Tuesday, November 8, 2022

199 ఓ బుల్లికధ --- ఓ పరుగులెత్తే గంగమ్మ కధ

16వ అంతస్తు నుండి --- బెంగుళూరు 

గంగమ్మ వయస్సు ఎంతో గంగమ్మకి తెలియదు. జీవితంలో తన వయస్సు తెలుసుకోవాలనే అవసరం గంగమ్మకి లేదు. వయస్సు అడిగే ఉద్యోగాలు ఎప్పుడూ చెయ్యలేదు. ముగ్గురు చెల్లెళ్ళు  ముగ్గురు తమ్ముళ్ళ తో జీవితం గడిపింది. ఇంట్లో పెద్దదవటంతో పాఠశాల వైపు పోకుండా చిన్నప్పటి నుండీ ఇంటిపనులతోనూ పొలం పనులతోనూ కాలం గడిపింది.  

ఆమెకు పెళ్ళంటే తెలియని పన్నెండేళ్ళ వయసులో పెళ్ళి చేశారు. ఇంక అత్తారింట్లో కాపరం దానితో వచ్చే మంచి చెడ్డలితో కాలం గడిచిపోయింది. పిల్లలు పుట్టటం వాళ్ళ పెంపకం. భర్త ఇళ్ళ  నిర్మాణాల్లో మేస్త్రీ పని చేసేవారు. ఒక ప్రమాదంలో కాలు విరిగింది. జీవితంలో ఏవి ఎప్పుడు జరుగుతయ్యో చెప్పలేము. ధైర్యంగా ముందుకి సాగి పోవటమే. పనులు చెయ్యలేని భర్త, ఇద్దరి కొడుకులు ఒక కూతురితో తన సొంత ఊరు, తమిళనాడులో ధర్మపురి వదిలేసి దగ్గరున్న పట్టణం, కర్ణాటక లోని బెంగుళూరుకి  బస్ ఎక్కింది. 

బెంగుళూరులో అందరికీ అవసరమయ్యే ఇంటిపనిని తన వృత్తిగా మార్చుకుంది. కంప్యూటర్లతో సతమత మవుతూ ఆకాశ హర్మ్యాలలో నివసించే బెంగుళూరు వాసులకు ఒక పెన్నిధిగా మారింది. పొద్దున్నే ఏడింటికి బస్సు లో రావటం, అయిదు ఆరు ఇళ్ళల్లో పనిచేయటం, మళ్ళా సాయంత్రం ఏడింటికి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళటం మామూలు అయిపొయింది. పనిచేసే ఇంటి అవసరాల్ని బట్టి తన సమయాన్ని ఇంటింటికీ కేటాయించేది. ఒక ఇంటిలోనే అంత సమయమూ గడపకుండా ఇంటిపనులన్నీ విడివిడిగా చేసి అన్ని ఇళ్ళకీ సమయం కేటాయించేది. దానినే బిజినెస్ గురువులు కస్టమర్ సెగ్మెంటేషన్ అంటారు. సామాన్యంగా ఏదో ఇంట్లో కాఫీ ఇస్తారు ఎవరో మధ్యాన్నం భోజనం పెడతారు సాయంత్రం ఇంటికి తీసుకు వె ళ్ళటానికి ఏవేవో ఇస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ తినేవి ఎప్పుడూ మిగులుతూనే ఉంటాయి కదా!.

అల్లా 20 ఏళ్ళు గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అందరూ గవర్నమెంటు పాఠశాలల్లో హైస్కూ ల్ పూర్తి చేశారు. పిల్లలకి పెద్ద చదువులు చెప్పించే పరిస్థితి లేక వాళ్ళని చిన్న వ్యాపారులుగా మార్చింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళకి పిల్లలు. ఒక చిన్న స్థలం కొనుక్కుని ఇల్లు కట్టించుకుంది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఉంటారు. అత్తగారినీ, భర్తనీ ఇంట్లో పెట్టి చివరి వరకూ వారిని చూసుకుంది.

కోవిడ్ తర్వాత ఇండియాకి వచ్చిన ట్రిప్ లో బెంగుళూరు లో ఎక్కువ రోజులు గడపటం జరిగింది. ఎందుకో రోజూ మా ఇంట్లో పనిచేసే గంగమ్మ కధ  చెప్పాలని అనిపించింది. నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుపోతూ జీవితం గడిపే గంగమ్మ లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది  ఉన్నారు. వారి మూలానే ఈ దేశం నడుస్తోందనే మాటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

4 comments: