Wednesday, September 28, 2022

198 ఓ బుల్లి కథ -- పెళ్ళికి ముందర ప్రేమించాలా ?

మన సమాజంలో "ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే క్రేజ్" మొదలయినదని తెలిసిన దగ్గరనుండీ నాకు నేను జీవితంలో ఏదో  మిస్ అయిపోయాననే శంక పీకుతూ ఉంటుంది. యాఫ్ట్రాల్ జీవితంలో ఒక్కసారే కదా పెళ్ళి  చేసుకునేది ! పెళ్ళికి ముందు ఆ అనుభవం అనుభవిస్తే ఎంతో బాగుండేదని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

నలభై ఏళ్ళ క్రిందట ఒక నెల శలవబెట్టి అమెరికా నుండి వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్ళాను . కాకపోతే అది నే ననుకున్నట్లు  జరగక మూడుముళ్ళూ వెయ్యటానికి  రెండు నెలలు పట్టింది. అప్పుడు అమెరికా వాళ్ళు అదొక రికార్డ్ అనుకున్నారు. ఇప్పుడు రోజూ  "ప్రేమ పెళ్ళి క్రేజ్"  వింటూ ఉంటే జీవితంలో నేను ఏదన్నా మిస్ అయిపోయుంటానా అనే అనుమానం నాకు రోజూ వస్తూ ఉంటుంది. 

ఎదో అమ్మాయితో అలా ప్రేమ యాత్రలకి బీచికి వెళ్ళటం, ఆ తర్వాత ఇద్దరం ఏదో రెస్టోరెంట్ కి వెళ్ళటం, మనసు మనసూ కలిసేలా మాట్లాడు కోవటం. ఇవన్నీ నేను ఒక్కణ్ణే మిస్ అయ్యానా ? అనేది నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. అందుకని నేనేనా, నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని ఒక చిన్న పరిశోధన చెయ్యాలనే కోరిక మొదలయింది. అందుకని నాకు తెలిసిన వాళ్ళతో ముందర ప్రారంభించాలని అనుకున్నాను.

మేము నాలుగైదు ఫ్యామిలీలు నెలకోసారి మెడిటేషన్ కి కలుస్తూ ఉంటాము. ఒక సారి ఈ ప్రశ్న వేశాను. మీ పెళ్ళి ఎల్లా జరిగింది ? అని. అంటే ఎంత వైభవంగా జరిగింది అనికాదు. ఎట్లా మీ ఇద్దరికీ ముడి పడిందని.

నేను ఆ ఫ్యామిలీల గురించి ఒక ముక్క చెబుతాను. నేను ఒక్కణ్ణే ఆ చిన్న గుంపులో రిటైర్ అయిన  వాడ్ని. మా ఆవిడ ఇంకా పనిచేస్తోంది. మిగతా వాటిల్లో రెండు ఫ్యామిలీల లో అయ్యగార్లు  పనిచేస్తారు కానీ అమ్మగార్లు పని చేయరు. మిగిలిన రెండు ఫ్యామిలీలలో అమ్మగారూ అయ్యగారూ ఇద్దరూ పనిచేస్తారు.మొన్ననే ఒకళ్ళింట్లో వాళ్ళ 25 ఏళ్ళ కాపురానికి పండగ జరుపుకున్నాము. ఆంటే ఈ శాంపిల్ పోల్ లో ఇప్పటి వరకూ 25 ఏళ్ళ నుండీ 40 ఏళ్ళ పాటు సంసారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారన్న మాట. ఇంకొకఆయనకి పెళ్ళి అయినది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్యా వాళ్ళింటికి వెళ్ళాడు. నువ్వు యూనివర్సిటీ లో చదువుకున్నావు కదా నీ స్నేహితులు ఎవరన్నా పెళ్ళికున్నారా, చిట్టికి  పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము అని అడిగిందిట. చిట్టి తన కూతురు. నేనున్నా కదా ఎందుకు చూట్టం అన్నాడుట. ఇష్టా ఇష్టాలు ఎంత చమత్కారంగా ఆవిడ అడిగిందో మేనల్లుడు అంతే చమత్కారంగా ఎల్లా సమాధానం  చెప్పాడో చూడండి. ఆయన  అత్తకూతురుతో ఆయనకి పెళ్ళయి పోయి శుభాంతంగా ముగిసి పిల్లా పాపాలతో కాపరం చేస్తున్నారు. 

వారి సమాధానాలు మీరు వింటే నమ్మరు కానీ నాది తప్ప అందరివీ పెద్దలు కుదిర్చిన సంబంధాలే. (నేనంతట నేనే నా పెళ్ళాన్ని ఎతుక్కోవాల్సి వచ్చింది.) పెళ్ళి చూపుల ముందు వాళ్ళకి  కూడా పరిచయాలు లేవు. ఒకళ్ళయితే ఆయనకి పెళ్ళి చూపులు కూడా లేవు. వాళ్ళ ఫ్యామిలీ లో అది ఆచారం కాదుట. 

పెళ్ళికి ముందర పరిచయం లేకపోయినా ఏళ్ళ తరబడి సంసారాలు సాగి పోతున్నాయి. సుఖంగా సంసారం చేసుకుంటున్న వాళ్ళని  మీ సంసారంలో ప్రాబ్లమ్స్ ఉన్నయ్యా  అని అడిగే ధైర్యం లేక అడగలేదు. వాళ్ళ జీవితంలో ఏదీ మిస్ అయినట్లు నాకేమీ కనపడటల్లేదు. పెళ్ళి ముందు ప్రేమ ఉండాలనేది చెప్పటం ఈ శాంపిల్ తో నిర్ధారించలేము. 

నేను ఇదే ప్రశ్నని నా క్లాసులో  పిల్లలకి వేశాను. నేను ఇక్కడ పది ఏళ్ళబట్టీ ఇమ్మిగ్రెంట్స్ కి  ఇంగ్లీషు మాట్లాడటం నేర్పు తున్నాను. రిటైర్ అయ్యిన తరువాత  కాలక్షేపం volunteer పని ఇది. ఈ ప్రశ్నకి సమాధానాలు వింటే మీరు ఆశ్చర్య పోతారు. పెళ్లిచేసుకోవటం ఎంత కష్టమో తెలిసిపోతుంది.

ఒక S. Korea అమ్మాయి చిన్ననాటి స్నేహితుడి తో కొంత కాలం తిరిగిందిట కానీ  యూనివర్సిటీ డిగ్రీ తెచ్చుకొన్న తరువాత ఇంకోళ్ళతో పరిచయమయ్యి రెండు సంవత్సరాలు తిరిగిన తరువాత పెళ్ళి చేసుకుందిట. అంటే ఇంకొకళ్ళు దొరికిన తరువాత మొదటివాడిని వదిలేసింది.

ఒక ఇటాలియన్ అమ్మాయి పన్నెండేళ్ళు కలిసి ఉండి పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తూ ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పెళ్ళి  చేసుకుందిట.

ఒక పోలిష్ అమ్మాయికి అబ్బాయి పరిచయ మయిన తరువాత పెళ్ళి  చేసుకోటానికి రెండేళ్లు పట్టిందిట. ఆ రెండేళ్లూ చేసుకుంటాడో లేదో అనే సందిగ్దావస్థ.

వెనుజువెలా అమ్మాయికి అయితే మాత్రం చెట్టా పట్టా లేసుకు తిరగ కుండా వెంటనే పెళ్లి అయి పోయింది. పెళ్లి ఇద్దరికీ అవసరం. వాళ్ళాయన కంప్యూటర్ ఇంజినీర్ దేశాలు తిరుగుతూ ఉంటాడు.

అదే రష్యా అమ్మాయికి పెళ్ళికోసం దేశం విడిచి పెట్టాల్సి వచ్చింది. అమెరికాకి మూడు నెలలకని వచ్చి అవసర రీత్యా  ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. ఇంకో సంగతి కూడా చెప్పింది. రష్యాలో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు  సామాన్యంగా అయిదు ఏళ్ళు సహజీవనం చేస్తారుట. ఆ తరువాత పెళ్ళి అయితే అవుతుంది లేక పోతే లేదు. 

ఈ పోల్ లో తేలింది,పెళ్లి చేసుకోటానికి తంటాలు పడటం తప్ప పెళ్ళికి ముందు చల్ మోహన రంగా అంటూ తిరిగిన సూచనలు లేవు.

నా unscientific పోల్ రిజల్ట్స్ inconclusive. పెళ్ళికి ముందు ప్రేమ ఉండాలా ? తెలియదు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కధలు పేపర్లో చూస్తూ ఉంటే, తిట్టుకోటాలు కొట్టుకోటాలు, కత్తితో పొడుచుకోటాలు సూసైడ్ లూ, ఈ  ప్రేమా గీమా లో పస ఏమీ లేదని తెలుస్తోంది. ప్రేమించి పెళ్ళి  చేసుకోక పోవటం మూలంగా  జీవితంలో నేనేమీ మిస్  అవలేదు అని ప్రస్తుతం నేను గట్టిగా చెప్పగలను.