Monday, April 7, 2025

213 ఓ బుల్లి కధ --- మిలియాన్నైర్ పెళ్ళాం

ఏప్రిల్ నెల తో అమెరికాలో వసంతకాలం మొదలైనట్లే . లివింగ్ రూమ్ కిటికీ లోనుండి చూస్తున్నా . ఎదురింట్లో లాన్ మీద హడావుడిగా ఉంది . ఆకాశాన్ని అంటుతున్న చెట్టు పైన రెండు పక్షులు చేరి సరసా లాడుకుంటున్నాయి . పిల్లలు చెట్లకేసిన ఉయ్యాలలో  ఊగుతున్నారు . పెద్దలు నుంచుని బీర్ తాగుతున్నారు . అమ్మలు గ్రిల్ మీద "హాట్ డాగ్ "  లు కాలుస్తున్నారు. 

మార్చి తో చూస్తే ఒకనెలలో ఎంత మార్పు . నెల క్రిందట ఇదే కిటికీ లోనుండి  చూస్తే --- ఆకాశం నుండి ఎవరో ముగ్గు చల్లుతున్నట్లు "స్నో "  పడుతోంది . అది ఆకులులేని మోడులుగా ఉన్న చెట్లకొమ్మలపై పడి పేరుకుని వీధిలోఉన్న చెట్లకి ఒక అందాన్ని ఇస్తున్నాయి . రోడ్లమీద ఫుట్ పాత్ మీద "స్నో " పడి సన్నటి గాలికొడుతుంటే రేగిపోతూ ఇక్కడ ఉండేదా పోయేదా అనుకుంటూ చెలరేగుతోంది . నెల క్రిందటకీ ఇప్పటికీ ఎంత తేడా ! 

ఒక గంటలో అంతా మారిపోయింది .  స్నోపడటం ఆగిపోయింది .  గంభీరమైన నిశ్శబ్దం . ఎవరో వచ్చి ప్రకృతినంతా పెయింట్ చేసి వెళ్ళినట్లు  ఉంది . చెట్ల కొమ్మ లన్నీ  ఎవరో తెల్ల పెయింట్ పూసునట్లు  తెల్లగా ఉన్నాయి . వీధులూ , ఫుట్ పాత్ లూ తెల్లగా మెరుస్తున్నాయి . ఇది నెలరోజుల కిందటి వాతావరణం .  మళ్ళా ఇంకొక సంవత్సరం దాకా అటువంటి దృశ్యాలు కనపడవు .  

తలుపు చప్పుడయినది పక్కింటి  పరమేశం వచ్చాడు .  సామాన్యంగా వీకెండ్ తప్ప పరమేశం కనిపించడు . స్టాక్ మార్కెట్ ఎదో చూసుకుంటూ ఉంటాడు .  ఇంకా మాట్లాడితే ఏవో "అప్షన్స్ " లట వాటితో  డబ్బులు సంపాయిస్తాడుట . రిటైర్ అయ్యిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడైతే బాగుంటుంది కదా !  ఇవ్వాళ ఇంటావిడ లేదు , వర్క్ కి వెళ్ళింది . నేనే కాఫీ పెట్టి ఇచ్చాను.

ఏం పరమేశం స్టాక్ మార్కెట్ ఎల్లా ఉంది అని అడిగాను . తను  వెంటనే సమాధానం ఇవ్వలేదు. TV లో వింటున్నాను ఏవో  "టారిఫ్" ల తోటి స్టాకులకి గడ్డు పరిస్థితి అని . 

నెమ్మదిగా అన్నాడు "మా ఆవిడని మిల్లియన్నీర్  చేద్దామనుకున్నాను " అని .  ఇదేదో కొత్తగా ఉంది .  సామాన్యంగా ఇంటావిడకి ఏదో పండగలకి పట్టు చీర కొందా మనో , ఎదో "నెక్ లెస్"  కొందామనో అనుకుంటారు కానీ ఇలా వాళ్ళ ఆవిడని మిల్లియన్నీర్ చేద్దామనే కోరిక వినలేదు . 

మరి ఏమయ్యింది అని అడిగాను .  మార్కెట్లు కుదేలు అయినాయి అన్నాడు .  పోన్లే మళ్ళా మెరుగవుతాయిలే అన్నాను . లేదు మన జీవిత కాలంలో అవ్వవు అన్నాడు . ఏమిటో ఇంత నిరాశ రావటానికి అంత ఉపద్రవం ఏమొచ్చిందో ! 

ఇంకా ఎదో అంటూనే ఉన్నాడు ,  కాల్స్ ట, పుట్స్ ట, ఆప్షన్ ఎక్సపైరీ ట, అసైన్మెంట్ ట ---  ఏవేవో ఆపకుండా గొణుగు తున్నాడు .  

నాకు ఎల్లా సముదాయించాలో అర్ధం కాలా .  పరమేశం మా ఇంట్లో సాయంత్రం భోజనం "ఉప్పుడు పిండి", ఆవురావురు మంటూ మా ఆవిడ వర్క్ నుండి వచ్చే లోపల చెయ్యాలి. ఈ  నాలుగు పచ్చిమిరప కాయలూ అల్లం ముక్క దంచిపెట్టు ,  నేను పెసరపప్పు నానేసి ఎసరు పోస్తాను అన్నాను . 

ఏదోవిధంగా బాధపడుతున్న వాళ్ళని ఇంకో వైపు తిప్పితే కొంచెం ఉపశమనం కలుగుతుంది . పాపం పరమేశం కోరిక ఎప్పుడు తీరుతుందో ! .    

4 comments:

  1. పరమేశ వాళ్ళ అవిడ ఎలా వున్నది

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతం టాక్స్ లతో కుస్తీ పడుతోంది . April 15 టాక్స్ చివరి రోజు .

      Delete
  2. మిలియనేర్ పెళ్ళాం కథ, Tariffs వచ్చి మన Spring moods ni Fall season లొ (చెట్ల) మెుడుల్లా చేశాయా అనే ఆలోచన కలిగించింది.

    👍రాధ ధూలిపాల

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడిప్పుడే చెట్ల కొమ్మల మీద మొగ్గలు కనపడుతున్నాయి . ఆ మొగ్గలు వికసించటం తధ్యం కదా ! అవి రాలిపోవడం తధ్యం కదా . అల్లాగే టారిఫ్ లు రాలి పోతాయి. కాల చక్రం తిరుగుతుంటే చూస్తుండటమే మన పని .
      మీ ఈ - మెయిల్ కి ధన్యవాదములు .

      Delete