Saturday, August 23, 2014

102 ఓ బుల్లి కథ 90 --- కంప్యూటర్ మూల పడితే

గత రెండు నెలల నుండీ నా కంప్యూటర్ సరీగ్గా పని చెయ్యటం మానేసింది. "ఈనాడు" వార్తలు లేవు "హిండూ" వార్తలు లేవు "మాలిక" బ్లాగులు చూడటం లేదు. పోనీ పని చెయ్యటం మానేసి గుట్టుగా కూర్చుంటుందా అంటే అదీ లేదు. "ఈనాడు" తీసుకు రావమ్మా అంటే ఒక అరగంటకి తీసుకు వస్తుంది. ఒక్కొక్కప్పుడు దానికోసం అలా చూస్తూ కూర్చోవాలి.

నేను ఇంటర్నెట్ ప్రొవైడర్ కస్టమర్ సపోర్ట్ కి ఫోన్ చేశాను. మీ ఇంట్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి అని అడిగాడు. మూడు ఉన్నాయి రెండు బాగానే పని చేస్తున్నాయి అని చెప్పాను. ఆ చెప్పటం తప్పయి పోయింది. మూడింట్లో రెండు పనిచేసి మూడోది పనిచెయ్యకపోతే మూడవది పాడయ్యి ఉంటుంది అని తేల్చాడు. ఇంక వాళ్ళు మాయింటికి వచ్చి నా ప్రోబ్లం సంగతి చూడటం సున్నా.

ఇంట్లో భర్త, ఏ పనీ చెయ్యకుండా కంప్యూటర్ స్క్రీన్ ఎదురుకుండా కూర్చుని జపం చెయ్యటం ఏ భారత నారీ మణికీ ఇష్టముండదు ! నాన్నగారి సమస్య గురించి మా ఆవిడ పిల్లల్ని అడిగింది. "కంప్యూటర్ పాతదయి పోయింది వైరస్ లు ఉండి ఉంటాయి కొత్తది కొనటం మంచిది" అని సలహా ఇచ్చారు.

నా కెందుకో కొత్త కంప్యూటర్ కొనటం ఇష్టం లేదు. నాలాంటివాడు  యాఫ్త్రాల్  ఓ జీవంలేని కంప్యూటర్ కి లొంగిపొవాలా ? అయినా కంప్యూటర్ కొన్ని రోజులు లేకపోతే జీవితం తల్లకిందులు అవదు కదా. దీనిసంగతి ఏదో   తేల్చుకోవాలని అనుకున్నాను.

పూర్వం ఇటువంటి పరిస్థితి వస్తే కంప్యూటర్ హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఫార్మాట్ చేసి వాళ్ళు ఇచ్చిన డిస్కులతోటి ఆపరేటింగ్ సిస్టం ని లోడ్ చేసేవాణ్ణి. కంప్యూటర్ దాదాపు కొత్త కంప్యూటర్ లాగా అయ్యేది. అలా ఏమన్నా చేయచ్చోమో అనే ఆశతో దాచిపెట్టిన కంప్యుటర్ file పైకి తీశాను.

ఈ laptop కొని 5 ఏళ్ళయింది. "Gateway " వాళ్ళు తయ్యారు చేశారు. windows 7 ఆపరేటింగ్ సిస్టం. కొత్త కంప్యుటర్ కొన్నప్పుడు వాటితో వచ్చిన వాటి నన్నిటినీ (మాన్యుయల్స్ వగైరా) ఒక పెద్ద కవర్ లో పెట్టి దాచి పెట్టాను. Instruction Manual,  "recovery " అని నా రైటింగ్ తో నాలుగు డిస్కులూ ఉన్నాయి. నేనే ఎప్పుడో వాటిని తయారు చేసి ఉంటాను. Instruction Manual లో కంప్యూటర్ ని పూర్వ దశకి తీసుకు రావచ్చేమో అని వెతికాను. recovery management అని ఒకటుంది దాని ద్వారా కంప్యూటర్ ని పాత టైం లోకి తీసుకు వెళ్ళచ్చు అని తెలుసుకున్నాను.

"start " icon ను క్లిక్ చేసి చూస్తే all programs లో Gateway అని ఉంది, క్లిక్ చేశాను. Gateway Recovery Management వచ్చింది. ఇంక నా పని నల్లేరు నడక నుండి పూల బాట మీద నడక అయ్యింది. ఇంక తనే చెప్పేసింది ఎల్లా recover అవ్వాలో(restore ద్వారా ). టైం మెషీన్ తో పాత కాలం లోకి పోయినట్లు దాదాపు ఒకటిన్నర గంటల్లో నా కంప్యూటర్ కి పూర్వ వైభవం తీసుకు రాగలిగాను. మీరు మీ laptop కి recovery డిస్క్ లు ఇంకా క్రియేట్ చెయ్యకపోతే తప్పకుండా వెంటనే చెయ్యండి. ఎప్పుడో అప్పుడు అవసరం రావచ్చు.

సరే కొత్త కంప్యూటర్ తోటి టెస్ట్ మొదలెట్టాను. కాసేపు Internet బాగా వచ్చింది కానీ తరువాత అంతా మామూలే. ఏమిటో అర్ధం కావటల్లేదు. ఒకరోజు నిద్రపట్టక పోతే రాత్రి 3 గంటలకి కంప్యూటర్ ఆన్ చేసాను. మీరు నమ్మరు blasting speed లో Internet వచ్చింది.

ఎన్ని రోజులని కంప్యూటర్ కోసం తెల్లవారు ఝామున లేచేది ? ఇంక విసుగు వచ్చేసి ఏమవుతుందో చూద్దామని కంప్యుటర్ ని మేడ మీద నుంచి కిందకి తీసుకు వచ్చాను. బ్రహ్మాండ మయిన స్పీడ్ తో Internet వచ్చింది. అప్పటినుండీ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఇంత సులువుగా నా ప్రాబ్లం సరి అవుతుందని అనుకోలేదు. ఒక విధంగా చూస్తే నా రెండు నెలల శ్రమా వృధాయే.

ఈ పోస్ట్ కి ఉపసంహారం ఏమి వ్రాసేది ? నాకు నేనే తిట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి.  ఈ పనిని నేను ముందరే ఎందుకు చెయ్య లేదు ? అనే ప్రశ్నకి సమాధానం లేదు. కానీ ఈ రెండు  నెలలలో laptop maintenance మీద చాలా తెలుసుకున్నాను. Windows లో కంప్యూటర్ ప్రొబ్లెమ్స్ సాల్వ్ చేసే tools చాలా ఉన్నాయి. మీరు క్రింద చెప్పిన విధంగా క్లిక్ చేసుకుంటూ పోతే వాటి గురించి చాలా తెలుస్తాయి. మీకు కంప్యూటర్ ప్రొబ్లెమ్స్ ఉంటే వాటినుండి బయట పడటానికి ఇవి చాలా పనికి వస్తాయి.

1. start -> control panel -> system and security

2. start -> right click on the computer -> properties

P.S: ప్రస్తుతం డైనింగ్ టేబుల్ మీద తిష్ట వేశాను. ఎంత కాలం సాగుతుందో తెలియదు. డైనింగ్ టేబుల్ కిచెన్ కిందకి వస్తుంది. కిచెన్ నా ఆధీనంలో లేదు. 

Saturday, August 16, 2014

101 ఓ బుల్లి కథ 89--- మీరు న్యూయార్క్ వెళ్తే - ఇవ్వాల్సిన ముడుపులు

క్రిందటి నెల జూలైలో మేము న్యూయార్క్ వెళ్ళటం జరిగింది. ఏ ఊరయినా వెళ్ళినప్పుడల్లా,  నలభై ఏళ్ళ క్రిందట యునివెర్సిటీ  చికాగోలో కలిసి తిరిగిన మా నలుగురు స్నేహితులం దగ్గరలో ఉంటే తప్పకుండా కలుసుకుంటాము. మేమందరం రిటైర్ అయ్యాము. మేమందరం చదువుకున్నదొకటి జీవితంలో భుక్తి కోసం చేసినది మరొక్కటి. మీరు కూడా ఇటువంటి పరిస్థుతులలో ఉంటే విచారించకండి. జీవితంలో అది మామూలే అని గ్రహించండి.

అసలు సంగతికి వస్తే మాలో ఒక స్నేహితుడు రామారావు "డిల్హై" నుండి మా ఇంటికి వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళాడు. అమెరికాలో "డిల్హై" ఏమిటా అంటారా! మీరు నమ్ముతారో నమ్మరో న్యూయార్క్ స్టేట్ లో DELHI అనే ఒక ఊరు ఉంది. ఎవరో ఎప్పుడో ఢిల్లీ వెళ్లి ముచ్చటపడి ఆ పేరు వాళ్ళ ఊరికి పెట్టుకున్నారుట. ఇంతెందుకు మనకి తెలిసిన పేర్లు "సేలం" "అశోకన్" "శోకన్" "గాంజెస్ సిటీ" లాంటివి ఎన్నో వున్నాయి.

ఇంకొక స్నేహితుడు మోహన రెడ్డి దగ్గరలో "లాంగ్ ఐలెండ్" లో ఉంటారు. మేము మెన్హాటన్ లో కలుసుకుందామని నిర్ణయించు కున్నాము. మేము జెర్సీ సిటీ నుంచి వచ్చే PATH ట్రైన్ స్టేషన్, ఆయన వచ్చే PEN  స్టేషన్ దగ్గరలో ఉంటాయి కనుక సులువుగా కలుసుకో గలిగాము. SUBWAY లో VEGGI MAAX తింటూ ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బయటికి వచ్చాము. అది BROADWAY  స్ట్రీట్.

BROADWAY  చాలా పెద్ద వీధి. "Bloomberg" అనే న్యూయార్క్ మేయర్ ఈ వీధిని రెండు భాగాలు చేసి చిన్న భాగంలో వాహనాలు, సైకిళ్ళూ పోవటానికి ఉంచి, పెద్ద భాగంలో ప్రజలు కూర్చోటానికి వీలుగా కుర్చీలు టేబుల్స్ వేసి అలంకరించారు. జనం మధ్యాన్నం లంచ్ టైం లో బాగా ఉంటారు. నడుస్తూ పెద్దగా మాట్లాడుతూ దగ్గరలో నిద్రబోతున్న అమ్మాయిని లేపేసాము. కూర్చోటానికి మాకు మంచి టేబుల్ దొరికిందనుకోండి. BROADWAY, theatres కి ప్రసిద్ది. చిన్నా చితకా నాటకాల నుండి ప్రపంచములో ప్రశిద్దమయిన నాటకాలు ఈ వీధిలో పుట్టినవే. సంవత్సరం పొడుగునా ఇక్కడ నాటకాలు వేస్తూ ఉంటారు. క్రిందటి తడవ వచ్చి నప్పుడు "మామా మియా" అనే నాటకాన్ని చూశాము. ఇక్కడ అది ఎన్నో సంవత్సరాల బట్టీ ఆడుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత TIME SQUARE ఇక్కడే దగ్గరలో ఉంది. EMPIRE STATE బిల్డింగ్ కూడా దగ్గరలోనే. ఒకప్పుడు ఈ వీధి నేత మగ్గాలకి ప్రశిద్దిట. MADE IN AMERICA వస్త్రాలన్నీ ఇక్కడ నుండే వచ్చేవి.

చక్కటి వసంతకాల వాతావరణం. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలో నాకు ఎదురుకుండా DUNKIN DONUTS బోర్డ్ కనపడింది. ఆటే చూస్తున్నాను. మా ఆవిడకి అర్ధమయ్యింది "కావాలా" అని అడిగింది. నాకు వాళ్ళు చేసే FRENCH CURLERS అంటే భలే ఇష్టం. వీళ్ళు ఒకప్పుడు world's best coffee బోర్డు పెట్టుకునే వాళ్ళని కూడా అన్నాను. మా స్నేహితుడూ మా ఆవిడా వెళ్ళి DONUT , COFFEE పట్టుకు వచ్చారు. ఇదివరకంటి రుచిలేదు గానీ బాగానే ఉన్నాయి. ఏమిటో అదో త్రుప్తి. మా ఆవిడకు నేను చేస్తున్న పనులు ఏమీ నచ్చలేదు. న్యూయార్క్ వెళ్ళి మెన్హాటన్ లో SUBWAY SANDWICH , DONUT , COFFEE తిన్నారనే భావన రావటం ఆవిడకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఏమిటో ఎవరి త్రుప్తి వారికి ఆనందంగా ఉంటుంది. Honalulu (Hawaii ) లో హోటల్లో అన్నం వండించుకుని గోంగూర ముద్ద sour cream (మీగడ) తో తిన్న వాళ్ళు, పల్లెటూరిలో పుట్టి పెరిగి పొద్దున్నే చద్ది అన్నము తిన్న వాళ్ళ దగ్గరనుండి ఇంకేమి కోరుకుంటారు అనుకుని ఆవిడ త్రుప్తి పడుంటుంది.

ఇంక rush hour దగ్గర పడుతోంది అని ట్రైన్ స్టేషన్ కి బయల్దేరాము. వీధిలో చాలా గందరగోళం గా ఉంది. పాడుతున్నారు ఆడుతున్నారు తింటున్నారు తిరుగుతున్నారు. అసలు  న్యూయార్క్ ఒక టూరిస్ట్ ప్లేస్. రోజుకి లక్షలమంది వచ్చి పోతూ ఉంటారు. వీధిలో ఒకచోట టూరిస్ట్ phamplets పెట్టారు. గబగబా వెళ్లి ఒక పుస్తకం తెచ్చు కున్నాను. అది నెల నెలకి వచ్చే టూరిస్ట్ పత్రిక. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఉపోద్ఘాతం కూడా వ్రాశారు. అమెరికాలో ఆనవాయితీ ఒకటుంది. మనకి వాళ్ళు చెయ్యాల్సిన పని చేసిన తరువాత మనం సంతోషపడిపోయి వారి చేతిలో డబ్బులు పెట్టటం. నిజంగా సంతోషపడినా పడకపోయినా డబ్బులు చేతిలో పెట్టాలి. వీటిని tips అంటారు. కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు కొందరు చాలా తక్కువ ఇస్తారు. అందుకని ముడుపులు (tips ) ఇవ్వటం ఈ ఊళ్ళో ఆనుమాయితీ అనిన్నూ, తరువాత మీరు ఏపనికి ఎంత tip ఇవ్వాలో అనుమానాలు లేకుండా ఈ పుస్తకంలో వేశారు. అంతేకాదు tips డబ్బు రూపంగా ఇవ్వాలి గానీ credit card తో కాదు అని కూడా విన్నవించారు. ఆ ముడుపులు ముందరే  తెలుసుకోవటం ఎందుకయినా మంచిదని క్రింద పొందు పరుస్తున్నాను.

Waitstaff, 20%.    Bartender, $1 drink.    Coatroom attendent, $1-2 a coat. Valet, $2-5 for each trip.
Washroom attendent, 50 cents to $1.    Hotel doorman, $1 per bag and $1/ per person for hailing a cab.
Hotel housekeeper, $2 - $5 per night.    Hotel concierge, $5+ for getting you tickets or reservations.
Tour Guides, $5 - 10 for giving helpful information and entertainment during tour.
ప్రస్తుతం రేటు $1 = 60 రూపాయలు.

Taken From: NewYorkCity Monthly, July 2014, page #74 Quick Tips for tackling.

Monday, May 5, 2014

100 ఓ బుల్లి కథ 88 --- దేవుడు మన కోర్కెలన్నీ ఎందుకు తీర్చాలి ?

సామాన్యంగా కోర్కెలు అందరికీ ఉంటాయి. సన్యాసులకి కోరికలుండ వంటారు నిజమెంతో అబద్దమేంతో తెలియదు. మానవ మాత్రులకి కోరికలు లేకుండా ఉండటం చాలా కష్టం. ఏ చిన్న కోరికయినా రేపు తీరవచ్చు అనే ఆశ తోటి మనం ఉత్సాహంగా జీవిస్తూ ఉంటాము. ఆ కోరికలు లేకపోతే ఆ ఆశా ఉండదు జీవితంలో ఆ ఉత్సాహమూ ఉండదు. ఆశ ఉత్సాహం లేని జీవితం వృధా.

కోర్కెలు తీర్చుకోవాలంటే దాదాపు ఇంకొకళ్ళ సహాయం తప్పక కావలసి వస్తుంది. ఉదాహరణకి నాకు రోజూ పోద్దునపూట మంచి కాఫీ తాగాలని కోరిక. దానికి మా ఆవిడ సహాయం తప్పకుండా కావాలి. ఏది మంచి కాఫీ అనే దాని నిర్వచనం మా ఇద్దరిదీ ఒకటి కాక పోవటం మూలంగా ఆ కోరిక రోజూ నెరవేరదు. ఇంకొకళ్ళు సహకరించక కోరికలు తీరకపోతే, ఆ కోరికలు చంపు కోవటమో లేక సూపర్ పవర్స్ ని ప్రార్ధించటమో చెయ్యాల్సి వస్తుంది. నేను అప్పుడప్పుడూ సూపర్ పవర్స్ ని ప్రార్ధిస్తాను.

సూపర్ పవర్స్ అంటే ఏమిటి? మనకు తెలిసినంతవరకూ ఏకారణం లేకుండా ఏదీ మన ఎదురుకుండా అమాంతంగా ప్రత్యక్ష మవదు. పనులు వాటంతట అవి జరగవు కాబట్టి, ఈ సృష్టి అనే క్రియకి ఒక కర్త ఉన్నాడని తెలుస్తోంది. ప్రత్యక్షంగా మన ఎదురుకుండా కనపడే సృష్టికి ఒక కర్త ఉన్నారని అనుకుంటే ఈ సృష్టి కంతా కారణం సృష్టికర్త ఒక రున్నారని చెప్పవచ్చు. ఆ సృష్టికర్తనే మనము దేవుడని అంటాము. ఆయనకున్నవే సూపర్ పవర్స్, జగతిని సృష్టించ గలిగే పవర్. మనకులేని ప్రజ్ఞ.

మనని సృష్టించిన వాళ్ళని మనం సుఖంగా ఉండటానికి కోరికలు కోరుకోవటంలో తప్పులేదు. అంతపెద్ద ప్రకృతినే సృష్టించిన వానికి మన చిన్నకోరికలు తీర్చటం పెద్ద కష్టం కాదని మన నమ్మకం. ముఖ్యంగా ఆ కోరికలన్నీదాదాపు మనకో మన కుటుంబానికో మంచి జరగాలని. అలాగే ఒక్కొక్కప్పుడు శత్రువులకి మంచి చెయ్యకూడదని కూడా కోరుకుంటాము. ముఖ్యంగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ పూజలు చేస్తూ ఉంటే మనము అడిగింది తప్పకుండా చేస్తాడని మన నమ్మకం. అందరం ఆయన సృష్టే కాబట్టి అందరికీ కోరికలు ఉంటాయి కాబట్టి కోరిక కలగగానే వెంటనే ప్రార్ధించటం మంచిది. మన లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కోరికలు కోరుకునే వాళ్ళ లైనులో మనం ముందర ఉండటం బాగుంటుంది. ఫస్ట్  కం ఫస్ట్ సర్వుడ్. లేదంటే మీ కోరిక ఎందుకు ముందర తీర్చాలో విశదీకరించాలి .

మనని సృష్టించినంత మాత్రాన సృష్టికర్త (దేవుడు) మన కోర్కెలు తీర్చాలని ఎక్కడుంది? ఎంత ప్రార్ధించినా కీర్తించినా అడిగిన మన కోరికలన్నీ తీర్చబడవు. ఇది మనకి తెలుసు. మన కోరికల్లో ఏవి తీర్చ బడతాయి ఏవి తీర్చ బడవు అనేది మనము చెప్పలేము. అసలు మనము కోరికలు కోరాలా? అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఉదాహరణకి మన పిల్ల లున్నారు. వారి సృష్టికర్తలు మనమేకదా. వారి కోరికలు కొన్ని వారు కోరకుండానే తీరుస్తున్నాము, కొన్నికోరినా తీర్చటల్లేదు.

ఇంకో కోణం లో నుండి చూస్తే, మనని సృష్టించిన సృష్టికర్తకి కూడా కోరికలు ఉండచ్చు కదా, మనము తీర్చ గలుగుతున్నామా? వప్పుకుంటాను దేవుడికి ఏమి కోర్కెలు ఉన్నయ్యో మనకి తెలియదు. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా మనకి తెలియదు. ఒకవేళ  సృష్టి కర్త ఎక్కడ ఉంటాడో తెలిసినా ఆయన కోర్కెలు తీర్చ లేమేమో! ఎందుకంటే మనకు తెలిసిన మన సృష్టి కర్తలు మన తల్లి తండ్రులు కదా. వాళ్ళ కోర్కెలు అన్నీమనం తీర్చగలుగు తున్నామా? అయినప్పుడు దేవుడి కోర్కెలు మనమేమి తీర్చగలం!.

మనకు తెలిసిన మన సృష్టి కర్తల కోర్కెలే మనము తీర్చలేనప్పుడు మనకు తెలియని సృష్టికర్త మన కోర్కెలు ఎందుకు తీర్చాలి?

(ఈ పోస్ట్ కి మూల కారణం ఆలోచింప చేసే ప్రశ్నవేసిన ఈమని శ్రీనివాస్ గారు)

Sunday, March 16, 2014

99 ఓ బుల్లి కథ 87 --- ఆర్కిటిక్ వింటర్ లో ఓ రోజు



ఫోటో చూసి ఇదేదో భూత ప్రేత లోకం లో ఒక దృశ్యం అనుకుంటున్నారా! పోద్దునపూట మా ఇంటి కిటికీ లోంచి బయటకు చూస్తే కనపడిన దృశ్యం అది . ఈ వింటర్లో అనుకోకుండా నిన్న బయట వెచ్చగా చాలా బాగుంది. షాపు లన్నీతిరిగేసి కూరలూ గట్రా తెచ్చుకున్నాము . సాయంత్రానికి వర్షం పడటం మొదలయ్యింది. కానీ తెల్లారి కిటికీలోనుండి చూస్తే పై ఫోటో లా ఉంటుందని ఊహించలేదు.

మేము ఉండేది అమెరికాలో చికాగో దగ్గర. దాదాపు నవంబర్ నుండీ బాగా చలి మొదలవుతుంది. డిసెంబర్ నుండి మార్చ్ దాకా ఆకాశాన్నించి ఎవరో ముగ్గు పోస్తూ ఉన్నట్లు స్నో పడింది ఈ సంవత్సరం. (నీళ్ళు గడ్డకట్టుకుని ఐస్ గ మారటం,  0 డిగ్రీలు సెంటీగ్రేడు లేక 32 డిగ్రీలు ఫారన్  హీట్ దగ్గర అవుతుంది. స్నో పడుతోంది అంటే ఉష్ణోగ్రత అంతకన్నా తక్కువగా ఉందన్న మాట.) ఈ వింటర్ లో దాదాపు వరుసగా డెబ్భై రోజులు అలా ఉంది. దానికి ఆర్కిటిక్ నుండి వచ్చే ఈదురు గాలి తగిల్తే ఉష్ణోగ్రత -40F లాగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం పడిన స్నో 80 అంగుళాలు (అంటే దాదాపు 7 అడుగులు లేక 2 మీటర్లు). ఇది ఒక రికార్డ్. రోడ్లమీద స్నో తీసిన తరువాత ఉన్న అవశేషం కరగటానికి వేసే ఉప్పు చివరి రోజుల్లో దాదాపు అయిపోయింది.

ఇక్కడ  చికాగోలో వాతావరణంలో చలి సెప్టెంబర్ తో ప్రారంభ మయి, జనవరి ఫిబ్రవరి లో ఉదృతంగామారి, మార్చికి చాలావరకు తగ్గి, ఏప్రిల్ లో చెట్లు చిగిర్చే విధంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా గడబిడ అయిపొయింది. "ఆర్కిటిక్ వర్టేక్స్" ట అనుకోని చలిగాలులతో రోజూ గొడవే. బయటికి వెళ్ళా లంటే శరీరం మీద కనీసం మూడు వరసల బట్టలు ఉండాలి. బయట అరవై రోజులు వరుసగా బిలో ఫ్రీజింగ్ (నీళ్ళు గడ్డ కట్టటానికన్న తక్కువ ఉష్ణోగ్రత). పైనించి ఎవరో వీభూతి చల్లుతున్నట్లు తెల్లగా స్నో పడింది. మునిసిపాల్టీ వాళ్ళు ట్రక్కు లను పంపించి స్నోని పక్కకి జరిపి రోడ్లన్నిటిమీదా కార్లు పోయేటట్లు చేస్త్హారు. ఈ సంవత్సరం రెండురోజుల కొకసారి స్నో పడుతూనే ఉంది. ఆ  స్నో ఎక్కడికి పోలేక రోడ్డుపక్క కొండల్లా తయారు అవుతాయి. వాతావరణం మరీ ఉదృతంగా ఉంటే జనాన్ని ఇంట్లో కూర్చో మంటారు. ఒకటి రెండు సార్లు మా ఊరి మేయర్ ఇంట్లో కూర్చోమని ఫోన్ చేశారు. ఇంతజరిగినా మా ఆవిడకు ఆఫీస్ వాళ్ళు ఒకరోజు మాత్రమే సెలవిచ్చి రావద్దన్నారు. ఆవిడ లైబ్రరీ లో పనిచేస్తుంది. లైబ్రరీ కొన్ని సమయాలలో ఉండటానికి చోటు లేని వారికి షెల్టర్ గ పని చేస్తుంది అది కారణ మవ్వచ్చు.

క్రింద మా వీధి ఫోటో చూడండి. అది మిట్ట మధ్యాహ్నం తీసినది. ఎండ ఉదృతంగా ఉంది కానీ చలి అంతకన్నా ఉదృతం. ఎండకీ చలికీ సంబంధం లేదు. ఇళ్ళ మీదా రోడ్లమీదా తెల్లగా కనపడేదల్లా పేరుకుపోయిన మంచు, మంచు దిబ్బలు. కొన్ని చోట్ల స్నో ని లారీలలో వేసి బయటికి పంపిన రోజులు కూడా ఉన్నాయి. ఇదే అనుకుంటే ఎయిర్ పోర్ట్ ల సంగతి ఇంకా గొడవగా ఉంటుంది. చికాగో ఎయిర్ పోర్ట్ లో కొన్ని సెకండ్ లకు ఒక ప్లేన్ లాండ్ అవటమో పైకి ఎగరటమో జరుగుతుంది. రన్వే లన్నిటి మీదా స్నోతీసేయ్యాలి. తీసిన స్నో ప్లేనులకు తగలకుండా దూరంగా ఉంచాలి. వచ్చిన ప్లేన్ ల మీద స్నోపడితే వెళ్ళే ముందర తీసెయ్యాలి (దీనిని డి ఐసింగ్ అంటారు). లేకపోతే రెక్కల మీద బరువుకి అవి ఎగర లేవు. అందుకనే ఈ సమయంలో చాలా ఫ్లైట్ లు కాన్సిల్ చేస్తారు. ఫ్లైట్ లు కాన్సిల్ అయి ఎక్కడికీ వెళ్ళలేక ఎయిర్ పోర్ట్ లో జాగారం చేసినవాళ్ళు ఎందరో.



వింటర్ లో స్నో కోసం పరితపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. "సోచి" లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ మీరు చూసే ఉంటారు. పిల్లలు స్నోమాన్ లు చేసి ఆడుకుంటారు. ఐస్ తో శిల్పాలు చెక్కుతారు.  ఇక్కడ మా గుళ్ళో శివరాత్రికి ఐస్ తో శివలింగం చెక్కుతారు. మా దగ్గరలో ఉన్న గ్రేట్ లేక్స్ లో ఒకటయిన లేక్ మిచిగన్ దాదాపు పూర్తిగా గడ్డకట్టుకు పోయింది. శని ఆది వారాల్లో కొందరు ఆ ఐస్ మీద గుడారాలు వేసుకుని గుంటలు తవ్వుకుని ఐస్ అడుగున ఉన్న నీళ్ళలో గేలం వేసి చేపలని పట్టుకుంటారు. దీనిని ఐస్ ఫిషింగ్ అంటారు. ఇంతెందుకు క్రిందటి వారం నీళ్ళు వచ్చేదాకా లేక్ లో గుంట తవ్వి చికాగో మేయర్ తో సహా చాలామంది స్కిన్ డిప్ చేశారు. అంటే బట్టలు లేకుండా నీళ్ళల్లో దూకటం అన్న మాట.

ఇంకా ఈ సంవత్సరం వింటర్ గురించి చెప్పాలంటే నయాగరా ఫాల్స్ ఈ వింటర్ లో రెండు సార్లు గడ్డకట్టుకు పోయింది. నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది. ఇంతెందుకు మా ఇంట్లో ఎప్పుడూ లేనిది నీళ్ళ పైపు పగిలి నరకం చూపెట్టింది. సామాన్యంగా ప్రతీ ఇంట్లోనూ ఒక చల్ల నీళ్ళు తీసుకు వచ్చే పైపూ ఒక వేడి నీళ్ళు తీసుకు వచ్చే పైపూ ఉంటాయి. జనవరిలో ఒక రోజు పొద్దున "వేడి నీళ్ళు రావటల్లేదు" అనే అరుపుతో నిద్దర లేచాను. అది మా ఆవిడ ఆర్తనాదం. చన్నీళ్ళ తో స్నానం ఐస్ నీళ్ళు పోసుకున్నట్లే. ఆవిడ చల్ల నీళ్ళతో స్నానం చెయ్యలేదు, తిట్టుకుంటూ వేడినీళ్ళు కాచుకుని స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళింది. నాకు ఏమయిందో తెలుసు నోరు ఎత్తలేదు. ఎత్తితే ఏమవుతుందో కూడా తెలుసు. ఇంట్లో ఉన్న గిన్నెలన్నిట్లో నీళ్ళు పట్టుకుని కూర్చున్నాను. మధ్యాన్నం కరెంట్ పోయింది. బ్యాటరీ లైట్లు వెతికి తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. థాంక్ గాడ్ మళ్ళా రెండు గంటల్లో తిరిగి వచ్చేసింది. ఇంట్లో చలి విపరీతం గా ఉంది. మా హీటర్ టెంపరేచర్ పెంచాను. కొంత సేపు తర్వాత మా ఇంటి క్రింద భాగం నుండి పెద్ద శబ్దం వస్తోంది. చూస్తే పైప్ పగిలింది. జరిగిన దేమిటంటే, చలికి పైప్లో నీళ్ళు గడ్డకట్టుకుపోయి పైపు పగిలి, నేను ఇంట్లో పెట్టిన వేడికి పైప్లో ఐస్ కరిగి, పగిలిన చోటి నుండి నీళ్ళు పెద్ద శబ్దం చేస్తూ రావటం మొదలెట్టాయి. వెంటనే ఇంట్లోకి నీళ్ళు రావటం ఆపేశాను. ప్లంబర్ ని పిలిచాం. మర్నాడు సాయంత్రానికి గానీ రానన్నాడు. ఈ పరిస్థుతులలో ఇంట్లో జరిగిన యుద్ధం గురించి నేను వ్రాయలేను. రామ రావణ యుద్ధం అని చెపుదా మనుకున్నా గానీ వర్ణన సరిఅయినదని అనిపించలేదు. మొగవాళ్ళు ఆడవాళ్ళు మధ్య యుద్ధ కాండ మన పురాణాలలో ఎక్కడయినా ఉంటే దాని వర్ణన అది అన్న మాట. ఒక రోజు నీళ్ళు లేక పోతే ఎంత గందరగోళం జరిగిందో మీ కర్ధం కాదు!. అదృష్ట వశాత్తూ చిన్నప్పుడు ఇండియా లో పెరిగాము కాబట్టి నిత్యావసారాలకి ఏమి చెయ్యాలో తెలియటం మూలంగా పెద్ద ఇబ్బంది పడలేదు. కాకపోతే కుళాయి తిప్పితే వచ్చే వేడి నీళ్ళ సుఖం ఒక రోజు లేదు. అంతకన్నా ఇంకేమీ లేదు.

మర్నాడు ప్లంబర్ వచ్చి బాగు చేసి, డబ్బులు తీసుకుని కొంచెం చివాట్లు పెట్టి పోయాడు. వాటి సారాంశం, ఉష్ణోగ్రత బాగా పడిపోతున్నప్పుడు కుళాయి లోనుండి నీళ్ళ ధార కొద్దిగా వదిలిపెడితే పైపులో నీళ్ళు ఫ్రీజ్ అవ్వవు. ఈ వారంలో వంద ఇళ్ళల్లో పైప్ లు బాగు చేశాడట!. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని సంతృప్తి పడ్డాము.

ఇంకొక వారం రోజుల్లో వసంతకాలం వస్తుంది. చెట్లు చిగిర్చి పూవులు పూయును. మళ్ళా వింటర్ దాకా,  ఒక ఆరు నెలలు జరిగినదంతా మరిచి పోవచ్చు.

1. క్రిందటి సంవత్సరం వ్రాసిన అమెరికాలో మా వీధి పోస్ట్
http://mytelugurachana.blogspot.com/2013/02/90-78.html

Monday, December 30, 2013

98 ఓ బుల్లి కథ 86 --- జర్సీ సిటీ లో ఓ వారం


అప్పుడప్పుడే తెలవారుతోంది.  నెమ్మదిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సన్నగా శబ్దం వినబడుతోంది.  ఏమిటా అని కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాను. ఇదీ దృశ్యం. హడ్సన్ రివర్  అలలు వడ్డుని అమాయకంగా సుతిమెత్తగా స్ప్రుసిస్తున్నాయి. ఇవే అలలు 6 నెలల క్రిందట "Sandy Storm " అనే పేరుతో భీభత్సాన్ని సృష్టించి భీకరంగా ప్రవర్తించాయి. వాటి తట్టుడికి అదిరి చెదిరిపోయిన ఈ బిల్డింగ్ క్రింది భాగం ఇంకా బాగు చేస్తూనే ఉన్నారు. క్రిందటి సంవత్సరం వందమంది ప్రయాణీకులు ఉన్న ప్లేన్ రెండు ఇంజిన్ లు చెడిపోతే పైలెట్ హడ్సన్ రివర్ మీద ఆపటం మూలంగా అందరూ ప్రాణాలతో బయట పడ్డారు. ఇంజిన్లు చెడిపోటానికి కారణం. పక్షులు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ రన్వే మీద నుంచి ప్లేన్ లేస్తుంటే పక్షులు ఇంజిన్ లో దూరాయి. అంతపెద్ద ప్లేన్ ని నాలుగు పక్షులు disable చేశాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 

నిన్న రాత్రి చికాగో నుండి ఓ వారం రోజులు పిల్లల దగ్గర ఉండటానికి న్యూజెర్సీ వచ్చాము. ఇది మార్చి నెల చలికాలం పోయి వసంతకాలం వస్తోంది.

( మేము జర్సీ సిటీ కి మార్చ్ లో వెళ్ళాము. వెళ్ళి ఆరు నెలల పైన అయ్యింది. వ్రాద్దామని అనుకుంటూ ఉండగానే కాలం గడిచి పోయింది.)

ఫోటోలో ఎడమ పక్క న్యూ యార్క్ సిటీ, కుడి పక్క జర్సీ సిటీ మధ్య నిశ్సబ్దంగా పారుతున్న హడ్సన్ రివర్. న్యూ యార్క్ స్టేట్, న్యూ జర్సీ స్టేట్ లు అమెరికాలో పక్క పక్కన ఉండే రెండు రాష్ట్రాలు. ఆ రెండు రాష్ట్రాలనీ విడతీసే నది హడ్సన్ రివర్. హడ్సన్ రివర్ వెళ్ళి దగ్గరలో సముద్రంలో కలుస్తుంది.

మీకు ఎడమ పక్క పొడుగ్గా బిల్డింగ్  కనపడుతోందే అదే ట్విన్ టవర్స్ ఉన్న చోటు. ఆ శిధిలాలని తీసివేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారు (1 World Trade Center). పైన సన్నగా కనపడుతున్నది క్రేన్. పైన క్రేన్ అటూ ఇటూ తిరుగుతూ క్రింద నించి సామాను చేరవేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. అంతస్తులన్నీ పైనున్న ఈ క్రేన్ లే కడతాయి. ఒక్కొక్క అంతస్తూ కడుతూ క్రేన్ లు పై అంతస్తు మీదకి వెళ్తూ ఉంటాయి. జీవితంలో పైకి ఎదగాలంటే క్రేన్ లా ఒక్కక్క అంతస్తూ కట్టుకుంటూ పోయి ఎదగాలి. నేను చూస్తున్నప్పుడు ఒక హెలికాప్టర్ పొడుగాటి వస్తువుని తీసుకు వచ్చింది. దానిని నిలబెట్టడం ద్వారా ఎత్తు పెరిగి అమెరికాలో ఎత్తయిన భవనంగా మారిపోయింది (1,776 feet tall). చికాగో వాళ్ళు వప్పుకోటం లేదనుకోండి (మొన్నటిదాకా అమెరికాలో ఎత్తు అయిన భవనం చికాగో లో ఉండే విల్లిస్/సేర్స్ టవర్.)

క్రింద బోట్ క్లబ్, స్వంత పడవలు పెట్టుకునే చోటు, పడవల పార్కింగ్ . పడవలు మీద ఊళ్లు తిరిగే వాళ్ళు అక్కడ పడవలు ఆపుకుని క్లబ్లొ సేద తీర్చుకుని ఊరు చూట్టానికి వెళ్తారు. క్రిందటి సంవత్సరం వచ్చిన sandy ఉప్పెన మూలంగా కొంత భాగం కొట్టుకు పోయింది. బోటు రాక పోకలు కూడా చాలా తగ్గి పొయాయిట. అసలయితే ఆ బోటు స్టేషన్ ఎప్పుడూ కిటకిట లాడుతూ కళకళ లాడుతూ ఉంటుందిట.

చూడటానికి ఈ ఊళ్ళో ఏమీ లేవు న్యూయార్క్ వెళ్ళాల్సిందే.  వెళ్ళటానికి కారు కావాలి లేకపోతే ట్రైన్ లో వెళ్ళాలి. సామాన్యంగా ఇక్కడ ఉండే వాళ్లకి కార్లు ఉండవు. వాటిని పార్క్ చెయ్యటానికి చాలా డబ్బులు అవుతాయి. మేము zip car ఒకటి తీసుకున్నాము. zipcar కంపెనీ వాళ్ళ కార్లు ఒక చోట పెట్టి ఉంటాయి. మనుషులెవరూ ఉండరు. అక్కడి మీటర్లో డబ్బులు వేసి కారు తీసుకుని మన పని అయిపోయిన తరువాత తీసుకు వచ్చి అక్కడే పార్కు చెయ్యాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే కార్లు అద్దెకిచ్చే చోటు.

న్యూయార్క్ లో ఉన్న guggenheim museum కి వెళ్ళాము. ఈ museum,  spiral case లాగా ఉంటుంది. క్రింద మొదలెట్టి చుట్టూతా తిరుగుతూ నడుచుకుంటూ చూసుకుంటూ పై అంతస్తుకి వెళ్తాము. నడవలేని వారికి lift ఉంది. ఇక్కడ ఒకే ఆర్టిస్ట్ ప్రదర్శన కొన్ని రోజులు ప్రదర్శిస్తారు. ఆరోజు ఒక జపనీస్ ఆర్టిస్ట్ ప్రదర్శన. నేను వాటిని చూసి ఆనందంతో గంతులు వెయ్యలేదు కానీ మాట్లాడ కుండా అన్నీ చూశాను. న్యూయార్క్ లో museum లన్నీ ఈ వీధిలోనే ఉన్నాయి. ఇంకా museum లు చూసే ఓపిక లేక ఇంటికి చేరుకున్నాము.

రాత్రి భోజనాలయిన తరువాత cast away on the moon (2009) అనే ఒక korean movie english subtitles తో చూశాము. చాలా విచిత్రమైన సినీమా. ఒక software engineer లాంటి technocrat వచ్చే డబ్బులతోటి సరిపెట్టుకోలేక credit card ల తో చాలా అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చలేక పోవటంతో అప్పులవాళ్ళు వెంటపడతారు. ఈ బాధలను భరించలేక జీవితం మీద ఆశ వదులుకుని మనస్సు చెడిపోయి ఒక పెద్ద bridge మీద నుండి క్రిందకి దూకుతాడు. మర్నాడు bridge కింద ఉన్న ద్వీపం వడ్డున మెలుకువ వస్తుంది. పైన తను దూకిన బ్రిడ్జి మీద కార్లు పోతూ ఉంటాయి. దూరంగా ఆ కాలువలో పర్యాటకులను షికారుకి తీసుకు వెళ్ళే బొట్లు పోతూ ఉంటాయి. తన సెల్ ఫోన్ పని చెయ్యటం లేదు. పిలుస్తాడు అరుస్తాడు జుట్టు పీక్కుంటాడు, ఎవ్వరూ సహాయం చేసే పరిస్థితి లేదు. తనకు నాగరికత ఆమడ దూరంలో ఉంది కానీ అందుకోలేడు.  చివరికి ఇసక మీద HELP అని వ్రాసి,  మళ్ళా ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆకులూ అలములూ తింటూ ఆ ద్వీపంలో సెటిల్ అయిపోతాడు. ఒక రోజు instant noodles పాకెట్ లో ఉండే మసాలా ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. ఆ మసాలా తో నూడుల్స్ తినాలనే కోరిక పుడుతుంది. అవి తయారు చెయ్యటానికి బీన్స్ కావాలే ఎలా వస్తాయి ? ఆలోచించగా ఆలోచించగా ఒక ఉపాయం తడుతుంది. ఆ ద్వీపం లోకి చాలా పక్షులు వచ్చి రెట్టలు వేస్తాయి. పక్షులు తినేవి గింజలు కదా ఆ రెట్టలలో అరగని గింజలు ఉండవచ్చు. ఆ రెట్టలని పోగుచేసి పాతి పెట్టి మొక్కలని పెంచి వాటినుండి బీన్స్ తీసుకుని నూడుల్స్ చేసి వండుకుని మసాలా వేసుకుని తింటాడు. అప్పుల బాధలు అవీ లేకుండా జీవితం సుఖంగా గడిచి పోతూ ఉంటుంది. ఈ ద్వీప వాసి పరిస్థితి అంతా దూరంగా ఉన్న ఒక భవనం నుండి టెలిస్కోప్ తో ఒక అమ్మాయి రోజంతా చూస్తూ ఉంటుంది.  ఆ అమ్మాయి ఇంట్లో తన గది వదలి బయటికి వెళ్ళదు. ఆ అమ్మాయికి బయటి ప్రపంచం అంటే భయం. వాళ్ళమ్మ తనకు కావలసినవి అన్నీ తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇల్లా రోజులు గడిచిపోతూ ఉంటాయి.

ఒక రోజు ఆ ద్వీపం inspect చెయ్యటానికి మునిసిపాలిటీ వాళ్ళు పడవల మీద వస్తారు.వాళ్ళని చూడంగానే మన హీరోగారు దాక్కుంటారు. చివరికి వాళ్ళు తనని వెతికి వెతికి పట్టుకుంటారు. శత్రువు కాదు అని తెలిసిన తరువాత వాళ్ళు హీరో గారిని తీసుకు వచ్చి బ్రిడ్జి మీద వదిలేస్తారు. టెలిస్కోప్ లో ఇదంతా గమనిస్తున్న ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చి అతన్ని చేరుతుంది. దానితో సినీమా సుఖాంతంగా ముగుస్తుంది. నా కెందుకో ఇది నచ్చింది అందుకని క్లుప్తంగా కధ వ్రాశాను. మీకు వీలయితే చూడండి.

రాత్రి internet లో ఏదో వెతుకుతుంటే దగ్గరలో రోజుకి $11 dollar rent a car దొరుకుతోందని తెలిసింది. రోజుకి పదకొండు డాలర్లకి కారు ఇస్తుంటే తీసుకోకుండా ఎల్లా ఉంటాము? కారు తీసుకుని Edison అనే ఊరు వెళ్ళాము. అది ఒక మినీ ఇండియా. అంతకన్నా ఆశ్చర్య పడటానికి ఏమీ కనపడలేదు. ఇంటికి చేరే సరికి రాత్రి పది అయ్యింది. ఇంకా మా కష్టాలు మొదలయ్యాయి. కారుని రాత్రి ఎక్కడ పెట్టటం ? ఫోనుల మీద ఫోనులు చెయ్యగా తెలిసింది పక్కనున్న ఫినిక్స్ యూనివర్సిటీ పార్కింగ్ లో పెట్టవచ్చు అని. కాకపోతే ఇరవై డాలర్లు అవుతుంది. మళ్ళా పొద్దున్నే వెళ్లి తీసుకు వచ్చాము. మళ్ళా అదే సమస్య కారు ఎక్కడ పెట్టాలి (చవకగా ). మా యింటి ఎదురుకుండా రెండు గంటలకన్నా ఎక్కువ పెట్టటానికి వీల్లేదు . రెండుగంటల కొకసారి కారు ఇంకొక చోటికి మార్చాలి. లేకపోతే జరిమానా చాలా ఎక్కువగా ఉంటుంది. వంటి గంటకి భోజనాలు చేసి హడ్సన్ రివర్ మీద బోటు లో తిరగటానికి వెళ్ళాము. మొదట వెచ్చగానే ఉంది కానీ రాను రాను చలి ఎక్కువ అయ్యింది . లోపల కాబిన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికొచ్చేసి కారు తిరిగి ఇచ్చేసాము.

మర్నాడు Spice Market అనే New York రెస్టో రెంట్ లో dinner. ఈ అద్దె కారు గొడవ పడలేక Limo మాట్లాడుకున్నాము. తీసుకువెళ్ళి రెండు మూడు గంటల తరువాత ఇంటికి తీసుకు రావటం. ఇది ఒక fusion  రెస్టో రెంట్. అంటే రెండు మూడు రకాల (దేశాల ) ఆహారాలని కలిపి తయారు చేసే వంటకాలు అక్కడ చేస్తారు. అక్కడకి పద్నాలుగు మంది కలిసి వెళ్తే మనకు కావలసింది చేయించుకోవచ్చు. కానీ మా పార్టీలో కొందరు రానందున మాకు కావలసినవి చేయించుకోవటం కుదరలేదు. నేనయితే నేను అరిటాకులలో చుట్టిన ఉప్మాలాంటి పదార్ధము తరువాత కొన్ని ఆకులు (ఏ దేశం వో తెలియదు) తిన్నాను. తినటాలు తాగటాలకి రెండు మూడు గంటలు పట్టింది. రాత్రి పదకొండు అవుతోంది లోపలకు రావటానికి జనం క్యు లో నుంచున్నారు. దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ ని మూసేసి అక్కడ చెట్లువేసి పార్క్ లా చేశారుట, అర్దరాత్రి న్యూయార్క్ లో పార్క్ కి వెళ్ళటం నాకు నచ్చక, నేను తప్ప అందరూ దానిని చూడటానికి నడుచుకుంటూ వెళ్ళారు. ఒంటి గంటకి Limo లో బయల్దేరి ఇంటికి చేరాము.

ఇంకా చెప్పుకోవాల్సినవి ఏమీ లేవు. మర్నాడు ప్లేన్ లో చికాగో వచ్చేశాము.

నా ఘోష:
సంవత్సరం లో ఏవేవో చేద్దాం అనుకుంటాము. సంవత్సరం అలా గడిచి పోతుంది. ఒక్కక్కప్పుడు ఎందుకు మనము ఆపనులు చెయ్యాలి అని కూడా ప్రశ్న వేసుకుంటాము. చాలా ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉండవని కూడా అనిపిస్తుంది. కానీ జీవిత గమనంలో కాలం గడపటానికి ఏవో పనులు మనం చేస్తూ ఉండాలి. ఆ చేసే పనులు చాలా వరకు మనకోసం  మన ఆనందం కోసం చేసుకుంటూ ఉంటాము. వాటిల్లో కొన్నిఇంకొకళ్ళ కోసం వాళ్ళు అడగ కుండా చెయ్యాలని ప్రయత్నం. మనం సుఖంగా జీవించటానికి ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసి ఉంటారు. ఎందుకంటే మనం సంఘజీవి ఒంటరిగా మనం జీవించలేము. ఈ సంవత్సరం దాదాపు అయిపొయింది. వచ్చే సంవత్సరంలో తప్పకుండా ఇంకొకరి ఆనందం కోసం కొన్ని పనులన్నా చెయ్యాలి. వచ్చే సంవత్సరమన్నా చేద్దామనుకున్నవి చెయ్యగాలుగుతానేమో.


Monday, December 9, 2013

97 ఓ బుల్లి కథ 85 --- నెయ్యి వేసుకోవటం మంచిదేనా?

నేను యూనివర్సిటీ నుండి శలవలకు ఇంటికి వచ్చే టప్పుడు తప్పకుండా పాసెంజర్ లో వచ్చే వాణ్ణి. దీనికి ఒకటే కారణం . ఏలూరు స్టేషన్లో దొరికే  ఇడ్లీలు. రెండు ఇడ్లీలు గట్టిపచ్చడీ కారప్పొడి దానిలోకి కమ్మటి నెయ్యీ . నెయ్యి విడిగా ఇచ్చే వాళ్ళు. ఆ ఇడ్లీలతో,  ఆ ఘుమఘుమ లాడే నెయ్యి కారప్పొడి లో వేసుకుని లాగిస్తూంటే, వావ్, ఆ ఆనందాన్ని వర్ణించలేను. ఆ రుచి మనస్సులో అల్లాగే ఉండి పోయింది. అందుకని ఎక్కడన్నా ఇడ్లీలు తింటే, ఆ రుచి తోటి పోల్చటం అలవాటయి పోయింది.  ఆ రుచిని ఎప్పుడూ వర్ణించ లేక అటువంటి ఇడ్లీలు తినే పరిస్థితి మళ్ళా కలుగలేదు. అమాంతంగా ఒకరోజున మనమే ఆ రుచిని ఎందుకు తెప్పించకూడదు అనే ఆలోచన వచ్చింది. కానీ ఎంత అనుకున్నా సరే ప్రపంచంలో అందరూ అన్ని పనులూ చెయ్యలేరు కదా. ఆ ultimate ఇడ్లీ రుచి తయారు చేసే quest లో ఒకటి మాత్రం సాధించాను. కమ్మటి నెయ్యి తయారు చెయ్యటం. ఈ పోస్ట్ అంతా దాని గురించే. మీకు నెయ్యి వేసుకోవటం అలవాటు లేకపోతే ఈ పోస్ట్ గురించి పట్టించుకోకండి.

కానీ పోస్టు వేసి మీకు చెప్పే ముందర అసలు నెయ్యి శరీరానికి మంచిదో కాదో తెలుసుకోవాలని ఒక చిన్న పరిశోధన చేశాను. దాని పరిశోధనా ఫలితాలు సూక్ష్మంగా:  వెన్న, వెన్ననుండి వచ్చిన నెయ్యిలో 80% milk fat కొవ్వు పదార్ధాలు ఉంటాయి వాటిలో చాలా వరకు saturated fat. వెన్న కన్నా నెయ్యిలో medium, short chain fats ఎక్కువగా ఉండటం మూలాన శరీరంలో వెన్న కన్న నెయ్యి కి అరుగుదల ఎక్కువ. వెన్న లో long chain fats ఎక్కువ. ఏది ఏమయినా రోజుకి మనం తినే ఆహారంలో 10% calories కంటే ఎక్కువ నెయ్యి వాడటం మంచిది కాదు. అంటే షుమారుగా రోజుకు రెండు స్పూనులు కన్నా ఎక్కువ వాడటం మంచిది కాదు. నా ఉద్దేశంలో saturated fats ఉండటం మూలాన వెన్న,  నెయ్యి ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

మా చిన్నప్పుడు పాలని తోడు బెట్టి, వచ్చిన పెరుగుని చిలికి వెన్న బయటికి తీసే వారు. పల్లెలో పాడి ఉన్న ప్రతి ఇంటిలోనూ జరిగే ప్రక్రియ ఇదే. ఆ వెన్నని సన్నటి సెగలో పొయ్యిమీద కరగబెట్టి నెయ్యి చేసేవాళ్ళు. మా అమ్మ కుంపటి మీద తయారు చేసేది. ఇక్కడ ఒకటే జాగర్త.  కమ్మని నెయ్యి కావాలంటే సరి అయిన సమయంలో పోయ్యిమీదనుంచి తీసి చల్లార్చాలి.

ఇప్పుడు పెద్ద పెద్ద డైరీ ఫారంలు వచ్చిన తరువాత,  వడిగా పాలని చిలికే యంత్రాలు వచ్చి (centrifuge), వెన్నని పాల మీద తెలేటట్లుచేస్తున్నాయి. ఆ తేరుకున్న వెన్నను తీసి one lb పాకెట్స్ కింద అమ్ముతారు. అమెరికాలో అయితే  వీటిని రెండు రకాలుగా అమ్ముతారు (salted , unsalted ).

వెన్న నుండి ఘుమ ఘుమ లాడే నెయ్యి తయారు చెయ్యటం చాలా తేలిక. కాకపోతే కొంచెం time తీసుకుంటుంది (కనీసం ఒక గంటా గంటన్నర దాకా ).

చేయు విధానం: ఒక  1 lb unsalted బట్టర్ పాకెట్( దానిలో నాలుగు భాగాలు ఉంటాయి)  ని తీసుకుని ఒక గిన్నె లో వెయ్యండి. స్టవ్ మీద పెట్టి మీడియం కన్నా తక్కువగా ఉన్న హీట్ లో పెట్టి కాగ నివ్వండి. మొదట వెన్న అంతా కరిగి పోతుంది. తరువాత తెల్లని నురగ,  పైన తెట్ట లా కడుతుంది. తరువాత తెట్ట పోతూ పోతూ పసుపు రంగులో నెయ్యి కనపడుతుంది. తరువాత పైనున్న నురుగు తెట్టా అంతా పోయి Golden  Brown color లో మంచి వాసనతో ఘుమ ఘుమ లాడుతూ నెయ్యి కనిపిస్తుంది. పై నురుగు మాడిపోయి అడుగున అట్ట లాగా తయారు అవుతుంది. దీనినే గోకుడు అంటారు. చిన్నప్పుడు దానిని తినే వాళ్ళం. ఇంక మీరు చెయ్యాల్సిన దల్లా కొద్దిగా చల్లారిన తరువాత వడబోసి మంచి నెయ్యిని వేరు చెయ్యటమే.  ఒక గంటా గంటన్నర లో వెన్న నుండి ఘుమ ఘుమ లాడే నెయ్యి తయారు అవుతుంది. మనం జాగర్తగా ఉండాల్సినదల్లా మాడకుండా చూడటమే.

నాకు వచ్చే ఒక న్యూస్ లెటర్ నుండి (INH Health Watch):

1. Ghee: It comes from the Hindi word for “fat,” and it’s a major player in Indian cooking. Ghee begins as unsalted butter. It is then melted until the milk fats and water have separated. This leaves only the pure butter oil behind. Ghee is different from clarified butter because it has a slightly nutty flavor and darker color.

Research shows that ghee safely increases blood lipids without raising LDL cholesterol. This means that it does more than simply lower total cholesterol. It raises the good kind (HDL) and lowers the bad (LDL). Ghee also reduces inflammation and prevents heart disease. One study found that men who consumed two tablespoons of ghee a day lowered their risk for heart disease by 23 percent. And although it isn’t exactly “mainstream,” ghee isn’t hard to find. Most health food stores have an international section where you can pick up grass-fed, organic ghee. But if you can’t find it nearby, you can always order it online.

1. వెన్న , నెయ్యి ఎంత మంచివి ?
http://www.whfoods.com/genpage.php?tname=newtip&dbid=9

Monday, September 9, 2013

96 ఓ బుల్లి కథ 84 --- డయబెటీస్ ఎందుకు వస్తుంది ?

డయబెటీస్ అనే వ్యాధి శరీరం లోని రక్తంలో షుగర్ (గ్లూకోజ్ ) ఎక్కువగా ఉండటం మూలాన వస్తుంది. షుగర్ ఎందుకు ఎక్కువ అవుతుంది అనేదే  ఈ పోస్ట్ లో చర్చించే విషయం.

మన దేహంలో బిలియన్ల కొద్దీ కణాలు ఉన్నాయి. శరీరంలో వాటి ఉనికిని బట్టి అవి చెయ్యాల్సిన పనులు చేస్తూ ఉంటాయి. ఆ పనులు చెయ్యటానికి శక్తి కావాలి. ఆ శక్తిని స్వయంగా అవే తయారు చేసుకుంటాయి.

దాదాపు కణాలన్నిటి లోనూ శక్తి (energy ) తయారు చేసే ప్రక్రియ ఒకటే. మనము తినే ఆహారమునుండి షుగర్ (గ్లూకోజ్ ) ని తయారు చేసుకుని, మనము పీల్చే గాలి లోనుండి వచ్చిన ప్రాణ వాయువు (oxygen ) తో దగ్ధము చేసి శక్తి ని (ATP) తయారు చేస్తాయి. కొన్ని బిలియన్ల కణముల నుండి తయారు అయిన ఆ శక్తి కలయిక తో మనం రోజూ చేద్దామనుకుంటున్న పనులు చేయ కలుగుతున్నాము. మనం జీవించటానికి మూల కారణం కూడా ఇదే.

మన శరీరములోని జీర్ణ ప్రక్రియలో, మనము తిన్న కార్బో హైడ్రేటులు, షుగర్లు గ్లూకోజ్ గ మారబడతాయి. ఈ గ్లూకోజ్ ని కణముల లో శక్తి ఉత్పాదన ప్రదేశానికి తీసుకు వెళ్ళటానికి, మన శరీరం తిన్న ఆహారాన్ని బట్టి, ఇన్సులిన్ అనే పదార్ధాన్ని తయారు చేస్తుంది.

When our food is digested, the glucose makes its way into our bloodstream. Our cells use the glucose for energy and growth. However, glucose cannot enter our cells without insulin being present - insulin makes it possible for our cells to take in the glucose.

మన రోజువారీ శక్తి వినియోగాన్ని బట్టి మనకింత శక్తి కావాలని మన శరీరం నిర్ణయిస్తుంది. కావలసిన శక్తి మాత్రమే గ్లూకోజ్ నుండి తయారు చేసుకుని మిగతా గ్లూకోజ్ ని కొవ్వు (fat ) కింద మార్చి శరీరంలో దాచి పెట్టుకుంటుంది. ఆ దాచిపెట్టిన కొవ్వు మూలానే మనకి ఆకారం వస్తుంది. ఎప్పుడయినా ఆహారము దొరకని పరిస్థితి వస్తే, ఆ దాచిపెట్టుకున్న కొవ్వుని మరల శక్తిగా మార్చి శరీరం రాలిపోకుండా చూసుకుంటుంది. ఇది శరీరం తన భద్రత కోసం చేసే పని. ఈ కొవ్వు దాచే ప్రక్రియలో కూడా ఇన్సులిన్ జోక్యం చాలా ఉంది.

ఒకవేళ కొవ్వు దాచే ప్రదేశాలన్నీ నిండిపోయి దాచటానికి చోటులేక పోతే శరీరంలో ఉన్నకంట్రోల్సు, ఇన్సులిన్ని గ్లూకోజ్ తీసుకు రావద్దు అని చెబుతాయి. దానితో ఎక్కువగా ఉన్నా, గ్లూకోజ్ కొవ్వుగా మారక, ఎక్కడకీ త్వరగా పోలేక,  బ్లడ్ లో షుగర్ (గ్లూకోజ్ ) పెరుగుతుంది. ఇలా బ్లడ్ లో ఇన్సులిన్ ఉండి పనిచెయ్యకపోవటాన్ని insulin resistance అంటారు. ఈ పరిస్థులలో షుగర్ పరిమాణం రక్తంలో ఉండవలసిన దాని కన్న పెరుగుతుంది. దానినే డయాబెటీస్ అంటారు.

మన శరీరంలో ఉన్నఅవయవాలు షుగర్ ఒక పరిణామం కన్న ఎక్కువగ వుంటే సరీగ్గా పనిచేయవు (మనకి జ్వరం వచ్చినట్లుగా ). సరీగ్గా పనిచేయ లేక పోతే వ్యాధులు వస్తాయి. అందుకని బ్లడ్ లో షుగర్ కొన్ని పరిమితులలో మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలి. డయాబెటీస్ ప్రమాదకరం అని చెప్పటానికి ఇదే కారణం.

మన శరీర శక్తి ఉత్పాదనలో ఇన్సులిన్ చాలా కీలకము.  కొందరిలో జన్యు పరంగా ఇన్సులిన్ తయారు అవదు. అటువంటి వారిలో వచ్చే diabetes ని Type 1 diabetes అంటారు.

మరి కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి  అయినా అది సరీగ్గా పనిచేయదు (insulin resistance). దీనిని Type 2 diabetes అంటారు.

కొందరిలో తాత్కాలికంగా కొన్ని పరిస్తుతులలో రక్తంలో షుగర్ పెరుగుతుంది. సామాన్యంగా ఇది గర్భిణీ స్త్రీలలో కనబడుతూ ఉంటుంది. దీనిని Gestational diabetes అంటారు.  వీరికి జీవితకాలంలో డయాబెటీస్ రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కొంచెం జాగర్తగా ఉండాలి.

సామాన్యంగా ప్రపంచంలో Type 2 diabetes ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్నేdiabetes అని కూడా అంటారు.   మనం తిన్న ఆహారం నుండి తయారు అయిన షుగర్ (గ్లూకోజ్ ) అంతా వినియోగించ బడక బ్లడ్ లో షుగర్ ఎక్కువ అవటం మూలాన వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మనము చేసే శ్రమకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఆహారం తింటున్నామన్న మాట.

దీనికి విరుగుడు రెండే మార్గాలు. మొదటిది మన శక్తి వినియోగాన్ని బట్టి కావలసిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. రెండొవది  ఒక వేళ తినటం ఎక్కువ అయితే శరీర శ్రమ చేసి (వ్యాయామం ) గ్లూకోజ్ ని తగ్గించు కోవాలి .

వ్యాయామం ( శరీర శ్రమ) చెయ్యటానికి శక్తి  కావాలి. దానికోసం మన శరీరం ఉన్న గ్లూకోజ్ ని వినియోగించు కుంటుంది. అంటే ఒక విధంగా చూస్తే బ్లడ్ లో షుగర్ (గ్లూకోజ్ ) తగ్గటానికి శరీర శ్రమ ని ఎక్కువ చేయాలి.  శక్తి వినియోగం పెరగటం మూలాన, శక్తి ఉత్పాదనకి  షుగర్ (గ్లూకోజ్ ) వినియోగింప బడి,  బ్లడ్ లో షుగర్ (గ్లూకోజ్ ) తగ్గుతుంది. ఒకవేళ తగినంత గ్లూకోజ్ అందుబాటులో లేకపోతే  దాచిపెట్టిన కొవ్వు (fat ) నుంచి శక్తి ఉత్పాదన జరుగుతుంది. బరువు కూడా తగ్గటం మొదలుపెడుతుంది. వ్యాయామం రెండు విధాలా మంచిది. గ్లూకోజ్  తగ్గుతుంది, వంట్లో  కొవ్వు కూడా  తగ్గుతుంది. వ్యాయామము, శ్రమ రెండూ చెయ్యని వారు ఆహారం తక్కువగా తీసుకోవటం మంచిది

మనం రోజూ ఎంత శక్తి ఉపయోగించు కుంటున్నామో అంత శక్తినే తయారు చెసుకొవాలి అంటే దానికి కావలసిన  ఆహారం మాత్రమే తినాలన్న మాట. ఇది కొంచెం కష్టమయిన పని. మనం చేసే పనులన్నిటికీ శక్తి కావాలి. అన్ని పనులూ మనము ముందరగా అనుకుని చేయము. ఉదా: అమాంతంగా లేచి ఇంటి చుట్టూతా పరిగెడుదాము అనుకున్నామనుకోండి. దీనికి కావలసిన శక్తి మన శరీరం అమాంతంగా ఉత్పత్తి చేసి ఇవ్వాలి. ఇంకొక ఉదాహరణ. మనం రోజూ సాయంత్రం నడుస్తాము అనుకోండి. మన శరీరం కావలసిన శక్తి ఇవ్వటానికి తయారు అయి ఉన్నది. కానీ మనం ఇవ్వాళ వెళ్ళటానికి ఇష్టములేక మాను కున్నామనుకోండి. నడవటానికి శరీరం అమర్చిన గ్లూకోజ్ అంతా ఏమవుతుంది? దాన్ని ఏదోవిధంగా బ్లడ్ లోనుండి బయటికి పంపించాలి. దీనికి ఒకటే మార్గం, షుమారుగా మనము చేసే శ్రమకి తగ్గట్లు ఆహారం తీసుకోవటం, బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ తక్కువలను సరిదిద్దటానికి  వ్యాయామం చెయ్యటం అవసరము.

ఇవన్నీ కుదరకపోతే డాక్టర్ను సంప్రదించి మందులేసుకుని బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రస్తుతం డాక్టర్లు వాడుతున్న మందుల వివరాలు 9వ మాతృకలో ఉన్నాయి. డయబెటీస్ కి కొత్త రకం ఇంగ్లీష్ మందులు వస్తున్నాయి. వాటి గురించి 10వ మాతృకలో తెలుసుకొన వచ్చు.

ఏవిధంగా చూసినా మనము కొన్ని ఆహార నియమాలు పాటించక తప్పదు . మనము గ్లూకోజ్ ఎక్కువగా తయారు చేసే ఆహారాన్ని తినటం తగ్గించాలి. పిండి పదార్ధాలు, షుగర్ తినటం తగ్గించాలి. నిజంగా చెప్పాలంటే మనము చేసే పనులకు కావలసిన శక్తి మాత్రమే ఉత్పత్తి అయే విధంగా ఆహారము తినాలి. ఒకవేళ మనకి కంట్రోల్ లేక తింటే, తయారు అయిన గ్లూకోజ్ ని నిర్వీర్యం చెయ్యటానికి వ్యాయామం చెయ్యాలి.

 ఫ ఇ బర్ (fiber ) ఉన్న ఆహారం తింటే  బ్లడ్ గ్లూకోజ్ తగ్గుతుందని కనుగొన్నారు. ఎందుకు తగ్గు తుందో ఇంకా నిర్ధారించ  లేదు.  కానీ ఒకటి మాత్రం నిజం. ఫ ఇ బర్(fiber ) ఉన్న ఆహారం తినటం మూలాన కడుపు నిండి నట్టు అనిపిస్తుంది.  అందుకని తక్కువ తింటాము. ఇంకొక సంగతి కూడా గమనించటం జరిగింది. fiber  జీర్ణ మవటానికి ఎక్కువ సేపు పడుతుంది గనక బ్లడ్ లోకి గ్లూకోజ్ నెమ్మదిగా వెళ్ళటం జరుగుతుంది. క్రింద 8 మాతృక నుండి దీనిని గురించి అంతా తెలుసు కొన వచ్చు.
Another benefit of fiber is that it adds bulk to help make you feel full. Given these benefits, fiber is important to include in the daily diet for people with diabetes, as well as those who don't have diabetes. You can add fiber by eating whole grain products, fruits, vegetables, and legumes. Leave the skin on fruits and vegetables, as it is high in fiber. Eat whole grain breads and crackers. And be sure to increase your fiber intake generally, and remember to drink 6-8 glasses of water per day to avoid constipation.

ఆహార నియమాల కొస్తే, కొన్ని పదార్ధాలు తిన్న వెంటనే బ్లడ్ షుగర్ చాలా ఎక్కువ చేస్తాయి (spike blood sugar). వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి. అవి 1. white Rice 2. White Bread 3.  Soda 4. Red Meat, Bacon 5. Fast Food 6. Packaged Food 7. White Milk. అయిదవ మాతృక లో వీటిని చూడ వచ్చు.

అల్లాగే కొన్ని పదార్ధాలు తిన్న వెంటనే బ్లడ్ షుగర్ ఎక్కువ చేయకుండా నెమ్మదిగా షుగర్ ని బ్లడ్ లోకి పంపిస్తాయి. వీటిని Low Glycemic index foods  అంటారు.  ఉదా: చిలకడ దుంప, మొక్కజొన్న, ఉలవలు, ఓట్స్, బార్లీ మొదలయినవి. 6 వ నంబరు మాతృకలో వీటిని చూడవచ్చు.

ఇంకా బ్లడ్ షుగర్ ఎక్కువ పెరగటం సమస్య అయితే భోజనంలో ఒక్క సారి అంతా తినకుండా చిన్న చిన్న పోర్షన్స్ లో రోజంతా ఆహారం  తీసుకోటానికి  ప్రయత్నించండి.

షుగర్, షుగర్ తో చేసిన పదార్ధాలు తినటం తగ్గించటం మంచిది. ఇంతెందుకు పేరు చివర "ose" ఉన్న పదార్ధాలు తినటం తగ్గించటం మంచిది. అవన్నీ షుగర్ లే. ఉదా : Glucose, Sucrose, Lactose etc. పాలల్లో Lactose ఉంటుంది.

పిండి పదార్దము తక్కువగ, low-carb, ఉన్నఆహారమును తీసుకొనుట మంచిది.  అవి కొన్ని 1. కీర దోసకాయ(cucumber ) 2. ముల్లంగి (radishes, Turnips) 3. బెల్ పెప్పర్ 4. బెండకాయ (okra ) 5. కాలీఫ్లవర్ 6. కాబేజీ 7. బ్రోకలీ 8. తోట కూర (Spinach ) 8. కారట్స్ 9. ఉల్లిపాయ (onions ). ఎక్కువగా Leafy green vegetables, కూరగాయలు తినటం చాలా మంచిది.

క్రింద ఇచ్చిన నాల్గవ మాతృకలో మనదేశపు "ఆయుర్వేదం" లో డయాబెటీస్ మందుల గురించి ప్రస్తావన ఉంది.

మీరు ఆరోగ్యపరంగా ఏమయినా చర్యలు తీసుకునే ముందర మీమీ వైద్యులను సంప్రదించుట చాలా మంచిది.

wikipedia నుండి క్రింద విషయం చదివితే బాధేస్తుంది కానీ చదవండి  :
India has more diabetics than any other country in the world, according to the International Diabetes Foundation,[36] although more recent data suggest that China has even more.[34]The disease affects more than 50 million Indians - 7.1% of the nation's adults - and kills about 1 million Indians a year.[36] The average age on onset is 42.5 years.[36] The high incidence is attributed to a combination of genetic susceptibility plus adoption of a high-calorie, low-activity lifestyle by India's growing middle class.[37]

మాతృకలు  ( References):

1. What is Diabetes - What causes Diabetes.

2. http://diabetes.webmd.com/ss/slideshow-type-2-diabetes-overview?ecd=wnl_dia_072611

3. http://en.wikipedia.org/wiki/Diabetes

4. Natural Ayurvedic Home Remedies for Diabetes
http://www.homeveda.com/diabetes/natural-ayurvedic-home-remedies-for-diabetes.html

5.7 Foods That Spike Blood Sugar
http://www.everydayhealth.com/type-2-diabetes-pictures/foods-that-spike-blood-sugar.aspx#/slide-1

6. The-glycemic-index-of-foods

7. oral-diabetes-medications

8. how_does_fiber_affect_blood_glucose_levels.

9. diabetes.webmd.oral-medications

10. diabetes.webmd./new-treatments


డయబెటీస్ మీద నా ఇతర పోస్టులు:

1.  65 ఓ బుల్లి కథ 53 ----  డయాబెటీస్ తో ఆరోగ్య జాగర్తలు

2. 66 ఓ బుల్లి కథ 54 ----  డయాబెటీస్ --- ఆరోగ్యమిచ్చే కూరగాయలు

3. 67 ఓ బుల్లి కథ 55 ---- డయాబెటీస్ --- మాఇంటి వంటలు