Monday, October 21, 2024

209 ఓ బుల్లి కధ --- విష్వక్సేనుడు

రిటైర్ అయిన  తర్వాత  సంవత్సరాలు గడిచిన కొద్దీ చిన్ననాటి సంగతులన్నీ రోజూ ఒకొటొకటిగా గుర్తుకు వస్తూ ఉన్నాయి . చిన్నప్పటి నుండీ యూనివర్సిటీ దాకా నాకు చదువు చెప్పిన వాళ్ళు తరుచూ గుర్తుకు వస్తూ ఉంటారు .  

చిన్నప్పుడు ఎప్పుడో  విష్వక్సేనుడు రాక్షస రాజు అని విని నట్టు గుర్తు . అది బహుశా నేను అయిదవ క్లాసు చదువుతున్నప్పుడు అయ్యుంటుంది . ఎందుకంటే "విష్వక్సేనుడు" అనే పదం తెలుగులో వ్రాసి, నోటితో సరీగ్గా పలక గలిగితే 5వ క్లాసు పాస్ అయినట్లే . అప్పుడు మాకు పుస్తకాలు అంటూ ఏవీ ఉండేవి కావు . ఉన్నది పలకా బలపమే .  అప్పుడు మాకు పుస్తకాలు కొనుక్కునే రూల్ యూనిఫార్మ్ వేసుకుని స్కూల్ కి రావాలనే రూల్ ఉండేవి కాదు .  మీకు ఇప్పటికే  అర్ధమై  ఉంటుంది నా చదువు పాతకాలం పల్లెటూరు లో ప్రారంభించానని . మా పెదనాన్న గారు స్కూల్ హెడ్మాస్టర్ కావటంతో రోజూ మేమే పొద్దున్న స్కూల్ బెల్ కొట్టేవాళ్ళం .  ఆయన్ని మేము బావయ్యారు అని పిలిచే వాళ్ళం . ఆయన మాకు అయిదవ క్లాస్ పాఠాలు కూడా చెప్పేవారు .  అందుకని మాకు ఆయనంటే భయం గౌరవం కూడా  . 

రోజూ స్కూల్ చివరి పిరియడ్ లో అన్ని తరగతుల వాళ్ళమూ , ఒక రెండు రెండు ,  రెండు మూ ళ్లారు అంటూ , పదవ ఎక్కం దాకా అరుస్తూ వంత పాడే వాళ్ళం .  మేము అయిదవ క్లాసు పూర్తయ్యే సరికి తెలుగు వ్రాయటం చదవటం 10 దాకా ఎక్కాలూ కంఠతా వచ్చేవి. అయిదు సంవత్సరాలు  రోజూ వల్లెవేయటం వల్ల ఎక్కాలు,  పర్మనెంట్ మెమొరీ లో జేరిపోయాయి . అందుకే సూపర్ మార్కెట్లో, నూనె మూడు  12oz సీసాలు  కొంటే చవకా  లేక ఒక 32oz సీసా కొంటే  చవకా  అని మా ఆవిడ అడిగితే తడువుకోకుండా  వెంటనే లెక్కకట్టి చెప్పేస్తాను .  

ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నప్పుడే  ఇంగ్లీషు ఇంట్లో  మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను .  అక్షరాల నుండీ,  సి ఏ టీ , Cat  వరకూ.  మా అమ్మ కూడా పెద్దగా  చదువుకోలేదు . ఇంకో పల్లెటూరులో కుటుంబరావు తాత  గారి వీధి బడిలో చదువుకుందిట .

ఒక రోజు పది మంది అమ్మాయిలని చూసి ఒకర్ని పెళ్లి చేసుకున్నాను.  ఆ అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలను కున్నాను అంటే సమాధానం లేదు. పెళ్లి చూపుల్లో  నేను అడిగిన ఒకే వక ప్రశ్న వంటచేయ గలవా అని .  బహుశ గుంటూరు వంట రోజూ తినాలనే కోరిక అవ్వచ్చు . తాను ఏమి చెప్పిందో నాకు గుర్తు లేదు . సంవత్సరాల తరబడి హాస్టళ్లల్లో హోటళ్లలో తినటం మూలాన విసిగిపోయి ఉంటాను . అందుకనే యాభై ఏళ్ళ నుండీ అమెరికా జీవితం కంది పచ్చడి  గోంగూర లతో  పెద్ద ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగిపోతూ ఉంది . 

మళ్ళా  మరొక  జ్ఞాపకంతో మీ ముందు ఉంటాను . అంతవరకూ శలవు  . 

Friday, October 11, 2024

208 ఓ బుల్లి కధ --- గుడ్ బై క్రేజీ సెప్టెంబర్

 








అమెరికాలో మేమున్న ప్రాంతంలో (చికాగో ) సెప్టెంబర్ వచ్చిందంటే, వేసవి రోజులు దాదాపు అయిపోయినట్లే. చెట్ల ఆకుల రంగులు మారుతూ ఉంటాయి. పొద్దున్నే చలి తొంగి చూస్తూ ఉంటుంది . వసంతకాలంలో తెల్లవారుఝామున నిద్రలేపే పక్షుల కిచకిచలు వినపడవు . మృదువైన పిల్లగాలి జాడ ఉండదు. తెల్లవారుతూ వచ్చే  తొలి వెలుగులు కనపడవు.  

నేను ఉదయాన్నే ఆరున్నరకు లేచి మేడ దిగి మొదట కాఫీ డికాషన్ పెడతాను . ఇంకా చీకటి గానే ఉంటుంది . తరువాత డిష్ వాషర్ లో ఉన్న గిన్నెలు ప్లేట్లు తీసి బయట పెడతాను.  ఇది ఒకరకంగా వ్యాయామం అని చెప్పొచ్చు . దీనికి  కనీసం 20 సార్లు వంగి లేవాల్సొస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటినీ  కదిలించాల్సి వస్తుంది . 

తీరిగ్గా భార్యామణి గారు ఏడు గంటలకి మేడ  దిగి వస్తారు . ఏవన్నా మిగిలితే డిష్ వాషర్ లో వస్తువులు ఖాళీ చేసి చీపురు పుచ్చుకుని కిచెన్  శుభ్రం చేస్తారు . అమెరికాలో పెళ్ళాం చేత చీపురుతో చిమ్మించే క్రూరాత్ముడ్ని అనుకునేరు. కాదు. నేను రోబాట్ ని కొని పెడతాను అన్నాను . కానీ ఆవిడ వినలేదు. ఇది ఆవిడకి వ్యాయామం ట .  

తర్వాత ఫిల్టర్ నుండి కాఫీ డికాషన్ తీసి ఆవిడ కాఫీ తాయారు చేస్తుంది .  మీకు ఇక్కడ అనిపించ వచ్చు. మీరే ముందర లేస్తారు కదా మీ భార్య గారికి మీరే ఎందుకు కాఫీ చెయ్యా కూడదు ?  అని . నేనూ కాఫీ తయారు చేయగలను కానీ తస్సాదియ్యా ఆ రుచిమాత్రం రాదు . దీనిని మీరుస్వలాభం అనో ఎమన్నా అనుకోండి . అందుకనే కాఫీకి అయిదు  నిమిషాలు లేటయినా ఓపిగ్గా వెయిట్ చేస్తాను . ఇద్దరం చెరో కప్పు పుచ్చుకుని బయట పోర్టికోలో కూర్చుంటాము. 

కుక్కలని వాకింగ్ చేస్తూ కొందరు ఆడవాళ్లు కనపడుతూ ఉంటారు . కొందరు హలొ చెప్తారు కొందరు చెప్పరు. ఫోనులు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదివరకు మా ఇంటి ముందర ఒక చెట్టు ఉండేది. వెళ్తున్న కుక్కలన్నీ ఆత్మీయంగా అక్కడ ఆగి వాటిపని చేసుకుని వెళ్లేవి. ఆ చెట్టుకి తొర్రలు పడ్డాయి అందుకని తీసేయించాము. ఇప్పుడు ఆ చెట్టు అక్కడ లేదు . అల్లాగే దొడ్లో ఉన్న చెట్లు కూడా కొట్టించేశాము. యాభై  ఏళ్ళ  చెట్లు. ఎండిపోయి పడిపోతున్నాయి . పాపం ఉడతలు ఆ చెట్ల మీది నుండి ఇంటి కప్పు మీదికి గెంతుతూ ఆడుకునేవి . పక్షులు చలిదేశం నుండి వేడి ప్రదేశాలకి  వలసపోతూ సేద తీర్చుకునేవి. కుందేళ్లు పగలిపూట నీడలో సేద తీరుతూ చెట్టుకింద కునుకులు తీస్తూ ఉండేవి. వాటికి అసౌకర్యం కలిపించాల్సి వచ్చింది . కానీ తప్పక చెయ్యాల్సి వచ్చింది.  

ఈ కాఫీ ప్రహసనం అంతా వేసవిలో జరిగేది . ఇప్పుడు మలయమారుతాలూ , అప్పుడే లేచిన కుందేళ్ళూ , ఉడతలూ కనపడవు . అప్పుడప్పుడూ వేడిప్రదేశాలకి గుంపులు గుంపులుగా వలస పోయే పక్షుల మూకలు కనపడుతూ ఉంటాయి . సెప్టెంబర్ వచ్చిందంటే బయట ఎల్లా ఉంటుందో చెప్పలేము. ఆరోజు  చల్లగా ఉంటే బయట కూర్చోము . కాఫీ తొందరగా చల్లారి పోతుంది , తాగినట్టు ఉండదు . 

ఇంటావిడ ఎనిమిది గంటలకల్లా కారెక్కి ఉద్యోగానికి వెళ్తుంది . వెళ్లేముందు ఆమె తిరిగి వచ్చేసరికి నేను ఏమి చెయ్యాలో చెప్పి వెళ్తుంది కాబట్టి నాకు బోల్డంత పని. మధ్యకాలంలో అప్పుడప్పుడూ నేను కంప్యుటర్లో ఆంధ్రాలో ఏమి జరుగుతుందో తొంగి చూస్తూ ఉంటాను . ఏ దేశంలో వున్నా పుట్టింటి బంధం విడదీయలేము . 

రోజూ పొద్దునా సాయంత్రం చెట్లకి నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోసిన తర్వాత సేద తీరటానికి ఇంటికి ముందరా వెనుకా కుర్చీలు వేశాము.  వైఫై అక్కడికి కూడా వస్తుంది అప్పుడప్పుడూ కంప్యూటర్ లో కూడా తొంగి చూడవచ్చు. నీరెండలో  కూర్చొని కునుకులు గూడా తీయవచ్చు. 

ఇంకా సెప్టెంబర్లో చెయ్యాల్సిన పనులు,  హీటర్ చెక్ చేయించాలి. చలికాలంలో ఇక్కడ ఇంట్లో హీటర్ తప్పదు.  వచ్చే సంవత్సరం లాన్ సరీగ్గా ఉంచటానికి , ఎరువులు, విత్తనాలు ,  పిచ్చిమొక్కలు మొలవకుండా రసాయనాలూ , వేయించాలి.  మా లాన్ కట్ చేసే వాడు వచ్చేసంవత్సరం ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు . దాని సంగతేదో చూడాలి.  క్రిందటి వారం నేను నా మానవరాలూ రకరకాల బంతి  మొక్కల విత్తనాలు చెట్ల నుండి తీసి వచ్చే సంవత్సరానికి దాచి పెట్టాము . 

వేసవికి, చలికాలం కి మధ్యలో ఉన్న ఈ క్రేజీ సెప్టెంబర్లో ముఖ్యంగా చేయాల్సిందల్లా వచ్చే చలికాలానికి ప్రిపేర్ అవటమే ,  చలికాలం (డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ) ఒకప్పుడు మైల్డ్ గ  ఉంటుంది ఒకపుడు బ్రూటల్ గ  ఉంటుంది .  దేనికయినా ప్రిపేర్ అవ్వాలి కదా . 

గుడ్ బై  క్రేజీ  సెప్టెంబర్. 

ఈ పోస్ట్ సెప్టెంబర్ లో మొదలెట్టి అక్టోబర్ లో మీ ముందు ఉంచుతున్నాను. ఈ మధ్యకాలంలో  ఏమయినా తీరికలేనంత గొప్పపనులు చేశానా  అంటే సున్నకి సున్నా హళ్ళికి హళ్ళి . 

అందరికీ దసరా శుభాకాంక్షలు . 

Thursday, July 25, 2024

207 ఓ బుల్లి కధ --- జీవితం సుఖంగా గడపాలంటే

మనందరం జీవితం సుఖంగా గడపాలని అనుకుంటాం. దానికి మార్గాలు వెతుకుతూ ఉంటాము. మొదటగా మనము ఆలోచించేది డబ్బు. డబ్బు ఉంటే మనం అన్నీ కొనుక్కోవచ్చు అని అనుకుంటాము. డబ్బు సంపాయించాలంటే  రెండే రెండు మార్గాలు. మొదటిది ఉద్యోగం దానికి కావాల్సిన చదువు . రెండొవది వ్యాపారం. వ్యాపారం చెయ్యటానికి కూడా దానికి తగిన నేర్పరి తనం చదివి నేర్చుకోవాలి. 

ఇలా కాకుండా అదృష్టం ఉంటే డబ్బు మన చేతిలోకి వారసత్వం ద్వారానో లాటరీ ద్వారానో రావచ్చు. అయినప్పటికీ ఆ డబ్బుని సరీగ్గా ఉపయోగించటం తెలియక బికారీ అయినవాళ్లు కోకొల్లలు. డబ్బును సక్రమంగా ఉపయోగించటానికి కూడా చదువు చాకచక్యం కావాలి.

డబ్బున్నా కూడా మనకు కావాల్సిన వాటిని చాలా సార్లు కొనుక్కోలేము. దీనికి ఉదాహరణగా నాకు తెలిసిన ఒక కధ చెబుతాను. అది రెండొవ ప్రపంచ యుద్ధ కాలం. ఫ్రాన్స్ లో ఆహారపదార్ధాలు అమ్మే ఒక వ్యాపారస్తుడి కధ. యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. ఆహార పదార్ధాలు దొరకటం కష్టంగా ఉంది. తన దగ్గరున్న వన్నీ ధరలు పెంచేసి అమ్మేసి డబ్బు బాగా గడించాడు ఓ వ్యాపారి. ఇంకా తన దగ్గర అమ్మటానికి ఏమీ లేవు. యుద్ధం ఇంకా సాగుతూ ఉంది. తన దగ్గర ఆహార పదార్ధాలు కొన్న వాళ్ళే  ఏంత డబ్బుఇస్తానన్నా వాళ్ళు దాచిపెట్టుకున్న ఆహారం ఇవ్వటానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎంత డబ్బు ఉన్నా తింటానికి తిండి దొరకక  ఆ వ్యాపారి ఆకలితో మరణించాల్సి వచ్చింది. ఎక్కువగా  డబ్బు సంపాయించాలి అనే కక్కూర్తితో మోసంచేసి జైలు పాలయిన వాళ్ళు కూడా చాలామంది.

అందుకని జీవితం సుఖంగా గడపటానికి డబ్బే ప్రాధాన్యం కాదు . డబ్బుతో అన్నీ కొనుక్కోలేము. అదే అయితే  బాగా డబ్బున్న దేశాలు డబ్బులేని దేశాల్ని కబళించ వచ్చు. పోనీ డబ్బున్న దేశాల్లో ప్రజలు సుఖంగా ఉన్నారంటే అదీలేదు. ప్రపంచ దేశాల్లో, ప్రజలు సుఖంగా ఉన్నామని చెప్పే మొదటి ఐదు దేశాలు Finland, Denmark, Iceland, Sweden, and Norway ( 2024 World Happiness Report,) . ఇవి చలి దేశాలు. సంవత్సరంలో చాలా రోజులు బయట తెల్లగా ఐస్ కనపడుతుంది సూర్యు డుండడు . ఎందుకు వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుంటే తెలిసిన ముఖ్యాంశాలు.

1. సఖ్యత తో చక్కగా ఉండే సమాజం. ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సఖ్యతగా ఉండే సమాజం. నీకు అవసరమైతే సహాయం చేసేవాళ్ళు ఉన్నారా అని ఆ దేశ ప్రజలని అడిగితే, ఉన్నారు  అన్న వాళ్ళు ఈ దేశాల లో చాలా మంది.

2. ఈ దేశాల వాళ్ళు మంచి జీవన విధానం అవలంభిస్తారు. ప్రకృతిని ప్రేమిస్తారు ఆరాధిస్తారు. ప్రకృతితో మమేకమై జీవిస్తారు. అందుకనే వారి సగటు ఆయుర్దాయం 80 ఏళ్ళ పైనే.

3.ప్రజలకోసం మంచి ప్రభుత్వ నిర్ణయాలు. These countries also provide a social safety net for their citizens, including child benefits, parental leave, health services, hospitals, and care for the sick, unemployed, and senior citizens — all paid for by the government. 

4. ప్రజలందరికీ మంచి ఉద్యోగాలూ, అందరికీ చక్కగా జీవించటానికి కావలసిన సదుపాయాలు  కలిగించే ప్రభుత్వం.

5. చాలా మందికి వారి ఉద్యోగ వసతులతో సంతృప్తిగ ఉంది. దానికి తోడు వీలున్నంత వరకూ వారు దాన ధర్మాలు చేస్తారు.

ప్రజలు జీవించటానికి చక్కని సదుపాయాలూ చేసే ప్రభుత్వం ఉంటేనూ, సఖ్యతతో ఒకరి కొకరు  బాగోగులు గమనించే సమాజం ఉంటేనూ జీవితం సుఖంగా గడుస్తుంది.

https://dailypassport.com/the-worlds-happiest-countries-all-share-this-in-common/

Thursday, May 2, 2024

206 ఓ బుల్లి కధ ---చికాగో టు సియాటిల్ ప్రయాణం

 అమెరికాలో చలికాలం వెళ్ళి వసంతకాలం వచ్చింది . ఇంక జనం తిరగటం మొదలెడుతారు . దాదాపు అందరూ, తక్కువదూరం అయితే కార్ల ల్లోనూ , ఎక్కువదూరం అయితే విమానాలలోనో వెళ్తూ  ఉంటారు.  కొందరు వాళ్ళ వాళ్ళ చిన్న విమానాలలో కూడా వెళ్తూ ఉంటారు. మా ఇంటి పక్క ఒక చిన్న విమానాశ్రయం ఉంది. ఆ చుట్టు  పక్కల ఉన్నఇళ్ళ వాళ్ళకి చిన్న చిన్న  విమానాలు ఉన్నాయి. మనం కార్లో వెళ్ళొచ్చినట్లు విమానాల్లో వెళ్ళొచ్చి విమానాల్ని వాళ్ళ ఇంటి గరాజ్ లో పెట్టుకుంటారు. కాకపోతే గరాజ్ లు కొంచెం పెద్దగా ఉంటాయి. మాకు అటువంటి సౌకర్యము లేక సియాటిల్ వెళ్ళటానికి కమ్మర్షియల్  ప్లేన్ లో వెళ్లాలని రిజర్వేషన్ చేసుకున్నాము. మేముండే చోటుకి ఏర్పోర్ట్ ముఫై మైళ్ళ దూరం. అందుకని టాక్సీ మాట్లడుకున్నాము. ప్లేన్లో  నాలుగు గంటల  ప్రయాణానికి ఏర్పోర్టు కి  రెండుగంటల ముందు వెళ్ళాలి. టాక్సీ ప్రయాణం ఒక గంట. మొత్తం సియాటిల్ ప్రయాణం ఏడు  గంటల పడుతుంది . అంటే రెండు వేల మైళ్ళ ప్రయాణం ఏడు గంటల్లో చేసెయ్యవచ్చు. మంచి సౌకర్యమే. సాయంత్రం భోజనం టైం కి ఇంటికి జేరతాం.

సామాన్లు సర్దటం త్వరగా పూర్తవటం మూలంగా టాక్సీ కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూర్చున్నాను . సామాన్యంగా ప్రయాణం చేయబోయే రోజు ఇంట్లో మేము మాట్లాడుకోము. అంతా  నిశ్శబ్దం. మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోవటమే. ఏ ప్రయాణంలో అయినా మన కంట్రోల్  లో లేనివి చాలా ఉంటాయి. అందరూ టెన్షన్  లో ఉంటారు. ఎవరికయినా కోపాలొస్తే పెద్ద గొడవ అవుతుంది. ఒకసారి ఏర్పోర్ట్ కి సగం దూరంలో ఉన్నప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయినదని సమాచారం వస్తే టాక్సీ వాడ్ని బతిమాలుకొని  అదే టాక్సీలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. రిజర్వేషన్స్  అన్నీ ఇంటావిడ చేస్తుంది. నేను నోరు మెదపలేదు. ఆరోజు చాలా మౌనం పాటించాము. టాక్సీ ఆయన బతిమాలించుకుని రాను పోనూ చార్జీలు రెండూ తీసుకుని మమ్మల్ని ఇంట్లో దింపాడు. ఆ రోజు వాతావరణం ఏమీ బాగుండలేదనుకొండీ. ఏ పనీ  లేకుండా ఊరికెనే కూర్చుంటే మనస్సు అర్ధం పర్ధం లేని ఆలోచనలతో ఎటో పోతుంది. నా కెందుకో చిన్నప్పటి సంగతులు గుర్తుకు వస్తున్నాయి ఈరోజు .

నా చిన్నప్పుడు ఒకసారి శలవలకి తాతయ్యగారింటికి నెప్పల్లి వెళ్ళాము . అప్పుడు త్రివిక్రమ  పెళ్ళికి గుడివాడ మొగ పెళ్ళివారితో  కలిసి వెళ్ళాము. పిల్లాళ్ళకి ఆరోజుల్లో  పెద్దవాళ్ళు ఏది చెబితే అది చెయ్యటమే. సొంత  ఆలోచనలంటూ ఏమీ ఉండేవి కాదు. అయినా పెద్దవాళ్ళు ఎవ్వరూ మమ్మల్ని అడిగే వాళ్ళు కాదు. ఆ పెళ్ళికి వెళ్ళిన రోజు ఎందుకో నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను ఐదోక్లాస్ చదివే రోజులనుకుంటాను. మధ్యాహ్నము పెళ్ళివాళ్ళమంతా  రెండెడ్ల బళ్ళల్లో ఎక్కాము. నెమ్మదిగా వెళ్తూ సాయంత్రానికి దారిలో ఒక సత్రంలో ఆగాము. పిల్లలందరికీ అమ్మమ్మ కందిపొడీ, ఆవకాయ ముద్దలు చేసి చేతుల్లో పెట్టింది. రాత్రికి సత్రంలో పడుకున్నాము. మర్నాడు మధ్యాహ్ననికి పెళ్లి ఇంటికి వెళ్ళాము. నాకు పెళ్లి పందిరిలో పెద్ద పెద్ద అరిసెలు లడ్డులూ తిన్నట్లు గుర్తుంది కానీ ఇంకేమీ గుర్తు లేవు.

నాకు అమ్మమ్మను తలుచుకుంటుంటే ఇంకొకటి కూడా గుర్తుకు వచ్చింది. నా వడుగుకి తిరుపతికి రైల్లో వెళ్ళాము. తిరుపతి చేరటానికి రేణిగుంట స్టేషన్  లో దిగి ఇంకో రైలు ఎక్కాలి. సాయంత్రం రేణిగుంట స్టేషన్లో దిగాము. ప్లాటుఫారం మీద కుళాయి దగ్గర మూటవిప్పి అమ్మమ్మ, అమ్మక్కయ్యా కందిపొడీ ఆవకాయ పెద్ద పెద్ద ముద్దలు కలిపి పిల్లల చేతుల్లో పెట్టారు. ముద్దలు అంటే అన్నం ముద్దలు.

నాకు ఎందుకిల్లా ఆలోచనలు అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయో  తెలియదు. ఆ తాతయ్యలూ అమ్మమ్మలూ అమ్మక్కయ్యాలూ ఇప్పుడు ఎవ్వరూ లేరు. అప్పటి సత్రాలు ఇప్పుడు ఉన్నయ్యో లేవో కూడా తెలియదు. రేణిగుంట స్టేషన్ ఉంది కానీ ఆ కుళాయి ఇప్పుడు అక్కడ ఉందో లేదో తెలియదు. కానీ రేణిగుంట నుండి తిరుపతి రైలు ఇప్పుడు పెద్ద పట్టాలమీద పోతోందిట. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే రేణిగుంటలో దిగాల్సిన అవుసరమే లేదుట. ఎందుకో ఆ  జ్ఞాపకాలు అన్నీ  అప్పుడప్పుడూ మనసులో మెదులుతూనే ఉంటాయి.

ఇంటి దగ్గరకు వచ్చినట్లు టాక్సీ ఆయన ఫోన్ చేశాడు.సామాన్లు  తీసుకుని టాక్సీలో ఎక్కాము. ఇంకేముంది ఏర్పోర్ట్ కి వెళ్లిన తర్వాత  క ర్బ్ సైడ్ లో సామాను ఇచ్చేసి సెక్యూరిటీ లో పని పూర్తి చేసి , గెట్ దగ్గర సియాటిల్  ప్లేన్ ఎక్కటమే.

Sunday, January 14, 2024

205 ఓ బుల్లి కధ --- అమెరికాలో చలికాలం వచ్చింది


 
మా ఇంటి వెనక 

మా ఇంటి ముందు 

అమెరికాలో చలికాలం వచ్చేసింది. కాక పోతే ఈ సంవత్సరం కొంచెం ఆలాస్యంగా తన ప్రతాపం చూబెడుతోంది. ఇవాళ పొద్దున్న టెంపరేచర్ -14F (-25.5C) చూపెడుతోంది. ఫొటోలో తెల్లగా కనపడేదంతా స్నో. పొద్దున్న లేచినప్పుడు చెట్ల కొమ్మల మీద కూడా స్నో ఉంది కానీ ఈదురుగాలి మూలాన కిందకి రాలిపోయింది. పై ఫోటోలు తీసేటప్పుడు ఎండ బాగా ఉన్నది కానీ, బయటికి అడుగు పెట్టలేనంత చలి. తలుపు తీసి ఫోటో తీయటం కుదరలేదు.

దేశంలో చాలామందికి కరెంట్ పోయింది. ఈ చలిలో కూడా కరెంట్ వాళ్ళు వచ్చి బాగు చేస్తారు. అది కుదరక పోతే జనాన్ని వేడి ప్రదేశాలకి తరలిస్తారు. 

మేము చికాగో దగ్గరలో ఉంటున్నాము కాబట్టి ప్రతీ సంవత్సరమూ మాకు ఇది అలవాటే. మా ఆవిడ ఇవాళ లైబ్రరీ లో ఉద్యోగానికి కూడా వెళ్ళింది. వీలయినంత వరకూ ఇక్కడ లైబ్రరీలు తెరిచి ఉంటాయి కారణం అవి చలికి మారుగా వేడిగా ఉండే షెల్టర్లు కూడా. మా ఆవిడ పనిచేసే లైబ్రరీలో ఇవ్వాళ పుట్టలమంది జనం వచ్చారుట (అందులో కొందరు T షర్టులు చేసుకోటానికి, అయోధ్య టెంపుల్ పాంఫ్లెట్స్ ప్రింట్ చేసుకోటానికీ కూడా). ఫ్రీగా కంప్యూటర్ లు వాడుకోటానికి, పుస్తకాలూ పేపర్లూ చదవటానికి జనం వస్తూ ఉంటారు కానీ ఇవ్వాళ చలి కాచుకోటానికి కూడా జనం వచ్చి ఉండచ్చు. 

అమెరికాలో చలికాలంలో ముఖ్యంగా వచ్చే పండగలు మూడు  , థాంక్స్ గివింగ్ , క్రిస్మస్, న్యూ ఇయర్. అవి నవంబర్ డిసెంబర్ లో వస్తాయి. 

మేము క్రిస్మస్ కి "డల్లాస్" వెళ్ళాము. టెక్సాస్ రాష్ట్రానికి వెళ్ళటం ఇదే మొదటి సారి. మామూలుగా రోజూవారీ ఉష్ణోగ్రత చికాగో కన్నా ఎక్కువగా ఉంటుంది.మేమున్న దరిదాపుల్లో ఎక్కడ విన్నా తెలుగు మాటలే. ఇక్కడ కొత్తగా పిల్లలకోసం ఒక పాఠశాల తెరిచారుట. దానిలో 50% పైన తెలుగు పిల్లలే. మా దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ పేరు FOODISTHAN. నాకు మొదట అర్ధం కాలేదు గానీ తర్వాత  తెలిసింది దానిపేరు , ఫుడ్ ఇస్తాను, అని. అల్లాగే ఒక కారు లైసెన్స్ ప్లేట్ "andebey " (ఏంది బే ). ఇక్కడ చాలా గుళ్ళు కూడా ఉన్నాయిట. వాటిల్లో దగ్గరలో ఉన్న , "వెంకటేశ్వర స్వామి", "హనుమాన్"  గుళ్ళకి వెళ్ళాము. 

"డల్లాస్" నుండి కారులో "ఆస్టిన్ " వెళ్ళాము. మధ్యలో  "వాకో " అనే ఊరిలో ఆగాము. ఒకప్పుడు , "పాత ఇంటిని కొత్త ఇంటిగా మార్చటం", అనే TV ప్రోగ్రాం ఇక్కడ నుంచి ప్రసార మయ్యేదట. ఇక్కడ కాఫీ మాత్రం చాలా బాగుంది. 

టెక్సాస్ కేపిటల్ భవనం 

"ఆస్టిన్" టెక్సాస్ రాష్ట్ర రాజధాని. విశాలమైన ఆవరణ ఉన్న తోటలో చక్కటి రాజ  భవనం ఉంది. కొద్ది  దూరంలో  అయిదారు అంతస్థుల లైబ్రరీ ఉంది. ఇక్కడ పై అంతస్థులో మేడ మీద గార్డెన్ ఉంది. ఇక్కడ ప్రతీ లైబ్రరీ లో మేకర్ స్టూడియో అని ఉంటుంది. సూయింగ్ మెషిన్ లూ , 3D ప్రింటర్ వగైరా వగైరా , కళల కి ప్రాధాన్య మిచ్చేవి వీటిల్లో ఉంటాయి. వాటిని వాడటానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అక్కడ మా ఆవిడ ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు నువ్విక్కడ పనిచేయ కూడదా అని అడిగారు. (రహస్యం మా ఊళ్ళో మా ఆవిడ లైబ్రరీ మేకర్ స్టూడియోలో పనిచేస్తుంది). ఇక్కడ నాకు ఆశ్చర్యమేసింది  లైబ్రరీ వరండాలో ఫోన్ లేని వాళ్ళ కోసం పెట్టిన "ఫ్రీ ఫోన్". అమెరికా లో కూడా నిరుపేదలు ఉన్నారు.  

"ఆస్టిన్" నుండి "హ్యూస్టన్" కి వెళ్లి NASA వాళ్ళ మ్యూజియం చూశాము. అక్కడ నాకు బాగా నచ్చినవి, అంతరిక్షం నుండి తిరిగివచ్చిన షటిల్ ని మోసుకు వెళ్లిన ప్లేన్ , అంతరిక్షం లోకి వెళ్లి వచ్చిన  రాకెట్, దాని విడి భాగాలూ. రాత్రికి మళ్ళా "ఆస్టిన్" కి తిరిగి వచ్చాము.

"ఆస్టిన్" నుండి మర్నాడు "సాన్ ఆంటోనియో" వెళ్ళాము. మధ్య దారిలో "ఒయాసిస్" అనే రెస్టారెంట్ కి వెళ్ళాము. అది ఎందుకు వెళ్ళామంటే "ఫిదా" మూవీ లో హీరో హీరోయిన్ అక్కడ బాల్కనీ లో "వ్యూ " చూస్తూ మాట్లాడుకుంటారుట. ఆ "వ్యూ " చూద్దామని. ఆ రోజు చలి ఈదురు గాలి దానికి తోడు రెస్టారెంట్ సర్వర్లు పెద్దగ సహకరించలేదు. నేను  బాల్కనీ లో ఈదురు చలిగాలి లో  కూర్చోలేక లోపల ముసలాళ్ళ బెంచీమీద కూర్చుని తినటానికి వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.

ముసలాళ్ళ బెంచి 

"సాన్ ఆంటోనియో" అనే ఊరు అమెరికన్ సివిల్ వార్ లో ఒక ప్రముఖ పాత్ర వహించింది. ఇక్కడ యుద్ధంలో "మెక్సికో " ని ఓడించి టెక్సాస్ ను వశం చేసుకున్నారట. మేము వెళ్లేసరికి సాయంత్రం అయ్యింది, చీకటి, చలి, ఆ రోజే ఒక ముఖ్యమయిన "ఫుట్బాల్ " ఆటట  అక్కడ వీధుల నిండా పిల్లా పెద్దా జనం. పార్కింగ్ సమస్య అయ్యింది. ఒక చోటుకు పోతే $40 చెప్పాడు. నాయనా తక్కువలో ఏమన్నా ఉందా అంటే, పక్క వీధిలో అయిదు డాలర్లే అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళని అడగటం మంచిది.

ఈ వూళ్ళో చూడవలసింది ఎక్కవలసింది, బోటు షికారు. ఒక గంట Q లో నుంచున్న తరువాత విహారయాత్రకు బోటు లో ఎక్కాము. ఆ ఊరిలో కాలువలో బోటు మీద అరగంట విహార యాత్ర. చుట్టూతా  ఉన్న షాప్స్ చూస్తూ తిప్పుతారు. ఎప్పుడైనా బోటు ఎక్కినప్పుడు ఆ బోటు కెప్టెన్ చెప్పిన మాట వినాలి. మా బోటు కాప్టెన్ , అమ్మాయి, మొదట చెప్పింది  "బోటు" కదిలిన తరువాత లేచి నుంచో వద్దు అని. ఒకాయన లేచి నుంచిని ఫోటోలు తీసుకుంటున్నాడు. మూడు సార్లు వార్ణింగ్ ఇచ్చింది.  మధ్యలో దించేస్తానంటే గానీ ఆయన వినలేదు. ఆయన మన దేశస్థుడే.  ఇంట్లో బయటా ఎక్కడయినా కెప్టెన్ చెబితే తప్పకుండా వినాలి.

ఈ చలికాలం "డల్లాస్" ట్రిప్ లో నాకు బాగా నచ్చినవి మూడు.

మొదటిది "ఆస్టిన్" లో మేమున్న చోట ఉన్న "Domain " షాపింగ్ సెంటర్  లో పొద్దున పూట, లేత ఎండలో సన్నని చలిలో రాళ్లు పరిచిన వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ షాపులు చూసిన  మార్నింగ్ వాక్. థాంక్స్ అపూర్వా .

క్రిస్మస్ పార్టీ 

రెండవది హరి గారి ఇంట్లో "క్రిస్మస్ పార్టీ". చక్కటి వాతావరణం. ఇక్కడ చాలా మెచ్చుకోవలసింది పిల్లలు. ఎంతో చక్కగా ప్రేమతోపలుకరించారు. చివర పెట్టిన ఫోటోలు అక్కడ తీసినవే. థాంక్స్ హరి గారూ .

మూడవది "కొండా" గారింట్లో న్యూ ఇయర్ పార్టీ. పిల్లలు పెద్దలూ ఆట పాటలూ, కొత్తసంవత్సరం  డాన్స్. నేను మా ఆవిడా కాసేపు గెంతులు వేశాం. థాంక్స్ కొండా గారూ.

న్యూ ఇయర్ పార్టీ

ఈ రెండు పార్టీలలోనూ పిల్లలు చాలా చక్కగా యాక్టీవ్ గా పాల్గొన్నారు. థాంక్స్ ఫర్ దెమ్ . అసలు చాలా ముఖ్యమయిన వాళ్ళు "ఇంటి దేవతలు" వాళ్ళు లేకపోతే ఇంత చక్కగా ఏర్పాట్లు జరిగేవి కాదు. మిలియన్ థాంక్స్  ఉమా, పద్మా , సరీతా , సురేఖా , భార్గవీ, కామేశ్వరీ.

క్రిస్మస్ పార్టీలో మేము 



Tuesday, October 31, 2023

204 ఓ బుల్లి కధ --- అమెరికాలో ఒక "లేజీ యాఫ్టర్ నూన్"

 

మా ఊళ్ళో నాలుగు రోజులబట్టీ వర్షాలు. ఎండపొడ కొద్దిగానే ఉంది. ఇవ్వాళ సూర్యభగవానుడు తళ తళా మెరుస్తూ బయటికి వచ్చాడు. పచ్చగడ్డి బాగా వచ్చింది. ఎండ  బాగుంది. ఆకురాలు కాలం వచ్చేసింది కాబట్టి ఎండలో పెద్ద చురుకులేదు. వేసవి ఎండ ఆవకాయ అనుకుంటే ఇవ్వాళ వాతావరణం కమ్మటి కందిపొడిలా ఉంది. మేము  మధ్యాహ్నం భోజనం చేసి జోగుతున్నామని అనటం సరీగ్గా సరిపోతుంది. ఇంటావిడ పెట్టిన సినీమా  "Marriage Italian Style " నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఇది పాత "Sophia Lorin " ఇటాలియన్ భాషలో ఉన్న సినీమా ఇంగ్లీష్ స బ్  టై   టి ల్స్  తో. ఎందుకింత  కష్ట పడుతూ చూడటం అని మీరు అనుకోవచ్చు. కానీ మాకు ఏ సినీమా పూర్తిగా చూడాలనే కోరిక ఉండదు. విచక్షణా భావం అసలు లేదు. కాసేపు చూస్తాం నచ్చక పోతే ఇంకో సినీమా పెడతాం. మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయా అని మీరు అడగవచ్చు. అటువంటి దేమీ లేదు. మాది ఆదర్శ దాంపత్యమేమీ కాదు. జుట్టూ జుట్టూ పట్టుకున్న రోజులు ఉన్నాయి.  ప్రస్తుతం నా తలమీద  జుట్టులేదు అంటే ఎవరి పట్టు ఎటువంటిదో మీకు అర్ధమయింది అనుకుంటాను.

అమెరికాలో ఆకురాలు కలం వచ్చేసింది. త్వరలో మా గడియారాలు మార్చాలి. చెట్లూ చేమలూ ఆకుల రంగులు మార్చి, వాటిని రాల్చి వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా నిద్రపోతాయి. మా తోటలో వేసిన చెట్లూ తీగలూ వాడిపోయి రాలి పోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మా తోటలో దిగుమతి చాలా తక్కువ వచ్చింది. పెట్టిన శ్రమకు తగినట్లు రాలేదు. 

అసలు ఇక్కడ పెరటి తోట వెయ్యాల్సినది మేలో. ఈ సంవత్సరం మాకు అది కుదరక ఒక నెలరోజుల తర్వాత మొక్కలు నాటాల్సి వచ్చింది. దీనికంతా కారణం మా పెరట్లో ఉండే పెద్ద మేపుల్  చెట్టు. ఒక చెట్టు అనటం కన్న పది చెట్ల కలయిక అంటే బాగుంటుందేమో. వాటి వయసు దాదాపు యాభై ఏళ్ళ  పైనే ఉంటుంది. అందులో ఒకటి రెండు చెట్లు కాలం చేసి మోడులుగా ఉన్నాయి. కొట్టించటం  ఇష్టంలేక అల్లాగే ఉంచాము. హఠాత్తుగా ఒక రోజున వంటింటి కిటికీలో నుండి చూస్తుండగా ఎండిపోయిన చెట్టు నుండి ఒక దుంగ విరిగిపోయి శబ్దం చేస్తూ కింద పడింది. ఇంక  పిల్లలూ పెద్దలూ ఏకగ్రీవంగా చెట్టు కొట్టించాలని నిర్ణయం జరిగింది. ఇంకా ఇంటావిడ ప్రయత్నం మొదలెట్టింది. మా ఇంట్లో నలుగుర్ని పిలవటం వాళ్ళెంత తీసుకుంటారో ఎప్పుడు పని పూర్తిచేస్తారో కనుక్కోవటం ఇంటావిడ బాధ్యత. నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు రోజులు పట్టింది  చెట్టు కొట్టి పడెయ్యటానికి. అమ్మయ్య అంతా అయిపోయింది అనుకుంటూంటే చెట్టును మొదలు చప్టా చేసే యంత్రం నుండి ఒక పెంకు వెళ్ళి మేడ మీద కిటికీ అద్దం పగలకొట్టింది. ఆ అద్దము విడిగా తెప్పించి  ఫిట్ చేసే సరికి జూన్ వచ్చేసింది. బతిమాలితే ఆ చెట్టు కొట్టినవాడే విత్తనాలు వెయ్యటానికి తోట దున్ని పెట్టాడు.

మాకు ఈ సంవత్సరం వచ్చిన కాపు ఒక అరడజను సొరకాయలూ, ఒక అరడజను బీరకాయలూ , ఒక ఇరవై దోసకాయలూ,  ఒక యాభై టొమాటోలు ఒక వంద పచ్చిమిరప కాయలు. అన్నీ మేము వాడుకోలేము దగ్గరున్న వాళ్లకి పంచాము. వచ్చింది తక్కువే కానీ అదొక తృప్తి. వచ్చిన ఈ కాస్తకి, రోజూ నీళ్ళు పోస్తూ, కలుపుతీస్తూ శ్రమించాలా అనిపించవచ్చు  కానీ,  మనం కోట్ల మందీ పెరటి తోటతో  పండిస్తుంటే దేశం ఎంత సుభిక్షంగా మారుతుంది ! ఎదో దేశం లో ప్రతియింటికీ  ఇంటిముందు కొంచెం ఖాళీ స్థలం ఇచ్చి సంవత్సరానికి వాళ్లకు కావాల్సినవి పండించుకుని  తినమంటారుట. అంటే జనానికి తిండి లేకపోతే అది వాళ్ళ సోమరితనమే, ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పటం.

ఈ సంవత్సరం తోట మూలాన ఒక నగ్న సత్యం తెలుసుకున్నాను. సొర తీగ పెరిగి పోతూ ఉంటే దాన్ని ఒక ఫ్రెమ్ లో ఉంచుదామని ప్రయత్నించి విఫలం అయ్యాము. ఎన్నిసార్లు సొర తీగని ఫ్రెములో పెట్టినా అది పెరిగిపోయి పక్కనున్న చెట్టుకు అల్లుకుపోయి సొరకాయ పిందెలు వేసింది. మనం ఎవరి గమనాన్నీ ఏమీ మార్చలేము. అందుకనే ఎవరికర్మ వాళ్ళు అనుభవించాలి, ఎంత ప్రయత్నించినా మార్చలేము అంటారు.

నాలుగు రోజులబట్టీ వర్షాలు పడి  ఇవ్వాళే సూర్య భగవానుడు బయటికి వచ్చాడు. మాకు కొన్ని ఈతి బాధలు వున్నాయి వాటి సంగతి చూడాలి. ఇంట్లో వాషింగ్ మెషిన్ పాడయింది. వంటింట్లో సింక్ లో వేడి నీళ్లు రావటల్లేదు. మా రెండో కారు కి ఒక టైర్ గాలిపోతుంది. నెల రోజులకొకసారి దానికి సిగరెట్ లైటర్ ద్వారా పంప్ పెట్టి గాలి కొడతాను. ఇప్పుడు సిగరెట్ లైటర్ పని చెయ్యటం మానుకుంది. రెండవకారు దగ్గర పెట్టి దాని సిగరెట్ లైటర్ ద్వారా గాలి కొడుతున్నాను. దాని సంగతేదో చూడాలి. 

ఇవ్వాళ శనివారం. దగ్గర ఇండియా మాల్ లో పెద్ద వినాయకుని విగ్రహం పెట్టి చవితి చేసి, ఇవ్వాళ నిమజ్జనం. అక్కడికి వెళ్ళాలి. బయట నిశ్శబ్దంగా ఉన్నది. ఈ నిశ్శబ్దాన్ని భరించలేక ఇంటావిడ సినీమా పెట్టింది "Marriage Italian Style ". అదొక పాత ఇటాలియన్ సినిమా, ఇంగ్లీష్ subtitles . ఒకావిడ డబ్బున్న ఒకాయనతో చాలా సంవత్సరాలు సహా జీవనం  చేస్తూ  ఉంటుంది. ఆయనకి ఈవిడతో మొహం మొత్తి ఇంకోఅమ్మాయితో తిరుగుతూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సంగతి తెలిసి మొదటావిడ చాలా అస్వస్థకు గురి అయిపోయి తన యింటికి చేరుతుంది. ఇంట్లో వాళ్ళు ,  డాక్టర్ చెప్పాడు  అమ్మాయి చనిపోతుందని చివరి చూపుకు రమ్మని ఆయనకి కబురు చేస్తే, వస్తాడు. చివరి కోరికగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని చచ్చిపోతానంటే అప్పటికప్పుడు ప్రీస్ట్ ని పిలిచి పెళ్లి చేస్తారు.  పెళ్లి అవ్వగానే ఆవిడ తన దొంగ అస్వస్థకు స్వస్తి చెప్పి  భార్యగా తన ఆధిపత్యం చూపుతుంది. ఆయన ఇది భరించలేక , ఒక దొంగ మిషతో పెళ్లి చేసుకుందని కోర్టులో విడాకులు తెచ్చుకుంటాడు. పోతూ పోతూ కాన్వెంట్లలో పెరుగుతున్న తన ముగ్గురు పిల్లల్ని ఇంటికి రమ్మంటుంది. వచ్చిన పిల్లల్ని చూపెట్టి అందులో ఒకరు నీ పిల్లాడు అని చెబుతుంది. ఇంటాయన తటపటా ఇస్తాడు. పితృప్రేమతో, వాళ్ళల్లో తన పిల్లాడెవరో తెలుసుకోలేక చివరికి మళ్ళా మొదటి ఆవిడనే తిరిగి పెళ్ళి చేసుకుని, ఆ ముగ్గురు పిల్లల్ని తాను adopt  చేసుకుంటాడు. అదీ సినిమా. 

దగ్గరలో శర్మగారు వాళ్ళమ్మాయి పెళ్ళికి రమ్మని పిలవటానికి వచ్చారు. మా ఇల్లు విడిదిగా పెట్టుకోమని చెప్పాము. సాయంత్రం శోభా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో ఇండియా మాల్ కి వెళ్లి వినాయకుడిని చూడాలి. 

ఇంకా కంప్యూటర్ ముందు కూర్చుని ఎదో వింటూ కొత్తవి నేర్చుకుంటూ ఉంటాను. ఈ వయసులో “నువ్వు చదవడం వల్ల లోకానికొచ్చే ఉపయోగం ఏమీలేదు, చదవకపోవడం వల్ల వచ్చే ఉపద్రవం కూడా ఏమీ లేదు” అని మా ఆవిడ అంటూనే ఉంటుంది కానీ నా పైథాన్ , నా జూపిటర్ నోట్బుక్ నేను వదలలేను. ఆవిడని శాంత పరచటానికి అప్పుడప్పుడూ యూటుబ్లో నేర్చుకున్న వంటలు చేసి పెడుతూ ఉంటాను. ఈ మధ్య పాతకాలపు పచ్చళ్ళు చేసిపెడదామని రోలు రోకలి కూడా తెప్పించాను. ఇంట్లోవాళ్ళని మంచిచేసుకోవటం ఎప్పుడూ మంచిదేగా !

ఈ పోస్ట్ వ్రాయటం సెప్టెంబర్ లో మొదలెట్టాను . అక్టోబరులో  అయినా పూర్తి చేద్దామని ప్రయత్నం. ఇవ్వాళ అక్టోబర్ చివరి రోజు. ఈ సంవత్సరంలో మొదటి గా ఇవ్వాళే స్నో పడింది. ఆ తరువాత ఎండకూడా వచ్చింది. మా తోట  రంగులు మారి, వడలి పోతున్న ఆకులతో స్నోలో ఎలా

మెరిసిపోతోందో చూడండి.

  . 

ఇవ్వాళ "హాలోవీన్". పిల్లలు గుమ్మడికాయలమీద బొమ్మలు చెక్కుతారు.  పిల్లలు  "ట్రిక్ ఆర్ ట్రీట్ " అనుకుంటూ  ఇంటింటికీ  తలో సంచీ పుచ్చుకుని వస్తారు. ఇంటి పెద్దలు వాళ్లకి "కాండీ" సంచీలోవేస్తారు. పిల్లలికి ఈ రోజు చాలా ఇష్టం. సంవత్సరానికి తినేటంత "కాండీ" వస్తుంది. మా ఇంటికి సాయంత్రం నాలుగు గంటల నుండీ పిల్లలు "కాండీ" కోసం వస్తున్నారు. ఇప్పుడే మా మానమలూ మానవరాళ్ళూ చేసిన గుమ్మడి కాయల ఫోటోలు వచ్చాయి. అందులో రెండు కింద పెడుతున్నాను.


Tuesday, May 30, 2023

203 ఓ బుల్లి కధ --- జీవిత సత్యం

అమెరికాలో చలికాలం అయిపోయి వేసవి కాలం వచ్చింది. పొద్దునపూట అయిదు గంటల కల్లా కిచ కిచలతో పక్షులు నిద్రలేపటం మొదలయ్యింది.  ప్రతిరోజూ వాతావరణం లో వేడి పెరుగుతూ వస్తోంది. సమయం పొద్దునపూట ఎనిమిది  గంటలు. కాఫీ తాగుతూ పోర్టికోలో కూర్చున్నాను.

పక్కింటి పరమేశం హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనగారి మొహం జీవితంలో ఎదో గెలిచినవాడి మొఖంలా వికసించిపోతూ ఉంది. ముఖద్వారం కొద్దిగా ముందుకి తోసి "ఒక కాఫీ" అని అరిచాను. "దేదీప్య మనంగా వెలిగిపోతున్నావు -- ఏమిటి సంగతి" అని అడగాలని పించింది కానీ నేను అడగలేదు. ఎవరి ముఖమైనా దివ్యంగా వెలిగిపోతూ ఉంటే వాళ్ళని మనం ఏమీ ఎందుకూ అని అడగాల్సిన పని లేదు. వాళ్ళే చెప్పేస్తారు.

ఇంటావిడ కాఫీ తీసుకువచ్చింది. పరమేశానికి ఆవిడ చేతికాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతూ మొదలెట్టాడు.

"జీవితంలో కొన్ని మనమనుకున్నట్లు జరుగుతాయి కొన్ని జరుగవు".  ఎందుకు ఇల్లా  మొదలెట్టాడో  అర్ధం కాలేదు. ఇవన్నీ అందరికీ మామూలే. ఎవరి జీవితంలో నయినా  "పర్ఫెక్ట్"  గ అన్నీ మనమనుకున్నట్లు జరగవు. అసలు సంగతి ఏమిటని అడిగాను. అదే చెప్పబోతున్నా నన్నాడు.

"నిన్న నామనసులో ఒక మెరుపుమెరిసింది" అన్నాడు. "నా జీవితంలో ఫైల్యూర్స్  ఎందుకు వచ్చాయో తెలిసిపోయింది. జీవితంలో గెలవాలంటే ఏమి చెయ్యాలో కూడా తెలిసి పోయింది." అన్నాడు. ఆ మెరుపు సంగతి మాకు కూడా వినిపించు అన్నాను.

"మనం చేసే పనుల్లో మనం మూడు సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే గెలుపెప్పుడూ మనదే" అన్నాడు.

పరమేశం చెప్పినవి క్లుప్తంగా మూడు అవి  : What to Do .  How to Do .  When to Do .

లోతుగా చూస్తే అవి: 

1.  మనము ఏమి చేద్దామనుకుంటున్నాము. (What we are going to do ). మొదట దీనిని నిర్ధారించు కోవాలి.

2. దానిని ఎలా చేద్దామనుకుంటున్నాము . (How we are going to do it ). దీనిని  గురించి బాగా ఆలోచించాలి.

3. ఎప్పుడు చేద్దా మనుకుంటున్నాము. (When we are going to do it ). Timing . ఇది చాలా ముఖ్యం.

ఓ పని మొదలెట్టే ముందు ఈ మూడు సూత్రాలూ సరీగ్గా అధ్యయనం చేస్తే మనకి తిరుగంటూ ఉండదు. నా జీవితంలో "ఫైల్యూర్ " అయినవన్నీ నా తప్పిదాలే. ఈ మూడు సూత్రాలూ సరీగ్గా చెయ్యలేక పోవటం మూలానే అలా జరిగాయి. అని చెప్పాడు.

నాకు చాలా ఉత్సాహము ఎక్కువయ్యింది. మనం జీవితంలో ఓటమి ఎదురయినప్పుడల్లా దానికి కారణం వెంటనే ఇంకొకళ్ళ మీదికి నెట్టేస్తాము. మన అందరికీ జయాలకన్నా అపజయాలు ఎక్కువగా బాధిస్తూఉంటాయి. అవి ఒక పట్టాన మనసులోంచి పోవు. ఈ పని చేయకపోతే ఎంత బాగుండేదో కదా. ఇలా కాకుండా ఆలా చేస్తే బాగుండేదే. ఈ ప్రశ్నలూ సమాధానాలూ మన దైనందిన జీవితాల్లో ఒక భాగం. కానీ పరమేశం థియరీ ప్రకారం అలా జరగటం అంతా మన ప్రతాపమే.

జీవితంలో చాలా మందికి ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలియక తప్పటడుగులు వేస్తూ ఉంటారు. వెంటనే ఆలోచించాను ఒక పుస్తకం వ్రాసేస్తే చాలా మందిని ఆ బాధల నుండి విముక్తి చేయొచ్చు కదా అని. వెంటనే పరమేశంతో మనమో పుస్తకం వ్రాసేద్దామని చెప్పేశాను. ఎప్పుడయినా బంగారం లాంటి ఆలోచనలు వస్తే వాటిని వెంటనే ఆచరణ చెయ్యటానికి ప్రయత్నించాలి. 

పరమేశం నీ జీవితంలో జరిగిన సంఘటనలను పై మూడు సూత్రాలతో అన్వయించి చెప్పావంటే , వాటిని ఉంటంకిస్తూ ఒక పుస్తకం వ్రాసేద్దాము. దానికి నోబెల్ పీస్ ప్రైజ్ రావచ్చు అని చెప్పాను. పరమేశం వెంటనే నాతో పుస్తకం వ్రాయటానికి అంగీకరించాడు. అనుకున్న వెంటనే ఆ పని చేస్తే మీన మేషాలు లెక్క చెయ్యక్కర లేదుట. ముహూర్తాలు పెట్టవలసిన అవుసరం లేదుట. 

వెంటనే గుమ్మం వేపు తిరిగి , "ఏమేవ్  ఒక  పెన్నూ పేపరూ త్వరగా పట్టుకురా " అంటూ అరిచాను. మా ఆవిడ నేను అడిగినప్పుడల్లా  ఎదురు ప్రశ్నించకుండా చెప్పిన పనులు చేస్తుంది. నాకు నోబెల్ వస్తే ఆవిడ పేరు నా నోబెల్ లెక్చర్ లో తప్పకుండా చెప్పాలని తీర్మానించు కున్నాను. 

రిటైర్మెంట్  లో ఇంత ఎగ్జైట్మెంట్  ఎప్పుడూ రాలేదు. ఎంత మంది జీవితాల్లోనో ఆనందం నింప  బోతున్నానో. పుస్తకం పబ్లిష్ చేసిన వెంటనే "నెమలికన్ను" మురళి గారి చేత రివ్యూ వ్రాయించాలని కూడా అనుకున్నాను.

పెన్నూ పేపర్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలోకి పరమేశం మొబైల్ మోగింది.  పరమేశానికి కొంచెం శ్రవణ గ్రహణం. సరీగ్గా వినపడటం కోసం శబ్దాన్ని ఎక్కువగా పెట్టుకుంటాడు. దానిలోనుంచి "కూరలు తరగాలి తొందరగా రా" అనే సందేశం పెద్దగా వినపడింది.

పరమేశం నేనింటికి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. నా నోబెల్ ప్రైజ్ కలలు నిమిషంలో కరిగి పోయాయి.

మళ్ళా పరమేశం వచ్చినప్పుడు ఆ పుస్తకం సంగతేదో చూడాలి. నాకు ఆ పుస్తకం పూర్తి చేస్తే, నా  నోబెల్  ప్రైజ్  కన్నా ఎందరి జీవితాల్లో నో ఆనందం నింపిన సంతృప్తి ఉంటుంది. మీరు పుస్తకం కోసం ఎదురుచూడకుండా, ఇప్పటినుండే ఆ మూడు సూత్రాలూ పాటిస్తూ ఉంటే, జీవితం మూడు పువ్వులూ ఆరు కాయలుగా ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. జై పరమేశం.