Saturday, February 10, 2018

140 ఓ బుల్లి కథ ---- పరమేశం పరకాయ ప్రవేశం

కాఫీ తాగి బయట ఎలా ఉందో అని కిటికీ లోనుండి చూస్తున్నాను. వాళ్ళు చెప్పినట్లు అప్పుడే స్నో మొదలయింది. ఒక అడుగు దాకా పడుతుందని చెబుతున్నారు. చికాగో ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే ప్లేన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. లేకపోతే ఈ పాటికి న్యూయార్క్ లో వుండే వాళ్ళం. చూస్తున్నాను పక్కింటి పరమేశం మాఇంటికి ఎందుకో పరిగెత్తుకు వస్తున్నాడు.

పరమేశం, భార్యా పక్కింట్లో ఉంటారు. రిటైర్ అయినవాళ్ళం కాబట్టి సామాన్యంగా రోజూ మా భార్యలు ఉద్యోగాలకి వెళ్లిన తరువాత కలుసుకుంటూ ఉంటాము. భర్త రిటైర్ అయిన తర్వాత భార్యలు వర్క్ కి వెళ్ళి ఏవో నాలుగు రాళ్ళు తెస్తూ ఉంటారు. అదే మాకు తీరిక సమయం. ఎదో పిచ్చాపాటీ, భార్యల గురించీ మాట్లాడుకుంటూ ఉంటాము.

భార్యలు వర్క్ కి వెళ్ళేటప్పుడు, వాళ్ళు వచ్ఛేటప్పటికీ ఏవేం పనులు చెయ్యాలో భర్తలకి చెప్పి వెళ్తారు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఏదోవిధంగా మానేజ్ చెయ్యచ్చు. అప్పుడొచ్చే స్వేచ్ఛకోసం, ఆ freedom కోసం రోజూ ఎదురుచూస్తూ ఉంటాము. ప్రతి సుఖానీకీ ఏవో బాధలు వెనకాల ఉంటాయని మా తెలుగు మాస్టారు క్లాస్ లో చెబుతూ ఉండే వారు. ఆయన చెప్పే ఉదాహరణలు నేను ఇక్కడ వ్రాసేవి  కాదనుకోండీ. అందుకని సర్ది పెట్టుకోవాలి. ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే మన పెద్ద వాళ్లకి ఎంత ముందు చూపో. వాళ్ళబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురు తక్కువ వయస్సు ఉండేలా చూస్తారు. రిటైర్ అయిన తరువాత వాళ్ళ అబ్బాయి, రోజుకి కొన్ని గంటలు అయినా  ఫ్రీగా ఉంటాడని.

తలుపు తీశాను. పరమేశం మొహం దేదీప్య మానంగా వెలిగి పోతోంది. కొత్తగా ఏదో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉన్నాడు. ఏదో కొత్తదనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆలాస్యం చెయ్యకుండా అసలు సంగతి చెప్పేశాడు, ఇవ్వాళ బ్లడ్ ప్రెషర్ చాలా నార్మల్ కి వచ్చేసిందని. ఇది నిజంగా సంతోషించ వలసిన విషయం. ఎక్సరసైజ్ లు చేసి, మందులేసుకుని చాలా బాధ పడుతున్నాడు. కొత్త రెగ్యులేషన్ కన్నానా, పాత రెగ్యులేషన్ కన్నానా అని అడిగాను. కొత్త రెగ్యులేషన్ కన్నా అన్నాడు.

ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికాలో ప్రభుత్వం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చాలా ప్రయాస పడుతుంది. అందుకని మొన్న డాక్టర్లకి కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. బ్లడ్ ప్రెజర్ 130/80 కన్నా ఎక్కువుంటే వాళ్లకి బ్లడ్ ప్రెజర్ ఉన్నట్టని డాక్టర్లకి చెప్పి పేషేంట్స్ ని అల్లా treat  చెయ్యమంది. ఇదివరకు అదే గయిడ్లైన్ 140/90 ఉండేది. లక్షల మంది ఒక్క దెబ్బతో బీపీ పేషంట్స్ అయ్యారు. అమాంతంగా గయిడ్లైన్ ఎల్లా మారిపోయిందో అర్ధం కాదు.

అల్లాగే అర్ధం అవనివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులని డాక్టర్ దగ్గరకి వెళ్తే, జాయింట్ లో ఎముకలు అరిగి పోయా యని చెబుతారు. ఎందుకు అరుగుతాయి అని అడిగితే పుట్టినప్పటినుండీ నడుస్తున్నావు కదా అంటారు. ఏమి చెయ్య మంటారు అంటే "ఈ మందులు వేసుకుని రోజూ ఎక్సరసైజ్ చెయ్య" అంటారు. ఏమి ఎక్సరసైజ్ అంటే రోజుకి పది వేల అడుగులు నడవ మంటారు. అసలు నడిస్తేనే కదా ఎముకలు అరిగినాయి !  కొందరు అయితే అదేదో 'fit bit ' ట ఒక గడియారం చేతికి పెట్టుకుని అడుగులు లెక్కపెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు.

ఏమిటి పరమేశం ఎదో అన్నావు, మళ్ళా చెప్పు నేను విన్నది నమ్మలేక పోతున్నాను అని అడిగాను. మళ్ళా చెప్పాడు.నేను విన్నది కరెక్టే. బీపీ 103 కి తగ్గిందిట. నాకు నమ్మ బుద్ది కాలేదు. కొత్త బీపీ మెషిన్ కొన్నావా అని అడిగాను. లేదన్నాడు. మందు ఎక్కువ వేసుకున్నావా అని అడిగాను. లేదన్నాడు. డయట్ మార్చావా అన్నాను. లేదన్నాడు.

నాకు ఏమిటో తెలుసుకోవాలనే ఉత్కంఠత ఎక్కువయింది. ఇవ్వాళ ఒక్క రోజేనా ఆ రీడింగ్ వచ్చింది అని అడిగాను. కాదు నాలుగు రోజులబట్టీ అన్నాడు. ఇంకేమై ఉంటుందని పరమేశ్వరానికి కాఫీ ఇచ్చి ఆలోచిస్తున్నాను.

కాఫీ ని అదేదో అమృతంలాగా తాగుతున్నాడు. ఇవాళ కాఫీ తాగలేదా అని అడిగాను. లేదు నేను లేచేసరికి ఆవిడ వర్క్ కి వెళ్ళిపోయింది అన్నాడు. అటువంటి పరిస్థుతులలో మా ఆవిడ కాఫీ అక్కడ పెట్టి వెళ్లి పోతుంది. అదే అడిగాను. లేదన్నాడు.

 నేను వంట చేశాను లంచ్ చేసి వెళ్తావా అని అడిగాను. తప్పకుండా అన్నాడు. నాలుగు రోజులయింది సరైన భోజనం చేసి అన్నాడు. మీ ఆవిడకి ఈ  బీపీ సంగతి చెప్పావా అని అడిగాను. చెప్పలేదన్నాడు. నా రిసెర్చ్ మైండ్ కి పని చెప్పాను. నాలుగు రోజులబట్టీ బీపీ రీడింగ్ మారింది. నాలుగు రోజులబట్టీ సరీగ్గా భోజనం చెయ్యటల్లేదు.

"డయట్ చేస్తున్నావా " అని అడిగాను. లేదు మేము నాలుగురోజుల కింద పోట్లాడుకున్నాము అన్నాడు.మొగుడూ పెళ్ళాలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు. అది పెద్ద విషయం కాదు. దాని మూలాన బీపీ పెరుగుతుంది గానీ తగ్గదు. ఇంకా ఏమి జరిగింది అని అడిగాను. అప్పటి నుండీ విడిగా ఇంకో గదిలో పడుకుంటున్నాము  అన్నాడు. ఎందుకు పోట్లాడు కున్నారని నేను అడగలేదు. నాకు అనవసరం. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.

కాసేపు కళ్ళుమూసుకుని తెరిచి సీరియస్ గా  "పరమేశ్వరం మీ ఆవిడ నీకు బీపీ ఇస్తోంది" అన్నాను. అని నా discovery చెప్పి, నాలుగు రోజుల క్లూ లు చెప్పి ఋజువు చేశాను. నీ బీపీ తగ్గటానికి కారణం విడివిడిగా పడుకోవటం అని ముగించాను. ఇంత పెద్ద నా discovery కి వళ్ళంతా  గగుర్పొడిచింది.

వెంటనే నా మనస్సులో తళుక్ మని ఒక మెరుపు మెరిసింది. ఈ నా డిస్కవరీ ని  మా ఇంట్లో test చెయ్యాలి అని నిర్ణయించు కున్నాను. నాకూ బీపీ ఉంది. మా ఇంట్లో మూడు గదులు ఉన్నాయి విడిగా పడుకోటానికి. త్వరలో ఆవిడ వచ్చే లోపల ఏ విషయం మీద పోట్లాడాలో నిర్ణయించుకోవాలి.

No comments:

Post a Comment