పై ఫోటో వరలక్ష్మీ వ్రతం రోజున మా పెరట్లో అతిథులతో తీసిన ఫోటో. కొన్ని సంవత్సరాల బట్టీ, వరసగా పెరట్లో తోట వేస్తున్నాము. ప్రతి సంవత్సరం కలుపు తీసి మొక్కలు నాటడం కొంచెం కష్టంగా ఉంటోంది. అందుకని ఈ సంవత్సరం ఒక electric నాగలి (cultivator ) కొన్నాము. రెండు మూడు సార్లు మట్టిని తిరగ తీశాము. అన్ని సార్లూ నేను చెయ్యలేదు. నామీద కోపమువఛ్చి మా ఇంటావిడ కూడా నాగలి పట్టింది. ఏ మొక్కలు ఎక్కడ నాటాలి అనే దాని మీద కూడా మాకు అభిప్రాయ భేదాలే. మొత్తం మీద కొట్టుకుంటూ తిట్టుకుంటూ పాదులు వేశాము, ఎలాగయితేనేం చివరికి మొక్కలు బతికి బట్టకట్టాయి. నేను చెప్పుకో కూడదు గానీ వాటి సంరక్షణ అంతా నాదే. దాదాపు వాటికి రోజూ నీళ్ళు నేనే పోసే వాడిని. నిజం చెప్పొద్దూ అప్పుడప్పుడూ మా ఆవిడ కూడా పోసేదనుకోండీ , మా పక్కింటి ఆవిడ కూడా మేము New York వెళ్ళినప్పుడు మొక్కలకి నీళ్ళు పోసింది.
ఈ సంవత్సరం పెరటితోటలో పండిన వాటితో వంట చేసుకోవటం, తోటకూర తో ప్రారంభమయ్యింది. కొన్నేళ్ళ క్రిందట తోటకూర వేస్తే ప్రతీ సంవత్సరం గింజలు నాటకుండానే వస్తోంది. దాదాపు కొన్ని వారాలు తోటకూర పప్పు, తోటకూర కూర, తోటకూర పులుసు కూర.
ఈ సంవత్సరం beefsteak tomato మొక్కలు వేశాము. చాలా బాగా వచ్చాయి. పచ్చి టొమాటోల తోటి (ఉల్లితో కలిపి) కూర, పప్పు, పులుసూ తనివి తీరా చేసుకుని తిన్నాము. పచ్చి టొమాటోల తోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చి టొమాటోలు సామాన్యం గా దొరకవు. దొరికినప్పుడు చాలా ఖరీదు. మేము తినటమే కాదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్లకి కూడా ఇచ్చాము. ఈ సంవత్సరం pole beans (చిక్కుడు) వేశాము. చాలా బాగా వచ్చాయి. నేను ఈనెలు తీసి ముక్కలు చేసి చాలా సార్లు కూర కూడా చేశాను.
ద్రోణంరాజు రామకృష్ణ గారు వాళ్ళ పెరట్లో స్థలం లేదని వంకాయ, బెండకాయ మొక్కలు ఇచ్చారు. ప్రతీ సంవత్సరం ఆయన పెరట్లో, ఆయన పిల్లలకూ తనకూ కూరగాయలు పండిస్తారు. ఆయనదంతా హైటెక్. మొక్కలకి నీళ్లు పోయటం వగైరా అంతా ఎలక్ట్రానిక్ సెన్సార్స్. ద్రోణంరాజు గారి భాగ్యమా అని పండిన వంకాయలతో చిక్కుడు కలిపి కూర చేసుకున్నాము. బ్రహ్మాడం. చిక్కుడూ బంగాళాదుంప కూర కూడా బాగుంటుంది.
ఆనపకాయ వేశాము. ఎక్కువ రాలేదు. అల్లాగే సొరకాయ విత్త నాలు చాలా లేటుగా దొరికితే వేశాము. అవి కూడా రాలేదు. ఎక్కువ మొక్కలు వేశాము. మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే రావల్లే ఉంది. మా ఇంటిదగ్గర ఒక నర్సరీ కి వెళ్తే దోసకాయ లాంటి విత్థనాలు కనపడ్డాయి. వాటి పేరు cucumber lemon . అవి వేశాము. చాలా కాయలు వచ్చాయి. దోసకాయలు లాగానే ఉన్నాయి కానీ అవి చివరికి దోసకాయ లాగా గుండ్రంగా ఉండే కీరా దోసకాయ. చెక్కు మాత్రం దోసకాయ పసుపు రంగు. వాటితో పప్పు, పులుసూ బాగా వచ్చా యి. పక్క బొమ్మలో టొమాటోల పక్కన ఉన్నాయి చూడండి.
ఈ సంవత్సరం బీరకాయలు చాలా వచ్చాయి. బీరకాయ పప్పు, కూర, పై తొక్కు తో పచ్చడి. మొదటి తడవ బీరకాయ చెక్కుని ఎండబెట్టి పొడి చేశాను (కరివేపాకు పొడి లాగా). మొదటి తడవే బాగా వచ్చింది (నా ఉద్దేశంలో). ఈ వేసవిలో చాలా రోజులు పథ్యం తిండి. జుకీనీ వేశాం, మొక్క చాలా పెద్దదయింది కానీ ఒక కాయ కాసి ఎండిపోయింది.
ఈ నెలతో ఈ సంవత్సరానికి పెరటి తోట అయిపోయినట్లే. వచ్చే వారం రాత్రి ఉష్ణోగ్రత 50F (10C) డిగ్రీలు అవుతుందంటున్నారు. ఇక మొక్కలన్నీ వాడిపోటం మొదలెడ తాయి. తీగెలన్నీ తెంపి లాన్ బాగ్ లో పెట్టి బయట పెడితే గార్బేజ్ వాళ్ళు తీసుకు వెళ్తారు.
వచ్చే సంవత్సరం వేసే మొక్కల లిస్ట్ తయారు చేసుకున్నాను. తోటకూర ఎల్లాగూ వస్తుంది. beefsteak or heirloom tomatoes, బీరకాయ, poll beans, butternut squash (నరసింహారావు గారింట్లో బాగా వచ్చిందిట ), lemon cucumber, Thai పచ్చిమెరప, సొరకాయ,
ఇంటావిడ సహకరిస్తే ఈ సంవత్సరం cultivator తో వాడిపోయిన మొక్కలని మట్టితో కలిపి ఎరువు చేద్దా మనుకుంటున్నాను. వచ్ఛే సంవత్సరానికి మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ వింటర్ చివర్లో ఇంటావిడని కొంచెం మంచి చేసుకోవాలి (ఒక నెలరోజుల ముందర చాలు అని అనుకుంటున్నాను). తోటలో మొక్కలు పెట్టటానికి కొంచెం సహాయం చేస్తుంది. దేనికయినా ముందుచూపు ఉండాలి కదా.