Monday, September 13, 2021

175 ఓ బుల్లి కథ -- అమెరికాలో మా తోట

   


అమెరికాలో సెప్టెంబర్ మొదటి సోమవారం "లేబర్డే" వస్తుంది. ఆ రోజు అందరికీ శలవ. అధికారికంగా వేసవి వెళ్లిపోయినట్లు లెక్క. వాతావరణం కూడా చల్లబడుతుంది. పెరట్లో వేసిన మొక్కలు కి కూడా ఇది చివరి నెల. అన్నీ వాడిపోయి విడిపోయి రాలిపోతాయి. ఈ సంవత్సరం గోంగూర, దోసకాయ, బీరకాయ, చిక్కుడు, టమాటో, ఎల్లో స్క్వాష్ వేశాము. దోసకాయలు బాగా వచ్చాయి. గోంగూర బాగా వచ్చింది. ఒక పది బీరకాయలు వచ్చాయి. మిగతావన్నీ నామకః పెరిగాయి గానీ ఉత్పత్తి చాలా తక్కువ. 
పెరట్లో తోట ఉంటే ఆ కిక్ వేరు. గోంగూర పచ్చడి ఎన్ని సార్లో చేసుకున్నాము. దోసకాయలతో చాలా చేశాము. దోసకాయ పచ్చడి ఎక్కువగా చేశాము , దోసకాయకూర, పప్పు వారానికి ఒకసారి. రెండేళ్ల క్రిందట మా మరదలు పద్మ రోజూ పెరట్లోకి వెళ్ళి ఏదో కోసుకువచ్చి కూరో పప్పో పచ్చడో చేసేది. పచ్చి  టమాటో తో పచ్చడి చాలా బాగుంటుంది. రెండు బీరకాయలు ఒకపూట కూరకి సరిపోతాయి. లేత బీరకాయ కూర లేత తాటి ముంజలు తిన్నట్లు ఉంటుంది. రాత్రి పూట లేత బీరకాయలతో చేసిన కూర తింటూ ఉంటే "కఠెవరం" లో చిన్నప్పటి రాత్రిళ్ళు బాసీపెట్టు వేసుకుని బయట కూర్చుని కంచాల్లో అన్నం తిన్న రోజులు గుర్తుకువచ్చాయి. మాఇంట్లో ఎందుకో బీరకాయ కూర రాత్రిళ్లే చేసేవాళ్ళు. ఎల్లోస్క్వాష్ పప్పు చాలాబాగుంటుంది. చిక్కుడే సరీగ్గారాలేదు. కాకరకాయ వేశాముగానీ మొక్కే రాలేదు. వేసవిలో grandkids వస్తే కుండీలో గుమ్మడి గింజలు నాటించి మొక్కలు వస్తే తోటలో వేయించాము. మొక్కలు మాత్రం బాగా పెరిగాయి గానీ పెద్ద గుమ్మడి కాయలు రాలేదు. పిందెలు మాత్రం ఉన్నాయి. 

ఇంకా రెండు నెలల్లో చెట్ల ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడులు అవుతాయి. ఆ తరువాత "స్నో" , చలి. మళ్ళా  అందరం ఏప్రిల్ కోసం ఎదురు చూడటం. విత్తనాలు ఇంట్లో వేసి మొక్కలని పెంచటం. "మే" లో వాటిని తోటలో నాటి రోజూ నీళ్ళుపోసి ఎంతవరకూ పెరిగాయో చూడటం. జీవితమే ఒక రంగుల రాట్నం అలా "ఆశా" "నిరాశ" లతో కదిలిపోతూ ఉంటుంది. 


2 comments:

  1. రావు గారు,
    మనకి ఉన్న తక్కువ వేసవిలో ఒక్క మొక్క సరిగ్గా పూసిన/కాసిన మహాసంతోషమే. రసాయనాలు వాడకుండా మొక్కలు పెంచితే ఇంతకంటే ఎక్కువ ఆశించలేమేమో. గత పదిహేను సంవత్సరాలుగా మిడ్ అట్లాంటిక్ ప్రాంతంలో నాది కూడా మీ అనుభవమే.

    ReplyDelete
  2. పెరట్లో నుండి కాయలు తుంచుకువచ్చి కూరలు చేసుకున్న కిక్ సంతృప్తి ఇంకే విధంగా రాదు. ఇంక ఏప్రిల్ లోనే ఇంట్లో మొక్కలు పెంచి మే లో తోట ప్రారంభించాలని చూస్తున్నాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete