మా ఊళ్ళో నాలుగు రోజులబట్టీ వర్షాలు. ఎండపొడ కొద్దిగానే ఉంది. ఇవ్వాళ సూర్యభగవానుడు తళ తళా మెరుస్తూ బయటికి వచ్చాడు. పచ్చగడ్డి బాగా వచ్చింది. ఎండ బాగుంది. ఆకురాలు కాలం వచ్చేసింది కాబట్టి ఎండలో పెద్ద చురుకులేదు. వేసవి ఎండ ఆవకాయ అనుకుంటే ఇవ్వాళ వాతావరణం కమ్మటి కందిపొడిలా ఉంది. మేము మధ్యాహ్నం భోజనం చేసి జోగుతున్నామని అనటం సరీగ్గా సరిపోతుంది. ఇంటావిడ పెట్టిన సినీమా "Marriage Italian Style " నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఇది పాత "Sophia Lorin " ఇటాలియన్ భాషలో ఉన్న సినీమా ఇంగ్లీష్ స బ్ టై టి ల్స్ తో. ఎందుకింత కష్ట పడుతూ చూడటం అని మీరు అనుకోవచ్చు. కానీ మాకు ఏ సినీమా పూర్తిగా చూడాలనే కోరిక ఉండదు. విచక్షణా భావం అసలు లేదు. కాసేపు చూస్తాం నచ్చక పోతే ఇంకో సినీమా పెడతాం. మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయా అని మీరు అడగవచ్చు. అటువంటి దేమీ లేదు. మాది ఆదర్శ దాంపత్యమేమీ కాదు. జుట్టూ జుట్టూ పట్టుకున్న రోజులు ఉన్నాయి. ప్రస్తుతం నా తలమీద జుట్టులేదు అంటే ఎవరి పట్టు ఎటువంటిదో మీకు అర్ధమయింది అనుకుంటాను.
అమెరికాలో ఆకురాలు కలం వచ్చేసింది. త్వరలో మా గడియారాలు మార్చాలి. చెట్లూ చేమలూ ఆకుల రంగులు మార్చి, వాటిని రాల్చి వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా నిద్రపోతాయి. మా తోటలో వేసిన చెట్లూ తీగలూ వాడిపోయి రాలి పోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మా తోటలో దిగుమతి చాలా తక్కువ వచ్చింది. పెట్టిన శ్రమకు తగినట్లు రాలేదు.
అసలు ఇక్కడ పెరటి తోట వెయ్యాల్సినది మేలో. ఈ సంవత్సరం మాకు అది కుదరక ఒక నెలరోజుల తర్వాత మొక్కలు నాటాల్సి వచ్చింది. దీనికంతా కారణం మా పెరట్లో ఉండే పెద్ద మేపుల్ చెట్టు. ఒక చెట్టు అనటం కన్న పది చెట్ల కలయిక అంటే బాగుంటుందేమో. వాటి వయసు దాదాపు యాభై ఏళ్ళ పైనే ఉంటుంది. అందులో ఒకటి రెండు చెట్లు కాలం చేసి మోడులుగా ఉన్నాయి. కొట్టించటం ఇష్టంలేక అల్లాగే ఉంచాము. హఠాత్తుగా ఒక రోజున వంటింటి కిటికీలో నుండి చూస్తుండగా ఎండిపోయిన చెట్టు నుండి ఒక దుంగ విరిగిపోయి శబ్దం చేస్తూ కింద పడింది. ఇంక పిల్లలూ పెద్దలూ ఏకగ్రీవంగా చెట్టు కొట్టించాలని నిర్ణయం జరిగింది. ఇంకా ఇంటావిడ ప్రయత్నం మొదలెట్టింది. మా ఇంట్లో నలుగుర్ని పిలవటం వాళ్ళెంత తీసుకుంటారో ఎప్పుడు పని పూర్తిచేస్తారో కనుక్కోవటం ఇంటావిడ బాధ్యత. నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు రోజులు పట్టింది చెట్టు కొట్టి పడెయ్యటానికి. అమ్మయ్య అంతా అయిపోయింది అనుకుంటూంటే చెట్టును మొదలు చప్టా చేసే యంత్రం నుండి ఒక పెంకు వెళ్ళి మేడ మీద కిటికీ అద్దం పగలకొట్టింది. ఆ అద్దము విడిగా తెప్పించి ఫిట్ చేసే సరికి జూన్ వచ్చేసింది. బతిమాలితే ఆ చెట్టు కొట్టినవాడే విత్తనాలు వెయ్యటానికి తోట దున్ని పెట్టాడు.
మాకు ఈ సంవత్సరం వచ్చిన కాపు ఒక అరడజను సొరకాయలూ, ఒక అరడజను బీరకాయలూ , ఒక ఇరవై దోసకాయలూ, ఒక యాభై టొమాటోలు ఒక వంద పచ్చిమిరప కాయలు. అన్నీ మేము వాడుకోలేము దగ్గరున్న వాళ్లకి పంచాము. వచ్చింది తక్కువే కానీ అదొక తృప్తి. వచ్చిన ఈ కాస్తకి, రోజూ నీళ్ళు పోస్తూ, కలుపుతీస్తూ శ్రమించాలా అనిపించవచ్చు కానీ, మనం కోట్ల మందీ పెరటి తోటతో పండిస్తుంటే దేశం ఎంత సుభిక్షంగా మారుతుంది ! ఎదో దేశం లో ప్రతియింటికీ ఇంటిముందు కొంచెం ఖాళీ స్థలం ఇచ్చి సంవత్సరానికి వాళ్లకు కావాల్సినవి పండించుకుని తినమంటారుట. అంటే జనానికి తిండి లేకపోతే అది వాళ్ళ సోమరితనమే, ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పటం.
ఈ సంవత్సరం తోట మూలాన ఒక నగ్న సత్యం తెలుసుకున్నాను. సొర తీగ పెరిగి పోతూ ఉంటే దాన్ని ఒక ఫ్రెమ్ లో ఉంచుదామని ప్రయత్నించి విఫలం అయ్యాము. ఎన్నిసార్లు సొర తీగని ఫ్రెములో పెట్టినా అది పెరిగిపోయి పక్కనున్న చెట్టుకు అల్లుకుపోయి సొరకాయ పిందెలు వేసింది. మనం ఎవరి గమనాన్నీ ఏమీ మార్చలేము. అందుకనే ఎవరికర్మ వాళ్ళు అనుభవించాలి, ఎంత ప్రయత్నించినా మార్చలేము అంటారు.
నాలుగు రోజులబట్టీ వర్షాలు పడి ఇవ్వాళే సూర్య భగవానుడు బయటికి వచ్చాడు. మాకు కొన్ని ఈతి బాధలు వున్నాయి వాటి సంగతి చూడాలి. ఇంట్లో వాషింగ్ మెషిన్ పాడయింది. వంటింట్లో సింక్ లో వేడి నీళ్లు రావటల్లేదు. మా రెండో కారు కి ఒక టైర్ గాలిపోతుంది. నెల రోజులకొకసారి దానికి సిగరెట్ లైటర్ ద్వారా పంప్ పెట్టి గాలి కొడతాను. ఇప్పుడు సిగరెట్ లైటర్ పని చెయ్యటం మానుకుంది. రెండవకారు దగ్గర పెట్టి దాని సిగరెట్ లైటర్ ద్వారా గాలి కొడుతున్నాను. దాని సంగతేదో చూడాలి.
ఇవ్వాళ శనివారం. దగ్గర ఇండియా మాల్ లో పెద్ద వినాయకుని విగ్రహం పెట్టి చవితి చేసి, ఇవ్వాళ నిమజ్జనం. అక్కడికి వెళ్ళాలి. బయట నిశ్శబ్దంగా ఉన్నది. ఈ నిశ్శబ్దాన్ని భరించలేక ఇంటావిడ సినీమా పెట్టింది "Marriage Italian Style ". అదొక పాత ఇటాలియన్ సినిమా, ఇంగ్లీష్ subtitles . ఒకావిడ డబ్బున్న ఒకాయనతో చాలా సంవత్సరాలు సహా జీవనం చేస్తూ ఉంటుంది. ఆయనకి ఈవిడతో మొహం మొత్తి ఇంకోఅమ్మాయితో తిరుగుతూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సంగతి తెలిసి మొదటావిడ చాలా అస్వస్థకు గురి అయిపోయి తన యింటికి చేరుతుంది. ఇంట్లో వాళ్ళు , డాక్టర్ చెప్పాడు అమ్మాయి చనిపోతుందని చివరి చూపుకు రమ్మని ఆయనకి కబురు చేస్తే, వస్తాడు. చివరి కోరికగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని చచ్చిపోతానంటే అప్పటికప్పుడు ప్రీస్ట్ ని పిలిచి పెళ్లి చేస్తారు. పెళ్లి అవ్వగానే ఆవిడ తన దొంగ అస్వస్థకు స్వస్తి చెప్పి భార్యగా తన ఆధిపత్యం చూపుతుంది. ఆయన ఇది భరించలేక , ఒక దొంగ మిషతో పెళ్లి చేసుకుందని కోర్టులో విడాకులు తెచ్చుకుంటాడు. పోతూ పోతూ కాన్వెంట్లలో పెరుగుతున్న తన ముగ్గురు పిల్లల్ని ఇంటికి రమ్మంటుంది. వచ్చిన పిల్లల్ని చూపెట్టి అందులో ఒకరు నీ పిల్లాడు అని చెబుతుంది. ఇంటాయన తటపటా ఇస్తాడు. పితృప్రేమతో, వాళ్ళల్లో తన పిల్లాడెవరో తెలుసుకోలేక చివరికి మళ్ళా మొదటి ఆవిడనే తిరిగి పెళ్ళి చేసుకుని, ఆ ముగ్గురు పిల్లల్ని తాను adopt చేసుకుంటాడు. అదీ సినిమా.
ఈ పోస్ట్ వ్రాయటం సెప్టెంబర్ లో మొదలెట్టాను . అక్టోబరులో అయినా పూర్తి చేద్దామని ప్రయత్నం. ఇవ్వాళ అక్టోబర్ చివరి రోజు. ఈ సంవత్సరంలో మొదటి గా ఇవ్వాళే స్నో పడింది. ఆ తరువాత ఎండకూడా వచ్చింది. మా తోట రంగులు మారి, వడలి పోతున్న ఆకులతో స్నోలో ఎలా
మెరిసిపోతోందో చూడండి.
ఇవ్వాళ "హాలోవీన్". పిల్లలు గుమ్మడికాయలమీద బొమ్మలు చెక్కుతారు. పిల్లలు "ట్రిక్ ఆర్ ట్రీట్ " అనుకుంటూ ఇంటింటికీ తలో సంచీ పుచ్చుకుని వస్తారు. ఇంటి పెద్దలు వాళ్లకి "కాండీ" సంచీలోవేస్తారు. పిల్లలికి ఈ రోజు చాలా ఇష్టం. సంవత్సరానికి తినేటంత "కాండీ" వస్తుంది. మా ఇంటికి సాయంత్రం నాలుగు గంటల నుండీ పిల్లలు "కాండీ" కోసం వస్తున్నారు. ఇప్పుడే మా మానమలూ మానవరాళ్ళూ చేసిన గుమ్మడి కాయల ఫోటోలు వచ్చాయి. అందులో రెండు కింద పెడుతున్నాను.
As usual very captivating and entertaining! Thanks for sharing!
ReplyDeleteThanks for the comment. Take care in winter.
DeleteVery interesting. అమెరికా లైఫ్ ని టచ్ చేస్తూ రాయడం బాగుంది.
ReplyDelete" జుట్టూ జుట్టూ పట్టుకున్న రోజులున్నాయి "
తమాషాగా ఉంది 🙂
ధరిత్రీ గారూ: "తప్పదు మరి. అన్నిటి లోనూ ఏకీ భావం ఉండదుగా మరి. మధ్యలో రంగులు మరిన ఆకుల ఫోటో మీకు నచ్చిన దనుకుంటాను. మా దగ్గరలో ఉన్న ఊరికి వీధుల్లో రకరకాల రంగులతో ఉన్న చెట్లని చూడటానికి చాలామంది ఈ ఫాల్ సమయంలో వస్తారు.థాంక్స్ ఫర్ ది కామెంట్.
ReplyDeleteకొందరు అలనాటి రచయితల శైలిలో బాగా వ్రాశారు 👌🙂.
ReplyDelete“సిగరెట్ లైటర్ ద్వారా పంప్ పెట్టడం” ఏమిటండీ, అర్థం కాలేదు 🤔.
గాలి గొట్టే పంప్ కి కరెంట్ కావాలి. దానిని కారు లో ఉండే సిగరెట్ లైటర్ సాకెట్ నుండి తీస్తారు. ఇప్పటి కార్లలో అవి ఉన్నయ్యో లేవో నేను గమనించలేదు.
ReplyDeleteపోస్ట్ హెడ్డింగ్ తెలుగులో తర్జుమా చేద్దామనుకున్నా గానీ , ఆ అర్ధం తీసుకు రాలేక పోయాను. పోస్ట్ కు మీరు స్పందించినందుకు థాంక్స్.
రెండు కార్లవసరమేముంటుందా అని ఎప్పుడూ సందేహమే ఉండేదండి ఇవ్వాళ అర్థమయిందండి అది దేనికోసమో :)
ReplyDeleteరెండవ కార్ ని బాక ప్ క్రిందవాడతాము. అసలు ఉపయోగం ఎప్పుడంటే ఇంట్లో ఒకళ్ళ పొడ ఒకళ్ళకి పడలేని సమస్య వస్తే తగ్గేదాకా చెరొక కారు వేసుకుని బయటికి వెళ్ళొచ్చు . థాంక్స్ జిలేబీ గారూ.
Deleteఈ గుమ్మడికాయలతో కూర వండుతారా?
ReplyDeleteమొదట్లో గుమ్మడి కాయలని చూసి ముచ్చటపడి ఆహా నా భాగ్యం అనుకున్నాను. నాకు గుమ్మడి పులుసంటే చాలా ఇష్టం. అందుకని ట్రై చేశాను . బాగా రాలేదు. ఆ రుచి రాలేదు. నేనేమీ ఎక్సపర్ట్ కుక్ ను కాదు కనక నా అభిప్రాయం టేక్ విత్ ఎ గ్రైన్ అఫ్ సాల్ట్.వీటిని చాలావరకు పంప్కిన్ పై లుగా చేస్తారు. నా ఉద్దేశంలో చాలావరకు గార్బేజ్ లోకి వెళ్తాయి. నీహారిక గారూ బాగున్నారా. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDelete