Monday, May 24, 2010

22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే ---- ఏమి జరుగు తుంది ----
కథ రోజూ కంప్యూటర్ సముద్రంలో కొట్టుకుంటూ మునిగి తేలే వారి కోసం మాత్రం కాదు. దానిలో మునిగి తేల లేక ఏదో విధంగా సరిపెట్టు కుందాము అనుకునే వారి కోసం.


నేను పొద్దున్నే నిద్ర లేవ గానే మొదట చేసే పని కంప్యూటర్ స్విచ్ ఆన్ చెయ్యటం. మొహం కడుక్కు వచ్చే సరికి రెడీ గా ఉంటుంది నా ఆజ్ఞల కోసం. ఈ కంప్యూటర్ నాది. దానికి చేతనయినంత వరకూ నేను ఏమి చెబితే అది చేస్తుంది. దానికి ఇంత మంచి గుణం ఎల్లా వచ్చింది ?

క్రిందటి పోస్ట్ లో మనము కంప్యూటర్ లో హార్డ్ వేర్ ఏమి ఉంటావో తెలుసుకున్నాము (ఉదా: మోనిటర్, ప్రింటర్, సౌండ్ కార్డు...). వీటన్నిటితో వాటి భాషలో చెప్పి మనకు కావాల్సిన పని చేయించ టానికి ఒక సాఫ్టు వేర్ ఉంటుంది. దానినే ఆపరే టింగ్ సిస్టం అంటారు. మన భాష లో మనకు కావాల్సింది చెబితే ఇది కంప్యూటర్ భాషలో మన పని చేసే పరికరాలకి చెబుతుంది (ఉదా: ప్రింటర్ కు ). ఇది ఆపరే టింగ్ సిస్టం చేసే పని. మా కంప్యూటర్ లో ఇది windows xp. మన భాష, కంప్యూటర్ భాష తెలిసిన వాళ్ళు కూర్చుని ఈ ప్రోగ్రాం ని వ్రాస్తారు. వీరిని సిస్టమ్స్ ప్రోగ్రామ్మార్ అంటారు.

మనము కంప్యూటర్ ని స్విచ్ ఆన్ చెయ్యం గానే జరిగేది ఇదే. తన యజమాని ఆజ్ఞలను పూర్తి చేయించ టానికి పరికరాలు అన్నీసరీగ్గా ఉన్నయ్యో లేవో చూసుకుంటుంది. మనము వంట చెయ్యటానికి ముందు అన్నీ వంటింట్లో సరీగ్గా ఉన్నయ్యో లేవో చూసు కున్నట్లు. అందుకని మీ మీ అవసరాలని బట్టి సర్దుకోటానికి టైము తీసు కుంటుంది. అన్నీ చూసు కున్న తర్వాత మీ మోనిటర్ మీద బొమ్మలతో కంప్యూటర్ తో ఏమి చెయ్యచ్చో చెబుతుంది. ఈ బొమ్మలని ఐకాను(Icons) అంటారు. ఈ బొమ్మల మీద త్వరగా రెండు సార్లు మౌస్ తో క్లిక్ చేస్తే మీ ప్రోగ్రాం కంప్యూటర్ లో వస్తుంది. My Computer అనే దాని మీద క్లిక్ చేసారను కొండి కంప్యూటర్ లో ఏమి ఉన్నయ్యో మోనిటర్ మీద కనపడుతుంది.

ఎడమవేపు క్రింద Start(స్టార్ట్) అని కన పడు తుంది. దానిని నొక్కితే వచ్చే All Programs(అల్ ప్రోగ్రామ్స్) నొక్కితే మీ కంప్యూటర్ లో ఉన్న ప్రోగ్రామ్స్ లిస్టు వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ రెడీ అయ్యింది మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోంది.

మీరు ఇంకా మీ పని చేసుకో వచ్చు. సిడి లోంచి పాటలు వినవచ్చు, డివిడి లో నుంచి సినిమాలు చూడవచ్చు. Spreadsheet తో పద్దులు వెయ్యచ్చు. Word(వర్డ్) తో పుస్తకాలు వ్రాయచ్చు. దీనిని ఆఫ్ లైను మోడు అంటారు. మీ పని మీరు చేసుకుంటారు. మీ కంప్యూటర్ ప్రపంచంలో ఇంకొకళ్ళకి తెలియదు.

మీరు ఈ-మెయిలు చూడాలన్నా, బయట ప్రపంచం లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నా, ఇంకో వూళ్ళో ఉన్న వాళ్ళతో చాట్ చెయ్యా లన్నా మీరు ఆన్ లైను మోడ్ లోకి రావాలి.

దీనికి మీ కంప్యూటర్ ని నెట్వర్క్ కి కలుపు కోవాలి. ఈ నెట్వర్క్ లో ప్రపంచం లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కలిపి ఉంటాయి. దీని పేరు ఇంటర్నెట(Internet). ఒక్కొక్క కంప్యూటర్ కి ఒక చిరునామా ఉంటుంది. దానినే IP address అంటారు.ఇంకేముంది అడ్రస్ తెలిస్తే వాళ్ళ తోటి మాట్లాడచ్చు. ఈ IP address లు గుర్తు పెట్టు కోవటం కష్టం కాబట్టి మనము గుర్తు పెట్టు కొనటానికి వీలుగా ఈ-మెయిలు పేర్లు, వెబ్ సైట్ పేర్లు వచ్చాయి.

ఈ నెట్వర్క్ కి మీ కంప్యూటర్ ని కలుపుకోవాలి. టెలిఫోన్ ద్వారా కలపచ్చు(దానికి టెలిఫోనే నంబర్ ఉంది). కాకపోతే ఇది నత్త నడక నడుస్తుంది. మా ఇంట్లో హై స్పీడ్ DSL ఉంది. దానిని మా డెస్క్ టాప్ కి కలిపాము. ఈ కలిపేటప్పుడు మధ్యలో లింక్ సిస్ లాంటిది పెట్టు కుంటే DSL కి వైర్లెస్ ద్వారా కలపచ్చు. మా ఇంట్లో Linksys కాకుండా Netgear ఉంది. అంటే DSL నుండి వైర్ ను Netgear కి కలపటం Netgear నుండి కంప్యూటర్ కి కలపటం. దీనితో మీ లాప్ టాప్ ని మీ ఇంట్లో ఎక్కడ నుంచి అయినా DSL కి కలుపుకో వచ్చు.

ఈ నెట్వర్క్ లో ఏమేమి జరుగుతున్నాయో చూసి మనకు చెప్పటానికి మనకు బ్రౌసెర్ (Browser) కావాలి. దీని పనల్లా ఎవరెవరు ఏమి చేస్తున్నారో తెలిసికొని చెప్పటం, మన కోరికని బట్టి IP address లుగా మార్చి మనకు కావాల్సినపని చేసి పెడుతుంది. మీకు కావాలంటే వాటికి కలిపి చూపెడుతుంది. నేను వాడేవి Chrome, Mozilla, Internet explorer. మీరు ఏదో ఒకటి వాడచ్చు.

మీరు ఇప్పుడు బ్రౌజరు ని డబల్ క్లిక్ చేసి అడ్రస్ లో yahoo.com అని టైపు చెయ్యండి. యాహూ వాళ్ళ కంప్యూటర్ దగ్గరకి వెళ్తారు. దానిలో న్యూస్ క్లిక్ చేసి న్యూస్ చూడ వచ్చు. లేక Mail కి వెళ్లి ఈ-మెయిల చూసుకోవచ్చు. తర్వాతా కూడలికో మాలిక కో హారం కో వెల్ల వచ్చు. మీరు ఇల్లా వెళ్ళు తూ వుంటే మీ బ్రౌజరు ఒక్కొక్క దానిని ఒక్కొక్క విండో లో చూపెడుతుంది. ఈ విండోస్ అన్నీ కంప్యూటర్ మెమరీ లో తెరుస్తుంది. మీ కంప్యూటర్ కి అంత ఎక్కువ మెమరీ ఉంటె అన్ని విండోస్ తీరవచ్చు. అలా తెరుస్తూ పోతుంటే మెమరీ నిండి పోయి కంప్యూటర్ నెమ్మదిగా నడుస్తుంది. అందుకని ఉపయోగించిన తరువాత మూసి వెయ్యటం మంచిది. మనము వస్తువు వాడిన తరువాత కౌంటర్ మీద ఉంచము కదా, కౌంటర్ నిండి పోతుంది, అలాగన్న మాట. దీన్నే బ్రౌజింగ్ అంటారు సర్ఫింగ్ అని కూడా అంటారు.

మీరు ఇంటర్నెట వాడటం మొదలెట్తే ప్రపంచం లో ఉన్న కంప్యూటర్స్ లో ఒకళ్ళు అవుతారు. మీ ఈ-మెయిలు చూసుకోవచ్చు, బ్యాంకింగ్ చెయ్యొచ్చు, హోటలు, రైల్వే, ప్లేన్ రిజర్వేషన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంప్యూటర్స్ తోటి మీరు మాట్లాడ గలుగు తున్నారు కాబట్టి. మీరు ఈ పనులను చెయ్యటానికి usercode password లు సృష్టించు కోవాలి. మీరు ప్రతిసారీ టైపు చెయ్యటం కష్టముగా ఉంటె వాటిని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో దాచి పెట్టచ్చు. వీటికి కంప్యూటర్ పెట్టె పేరు కుకీస్(cookies).

సమాజం లో అందరూ మంచి వాళ్ళు అయితే న్యాయస్థానాలు అవ్వీ అక్కర లేదు కానీ ఇది నిజం కాదు. ఇంటర్నెట సమాజం లో మీరు ఇంకొక కంప్యూటర్ దగ్గరకి ఎలా వెల్ల గలరో ఇంకొకళ్ళు గూడా మీ కంప్యూటర్ దగ్గరకు రాగలరు. కంప్యూటర్ భాష తెలిసి దొంగతనం గా మీ కంప్యూటర్ లోకి వచ్చిన వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెలిసుకో గలరు. అందుకని మీ usercode password జాగర్తగా దాచి పెట్టుకోండి. కనీసం password లు కుకీస్ లో పెట్టకండి.

నేను చెప్పినవన్నీ కంప్యూటర్ లో చెయ్యటం మొదలెట్టండి. తర్వాత పోస్ట్ లో కంప్యూటర్ చెడిపోతే బాగు చేసే విధానం గురించి తెలుసుకుందాము.


Tuesday, May 11, 2010

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి ---

కథ రోజూ కంప్యూటర్ సముద్రంలో కొట్టుకుంటూ మునిగి తేలే వారి కోసం మాత్రం కాదు. దానిలో మునిగి తేల లేక ఏదో విధంగా సరిపెట్టు కుందాము అనుకునే వారి కోసం.

నా డెస్క్ టాప్ పాడయితే మా ఆవిడ లాప్ టాప్ వాడటానికి ఒక ఒప్పందానికి వచ్చాము. నేను లాప్ టాప్ మీద పని చేసిన సమయము నిమిషాల తో సహా ఆవిడ చెప్పిన పనులు చెయ్యాలి. దానికి తోడు కంప్యూటర్ బాగు చెయ్యటం ఆవిడకి నేర్పాలి. ఇది బలాత్కార బానిసత్వం క్రిందకి వస్తుంది. నాకు ఒకటే శరణ్యం. ఆవిడకి కంప్యూటర్ బాగు చెయ్యటం నేర్పాలి. సరే ప్రణాళిక నిర్ణయించు కున్నాను.
మొదట కంప్యూటర్ గురించి చెప్పాలి. ఆవిడ్ -మెయిల్స్ చూస్తుంది తప్ప పరిజ్ఞానం ఎంత ఉందొ తెలియదు. టూకీగా చెప్పాలని నిర్ణయించు కున్నాను. తరువాత అది ఎల్లా పాడవు తుందో చెప్పాలి(ఇది నన్ను సేవ్ చేసు కోవటం కోసం. ఎందుకంటే పొద్దున్న బాగున్న కంప్యూటర్ సాయంత్రానికి ఎల్లా పాడయింది . ఏదో చేసారు కి సమాధానం చెప్పలేక) . తరువాత బాగు చేసే విధానం. తేలికగా మూడు మెట్ల వ్యవహారం. నోట్సు వ్రాసు కున్నాను. మొదట చదివించటం తరువాత ప్రశ్నలకి జవాబు లివ్వటం.
కంప్యూటర్ అంటే ఏమిటి --- దానిలో ఏమి ఉండును --- ఎలా పని చేయును.
కంప్యూటర్ పని చెయ్యాలంటే దానికి రెండు రకముల సాధనాలు ( కనపడేవి కనపడనివి) కావాలి. కనపడే వాటిని హార్డువేర్ అంటారు, కనపడని వాటిని సాఫ్ట్ వేర్ అంటారు. కంప్యూటర్ కి అర్ధమయ్యేది ఒకటే భాష. దానిని మెషీన్ లాంగ్వేజి అంటారు. మనం కంప్యూటర్ ఆన్ చెయ్య గానే వచేదాన్ని ఆపరేటింగ్ సిస్టం అంటారు( ఉదా: విండోస్). ఇది మన ఆజ్ఞ లని మనభాష లో తీసుకుని కంప్యూటర్ భాషలో కి మార్చి కంప్యూటర్ కి చెయ్యమని చెబుతుంది.

I
. Hard ware:

1.
ఎలక్రానిక్ చిప్ --- తనకు పంపిన ఆజ్ఞలను ఛేదించ టానికి.
2. RAM ------ Random Access Memory  -- చాలా త్వరగా పని చేస్తుంది. అందుకని కంప్యుటర్ ని పనిచేయించే         ఆపరేటింగ్ సిస్టంని (విండోస్) దీనిలో ఉంచుతారు. త్వరగా ఆజ్ఞలను పంపటానికి.
3. హార్డ్ డిస్క్ --- వ్రాసిన సంగతులు, ఫోటోలు దాచి పెట్టి కావాల్సి నప్పుడు ఇవ్వ టానికి.
4. వీడియో కార్డు --- కంప్యూటర్ లో జరిగేవి మనకు మోనిటర్ ద్వారా చూ పెట్ట టానికి.
5సౌండ్ కార్డు --- speakers ద్వారా శబ్దాన్ని వినిపించటానికి.
6. CD/DVD రికార్డర్/ప్లేయర్. --- కంప్యూటర్ లోకి CD ద్వారా సందేశాలు పంప టానికి.
7. I/O బోర్డు --- కీ బోర్డ్ ద్వారా ( టైపు చెయ్యటం) ద్వారా కంప్యూటర్ కి చెప్పటానికి. ప్రింట్ చెయ్యటానికి.
8. నెట్వర్క్ కార్డు --- ఇంటర్నెట్ కనెక్షన్ కి.
9. Power supply --- ఫై వాటన్నిటికి విద్యుత్తు పంపటానికి.


మీకు లాప్ టాప్ ఉంటే దానిలో వైర్లెస్ కనెక్షన్ కి ఒక కార్డు ఉంటుంది. చాలావరకు ఇవన్నీ ప్లేట్లు లాగా ఉంటాయి. ఎందుకనో వీటిని కార్డులు అంటారు
కంప్యూటర్ లో ఇవన్నీ వాటంతట అవే పని చేస్తయ్యి కానీ కొన్నిటికి డ్రైవ్ చేసే వాళ్ళు(drivers) ఉంటె కానీ ఎక్కడికీ కదలవు(పని చెయ్యవు). సామాన్యంగా drivers సాఫ్ట్వేర్ (కనపడనిది) ఉంటాయి.


II. Software :  ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ )

ఇది కంప్యుటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు RAM లోకి హార్డ్ డిస్క్ నుండి లోడ్ చెయ్య బడుతుంది.
మనము కంప్యూటర్ కి ఎమన్నా చెప్పాలంటే కీ బోర్డు మీద టైపు చేస్తాము లేకపోతే మౌస్ తో క్లిక్ చేస్తాము. మనసందేశాల కోసం ఎప్పుడూ కంప్యూటర్ లో ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దాన్నే ఆపరేటింగ్ సిస్టం అంటారు. అది చేసే పనల్లా మీ ఆజ్ఞలను తీసుకుని, కార్యాచరణకి ఆయా పనులు చేసేవాటికి పని అప్పగించి మీ కార్యము నేరవేరేటట్టు చేస్తుంది. ఉదా: మీరు ప్రింట్ చెయ్యమని చెప్పారనుకోండి, ప్రింట్ చేసే విభాగానికి మీ కోరిక తెలుపుతుంది. కంప్యూటర్ కి మన భాష తెలియదు. అది మాట్లాడే భాషని మెషిన్ లాంగ్వేజి అంటారు. ఆపరేటింగ్ సిస్టం మనము చెప్పిన వాటిని కంప్యూటర్ కు అర్ధమయ్యేలా చెబుతుంది. కంపూటర్లు మొదట వచ్చినప్పుడు దీనిని సూపర్వయిజరు అనే వాళ్ళు. దీనిని మామూలుగా కంప్యూటర్ భాషలో వ్రాస్తారు.
ఉదా విండోస్ , యునిక్స్. కొత్త వి వచ్చినప్పుడల్లా వీటికి ఒక తోక తగిలిస్తారు. ఉదా: విండోస్ xp, విండోస్ 7.


III. Application Programs.


మీరు Internet లోకి వెళ్ళవలె ననుకోండి బ్రౌజరు కావాలి(Mozilla, Chrome, Internet explorer).మీరు పుస్తకం వ్రాయాలను కొండి. మీకు word కావాలి.మీరు పద్దులు వ్రాయాలను కొండి. Spread sheet (Excel) కావాలి.వీటి నన్నిటినీ అప్లికేషను ప్రోగ్రామ్స్ అంటారు. మీ విండౌస్ వీటి పేర్లని అన్నిటిని ఒక రిజిస్టర్ లో వ్రాసుకుంటుంది. మీరు అడగంగానే వాటిని పిలవటానికి. మీరు control panel లోకి వెళ్తే add remove programs లో మీరు ఉపయోగించే ప్రోగ్రాముల పేర్లన్నీ కనపడుతాయి.

కంప్యూటర్ ఎల్లా పని చేస్తుంది: మనం కంప్యూటర్ కి మూడు విధాలుగా చెప్పొచ్చు. కీ బోర్డ్ తో టైపు చెయ్యటం ద్వారా, మౌస్ ద్వారా, CD ద్వారా. ఆపరేటింగ్ సిస్టం (విండోస్) మీ ఆజ్ఞ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అవి తీసుకుని కంప్యూటర్ భాష లోకి మార్చుకుని. కంప్యూటర్ చిప్ దగ్గరకు పంపిస్తుంది. కంప్యూటర్ చిప్ ఆజ్ఞను మిగతా హార్డువేర్ డ్రైవర్స్ కి కావలసిన పని చెయ్య మని చెబుతుంది (ఉదా: దీనిని మోనిటర్ మీద చూపు). అందుకే మంచి స్పీడు పనిచేసే కంప్యూటర్ చిప్ కావాలి. ఒక్కొక్కప్పుడు ఆజ్ఞ లన్నిటిని వెంటనే పంపించటానికి కుదరదు. అందుకనే ఆజ్ఞలను దాచిపెట్టి వరుసగా పంపటానికి మెమరీ కావాలి. అల్లాగే మెమరీ లో మనం ఎక్కువగా చూసే వాటిని(కూడలి, హారం, న్యూస్) windows పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ మెమరీ ఉంటె అంత మంచిది.
అలాగే మీకు హైస్పీడ్ కనెక్షన్ కావాలనుకుంటే దానిని గుర్తు పట్టే కార్డు, దాని డ్రైవర్ కంప్యూటర్ లో ఉండాలి.
ఇది సూక్ష్మంగా కంప్యూటర్ కథ. నా ఉద్దేశం లో ఇంత ఆవ గాహన ఉంటే గాబరా పడకుండా కంప్యూటర్ ప్రొబ్లెంస్ పరిష్కరించ వచ్చును.
మా ఆవిడ కిచ్చి చదివించి చూడాలి ఏమంటుందో.

సశేషం --- ఇంకా ఉంది