Monday, August 30, 2021

173 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 4 (Ishopanishad)

మనకున్న వేదాలు నాలుగు. ప్రతీ వేదం శాంతి మంత్రం తో మొదలవుతుంది. శాంతి మంత్రం ఆ వేదంలో చర్చించబోయే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. దానిలో ఉన్న ఉపనిషత్ చర్చాంశాన్ని  వివరంగా చెబుతుంది. వేదముల లోని విషయాలూ చర్చలూ సంస్కృత పదాలతో అల్లిన శ్లోకాలతో మృదువుగా గుంభనగా గోప్యంగా ఉంటాయి. వాటి ముడులు విప్పి సౌరభాలు ఆస్వాదించాలంటే నిష్ణాతులైన గురువులు అవసరం. ఈశావాస్య ఉపనిషత్ లో ఇటువంటి శ్లోకాలు 18 ఉన్నాయి.

ఈ సృష్టికి కారణం పరమాత్మ అనీ ఆయన అంశం ఆయన సృష్టించిన ఈ జగత్ లో జీవులన్నిటిలోనూ  జీవాత్మగా ఉంటుందనీ, చూడటానికి, తాకటానికి అది అతీతమని చెప్పే శాంతి మంత్రం తో శుక్ల యజుర్వేదం మొదలవుతుంది.

నిర్గుణ నిర్వికార అనంత మూర్తి జీవాత్మను సంభోదించేది "ఓం" కారం తోనే. ధ్యానించేది "ఓం" కారం తోనే. అలా ధ్యానం చేస్తూ మనలో ఉన్న ఆత్మ  తో మమేకమై ఆ ఆనందంతో మైమరచిపోతే జీవితం ఆధ్యాత్మిక తో ఆనందంగా గడపవచ్చును. ఇదే మొదటి శ్లోక సారాంశం.

ఏ కారణము చేత నయినా తనలోని జీవాత్మని భౌతిక శరీరాన్ని విడివిడిగా చూడలేక పోతే, వంద ఏళ్ళు బ్రతికి తోటి జీవులకి తోడుగా ఉంటూ, తనలోని ఆత్మని అందరిలో చూస్తూ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ జీవించాలని నిర్ణయించుకోవాలి. ఇదే రెండవ శ్లోక సారాంశం.

భౌతికశరీరము  లోని పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ, కామినీ కాంచన కీర్తికోసం పరితపిస్తూ  జీవితం గడిపితే చనిపోయిన తరువాత కారుచీకటి లోకం "అసుర" లో తనలాంటి తోటి జీవులతో ఇంకొక దేహం కోసం వేచి ఉండి మరల మరల భువి మీద జన్మించాల్సి ఉంటుంది. ఇదే మూడవ శ్లోక సారాంశం.

శ్లోకాలు 4 నుంచీ 14 దాకా ఆత్మ (ఈశ ) గురించి వర్ణించటం జరుగుతుంది. మనము సామాన్యంగా "నేను" అనేది మన శరీరం, దానిలోఉండే పంచేంద్రియాలూ, అవిచేసే విన్యాసాలుగా గుర్తిస్తాము. అవే మనని కామినీ కాంచన కీర్తుల కోసం పరితమించమని చెబుతాయి. ఈ విన్యాసాలకు (మన కోరికలకు) అంతు ఉండదు ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంతులేని వాటికోసం పరితపిస్తూ ఒకటి తరువాత ఒకటి కోరికలు తీర్చుకుంటూ (తీర్చుకోలేక విషాదంతో కుమిలిపోతూ) జీవితం గడుపుతూ ఉంటాము. ఇవే సుఖ దుఃఖాలకి కారణాలు. 

మనం గనక ఈ భౌతిక శరీరాన్నీ (దానిలోని పంచేంద్రియాల్తో సహా ) నడిపించే ఆత్మ (conscious ) మీద కేంద్రీకరిస్తే, మనలో దాని ఉనికిని గ్రహిస్తే, దానితో మమేకమయితే, ఈ భౌతిక శరీరం  గుప్పించే విన్యాసాలకు అతీతం అవుతాము. మనము చెయ్యాల్సిన పనిని చేస్తాము కానీ ఆకర్షణలకు లొంగము. సినిమా హాల్లో తెల్లటి తెర ఉంటుంది. ఆ తెరమీద రంగురంగుల సినిమాలు ఎన్నో వేస్తుంటారు. దానికి ఏ రంగూ అంటదు. అటువంటిదే మన ఆత్మ. దానితో మమేక మయితే భౌతిక శరీర విన్యాసాలకు అవి కురిపించే సుఖ దుఃఖాలకి మనం అతీతల మవుతాము. ఇక్కడ గమనించ వలసినది మనం ముందర మన కర్తవ్యకర్మ చేసిన తరువాతే ఆత్మ జ్ఞానము మీద కేంద్రీకరించాలి.

శ్లోకాలు 15 నుండీ 18 దాకా సూర్య ప్రార్ధన శ్లోకాలు. శుక్ల యజుర్వేదము రచయిత యాజ్ఞవల్క్య  ముని సూర్య ప్రార్ధన ఫలితమే ఈశా వ్యాస ఉపనిషత్ అని కూడా అంటారు. 

శ్లోకం 15:

హిరణ్మయేన పాత్రేణ            బంగారపు మూతతో 

సత్య శ్యాపి హితం ముఖం   "సత్యం" ముఖం కప్పి ఉన్నది 

తత్వం పూషణ్ అపా వృణో     ఓ సూర్య దేవా!  ఆ మూత తీసివేయి 

సత్య ధర్మాయ దృష్టయే   సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది 

ఓ సూర్య దేవా (పూషణ్ ) బంగారపు మూతతో "సత్యం" కప్పి ఉన్నది. ఆ బంగారపు మూత తీసివేయవా. సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది. ( శ్లోకం 15)

(పూషణ్  అంటే పోషక కర్త. సూర్య దేవుడు సముద్రమునుండి నీరు తీసి మేఘముల ద్వారా వర్షము కురిపించి ఆహారము కొరకు పంటలుపండిస్తూ , సముద్రమును నింపుతూ జీవత్వము కొనసాగే విధంగా చేఇస్తున్నాడు. అంతే కాదు మన శరీరతత్వం కూడా సూర్యోదయము , సూర్యాస్తమయం  మీద ఆధారపడి ఉంటుంది.) 

నీవిచ్చిన ప్రాణం తోటి ఈ శరీరం ద్వారా ఇప్పటిదాకా "సత్యం" గా జీవితం గడిపాను. నా చరమ దశ ఆసన్నమైంది. ఈ నా శరీరాన్ని భస్మం చేసి  నువ్విచ్చిన నాలోని ప్రాణాన్నితీసుకుని నన్ను నీతో కలుపుకో .  శ్లోకం 17.

ఈ క్రింది చివరి ప్రార్ధన శ్లోకం మన అందరికోసం వ్రాసింది :

శ్లోకం 18:

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్  మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో  మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ    నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా  నీకు నన్ను నేను అర్పించుకోవటమే. శ్లోకం 18.

Summary written in English for people who do not know how to read Telugu.

The devotee is praying sun God, who is responsible for our existence and survival on this earth, to bless him to see his true figure so that he can show his gratitude. The Sun is actually instrumental for our existence on this earth by absorbing water from the Ocean , creating clouds and rain, which in turn fill the Ocean and raises crops and provide food for our survival. The Sun rise and Sun set are somewhat closely mingled with our biological system and daily activities.

నా మాట:

దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి

1.Swami Aparajitananda

2. The Upanishads





Monday, August 2, 2021

172 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 3 (Ishopanishad)

ఈ ఉపనిషత్ లోని శాంతి మంత్రం తో,  సృష్టి కర్త తాను సృష్టించిన వాటి అన్నిటిలోనూ తన అంశ  ఉంచుతారని తెలుసుకున్నాము. దానినే ఆత్మ అందాము. దానినే Consciousness  అని కూడా అంటారు.

ఈ ఉపనిషత్ లోని మొదటి మంత్రంతో పరుల సంపాదనమీద కన్నువేయకుండా, పాత సంగతులు మర్చిపోయి, మనలోని ఆత్మను ధ్యాన మార్గము (meditation ) ద్వారా గుర్తించి ఆరాధిస్తూ, సుఖంగా జీవితం గడపవచ్చని తెలుసుకున్నాము. దీనికి గురువుగారి సహాయము చాలా అవసరము అని కూడా తెలుసుకున్నాము. దీనినే జ్ఞాన యోగం అంటారు.

ఆధ్యాత్మిక జీవితం ఇష్టమున్నా, జ్ఞాన యోగం పాటించ లేని వారు  రెండవ మంత్రం ( కర్మ యోగము) ద్వారా ఫలితము పొందవచ్చునని ఉపనిషత్ కర్త విశదీకరించారు.

రెండవ శ్లోకం :

కురువం నేవేహ కర్మాణి  నువ్వు వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి.

జిజీ విషేచ్చతకం సమాః  : ఇతరులకు సహాయపు పనులు చేస్తూ.

ఏవం త్వయ్  నాణ్యథె థొస్తి  : నీలాంటి వాళ్లకి ఇదొక్కటే మార్గం.

నకర్మ లిప్యతే  నరే  : ఆ (సహాయము చేసిన) పనులు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టవు.

నువ్వు మొదట వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఇతరులకు సహాయపడే పనులు చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా,  దేవునికి అర్పణబుద్ది తో జీవిస్తే నువ్వు చేసిన ఆపనులు నిన్నెప్పుడూ బాధపెట్టవు. నీలాంటి వాళ్లకి  (ధ్యాన మార్గము కుదరని వారికి) ఇదొక్కటే మార్గం. 

 "కురువన్ " అనే సంస్కృత పదానికి, ఇతరులు, దైవము అనే రెండు అర్ధాలు ఉన్నాయి.  మనందరిలో దైవస్వరూపం ఆత్మ ఉన్నది కనక,  ఇతరుల సేవ (మానవ సేవ)  దైవార్పణ బుద్దితో చేసి ప్రసాద బుద్దితో ఫలితములు స్వీకరిస్తే అదే మాధవసేవ గా గుర్తించ వచ్చు. 

ఇక్కడ ఎటువంటి పనులు చేయాలి అనే సమస్య వస్తే  భగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:

1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.

2. దేవ  యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రతగా చూచుట.

3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .

4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.

5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.


భౌతిక ఆకర్హణలకు లొంగిపోయి ఆధ్యాత్మికతకు ఆమడ దూరంలో వుండే వాళ్ళ గురించి మూడవ శ్లోకంలో చెప్పారు.

మూడవ శ్లోకం :

అసూర్యా నామతేలోకాః  : "అసూర్య" అనే పేరుతో ఉన్నలోకం (బాహ్య భోగాలకు మాత్రమే పరిమిత మైన  వాళ్ళ లోకం). 

అంధేన తమసావృతాః  : అది కారు చీకటితో నిండిన లోకం.

తాగం స్తే ప్రేత్యాభి గత్యంచి : వీరందరూ కొన్ని లోకాలకు వెళ్తారు.

ఏకే  చాత్మ మనోజనాః : ఆత్మను చంపుకునే వారు.  (తనలో ఆత్మ ఉందని చూడలేరు)

భోగ జీవితానికి అలవాటు పడి జీవించిన వారు , చనిపోయిన తరువాత చీకటి లోకం "అసూర్య" లో వారి వారి భోగ మిత్రులతో (పునర్జన్మకు ఎదురుచూస్తూ) గడుపుతారు.


Summary written in English for people who do not know how to read Telugu.

For those people who have spiritual interest but difficult for them to follow the strict principles of meditation, saints gave the 2nd poem as a solution.

The poem says: you must aspire to live for one hundred years working as best as you can for your fellow men and environment as prescribed in Karma Yoga. Basic principles of Karma yoga are: 1. Read the scriptures and attain knowledge. 2. Look after the environment. 3. Take care of your parents. 4. Take care of your fellow human beings. 5. Take care of the animals, they are also part of creation.

For those people who cannot follow either 1 or 2 mantras, the saints described them as "Bhogis", people much more interested in physical enjoyment other than spiritual enjoyment. In the 3rd poem, their fate  after death is described. They will spend their time (waiting for next birth) with same group of people as they are in a darkened location called "Asura" and will be born again and again until they reform themselves to spiritual life.

నా మాట:

ప్రకృతి, మనకి ఒక శరీరం, అది పని చేయటానికి కావలసిన ఇంద్రియాలూ, అవి సరీగ్గా పని చేస్తున్నాయ్యో లేదో తెలుసుకోవటానికి జ్ఞానేంద్రియాలూ ప్రసాదించింది. మన శరీరంలో మనకి కనపడనిది, మన ఇంద్రియాలకు జీవించే శక్తి నిచ్చేది ఒకటుంది అది మన "ఆత్మ" . 

మనం అవి ఎలా పనిచేస్తాయో తెలియకుండా చాలా వస్తువులు రోజూ వాడుతాము అల్లాగే మన శరీరంతో పనులు చెయ్యటానికి, మనలో  "ఆత్మ " ఉన్నదని  గ్రహించవలసిన అవసరం లేదు. 

మనలో పరమాత్మ అంశ "ఆత్మ" ఉన్నదని గ్రహిస్తే, ఈ సృష్టిలో మన చుట్టూతా ఉన్న వాటన్నిట్లో అదే పరమాత్మ అంశ ఉన్నట్లు గుర్తించి స్నేహ భావం పెంచుకుంటాము. దానితో మన జీవన దృక్పధము మారిపోయి సుఖ సంతోషాలతో జీవితం గడుపుతాము. దీనినే జ్ఞాన మార్గం, జ్ఞాన యోగము అంటారు. ఇదే మొదటి శ్లోకంలోని సారాంశం.

జ్ఞాన యోగం పాటించలేని వారికి మన ఋషులు ఇంకొకమార్గము రెండొవ శ్లోకంలో సూచించారు. కాకపోతే అటువంటి వారు ముందర వంద ఏళ్ళు బ్రతకాలని కోరుకోవాలని గట్టిగా చెప్పారు. ఆ సమయంలో చెయ్యవలసిన పనులుకూడా (పంచ మహా యజ్ఞములు)  సూచించారు. దీనినే కర్మ యోగం అంటారు.

పైరెండు శ్లోకములు పాటించ లేక భోగ విలాసములతో జీవితం గడుపుదామని అనుకునే వారికి ఏమవుతుందో మూడవ శ్లోకంలో సూచించారు. వారు సరయిన మార్గములోకి వచ్చేదాకా మరల మరల భువి మీద జన్మిస్తారని చెప్పారు. ఈ పునర్జన్మ కోసం వేచి ఉండే సమయం తమలాంటి భోగప్రియుల తో చీకటిలోకం "అసుర" లో గడపాల్సొస్తుందని చెప్పారు.

పీజ్జాలూ, బర్గర్లూ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులూ లేకుండా వేల ఏళ్ళ క్రిందట వంద ఏళ్ళు బ్రతికే వారంటే ఆశ్చర్యంగా ఉంది.

దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి.

1.Swami Aparajitananda

2. The Upanishads