Wednesday, August 26, 2015

117 ఓ బుల్లి కథ 105 --- అమెరికా లో ఓ సమ్మర్ వీకెండ్

టాంక్ యోధులు 
సమ్మర్ అయిపోవస్తోంది. సెప్టెంబర్ రాబోతోంది ఇంక చలికి స్వాగతం, మనం చెప్పినా చెప్పకపోయినా అది వస్తుంది. వెచ్చదనం వెళ్ళే లోపల మనం చెయ్యాలనుకున్న పనులు చేసెయ్యాలి. కాలం మనకోసం ఆగదు కదా. మేము ఈ వీక్ ఎండ్ లో మూడు పనులు సక్సెస్  ఫుల్ గ చేశాము.

 Rose Garden  గులాబీలు  
భోజన ప్రియులు 
మొదటిది కాన్టీని పార్క్ పిక్నిక్(contigny park ఇది ఫ్రెంచ్, పేరు లో ఉన్న "g" పలకదు). పై ఫొటో అక్కడ తీసిందే. పార్క్ చూడంగానే పెద్ద పిల్లలు చిన్న పిల్ల లవుతారు. ఈ కాన్టీని పార్క్ ఒకప్పుడు Colonel Robert R. McCormick ఎస్టేటు. ఇది అయిదువందల ఎకరాల విశాలమయిన స్థలం. ఆయన Chicago Tribune అనే పత్రికకి ఎడిటర్.  ఇక్కడే ఉండి ఆయన 40 మైళ్ళ దూరాన్నున్న చికాగో ఆఫీసు కి రోజూ వెళ్ళి వస్తూ ఉండేవాడు. పొద్దున్న 8 గంటలకి ఇంట్లో బయలు దేరి ఆఫీసుకి 8:15 కల్లా జేరుకునేవాడుట. మనలాంటి వాళ్ళకయితే ఇది కొంచెం కష్టం. కానీ ఆయనకి ఎస్టేట్ లో ప్లేన్ ఉండేది, రన్వే ఉండేది. ఆయన చనిపోయేటప్పుడు   ప్రజల కోసం ఈ ఎస్టేట్ ని ఉపయోగించమని చెప్పి పోయాడుట.
వైకుంఠ పాళీ ఆటగాళ్ళు 

పిల్లల కేక్ కట్టింగ్  

ఆయన దాయాదులు ఈ స్థలంలో ఒక పార్క్, ఒక గల్ఫ్ కోర్స్ కట్టి వాటికి ఆయన వరల్డ్ వార్ 1 లో ఫ్రాన్స్ లో పోరాటం చేసిన ఊరు పేరు పెట్టారు. అల్లాగే వార్ కి సంబంధించిన మ్యుజియంలు కట్టారు. పిల్లలు ఆడుకోవటానికి యుద్దం లో వాడిన టాంక్ లు తీసుకు వచ్చి పెట్టారు. పార్క్ చాలా పెద్దది (29 ఎకరాలు ). ఒకపక్క పిక్నిక్ లు చేసుకోవటానికి పెద్దస్థలమూ, పక్కన కార్ పార్కింగ్ కి స్థలమూ. ఇంకా ఈ పార్క్ లో ఉన్నవి పెద్ద Rose Garden, ఒక  పెద్ద సరస్సు (ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు). పార్క్ అంతా రకరకాల పూలు, చట్లతో కళకళ లాడుతూ కనువిందుగా ఉంటుంది. నడవలేని వాళ్ళకి ట్రాలీ లో ఎక్కించి పార్క్ అంతా తిప్పుతారు. ఇక్కడ ఉన్న ఆయన నివాసం కూడా ఒక మ్యూజియం లాగా చేసి టూర్స్ ఇస్తున్నారు.
పిక్నిక్ సూత్రధారులు 
మేము పార్క్ తెరవంగానే పొద్దున్న పది గంటలకల్లా వచ్చేశాము. ఒక చెట్టుకింద స్థలాన్ని చూసుకుని సామాను పెట్టేసి పార్క్ చూడటానికి వెళ్ళాము. ఒంటి గంటకి భోజనం. సామాన్యంగా ఇటువంటి వాటిల్లో మగవాళ్ళ జోక్యం ఉండదు. భోజనం లో  ఏమి పెట్టాలి ఎవరు ఏమి చేసి తీసుకు రావాలి అనేవి ఆడ వాళ్ళే నిర్ణయించుకుంటారు. భోజనం అయిన తరువాత ఆడవాళ్ళూ పిల్లలూ వైకుంఠ పాళీ ఆడారు. ఇంతలో పెళ్ళి కెళ్ళి లంచ్ మిస్ అయిన రమ, రాజు గారు కేక్ పట్టుకు వచ్చారు. ఆరోజు మా గ్రూప్ లో రెండు యానివార్సరీలు, ఒకళ్ళకి పెళ్ళయి 31 ఏళ్ళు  ఇంకొకళ్ళకి 15 సంవత్సరాలు. కేక్ ని మా గ్రూప్ లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు కట్ చేశారు. ఇంతలో సాయంత్రం అయిపొయింది ఎవరిళ్ళకి వాళ్ళం బయల్దేరాము. నాకయితే ఇన్ని గంటలు పార్క్ లో కూర్చోటం ఇదే మొదటి సారి.



రెండవ పని మా ఇంటి దగ్గరలో ఉన్న Fermi Lab కి స్నేహితులని తీసుకు వెళ్ళటం నాకొక అలవాటు.  నేను అక్కడకి  ఎన్ని సార్లు వెళ్ళానో చెప్పలేను. నేను చూసి నచ్చిన వాటిని అందరికీ చెబుతూ ఉంటాను. నాకు వీలయితే అక్కడికి తీసుకువెళ్ళి చూపెడతాను. మోహన్  Fermi కి వెళ్దాము వస్తారా అంటే తప్పకుండా అని బయల్దేరాము. నా కెందుకో Fermilab అంటే చాలా ఇష్టం. ప్రపంచం లో దేశ దేశాల నుండీ పరిశోధనలు చెయ్యటానికి వచ్చిన ఒక వెయ్యి మంది ఇక్కడ రాత్రిం బవళ్ళు పనిచేస్తూ  ఉంటారు.

Fermi అంటే Enrico Fermi, University of Chicago లో Atomic Chain Reaction ని సాధించిన ఆయన. చికాగో దగ్గర Batevia అనే ఊళ్ళో కట్టిన particle physics and accelerator laboratory కి ఆయన పేరు పెట్టారు. మోహన్ చెప్పినట్లు హైస్కూల్ ఫిజిక్స్ పుస్తకాల్లో దీనిని గురించి ఒక లైన్ ఉంటుంది. CERN వాళ్ళ The Large Hadron Collider (LHC) రాకముందు Fermilab Tevatron ప్రపంచెం లో చాలా పెద్ద Collider.

సూక్ష్మంగా చెప్పాలంటే Fermilab, మన ప్రపంచములో atom కన్నా చిన్నవాటిని కనుక్కోటానికి పెట్టిన పరిశోధనాలయం. ఇక్కడ  చేసే పని చాలా సింపుల్ గ కనపడుతుంది కానీ చాలా క్లిష్టమయినది. ఈ పరిశోధనల కోసం భూమి కింద ఒక సొరంగం తవ్వి paticles (atoms, protons మొదలయినవి ) పరిగెత్తటానికి ఒక పెద్ద enclosed racetrack లాంటిది కట్టారు. దీనిలోనికి కొంత స్పీడ్ లో protons ని పంపిస్తారు. ఒక రౌండ్ తిరిగిన తరువాత వాటిని magnetic field తో ఒక తన్ను తంతారు. అప్పుడు అవి ఇంకొంచెం ఎక్కువ స్పీడ్లో పరుగెడుతాయి. తన్ని నప్పుడల్లా స్పీడ్ పెరుగుతుంది. అల్లా తన్నులు తిని తిని మంచి స్పీడ్ వచ్చినప్పుడు వాటికి అడ్డంగా ఏదైనా పదార్ధం పెడుతారు. మాంచి స్పీడ్లో వస్తున్న protons తగిలే సరికి ఆ పదార్ధం ముక్కలు ముక్కలవుతుంది. ఇంక మిగిలింది  పగిలిన ముక్కల్లో చిన్న ముక్కని కనిపెట్టటం. ఆ ముక్కలలో atom కన్నా చిన్న ముక్కలున్నయ్యేమో నని వెతుకుతారు. atom కన్నా చిన్న వైన ఆరు quarks లో, top quark, bottom quark ఇక్కడ కనుగొన్నారు. ఇప్పుడు ప్రపంచం లోకల్లా పెద్దది, యూరప్ లో పెట్టిన, The Large Hadron Collider (LHC) లో protons పరిగెత్తే racetrack Fermilab Tevatron కన్న పెద్దది. అందుకని అవి ఎక్కువ స్పీడ్తో పరిగెత్తి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ మైన ముక్కలని చెయ్యగలదు. మీరు వినే ఉంటారు, క్రిందటి సంవత్సరం boson అనే atom కన్న చిన్న పదార్ధాన్ని ఇక్కడ కనుగొన్నారు.

పిల్లలకి Fermilab లో జరిగే సంగతులు చెప్పటానికి Lederman Science Center అని ఒక దాన్ని కట్టారు. ఇక్కడ పిల్లలూ పెద్దలూ paricle ఫిజిక్స్ లో చిన్న చిన్న experiments చెయ్య వచ్చు. వీలయితే మీరు తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడండి.
The Leon M. Lederman Science Education Center houses hands-on exhibits for ages 10+, technology and science labs, a store and the K-12 Teacher Resource Center. Educators who have attended workshops may bring their students here for field trips. Science Adventures classes for all ages take place at the Lederman Science Center.

మూడవ పని మా ఇంటి తోటకి సంబంధించినది. మా తోటలో ప్రతి సంవత్సరం లాగా దిగుమతి రాక పోయినా మాకు కావలసిన దాని కన్నా ఎక్కువ పండాయి. అందుకని స్నేహితులని పిలుస్తాము. ఒకరకంగా Garden Party లాంటిది. Garden లో పండినవి పంచుకోవటం ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం తోటకూర చాలా వచ్చింది. Italian Beans, బీరకాయలు చాలా వస్తున్నాయి. బోలెడన్ని థాయ్ మెరపకాయలు కాశాయి. కీరా దోసకాయలూ టమేటాలు బోలెడన్ని. కానీ కొన్ని మొక్కలు చాలా తక్కువ కాశాయి. yellow squash రెండు కాయలు వచ్చాయి. వంకాయలు మూడంటే మూడు వచ్చాయి. జుకినీ కి ఉన్న పెద్ద పెద్ద ఆకులు వంకాయ చెట్టుకు ఎండ తగలకుండా మూసేస్తున్నాయి. అందుకని ఆకులు కట్ చేశాము. దానితో జుకినీ చచ్చి కూర్చుంది. హైస్కూల్ సైన్స్ మర్చిపొయాము. ఆకులలో ఉన్న పత్రహరితము సూర్యరస్మితో కలిసి కదా మొక్క తన ఆహారం తయారు చేసుకునేది. అందుకనే జుకినీలు నాలుగే వచ్చాయి. సొరకాయలు అసలు రాలేదు. కొత్తిమెర వేద్దామనుకున్నా గానీ డాలరికి నాలుగు కట్టలు వస్తుంటే ఎందుకులే అని వేయలేదు. మొన్నీ మధ్యన కట్ట రెండు డాలర్లయింది. నాలిక కరుచుకున్నాను. ఈ సమ్మర్ లో మెక్సికో నుండి వచ్చే కొత్తిమెరలో మలినాలున్నాయని అమెరికా లోకి రానివ్వ లేదు. మాకు మెక్సికో నుండి చాలా కూరగాయలు వస్తాయి.
మా నాన్నగారు ప్రతి రోజూ పోద్దునపూట పెరటి తోటలో కూరలు కోసుకు వచ్చేవారు. మా అమ్మ ఆ రోజు వంట వాటితో చేసేది. అదే మా ఇంట్లో చేద్దామని ప్రయత్నం. మా ఇంటిలో వంటలు ఈ సంవత్సరం వింటే మీకు నోరువూరుతుంది. అన్నీ తోటలోనుండి కోసుకువచ్చి చేసినవే. తోటకూర పప్పు, తోటకూర(ఎండ బెట్టి) కూర. నేతి బీరకాయ, జుకినీ, దోసకాయ(కీరా) లతో కూర, పప్పు, పులుసు, పచ్చడి.
పచ్చి గ్రీన్ టొమాటో లతో పచ్చడి, పులుసు. Italian Beans తో కూర, వంకాయ తో కలిపి చేస్తే చాలా బాగుంటుంది. లేత బీరకాయలతో కూర (నాకు చాలా ఇష్టం) చాలా సార్లు చేశాం. నేను చేసిందల్లా మొక్కలకి ప్రేమగా నీళ్ళు పోయటం. అప్పుడప్పుడూ వాటికి పాటలు పాడుతూ ఉండటం. మొక్కలకి మ్యూజిక్ చాలా ఇష్టంట. మా ఆవిడ చేసిందల్లా కూరలు కోసుకొచ్చి వంట చేయటం. నిజం చెప్పొద్దూ  వంటలన్నీ మంచి ఫ్లేవర్ఫుల్ గ వచ్చాయి. పెరటి తోట కూరగాయలతో ఎవరు చేసినా వంటలు బ్రహ్మాండంగా వస్తాయల్లె ఉంది.

1. http://www.cantigny.org/
2. Fermilab

Thursday, August 6, 2015

116 ఓ బుల్లి కథ 104 --- పోర్చ్ లైట్



వసంత కాలం వచ్చింది. వింటర్ లో స్నో కి చలికి తట్టుకోలేక వెచ్చదనం లోకి పారిపోయిన పక్షులన్నీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నాయి. అవి ప్రతిరోజూ తెల్లవారు ఝామున 4:30 కి కిచ కిచలతో నిద్దరలేపు తాయి. ఆ కిచ కిచలు కొందరికి  మధుర గానం గా వినపడుతుంది కానీ మా ఇంట్లో కొందరికి దరిద్రపు రోదనలా వినపడుతుంది. ఏది ఏమయినా ఈ శబ్దాలు కిటికీలు వేసుకుని పడుకుంటే తప్ప తప్పవు . నా కయితే మాత్రం ఈ శబ్దాలు మేలుకొలుపుగా ఉంటాయి. నా చిన్నప్పుడు మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున లేచి పద్యాలూ పాటలూ పాడుతుండే వాడు. నాకు అటువంటి పరిస్థుతులు లేవు గనుక శబ్దం చెయ్యకుండా కదలకుండా పడుకుని మనస్సుకి ఏమన్నా మంచి ఆలోచనలు వస్తాయేమోననని ఎదురుచూస్తూ ఉంటాను, కాఫీ పెట్టేవాళ్ళు లేచేదాకా.

ఆరోజు పొద్దున్నే పేపర్ తీసుకుని వస్తుంటే బయట పోర్చ్ లైట్ వింతగా కనపడింది. ఏమిటా అని చూస్తే లాంప్ కి గోడకి మధ్యన పుల్లలు కనపడ్డాయి. ఇక్కడికి అవి ఎల్లా వచ్చాయా అని ఆశ్చర్య పోయాను. సరే చూద్దాంలే  అని వదిలేశాను. కానీ రోజురోజుకీ అవి పెరగటం మొదలెట్టి గూడు ఆకారం వస్తోంది. ఇంట్లో పక్షులు గూడు పెట్టబోతున్నాయని గ్రహించి ఇంకా ఊరుకుంటే లాభంలేదని పుల్లలన్నీ తీసేశాము. ఈ పక్షులు ఇంటి ముందరా ఇంటి వెనకాలా చెట్లు ఉంటే వాటి మీద గూడు పెట్టుకోక ఇంట్లోనే గూడు పెట్టాలా!

ఇంతలో వారంరోజులు ఇల్లు విడిచి న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది ( మా ఆవిడ వెకేషన్ తనతోపాటు నేనూను). తిరిగొచ్చి చూసేసరికి లాంప్ వెనకాల పూర్తి గా గూడు తయారయ్యింది. దానిలో గుడ్లు పెట్టిందేమో, పడగొట్టటానికి మనసొప్పలేదు. దానికి తోడు రోజూ వర్షం. ఎంత పక్షులనైనా వర్షంలో క్రూరంగా ఎల్లా బయటికి నెట్టేస్తాం ? ఇంక పక్షుల రాక పోక లని జాగర్తగా గమనించటం మొదలెట్టాము.

రోజూ ఎప్పుడూ ఒక పక్షి చెట్టు కింద కూర్చుని చూస్తూ ఉంటుంది. పొద్దున్న వాకిలి తలుపు తీయగానే చెట్టుకింద ఉన్న పక్షి  "గాయ్" మంటుంది. ఇంటి బయటికి రాంగానే "గాయ్ గాయ్"  మంటుంది. ఇలా రోజూ తలుపు తీసినప్పుడల్లా జరుగుతుంటే ఏమిటా ఇది అనే ఆలోచన మొదలయింది. ఒక రోజు  తెల్లవారు ఝామున పక్షుల కోడ్ ఒక మెరుపులా తట్టింది. మొదటి అరుపు "గాయ్" డేంజర్ అని చెప్పటం రెండో అరుపు "గాయ్  గాయ్" ఆల్ క్లియర్ అని. ఈ సమాచారం ఆ కాపలా కాసే పక్షి ఎవరికి  చేరవేస్తోందో తెలియదు. అందుకని చాలా జాగర్తగా మసులుకున్నాము. మా రాకపోకలు తప్పుగా అర్ధం చేసుకున్నాయంటే మా మీద ఎన్ని పక్షులు దండెత్తేవో !

ఇలా రోజులు గడుస్తున్నాయి. ఏవో శబ్దాలు, కిచ కిఛలు వినపడుతుంటాయి. ఒకరోజు కిటికీ లోనుండి చూశాను, పిల్లలు అమ్మ చుట్టూ చేరాయి, అమ్మ ఆహారం పట్టుకొచ్చి పిల్లలకి పెడుతోంది. ఫోటోలు తియ్యాలని ఉంది కానీ ఆ మధురమైన తల్లీ పిల్లల మధ్య మాధుర్యాన్ని శబ్దం చేసి చెదరగొట్టటం ఇష్టం లేక పోయింది. తల్లీ పిల్లల మధ్య ప్రేమ ప్రకృతిలో అన్ని జీవులలోనూ ఒకటే. వారం పదిరోజులయ్యింది. పిల్లలు పెద్దవయినాయి. మీరు క్రింద ఫోటోని పెద్దది చేసుకుని చూస్తే  బుజ్జి బుజ్జి పిల్లలు కనపడతాయి.


ఒకరోజు పొద్దున్న మా దివ్య మొక్కలకి నీళ్ళు పోస్తుంటే పక్షి పిల్లలు గబుక్కున రెక్కలు విదిలించుకుని ఎగిరిపోయాయి.


పక్షులు ఎగిరి పోయాక  రెండు రోజులు ఆగి గూడులో ఏమన్నా పిల్లలు ఉన్నాయేమో నని కుర్చీ వేసుకుని ఎక్కి చూశాము. అంతా ఖాళీ. "యమ్టీ నెస్ట్" అంటే ఇదే నెమో. లాంప్ చుట్టూతా శుభ్రం చేశాము. చిత్రంగా ఉంటుంది, పక్షులు గూడుని పకడ్బందీగా ఎంత జాగర్తగా అల్లుతాయో. ఫోటో తీసి దాచి పెట్టుకున్నాము.

మా అదృష్ట మేమిటో , ఈ వసంతంలో ప్రకృతిలో జరిగే మృదు మధురమయిన మహత్తర ఘట్టం మా పోర్చ్ లో జరిగింది.