Tuesday, August 10, 2010

25. ఓ బుల్లి కథ 13 -- జీవిత చక్రం --

ముందు మాట: ఈ కథకి మూలము హిందూ టెంపుల్ లో వాలంటీర్ గ చేయునప్పుడు తీరిక సమయములో చదివిన ఒక కథ. గుడి లో చదువుటచే  ఏదో వేదాంత  పుస్తకములోనిది అయి ఉండవచ్చును.  ఇందులో (నాకు గుర్తు లేక) పాత్రల పేర్లు, కొంత కథా కల్పితాలు. కానీ భావము మాత్రము మార్చలేదు. 

ధనుంజయుడికి జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్ళిపోవుచుండెను. చేతులారా డబ్బులు సంపాయించు చుండెను.   ఎవ్వరూ తనకి ఉచితముగా ఇచ్చినవి కావు. ఈ మేడలు ఈ మిద్దెలు ఇవన్నీ తన తెలివితేటలతో, తన స్వశక్తి తో, తన ఊహా సంపత్తు తో, కష్టపడి పనిచేయుట వలన వచ్చినవి కనుక తను ఇంకొకళ్ళకి ఉచితముగా దాన ధర్మాలు చెయ్యవలసిన అవుసరము లేదు అని నిర్ణయించు కొనెను. తన తెలివితేటలు ఊహాసంపత్తీ ఎటుల తనకు వచ్చెనో గుర్తించలేక పోయెను. బాలప్రాయమునుండీ సాకిన తలి దండ్రులు, బంధువులు,తనతో ఆటలాడిన మిత్రులు, చదువులు నేర్పిన అధ్యాపకులు, తనకు సౌకర్యములు ఇచ్చుచున్న భార్యా పిల్లలు, వీరెవరు తనకు కానరాలేదు.  

వయసు పెరిగిన కొలదీ తను సంపాయించు  ధనమూ దానితో సంఘము లో గౌరవము పెరుగుతూ వచ్చెను. తనమీద తన తెలివితేటలమీద తనకి పెద్ద నమ్మకము గర్వమూ పెరిగెను. ఇంటిలోనూ బయట ఒకటే పద్ధతి లో ఆలోచన. నా అంత తెలివితేటల వాళ్ళు మీరు కాదు. నేను చెప్పినదే వేదము కనక  మీరు నేను చెప్పినపని చేయవలయును. భార్యా పిల్లలకు, సేవకులకు అందరికీ యజమాని అనిన భయము. 

కాలక్రమేణా పిల్లలు వారి త్రోవన వాళ్ళు వెళ్ళి పోయిరి. భార్య పరమపదించెను. ఒంటరి వాడయ్యెను.  పెద్ద ఇంటిలో  ఉండుట ఖర్చు పని అని ఒక చిన్న ఇంటిలోనికి మారి తన మాటలను శిరసావహించు ఒక సేవకుని మాత్రమే ఉంచుకొనెను. ఆ సేవకుడికి అయ్యగారు చెప్పు పనులన్నియు చేయుట కష్టముగా ఉండెను. పది పనులు చెప్పి అన్నియు అప్పుడే కావలయుననిన జరగని పని. ఆ సేవకుడు కూడా అన్నిటిలోనూ నిష్ణాతుడు కాకపోవటముచే తప్పులు చేయు చుండెను. దానితో యజమానికి కోపము వచ్చుచుండెను. తన ఒక్కడి కొరకు పదిమంది సేవకులను పెట్టుకొనుట ఇష్టము లేదు.ఈ సేవకుని మాన్పించి ఇంకొక సేవకుని పెట్టుకొనుటకు మనసొప్పుట లేదు. కొత్త వానికి మరల తనకు కావలసినవిధముగ పనులు నేర్పుట కష్టము కదా. 

ఒకరోజున మితిమీరిన కోపము వచ్చుటచే సేవకుని పిలిచి చెక్కమీద "I am an Idiot"  అను బోర్డు చేక్కించుకు రమ్మని పంపెను. బోర్డు తెచ్చిన వెంటనే దానికి రెండు వేపుల తాడు కట్టి హారముగా మెడలో వేసుకొనమని చెప్పెను. రోజూ పనికి వచ్చినప్పటి నుండీ వెళ్ళు దాకా ఆ హారమును వేసుకొని పనిచేయు మని చెప్పెను. దీనివలన తన పని సవ్యముగ జరగని యడల తన మనస్థాపము తగ్గునని భావించెను.  

ఈ విధముగా యజమాని సేవకుడు రోజులు గడుపు చుంటిరి. హఠాటాత్తుగా ఒక రోజున యజమాని అస్వస్థకు లోనుకాగా తన కాళ్ళు స్వాధీనము తప్పెను. ఎంత మందికి  చూపిననూ పరిస్థితి మెరుగు పడలేదు. కాల కృత్యములకు కూడా సేవకుని సహాయము కావలసి వచ్చెను. సేవకుడు కూడా నమ్రతగా రోజూ తన హారము వేసుకుని పని చేయు చుండెను. 

యజమానికి ఒక రోజు పట్టరాని కోపము వచ్చి సేవకుని, హారము లోని పదములు చదవ మనెను. సేవకునికి చదువు రాక పోవుటచే తను చదివి దాని అర్ధము చెప్పెను. వెంటనే సేవకుడు తన హారమును తీసి యజమాని మెడలో వేసెను. సేవకుడు తను ఇంక పనిచేయనని వెళ్ళి పోవుచుండగా జీతము రెట్టింపు చేసి తన దగ్గరే ఉండమని బతిమాలెను. రోజూ సేవకుడు వచ్చి హారమును యజమాని మెడలో వేసి తను వెళ్లి పోవు చున్నపుడు తీసివేయుచు యజమాని చనిపోవు వరకూ పనిచేసేను.

 చివరిమాట: జీవిత కాల చక్రములో బండ్లు ఓడలూ ఓడలు బండ్లు గా మారవచ్చును. అందువలన జీవన విధానము లో మానవత్వము చూపక జీవించిన, అనువుగాని సమయమున భంగపాటు తో జీవించ వలసి వచ్చును.   

3 comments:

  1. e-mail ద్వారా:
    Rajeswari Nedunuri to me
    show details 8:57 AM (13 minutes ago)
    బాగుంది కధ చివరికి యజమానే ఇడియట్ ఐపోయాడు కదా ? ఇంకా ఇలాంటి ఆని ముత్యాలను రాయండి. బాగుంటాయి. నీటి కుడా ఉంది కదా ? స్వాతంత్ర దినోత్సవ శుబా కాంక్షలు

    ReplyDelete
  2. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    తాను ఎంత ఎత్తుకెదిగినా,తన మూలాలను మరువకూడదు అని తెలియచెబుతూ, జీవితములో, అడుగడుగునా, పుట్టినప్పుడు; పెరుగుతున్నప్పుడు; ఆఖరికి చనిపోయేటప్పుడుకూడా, మనిషికి మరొకరి సహాయం తప్పక కావాల్సివుంటుంది అని ఈ కథ తెలియచేస్తుంది. చక్కటి విషయాన్ని చెప్పారు. ధన్యవాదములు.

    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  3. మాధవరావు గార్కి, రాజేశ్వరి గారికి,
    మీరు పోస్ట్ ముఖ్యాంశాన్ని చక్కగా సంక్షిప్తం గ చెప్పారు. ఇది వ్రాయటానికి కారణం అదే. మనము వ్రాసే వాటిల్లో ఏ కొందరయినా విషయం గ్రహించగలిగితే ధన్యులమవుతాము. మీ వ్యాఖ్యలకు థాంక్స్.

    ReplyDelete