  స్టేషన్ దగ్గరలో ఉంటాయి కనుక సులువుగా కలుసుకో గలిగాము. SUBWAY లో VEGGI MAAX తింటూ ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బయటికి వచ్చాము. అది BROADWAY  స్ట్రీట్.

BROADWAY  చాలా పెద్ద వీధి. "Bloomberg" అనే న్యూయార్క్ మేయర్ ఈ వీధిని రెండు భాగాలు చేసి చిన్న భాగంలో వాహనాలు, సైకిళ్ళూ పోవటానికి ఉంచి, పెద్ద భాగంలో ప్రజలు కూర్చోటానికి వీలుగా కుర్చీలు టేబుల్స్ వేసి అలంకరించారు. జనం మధ్యాన్నం లంచ్ టైం లో బాగా ఉంటారు. నడుస్తూ పెద్దగా మాట్లాడుతూ దగ్గరలో నిద్రబోతున్న అమ్మాయిని లేపేసాము. కూర్చోటానికి మాకు మంచి టేబుల్ దొరికిందనుకోండి. BROADWAY, theatres కి ప్రసిద్ది. చిన్నా చితకా నాటకాల నుండి ప్రపంచములో ప్రశిద్దమయిన నాటకాలు ఈ వీధిలో పుట్టినవే. సంవత్సరం పొడుగునా ఇక్కడ నాటకాలు వేస్తూ ఉంటారు. క్రిందటి తడవ వచ్చి నప్పుడు "మామా మియా" అనే నాటకాన్ని చూశాము. ఇక్కడ అది ఎన్నో సంవత్సరాల బట్టీ ఆడుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత TIME SQUARE ఇక్కడే దగ్గరలో ఉంది. EMPIRE STATE బిల్డింగ్ కూడా దగ్గరలోనే. ఒకప్పుడు ఈ వీధి నేత మగ్గాలకి ప్రశిద్దిట. MADE IN AMERICA వస్త్రాలన్నీ ఇక్కడ నుండే వచ్చేవి.

చక్కటి వసంతకాల వాతావరణం. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలో నాకు ఎదురుకుండా DUNKIN DONUTS బోర్డ్ కనపడింది. ఆటే చూస్తున్నాను. మా ఆవిడకి అర్ధమయ్యింది "కావాలా" అని అడిగింది. నాకు వాళ్ళు చేసే FRENCH CURLERS అంటే భలే ఇష్టం. వీళ్ళు ఒకప్పుడు world's best coffee బోర్డు పెట్టుకునే వాళ్ళని కూడా అన్నాను. మా స్నేహితుడూ మా ఆవిడా వెళ్ళి DONUT , COFFEE పట్టుకు వచ్చారు. ఇదివరకంటి రుచిలేదు గానీ బాగానే ఉన్నాయి. ఏమిటో అదో త్రుప్తి. మా ఆవిడకు నేను చేస్తున్న పనులు ఏమీ నచ్చలేదు. న్యూయార్క్ వెళ్ళి మెన్హాటన్ లో SUBWAY SANDWICH , DONUT , COFFEE తిన్నారనే భావన రావటం ఆవిడకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఏమిటో ఎవరి త్రుప్తి వారికి ఆనందంగా ఉంటుంది. Honalulu (Hawaii ) లో హోటల్లో అన్నం వండించుకుని గోంగూర ముద్ద sour cream (మీగడ) తో తిన్న వాళ్ళు, పల్లెటూరిలో పుట్టి పెరిగి పొద్దున్నే చద్ది అన్నము తిన్న వాళ్ళ దగ్గరనుండి ఇంకేమి కోరుకుంటారు అనుకుని ఆవిడ త్రుప్తి పడుంటుంది.

ఇంక rush hour దగ్గర పడుతోంది అని ట్రైన్ స్టేషన్ కి బయల్దేరాము. వీధిలో చాలా గందరగోళం గా ఉంది. పాడుతున్నారు ఆడుతున్నారు తింటున్నారు తిరుగుతున్నారు. అసలు  న్యూయార్క్ ఒక టూరిస్ట్ ప్లేస్. రోజుకి లక్షలమంది వచ్చి పోతూ ఉంటారు. వీధిలో ఒకచోట టూరిస్ట్ phamplets పెట్టారు. గబగబా వెళ్లి ఒక పుస్తకం తెచ్చు కున్నాను. అది నెల నెలకి వచ్చే టూరిస్ట్ పత్రిక. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఉపోద్ఘాతం కూడా వ్రాశారు. అమెరికాలో ఆనవాయితీ ఒకటుంది. మనకి వాళ్ళు చెయ్యాల్సిన పని చేసిన తరువాత మనం సంతోషపడిపోయి వారి చేతిలో డబ్బులు పెట్టటం. నిజంగా సంతోషపడినా పడకపోయినా డబ్బులు చేతిలో పెట్టాలి. వీటిని tips అంటారు. కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు కొందరు చాలా తక్కువ ఇస్తారు. అందుకని ముడుపులు (tips ) ఇవ్వటం ఈ ఊళ్ళో ఆనుమాయితీ అనిన్నూ, తరువాత మీరు ఏపనికి ఎంత tip ఇవ్వాలో అనుమానాలు లేకుండా ఈ పుస్తకంలో వేశారు. అంతేకాదు tips డబ్బు రూపంగా ఇవ్వాలి గానీ credit card తో కాదు అని కూడా విన్నవించారు. ఆ ముడుపులు ముందరే  తెలుసుకోవటం ఎందుకయినా మంచిదని క్రింద పొందు పరుస్తున్నాను.

Waitstaff, 20%.    Bartender, $1 drink.    Coatroom attendent, $1-2 a coat. Valet, $2-5 for each trip.
Washroom attendent, 50 cents to $1.    Hotel doorman, $1 per bag and $1/ per person for hailing a cab.
Hotel housekeeper, $2 - $5 per night.    Hotel concierge, $5+ for getting you tickets or reservations.
Tour Guides, $5 - 10 for giving helpful information and entertainment during tour.
ప్రస్తుతం రేటు $1 = 60 రూపాయలు.

Taken From: NewYorkCity Monthly, July 2014, page #74 Quick Tips for tackling.

Monday, May 5, 2014

100 ఓ బుల్లి కథ 88 --- దేవుడు మన కోర్కెలన్నీ ఎందుకు తీర్చాలి ?

సామాన్యంగా కోర్కెలు అందరికీ ఉంటాయి. సన్యాసులకి కోరికలుండ వంటారు నిజమెంతో అబద్దమేంతో తెలియదు. మానవ మాత్రులకి కోరికలు లేకుండా ఉండటం చాలా కష్టం. ఏ చిన్న కోరికయినా రేపు తీరవచ్చు అనే ఆశ తోటి మనం ఉత్సాహంగా జీవిస్తూ ఉంటాము. ఆ కోరికలు లేకపోతే ఆ ఆశా ఉండదు జీవితంలో ఆ ఉత్సాహమూ ఉండదు. ఆశ ఉత్సాహం లేని జీవితం వృధా.

కోర్కెలు తీర్చుకోవాలంటే దాదాపు ఇంకొకళ్ళ సహాయం తప్పక కావలసి వస్తుంది. ఉదాహరణకి నాకు రోజూ పోద్దునపూట మంచి కాఫీ తాగాలని కోరిక. దానికి మా ఆవిడ సహాయం తప్పకుండా కావాలి. ఏది మంచి కాఫీ అనే దాని నిర్వచనం మా ఇద్దరిదీ ఒకటి కాక పోవటం మూలంగా ఆ కోరిక రోజూ నెరవేరదు. ఇంకొకళ్ళు సహకరించక కోరికలు తీరకపోతే, ఆ కోరికలు చంపు కోవటమో లేక సూపర్ పవర్స్ ని ప్రార్ధించటమో చెయ్యాల్సి వస్తుంది. నేను అప్పుడప్పుడూ సూపర్ పవర్స్ ని ప్రార్ధిస్తాను.

సూపర్ పవర్స్ అంటే ఏమిటి? మనకు తెలిసినంతవరకూ ఏకారణం లేకుండా ఏదీ మన ఎదురుకుండా అమాంతంగా ప్రత్యక్ష మవదు. పనులు వాటంతట అవి జరగవు కాబట్టి, ఈ సృష్టి అనే క్రియకి ఒక కర్త ఉన్నాడని తెలుస్తోంది. ప్రత్యక్షంగా మన ఎదురుకుండా కనపడే సృష్టికి ఒక కర్త ఉన్నారని అనుకుంటే ఈ సృష్టి కంతా కారణం సృష్టికర్త ఒక రున్నారని చెప్పవచ్చు. ఆ సృష్టికర్తనే మనము దేవుడని అంటాము. ఆయనకున్నవే సూపర్ పవర్స్, జగతిని సృష్టించ గలిగే పవర్. మనకులేని ప్రజ్ఞ.

మనని సృష్టించిన వాళ్ళని మనం సుఖంగా ఉండటానికి కోరికలు కోరుకోవటంలో తప్పులేదు. అంతపెద్ద ప్రకృతినే సృష్టించిన వానికి మన చిన్నకోరికలు తీర్చటం పెద్ద కష్టం కాదని మన నమ్మకం. ముఖ్యంగా ఆ కోరికలన్నీదాదాపు మనకో మన కుటుంబానికో మంచి జరగాలని. అలాగే ఒక్కొక్కప్పుడు శత్రువులకి మంచి చెయ్యకూడదని కూడా కోరుకుంటాము. ముఖ్యంగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ పూజలు చేస్తూ ఉంటే మనము అడిగింది తప్పకుండా చేస్తాడని మన నమ్మకం. అందరం ఆయన సృష్టే కాబట్టి అందరికీ కోరికలు ఉంటాయి కాబట్టి కోరిక కలగగానే వెంటనే ప్రార్ధించటం మంచిది. మన లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కోరికలు కోరుకునే వాళ్ళ లైనులో మనం ముందర ఉండటం బాగుంటుంది. ఫస్ట్  కం ఫస్ట్ సర్వుడ్. లేదంటే మీ కోరిక ఎందుకు ముందర తీర్చాలో విశదీకరించాలి .

మనని సృష్టించినంత మాత్రాన సృష్టికర్త (దేవుడు) మన కోర్కెలు తీర్చాలని ఎక్కడుంది? ఎంత ప్రార్ధించినా కీర్తించినా అడిగిన మన కోరికలన్నీ తీర్చబడవు. ఇది మనకి తెలుసు. మన కోరికల్లో ఏవి తీర్చ బడతాయి ఏవి తీర్చ బడవు అనేది మనము చెప్పలేము. అసలు మనము కోరికలు కోరాలా? అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఉదాహరణకి మన పిల్ల లున్నారు. వారి సృష్టికర్తలు మనమేకదా. వారి కోరికలు కొన్ని వారు కోరకుండానే తీరుస్తున్నాము, కొన్నికోరినా తీర్చటల్లేదు.

ఇంకో కోణం లో నుండి చూస్తే, మనని సృష్టించిన సృష్టికర్తకి కూడా కోరికలు ఉండచ్చు కదా, మనము తీర్చ గలుగుతున్నామా? వప్పుకుంటాను దేవుడికి ఏమి కోర్కెలు ఉన్నయ్యో మనకి తెలియదు. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా మనకి తెలియదు. ఒకవేళ  సృష్టి కర్త ఎక్కడ ఉంటాడో తెలిసినా ఆయన కోర్కెలు తీర్చ లేమేమో! ఎందుకంటే మనకు తెలిసిన మన సృష్టి కర్తలు మన తల్లి తండ్రులు కదా. వాళ్ళ కోర్కెలు అన్నీమనం తీర్చగలుగు తున్నామా? అయినప్పుడు దేవుడి కోర్కెలు మనమేమి తీర్చగలం!.

మనకు తెలిసిన మన సృష్టి కర్తల కోర్కెలే మనము తీర్చలేనప్పుడు మనకు తెలియని సృష్టికర్త మన కోర్కెలు ఎందుకు తీర్చాలి?

(ఈ పోస్ట్ కి మూల కారణం ఆలోచింప చేసే ప్రశ్నవేసిన ఈమని శ్రీనివాస్ గారు)

Sunday, March 16, 2014

99 ఓ బుల్లి కథ 87 --- ఆర్కిటిక్ వింటర్ లో ఓ రోజు



ఫోటో చూసి ఇదేదో భూత ప్రేత లోకం లో ఒక దృశ్యం అనుకుంటున్నారా! పోద్దునపూట మా ఇంటి కిటికీ లోంచి బయటకు చూస్తే కనపడిన దృశ్యం అది . ఈ వింటర్లో అనుకోకుండా నిన్న బయట వెచ్చగా చాలా బాగుంది. షాపు లన్నీతిరిగేసి కూరలూ గట్రా తెచ్చుకున్నాము . సాయంత్రానికి వర్షం పడటం మొదలయ్యింది. కానీ తెల్లారి కిటికీలోనుండి చూస్తే పై ఫోటో లా ఉంటుందని ఊహించలేదు.

మేము ఉండేది అమెరికాలో చికాగో దగ్గర. దాదాపు నవంబర్ నుండీ బాగా చలి మొదలవుతుంది. డిసెంబర్ నుండి మార్చ్ దాకా ఆకాశాన్నించి ఎవరో ముగ్గు పోస్తూ ఉన్నట్లు స్నో పడింది ఈ సంవత్సరం. (నీళ్ళు గడ్డకట్టుకుని ఐస్ గ మారటం,  0 డిగ్రీలు సెంటీగ్రేడు లేక 32 డిగ్రీలు ఫారన్  హీట్ దగ్గర అవుతుంది. స్నో పడుతోంది అంటే ఉష్ణోగ్రత అంతకన్నా తక్కువగా ఉందన్న మాట.) ఈ వింటర్ లో దాదాపు వరుసగా డెబ్భై రోజులు అలా ఉంది. దానికి ఆర్కిటిక్ నుండి వచ్చే ఈదురు గాలి తగిల్తే ఉష్ణోగ్రత -40F లాగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం పడిన స్నో 80 అంగుళాలు (అంటే దాదాపు 7 అడుగులు లేక 2 మీటర్లు). ఇది ఒక రికార్డ్. రోడ్లమీద స్నో తీసిన తరువాత ఉన్న అవశేషం కరగటానికి వేసే ఉప్పు చివరి రోజుల్లో దాదాపు అయిపోయింది.

ఇక్కడ  చికాగోలో వాతావరణంలో చలి సెప్టెంబర్ తో ప్రారంభ మయి, జనవరి ఫిబ్రవరి లో ఉదృతంగామారి, మార్చికి చాలావరకు తగ్గి, ఏప్రిల్ లో చెట్లు చిగిర్చే విధంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా గడబిడ అయిపొయింది. "ఆర్కిటిక్ వర్టేక్స్" ట అనుకోని చలిగాలులతో రోజూ గొడవే. బయటికి వెళ్ళా లంటే శరీరం మీద కనీసం మూడు వరసల బట్టలు ఉండాలి. బయట అరవై రోజులు వరుసగా బిలో ఫ్రీజింగ్ (నీళ్ళు గడ్డ కట్టటానికన్న తక్కువ ఉష్ణోగ్రత). పైనించి ఎవరో వీభూతి చల్లుతున్నట్లు తెల్లగా స్నో పడింది. మునిసిపాల్టీ వాళ్ళు ట్రక్కు లను పంపించి స్నోని పక్కకి జరిపి రోడ్లన్నిటిమీదా కార్లు పోయేటట్లు చేస్త్హారు. ఈ సంవత్సరం రెండురోజుల కొకసారి స్నో పడుతూనే ఉంది. ఆ  స్నో ఎక్కడికి పోలేక రోడ్డుపక్క కొండల్లా తయారు అవుతాయి. వాతావరణం మరీ ఉదృతంగా ఉంటే జనాన్ని ఇంట్లో కూర్చో మంటారు. ఒకటి రెండు సార్లు మా ఊరి మేయర్ ఇంట్లో కూర్చోమని ఫోన్ చేశారు. ఇంతజరిగినా మా ఆవిడకు ఆఫీస్ వాళ్ళు ఒకరోజు మాత్రమే సెలవిచ్చి రావద్దన్నారు. ఆవిడ లైబ్రరీ లో పనిచేస్తుంది. లైబ్రరీ కొన్ని సమయాలలో ఉండటానికి చోటు లేని వారికి షెల్టర్ గ పని చేస్తుంది అది కారణ మవ్వచ్చు.

క్రింద మా వీధి ఫోటో చూడండి. అది మిట్ట మధ్యాహ్నం తీసినది. ఎండ ఉదృతంగా ఉంది కానీ చలి అంతకన్నా ఉదృతం. ఎండకీ చలికీ సంబంధం లేదు. ఇళ్ళ మీదా రోడ్లమీదా తెల్లగా కనపడేదల్లా పేరుకుపోయిన మంచు, మంచు దిబ్బలు. కొన్ని చోట్ల స్నో ని లారీలలో వేసి బయటికి పంపిన రోజులు కూడా ఉన్నాయి. ఇదే అనుకుంటే ఎయిర్ పోర్ట్ ల సంగతి ఇంకా గొడవగా ఉంటుంది. చికాగో ఎయిర్ పోర్ట్ లో కొన్ని సెకండ్ లకు ఒక ప్లేన్ లాండ్ అవటమో పైకి ఎగరటమో జరుగుతుంది. రన్వే లన్నిటి మీదా స్నోతీసేయ్యాలి. తీసిన స్నో ప్లేనులకు తగలకుండా దూరంగా ఉంచాలి. వచ్చిన ప్లేన్ ల మీద స్నోపడితే వెళ్ళే ముందర తీసెయ్యాలి (దీనిని డి ఐసింగ్ అంటారు). లేకపోతే రెక్కల మీద బరువుకి అవి ఎగర లేవు. అందుకనే ఈ సమయంలో చాలా ఫ్లైట్ లు కాన్సిల్ చేస్తారు. ఫ్లైట్ లు కాన్సిల్ అయి ఎక్కడికీ వెళ్ళలేక ఎయిర్ పోర్ట్ లో జాగారం చేసినవాళ్ళు ఎందరో.



వింటర్ లో స్నో కోసం పరితపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. "సోచి" లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ మీరు చూసే ఉంటారు. పిల్లలు స్నోమాన్ లు చేసి ఆడుకుంటారు. ఐస్ తో శిల్పాలు చెక్కుతారు.  ఇక్కడ మా గుళ్ళో శివరాత్రికి ఐస్ తో శివలింగం చెక్కుతారు. మా దగ్గరలో ఉన్న గ్రేట్ లేక్స్ లో ఒకటయిన లేక్ మిచిగన్ దాదాపు పూర్తిగా గడ్డకట్టుకు పోయింది. శని ఆది వారాల్లో కొందరు ఆ ఐస్ మీద గుడారాలు వేసుకుని గుంటలు తవ్వుకుని ఐస్ అడుగున ఉన్న నీళ్ళలో గేలం వేసి చేపలని పట్టుకుంటారు. దీనిని ఐస్ ఫిషింగ్ అంటారు. ఇంతెందుకు క్రిందటి వారం నీళ్ళు వచ్చేదాకా లేక్ లో గుంట తవ్వి చికాగో మేయర్ తో సహా చాలామంది స్కిన్ డిప్ చేశారు. అంటే బట్టలు లేకుండా నీళ్ళల్లో దూకటం అన్న మాట.

ఇంకా ఈ సంవత్సరం వింటర్ గురించి చెప్పాలంటే నయాగరా ఫాల్స్ ఈ వింటర్ లో రెండు సార్లు గడ్డకట్టుకు పోయింది. నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది. ఇంతెందుకు మా ఇంట్లో ఎప్పుడూ లేనిది నీళ్ళ పైపు పగిలి నరకం చూపెట్టింది. సామాన్యంగా ప్రతీ ఇంట్లోనూ ఒక చల్ల నీళ్ళు తీసుకు వచ్చే పైపూ ఒక వేడి నీళ్ళు తీసుకు వచ్చే పైపూ ఉంటాయి. జనవరిలో ఒక రోజు పొద్దున "వేడి నీళ్ళు రావటల్లేదు" అనే అరుపుతో నిద్దర లేచాను. అది మా ఆవిడ ఆర్తనాదం. చన్నీళ్ళ తో స్నానం ఐస్ నీళ్ళు పోసుకున్నట్లే. ఆవిడ చల్ల నీళ్ళతో స్నానం చెయ్యలేదు, తిట్టుకుంటూ వేడినీళ్ళు కాచుకుని స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళింది. నాకు ఏమయిందో తెలుసు నోరు ఎత్తలేదు. ఎత్తితే ఏమవుతుందో కూడా తెలుసు. ఇంట్లో ఉన్న గిన్నెలన్నిట్లో నీళ్ళు పట్టుకుని కూర్చున్నాను. మధ్యాన్నం కరెంట్ పోయింది. బ్యాటరీ లైట్లు వెతికి తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. థాంక్ గాడ్ మళ్ళా రెండు గంటల్లో తిరిగి వచ్చేసింది. ఇంట్లో చలి విపరీతం గా ఉంది. మా హీటర్ టెంపరేచర్ పెంచాను. కొంత సేపు తర్వాత మా ఇంటి క్రింద భాగం నుండి పెద్ద శబ్దం వస్తోంది. చూస్తే పైప్ పగిలింది. జరిగిన దేమిటంటే, చలికి పైప్లో నీళ్ళు గడ్డకట్టుకుపోయి పైపు పగిలి, నేను ఇంట్లో పెట్టిన వేడికి పైప్లో ఐస్ కరిగి, పగిలిన చోటి నుండి నీళ్ళు పెద్ద శబ్దం చేస్తూ రావటం మొదలెట్టాయి. వెంటనే ఇంట్లోకి నీళ్ళు రావటం ఆపేశాను. ప్లంబర్ ని పిలిచాం. మర్నాడు సాయంత్రానికి గానీ రానన్నాడు. ఈ పరిస్థుతులలో ఇంట్లో జరిగిన యుద్ధం గురించి నేను వ్రాయలేను. రామ రావణ యుద్ధం అని చెపుదా మనుకున్నా గానీ వర్ణన సరిఅయినదని అనిపించలేదు. మొగవాళ్ళు ఆడవాళ్ళు మధ్య యుద్ధ కాండ మన పురాణాలలో ఎక్కడయినా ఉంటే దాని వర్ణన అది అన్న మాట. ఒక రోజు నీళ్ళు లేక పోతే ఎంత గందరగోళం జరిగిందో మీ కర్ధం కాదు!. అదృష్ట వశాత్తూ చిన్నప్పుడు ఇండియా లో పెరిగాము కాబట్టి నిత్యావసారాలకి ఏమి చెయ్యాలో తెలియటం మూలంగా పెద్ద ఇబ్బంది పడలేదు. కాకపోతే కుళాయి తిప్పితే వచ్చే వేడి నీళ్ళ సుఖం ఒక రోజు లేదు. అంతకన్నా ఇంకేమీ లేదు.

మర్నాడు ప్లంబర్ వచ్చి బాగు చేసి, డబ్బులు తీసుకుని కొంచెం చివాట్లు పెట్టి పోయాడు. వాటి సారాంశం, ఉష్ణోగ్రత బాగా పడిపోతున్నప్పుడు కుళాయి లోనుండి నీళ్ళ ధార కొద్దిగా వదిలిపెడితే పైపులో నీళ్ళు ఫ్రీజ్ అవ్వవు. ఈ వారంలో వంద ఇళ్ళల్లో పైప్ లు బాగు చేశాడట!. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని సంతృప్తి పడ్డాము.

ఇంకొక వారం రోజుల్లో వసంతకాలం వస్తుంది. చెట్లు చిగిర్చి పూవులు పూయును. మళ్ళా వింటర్ దాకా,  ఒక ఆరు నెలలు జరిగినదంతా మరిచి పోవచ్చు.

1. క్రిందటి సంవత్సరం వ్రాసిన అమెరికాలో మా వీధి పోస్ట్
http://mytelugurachana.blogspot.com/2013/02/90-78.html