Sunday, August 29, 2010

26. ఓ బుల్లి కథ 14 -- మీరేమంటారు --

ముందు మాట: ఆగస్టు 25, 2010 న చికాగో ట్రిబ్యూన్ లో  Ask Amy  అనే కాలమ్ లో అడిగిన ప్రశ్న దానికి సమాధానం తెలుగు లో వ్రాస్తున్నాను. ఇది నన్ను ఆకర్షించడానికి కారణం, అమెరికా లో సాధారణ ప్రజల  మనస్తత్వం ఎటువంటిదో చెబుతుంది. 


డియర్ ఎమీ: ఈ మధ్య నేను temporary job లో పనిచెయ్యటం మొదలెట్టాను. నా కంటే బాగా పెద్ద ఆయన గూడా అక్కడ పనిచేస్తున్నారు. కాకపోతే ఆయనది పర్మేనేంట్  పొజిషను. ఆయన చాలా స్నేహముగా ఉంటారు కాని కొంచం తలతిక్క. ఆయన ఈమధ్య నన్ను ఒక షాప్ కు వెళ్ళి కొన్ని తినే పదార్దములు కొనుక్కు రమ్మన్నారు. దానికి ఆయన డబ్బులిస్తానని చెప్పినారు. అల్లాగే నా మధ్యాహ్నపు భోజనం పంచు కుందామని కూడా అన్నారు. నేను వీటన్నిటికీ వప్పుకుని చేశాను.
క్రిందటి వారము నాలాంటి temporary ఇంకొకళ్ళు ఈయనకి భోజనము తీసుకు వస్తుంటే చూశాను. నా ఉద్దేశం లో ఆయనకి శక్తి లేక షాపు దాకా నడచి వెళ్ళటము కష్టముగా ఉన్నటుల కనిపిస్తోంది. ఆయనకి ఆదుకునే దిక్కు కూడా లేనట్లు ఉన్నది.
ఈ పరిస్థితి నాకు కొంచెము బాధాకరముగా ఉన్నది, ప్రతీ వారం ఆయనకోసం బయటకు వెళ్ళి తీసుకు రావాలంటే నాకు కొంచెము కష్టమవుతుంది. దానికి తోడు ఈ విధముగా ఆయన నామీద ఆధార పడి ఉండటం ఆయన కష్టాలకు శాశ్వత పరిష్కారము కాదు.  


ఆయన రొజూ పనిచెబితే నేను ఏమి చేసేది.  మీరు నాకు ఏమి సలహా ఇస్తారు ?.
మన ఈ సంఘము లో వృద్ధులను సంరక్షించుటలో  మన కర్తవ్యములేమిటి?


ఇట్లు, చిన్నపనుల రన్నర్
డియర్ రన్నర్: మీ బాధ నాకు అర్ధమవు తున్నది, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి కానీ ఎంత కాలం. మీరు కొంతకాలం ఈ విధముగా కొనసాగించండి. వారానికి రెండు రోజులు మీరు తెస్తానని చెప్పండి. మీ లాగే మిగతా వాళ్ళు కూడా పని పంచు కునే ప్రయత్నం చేయండి. కానీ సహాయము చేయటం మాన కండి.
మీ పెద్దవాళ్ళను  (grandparents )  గుర్తుకు తెచ్చుకోండి, వారికి కూడా ఈ విధముగానే చిన్నపనులు పెద్దపనులు,  స్నేహితులో, పక్కిన్టివాళ్ళో , దారే పోయేవాళ్ళో ఎవరో అవసరము అయినప్పుడు సహాయము చేస్తూనే ఉంటారు.
చాలా మంది వృద్ధులు భోజనానికి ఇబ్బంది పడుతూ వుంటారు -- మీ ఆఫీసులో స్నేహితుని లాగా, బయటకు వెళ్ళటానికి వీలు లేక,
 సత్తువ లేక. 
మీ ఊళ్ళో ఉన్న "office on aging " ని కనుక్కుంటే వాళ్ళు మీ స్నేహితుని జీవితం కొంచెము సులువయ్యేట్లు చూడ గలుగుతారు. 
సమస్యని పరిష్కరించటానికి ప్రయత్నించి నందుకు ధన్యవాదములు. 


చివరిమాట: మీరేమంటారు ?


మీరు US లో ఉంటే సీనియర్స్ కి సహాయము చెయ్యటానికి State, County, Township and city లెవెల్ లో చాలా సంస్థలు ఉన్నాయి. మీకు నిస్సహాయతతో ఎవరన్నా కనపడితే దయచేసి ఆ సంస్థల తోటి కలపండి. సీనియర్ సర్వీసెస్ అని గూగుల్ చేస్తే నంబర్లు దొరుకుతాయి. ఉదా: Naperville Township కి 'Dial A Ride' ప్రోగ్రాం ఉంది. అల్లాగే 'Meals on Wheels' ప్రోగ్రాం. 'Food Pantry' ప్రోగ్రాం.

Tuesday, August 10, 2010

25. ఓ బుల్లి కథ 13 -- జీవిత చక్రం --

ముందు మాట: ఈ కథకి మూలము హిందూ టెంపుల్ లో వాలంటీర్ గ చేయునప్పుడు తీరిక సమయములో చదివిన ఒక కథ. గుడి లో చదువుటచే  ఏదో వేదాంత  పుస్తకములోనిది అయి ఉండవచ్చును.  ఇందులో (నాకు గుర్తు లేక) పాత్రల పేర్లు, కొంత కథా కల్పితాలు. కానీ భావము మాత్రము మార్చలేదు. 

ధనుంజయుడికి జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్ళిపోవుచుండెను. చేతులారా డబ్బులు సంపాయించు చుండెను.   ఎవ్వరూ తనకి ఉచితముగా ఇచ్చినవి కావు. ఈ మేడలు ఈ మిద్దెలు ఇవన్నీ తన తెలివితేటలతో, తన స్వశక్తి తో, తన ఊహా సంపత్తు తో, కష్టపడి పనిచేయుట వలన వచ్చినవి కనుక తను ఇంకొకళ్ళకి ఉచితముగా దాన ధర్మాలు చెయ్యవలసిన అవుసరము లేదు అని నిర్ణయించు కొనెను. తన తెలివితేటలు ఊహాసంపత్తీ ఎటుల తనకు వచ్చెనో గుర్తించలేక పోయెను. బాలప్రాయమునుండీ సాకిన తలి దండ్రులు, బంధువులు,తనతో ఆటలాడిన మిత్రులు, చదువులు నేర్పిన అధ్యాపకులు, తనకు సౌకర్యములు ఇచ్చుచున్న భార్యా పిల్లలు, వీరెవరు తనకు కానరాలేదు.  

వయసు పెరిగిన కొలదీ తను సంపాయించు  ధనమూ దానితో సంఘము లో గౌరవము పెరుగుతూ వచ్చెను. తనమీద తన తెలివితేటలమీద తనకి పెద్ద నమ్మకము గర్వమూ పెరిగెను. ఇంటిలోనూ బయట ఒకటే పద్ధతి లో ఆలోచన. నా అంత తెలివితేటల వాళ్ళు మీరు కాదు. నేను చెప్పినదే వేదము కనక  మీరు నేను చెప్పినపని చేయవలయును. భార్యా పిల్లలకు, సేవకులకు అందరికీ యజమాని అనిన భయము. 

కాలక్రమేణా పిల్లలు వారి త్రోవన వాళ్ళు వెళ్ళి పోయిరి. భార్య పరమపదించెను. ఒంటరి వాడయ్యెను.  పెద్ద ఇంటిలో  ఉండుట ఖర్చు పని అని ఒక చిన్న ఇంటిలోనికి మారి తన మాటలను శిరసావహించు ఒక సేవకుని మాత్రమే ఉంచుకొనెను. ఆ సేవకుడికి అయ్యగారు చెప్పు పనులన్నియు చేయుట కష్టముగా ఉండెను. పది పనులు చెప్పి అన్నియు అప్పుడే కావలయుననిన జరగని పని. ఆ సేవకుడు కూడా అన్నిటిలోనూ నిష్ణాతుడు కాకపోవటముచే తప్పులు చేయు చుండెను. దానితో యజమానికి కోపము వచ్చుచుండెను. తన ఒక్కడి కొరకు పదిమంది సేవకులను పెట్టుకొనుట ఇష్టము లేదు.ఈ సేవకుని మాన్పించి ఇంకొక సేవకుని పెట్టుకొనుటకు మనసొప్పుట లేదు. కొత్త వానికి మరల తనకు కావలసినవిధముగ పనులు నేర్పుట కష్టము కదా. 

ఒకరోజున మితిమీరిన కోపము వచ్చుటచే సేవకుని పిలిచి చెక్కమీద "I am an Idiot"  అను బోర్డు చేక్కించుకు రమ్మని పంపెను. బోర్డు తెచ్చిన వెంటనే దానికి రెండు వేపుల తాడు కట్టి హారముగా మెడలో వేసుకొనమని చెప్పెను. రోజూ పనికి వచ్చినప్పటి నుండీ వెళ్ళు దాకా ఆ హారమును వేసుకొని పనిచేయు మని చెప్పెను. దీనివలన తన పని సవ్యముగ జరగని యడల తన మనస్థాపము తగ్గునని భావించెను.  

ఈ విధముగా యజమాని సేవకుడు రోజులు గడుపు చుంటిరి. హఠాటాత్తుగా ఒక రోజున యజమాని అస్వస్థకు లోనుకాగా తన కాళ్ళు స్వాధీనము తప్పెను. ఎంత మందికి  చూపిననూ పరిస్థితి మెరుగు పడలేదు. కాల కృత్యములకు కూడా సేవకుని సహాయము కావలసి వచ్చెను. సేవకుడు కూడా నమ్రతగా రోజూ తన హారము వేసుకుని పని చేయు చుండెను. 

యజమానికి ఒక రోజు పట్టరాని కోపము వచ్చి సేవకుని, హారము లోని పదములు చదవ మనెను. సేవకునికి చదువు రాక పోవుటచే తను చదివి దాని అర్ధము చెప్పెను. వెంటనే సేవకుడు తన హారమును తీసి యజమాని మెడలో వేసెను. సేవకుడు తను ఇంక పనిచేయనని వెళ్ళి పోవుచుండగా జీతము రెట్టింపు చేసి తన దగ్గరే ఉండమని బతిమాలెను. రోజూ సేవకుడు వచ్చి హారమును యజమాని మెడలో వేసి తను వెళ్లి పోవు చున్నపుడు తీసివేయుచు యజమాని చనిపోవు వరకూ పనిచేసేను.

 చివరిమాట: జీవిత కాల చక్రములో బండ్లు ఓడలూ ఓడలు బండ్లు గా మారవచ్చును. అందువలన జీవన విధానము లో మానవత్వము చూపక జీవించిన, అనువుగాని సమయమున భంగపాటు తో జీవించ వలసి వచ్చును.   

Tuesday, August 3, 2010

24. ఓ బుల్లి కథ 12 -- లాండ్రోమేట్లో కుస్తీ --

ముందు మాట: లాండ్రోమేట్ అంటే తెలుగులో చెప్పాలంటే  సామూహిక బట్టలుతికే చోటు అని చెప్పొచ్చు లేకపోతే చాకిరేవు అని కూడా అనవచ్చు. 
ఈ క్రింది సంభాషణలు అమెరికాలో ప్రతీ ఇంటిలో ఎప్పుడో  ఒకప్పుడు రాక మానవు (చాకలి మెషీన్లు  ఉన్నా లేకపోయినా ).


" విడిచిన బట్టలు చాలా ఉన్నాయి."
"మన వాషింగ్ మెషీన్ పనిచెయ్యక  పోతే  నైకోర్ వాణ్ని పిలు." బాగు చెయ్యటానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. పిలిస్తే వచ్చి బాగు చేస్తాడు.
"కుదరక వాషింగ్ చెయ్యలేదు. ఒక రోజంతా పట్టేటట్లా ఉంది,  వాషింగ్ కి  drying కి. లాండ్రోమేట్ కి వెళ్తే ఒక గంటలో అవుతుంది"


ఒకప్పుడు అంటే ఇరవై ఏళ్ళ క్రిందట వరకూ రెండు వారాల కొకసారి వెళ్లి బట్టలు ఉతుక్కుని  వచ్చేవాళ్ళం. ఆ రోజు స్పెషల్,  వాషింగ్ అయిన తరువాత అటునుంచి అటే  రెస్టారెంట్ కి  వెళ్లి బ్రేక్ ఫాస్ట్  చేసేవాళ్ళము. ఫామిలీతోటి ఎక్కువసేపు గడపచ్చని,   కావాలని ఇంట్లో చాకలి మేషీనులు కొనలేదు.  తరువాత ఇంటావిడా పిల్లలు నా మీద తిరగపడటం తోటి ఉతుక్కోవటం ఇంట్లోనే పెట్టుకున్నాము. పాత రోజులు గుర్తుకు వస్తే కొంచం బాధగా ఉంటుంది.


"సరే రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు  వెళ్దాము "
"మనింటి దగ్గర లాండ్రోమేట్ మూసేశారు. క్రిందటి సంవత్సరం మీరు వెళ్ళిన చోటుకి వెళ్దాము." క్రిందటిసంవత్సరం మా డ్రయర్ పాడయితే తడి గుడ్డ లన్నీ మోసుకెళ్ళి ఆరబెట్టుకు వచ్చాను.


మర్నాడు చాకలి మూటలు కట్టుకుని కారు లో బయల్దేరాము చాకలి రేవు(లాండ్రోమేట్) కి. బట్టల మూటలు,  ఆవిడని చాకిరేవు ఎదురుకుండా దించి కారు పార్క్ చెయ్య టానికి వెళ్ళాను.వచ్చి చూసేసరికి మెషిన్ లో బట్టలు వేస్తోంది. రుద్రం మోహము లో కనపడుతోంది. మీరు గమనించారో లేదో ప్రళయం ముందు చాలా ప్రశాంతము గా ఉంటుంది. ఒక గంటసేపు నాకు కోపము తెప్పించవోకు నాయనా,  నన్ను నలుగురిలో నవ్వులపాలు చెయ్యకు తండ్రీ అని ప్రార్ధిస్తూ నాకొచ్చిన  మంత్రాలన్నీ చదివేశాను.  


"పార్కింగ్ కి ఇంతసేపు ఎందుకు అయ్యింది?"
"కారు సూర్యుడి ఎదురు లేకుండా  పార్కు చేశాను అందుకు ఆలశ్యమయ్యింది"
"ఇక్కడ డబ్బులు తీసుకోరట నాకెందుకు చెప్పలేదు" ఎదురు కుండా ఎటియం కార్డు లాంటిది కనపడు తోంది.
"అయ్యో నేను చెప్పటం మర్చేపోయాను "
"కార్డు లో డబ్బులు లోడ్ చేశాను, ఈ సోపు వేసి రెండు ఫ్రంట్ లోడర్సు స్టార్ట్ చెయ్యండి".  ఇక్కడ చాకలి మెషీన్లు ఫ్రంట్ లోడర్సు అని టాప్ లోడర్సు అనీ రెండు రకాలు. టాప్ లోడర్సు లో సామాన్యం గ ఒక మూటే పడుతుంది. ఫ్రంట్ లోడర్సు లో ఎక్కువ లోడ్సు వెయ్య వచ్చు. కార్డ్ slot  లో పెట్టి రెండు మూడు సార్లు ప్రయత్నించాను. స్టార్ట్ అవలేదు. నాకు ఈ కార్డులతో చాలా భయం. పెట్రోల్ బంకుల  దగ్గరనుంచీ వాటిని వాడాలి. ఎప్పుడూ వాటితో ప్రోబ్లెంసే. మొన్నే ఎవరో అమెరికాలో పెట్రోల్ బంకుల దగ్గర డెబిట్ కార్డులు వాడద్దని సలహా ఇచ్చారు. ఏమిటో ఎన్ని రకాల కార్డులో. 


"చేతకాకపోతే అటెండరు ని పిలవాలి" అటెండరు ని తీసుకు వచ్చాను. ఠకా  మని రెండు మెషీన్లు స్టార్ట్ అయినాయి. కార్డు పెట్టి గబుక్కున తీసేయ్యాలాట. రెండు అయిదు డాలర్లు లాగేసుకుంది.  ఇంత డబ్బులు ఎప్పుడూ పెట్టలేదు. పాత కాలం లో క్వార్టర్సు తోటి సరిపోయేది. మెషీన్లు గుడ్డల మీద సోపు నీళ్ళు పోసుకుంటూ  తిరుగుతుంటే చూస్తున్నాను.


"ఏమిటి ఇంత డబ్బయింది?"
"ధరలు పెరిగి ఉంటాయి" అంటూ ఉండగానే  దాని మీద ఫయివు లోడరు  అని బోర్డు గమనించాను. అప్పుడే ఆవిడా గమనించింది.
"అయిదు లోడ్ల దానిలో రెండు లోడ్లు వేసాము. మీకు తెలియదా ఇక్కడ మెషీన్లు గురించి?"
"తెలియదు"
"మరి ఎందుకు తీసుకు వచ్చారు ఇక్కడికి?"
"అంటే నేను ముందరగా వెళ్లి అన్నీ చూసి రావాలా?"
"క్రిందటి సంవత్సరము వచ్చారుగా ఇక్కడికి!" నాకు మాట పెగలటల్లేదు.  క్రిందటి సంవత్సరము వచ్చినది వాస్తవమే . కానీ ఆనాటి  పరిస్థితి వేరు. మా ఆవిడ పక్కనలేదు. ఇది అమెరికా,   చేత కాని తనము చెబితే పక్కవాళ్ళు చేసి పెట్టారు.  పరిస్థుతులు కొంచం  వేడెక్కే టట్లు ఉన్నాయని గ్రహించి, సరే ఇక్కడ ఎమున్నయ్యో చూస్తానని పక్క వరుస లోకి వెళ్ళాను. అక్కడ నాలుగు లోడర్లవి ఉన్నాయి. వాడటానికి ధర ఇంకా తక్కువ. పక్కవరుసలో  ఆరు లోడర్లవి ఉన్నాయి. ఇంకొకవరసలో ఒక మూటకి సరిపోయేవి టాప్ లోడర్సు  వున్నాయి. పక్కన కష్టమర్సు కి ఫ్రీ సోప్  అని కూడా వ్రాసి వుంది. కూర్చోటానికి కుర్చీలు, చదువుకోటానికి పత్రికలూ, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మయం. చూస్తుంటే ప్రపంచములో ఆడవాళ్లే ఎక్కువగా ఉతుకుతారల్లె ఉంది. కొందరయితే వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా తీసి  ఉతుకు తున్నారల్లె  ఉంది. కొందరికి కన్నుల పండువ గాను కొందరికి "రామ రామ" గానూ ఉండవచ్చు. 


"వాషింగ్ అయినది బట్టలు డ్రయర్  లో వెయ్యాలి" తడి బట్టలన్నీ తీసి రెండు డ్రయర్ ల  లో వేసాము. మళ్ళా కార్డుల   తోటి తంతు. ఈ తడవ మెషీను స్టార్ట్ అయ్యింది కానీ దాని  మీద పది అంకె వచ్చేసరికి పది డాలర్లు లాగే సుకుందేమోనని భయపడ్డాము. మళ్ళా అటెండరు . చివరకి తెలిసింది ఆ పది డ్రయర్ తిరిగే నిమిషాలుట. మెషీన్లు  తిరుగుతుంటే ఈ తడవ ఆవిడ స్వయానా లాండ్రోమేట్ చూడటానికి బయల్దేరింది.
"సీనియర్స్ కి ట్వంటీ పర్సంట్ డిస్కౌంట్ ట. అక్కడ నోటీసు ఉంది చూసిరండి" అంతే చూడటమే కాదు ఎన్రోల్ అయి వచ్చాను. అప్పుడప్పుడు ఫ్రీ వాషింగ్ కూడాట. ఇంక నేను రెండు వారాల కొకసారి లాండ్రోమేట్ కి రావాలని నిర్ణయించు కున్నాను. 
"డ్రయర్ అయ్యింది బట్టలు తీయండి" బట్టలు తీయటము, మూటలు కట్టటము, కార్లో పెట్టటము, ఇంటికి చేరటము తర్వాతా ఇంట్లోకి చేర్చటము అన్నీ అయినాయి. గంటలో పని అయిపోయిందని సంతోషం గ ఉన్నాను.
"నేను ఇంకా లాండ్రోమేట్ కి రాను" నా గుండెల్లో రాయి పడింది.
"ఎందుకని"
"బట్టలు మూట కట్టటము, చేరవేయ్యటము, మళ్ళా తీసుకువచ్చి ఇంట్లో చేరవేయ్యటము ఇంక నా వల్ల కాదు"
"పోనీ నా బట్టలు తీసుకువెళ్ళి ఉతుక్కుంటాలే, నీకు కొద్దిగానన్నా శ్రమ తప్పుతుంది"
"పోనీ ఆపని చెయ్యండి"


చివరి మాట: నాకు ఎక్కడలేని ఆనందముగా ఉంది పైకి మాత్రం గంభీరం గ ఉన్నాను లేకపోతే అసలుకే మోసం వస్తుంది. హాయిగా ఒంటరిగా లాండ్రోమేట్ కి వెళ్ళవచ్చు, సీనియర్ డిస్కౌంట్లు, ఫ్రీ సోప్. పక్కనున్న డునట్ షాప్  లో సీనియర్ రోజు ఎప్పుడో కనుక్కుంటే,  డునట్ తోటి ఫ్రీ కాఫీ, ఎయిర్ కండిషన్  లాండ్రోమేట్,  పక్కన భార్య లేకుండా ఒక గంట. హా ఇట్ ఈస్  హెవన్ .