Friday, November 11, 2016

128 ఓ బుల్లి కథ 116 ---- హెర్మన్ హెస్ - సిద్దార్ధ


ఎప్పుడో పిల్లలు చదివి పడేసిన పుస్తకాలని ఇప్పుడు చదవటం కొంచెం చిన్నతనంగా ఉండచ్చు కానీ చదివిన తరువాత అవి ఇచ్చే తృప్తి వేరు. ఇదివరకే ఎందుకు చదవ లేదనిపిస్తుంది. నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడల్లా ఎదో ఒక పుస్తకం చదవటం అవుతోంది. ఈ తడవ చదివిన పుస్తకం "హెర్మన్ హెస్" వ్రాసిన  "సిద్దార్ధ".

హెర్మన్ హెస్ జర్మనీ లో Claw అనే ఊళ్ళో జులై  2, 1877 పుట్టారు. జర్మన్ భాషలో చాలా నవలలు వ్రాశారు. ఆయన నవలలు చాలా భాషలలో అనువాదాలుగా వచ్చాయి. అమెరికాలో "సిద్దార్ధ" ఇంగ్లీష్  అనువాదం స్కూల్ పిల్లలందరూ చదువుతారు. హెర్మన్ హెస్ కి 1946 లో రచయితగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. Aug 9, 1962 లో ఈయన చనిపోయారు.

నోబెల్ ప్రైజ్ వచ్చిందని పుస్తకం చదవలేదు కానీ నవల పేరుని బట్టి "బౌద్ధ సిద్ధాంతాల" గురుంచి తెలుసుకుందామని మొదలెట్టాను. మొదట ఉపోద్గాతం లో హెస్ చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ నుండి పారిపోయాడని చదివాను. అల్లా చదువుకి తిరకాసు పెట్టినవాడు నోబెల్ ప్రైజ్ వచ్ఛే నవలలు ఎల్లా వ్రాశాడబ్బా అని ఆశ్చర్యపోతూ చదివాను.

వ్రాసిన శైలి పటిమ గురించి నేను చెప్పలేను కానీ కధ సూక్ష్మంగా చెబుతాను. కధలో హిందూ తత్వం కనపడితే అది జర్మన్ గా పుట్టి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ సూత్రాలూ (అనువాదాలుగా చదివి ) ఒంట పట్టించుచుకున్నహెర్మన్ హెస్ గొప్పే. జీవితంలో మనకు తారస పడే ప్రతి దానిలోనూ మంచి చెడూ ఉంటుంది. మంచి చూసి సంతోషించే వాళ్ళు ఒకళ్ళు, చెడుని చూసి ఏడ్చే వాళ్ళు ఒకళ్ళు. జీవితంలో మనం నవ్వాలా ఏడవాలా అనేది అంతా మన జీవన దృక్పధం లోనే ఉంది.

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన "సిద్దార్ధ" ఈ నవలలో హీరో. సమాజంలో ఒక క్రమ శిక్షణ కోసం రూపొందించిన వర్ణ వ్యవస్థ లో బాల్యం అంతా గడిపాడు. తన తండ్రి దగ్గరనుండి తెలుసుకోవాల్సిన వన్నీ తెలుసుకున్నాడు. ఇంకా తనకు తెలియనివి చాలా ఉన్నాయని గ్రహించాడు. ఆ గ్రహింపుతో సాగిన జీవిత యాత్రే  "సిద్దార్ధ". సిద్దార్ధ జీవన యానంలో ఏదో ఒక మూల మన జీవన యాత్ర కూడా దోబూచులాడుతూ కనపడుతూ ఉంటుంది.

********************************************************************************

"నేను రేపు అడవుల్లోకి వెళ్ళి సన్యాసుల్లో కలుస్తాను. మీ అనుమతి కావాలి " అన్న సిద్దార్ధుని మాటలకి తండ్రి నిర్ఘాంత పోయి అక్కడనునుండి వెళ్లి పోతాడు. మర్నాడు పొద్దున వచ్చి చూస్తే ఇంకా కొడుకు అల్లాగే అక్కడ నుంచుని ఉంటాడు. ఇంక చేసేది లేక "సరే వెళ్ళు. వెళ్ళే ముందర అమ్మకి కూడా చెప్పి వెళ్ళు" అంటాడు. తండ్రి అనుమతి విన్న తరువాత నెమ్మదిగా కదిలి తల్లికి నమస్కరించి అడవుల్లోకి బయల్దేరాడు సిద్దార్ధ. ఊరి చివర తన బాల్య మిత్రుడు గోవిందుడు కూడా తనతో కలుస్తాడు.

ఇద్దరు మిత్రులూ కొన్ని నెలలలో సన్యాస సంస్కృతికి అలవాటు పడతారు. స్నాన జపాదులు, ఉపోషాలూ, ఉపాసనాలూ వగైరా. వారికి ఒకటే కోరిక, మనస్సు సూన్యం(empty) చేసుకోవాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. కోరికలూ,  రాగ ద్వేషాలూ, సుఖ సంతోషాలూ మనస్సులోకి రాకూడదు. కొంతవరకూ వాటిని సాధించారు కానీ ఇంకా ఏమిటో వెలితి కనపడుతోంది. సమాజంలో బాధలూ భయాలూ కష్టాలూ ఎందుకొస్తున్నాయి ? వీటిని అధికమించే మార్గం లేదా? మరల మరల జన్మించి ఈ బాధలను అనుభవించ వలసిన దేనా? జన్మ రాహిత్యం (నిర్వాణ) పొందే రహశ్య మున్నదా ?

ఈ ప్రశ్నలన్నిటికీ దగ్గరలో బోధిసత్వుడు అనే ఆయన సమాధానం చెబుతున్నాడని విని, ఇద్దరు మిత్రులూ  సన్యాసుల సంపర్కంవదలి అక్కడకి బయల్దేర్తారు. బోధిసత్వుని మాటలు గోవిందునకు నచ్చి తను వారిలో చేరిపోతాడు. సిద్దార్ధ కి మాత్రం ఇంకా తెలియని లోటు ఎదో కనిపించింది. దానికోసం బౌద్ధ ఆశ్రమం వదిలి బయల్దేర్తాడు.

ప్రియ మిత్రుని వదిలి సిద్దార్ధ గమ్యంలేని బాటలో ప్రయాణం మొదలెట్టాడు. మూడేళ్ళ సన్యాసుల సంపర్కంతో నేర్చుకున్న విషయాలు చాలా ఉపకరించాయి. తనకి ఆలోచించే శక్తి ఉన్నది. తనకు కావలసిన వాటి కోసం ఎంతకాలమయినా ఆగ గలడు. అన్న పానాదులు మానివేసి ఎన్ని రోజులయినా గడప గలడు. తనదంటూ ఈ ప్రపంచెంలో ఏదీ లేదాయె. ఎవరన్నా ఇస్తే తింటాడు లేకపోతే లేదు.

వెళ్ళే దోవలో నది అడ్డంగా ఉంది. దాటటానికి పడవ మీద ఎక్కాడు. పడవ నడిపేవాడు ఎదో మాట్లాడు తూనే ఉన్నాడు. తాను నదిఒడ్డున ఒక గుడిసెలో ఉంటాడుట. జల జల పారే నదే తన మిత్రుడుట. ఎప్పుడూ తనతో మాట్లాడుతూ సలహాలు చెబుతూ ఉంటుందిట. తాను సన్యాసిని, తన దగ్గర నదిని దాటించినందుకు ఇవ్వటానికి ఏమీ లేవు అని సిద్దార్ధ అంటే  "మీ పూజల్లో నన్ను గుర్తుంచుకోండి చాలు" అంటాడు పడవవాడు.

గమ్యం లేని ప్రయాణం సాగుతోంది. దారిలో ఒక ఊరి బయట చాకలి బట్టలు ఉతుకుతోంది. ఎందుకో మనస్సు అటు పోయింది. నవయౌవ్వనవతి , బట్టలుతుకుతూ పెల్లుబికే తన  బిగువులు చూపెడుతోంది. ఆకర్షితు డయ్యాడు. సన్యాసిగా నివురుకప్పిన తన కోరికలు కెలికినట్లయ్యింది. దగ్గరకి వెళ్ళాడు. పలకరించి మాటలు కలిపి "సన్యాసులంటే తన కిష్టం" తనతో రమ్మంది. ఎందుకో సిద్దార్ధుని మనస్సు "అటువైపు  వెళ్లొద్దు" అని చెబుతోంది. ఆకర్షణ వదలి తన గమ్యం కొన సాగించాడు.

కొద్ధి దూరంలో ఇంకోవూరి పొలిమేర్లలోకి వచ్చాడు. పల్లకీలో ఎవరో వస్తున్నారు. పక్కకు తొలిగి చూశాడు. పల్లకీలో చక్కటి సుందరాంగి. ఎందుకో ఆకర్షితు డయ్యాడు. కనుక్కుంటే తెలిసింది ఆ నెరజాణ ఆ ఊరి వేశ్య,పేరు కమల అని. ఊరి బయట తన తోటకి వెళ్తోంది అని. ఆమెని పరిచయం చేసుకోవాలని అనిపించింది. మర్నాడు అదే సమయానికి అక్కడకి చేరుకున్నాడు. పరివార మంతా వెళ్ళిపోయినతరువాత చివరి సేవకుడితో తాను అమ్మగారికోసం వచ్చాను వెళ్ళి చెప్పి రమ్మన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి సిద్దార్దని లోపలి తీసుకు వెళ్ళాడు.

ఎందుకు వచ్చావు అంది ఆవిడ. మీ దగ్గర "ప్రేమ" గురించి తెలుసుకోవాలని వచ్చాను అంటాడు. సరే నీ దగ్గర ఏముంది? అని అడుగుతుంది . నేను సన్యాసిని నా దగ్గర ఏమీ లేదు అంటాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సెంటు పూసుకుని మంచి దుస్తులతో జేబులో డబ్బుతో వస్తారు. నువ్వేమిటీ ఇలా వచ్చావు?  ఇంకేమన్నా చేయగలవా? అని అడుగుతుంది. తను ఎన్ని రోజులయినా ఉపవాసము ఉండగలనని చెబుతాడు (I can think. I can wait. I can fast). దానికి ఆవిడ నవ్వి ఇంకేమయిన చెప్పమంటుంది. అది అంత గొప్పగా లేదని తెలుసుకొని వెంటనే తనకు గేయాలు వ్రాయటం కూడా వచ్చు అని చెబుతాడు. అయితే నా మీద పద్యం చెప్పు అంటుంది ఆవిడ. పద్యం చెబుతాను గేయాని కొక ముద్దిస్తావా అని అడుగుతాడు. సరే అంటుంది ఆవిడ.

"ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి కమలనయన. దేముడిని కొలవటం కన్నా ఆ కమలని కొలవటం ఆహ్లదకరం" అని చెబుతాడు . ఆ వేశ్య గేయానికి ఆనందించి కౌగలించి ముద్దిస్తుంది. నా దగ్గరకి వచ్చేవాళ్ళు డబ్బులతో రావాలి, నీకు చదవటం వ్రాయటం వచ్చంటున్నావు కదా నీకొక ఉపాయం చెబుతాను రేపొచ్చి కలవ మంటుంది.

మర్నాడు సిద్దార్ధ కమలను కలుసుకున్నాడు. ఆవిడ "కామస్వామి" అనే ఆ ఊళ్ళో పెద్ద వ్యాపారిని కలుసుకోమని చెబుతుంది. "నేను నీ గురించి అంతా చెప్పాను. ఆయన దగ్గరనుండి వ్యాపార రహస్యాలు తెలుసుకుని పెద్ద వ్యాపారి వై డబ్బులు సంపాయించి నా దగ్గరకురా" అని చెబుతుంది.

మర్నాడు కామస్వామిని కలుసుకుంటాడు. తన ఇంట్లోనే ఉండి వ్యాపార రహస్యాలు తెలుసుకోమంటాడు. సిద్దార్ధ కామస్వామికి చేదోడు వాదోడుగా అక్కడే ఉంటూ కామస్వామికి వ్యాపారంలో భాగస్తుడై ధనవంతు డవుతాడు. వీలున్నప్పుడల్లా కమలతో గడుపుతూనే ఉన్నాడు. ఏళ్ళు గడచి పోతున్నాయి. కలసి వచ్చిన డబ్బుతో భవంతులూ తోటలూ కొని కోమలాంగులతో  విలాసవంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు.

ఒక రోజు సాయంత్రం ఊరిబయట ఉన్న తన తోటలో ఒక చెట్టు క్రింద సేద తీరటానికి కూర్చున్నాడు. ఏవేవో అంతులేని ఆలోచనలు వస్తున్నాయి. తాను ఏమనుకొని ఇంటినుండి బయటకు వచ్చాడు, విలాస వంతుడిగా ఇప్పుడేమి చేస్తున్నాడు. వీటికి ఏమన్నా అర్ధముందా? దీనికి అంతం అంటూ ఉన్నదా? చీకటి పడింది. తన జీవితానికి అర్థమేమిటో అర్ధంకాలా? తానే ఈ విలాస జీవితానికి స్వస్థి చెప్పాలి అని నిర్ణయించు కున్నాడు. కట్టు బట్టలతో తన తోట నుండి బయటపడ్డాడు. అన్నీ వదిలేసి చీకటిలో గమ్యంలేని గమ్యానికి నడక మొదలెట్టాడు.

దారిలో నది అడ్డంగా ప్రవహిస్తోంది. అక్కడవున్న పడవ వాడిని అవతల వడ్డుకి తీసుకు వెళ్ళమన్నాడు. మధ్యదారిలో ఇవ్వటానికి తన దగ్గర డబ్బులేమీ లేవు అన్నాడు. దానికి పడవవాడు ఆశ్చర్య పోతాడు. అంత ఖరీదయిన బట్టలు కట్టుకున్న వాడివి నీ దగ్గర డబ్బులు లేవంటా వేమిటి? అన్నాడు. సిద్దార్ధ సంగతంతా చెప్పి నన్ను గుర్తు పట్టావా ? కొన్ని సంవత్సరాల క్రిందట నీ గుడిసెలో ఆశ్రయ మిచ్చి ఈ నదిని దాటించావు అన్నాడు. పడవవాడు గుర్తు పట్టి ఇంకెక్కడికి వెళ్తావు, నా భార్య చనిపోయింది నాతో పాటు నా గుడిసెలో ఉండు అంటాడు. అనుకోని దాతృత్వానికి సంతోషించి నీతో వుండి పోతానన్నాడు.

పడవ వాని పేరు వాసుదేవుడు. వసుదేవుడి నుండి పడవలు బాగు చెయ్యటం. వాటిని నడిపే మెళుకువలు నేర్చు కున్నాడు. తోటలో తినటానికి ఆహారాలు పండించటం నేర్చుకున్నాడు. ఇద్దరూ పడవ నడిపే వాళ్ళు. బాటసారు లందరికీ వారితో నది ఎట్లా మాట్లాడుతుందో, తమకి ఎట్లా సూచనలిస్తుందో. కష్ట సుఖాల్లో సలహాలు ఎల్లా ఇస్తుందో చెప్పే వాళ్ళు. సంవత్సరాలు గడిచి పోతున్నాయి ఇద్దరు మిత్రులూ ముసలి వాళ్ళవుతున్నారు.

కొన్నిరోజులనుండీ నది దాటే జనం ఎక్కువవడం గమనించారు. ఆరా తీస్తే దగ్గర వనంలో బోధిసత్వుడు చనిపోయే చివరి దశలో ఉన్నాడని తెలిసి, చివరి చూపుకోసం జనం వెళ్తున్నారని తెలిసింది. ఒక రోజున నది వడ్డున తల్లికి పాముకుట్టిందని పిల్లవాడు కేక లేస్తుంటే, వాళ్ళని వాసుదేవుడు ఇంటికి తీసుకు వచ్చి నాటు వైద్యం చేస్తాడు. అప్పుడే వచ్చిన సిద్దార్ధ, ఆ తల్లి ఒకప్పుడు తనను చేరదీసి దోవ చూపిన కమల అని గుర్తిస్తాడు. తన ఆస్తి అంతా  బౌద్ధ సన్యాసులకు ఇచ్చి, తాను చివరి దశలో ఉన్న బోధిసత్వుని చూడటానికి వెళ్తున్నట్లు ఆమె చెబుతుంది. తనతో ఉన్న పిల్లాడు నీ కొడుకు అని కూడా సిద్దార్ధ కు చెప్పి కమల చనిపోతుంది.

హఠాత్తుగా వచ్చిన  పరిణామాలతో సిద్దార్ధ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. తండ్రిగా తాను ఏమిచేయాలో అర్ధం కాదు. ఇంట్లో పనులకు చేదోడు వాదోడుగా ఉంటాడని పిల్లవాణ్ణి పనులు చెయ్య మంటే మోండికెత్తి కూర్చుంటున్నాడు తప్ప చెయ్యటల్లేదు.సేవకులతో సర్వ సుఖాలకి అలవాటుపడిన తనయుడి చేత ఇంటి పనులు చేయించటం కష్ట సాధ్య మని తెలుసుకున్నాడు. ఒక రోజు పిల్లవాడు ఇంట్లో ఉన్న సొమ్ము తీసుకుని మాయమవుతాడు. వెదుకుదామని అనుకుంటాడు కానీ తాను ఒకప్పుడు చేసిన పని కూడా అదే కదా అని మానుకుంటాడు. వాసుదేవుడు కూడా తన సమయం దగ్గర పడిందని సిద్దార్దని వదిలి అడవుల్లోకి వెళ్ళి పోతాడు.

ఇద్దరు నావికులు బాటసారులతో వేదాంతం చెబుతున్నారనే వదంతి, ఆనోటా ఆనోటా పాకి, కమల తోటలో ఉన్న బౌద్ధ సన్యాసులకు తెలుస్తుంది. అక్కడే ఉన్న గోవిందుడు సంగతి ఏమిటో తెలుసు కుందామని వస్తాడు. మొదట గుర్తు పట్టలేక పోయినా, ఆ నావికుడు బాల్య మిత్రుడు సిద్దార్ధ అని తెలుసుకుంటాడు. మాటా మంచీ అయినా తరువాత  తన ఇన్ని సంవత్సరాల జీవన పయనం లో తెలుసుకున్న జీవిత సత్యాలగురించి సిద్దార్దని చెప్పమని అడుగుతాడు.

ఇద్దరు మిత్రులూ జీవిత సత్యాల గురించి చర్చించు కుంటారు. చాలా వరకు గోవిందుడు వినటమే. చర్చ చివరి దశలో , నిర్యాణము చెందిన తన గురువు "గౌతమ బుద్ధ" వర్చస్సు, సిద్దార్ధలో చూస్తాడు. తన్మయుడై సిద్దార్థునికి ప్రమాణాలు అర్పిస్తాడు. తరువాత మిత్రులు విడిపోటంతో నవల ముగుస్తుంది.

నాకు ఈ ఇద్దరి మిత్రుల సంభాషణ బాగా నచ్చింది. వాటిలో  కొన్ని :

1. "There were a number of thoughts, but it would be hard for me to communicate them to you. Listen, my Govinda, this is one of my thoughts that I have found: Wisdom cannot be
communicated. Wisdom that a wise man tries to communicate always sounds foolish."

2. I am telling you what I have found. Knowledge can be communicated, but not wisdom. We can find it, we can live it, we can be carried by it, we can work wonders with it, but we cannot utter it or teach it.

3. "This here,"he said playfully, "is a stone, and perhaps at a certain time it will be soil and will, from soil, become a plant, or an animal or a human being. But in the cycle of transmutations it can also become a man and mind. This stone is a stone, it is also an animal, it also god, it is also Buddha, I love and honor it not because it could become this or that someday, but because it is everything long since and always.

4. Words are not good for secret meaning, everything instantly becomes a bit different when we utter it, a bit adulterated, a bit foolish - yes, and that too is very good and appeals to me, I also very much agree that one man's treasure and wisdom always sound like foolishness to another.

*********************************************************************************

అమెరికాలో హైస్కూల్లో బహుశ పిల్లలకి మంచి పుస్తకాలని పరిచయం చెయ్యటం కోసం దీనిని చదవమని పెట్టివుంటారు. నవలలో ప్రతి చోటా జీవిత వేదాంతం కనపడుతూ ఉంటుంది. హైస్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు గమనించ లేక పోవచ్చు గానీ మధ్య వయసులో చదివితే ఎదో ఒక భాగంలో ఎదో ఒక కోణంలో పాఠకుడి కి తన జీవిత చిత్రం కనపడుతుంది. ఇంకొంచెం విశ్లేషణతో చదివితే మనం నిమిత్తమాత్రులమే ననీ జీవితం ఒక గలగల పారే నదిలా సంతతం ప్రవహిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటుందని తెలుసుకుంటాము. మనం ఓపికతో అది చెప్పేవి వినటానికి ప్రయత్నించాలి. అంతే.

మీరు ఈ పుస్తకం చదవాలంటే ఈ క్రింద లింక్ ద్వారా చదవచ్ఛు :

సిద్దార్ధ పుస్తకం