Sunday, August 29, 2010

26. ఓ బుల్లి కథ 14 -- మీరేమంటారు --

ముందు మాట: ఆగస్టు 25, 2010 న చికాగో ట్రిబ్యూన్ లో  Ask Amy  అనే కాలమ్ లో అడిగిన ప్రశ్న దానికి సమాధానం తెలుగు లో వ్రాస్తున్నాను. ఇది నన్ను ఆకర్షించడానికి కారణం, అమెరికా లో సాధారణ ప్రజల  మనస్తత్వం ఎటువంటిదో చెబుతుంది. 


డియర్ ఎమీ: ఈ మధ్య నేను temporary job లో పనిచెయ్యటం మొదలెట్టాను. నా కంటే బాగా పెద్ద ఆయన గూడా అక్కడ పనిచేస్తున్నారు. కాకపోతే ఆయనది పర్మేనేంట్  పొజిషను. ఆయన చాలా స్నేహముగా ఉంటారు కాని కొంచం తలతిక్క. ఆయన ఈమధ్య నన్ను ఒక షాప్ కు వెళ్ళి కొన్ని తినే పదార్దములు కొనుక్కు రమ్మన్నారు. దానికి ఆయన డబ్బులిస్తానని చెప్పినారు. అల్లాగే నా మధ్యాహ్నపు భోజనం పంచు కుందామని కూడా అన్నారు. నేను వీటన్నిటికీ వప్పుకుని చేశాను.
క్రిందటి వారము నాలాంటి temporary ఇంకొకళ్ళు ఈయనకి భోజనము తీసుకు వస్తుంటే చూశాను. నా ఉద్దేశం లో ఆయనకి శక్తి లేక షాపు దాకా నడచి వెళ్ళటము కష్టముగా ఉన్నటుల కనిపిస్తోంది. ఆయనకి ఆదుకునే దిక్కు కూడా లేనట్లు ఉన్నది.
ఈ పరిస్థితి నాకు కొంచెము బాధాకరముగా ఉన్నది, ప్రతీ వారం ఆయనకోసం బయటకు వెళ్ళి తీసుకు రావాలంటే నాకు కొంచెము కష్టమవుతుంది. దానికి తోడు ఈ విధముగా ఆయన నామీద ఆధార పడి ఉండటం ఆయన కష్టాలకు శాశ్వత పరిష్కారము కాదు.  


ఆయన రొజూ పనిచెబితే నేను ఏమి చేసేది.  మీరు నాకు ఏమి సలహా ఇస్తారు ?.
మన ఈ సంఘము లో వృద్ధులను సంరక్షించుటలో  మన కర్తవ్యములేమిటి?


ఇట్లు, చిన్నపనుల రన్నర్




డియర్ రన్నర్: మీ బాధ నాకు అర్ధమవు తున్నది, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి కానీ ఎంత కాలం. మీరు కొంతకాలం ఈ విధముగా కొనసాగించండి. వారానికి రెండు రోజులు మీరు తెస్తానని చెప్పండి. మీ లాగే మిగతా వాళ్ళు కూడా పని పంచు కునే ప్రయత్నం చేయండి. కానీ సహాయము చేయటం మాన కండి.
మీ పెద్దవాళ్ళను  (grandparents )  గుర్తుకు తెచ్చుకోండి, వారికి కూడా ఈ విధముగానే చిన్నపనులు పెద్దపనులు,  స్నేహితులో, పక్కిన్టివాళ్ళో , దారే పోయేవాళ్ళో ఎవరో అవసరము అయినప్పుడు సహాయము చేస్తూనే ఉంటారు.
చాలా మంది వృద్ధులు భోజనానికి ఇబ్బంది పడుతూ వుంటారు -- మీ ఆఫీసులో స్నేహితుని లాగా, బయటకు వెళ్ళటానికి వీలు లేక,
 సత్తువ లేక. 
మీ ఊళ్ళో ఉన్న "office on aging " ని కనుక్కుంటే వాళ్ళు మీ స్నేహితుని జీవితం కొంచెము సులువయ్యేట్లు చూడ గలుగుతారు. 
సమస్యని పరిష్కరించటానికి ప్రయత్నించి నందుకు ధన్యవాదములు. 


చివరిమాట: మీరేమంటారు ?


మీరు US లో ఉంటే సీనియర్స్ కి సహాయము చెయ్యటానికి State, County, Township and city లెవెల్ లో చాలా సంస్థలు ఉన్నాయి. మీకు నిస్సహాయతతో ఎవరన్నా కనపడితే దయచేసి ఆ సంస్థల తోటి కలపండి. సీనియర్ సర్వీసెస్ అని గూగుల్ చేస్తే నంబర్లు దొరుకుతాయి. ఉదా: Naperville Township కి 'Dial A Ride' ప్రోగ్రాం ఉంది. అల్లాగే 'Meals on Wheels' ప్రోగ్రాం. 'Food Pantry' ప్రోగ్రాం.

Tuesday, August 10, 2010

25. ఓ బుల్లి కథ 13 -- జీవిత చక్రం --

ముందు మాట: ఈ కథకి మూలము హిందూ టెంపుల్ లో వాలంటీర్ గ చేయునప్పుడు తీరిక సమయములో చదివిన ఒక కథ. గుడి లో చదువుటచే  ఏదో వేదాంత  పుస్తకములోనిది అయి ఉండవచ్చును.  ఇందులో (నాకు గుర్తు లేక) పాత్రల పేర్లు, కొంత కథా కల్పితాలు. కానీ భావము మాత్రము మార్చలేదు. 

ధనుంజయుడికి జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్ళిపోవుచుండెను. చేతులారా డబ్బులు సంపాయించు చుండెను.   ఎవ్వరూ తనకి ఉచితముగా ఇచ్చినవి కావు. ఈ మేడలు ఈ మిద్దెలు ఇవన్నీ తన తెలివితేటలతో, తన స్వశక్తి తో, తన ఊహా సంపత్తు తో, కష్టపడి పనిచేయుట వలన వచ్చినవి కనుక తను ఇంకొకళ్ళకి ఉచితముగా దాన ధర్మాలు చెయ్యవలసిన అవుసరము లేదు అని నిర్ణయించు కొనెను. తన తెలివితేటలు ఊహాసంపత్తీ ఎటుల తనకు వచ్చెనో గుర్తించలేక పోయెను. బాలప్రాయమునుండీ సాకిన తలి దండ్రులు, బంధువులు,తనతో ఆటలాడిన మిత్రులు, చదువులు నేర్పిన అధ్యాపకులు, తనకు సౌకర్యములు ఇచ్చుచున్న భార్యా పిల్లలు, వీరెవరు తనకు కానరాలేదు.  

వయసు పెరిగిన కొలదీ తను సంపాయించు  ధనమూ దానితో సంఘము లో గౌరవము పెరుగుతూ వచ్చెను. తనమీద తన తెలివితేటలమీద తనకి పెద్ద నమ్మకము గర్వమూ పెరిగెను. ఇంటిలోనూ బయట ఒకటే పద్ధతి లో ఆలోచన. నా అంత తెలివితేటల వాళ్ళు మీరు కాదు. నేను చెప్పినదే వేదము కనక  మీరు నేను చెప్పినపని చేయవలయును. భార్యా పిల్లలకు, సేవకులకు అందరికీ యజమాని అనిన భయము. 

కాలక్రమేణా పిల్లలు వారి త్రోవన వాళ్ళు వెళ్ళి పోయిరి. భార్య పరమపదించెను. ఒంటరి వాడయ్యెను.  పెద్ద ఇంటిలో  ఉండుట ఖర్చు పని అని ఒక చిన్న ఇంటిలోనికి మారి తన మాటలను శిరసావహించు ఒక సేవకుని మాత్రమే ఉంచుకొనెను. ఆ సేవకుడికి అయ్యగారు చెప్పు పనులన్నియు చేయుట కష్టముగా ఉండెను. పది పనులు చెప్పి అన్నియు అప్పుడే కావలయుననిన జరగని పని. ఆ సేవకుడు కూడా అన్నిటిలోనూ నిష్ణాతుడు కాకపోవటముచే తప్పులు చేయు చుండెను. దానితో యజమానికి కోపము వచ్చుచుండెను. తన ఒక్కడి కొరకు పదిమంది సేవకులను పెట్టుకొనుట ఇష్టము లేదు.ఈ సేవకుని మాన్పించి ఇంకొక సేవకుని పెట్టుకొనుటకు మనసొప్పుట లేదు. కొత్త వానికి మరల తనకు కావలసినవిధముగ పనులు నేర్పుట కష్టము కదా. 

ఒకరోజున మితిమీరిన కోపము వచ్చుటచే సేవకుని పిలిచి చెక్కమీద "I am an Idiot"  అను బోర్డు చేక్కించుకు రమ్మని పంపెను. బోర్డు తెచ్చిన వెంటనే దానికి రెండు వేపుల తాడు కట్టి హారముగా మెడలో వేసుకొనమని చెప్పెను. రోజూ పనికి వచ్చినప్పటి నుండీ వెళ్ళు దాకా ఆ హారమును వేసుకొని పనిచేయు మని చెప్పెను. దీనివలన తన పని సవ్యముగ జరగని యడల తన మనస్థాపము తగ్గునని భావించెను.  

ఈ విధముగా యజమాని సేవకుడు రోజులు గడుపు చుంటిరి. హఠాటాత్తుగా ఒక రోజున యజమాని అస్వస్థకు లోనుకాగా తన కాళ్ళు స్వాధీనము తప్పెను. ఎంత మందికి  చూపిననూ పరిస్థితి మెరుగు పడలేదు. కాల కృత్యములకు కూడా సేవకుని సహాయము కావలసి వచ్చెను. సేవకుడు కూడా నమ్రతగా రోజూ తన హారము వేసుకుని పని చేయు చుండెను. 

యజమానికి ఒక రోజు పట్టరాని కోపము వచ్చి సేవకుని, హారము లోని పదములు చదవ మనెను. సేవకునికి చదువు రాక పోవుటచే తను చదివి దాని అర్ధము చెప్పెను. వెంటనే సేవకుడు తన హారమును తీసి యజమాని మెడలో వేసెను. సేవకుడు తను ఇంక పనిచేయనని వెళ్ళి పోవుచుండగా జీతము రెట్టింపు చేసి తన దగ్గరే ఉండమని బతిమాలెను. రోజూ సేవకుడు వచ్చి హారమును యజమాని మెడలో వేసి తను వెళ్లి పోవు చున్నపుడు తీసివేయుచు యజమాని చనిపోవు వరకూ పనిచేసేను.

 చివరిమాట: జీవిత కాల చక్రములో బండ్లు ఓడలూ ఓడలు బండ్లు గా మారవచ్చును. అందువలన జీవన విధానము లో మానవత్వము చూపక జీవించిన, అనువుగాని సమయమున భంగపాటు తో జీవించ వలసి వచ్చును.   

Tuesday, August 3, 2010

24. ఓ బుల్లి కథ 12 -- లాండ్రోమేట్లో కుస్తీ --

ముందు మాట: లాండ్రోమేట్ అంటే తెలుగులో చెప్పాలంటే  సామూహిక బట్టలుతికే చోటు అని చెప్పొచ్చు లేకపోతే చాకిరేవు అని కూడా అనవచ్చు. 
ఈ క్రింది సంభాషణలు అమెరికాలో ప్రతీ ఇంటిలో ఎప్పుడో  ఒకప్పుడు రాక మానవు (చాకలి మెషీన్లు  ఉన్నా లేకపోయినా ).


" విడిచిన బట్టలు చాలా ఉన్నాయి."
"మన వాషింగ్ మెషీన్ పనిచెయ్యక  పోతే  నైకోర్ వాణ్ని పిలు." బాగు చెయ్యటానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. పిలిస్తే వచ్చి బాగు చేస్తాడు.
"కుదరక వాషింగ్ చెయ్యలేదు. ఒక రోజంతా పట్టేటట్లా ఉంది,  వాషింగ్ కి  drying కి. లాండ్రోమేట్ కి వెళ్తే ఒక గంటలో అవుతుంది"


ఒకప్పుడు అంటే ఇరవై ఏళ్ళ క్రిందట వరకూ రెండు వారాల కొకసారి వెళ్లి బట్టలు ఉతుక్కుని  వచ్చేవాళ్ళం. ఆ రోజు స్పెషల్,  వాషింగ్ అయిన తరువాత అటునుంచి అటే  రెస్టారెంట్ కి  వెళ్లి బ్రేక్ ఫాస్ట్  చేసేవాళ్ళము. ఫామిలీతోటి ఎక్కువసేపు గడపచ్చని,   కావాలని ఇంట్లో చాకలి మేషీనులు కొనలేదు.  తరువాత ఇంటావిడా పిల్లలు నా మీద తిరగపడటం తోటి ఉతుక్కోవటం ఇంట్లోనే పెట్టుకున్నాము. పాత రోజులు గుర్తుకు వస్తే కొంచం బాధగా ఉంటుంది.


"సరే రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు  వెళ్దాము "
"మనింటి దగ్గర లాండ్రోమేట్ మూసేశారు. క్రిందటి సంవత్సరం మీరు వెళ్ళిన చోటుకి వెళ్దాము." క్రిందటిసంవత్సరం మా డ్రయర్ పాడయితే తడి గుడ్డ లన్నీ మోసుకెళ్ళి ఆరబెట్టుకు వచ్చాను.


మర్నాడు చాకలి మూటలు కట్టుకుని కారు లో బయల్దేరాము చాకలి రేవు(లాండ్రోమేట్) కి. బట్టల మూటలు,  ఆవిడని చాకిరేవు ఎదురుకుండా దించి కారు పార్క్ చెయ్య టానికి వెళ్ళాను.వచ్చి చూసేసరికి మెషిన్ లో బట్టలు వేస్తోంది. రుద్రం మోహము లో కనపడుతోంది. మీరు గమనించారో లేదో ప్రళయం ముందు చాలా ప్రశాంతము గా ఉంటుంది. ఒక గంటసేపు నాకు కోపము తెప్పించవోకు నాయనా,  నన్ను నలుగురిలో నవ్వులపాలు చెయ్యకు తండ్రీ అని ప్రార్ధిస్తూ నాకొచ్చిన  మంత్రాలన్నీ చదివేశాను.  


"పార్కింగ్ కి ఇంతసేపు ఎందుకు అయ్యింది?"
"కారు సూర్యుడి ఎదురు లేకుండా  పార్కు చేశాను అందుకు ఆలశ్యమయ్యింది"
"ఇక్కడ డబ్బులు తీసుకోరట నాకెందుకు చెప్పలేదు" ఎదురు కుండా ఎటియం కార్డు లాంటిది కనపడు తోంది.
"అయ్యో నేను చెప్పటం మర్చేపోయాను "
"కార్డు లో డబ్బులు లోడ్ చేశాను, ఈ సోపు వేసి రెండు ఫ్రంట్ లోడర్సు స్టార్ట్ చెయ్యండి".  ఇక్కడ చాకలి మెషీన్లు ఫ్రంట్ లోడర్సు అని టాప్ లోడర్సు అనీ రెండు రకాలు. టాప్ లోడర్సు లో సామాన్యం గ ఒక మూటే పడుతుంది. ఫ్రంట్ లోడర్సు లో ఎక్కువ లోడ్సు వెయ్య వచ్చు. కార్డ్ slot  లో పెట్టి రెండు మూడు సార్లు ప్రయత్నించాను. స్టార్ట్ అవలేదు. నాకు ఈ కార్డులతో చాలా భయం. పెట్రోల్ బంకుల  దగ్గరనుంచీ వాటిని వాడాలి. ఎప్పుడూ వాటితో ప్రోబ్లెంసే. మొన్నే ఎవరో అమెరికాలో పెట్రోల్ బంకుల దగ్గర డెబిట్ కార్డులు వాడద్దని సలహా ఇచ్చారు. ఏమిటో ఎన్ని రకాల కార్డులో. 


"చేతకాకపోతే అటెండరు ని పిలవాలి" అటెండరు ని తీసుకు వచ్చాను. ఠకా  మని రెండు మెషీన్లు స్టార్ట్ అయినాయి. కార్డు పెట్టి గబుక్కున తీసేయ్యాలాట. రెండు అయిదు డాలర్లు లాగేసుకుంది.  ఇంత డబ్బులు ఎప్పుడూ పెట్టలేదు. పాత కాలం లో క్వార్టర్సు తోటి సరిపోయేది. మెషీన్లు గుడ్డల మీద సోపు నీళ్ళు పోసుకుంటూ  తిరుగుతుంటే చూస్తున్నాను.


"ఏమిటి ఇంత డబ్బయింది?"
"ధరలు పెరిగి ఉంటాయి" అంటూ ఉండగానే  దాని మీద ఫయివు లోడరు  అని బోర్డు గమనించాను. అప్పుడే ఆవిడా గమనించింది.
"అయిదు లోడ్ల దానిలో రెండు లోడ్లు వేసాము. మీకు తెలియదా ఇక్కడ మెషీన్లు గురించి?"
"తెలియదు"
"మరి ఎందుకు తీసుకు వచ్చారు ఇక్కడికి?"
"అంటే నేను ముందరగా వెళ్లి అన్నీ చూసి రావాలా?"
"క్రిందటి సంవత్సరము వచ్చారుగా ఇక్కడికి!" నాకు మాట పెగలటల్లేదు.  క్రిందటి సంవత్సరము వచ్చినది వాస్తవమే . కానీ ఆనాటి  పరిస్థితి వేరు. మా ఆవిడ పక్కనలేదు. ఇది అమెరికా,   చేత కాని తనము చెబితే పక్కవాళ్ళు చేసి పెట్టారు.  పరిస్థుతులు కొంచం  వేడెక్కే టట్లు ఉన్నాయని గ్రహించి, సరే ఇక్కడ ఎమున్నయ్యో చూస్తానని పక్క వరుస లోకి వెళ్ళాను. అక్కడ నాలుగు లోడర్లవి ఉన్నాయి. వాడటానికి ధర ఇంకా తక్కువ. పక్కవరుసలో  ఆరు లోడర్లవి ఉన్నాయి. ఇంకొకవరసలో ఒక మూటకి సరిపోయేవి టాప్ లోడర్సు  వున్నాయి. పక్కన కష్టమర్సు కి ఫ్రీ సోప్  అని కూడా వ్రాసి వుంది. కూర్చోటానికి కుర్చీలు, చదువుకోటానికి పత్రికలూ, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మయం. చూస్తుంటే ప్రపంచములో ఆడవాళ్లే ఎక్కువగా ఉతుకుతారల్లె ఉంది. కొందరయితే వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా తీసి  ఉతుకు తున్నారల్లె  ఉంది. కొందరికి కన్నుల పండువ గాను కొందరికి "రామ రామ" గానూ ఉండవచ్చు. 


"వాషింగ్ అయినది బట్టలు డ్రయర్  లో వెయ్యాలి" తడి బట్టలన్నీ తీసి రెండు డ్రయర్ ల  లో వేసాము. మళ్ళా కార్డుల   తోటి తంతు. ఈ తడవ మెషీను స్టార్ట్ అయ్యింది కానీ దాని  మీద పది అంకె వచ్చేసరికి పది డాలర్లు లాగే సుకుందేమోనని భయపడ్డాము. మళ్ళా అటెండరు . చివరకి తెలిసింది ఆ పది డ్రయర్ తిరిగే నిమిషాలుట. మెషీన్లు  తిరుగుతుంటే ఈ తడవ ఆవిడ స్వయానా లాండ్రోమేట్ చూడటానికి బయల్దేరింది.
"సీనియర్స్ కి ట్వంటీ పర్సంట్ డిస్కౌంట్ ట. అక్కడ నోటీసు ఉంది చూసిరండి" అంతే చూడటమే కాదు ఎన్రోల్ అయి వచ్చాను. అప్పుడప్పుడు ఫ్రీ వాషింగ్ కూడాట. ఇంక నేను రెండు వారాల కొకసారి లాండ్రోమేట్ కి రావాలని నిర్ణయించు కున్నాను. 
"డ్రయర్ అయ్యింది బట్టలు తీయండి" బట్టలు తీయటము, మూటలు కట్టటము, కార్లో పెట్టటము, ఇంటికి చేరటము తర్వాతా ఇంట్లోకి చేర్చటము అన్నీ అయినాయి. గంటలో పని అయిపోయిందని సంతోషం గ ఉన్నాను.
"నేను ఇంకా లాండ్రోమేట్ కి రాను" నా గుండెల్లో రాయి పడింది.
"ఎందుకని"
"బట్టలు మూట కట్టటము, చేరవేయ్యటము, మళ్ళా తీసుకువచ్చి ఇంట్లో చేరవేయ్యటము ఇంక నా వల్ల కాదు"
"పోనీ నా బట్టలు తీసుకువెళ్ళి ఉతుక్కుంటాలే, నీకు కొద్దిగానన్నా శ్రమ తప్పుతుంది"
"పోనీ ఆపని చెయ్యండి"


చివరి మాట: నాకు ఎక్కడలేని ఆనందముగా ఉంది పైకి మాత్రం గంభీరం గ ఉన్నాను లేకపోతే అసలుకే మోసం వస్తుంది. హాయిగా ఒంటరిగా లాండ్రోమేట్ కి వెళ్ళవచ్చు, సీనియర్ డిస్కౌంట్లు, ఫ్రీ సోప్. పక్కనున్న డునట్ షాప్  లో సీనియర్ రోజు ఎప్పుడో కనుక్కుంటే,  డునట్ తోటి ఫ్రీ కాఫీ, ఎయిర్ కండిషన్  లాండ్రోమేట్,  పక్కన భార్య లేకుండా ఒక గంట. హా ఇట్ ఈస్  హెవన్ . 



Wednesday, July 21, 2010

23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే ---

ముందు మాట:
కంప్యూటర్ మన నిత్య జీవితములో వినీలమయిన కారణంగా అది సరీగ్గా పనిచేయక మొరాయిస్తే చాలా బాధగా ఉంటుంది. జీవితం లో ఏదో కోల్పోయినట్లుగా బాధపడతాము. ఈ పోస్ట్ ద్వారా మనము ఎంతవరకు దానిని సరిచేసుకోగాలమో చూద్దాము. నేను ఈ పోస్ట్ లో చెప్పే కిటుకులు అన్నీ నేను ఉపయోగించినవే.



మీరు కంప్యూటర్ కొన్నప్పుడు, దానితో పాటు వచ్చిన డిస్కులు అన్నీ దాచి పెట్టండి. కంప్యూటర్ బాగు చెయ్యటానికి వాటితో అవసరముంటుంది. మీకు కంప్యూటర్ లో ముఖ్యమయిన ఫైల్స్ అన్నీ ఫ్లాష్ డ్రైవ్ లో దాచి పెట్టు కుంటూ ఉండండి. అవసరమయినప్పుడు ఉపయోగ పడుతాయి.
మొదటగా నేను ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టము Windows XP. నేను ఉపయోగించే బ్రౌజరు Chrome. మీ కంప్యూటర్ లో ఇంకో Windows ఆపరేటింగ్ సిస్టము ఉంటే మీరు క్లిక్ చెయ్యాల్సినవి ఇంకో విధంగా ఉండచ్చు కానీ చెప్పే కిటుకులన్నీ వాటిల్లోనూ ఏదో రూపంలో  ఇవే ఉంటాయి.


నేను వాడే కిటుకులు:
1. చాలా ముఖ్యమయినది మీ కంప్యూటర్ లో ఉండవలసినది  Restore Point. మీ కంప్యూటర్ ఇవాళ బాగా పనిచేస్తున్నదనుకోండి, మీరు ఆ కంప్యూటర్ పరిస్థుతు లని దాచి పెట్టుకుని. ఎప్పుడయినా ఆ రోజు కి వెళ్ళవచ్చు.  అంటే ఇవాళ్ళ మీ కంప్యూటర్ సరీగ్గా పనిచేయ్యటల్లెదను కోండి, మీరు దాచి పెట్టుకున్న బాగా పనిచేసిన రోజుకి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. Restore Point పెట్టటం ఇలా.
Start -- Accessories -- System tools -- System Restore.
Start నుండీ వరసాగ్గా క్లిక్ చేసుకు రండి. అప్పుడు 
Create a restore point, Restore my computer to an earlier time. మీరు వాటిల్లో ఒక దాన్ని తీసుకోండి.


1.1 బయటి ప్రపంచం మీ కంప్యూటర్ తో connect అవకుండా Firewall  ని ఆన్ చేయండి.
Start -- Control Panel -- Firewall 


2. మీరు కంప్యూటర్ ఆన్ చెశారు కాని అంతా గుట్టు చప్పుడు గ ఉంది. ఎక్కడా లైట్లు కూడా వెలగ లేదు. కంప్యూటర్ పవర్ సప్ప్లై కనెక్షన్ సరీగ్గా లేకపోవచ్చు లేక కంప్యూటర్ లో పవర్  సప్ప్లై పాడాయి ఉండచ్చు. పాడయితే  కొత్తది వేయించవలసి ఉంటుంది. 


3.  మీకు కంప్యూటర్ లో ఇంటర్నెట్ రావటల్లేదు. ఇంటర్నెట్ వైర్లు చెక్ చేయండి. connecting  వైర్లు తీసి మళ్ళా వాటి స్థానాల్లో పెట్టండి. ఒక్కొక్కప్పుడు స్టాటిక్ కరెంటు మూలంగా పనిచెయ్యక పోవచ్చు. మీ హైస్పీడ్ ఇంటర్నెట్ బాక్స్ లో లైట్స్ అన్నీ వెలుగుతున్నాయో లేదో చూడండి. లేక పోతే కస్టమర్ సప్పోర్ట్ ని పిలవండి.


4. మీ కంప్యూటర్ ఇంటర్నెట్ తో నెమ్మదిగా పనిచేస్తోంది. దీనికి చాలా కారణాలు ఉండచ్చు. ఒక్కొక్కటే పరిశీలిద్దాము.


4.1 మీ అవసరం కోసం మీ కంప్యూటర్ కొన్ని ఫైళ్ళని temporary గ దాచి పెడుతుంది. ఆ   ఫైళ్ళు ఎక్కు వయిన కొద్దీ కంప్యూటర్ నత్త నడక సాగిస్తుంది. వాటిని తీసేయ్యాలి.  
Start -- Control Panel -- Internet Options -- Browsing History -- Delete -- Temporary Internet files -- Delete


4.2 మీరు ఒక పెద్ద సైజు ఫైలు ను హార్డ్ డిస్క్ లో దాచి పెడదాము అని అనుకున్నారను కొండి. దానికి అంత పెద్ద సైజు స్థలం దొరకక పోతే. దానిని ముక్కలు చేసి చాలా చోట్ల దాచి పెడు తుంది( దీనిని fragmentation అంటారు). మీరు ఆ ఫైలు ను కావాలని అడిగితే ఆ ముక్కలని అన్నీ కలిపి మీకు చూపెడుతుంది(దీనిని defragmentation అంటారు). ఈ కలపటానికి సమయము తీసుకుంటుంది గనక, నెమ్మదిగా వెళ్ళు తున్నట్లు కనపడు తుంది. ఇలా fragmented ఫైళ్ళు ఎక్కువ ఉంటె, ప్రతీసారీ మీరు అడిగినప్పుడు మీకు ఫైళ్ళు ఇవ్వటానికి సమయం పడుతుంది. అందుకని మీ డిస్క్ లో ఉన్న ఫైళ్ళకి ఎంత స్థలం కావాలో చూసి వాటిని కలిపి దగ్గర చేర్చటాన్ని డిస్క్ defragmentation చెయ్యాలి.
Start -- All Programs -- Accessories -- System Tools -- Disk Defragmenter.


4.3 మీరు ప్రోగ్రాం ని ఒక దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అప్పటినుండి సిస్టం చాలా స్లో గ పోతోందని పిస్తోంది. డిస్క్ defragmentation చెయ్యండి. అప్పటికి సరి అవక పోతే ఆ ప్రోగ్రాం ను సిస్టం లో నుండి తీసి వెయ్యండి.
Start-- Control Panel -- Add Remove Programs (ఇక్కడ మీ ప్రోగ్రాం ని సెలెక్ట్ చేసుకుని remove  చెయ్యండి). 


5. కంప్యూటర్ వైరస్ లు  ఉంటే గూడా కంప్యూటర్ నెమ్మదిగా వెళ్తుంది. కంప్యూటర్ వైరస్ లు అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఎవరో వ్రాసి మీ కంప్యూటర్ లోకి దొంగతనంగా మీకు తెలియకుండా పంపించారు. అవి సామాన్యముగా ఆ యా వైరస్ ప్రోగ్రామ్స్ వ్రాసిన వారి పనులు మీ కంప్యూటర్ మీద చేస్తూ ఉంటాయి. అవి అలా మీతోపాటు కంప్యూటర్ ని వాడుకొనుట మూలంగా, కంప్యూటర్ నెమ్మదిగా పోతుంది. కొన్ని కొన్ని మీ కంప్యూటర్ పని చెయ్య కుండా ఆపేస్తాయి. కాగాపోగా మీరు క్రెడిట్ కార్డు తో డబ్బులు పంపిస్తే బాగు చేస్తా మని చెబుతాయి. మీ కంప్యూటర్ అలా స్తంభించి పోతుంది. ఇంకా కొన్ని వైరస్  లు మీ దగ్గర ఉన్న ఈ మెయిల్ అడ్రస్ లు తీసుకుని వారికి మీరు ఎక్కడో బాధల్లో ఉన్నారు వాళ్లకి డబ్బు పంపిస్తే అందచేస్తాము అని చెబుతాయి. కొన్ని మీరు దాచి పెట్టుకున్న విషయాలు దొంగిలిస్తాయి. ఈ క్రింది విధంగా వాటిని రాకుండా చెయ్యచ్చు, కాదుపో వస్తే సాగనంపచ్చు. antivirus ప్రోగ్రాం ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్రీ గ వచ్చేవి ఉన్నాయి.   


5.1. వైరస్ లు దొంగతనంగా వస్తాయని చెప్పాను కదా, ఎక్కువగా ఈ మెయిల్స్ తో  వస్తూ వుంటాయి. మీకు తెలియని వారు ఈ మెయిల్స్ పంపించినా లేక సబ్జెక్టు లో ఆ ఈ మెయిల్ ఎందుకో వ్రాయక పోయినా జాగర్తగా ఉండాలి. ఓపెన్ చేసారంటే వైరస్ లోపలి కి  చేరుతుంది. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. వెంటనే డిలీట్ చెయ్యండి. మీకు తెలియని వాళ్ళు ఐ లవ్ యు అని ఈ మెయిల్ పంపిస్తే కూడా వెంటనే డిలీట్ చెయ్యండి. ప్రపంచములో ఒకరు మనల్ని లవ్ చెయ్యక పోతే పర్లేదు.


5.2. మీరు ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకుంటుంటే కూడా రావచ్చు. కంప్యూటర్ చాలా నెమ్మదిగా నడుస్తుంటే anti వైరస్  ప్రోగ్రాం రన్ చేసి వాటిని తీసి వెయ్యండి. 


5.3. మీరు వెబ్ సైట్స్ చూస్తున్నప్పుడు రావచ్చు. మీ కంట్రోల్ లేకుండా మీ కంప్యూటర్ స్క్రీన్ మీద బొమ్మలు వస్తూ ఉంటాయి. వెంటనే కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చెయ్యండి. మళ్ళా ఆన్ చేస్తే మీ కంప్యూటర్ పని చెయ్యక పోతే వైరస్ ఉన్నట్లే లెక్క. Anti వైరస్ ప్రోగ్రాం రన్ చెయ్యటానికి చూడండి.  ఒకవేళ కుదరక పోతే safemode  లోకి వెళ్లి antivirus రన్ చెయ్యండి. అదీ కుదరక పోతే restorepoint ద్వారా మీ కంప్యూటర్ ని బాగా పనిచేసిన రోజు కి తీసుకు వెళ్ళండి.
కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసినతరువాత, కంప్యూటర్ వస్తున్నప్పుడు కీ బోర్డు పై వరసలో ఉన్న F8 నొక్కితే safemode లోకి వెళ్ళచ్చు.


5.4. computer safemode అంటే మీ కంప్యూటర్ రన్ కావటానికి కావలసిన తక్కువ ప్రోగ్రామ్స్ తో  (ex : barebones  Windows XP) పని చేస్తూ ఉంటుంది. మిగతా ప్రోగ్రామ్స్ మీరు రన్ చేస్తే గాని రన్ అవ్వవు. ఏ ప్రోగ్రాం ప్రాబ్లం ఇస్తోందో  తెలిస్తే దాన్ని remove చెయ్యవచ్చు. Antivirus ప్రోగ్రాం ని కూడా రన్ చెయ్యవచ్చు. restorepoint ద్వారా  మంచి రోజుకి వెళ్ళవచ్చు. 


6. ఫై చెప్పిన వేవి పని చెయ్యక పోతే, మీ కంప్యూటర్ తో వచ్చిన డిస్క్ లతో operating system లోడ్ చెయ్యాలి. మొదట మీ కంప్యూటర్ ఆఫ్ చెయ్యండి. మీ కంప్యూటర్ తో పాటు వచ్చిన ఆపరేటింగ్ సిస్టము డిస్క్ ని CD/DVD drive లో పెట్టండి. కంప్యూటర్ ఆన్ చెయ్యండి. ఆన్ చెయ్యం గానే కంప్యూటర్ చేసే పని ఆపరేటింగ్ సిస్టము కోసం వెతకటం. మొట్టమొదట CD  డ్రైవ్ లో వెదుకుతుంది. దానిలో CD పెట్టాము కాబట్టి ఆపరేటింగ్ సిస్టము ని దానిలో నుండి తీసుకుంటుంది(హార్డ్ డిస్క్ లోనుండి కాకుండా). ఇక్కడి నుండీ అది అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పుకుంటూ పోతే ఆపరేటింగ్ సిస్టము ను లోడ్ చెయ్యవచ్చు.


7. అప్పటికీ పనిచేయక పోతే మీ హార్డ్ డిస్క్ ని format చేసి operating system లోడ్ చెయ్యాలి. దాని తరవాత మళ్ళా మీ ప్రోగ్రామ్స్ ఫైళ్లు లోడ్ చెయ్యాలి.


8. నేను ఉపయోగించే ఫ్రీ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ గూగుల్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడే డౌన్లోడ్ సైట్ CNET.
A. Browser: Chrome
B. Anti Virus : Panda Cloud
C. Windows Maintenance: Advanced System Care (దీన్ని వారానికి ఒకసారి వాడుతాను) 


చివరి మాట:
మీ కంప్యూటర్ సరీగ్గా పని చెయ్యక పోతే బాగు చెయ్యవచ్చు.  గాభరా పడవలసిన అవుసరము లేదు. మీకు సందేహాలు వస్తే గూగుల్ చెయ్యండి. విపులంగా అన్నీ వ్రాసి ఉన్నాయి.


గమనిక: ఈ వ్యాసం వ్రాసింది మా ఇంట్లో వాళ్ళ ప్రేరేపణ తో. అందరికీ అర్ధమయ్యేలా వ్రాసాను. మీరు ఇది చదువుతున్నారంటే దీనికి సరియన అప్ప్రొవల్ రేటింగ్ వచ్చినదన్న మాట. ఇంక ఆనందంగా నా బుల్లి కథలు వ్రాసు కుంటాను.

Monday, May 24, 2010

22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే --



-- ఏమి జరుగు తుంది ----
కథ రోజూ కంప్యూటర్ సముద్రంలో కొట్టుకుంటూ మునిగి తేలే వారి కోసం మాత్రం కాదు. దానిలో మునిగి తేల లేక ఏదో విధంగా సరిపెట్టు కుందాము అనుకునే వారి కోసం.


నేను పొద్దున్నే నిద్ర లేవ గానే మొదట చేసే పని కంప్యూటర్ స్విచ్ ఆన్ చెయ్యటం. మొహం కడుక్కు వచ్చే సరికి రెడీ గా ఉంటుంది నా ఆజ్ఞల కోసం. ఈ కంప్యూటర్ నాది. దానికి చేతనయినంత వరకూ నేను ఏమి చెబితే అది చేస్తుంది. దానికి ఇంత మంచి గుణం ఎల్లా వచ్చింది ?

క్రిందటి పోస్ట్ లో మనము కంప్యూటర్ లో హార్డ్ వేర్ ఏమి ఉంటావో తెలుసుకున్నాము (ఉదా: మోనిటర్, ప్రింటర్, సౌండ్ కార్డు...). వీటన్నిటితో వాటి భాషలో చెప్పి మనకు కావాల్సిన పని చేయించ టానికి ఒక సాఫ్టు వేర్ ఉంటుంది. దానినే ఆపరే టింగ్ సిస్టం అంటారు. మన భాష లో మనకు కావాల్సింది చెబితే ఇది కంప్యూటర్ భాషలో మన పని చేసే పరికరాలకి చెబుతుంది (ఉదా: ప్రింటర్ కు ). ఇది ఆపరే టింగ్ సిస్టం చేసే పని. మా కంప్యూటర్ లో ఇది windows xp. మన భాష, కంప్యూటర్ భాష తెలిసిన వాళ్ళు కూర్చుని ఈ ప్రోగ్రాం ని వ్రాస్తారు. వీరిని సిస్టమ్స్ ప్రోగ్రామ్మార్ అంటారు.

మనము కంప్యూటర్ ని స్విచ్ ఆన్ చెయ్యం గానే జరిగేది ఇదే. తన యజమాని ఆజ్ఞలను పూర్తి చేయించ టానికి పరికరాలు అన్నీసరీగ్గా ఉన్నయ్యో లేవో చూసుకుంటుంది. మనము వంట చెయ్యటానికి ముందు అన్నీ వంటింట్లో సరీగ్గా ఉన్నయ్యో లేవో చూసు కున్నట్లు. అందుకని మీ మీ అవసరాలని బట్టి సర్దుకోటానికి టైము తీసు కుంటుంది. అన్నీ చూసు కున్న తర్వాత మీ మోనిటర్ మీద బొమ్మలతో కంప్యూటర్ తో ఏమి చెయ్యచ్చో చెబుతుంది. ఈ బొమ్మలని ఐకాను(Icons) అంటారు. ఈ బొమ్మల మీద త్వరగా రెండు సార్లు మౌస్ తో క్లిక్ చేస్తే మీ ప్రోగ్రాం కంప్యూటర్ లో వస్తుంది. My Computer అనే దాని మీద క్లిక్ చేసారను కొండి కంప్యూటర్ లో ఏమి ఉన్నయ్యో మోనిటర్ మీద కనపడుతుంది.

ఎడమవేపు క్రింద Start(స్టార్ట్) అని కన పడు తుంది. దానిని నొక్కితే వచ్చే All Programs(అల్ ప్రోగ్రామ్స్) నొక్కితే మీ కంప్యూటర్ లో ఉన్న ప్రోగ్రామ్స్ లిస్టు వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ రెడీ అయ్యింది మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోంది.

మీరు ఇంకా మీ పని చేసుకో వచ్చు. సిడి లోంచి పాటలు వినవచ్చు, డివిడి లో నుంచి సినిమాలు చూడవచ్చు. Spreadsheet తో పద్దులు వెయ్యచ్చు. Word(వర్డ్) తో పుస్తకాలు వ్రాయచ్చు. దీనిని ఆఫ్ లైను మోడు అంటారు. మీ పని మీరు చేసుకుంటారు. మీ కంప్యూటర్ ప్రపంచంలో ఇంకొకళ్ళకి తెలియదు.

మీరు ఈ-మెయిలు చూడాలన్నా, బయట ప్రపంచం లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నా, ఇంకో వూళ్ళో ఉన్న వాళ్ళతో చాట్ చెయ్యా లన్నా మీరు ఆన్ లైను మోడ్ లోకి రావాలి.

దీనికి మీ కంప్యూటర్ ని నెట్వర్క్ కి కలుపు కోవాలి. ఈ నెట్వర్క్ లో ప్రపంచం లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కలిపి ఉంటాయి. దీని పేరు ఇంటర్నెట(Internet). ఒక్కొక్క కంప్యూటర్ కి ఒక చిరునామా ఉంటుంది. దానినే IP address అంటారు.ఇంకేముంది అడ్రస్ తెలిస్తే వాళ్ళ తోటి మాట్లాడచ్చు. ఈ IP address లు గుర్తు పెట్టు కోవటం కష్టం కాబట్టి మనము గుర్తు పెట్టు కొనటానికి వీలుగా ఈ-మెయిలు పేర్లు, వెబ్ సైట్ పేర్లు వచ్చాయి.

ఈ నెట్వర్క్ కి మీ కంప్యూటర్ ని కలుపుకోవాలి. టెలిఫోన్ ద్వారా కలపచ్చు(దానికి టెలిఫోనే నంబర్ ఉంది). కాకపోతే ఇది నత్త నడక నడుస్తుంది. మా ఇంట్లో హై స్పీడ్ DSL ఉంది. దానిని మా డెస్క్ టాప్ కి కలిపాము. ఈ కలిపేటప్పుడు మధ్యలో లింక్ సిస్ లాంటిది పెట్టు కుంటే DSL కి వైర్లెస్ ద్వారా కలపచ్చు. మా ఇంట్లో Linksys కాకుండా Netgear ఉంది. అంటే DSL నుండి వైర్ ను Netgear కి కలపటం Netgear నుండి కంప్యూటర్ కి కలపటం. దీనితో మీ లాప్ టాప్ ని మీ ఇంట్లో ఎక్కడ నుంచి అయినా DSL కి కలుపుకో వచ్చు.

ఈ నెట్వర్క్ లో ఏమేమి జరుగుతున్నాయో చూసి మనకు చెప్పటానికి మనకు బ్రౌసెర్ (Browser) కావాలి. దీని పనల్లా ఎవరెవరు ఏమి చేస్తున్నారో తెలిసికొని చెప్పటం, మన కోరికని బట్టి IP address లుగా మార్చి మనకు కావాల్సినపని చేసి పెడుతుంది. మీకు కావాలంటే వాటికి కలిపి చూపెడుతుంది. నేను వాడేవి Chrome, Mozilla, Internet explorer. మీరు ఏదో ఒకటి వాడచ్చు.

మీరు ఇప్పుడు బ్రౌజరు ని డబల్ క్లిక్ చేసి అడ్రస్ లో yahoo.com అని టైపు చెయ్యండి. యాహూ వాళ్ళ కంప్యూటర్ దగ్గరకి వెళ్తారు. దానిలో న్యూస్ క్లిక్ చేసి న్యూస్ చూడ వచ్చు. లేక Mail కి వెళ్లి ఈ-మెయిల చూసుకోవచ్చు. తర్వాతా కూడలికో మాలిక కో హారం కో వెల్ల వచ్చు. మీరు ఇల్లా వెళ్ళు తూ వుంటే మీ బ్రౌజరు ఒక్కొక్క దానిని ఒక్కొక్క విండో లో చూపెడుతుంది. ఈ విండోస్ అన్నీ కంప్యూటర్ మెమరీ లో తెరుస్తుంది. మీ కంప్యూటర్ కి అంత ఎక్కువ మెమరీ ఉంటె అన్ని విండోస్ తీరవచ్చు. అలా తెరుస్తూ పోతుంటే మెమరీ నిండి పోయి కంప్యూటర్ నెమ్మదిగా నడుస్తుంది. అందుకని ఉపయోగించిన తరువాత మూసి వెయ్యటం మంచిది. మనము వస్తువు వాడిన తరువాత కౌంటర్ మీద ఉంచము కదా, కౌంటర్ నిండి పోతుంది, అలాగన్న మాట. దీన్నే బ్రౌజింగ్ అంటారు సర్ఫింగ్ అని కూడా అంటారు.

మీరు ఇంటర్నెట వాడటం మొదలెట్తే ప్రపంచం లో ఉన్న కంప్యూటర్స్ లో ఒకళ్ళు అవుతారు. మీ ఈ-మెయిలు చూసుకోవచ్చు, బ్యాంకింగ్ చెయ్యొచ్చు, హోటలు, రైల్వే, ప్లేన్ రిజర్వేషన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంప్యూటర్స్ తోటి మీరు మాట్లాడ గలుగు తున్నారు కాబట్టి. మీరు ఈ పనులను చెయ్యటానికి usercode password లు సృష్టించు కోవాలి. మీరు ప్రతిసారీ టైపు చెయ్యటం కష్టముగా ఉంటె వాటిని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో దాచి పెట్టచ్చు. వీటికి కంప్యూటర్ పెట్టె పేరు కుకీస్(cookies).

సమాజం లో అందరూ మంచి వాళ్ళు అయితే న్యాయస్థానాలు అవ్వీ అక్కర లేదు కానీ ఇది నిజం కాదు. ఇంటర్నెట సమాజం లో మీరు ఇంకొక కంప్యూటర్ దగ్గరకి ఎలా వెల్ల గలరో ఇంకొకళ్ళు గూడా మీ కంప్యూటర్ దగ్గరకు రాగలరు. కంప్యూటర్ భాష తెలిసి దొంగతనం గా మీ కంప్యూటర్ లోకి వచ్చిన వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెలిసుకో గలరు. అందుకని మీ usercode password జాగర్తగా దాచి పెట్టుకోండి. కనీసం password లు కుకీస్ లో పెట్టకండి.

నేను చెప్పినవన్నీ కంప్యూటర్ లో చెయ్యటం మొదలెట్టండి. తర్వాత పోస్ట్ లో కంప్యూటర్ చెడిపోతే బాగు చేసే విధానం గురించి తెలుసుకుందాము.


Tuesday, May 11, 2010

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి ---

కథ రోజూ కంప్యూటర్ సముద్రంలో కొట్టుకుంటూ మునిగి తేలే వారి కోసం మాత్రం కాదు. దానిలో మునిగి తేల లేక ఏదో విధంగా సరిపెట్టు కుందాము అనుకునే వారి కోసం.

నా డెస్క్ టాప్ పాడయితే మా ఆవిడ లాప్ టాప్ వాడటానికి ఒక ఒప్పందానికి వచ్చాము. నేను లాప్ టాప్ మీద పని చేసిన సమయము నిమిషాల తో సహా ఆవిడ చెప్పిన పనులు చెయ్యాలి. దానికి తోడు కంప్యూటర్ బాగు చెయ్యటం ఆవిడకి నేర్పాలి. ఇది బలాత్కార బానిసత్వం క్రిందకి వస్తుంది. నాకు ఒకటే శరణ్యం. ఆవిడకి కంప్యూటర్ బాగు చెయ్యటం నేర్పాలి. సరే ప్రణాళిక నిర్ణయించు కున్నాను.
మొదట కంప్యూటర్ గురించి చెప్పాలి. ఆవిడ్ -మెయిల్స్ చూస్తుంది తప్ప పరిజ్ఞానం ఎంత ఉందొ తెలియదు. టూకీగా చెప్పాలని నిర్ణయించు కున్నాను. తరువాత అది ఎల్లా పాడవు తుందో చెప్పాలి(ఇది నన్ను సేవ్ చేసు కోవటం కోసం. ఎందుకంటే పొద్దున్న బాగున్న కంప్యూటర్ సాయంత్రానికి ఎల్లా పాడయింది . ఏదో చేసారు కి సమాధానం చెప్పలేక) . తరువాత బాగు చేసే విధానం. తేలికగా మూడు మెట్ల వ్యవహారం. నోట్సు వ్రాసు కున్నాను. మొదట చదివించటం తరువాత ప్రశ్నలకి జవాబు లివ్వటం.
కంప్యూటర్ అంటే ఏమిటి --- దానిలో ఏమి ఉండును --- ఎలా పని చేయును.
కంప్యూటర్ పని చెయ్యాలంటే దానికి రెండు రకముల సాధనాలు ( కనపడేవి కనపడనివి) కావాలి. కనపడే వాటిని హార్డువేర్ అంటారు, కనపడని వాటిని సాఫ్ట్ వేర్ అంటారు. కంప్యూటర్ కి అర్ధమయ్యేది ఒకటే భాష. దానిని మెషీన్ లాంగ్వేజి అంటారు. మనం కంప్యూటర్ ఆన్ చెయ్య గానే వచేదాన్ని ఆపరేటింగ్ సిస్టం అంటారు( ఉదా: విండోస్). ఇది మన ఆజ్ఞ లని మనభాష లో తీసుకుని కంప్యూటర్ భాషలో కి మార్చి కంప్యూటర్ కి చెయ్యమని చెబుతుంది.

I
. Hard ware:

1.
ఎలక్రానిక్ చిప్ --- తనకు పంపిన ఆజ్ఞలను ఛేదించ టానికి.
2. RAM ------ Random Access Memory  -- చాలా త్వరగా పని చేస్తుంది. అందుకని కంప్యుటర్ ని పనిచేయించే         ఆపరేటింగ్ సిస్టంని (విండోస్) దీనిలో ఉంచుతారు. త్వరగా ఆజ్ఞలను పంపటానికి.
3. హార్డ్ డిస్క్ --- వ్రాసిన సంగతులు, ఫోటోలు దాచి పెట్టి కావాల్సి నప్పుడు ఇవ్వ టానికి.
4. వీడియో కార్డు --- కంప్యూటర్ లో జరిగేవి మనకు మోనిటర్ ద్వారా చూ పెట్ట టానికి.
5సౌండ్ కార్డు --- speakers ద్వారా శబ్దాన్ని వినిపించటానికి.
6. CD/DVD రికార్డర్/ప్లేయర్. --- కంప్యూటర్ లోకి CD ద్వారా సందేశాలు పంప టానికి.
7. I/O బోర్డు --- కీ బోర్డ్ ద్వారా ( టైపు చెయ్యటం) ద్వారా కంప్యూటర్ కి చెప్పటానికి. ప్రింట్ చెయ్యటానికి.
8. నెట్వర్క్ కార్డు --- ఇంటర్నెట్ కనెక్షన్ కి.
9. Power supply --- ఫై వాటన్నిటికి విద్యుత్తు పంపటానికి.


మీకు లాప్ టాప్ ఉంటే దానిలో వైర్లెస్ కనెక్షన్ కి ఒక కార్డు ఉంటుంది. చాలావరకు ఇవన్నీ ప్లేట్లు లాగా ఉంటాయి. ఎందుకనో వీటిని కార్డులు అంటారు
కంప్యూటర్ లో ఇవన్నీ వాటంతట అవే పని చేస్తయ్యి కానీ కొన్నిటికి డ్రైవ్ చేసే వాళ్ళు(drivers) ఉంటె కానీ ఎక్కడికీ కదలవు(పని చెయ్యవు). సామాన్యంగా drivers సాఫ్ట్వేర్ (కనపడనిది) ఉంటాయి.


II. Software :  ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ )

ఇది కంప్యుటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు RAM లోకి హార్డ్ డిస్క్ నుండి లోడ్ చెయ్య బడుతుంది.
మనము కంప్యూటర్ కి ఎమన్నా చెప్పాలంటే కీ బోర్డు మీద టైపు చేస్తాము లేకపోతే మౌస్ తో క్లిక్ చేస్తాము. మనసందేశాల కోసం ఎప్పుడూ కంప్యూటర్ లో ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దాన్నే ఆపరేటింగ్ సిస్టం అంటారు. అది చేసే పనల్లా మీ ఆజ్ఞలను తీసుకుని, కార్యాచరణకి ఆయా పనులు చేసేవాటికి పని అప్పగించి మీ కార్యము నేరవేరేటట్టు చేస్తుంది. ఉదా: మీరు ప్రింట్ చెయ్యమని చెప్పారనుకోండి, ప్రింట్ చేసే విభాగానికి మీ కోరిక తెలుపుతుంది. కంప్యూటర్ కి మన భాష తెలియదు. అది మాట్లాడే భాషని మెషిన్ లాంగ్వేజి అంటారు. ఆపరేటింగ్ సిస్టం మనము చెప్పిన వాటిని కంప్యూటర్ కు అర్ధమయ్యేలా చెబుతుంది. కంపూటర్లు మొదట వచ్చినప్పుడు దీనిని సూపర్వయిజరు అనే వాళ్ళు. దీనిని మామూలుగా కంప్యూటర్ భాషలో వ్రాస్తారు.
ఉదా విండోస్ , యునిక్స్. కొత్త వి వచ్చినప్పుడల్లా వీటికి ఒక తోక తగిలిస్తారు. ఉదా: విండోస్ xp, విండోస్ 7.


III. Application Programs.


మీరు Internet లోకి వెళ్ళవలె ననుకోండి బ్రౌజరు కావాలి(Mozilla, Chrome, Internet explorer).మీరు పుస్తకం వ్రాయాలను కొండి. మీకు word కావాలి.మీరు పద్దులు వ్రాయాలను కొండి. Spread sheet (Excel) కావాలి.వీటి నన్నిటినీ అప్లికేషను ప్రోగ్రామ్స్ అంటారు. మీ విండౌస్ వీటి పేర్లని అన్నిటిని ఒక రిజిస్టర్ లో వ్రాసుకుంటుంది. మీరు అడగంగానే వాటిని పిలవటానికి. మీరు control panel లోకి వెళ్తే add remove programs లో మీరు ఉపయోగించే ప్రోగ్రాముల పేర్లన్నీ కనపడుతాయి.

కంప్యూటర్ ఎల్లా పని చేస్తుంది: మనం కంప్యూటర్ కి మూడు విధాలుగా చెప్పొచ్చు. కీ బోర్డ్ తో టైపు చెయ్యటం ద్వారా, మౌస్ ద్వారా, CD ద్వారా. ఆపరేటింగ్ సిస్టం (విండోస్) మీ ఆజ్ఞ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అవి తీసుకుని కంప్యూటర్ భాష లోకి మార్చుకుని. కంప్యూటర్ చిప్ దగ్గరకు పంపిస్తుంది. కంప్యూటర్ చిప్ ఆజ్ఞను మిగతా హార్డువేర్ డ్రైవర్స్ కి కావలసిన పని చెయ్య మని చెబుతుంది (ఉదా: దీనిని మోనిటర్ మీద చూపు). అందుకే మంచి స్పీడు పనిచేసే కంప్యూటర్ చిప్ కావాలి. ఒక్కొక్కప్పుడు ఆజ్ఞ లన్నిటిని వెంటనే పంపించటానికి కుదరదు. అందుకనే ఆజ్ఞలను దాచిపెట్టి వరుసగా పంపటానికి మెమరీ కావాలి. అల్లాగే మెమరీ లో మనం ఎక్కువగా చూసే వాటిని(కూడలి, హారం, న్యూస్) windows పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ మెమరీ ఉంటె అంత మంచిది.
అలాగే మీకు హైస్పీడ్ కనెక్షన్ కావాలనుకుంటే దానిని గుర్తు పట్టే కార్డు, దాని డ్రైవర్ కంప్యూటర్ లో ఉండాలి.
ఇది సూక్ష్మంగా కంప్యూటర్ కథ. నా ఉద్దేశం లో ఇంత ఆవ గాహన ఉంటే గాబరా పడకుండా కంప్యూటర్ ప్రొబ్లెంస్ పరిష్కరించ వచ్చును.
మా ఆవిడ కిచ్చి చదివించి చూడాలి ఏమంటుందో.

సశేషం --- ఇంకా ఉంది