Monday, November 22, 2021

183 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 4 (Prasnopanishad )

ఇంతవరకూ జరిగిన వృతాంతం:ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ  కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ  గార్గ్య, సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్నలన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు పిప్పలాద ఋషి .

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

రెండవ ప్రశ్న భార్గవ వైదర్భి గురువుగారికి వేస్తాడు : భగవాన్ ఒక వ్యక్థి స్థితికి ఎవరు కారకులు వారిలో శ్రేష్ఠులు ఎవరు అని. ఇక్కడ స్థితి అంటే జీవించటం అని అర్ధం చెప్పుకోవచ్చు.

దానికి గురువుగారు పిప్పలాదులు చెబుతారు : మొదట ఇంద్రియాలు, వాటి వల్లనే వ్యక్తి జీవించకలుగుతున్నాడని గర్వంగా చెప్పేవి కానీ  "ప్రాణం"  మధ్యలో వచ్చి తానే జీవత్వానికి కారణం అని చెప్పి నిరూపిస్తుంది. అందుకని అన్ని ఇంద్రియాలకీ "ప్రాణం"  పొసే "ప్రాణం" శ్రేష్టమైనది అని పిప్పలాదులు సమాధానం చెబుతారు.

మూడవ అధ్యాయం లో గురువుగారికి శిష్యుడు మూడవ ప్రశ్న వేస్తాడు.

మూడవ అధ్యాయం మొదటి మంత్రం: (3-1)

అధ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః  ప్రపచ్చ  : ఆ తరువాత కౌసల్య అశ్వలాయన అడిగాడు 

భవన్కుత ఏష ప్రాణో జయతే కధమాయాత్యస్మిరీరే ? : మహర్షీ ఈ ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది ? ఈ శరీరంలోకి ప్రాణం ఎల్లా వచ్చింది ?

ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే ? : తనను తాను విభజించుకుని ఎల్లా ప్రతిష్ఠించు కున్నది? 

కేనో త్క్ర మతే ? కథం బాహ్య మభిధత్తే  ?: ఎలా బయటకు వెళ్తుంది (శరీరం నుండి) ? ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైనది ?

కధ మధ్యా త్మ మితి ? : 

మూడవ అధ్యాయం రెండవ  మంత్రం: (3-2)

తస్మై స హోవాచాతి ప్రశ్నా స్ప్రుచ్చ  సి : శిష్యునితో (గురువుగారు) అన్నారు నువ్వు కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు 

బ్రాహ్మిష్టో సీతి తాస్మాత్తే  హం బ్రవీమి : నీవు బ్రహ్మజ్ఞానివి (అర్ధం చేసుకునే శక్తి ఉన్నది) అందుకు దీనికి సమాధానం చెబుతాను 

మూడవ అధ్యాయం మూడవ  మంత్రం: (3-3)

ఆత్మన ఏష ప్రాణో జాయతే : ఆత్మ నుండి ప్రాణం పుట్టింది 

యథైషా పురుషే చ్చ యైత స్మిన్నే తదాత తం : పురుషుని వల్ల  ఏర్పడిన నీడలా  

మనోకృతేనా యాత్య స్మి ఇంమి రీరే : కర్మల వలన శరీరంలోకి వస్తుంది 

కౌసల్య అశ్వలాయన గురువుగారికి వేసిన మూడవ ప్రశ్న,మనిషిలో  "ప్రాణం" ఎల్లా వస్తుంది, శరీరంలో ఎల్లా ప్రతిష్ఠించు కుంటుంది, చివరికి శరీరాన్ని వదలి ఎల్లా వెళ్ళి పోతుంది?, చెప్పమని. (3-1)

గురువుగారు శిష్యుడికి తన సమాధానం అర్ధం కాదేమోనని  కొంత తటపటాయించినా, శిష్యుని సామర్ధ్యం తెలిసినవాడు కనుక, ఇది చాలా క్లిష్టమయిన ప్రశ్న అంటూనే దానికి సమాధానం చెబుతారు.  (3-2)

ఈ జగత్ అంతటికీ కారణం పరమాత్మ. పరమాత్మ నుండి "ప్రాణం" పుట్టింది. ఎల్లా పుట్టింది అంటే మనం ఎండలో నుంచుంటే నీడ వస్తుందే అలా. "ప్రాణం" పరమాత్ముని నీడ లాంటిది. నీడ ఎంత మిధ్యో పరమాత్ముని అంశం ఈ జగం కూడా అంతే మిధ్య . అది ఏశరీరంలోకి వస్తుంది? మనం చేసిన పూర్వ జన్మ కర్మల ప్రభావం వలన.  (3-3)

ఏవిధంగా ఒక చక్రవర్తి పరిపాలన సౌలభ్యంకోసం మంత్రులూ సామంత్రులు మొదలగు వారిని నియమించుకుని పాలిస్తారో అటులనే "ప్రాణం" శరీరంలో తన వారిని  విడివిడిగా తగిన స్థానాలలో నియమించుకుని శరీరాన్ని పరిపాలిస్తుంది. (3-4)

"ప్రాణం" తన అంశతో నలుగురు సహాయకులను సృష్టించుకుని , అపానం, సమానం, వ్యనం, ఉదానం అనే నలుగురు, శాఖా బాధ్యతలు అప్పజెప్పింది. అపానం బాధ్యత విసర్జన క్రియ, జీవోత్పత్తి , సమానం కి జీర్ణక్రియ, వ్యనం కి రక్తప్రసరణ క్రియ, ఉదానం కి తిరోగమన క్రియ అప్పజెప్పి ముఖ్యమయిన శ్వాసక్రియ దానికి కావాల్సిని కళ్ళు చెవులు ముక్కు (చక్షు శ్రోత్రే ముఖ నాసికాభ్యం ) తన పరిధిలో  ఉంచుకుంది "ప్రాణం". (3,5) (3,6) (3,7)

"సమానం" కి ఉన్న శాఖ జీర్ణక్రియ. తనకు హోమాగ్ని లాగా అర్పించబడిన ఆహారాన్ని తీసికుని పోయి ఏడు  జ్వాలలను ఉత్పత్తి చేసి ఏడు ఇంద్రియాలకు శక్తిగా ఇస్తుంది (2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నాలిక )

"వ్యానం " శాఖ  రక్త ప్రసరణం. ఆత్మ హృదయంలో ఉంది. ఈ హృదయంనుండి 101 నాడులు వస్తాయి (నాడీ నామ్ ఏతత్ ఏకశతమ్ ). వాటిలో ఒక్కొక్క దానికీ నూరు శాఖా నాడులు ఉన్నాయి. ప్రతి శాఖా నాడికీ 72000 ఉపనాడులు ఉన్నాయి (సహస్రాణీ ద్వాసప్తతి:). వీటిల్లో రక్త ప్రసరణక్రియ   "వ్యానం "నిర్వహిస్తుంది. (3-6)

"ఉదానం" స్థానం ఊర్ధ్వ భాగం. దీని శాఖ తిరోగమన క్రియ. మనం పడంది తింటే విసర్జన ద్వారా బయటికి పంపుతుంది. ప్రాణాన్ని సరి అయిన లోకాలకు చేర్చటం కూడా దీని పనే. పైకి వెళ్ళే ముఖ్యమైన నాడి  "సుషుమ్న" నాడి ద్వారా ఉపాసన చేసిన వారిని "ఉదానం" బ్రహ్మ లోకానికి తీసుకు వెళ్తుంది. మిగతా నాడులు మిగతా వారిని వారి వారి ప్రారబ్ధ కర్మ ప్రకారం, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి , పాపం చేస్తే నరకానికీ తీసుకు వెళ్తాయి. రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి తీసుకు వెళ్తాయి (పాప ముభాభ్యామేవ మనుష్యలోకమ్ ). (3-7)

సూర్యుడే బాహ్య రూపంలో "ప్రాణం". పృథ్వి బాహ్య రూపంలో"అపానం". అంతరిక్షం బాహ్య రూపంలో "సమానం". వాయువు బాహ్య రూపంలో "వ్యానం "  (3-8)

శరీరంలో అగ్ని తత్త్వం వెళ్ళి పోయినప్పుడు అన్ని ఇంద్రియాలూ మనస్సులో లీనమయి పోయి ఇంకొక జన్మలో మరల బయటికి వస్తాయి. (3-9) 

మరణం సమయంలో అయిదు ప్రాణులూ ఏకమవుతాయి. అందుకనే జీర్ణక్రియ లాంటివి జరుగవు. ఈ సమైఖ్య  "ప్రాణం ", మనిషి కోరిన చివరి సంకల్పం ప్రకారం దాని స్ధానానికి వెళ్తుంది.      (3-10)

ఎవరైతే "ప్రాణం" గురించి అర్ధంచేసుకుని ఉపాసన చేస్తారో అతని సంతతి ఎన్నటికీ నశించదు, బ్రహ్మ లోకానికి వెళ్తాడు. (3-11) 

ఫల శృతి:

"ప్రాణం" ఎలాపుట్టింది? శరీరంలోకి ఎలా వచ్చింది? శరీరంలో ఎక్కడ ఉంది? ఎలా పరిపాలిస్తోంది? ఐదుగా ఎలా విభజించుకుంది ? ఇవన్నీ తెలుసుకుని ఉపాసన చేసిన వ్యక్తి అమరత్వం పొందుతాడు. (3-12)

నా మాట :

మొదట ఈ అధ్యాయం క్లిష్టంగా కనపడుతుంది గానీ రెండుమూడు సార్లు చదివితే తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

సూక్ష్మంగా చెప్పాలంటే "ప్రాణం" మానవ శరీరంలోకి  ప్రవేశించి, శరీర దైనందిన కార్యక్రమాలకోసం, తనకుతాను అయిదు భాగాలుగా విభజించుకుని, జీవి చేత ప్రారబ్ధ కర్మ ప్రకారం "మానవ జన్మ" అనే శిక్ష అనుభవింప చేసి చివరకి "సుషుమ్న" నాడి ద్వారా నిష్క్రమిస్తుంది. 

ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన శాలలో రోజూ ఇటువంటివే ముఖ్యమయిన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. 

అది ఏమిటి? ఎలా వచ్చింది ? ఏమి పనిచేస్తుంది? మనకేమి ఉపయోగం? ఎట్లా పోతుంది?     అనేవి.

ఎన్నో వేల ఏళ్ళ  నాటి క్రింద భారత దేశంలో మన పూర్వికులు ఈ పంధాలో ఆలోచించారంటే నిజంగా మనకి మనం మెచ్చుకోవాలి గర్వపడాలి.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:

ఉపనిషత్ లు  

Tuesday, November 16, 2021

182 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 3 (Prasnopanishad )

ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, శైబ్య సత్యకామ, సుకేశ భరద్వాజ పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రాహ్మని  సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది  అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

రెండవ అధ్యాయం మొదటి మంత్రం.

అధ హైనం భార్గవో వైదర్భి: పప్రచ్చ  : ఆ తర్వాత విదర్భ దేశానికి చెందిన భార్గవుడు అడిగాడు 

భగవన్కత్యేవ దేవాః ప్రజాం విధారయన్తే ?  :  ఏ దేవతలు ఒక వ్యక్తికి స్థితికారకులు  

కతర ఏతత్ప్రకాశయన్తే ?  :   వారిలో ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు 

కః పునరేషాం వరిష్ఠ ఇతి  :  వారిలో ఎవరు శ్రేష్ఠులు అని            ( 2-1)

కబంధీ కాత్యాయనుడి మొదటి  ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పిన తర్వాత భార్గవుడు రెండవ ప్రశ్న వేశాడు. ఏ దేవతలు ఒక వ్యక్తి జీవించటానికి కారకులు ? వారిలో ఎవరు శ్రేష్ఠులు అని.

భార్గవుని ప్రశ్నలో  దేవతలు అనే పదం వాడారు కానీ ఆయన ఉద్దేశం ఒక వ్యక్తి లో ఉన్న ఇంద్రియాలు పని చేయటానికి ఎవరు కారకులు, వారిలో ఎవరు గొప్ప అని. మనం దీన్ని ఉదాహరణకి మనకు తెలిసిన  జ్ఞానేంద్రియాలు అని అనుకుందాము. జ్ఞానేంద్రియాలు లేక పోతే మనిషికి ఒక స్థితి అంటూ ఉండదు. 

మనం ఇంకో ఉదాహరణకి కన్ను తీసుకుంటే, కన్ను ఒక గాజు ముక్క, తన పని అల్లా కాంతికిరణాలని వెనకాల ఒక తెరమీదికి చేర్చటమే. మనము ఆ కిరణాల సముదాయాన్ని గుర్తించటం అనే పని ఇంకొక చోట, మనము చూడలేని చోట, జరుగుతుంది. మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఈ విధంగానే పని చేస్తాయి.  

వేల సంవత్సరాల క్రిందట ఈ ప్రశ్న వచ్చిందంటే నిజంగా గొప్పే. ఏ సమాధానం కనపడని  ప్రశ్నలకి మనకు కనపడని  దేవతలు చేస్తున్నారు అనుకోవటం నా ఉద్దేశంలో సహజమే.

రెండవ అధ్యాయం రెండొవ  మంత్రం.  (2-2)

తస్మై స హోవాచ  : అతడితో పిప్పలాద చెప్పాడు 

ఆకాశో హ వా ఏష దేవో వాయురగ్నిరాప:  : ఆకాశం వాయువు అగ్ని నీరు   

పృథివీ వాజ్ఞ న శ్చక్షు: శ్రోత్రం చ  :  పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు 

తే ప్రకాశ్యాభివదన్తి  :  దేవతలు వాటి పనిని గురించి గొప్పల చెప్పుకుంటున్నాయి 

వయమే తద్బాణ మవష్టభ్య విధారయా మః  :  శరీరం కలిపివుంచి మేమే శరీరాన్ని భరిస్తున్నాము      

మొదట ఆకాశం వాయువు అగ్ని నీరు పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు ఇవన్నీ శరీరాన్ని కలిపివుంచి శరీరాన్ని భరిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని పిప్పలాదుడు చెప్పారు.

నిజ జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం , వారే (సంసారం) అంతా భరిస్తున్నా రంటారు.

 తాన్వరిష్ఠ:  ప్రాణ ఉవాచ  : వాటిలో శ్రేష్ఠమైన ప్రాణం అన్నది 

మా మొహమా ప ద్యధాహ  మేవై : ఎవరుగొప్ప అను భ్రాంతి లో పడకండి   (2-3)

కానీ  మధ్యలో "ప్రాణం" వచ్చి నన్ను నేనే ఐదుగా విభజించుకుని ఈ శరీరాన్ని స్థంబం లాగా నిలబెడుతున్నాను. ఇంకొకళ్ళు గొప్ప అనే భ్రాంతి లో పడవోకండి అని అన్నది. కానీ  ఆ దేవతలు నమ్మలేదు అని చెప్పారు.

అందుకని "ప్రాణం" ఊర్ధ్వ దిశగా వెళ్ళిపోదామని బయలు దేరింది.  జ్ఞానేంద్రియాలలో  "ప్రాణం" ఉన్నది కాబట్టి అవి కూడా ప్రాణంతో వెళ్ళటానికి సిద్దమైనాయి. మరల "ప్రాణం" తన యధాస్థితికి వచ్చిన వెంటనే అవి గూడావాటి యధాస్థితికి  జేరినాయి. అందుకని అన్నిటికన్నా ప్రాణమే శ్రేష్టమైనది అని పిప్పలాదులు అన్నారు.

నా మాట:

నిజ జీవితం లో కూడా ఏది ముఖ్యమో ఎవరు ముఖ్యమో గమనించకపోతే కాపురాలూ, కంపెనీలూ పేక మేడల్లాగా కూలిపోతాయి. అటువంటప్పుడే  "ప్రాణం" లాగా ఎవరో వచ్చి మేలుకొలిపి రక్షిస్తూ ఉంటారు.

మన దేహం లో అగ్ని లేకపోతే శక్తి లేదు. నీరు లేకపోతే తిన్న ఆహారం జీర్ణం అవదు. వాయువు లేకపోతే మన శ్వాస లేదు. అల్లాగే మిగతా దేవతలన్నీ "ప్రాణ" ప్రేరేపణతో పనిచేసేవే.

ఈ రెండో అధ్యాయం లో మిగతా విశ్లేషణ అంతా "ప్రాణ" స్తుతి. అది ఎంత గొప్పదో చెబుతారు. మనిషిలో ప్రాణం లేకపోతే ఏమిజరుగుతుందో మనకందరికీ తెలుసు.

Sunday, November 7, 2021

181 ఓ బుల్లి కథ -- "ఎమిగ్డలా" (Amygdala) అరుస్తోంది

 

పై బొమ్మ మైక్రోసాఫ్ట్ పెయింట్ తో చెయ్యటం జరిగింది.

మన జ్ఞానేంద్రియాల నుండి  బయలు దేరిన సంకేతాలు మొదట వెన్నెముక (spinal card ) దగ్గరకి వస్తాయి. అక్కడ వెంటనే  చెయ్యాల్సిన పని ఉంటే అది కానిచ్చి మెదడులో థలామోస్  (Thalamus ) అనే చోటుకి జేరతాయి. ఉదా : మనం వేడి పెనం మీద చెయ్యి పిట్టామనుకోండి వెంటనే తీసేస్తామే, ఆ సంకేతం చేతికి వెన్నెముక (spinal cord ) నుండి వస్తుంది. ఆ తరువాత అది థలామస్ కి కూడా వెళ్తుంది.

థలామోస్ ఆ సంకేతాల్ని వెంటనే రెండు చోట్లకి పంపిస్తుంది , "ఎమిగ్డలా" (Amygdala) కి కార్టెక్స్ (cortex ) కి. 

"ఎమిగ్డలా" (Amygdala), ఆ సంకేతాలు లో ఏవన్నా అపకారం చేసేవి అని తాను అనుకుంటే వెంటనే  అవయవాలకు ఆజ్ఞలు జారీ చేసి ఆ పని ఆపమని చెప్పి చేయిస్తుంది. దీనిని fight flight  or freeze (FFF ) response  అంటారు. ఎదో ప్రమాదం జరగబోవచ్చని భావిస్తుంది కానీ అది నిజంగా జరుగుతుందో లేదో దానికి తెలియదు. "ఎమిగ్డలా" (Amygdala) గాబరా పడి  చేసే ఇటువంటి పనులు చాలా వరుకు జరగవు కానీ మనము "ఎమిగ్డలా" (Amygdala) ప్రేరేపణతో బాధ పడాల్సి వస్తుంది.

చాలా వరకు ఇటువంటి పనులని Obsessive Compulsive Disorder (COD ) అంటారు. మనం ఎదో చెయ్యకపోతే ఏమవుతుందో అనే బెంగతోనో భయంతోనో చెయ్యవలసి వస్తుంది. ఇవన్నీ "ఎమిగ్డలా" (Amygdala) పిలిస్తే (నుంచి) వచ్చిన ఆజ్ఞలు. COD చాలా రకాలుగా వస్తుంది, worry (what could go wrong and  potential outcomes), obsessions are another kind of obsessive thinking may involve repetitive thinking (Bruce may continuously thinking everyday that he may not complete his degree although he gets good grades),Perfectionism (people worry about what they do is not perfect), Compulsions ( repetitive behaviors or mental acts that a person engages into respond to a dreaded thought or situation or to reduce distress).

(COD ) ఈ "ఎమిగ్డలా" (Amygdala) చేసే తప్పుల వలన వస్తుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. దీనివలన వచ్చేవి anxiety (బెంగ,ఆరాటం, ఆందోళన, చింత), worry (చింతించటం, దుఃఖించటం వగైరా ). మనము కొన్నిపనులు భవిష్యత్ లో జరుగుతయ్యో జరగవనో అని బాధపడుతూ వుంటాము (ఉదా : పెళ్లవుతుందా లేదా, పాస్ అవుతామా లేదా , ఆ అమ్మాయి నన్నుచేసుకుంటుందా? మొదలయినవి ). ఈ పనులు కొన్ని భవిష్యత్ లో జరగచ్చు జరగక పోవచ్చు. మనకి తెలియదు. వాటి  కోసం బాధపడుతూ చింతిస్తూ ఏవో చేస్తూనే ఉంటాము.

ఈ  "ఎమిగ్డలా" (Amygdala)  అరుపుల్ని ఆపడం ఎట్లా? మనస్సుకి తనకి తాను మార్చు కునే గుణం ఉంది కాబట్టి (neuroplasticity ) ఇది సాధ్యము. 

మొదట ఇవి  "ఎమిగ్డలా" (Amygdala) నుంచి వస్తున్నాయని గుర్తించటం. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనస్సులో ఇంకొక మంచి ఆలోచన తెచ్చుకుని ఆ పాత ఆలోచనని పోగొట్టటం. నిద్రలేమి కూడా ఈ ఆలోచనలకి కారణం కావచ్చు. Mindfulness, మెడిటేషన్, ఒకే వ్యాపకం మీద మనస్సుని కేంద్రీకరించటం చేస్తే కొంచెం ఉపశమనం పొంద వచ్చు.(మన మనస్సు ఏ ఒక సమయంలో అయినా వందల ఆలోచనలతో ఉంటుంది) . బాధలు ఎక్కువగా ఉంటే వైద్యులను కలవటం మంచిది. మన దేశంలో ప్రచారంలో ఉన్న సూర్య నమస్కారాలు, పూజ, ధ్యానం, జపం లాంటివి కూడా ఏకాగ్రతతో చేస్తే ఫలితం కనిపించవచ్చు.

నేను మన "Mind " ఎల్లా పనిచేస్తుందో తెలుసుకోవటం కోసం పుస్తకాలు చదువుతాను. చాలామంది శాస్త్రజ్ఞులు ఈ అంశం మీద పనిచేయటం మూలంగా కొత్త సంగతులు ఎప్పుడూ  వస్తూ ఉంటాయి. మొన్న ఈ సంవత్సరం ముద్రించిన క్రింది పుస్తకం లైబ్రరీ లో కనబడితే COD గురించి చదివాను. ఆ పుస్తకం వ్రాసిన వాళ్ళు ఇద్దరూ  licensed clinical psychologists. మీరు అమెరికాలో ఉంటే ఈ పుస్తకం చదవాలనిపిస్తే లైబ్రరీ లో అడిగితే తెప్పిస్తారు. దీని ఖరీదు $18.95.

Rewire Your OCD Brain (2021) 

(Powerful Neuroscience-Based Skills to Break Free from Obsessive Thoughts and fears)

by Catherine M. Pittman, PhD and William H. Youngs, PhD
Newharbingerpublications
www.newharbinger.com


Monday, November 1, 2021

180 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 2 (Prasnopanishad )

బ్రహ్మ నిష్ఠా గరిష్టు లైన ఆరుగురు శ్రోత్రియులు సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ  గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ  కాత్యాయన, గురువు గారికి సరి అయిన కానుకలతో పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.

ఇక్కడ గమనించవలసినది ఎవరో వచ్చి ప్రశ్నలడిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత గురువుగారికి లేదు. పోనీ తాను చెబితే వాళ్ళకి తెలుస్తుందా లేక కంఠశోష మాత్రమే అవుతుందా అనేది గురువుగారికి తెలియదు. అందుకనే మీరు ఒక సంవత్సరం ఆశ్రమ నియమాలు పాటిస్తూ తన ఆశ్రమంలో ఉన్న తర్వాతే సందేహాలకి సమాధానాల సంగతి చూస్తాను అంటాడు గురువుగారు.

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు.

భగవన్కుతో హ వా ఇమాః  ప్ర జా: ప్రజాయన్తీ ఇతి   :  (1-3)

భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

కాత్యాయన ప్రశ్నకి గురువుగారు క్రింది మంత్రాలలో సమాధానం చెబుతారు.

ప్రజాకామోవై  ప్రజాపతి:  :  ప్రాణులను సృష్టించ దలచి  ప్రజాపతి 

స తపః అతప్యత  :   తపస్సు చేశాడు 

స తపః తపస్తప్యా స మిథునం ఉత్పాదయతే :   తపస్సు తరువాత జంటను సృష్టించాడు  

రాయించ ప్రాణం చేత్యేతౌ  మే  బహుధా ప్రజా: కరిష్యత  ఇతి :  రయిని, ప్రాణాన్ని (సృష్టించి) ఈ రెండూ నాకోసం అనేక జీవాల్ని  ఉత్పత్తి చేస్తాయి అనుకున్నాడు.  (1-4)

ప్రాణకోటి ఎల్లా పుట్టింది అనే కాత్యాయన ప్రశ్నకి గురువుగారు ప్రజాపతి తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించి, మూల ప్రకృతిగా (అనేక జీవుల పుట్టుకకు) దోహదపడుతుంది అని చెబుతారు. 

ఇక్కడ ప్రజాపతి అంటే ఎవరోకాదు విష్ణుమూర్తి సృష్టించిన బ్రహ్మ.  (ముండక ఉపనిషత్)

ఈ మంత్రం అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం కానీ ప్రయత్నిద్దాము. "ప్రాణం" అనే దానికి శక్తి  ఉత్పాదించేది  అనే అర్ధం చెప్పుకుంటే, శక్తిని ఉపయోగించేది  "రయి "  అవుతుంది. ప్రపంచంలో మనం చూసేవన్నీ జంటలు. సూర్యుడూ చంద్రుడూ, మగా ఆడా, పగలూ రాత్రీ, పుట్టుక చావు, తయారుచేసేవి తినేవి. 

ఉదాహరణకి సూర్యుడూ చంద్రుడూ తీసుకుందాము. సూర్య కాంతి లేనిది చంద్ర కాంతి లేదు. పగలూ రాత్రీ లేదు. శక్తి నిచ్చేది సూర్యుడు శక్తిని తీసుకునేది చంద్రుడు . వీటినుండి కాలమానం ఎల్లా వచ్చిందో చూడండి.

సూర్యుడు చంద్రుడూ తిరిగితే కానీ ఒక రోజు, 24 గంటలు పూర్తవదు. ఈ జంట వలన మనము కాలం గుర్తించి  రోజులు గుర్తించ గలుగుచున్నాము, పూర్ణమి అమావాస్య, ఉత్తరాయణం దక్షిణాయనం, కృష్ణ పక్షం శుక్ల పక్షం. వీటినుంచి ఋతువుల క్రమం కూడా గుర్తించాము.  ఇంతెందుకు మనం మన రోజూ దిన చర్య మొదలుకుని అంతా వీటి చుట్టూతా తిరుగుతాము.  

ఇంకో ముఖ్య ఉదాహరణ ఆడా మగా. వీళ్లిద్దరూ కలియక పోతే  మానవ జన్మ ఉండదు. భూమిమీద  మనుషులు కూడా ఉండరు.

అన్నం వై ప్రజాప్రతిస్తతో హ వై తద్రేతస్తస్మాదిమః  ప్రజా: ప్రజాయంత ఇతి   (1-14)

ఆహారమే ప్రజాపతి. అన్నం నుంచే మనుష్య బీజం ఉత్పత్తి అవుతుంది. ఆ బీజం నుండే మనుష్య సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది. (ఇక్కడ అన్నం అంటే తినే ఆహారమని అర్ధం)

శుక్రశోణిత సంయోగమేవ సృష్టి:  : స్త్రీ పురుషుల నుండి శుక్ర శోణిత బీజాలు కలిస్తే సృష్టి జరుగుతుంది.

వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

నా మాట: మనంజీవించటానికి సూర్య చంద్రులు చాలాముఖ్యం. అందుకనే సూర్యనమస్కారాలు వచ్చాయి. మనం నమస్కారాలు చెయ్యవలసిన అవసరం లేదు సూర్య దేవు డేమీ బాధపడడు. కానీ జీవితంలో మనకు సహాయం చేసిన వారినీ చేస్తున్న వారిని గుర్తించటం మన సభ్యత భాద్యత కూడా.

కాలం సృష్టించిన సూర్య చంద్రులు వందేళ్ల క్రిందటా ఇలాగే ఉన్నారు వందేళ్ల తరువాత కూడా ఇలాగే ఉంటారు. వారు సృష్టించే ఈ కాలంలో అరిగిపోయి ఒరిగిపోయేది మనమే . 

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

Six pundits reached the Ashram of  Rishi Pippalada and requested him to clear some doubts they gathered during their philosophical journey. Pippalada suggested to them that they should stay with him for an year and then if they ask he may tell if he know the answer to those questions. 

The year went by and the first question came from Kathyayana about the theory of creation, how the creatures were born ?.  

To that question the guru replied, Lord Vishnu created Prajapathi(Brahma) and assigned the duty of creating the world. Prajapathi meditated on this assignment and produced a pair "Rayi" and "Prana"to create the world.

That is why every significant thing in this world comes in pairs. Ex: Sun and Moon, Male and Female.

Without Sun and Moon there is no concept of time, Year, month and seasons.

Without Male and Female there is no human beings.

ఇంకా మీరు చదివి తెలుసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ లు ఉపయోగ పడతాయి.

ప్రశ్నోపనిషత్

ఉపనిషత్తులు