Saturday, March 27, 2021

163 ఓ బుల్లి కథ -- తెనాలి తో సంబంధం తెగి పోయింది

 పరమేశం, భార్యా మా పక్కింట్లో ఉంటారు. రిటైర్ అయినవాళ్ళం కాబట్టి సామాన్యంగా రోజూ మా భార్యలు ఉద్యోగాలకి వెళ్లిన తరువాత కలుసుకుంటూ ఉంటాము. భర్త రిటైర్ అయిన తర్వాత భార్యలు వర్క్ కి వెళ్ళి ఏవో నాలుగు రాళ్ళు తెస్తూ ఉంటారు. అదే మాకు తీరిక సమయం. ఎదో పిచ్చాపాటీ, భార్యల గురించీ మాట్లాడుకుంటూ ఉంటాము. 

ఇవ్వాళ ఎందుకో పరమేశం నిర్లిప్తంగా ఉన్నాడు. "టేస్టర్స్ ఛాయిస్" కాఫీ చేసి ఇచ్చాను. ఎందుకు అల్లా ఉన్నాడో  నేను అడగ తలుచుకోలేదు. చెప్పాలనుకుంటే తనే చెపుతాడు లేకపోతే లేదు. కొన్ని రోజులు అలా నిశబ్దంగా గడిపిన రోజులున్నాయి. కాఫీ తాగుతూ నెమ్మదిగా చెప్పటం మొదలెట్టాడు. మనం అడగాల్సిన పని లేదు. లోపలి మనస్తాపం ఎప్పుడో అప్పుడు బయటికి వస్తుంది. ఇటువంటి సమయంలో మనం ప్రశ్నలు వేయాల్సిన అవుసరం లేదు. అన్నీ నెమ్మదిగా బయటికి వస్తాయి. మనస్తాపం తగ్గుతుంది.

"మాది తెనాలి దగ్గర ఒకపల్లెటూరు, కఠెవరం. దాదాపు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ  ఏదోరూపేణా  రోజు కొకసారి తెనాలి వెళ్ళి వస్తూ ఉంటారు. పిల్లలు అయిదవ క్లాసు దాకా అక్కడే చదువు కోవచ్చు  గానీ ఆ తరువాత చదువులకి తెనాలి వెళ్లాల్సిందే. పెద్దలయితే ఇంటి అవసరాలకి, వెచ్చాలకి, సినీమాలకి తప్పకుండా  తెనాలి వెళ్ళాలి. మా ఊళ్ళో సుబ్బయ్య కోమటి కొట్టు ఉంది. పిల్లలకి అదంటే చాలా ఇష్టం. "కానీ" పెట్టి ఏదోఒకటి కొనుక్కోవచ్చు. పిల్లలం సాయంత్రం ఆటలు (బిళ్ళంగోడు గోళీలు బచ్చాలు) ఆడుకుంటున్నప్పుడు శనగలూ శనక్కాయలూ బఠాణీలు చాకోలెట్లూ, అక్కడే  కొనుక్కునే వాళ్ళం. నాకయితే మాత్రం సుబ్బయ్యకొట్లో పప్పు చెక్కలు చాలా ఇష్టం.  అప్పుడప్పుడూ పెద్దవాళ్ళు పేకాడుతుంటే పిల్లలం మేము వెళ్ళి సుబ్బయ్య కొట్లో బీడీలు, గోల్డ్ ఫ్లెక్ సిగరెట్లు కొనుక్కొచ్చే వాళ్ళం. సుబ్బయ్య,  కొట్లో అమ్మకానికి వస్తువులన్నీ తెనాలి వెళ్ళి కొనుక్కొస్తాడుట. నేను మా నాన్నతో  తెనాలి వెళ్ళి క్రాఫ్ చేయించుకునే వాడిని. అక్కడున్న వాళ్లందరికీ రోజూ తెనాలిలో ఎదో పనివుంటుంది. చాలా మంది సాయంత్రం షికారుకి తెనాలి వెళ్ళి కాఫీ తాగొస్తారు. 

దీపావళికి మందు సామానులు కొనుక్కోవాలంటే తెనాలే వెళ్ళేది. నిజంగా చెప్పాలంటే దాదాపు ప్రతీ పండగకి తెనాలి వెళ్ళే వాళ్ళం. శ్రీరామ నవమికి ఊరంతా పందిళ్లు వేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వడపప్పు పానకం పెట్టేవాళ్ళు. సినీమా చూడాలంటే తెనాలి వెళ్లాల్సిందే. నేను "స్వర్గసీమ" సినీమా తెనాలి రత్నా టాకీస్ లో చూశాను. తెనాలి మధ్యలో రెండు కాల్వలు వెళ్తాయి. వాటి మీద రెండుచోట్ల వంతెనలున్నాయి. ఒక వంతెన మీద వెళ్తే కూరగాయల మార్కెట్ వస్తుంది. రెండవ వంతెన మీద వెళ్తే, వంతెన దిగంగానే రోడ్డుకి ఎదురుగుండా ఒక పార్క్ వస్తుంది. ఆ పార్కుకు కుడి వైపు వెళ్తే మా మామయ్యగారి ఇల్లు వస్తుంది. ఎడమవైపు వెళ్తే రాముడన్నయ్య శివుడన్నయ్యా వాళ్ళ ఇల్లు వస్తుంది. ముందర రాముడన్నయ్య గారి ఇంటికి వెళ్లి మామయ్యా గారింటికి చూడటానికి తర్వాత వెళ్ళే వాళ్ళం. మామయ్యగారింటి లోపలికి వెళ్ళా లంటే స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. బయటే ఉండి పిల్లలతో  తొక్కుడు బిళ్ళా, దొంగాట ఆడుకుని కఠెవరం తిరిగి వచ్చేవాళ్ళం. 

తెనాలి వెళ్ళినప్పుడల్లా బస్టాండ్ లో మంత్రజాలం చూస్తున్న గుంపులోనుండి తొంగి చూడటం అలవాటు. మామిడి కాయ టెంక పాతిపెట్టి నాలుగు సార్లు ముసుగు వేసి తీసే సరికి దాని నుండి మామిడి చెట్టు మామిడికాయ మామిడి పండు --- మాంత్రికుడు ఎల్లా  తెప్పిస్తాడో  నా కిప్పటికీ అర్ధం కాదు. అది నిజం కాదనుకోటానికి వీల్లేదు, మామిడి పండుకొసి ముక్కలు కూడా పెడతాడు. 

నా ఐదో క్లాసు తరువాత మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఊళ్ళు మారాము. అందుకని నా చదువు చాలా ఊళ్ళల్లో సాగింది. కానీ సంవత్సరంలో చాలా సార్లు పెళ్ళిళ్ళకీ పబ్బాలకీ తెనాలి, కఠెవరం వచ్చేవాళ్ళం. నేను చివరికి యూనివర్సిటీ లో చదువు కుని అమెరికా రావటం జరిగింది. మాతృ దేశం వచ్చినప్పుడల్లా తెనాలి కఠెవరం తప్పకుండా వెళ్ళే వాళ్ళం.

దేశం వదిలి దాదాపు ఏభైయేళ్ళయ్యింది. ఇప్పుడు కఠెవరం లో మా వాళ్ళెవరూ లేరు. కాకపోతే పెద్దలు కట్టించిన గుడి ఉంది. ఈ మధ్య  మా వదినగారి (శివుడన్నయ్య భార్య) ఆధ్వర్యంతో మనవలూ మనవరాండ్రు అందరూ కలిసి గుడిని బాగు చేయించి మళ్ళా కుంభాభిషేకం చేశారు. తెనాలిలో మామయ్యగారు పోయి చాలా యేళ్ళ య్యింది. రాముడన్నయ్య శివుడన్నయ్య కాలం చేశారు. పిల్లలందరూ దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. మొన్నటిదాకా మా వదినగారు తెనాలి లో ఉండేది. ఆవిడా ఈ మధ్య పోయింది. దాంతో తెనాలితో ఉన్న చివరి బంధం విడి పోయింది".  

అంటూ ఆగి పోయాడు పరమేశం.

నాకు ఏమి మాట్లాడాలో తెలియటల్లేదు. "మనకి ఇష్టమయిన వాళ్ళతో ఎప్పుడూ  గడపాలని అనిపిస్తుంది. మనం మాట్లాడిన పరుషపు మాటలు వెనక్కు తీసుకోవాలని పిస్తుంది. కానీ పరమేశం, దేముడి  చదరంగపు ఎత్తుల్లో మనం పావులం. రాజులూ రాణులూ మంత్రులూ బంట్లూ ఏనుగులూ గుర్రాలతో సహా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఆటలోనుండి బయటికి రావాల్సిందే. వాటిని గురించి విచారించి మనసు పాడు చేసు కోవటం అనవసరం" అన్నాను.

Sunday, November 8, 2020

162 ఓ బుల్లి కథ -- నాకు నచ్చిన సినీమా - 2

కరోనా Lockout తోటి ఇంట్లో కూర్చుని యూట్యూబ్ సినిమాలు చూడటం మొదలెట్టాను. చూసిన తర్వాత నాకిష్టమయిన వాటిమీద నా అభి ప్రాయాలు వ్రాయాలని పించింది. నేను వ్రాసే విధానం కొత్తగా ఉండచ్చు. గాభరా పడవోకండి.


సినిమా పేరు:  Movie Name:

శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ 
Sri kanakamahalakshmi recording dance troupe

నటీనటులు:

గోపాలం (నరేష్), సీత (మాధురి), దొరబాబు (భరణి).
ఇంకా చాలామంది ఉన్నారు గానీ, కధంతా ఈ ముగ్గురి మీదా  నడుస్తుంది.

సంక్షిప్తంగా  కధ :

ఒక అమాయక పిల్లోడు (నరేష్) తన  మేనమామ టిఫిన్ సెంటర్లో సహాయం చేస్తూ తనకి ఇష్టమయిన డాన్స్ ట్రూపులో నటిస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు. ఈ డాన్సు ట్రూప్ ఒక డొక్కు బస్సులో ఊరుఊరికీ తిరుగుతూ కార్యక్రమాలు జరుపుతూ ఉంటుంది.

ఆ ఊళ్ళో ఉన్న ఒక కన్నెపిల్ల సీత(మాధురి) అమాయక పిల్లోడు గోపాలం (నరేష్) మీద కన్నేస్తుంది. కానీ తన ఇష్టం తెలపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమాయక పిల్లోడు తెలుసుకోటల్లేదు. ప్రియుణ్ణి వలలో వేసుకోటానికి తను గోపాలం కనుసన్నలలో దగ్గరగా ఉంటేనే   సాధ్యమవుతుందని, గోపాలం ఎక్కువగా గడిపే నాటక కంపెనీ లో హీరోయిన్ గా  జేరుతుంది.

సిగ్గు బెరుకులతో ఉన్న గోపాలాన్ని "వెన్నెలై పాడనా", "నువ్వునా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జివ్వుమంటుంది మనసు, రివ్వు మంటుంది వయసూ ", అంటూ మురిపిస్తే కాముడి తాళికి ఆగలేక పిరికి గోపాలం సీత నిద్రపోతున్నప్పుడు సీత మెడలో పసుపుకొమ్ము తాళి కడతాడు. ఆ తర్వాత "ఏనాడు విడిపోని ముడివేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపుతాడు" అనుకుంటూ "ఏ జన్మ స్వప్నాల అనురాగమో మూసినదినేడు ఈ పసుపుతాడు " అంటూ ఆనందంగా పాడుకుంటారు . కానీ వచ్చిన గొడవ ఏమిటంటే ఇద్దరూ పరాధీనులు, స్వంతంగా ఏనిర్ణయం తీసుకోలేని వాళ్ళు. 

ఇదిలా నడుస్తూ ఉండగా నాటక కంపెనీ ఓనర్(కోట శ్రీనివాసరావు ) మేనల్లుడు దొరబాబు సీత మీద కన్నేస్తాడు. ఎలాగయినా సీతని దక్కించుకోవాలని సీతను తనవైపు తిప్పుకోవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతాడు.

తనకు ఇష్టమయిన ఆభరణాన్ని దక్కించుకోటానికి  ఒక సీత, ఒక దొరబాబు వేసే పన్నాగాలే ఈ సినిమా. 

చివరగా గోపాలం సీత నిజం పెళ్ళి ఘట్టం చాలా నాటకీయం గా జరిగి సుఖాంతం అవుతుంది.

ఆడపిల్లలూ మగపిల్లలూ, ఒక సమస్యని పరిష్కరించటానికి ఎంత విభిన్నంగా ప్రయత్నిస్తారో కన్నులకి కట్టినట్లు కనపడుతుంది ఈ సినిమాలో. 

నా కెందుకు నచ్చింది : 

మనుషుల్లో ఇష్టాఇష్టాలూ ప్రేమానురాగాలూ ఎల్లా పుడతాయో (వస్తాయో) చాలావరకు తెలియదు. వాటికోసం తపన పడి సాధించుకునే వాళ్ళు ఉంటారు మధ్యలో విసుగొచ్చి వదిలేసేవాళ్ళూ వుంటారు. ఈ సినీమాలో ప్రేమ మొదటి కోవకి చెందినది. అందుకే నాకిష్టం.


Monday, September 28, 2020

161 ఓ బుల్లి కథ -- సెప్టెంబర్ వెళ్తోంది -- చలికాలం వస్తోంది
తిరగమోత లోకి కరేపాకు తీసుకురండి అంటే పోర్చీ లోకి వెళ్ళి  చెట్టునుండి రెండు కరేపాకు రెమ్మలు తుంచుకు వచ్చాను. జీవితంలో అదొక ఆనందం. పెరట్లోకి వెళ్ళి చారులోకి కొత్తిమీర తీసుకురావటం అరిటాకు కోసుకు వచ్చి భోజనానికి కూర్చోవటం ఇవన్నీ కొందరికి రోజూ వారీ జరిగే గొప్పసంగతు లేమీ కాదు. అదే చికాగోలో వాటిల్లో ఏవొక్కటి జరిగినా పెద్ద సంతోషమే. ఇరవై ఏళ్ళ తర్వాత చికాగో నుండి డల్లాస్ వెళ్ళిపోతూ మా శివుడన్నయ్య కూతురు ఉమ  అప్పచెప్పిన తన కరేపాకు చెట్టు మా పోర్చీలో పెరుగుతోంది. డల్లాస్ లో వాళ్ళింటి లో కనీసం పెరట్లో కొత్తిమీర మడి , కరేపాకు చెట్టు, అరిటి చెట్టూ వేయించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు కోరికలు తీర్చుకోవాలి.

దాదాపు ఇరవై ఏళ్ళబట్టీ వేసవికాలంలో పొద్దునపూట నేను గడిపేది మా ఇంటి పోర్చి లోనే. కప్పు కాఫీ తో ప్రారంభమయి న్యూస్పేపర్ చదవటంతో పూర్తవుతుంది. మాది cul-de-sac అవటం మూలాన జన సంచారం చాలా తక్కువ. ఒకళ్ళు ఇద్దరు కుక్కలతో వాకింగ్ చేస్తూ అప్పుడప్పుడూ కనపడుతూ ఉంటారు. అంతే. సెప్టెంబర్ లో రాను రాను చలి ఎక్కువవు తోంది. పోర్చిలో నా పక్కన ఉన్న కరేపాకు చెట్టు ఎదురుకుండా ఉన్న మల్లె కుండీ, తులసి మొక్కా  " చలికి వణుకుతున్నాము ఎప్పుడు ఇంట్లోకి తీసుకు వెళ్తావు" అని జాలిగా అడుగుతున్నాయి. చెట్ల ఆకులు రంగులు మారి కిందకు రాలిపోతున్నాయి. సరే వేసవి దాదాపు అయిపొయింది ఈ వేసవిలో ఏమి వెలగబెట్టానని చేసిన పనులు నెమరు వేసుకుంటున్నాను.

పోర్చీలో కూర్చుని ఎదురుకుండా చూస్తూ కూర్చోటం నాకు చాలా ఇష్టం. పిచ్చుకలు ఎగురుతూ ఉంటాయి. ఉడతలు, కుందేళ్లు  పచ్చికలో ఏదో వెతుకుతూ తిరుగుతుంటాయి. లాన్ లో తిరగటం విసుగు వచ్చినప్పుడు ఉడతలు చెట్లెక్కి గంతులేస్తూ ఉంటాయి. చెప్పొద్దూ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.దాదాపు తొమ్మిది గంటలకి సూర్యుడు పోర్చి లోనుండి వెళ్లి పోయిన తరువాత లేచి స్నానం గట్రా  చేసి డైనింగ్ టేబుల్ మీద లాప్టాప్ పెట్టుకుని ప్రపంచ సంగతులు తెలుసుకుంటూ ఉంటాను. పక్క కిటికీ లోనుంచి మా పెరటిలో చెట్లు మా చిన్ని తోట కనపడుతూ ఉంటాయి. మా ఆవిడ ఎదురుకుండా వంట చేస్తూ ఉంటుంది.


ఒకరోజు ఆలా కిటికీ లోంచి చూస్తూ ఉంటే చెట్టు కొమ్మ మీద కూర్చొని రెండు కాళ్ళూ ఎత్తి పెట్టి  ఆపిల్ ఒళ్ళో పెట్టుకుని తీరిగ్గా తింటున్న ఒక ఉడత కనపడింది. చూడ ముచ్చటగా ఉంది కానీ మా పెరట్లో కూర్చుని అది ఎవరి యాపిల్లో తినటం నాకు నచ్చలేదు. జలసీ యో ఏమన్నా నో అనుకోండి. నాకు నచ్చలేదు అంతే. సాయంత్రం ఉడత మా పెరట్లో మా యాపిల్ ఏ తినాలని ఒక యాపిల్ ని చెట్టుకిందకి విసిరి వేశాను.

మర్నాడు పొద్దున్నే కిటికీ లోనుండి చూశాను . యాపిల్ ఎక్కడ వేసింది అక్కడే ఉంది. గడ్డిలో ఉన్న యాపిల్ కనపడలేదోమో అని గడ్డిలోనుండి తీసి కనపడేటట్టు పెట్టాను. మర్నాడు చూస్తే యాపిల్ అల్లాగే ఉంది. ఆపిల్ ముట్టుకున్న ఛాయలు లేవు. ఆపిల్స్ లో చాలా వెరైటీ లు ఉన్నాయి. కొన్నే తింటుందేమో అని అనుమానం వచ్చింది.  'పింక్ లేడీ' 'హనీ క్రిస్ప్ ', రెడ్ డెలీషియస్', 'ఫ్యూజీ', 'గాలా '. ఉడతలు కోరికలేమిలో ఎల్లా తెలుస్తాయి !  నా ఆపిల్ తినలేదని నాకు చాలా బాధగా ఉంది. సరే ఇంకో రోజు ఆగి చూద్దామని అనుకున్నాను. అది తినక పోతే నేను చేసేదేమీ లేదనుకోండీ.

మర్నాడు హడావుడిగా కొంచెం పెందలాడే లేచాను. నేను ఉదయమే లేచి చేయవలసిన పనులు అన్నీ చేశాను, డిష్వాషర్ లో వస్తువులు తీసి ఖాళీ చేయటం, కాఫీ డికాషన్ పెట్టటం వగైరా. కాఫీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంటావిడ లేవటం కూడా ఇవాళ ఆలస్యమయింది. ఆవిడ లేచి వచ్చి నాకు కాఫీ కలిపి ఇస్తుంది. అదేమిటో ఆవిడ కలిపి ఇచ్చిన కాఫీ తాగితేగానీ తృప్తి ఉండదు. 

కిటికీ లోనుండి తొంగి చూసాను. నా నోము పండింది. నా యాపిల్ కాయ మాయమయింది. సంతోషం పట్టలేక పోయాను. మళ్ళా ఎదో అనుమానం వచ్చింది. నిజంగా యాపిల్ కాయ ఉడతే తిన్నదా ? అవశేషాలు ఎక్కడా కనపడటల్లేదే. అనుమానం పెనుభూతం. పెరట్లో అంతా వెతికాను.గుర్తులేవీ కనపడలేదు. ఆరోజంతా గందరగోళంగా ఉంది. రాత్రంతా నిద్దరపట్టలేదు.

మర్నాడు ఉదయం నేను చేయవలసిన పనులు చేసి కాఫీ కప్పుతో పోర్చ్ లో కూర్చున్నాను. ఎదురుకుండా సర్వి (క్రిస్మస్ చెట్టు) చెట్టుకొమ్మ మీద సగం కొరుక్కు తిన్న యాపిల్ ఉంది. నాకు పట్టరాని ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగింది. నేను వేసిన ఆపిల్ ఉడత తిన్నది ! వేసవి అంతా అల్లా నేను ఆపిల్స్ వెయ్యటం అది కొరుక్కు తినటం జరిగిపోయాయి.


దాదాపు అన్నివేసవిలు ఇలాగే గడిచి పోతూ ఉంటాయి. అంటే నేను ఇలా చెట్లూ ఉడతలూ మాత్రమే చూస్తూ కూర్చుంటానని అనుకోవోకండి. మొదట ఇంటిపని చేస్తేగానీ ఠికానా ఉండదు. ఆ తర్వాత చాలా చేస్తాను.

నేను పచ్చళ్ళు పెడతాను.  నిమ్మకాయ పెట్టాను, దానిని ఇండియా పంపిద్దామనుకున్నా కానీ కుదరలేదు. నాలాగా అవకాడో ముక్కలపచ్చడి ఎవరూ పెట్టలేరు. కావాలంటే ఫొటోలో చూడండి ఎంత బాగుందో. అది చూడటానికేగాదు రుచికి కూడా బాగుంటుంది.

 
ఇంకా మా పెరట్లో తోటలో కూడా పనిచేశాను. నేను చాలా వరకు మోరల్ సపోర్టే అనుకోండి. నేను అప్పుడప్పుడూ నీళ్ళు పోస్తాను కూడా. తోట ఫోటో పెట్టాను దాదాపు అది ఎండిపోయింది.ఈ తడవ గోంగూర బాగా పండింది. ఒక అరడజను కాకరకాయలు, ఒక ఇరవై దోసకాయలు, ఒక సంచీ చిక్కుళ్ళూ వచ్చాయి. గోంగూర మొక్క లిచ్చిన  AVL కి ముందర థాంక్స్ చెప్పాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా  గోంగూర స్టార్. దానితో గోంగూర పులుసు,పప్పు, పచ్చడి. గోంగూర పచ్చడి చేసినప్పుడల్లా  ఇంటావిడ కందిపచ్చడి కూడా చేస్తుంది. గోంగూర పచ్చడి కంది పచ్చడి కాంబినేషన్ ఆవిడ కలిపి ముద్దపెడితే "హెవెన్". దోసకాయలతో కూర, పులుసు,పప్పు, పచ్చడి. ఇవి మా ఆవిడకి చాలా ఇష్టం. 


అనుకోకుండా ఈ వేసవిలో కోవిడ్ - 19 తోటి రోజూ వారీ పనులన్నీ కొత్తరకంగా జాగర్తగా చెయ్యాల్సి వచ్చింది. ఎవరన్నా చూడటానికి ఇంటికి వచ్చినా మాస్క్ పెట్టుకుని పోర్చ్ లో కూర్చోపెట్టి పంపించేయటమే. పై వూరు నుండి వచ్చిన మనుమలు మనుమలాండ్రు కూడా మొదట్లో పోర్చిలో ఆడుకుని వెళ్ళేవాళ్ళు. నేను ఇమ్మిగ్రెంట్స్ కి ఆర్గనైజ్ చేసే Conversation Group కూడా ఈ వేసవిలో కలవలేదు. Zoom తో చెయ్యాలని చూస్తున్నాము. ఇంతెందుకు ఇవ్వాళ "డ్రైవ్ ఇన్" లో ఫ్లూ షాట్ తీసుకున్నాను. చేసే పనులన్నీ కొత్త రకంగా చెయ్యాల్సి వస్తున్నాయి.

ఈ వేసవిలో స్వామీ సర్వప్రియానంద గారి మాండుక్యోపనిషత్ లెక్చర్లు యూట్యూబ్ లో విన్నాను. ఏందుకో బాగా నచ్చాయి. దాని సారాంశం టూకీగా చెబుతాను.

సినిమాహాల్లో వెండి తెర మీద సినీమాలని వేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు సినీమాతో మమేకమై పోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాము సంతోషంతో చప్పట్లు కొట్టుతూ ఉంటాము. సినీమా చూస్తున్నంత సేపూ వెండితెర మీద వేస్తున్న సినిమాయే కనపడుతుంది కానీ మనకి వెనకనున్న వెండితెర కనపడదు. అది ప్రత్యక్షం గా ఉన్నా లేనట్లే అనిపిస్తుంది. అల్లాగే ఆ తెర  కూడా తన మీద ఏ సినీమా వేస్తున్నారో పట్టించుకోదు.

సినిమా హాలులో తెరలాగే మన జీవితంలో ఎన్నోచిత్ర విచిత్ర సినిమాలు మన మనస్సు లోని  తెర మీద ఆడుతూ ఉంటాయి. ఆ చిత్రాలలోని నటులూ, కనపడే ద్రుశ్యాలూ  చిరపరిచితులే. ఆ సినిమా చూస్తూ సంతోషపడుతూ ఉంటాము జుట్టు పీక్కుంటూ ఉంటాము. 

మన మనస్సు లోని ఆ తెరే ఆత్మ (Conscience). మనము దానిమీద పడుతున్న సినిమా పాత్రలతో పాటు చలిస్తూ ఉంటే బాధలూ భయాలూ తప్పవు. సినిమాహాల్లోని తెరలాగా తన మీద నడుస్తున్న సినిమాలకి ప్రతిస్పందిచకుండా ఉంటే మనకి మనం చిత్రించుకునే సుఖ దుఃఖాలు ఉండవు. మనం మనంగా ఉంటాము.

జీవితంలో మనం అనుభవించే బాధలన్నిటికీ కారణం అచంచలమైన మన ఆత్మతో చంచలమైన ప్రపంచాన్ని కలిపి చూడటమే అంటారు ఆత్మ జ్ఞానులు. క్లుప్తంగా ఇదే నాకు అర్ధమయిన మాండుక్యోపనిషత్ సారాంశం. 

నేనొక పుస్తకం కూడా చదివాను. "Eat to Beat Disease" by Dr. William W.Li  MD. The New Science of How Your Body Can Heal Itself. ఈ పుస్తకంలో మన శరీరంలో Angiogenesis అనే ప్రక్రియ  సక్రమంగా జరగటానికి  ఆహారం ద్వారా మనము తిన వలసిన పదార్థముల గురించి చర్చించటం జరిగింది.

మన శరీరం ఇబ్బందులు లేకుండా వీలయినంతవరకూ సుఖంగా గడపాలని అనుకుంటుంది. అందుకు శరీర భాగాలలో క్రమము తప్పినవాటిని సరిచేసి ఆరోగ్యంగా ఉండేలా చూసే రక్షణ కవచంలో ఒక భాగం Angiogenesis. 

మన శరీరంలో రక్తనాళాలు నలుమూలలా వ్యాపించి ఉంటాయి. జీవత్వానికి రక్తనాళాలు నుండి ప్రవహించే రక్తంలోని పోషకపదార్ధాలు చాలా ముఖ్యం. శరీరంలో అవసరమైన ప్రదేశాలకి రక్తం అందిస్తూ చెడు ప్రదేశాలకు రక్తం అందకుండాచేయటం దీని ప్రత్యేకత. ఈ విధంగా రక్తనాళాలని సక్రమంగా నిర్వహించేదే  Angiogenesis. 

ఎప్పటినుండో విశ్వనాధ సత్యనారాయణ గారి వేయిపడగలు నవల చదవాలని ఉండేది. ఎప్పుడూ కుదరలేదు. ఈ వేసవిలో కిరణ్ ప్రభగారి టాక్ షో ద్వారా ఒక విధంగా ఆ కోరిక తీరింది. ఈ వేసవిలో యు ట్యూబ్ లో నేర్చుకుంటూ సగంలో వదిలేసిన పనులు కూడా రెండు ఉన్నాయి. సంగీతం , సంస్కృతం. ఆ రెండూ నాలుగు లెసన్స్ తోటి ఆగిపోయాయి.  

ఈ వేసవిలో పిల్లలు మనుమలు మానమరాళ్ళతో వచ్చారు. న్యూయార్క్ నుంచి వచ్చిన పిల్లలు ఓపికగా పన్నెండు గంటలు కారు లో ప్రయాణం చేసి వచ్చారు . కాలిఫోర్నియా నుండి వచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకుని నాలుగు గంటలు ప్లేన్ లో కూర్చుని వచ్చారు.

అమెరికాలో మేముండేచోట (చికాగో దగ్గర) దాదాపు వేసవికాలం అయిపోయినట్లే. చలి మొదలెట్టింది. ఇంకా కొన్ని నెలలలో స్నో వస్తుంది. ఈ వేసవి  అంతా హడావుడిగా Covid-19 తో గడిచిపోయింది. వచ్చే వేసవి ఇంకొంచెం బాగుంటుందని ఆశిద్దాము.

కాలిఫోర్నియా నుండి ప్లేన్  లో నాలుగు గంటలు భరించి మమ్మల్ని చూడటానికి వచ్చిన మా ఏడాది మనవరాలి మ్యూజిక్ కాన్సర్ట్ తో ఈ పోస్ట్ ముగిస్తాను.
Wednesday, April 22, 2020

160 ఓ బుల్లి కథ -- మందాకిని

లాక్ డౌన్ లో ఇల్లంతా శుభ్రం చేస్తుంటే పాత కాగితాల్లో నేనెప్పుడో వ్రాసిన గేయం కనపడింది. ఈ గేయం క్రింద నా గురించి రెండు లైనులు వ్రాశారు కాబట్టి ఇది ఎప్పుడో ఎక్కడో అమెరికాలో ఎవరి పత్రిక లోనో పడుంటుందని అనుకుంటున్నాను.

మాతంగిని 

ప్రేమ మాటలు రావు నాకు 

పెద్ద చదువులు చదవలేదు 

పాటు పడి నా సాటి కొస్తే 

ప్రీతిగా సాపాటు పెడతా 


దాచుకోమని హృదయమిస్తే 

కొంగు కొసలో మూటగట్టి

హృదయ పేఠిలో దాచుకుంటా 


నృత్య నాటికలాడలేను 

పాటగట్టి పాడలేను 

ఊసురోమని ఇంటికొస్తే 


చెంగు పరచి చెంతజేరి 

కమ్మగా నిను కౌగాలిస్తా 


మృదువుగా నీ మాటలన్నీ 

మల్లెమొగ్గల మాల కట్టి 

తురిమి జడలో పెట్టుకుంటా 


భావకవితలు చెప్పలేను 

భామ కలాపము చెయ్యలేను

నీదు హృదిలో స్థానమిస్తే 


సన్న జాజుల తల్పమేసి 

సాదరంగా నిన్ను చేరి 

నాతి హృదయపు లోతులన్నీ 

దొంగ చూపులు చూడనిస్తా 


తేల్చుకో నీ కొరికెవరో

మాధవా ! నేనాగలేను 

మరుని ధాటికి తాళలేను 


Sunday, April 19, 2020

159 ఓ బుల్లి కథ -- రెండు పిచ్చుకల కధ

నేను పొద్దునపూట సామాన్యంగా ఏమీ తినను. కాఫీ పెట్టుకుని తాగేసి కూర్చుంటాను. కంప్యూటర్ లో వార్తలు అవ్వీ చూసుకుని  రోజూ లాగే పైకెళ్ళి స్నానం చేసి క్రిందకు వచ్చి దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. మా ఆవిడ నన్ను చూసి నీరసంగా ఉన్నానని గుర్తించింది. పైనుండి క్రిందకి గుడ్డల మూట మోసుకొచ్చాను బహుశా నా నీరసానికి అది కారణం అయిఉండచ్చు ( ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటాము).నేను ఎవరన్నా సింపథీ చూపిస్తుంటే మాట్లాడకుండా దీనంగా మొహం పెడతాను. తప్పకుండా ఎదో  బోనస్ వస్తుంది. నేను గుమ్ముగా చొక్కాలూ లాగూలు వాషింగ్ మెషిన్లో వేస్తున్నాను. "ఆమ్లెట్ వేస్తున్నాను వెళ్ళి ఆ కంప్యూటర్ ముందు కూర్చోకండి" అన్న మాట వినిపించింది.

అమెరికాలో ఇది వసంత కాలం. చలికాలం వస్తోందని ఉష్ణ  ప్రదేశాలకి  వెళ్ళిన పక్షులు వాటి వాటి గూళ్ళకి తిరిగి వస్తున్నాయి. మా పెరట్లొ పిచ్చుకలూ గోరింకలూ కుందేళ్ళు అప్పుడప్పుడూ బాతులు కూడా వస్తూ ఉంటాయి. ఉడతలు సరే సరి అన్ని కాలాలలోనూ  చెట్లమీద గంతులేస్తూ ఉంటాయి.

ఆమ్లెట్ శాండ్విచ్ తింటూ కిటికీ లోంచి చూస్తున్నాను. ఎదురుకుండా ఫెన్స్ మీద రెండు పిచ్చుకలు ఎదురెదురు గా కూర్చుని నోటితో (ముక్కుతో ) ఏదో అందించుకుంటున్నాయి. రెండూ ఒకే సైజు లో ఉన్నాయి. ఎదురుకుండా కూర్చుని తింటున్నాయి.  ఆహా ఎంత ప్రేమో అనిపించింది. గాఢ ప్రేమికులో అన్యోన్య దంపతులో అయి ఉండాలి అని అనుకున్నాను.

క్షణాలు గడిచాయి. తినటం అయిపొయింది. ఒక క్షణం ఎదురుగుండా నుంచుని ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నాయి. ఇద్దరూ రెండడుగులు అభిముఖంగా వేసి దూరంగా జరిగి తిరిగి ఒకళ్ళ నొకళ్ళు చూసుకున్నాయి. ఒక పిచ్చుక ఎందుకో ఒక అడుగు వెనక్కి తిరిగి వచ్చింది. విడిపోటం కష్టంగా ఉందల్లే ఉంది. రెండొవ పిచ్చుక కూడా తిరిగి వస్తుందనుకున్నాను. రాలేదు సరికదా ఎగిరి పోయింది. రెండవ పిచ్చుక ఎగిరి పోతున్న పిచ్చుకని ఒక క్షణం చూసి తానూ ఎగిరి పోయింది.

నా శాండ్విచ్ తినటం అయిపొయింది కానీ కుర్చీ లోనుండి లేవ లేక పోయాను. ఏమైంది ఆ పిచ్చుకలకి. ఏమిటో తెలియని బాధ నన్నావరించింది. రెండూ పోట్లాడుకుని విడిపోయాయా ? లేక ప్రేమగా విడిపోయాయా? ఏదీ తెగక ఆలోచిస్తున్నాను.

రెండడుగులు వేసి  ఒకళ్ళ నొకళ్ళు చూసుకున్నారు.  ప్రేమతో  బై చెప్పటానికి చూసుకున్నారంటే ఒకళ్లే రెండడుగులు వెనక్కి తిరిగి ఎందుకు వచ్చారు ? విరహ బాధతో వచ్చింది అనుకుంటే ప్రేమలేని ఆ మొదటి పిచ్చుక తన ఎదురుకుండా తుర్ మని ఎగిరిపోతే ఎంత బాధ పడిందో!! పోనీ పోట్లాడుకుని విడిపోయారనుకుంటే, తప్పెవరిదైనా కానీ అనుకుని రెండవ పిచ్చుక కాంప్రమైజ్ అవుదామని తిరిగి వస్తే  అంతమాత్రం జ్ఞానం లేదా ప్రియురాలు చూస్తుండంగా  అలా తుర్ మని ఎగిరి పోవటమేనా ? పాపం ఆ పిచ్చుక ఎంత ఏడ్చిందో  !!

ఏమిటో మన మనుషుల మనస్తత్వాలతో పిచ్చుకల గురించి ఆలోచిస్తున్నాను. పిచ్చుకలు ప్రేమ అల్లాగే చూపిస్తాయేమో అనుకుంటూ భారంగా కుర్చీ లోంచి లేచి నేను ఆవేళ చెయ్యాల్సిన పనులకి ఉపక్రమించాను.

P.S: పై ఫోటో తీసింది మా ఆవిడ. డైనింగ్ టేబుల్ మీద ఉన్నది నా లాప్టాప్, నా సరంజామా. ఫోటో తీయమంటే నసుగుతూ ఐపాడ్ తీసుకొస్తే డైనింగ్ టేబుల్ సరి చెయ్యటానికి కుదర లేదు. మా డైనింగ్ టేబుల్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకోవద్దు.

Thursday, March 26, 2020

158 ఓ బుల్లి కథ -- నాకు నచ్చిన సినీమా - 1

కరోనా Lockout తోటి ఇంట్లో కూర్చుని యూట్యూబ్ సినిమాలు చూడటం మొదలెట్టాను. చూసిన తర్వాత వాటిమీద నా అభి ప్రాయాలు వ్రాయాలని పించింది. నేను వ్రాసే విధానం కొత్తగా ఉండచ్చు. గాభరా పడవోకండి.

సినిమా పేరు: 
ముగ్గురు అమ్మాయిల మొగుడు.

ముఖ్య నటీనటులు:
చంద్రమోహన్, అరుణ, విజ్జి, సాధన.
నటీనటులు అన్నప్పుడు నటీమణుల పేరు ముందర పెట్టాలా ? తెలియదు.

సంక్షిప్తం గా కధ :
హీరో(చంద్రమోహన్)  "ఎం ఏ" పాస్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుని టైంపాస్ చేస్తుంటే వాళ్ళ నాన్నపెళ్ళి చేసుకోమంటాడు. హీరోకి ఇష్టం లేదు. తనకి ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని కోరిక. కానీ వాళ్ళ నాన్న బందరులో ఉన్నవాళ్ళ బాల్య మిత్రునికి, ఆయనకున్న ముగ్గురు కుమార్తెలలో ఒకరిని తన కొడుకుకి చేసుకుంటా నని మాటిచ్చాడు. ఉద్యోగం లేక ఇంటిపట్టున ఉన్న హీరోకి ఏమి చెయ్యాలో తోచక, ప్రేమించటానికి ఆ ఊర్లో ఎవరూ లేక, తండ్రికి చెప్పలేక, తీర్థ యాత్రలు చేసొస్తాను రెండు నెలలు టైం ఇమ్మంటాడు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుంటా ననటం తోటి తండ్రి కొడుకు కోరికకు అంగీకరిస్తాడు.

హీరో గారు కాబోయే భార్యని ప్రేమించటానికి తన తండ్రి మిత్రుడి ఊరుకు జేరుకుని ఆయన ఇంట్లో (తన మిత్రుని సహాయంతో)  మకాం వేస్తాడు. అక్కడున్న ముగ్గురు ఆడ పిల్లలలో ఎవరిని ఎల్లా ప్రేమించాలో తెలియక తికమక పడతాడు. చివరికి ఆ ముగ్గురు ఆడపిల్లలలో ఇద్దరు వేరే వాళ్ళని ప్రేమించటం మూలంగా సమస్య తేలిపోయి చివరికి మిగిలిన అమ్మాయితో సెటిల్ అయిపోతాడు. ఈ చిత్రంలో మామూలుగా ఉండే హీరో హీరోయిన్ డాన్సులు ఒక చిన్న రౌడీలతో  కొట్లాట కూడా ఉన్నాయి.

నా కెందుకు నచ్చింది : 
నేను హీరో హీరోయిన్  ఇంటర్వెల్ ముందర పెళ్ళి చేసుకుంటే సినిమా చూడను. అంతటితో సినీమా ఆపేస్తాను. లేకపోతే సినీమా అయ్యేదాకా వాళ్ళ బాధల గాధలు చూడాల్సి వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత డాన్సులు గట్రా ఉండవని మనకు తెలిసినదే కదా.

ఈ సినిమా లో పెళ్ళి చివర జరుగుతుంది. ఈ మధ్యలో డాన్సులు ప్రేమాయణాలు గట్రా ముగ్గురు అమ్మాయిలతో జరుగుతాయి. దీనిలో ప్రేమించటంలో హీరో కన్నా ఆ ముగ్గురు ఆడపిల్లలే బెటర్. సినిమా బాగుంది. చూడవచ్చు.
Tuesday, March 24, 2020

157 ఓ బుల్లి కథ --కాలం గాని కాలంలో అమెరికా


రెండు రోజుల క్రితం అమెరికాలో వసంతకాలం వచ్చింది. చెట్లు చిగిర్చి పువ్వులు పూయాలి. కానీ చికాగో లో కాలంగాని  కాలంలో  స్నో పడింది .  ఇంకా సూర్య భగవానుడు రాలేదు. పైన ఫొటోలో కనపడేది మా పెరటి తోట. కలికాలం ఇది. వసంత కాలంలో స్నో పడటం, "కరోనా వైరస్ "  లాంటి రోగాలు రావటం.

 "కరోనా వైరస్ ",  బయట తిరగొద్దు  అని  చెప్పటంతో వారం రోజులబట్టీ ఇంటిపట్టునే ఉంటున్నాము. ఇంట్లో ఉన్న ఇద్దరం  లైబ్రరీ లో పనిచేస్తాము. ఇంటావిడ ఉద్యోగం అక్కడ ఇంటాయనకి వాలంటీర్ పని.పెళ్ళయిన నలభై ఏళ్ళ తర్వాత 24 గంటలూ ఒక చోట ఇద్దరమూ  గడపటం ఇదే మొదటిసారి.

మనుషుల అభిప్రాయాలు సామాన్యంగా వారు పెరిగిన వాతావరణం బట్టి ఉంటాయి . భార్యా భర్తలు వీటికి అతీతం కాదు. అభిప్రాయ బేధాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అందులో 24 గంటలూ ఇంటిపట్టున ఇద్దరూ  ఉండాలంటే కొంచెం కష్టమే. వారం రోజులు జుట్టూ జుట్టూ   పట్టుకోకుండా ప్రశాంతంగా గడిచి పోయిందంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏమైంది అని నాలో నేనే ప్రశ్నించుకుంటే కొన్ని విశేషాలు బయటికి వచ్చాయి. మీకు కూడా అవి పనికి వస్తాయని వాటిని మీతో పంచుకుంటున్నాను.

మొదటిది చాలా ముఖ్యమయినది ఇంట్లో ఇద్దరే ఉండటం మూలంగా "ప్రైవసీ" ఉండదు.  అందుకని రోజూ ఒక గంట ముందర లేస్తాను. ఆ గంట మీ సొంతం ఎంతో హాయిగా ఉంటుంది. నేనయితే నేను కాఫీ పెడతాను. ప్రశాంతంగా కాఫీ తాగుతాను. మా డిష్ వాషర్  పై అరలో వున్న వన్నీ తీసి బయట పెడతాను. అవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టక పోతే ఆవిడకి కోపం వస్తుంది. అందుకని నేను సద్దను. డిష్ వాషర్ లో రెండొవ అర ఆవిడకి వదిలిపెడతాను. పని ఇద్దరికీ సమానంగా ఉంటుంది అందుకని పోట్లాటకి తావుండదు. లేచే సరికి కాఫీ గూడా తయారు చేసి పెడతా కదా సంతోష పడుతుంది. కాకపోతే కాఫీ పల్చగా ఉందనో స్ట్రాంగ్ గా ఉందనో అంటుందనుకోండీ. ఇటువంటివి పట్టించుకోను.

ఆవిడ కాఫీ తాగి స్నానం చేసి పూజా అవీ చేసుకునే టప్పటికి గంటలు పడుతుంది. ఆ సమయ మంతా మీదే. హాయిగా ప్రశాంతంగా పనులు చేసుకోండి. నేనయితే ఇంటర్నెట్ తో కంప్యూటర్ మీద ఉంటాను. సమయం గుర్తు వచ్చేసరికి సరికి లంచ్ టైం దగ్గర పడుతుంది.

వీలయినంత వరకూ ఇంట్లో సహాయము చేస్తున్నట్లు కనపడండి. నేను సామాన్యంగా తేలికగా లంచ్ తయారు చేస్తాను. నేను తయారు చేసేవి "అటుకుల ఉప్మా" "సేమ్యా ఉప్మా " లాంటివి. మీకు ఇటువంటివి చెయ్యటం రాక బోతే నేర్చు కుంటాను అని ఆవిడ చేత చేయించండి. భర్త బుద్దిగా నేర్చుకుంటా నంటే నేర్పటం వాళ్లకి చాలా ఇష్టం. ఇలా నేర్చుకుంటూ రోజులు గడపొచ్చు.

లంచ్ అయిన తర్వాత నిద్దర వస్తే నిద్దర పోండి. లేదూ U -Tube లో పాత తెలుగు సినిమాలు పెట్టండి. మూడు గంటలు అలా మాట్లాడకుండా గడపొచ్చు. మచ్చుకి మేము చూసిన తెలుగు సినిమాలు "కొంటె మొగుడు పెంకి పెళ్ళాం","శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్", "చిల్లరి మొగుడు అల్లరి కొడుకు", "మా ఇంటాయన కధ ", "పెళ్లి చేసి చూడు" "థాంక్యూ సుబ్బారావ్" లాంటి తెలుగు చిత్ర రాజములు.

నువ్వు పెట్టిన టీ చాలా బాగుంటుందని చెప్పి టీ పెట్టించుకుని తాగండి. ఇంతలో వార్తల టైం అవుతుంది. టీవీ లో వార్తల ఛానల్స్ (CNN వగైరా) చూడండి. తర్వాత ఆవిడకి TV  ఇచ్చేసి తనకి ఇష్టమయిన షోస్ చూసుకోమనండి . ఇలా కొన్ని గంటలు గడిచిపోతాయి.

ఇంతలో డిన్నర్ టైం దగ్గరపడుతుంది. మీరు లంచ్ చేశారు గనక డిన్నర్ ఆవిడే చేస్తుంది. మీరు ఆవిడ డిన్నర్ వండుతుంటే మీ వంతు ఒక పని తప్పకుండా చెయ్యాలి, అన్నం వండండి తేలిక. రైస్ కుక్కరో ప్రెషర్ కుక్కారో వాడండి. గిన్నెలో రెండు కప్పుల బియ్యానికి మూడు న్నర కప్పుల నీళ్ళు పొయ్యటమే. తర్వాత ఆవిడకి సహాయం చెయ్యండి. వీలయితే ఒక గరిటె తీసుకుని భగుణ లో కూర తిరగ తిప్పండి.

డిన్నర్ కి టేబుల్ మీద మంచినీళ్లు ప్లేట్లు పెట్టండి. వంట బాగుందని చెప్పండి.

డిన్నర్ అయిన తర్వాత U - ట్యూబ్ లో మరల తెలుగు సినిమాలు పెట్టండి. మూడు గంటలు గడిపెయ్యోచ్చు. నిద్దరొస్తే మధ్యలో కునుకు తీయండి. తెలుగు సినిమా చూస్తూ కునుకు తీయటం పెద్ద తప్పేమీ కాదు. తర్వాత నిద్దర టైం అవుతుంది.

ఇందులో ముఖ్యంగా గమనించ వలసింది close encounters రాకుండా జాగర్తగా ఉండటమే. ఒకవేళ నోరు జారటం సంభవిస్తే "Honey I love you " అనటానికి సంకోచించ వోకండి. All the best during lockout.

P.S
విన్నకోట వారూ, నీహారిక గారూ, శ్యామలీయం గారూ ముక్త కంఠం తో చెబుతున్నారు అన్నం వండటానికి నేను వ్రాసినట్లు కాకుండా బియ్యం,నీళ్ళు ఒకటికి రెండని. నేను అన్నం వండటంలో చివరి ముఖ్య పని మాత్రమే చేస్తాను అందుకని నాకు ఈ ప్రిపరేషన్ సంగతి తెలియదు. మా ఆవిడ ఇచ్చిన గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చెయ్యటం మాత్రమే నా పని. ఒక అరగంటకి అన్నం ఉడుకుతుంది. ఇది పెద్ద కష్టమయిన పని కాదు. వీరు చెప్పిన సంగతి తప్పో ఒప్పో తెలియక మా ఇంట్లో ఎక్సపర్ట్ కన్సల్టెంట్ మా ఆవిడని సలహా అడిగాను.

ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే నేను అన్నము మెత్తగా ఉన్నదని గొడవచేస్తే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం మెలికలుగా(పలుకుగా ) ఉన్నదంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం వండటం ఇంత క్లిష్టమని అనుకోలేదు. మీకు అన్నీ చెప్పాను. మీ కిష్టమయిన విధంగా అన్నం వండుకోండి.