Tuesday, October 30, 2018

146 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్న్యూయార్క్ దరిదాపుల్లోకి వెళ్ళినప్పుడల్లా మెన్హాటన్ కి వెళ్ళటం ఒక అలవాటై పోయింది. మెన్హాటన్ డౌన్ టౌన్ న్యూయార్క్. న్యూయార్క్ కి "Town never sleeps " అనే పేరుంది. మనకు అవసరాలకు కావలసిన కూరగాయాల నుంచీ హెయిర్ కట్ దాకా ఎప్పుడూ ఎక్కడో ఒక షాపు తెరిచే ఉంటుంది. ఇక్కడ బ్రాడ్వే వీధి నాటకాలకి ప్రసిద్ధి. మేము వచ్చినప్పుడల్లా ఎదో నాటకానికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వెళ్తాము. కాకపోతే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. ఇంతదానికి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చిందే అని బాధ పడాల్సి వస్తుంది. ఒకరోజు రాత్రి సినీమా అయిన తరువాత (ఆదో పెద్ద గాథ ) ఆకలయి రెస్టారంట్ కోసం చూస్తే ప్రతి చోటా జనం క్యూ లో నుంచున్నారు. చివరికి ఒక "వేగన్" రెస్టారెంట్ లో సీట్లు దొరికాయి. నిజంగా చెప్పాలంటే పచ్చ గడ్డి పెట్టి వంద డాలర్లు తీసుకున్నాడు. అందుకనే ఈ రోజు భోజనం చేసి బయలుదేరాము.

ఈ తడవ "LA LA Land " అనే సినిమాకి వెళ్ళాము. ఈ సినీమాకి oscars లో తప్పు చదవటం మూలంగా ఒక క్షణం "Best Picture " అయింది. అబ్బాయి మమ్మల్ని సినిమా హాల్ దగ్గర దింపి, మన పేరు మీద సీట్లు రిజర్వ్ చేశాను టిక్కెట్స్ తీసుకోండి అని కారు పార్క్ చెయ్యటానికి వెళ్ళాడు. నాకు ఎప్పటినుండో కోరిక, టిక్కెట్లు, రిజర్వ్ డ్  కౌంటర్ దగ్గర తీసుకోవాలని, పెద్ద వాళ్ళలాగా ఫీల్ అవ్వచ్చు. సామాన్యంగా ఎడ్వన్చెరస్ పనులకి మా ఆవిడని పంపిస్తూ ఉంటాను. ఆవిడ ఎడ్వన్చెరస్ అని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మొగుడు తాళి కట్టి అమెరికాకి వెళ్తే, మూడునెలల తరువాత తను వీసా పుచ్చుకుని అమెరికా వంటరిగా వచ్చింది. ఇది నలభై ఏళ్ళ క్రిందటి మాట. అప్పుడు ప్లేన్లు అమెరికాకి అంచెలంచెలుగా వచ్చేవి. వస్తూంటే మధ్యలో పారిస్ లో ప్లేన్ ఆగిపోయింది "mechanical failure ". సరే అది బయల్దేరి మర్నాడు న్యూయార్క్ చేరేముందర న్యూయార్క్ airport (Kennedy ) లో బస్సు హైజాక్ చేసి రన్వే మీద పెడితే ప్లేన్లు లాండ్ అవటం గొడవయింది. ఇంకొకటి, ఒక ఇరవై ఏళ్ళ క్రిందట దేశం కాని దేశం హాంకాంగ్ లో subway టిక్కెట్లు కొనుక్కురమ్మని పంపించాను. విజయవంతంగా తీసుకు వచ్చింది. అందుకని ఈ మిషన్ కి ఆవిడే తగినదని నిర్ణయించుకున్నాను. వెళ్ళి అడిగింది ఇవ్వనన్నాడు. ఎందుకని అడిగింది. ఏ క్రెడిట్ కార్డు మీద రిజర్వ్ చేశారో చెప్పమన్నాడు. అబ్బాయి ఏకార్డు ఉపయోగించాడో తెలియదు. టిక్కెట్లు రాలేదు. అబ్బాయి కారు పార్క్ చేసి వచ్చి టిక్కెట్లు తీసుకున్నాడు. మా ఆవిడ గొప్పలు చెప్పటానికీ, నేను గొప్పగా ఫీల్ అవటానికీ ఇవాళ అవకాశం లేదు.

"LA LA Land" అంటే అది ఒక విధంగా కృత్రిమ ప్రదేశం అనే అర్ధమొస్తుంది. LA అంటే లాస్ ఏంజెలెస్, "హాలివుడ్" ఉన్న చోటు. ఈ సినీమా ఒక musical. అంటే పాటలు ఉంటాయన్న మాట.ఈ అర్ధంతో చూస్తే మన తెలుగు సినీమాలన్నీ musicals. ఇది "My fair lady ", "Fiddler on the Roof", "Sound of Music" లాంటి musical  కాదు కాకపోతే చాలా పాటలు ఉన్నాయి. మొదటి పాట "LA " హైవే మీద ట్రాఫిక్ జామ్ లో మొదలవు తుంది. అక్కడే అమ్మాయి అబ్బాయి  కలుసుకుంటారు కూడా. అమ్మాయి త్వరగా కారు ముందుకి నడపదు. వెనక కారులో ఉన్న అబ్బాయికి కోపమొచ్చి తన కారు పక్క లైన్ నుండి తెచ్చి అమ్మాయి కారు పక్కకి పెట్టి, డ్రైవర్లు పంచుకునే భీకర సౌజ్ఞలతో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించటం. ఎవరి అభిరుచుల ప్రకారం వారు ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకోవటం. ఈ నిర్ణయం తో చివరికి వారాల  తరబడి అమ్మాయి గారు  ఒక చోట, అబ్బాయి గారు దేశంలో ఇంకోచోటా, ఉండటంతో, అమ్మగారు అలిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. అబ్బాయి గారు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి గారు ఉండరు. కానీ అమ్మాయి గారిని ఒక సినీమా కోసం audition కు రమ్మనే మెసేజ్ ఉంటుంది. అమ్మాయిగారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి ఆ మెసేజ్ ఇచ్చి ఆడిషన్ కి వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. మిగతా కధంతా మామూలే. అమ్మాయిగారు పెద్ద నటి అయి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని పిల్లాజెల్లా తో హాయిగా ఉంటుంది. అబ్బాయి గారు రెస్టారంట్ లో పియానో వాయించే రోజూ వారీ పనివాడుగా మిగిలిపోతాడు.

సినీమా అవగానే వెతుక్కుంటూ కారు దగ్గరకి వెళ్ళి ఇంటికి జేరాము. రాత్రి పూట వెతికితే మెన్హాటన్ లో కూడా వీధి పార్కింగ్ దొరుకుతుంది. లేకపోతే సినీమా కన్నా పార్కింగ్ కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది.

(ఇది సంవత్సరం కింద ఎప్పుడో వెయ్యాల్సిన పోస్ట్. ఇప్పటికి వెలుగు చూసింది)


Monday, October 8, 2018

145 ఓ బుల్లి కథ ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part-9 - పంచేంద్రియాలు Our Senses


మనకున్న పంచేంద్రియాలు senses  ) పేరుకు తగ్గట్టు అయిదు, కళ్ళు, ముక్కు, చెవి, రుచి (నాలిక), మన దేహమంతా ఆక్రమించుకున్న స్పర్శ (తోలుskin ). అవే మన జ్ఞానేంద్రియాలు కూడా ఎందుకంటే మనకు జ్ఞానం వచ్చేది  వీటి ద్వారానే.

మనము పుట్టినప్పుడు మనకున్న జ్ఞానం శూన్యం. మనకి తెలిసినదల్లా ఏడవటం. అప్పటినుండీ  పంచేంద్రియాల నుండి వచ్ఛే సంకేతాలను మన మనస్సులో గుప్త పరుచుకుంటూ వాటిద్వారా బయటి పరిమాణాలకి స్పందిస్తూ జీవిస్తున్నాము.

అందుకనే సంవత్సరాల పాటు మనం జీవించిన జీవన విధానము, మనం పెరిగిన వాతావరణము, మన జీవితానికి పునాది అవుతుంది. మనం అందరం పెరిగిన వాతావరణాలు వైవిధ్యం కాబట్టి మన ఆలోచనలు వైవిధ్యంగా ఉండటంలో ఆశ్చర్యము లేదు. ఉదా : మనం చిన్నతనంలో దైవత్వం అంటూ పండగలు చేసుకుంటూ గుళ్ళకి గోపురాలకు తిరిగామనుకోండీ, అవి జీవితాంతం మన జీవితంలో భాగమవటానికి ఆస్కారం ఉంటుంది. అదే చైనా నుండి వచ్చిన వారిని దైవం గురించి అడగండి, వాళ్ళకి అదంటే ఏమిటో తెలియదు, ఆ దృక్పధంతో వాళ్ళు పెరగలేదు.

ఒకసారి మన మెదడులో మనము పెరిగిన వాతావరణ సమాచారము గుప్త పడిన తరువాత వాటిని తీసి వెయ్యటం చాలా కష్టం. పేరుకుపోయిన భావజాలాన్ని మార్చటం చాలా కష్టం. ప్రపంచం లోని సైఖియాట్రిస్టులందరూ ప్రయత్నించేది అదే.  అమెరికాలో ఉన్నా ఆవకాయ తినాలనిపిస్తుంది. ఎన్ని సార్లు ఇంటిని రీమోడల్ చేసినా పునాదిని మార్చలేము.

ఈ జ్ఞానేంద్రియాలు ఏవిధంగా పనిచేస్తా యనే వాటిమీద చాలా మంది పరిశోధనలు చేశారు.  నోబెల్ ప్రైజులు కూడా వచ్చాయి. అందులో Georg Von Bekesy ఒకరు.ఆయనకి  మన చెవి ఎల్లా పనిచేస్తుందో కనుగొన్నందుకు 1961 లో నోబెల్ వచ్చింది. నా జీవితంలో నోబెల్ ప్రైజ్ కి దగ్గరైంది, University of Hawaii లో ఆయన Research Lab లో పనిచేయటం వరకే. This is the nearest I got to the nobel prize.

మన పంచేంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియమూ ఒక్కొక్క పరిస్థితికి స్పందిస్తుంది. ఆ స్పందనలు విద్యుత్ సాంకేతికాలుగా మారి మెదడుకు పంపబడతాయి. మెదడులో కొన్ని సంకేతాలు నిలువ ఉంటాయి కొన్ని అదృశ్యమవుతాయి. ఇదికూడా మన చేతుల్లో లేదు. కాకపోతే ఒకటి మాత్రం అందరికీ స్వానుభవం. మనం చిన్నప్పుడు బట్టీపట్టిన ఎక్కాలు, పద్యాలూ (ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు ) ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. కారణం బహుశా ఎక్కువసార్లు వల్లెవేయటం మూలంగా మన మెదడు వాటిని ముఖ్యమైనవని గుర్తించి దాచిపెట్టిందేమో.

ఇవిగో మన పంచేంద్రియాలు అవి పని చేసే విధానము:

1. కన్ను: కంటి లో పడిన కాంతి కిరణాలు విద్యుత్ ప్రకంపనలు కలిగించి మెదడుకి అందిస్తాయి. వస్తువుల మీద పడిన కాంతి కంటికి తగలటం మూలంగా ఆ వస్తువుల ఆకారాలు మనము చూడకలుగు తున్నాము.

2. చెవి: శబ్దము చేసినప్పుడు, గాలి అలలు ఏర్పడి (నీటి కెరటాలు లాగా), అవి చెవిని తాకి విద్యుత్ సాంకేతికాలు గా మారి మెదడును చేరుతాయి.
మనకి ఏవైపు నుండి శబ్దం వస్తోందో తెలుసుకునేది రెండు చెవుల నుండీ వచ్చే సంకేతాల తేడా వలన. మనం బజార్లో చూస్తూ ఉంటాము, earplugs పెట్టుకుని నడిచే వాళ్ళని. వాళ్ళు ఎప్పుడో అప్పుడు చిక్కుల్లో పడతారు. ఎందుకంటే నడిచేటప్పుడు బయట శబ్దం ఏవైపు నుండి వస్తోందో వారికి తెలుసుకోవటం కష్టమవుతుంది.

3. ముక్కు: వాసన నుండి వచ్చే సూక్ష్మ కణములు (particles ) గాలిలో ప్రయాణించి ముక్కులో వున్న mucas లో రంగరించ బడి (dissolve ) నరాలకు తాకి విద్యుత్ సాంకేతాలుగా మారి మెదడును చేరుతాయి. అందుకనే వాసన లేని కార్బన్ మోనాక్సయిడ్ ని మనం గుర్తించలేము (mucas లో dissolve కి ఏమీ లేవు). అందుకనే గుర్తించటానికి వాసనలేని వంట గ్యాస్ కి వాసన కలుపుతారు.

4. రుచి: నాలిక మీద ఉన్న రుచి మొగ్గలు(taste buds ), తిన్న ఆహారంలోని రుచిని గ్రహించటం మూలంగా మెదడుకి విద్యుత్ సంకేతాలు వెళ్తాయి. మామూలుగా మనము గుర్తించే రుచులు నాలుగు. తీపి(sweet ), వగరు(sour ), ఉప్పు(salty ), చేదు(bitter ). వాటితో కొత్తగా ఉమామి(umami ) అనే రుచిని అయిదవ రుచిగా కలిపారు.

5. స్పర్శ : తాకిన స్పర్శకు చర్మము క్రింద ఉన్న నరములు స్పందించి విద్యుత్ సంకేతాలు మెదడుకి పంపుతాయి.

ఈ జ్ఞానేంద్రియాలు ఒక్కోక్కటిగాను , రెండుమూడు కలిసికట్టుగానూ పని చేస్తాయి. ఉదా: మనం ఇంట్లోకి వ్రవేశిస్తున్నాము, వంటగది నుండి మంచి వాసన వస్తోంది(ముక్కు). తినాలని కోరిక పుడుతుంది. వంటింట్లోకి వెళ్ళి చూస్తే (కన్ను), మనకు ఆ వంటకం తిన బుద్ది పుట్టా వచ్చు
లేక ఏహ్యం కూడా రావచ్చు. తినబుద్ది పుట్టి తిన్నామనుకోండి ఆనందంతో ఆస్వాదించ వచ్చు లేక ఉప్పు ఎక్కువయ్యి మింగలేక బాధపడ వచ్చు(రుచి).

మన కళ్ళు, చెవులు, చర్మము మన కదలికల గురించి సంకేతాలు ఎల్ల వేళలా మెదడుకి పంపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల కలయికతో మన మెదడు మన కండరములను ప్రేరేపించి, మనము క్రిందపడకుండా (balanced ) నడిచేటట్లు చూస్తుంది. వీటి సంకేతాల సమన్వయం (coordination )లేక పోతే బాలన్స్ తప్పిపోయి తూలవచ్చు.
నిద్రపోతూ మంచం మీద నుండి లేచినప్పుడు, షవర్లో నుంచిని స్నానం చేసేటప్పుడు (మొఖానికి సబ్బు రాసుకొని  కళ్ళు మూసి కదిలేటప్పుడు ) కొంచెం జాగర్తగా ఉండండి బాలన్స్ పోయి పడటానికి ఆస్కారం ఉంది.

మనము ప్రకృతిలో ఒక భాగం కనుక అందరం ఒకే విధంగా ఉండటం జరగదు (mutation ఒక కారణం అవుతుంది). మన  పంచేంద్రియాల ప్రతిస్పందనలలో కూడా ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. కొందరిలో నాలిక మీద tastebeds ఎక్కువగా ఉండి ఉండవచ్చు. కొందరిలో తక్కువ ఉండవచ్చు. "మా ఆయన ఏమి పెట్టినా గుట్టు చప్పుడుగా తింటాడు", "మా ఆయన ప్రతి వంటనీ వంక పెడాతాడు" అనే మాటలకి అర్ధాలు ఇవే.

మనకి కనపడని వాటిని గుర్తించటానిని (instinct ), sixthsense అంటారు. ఉదా : మన వెనకాల ఎవరున్నారో గుర్తించటం, కళ్ళు మూసుకుని నడవటం వగైరా.

మనకి వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఇంద్రియాలలో పస తగ్గిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఆయా ఇంద్రియాలకు కావలసిన ఇంధనాలు (vitamins etc ) సరీగ్గా అందక పోవటం అవ్వచ్చు. దానికి కారణం మన జీర్ణ శక్తి తగ్గి, పోషక పదార్ధాలు రక్తంలోకి రావటం తగ్గటమేమో.

మాతృకలు :
1. Understanding the Senses (2010), Carol Ballard, Rosen Publishing Group Inc.
2. How does the Balance System Works