Monday, September 29, 2014

105 ఓ బుల్లి కథ 93 -- ఇటలీ లో ఓ వారం - పారిస్

హెడింగ్ చూసి ఇటలీకి, ఫ్రాన్స్ లో ఉన్నపారిస్ కి సంబంధం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా ? నిజంగా ఏమీ లేదు, కానీ పారిస్, మేము వెళ్ళే ఇటలీ దోవలో ఉంది. అక్కడ మధ్యలో ఆగితే ప్లేన్ ఫేర్ తగ్గుతుంది. అందుకని మా ఇటలీ ట్రిప్ లో పారిస్ కలిసింది.

మేము Paris "Charles degaulle " ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అప్పుడే తెల్లవారుతోంది. (Paris లో రెండు airport లు ఉన్నాయి. Charles degaulle, Orly.) ఇమ్మిగ్రేషన్, సామాను కలెక్ట్, సెక్యూరిటీ అయిన తరువాత బయట రిజర్వ్ చేసిన మా టాక్సీ కోసం చూశాము. అక్కడ మా పేరు బోర్డుతో ఎవరూ నుంచోలేదు. సరే ఫోన్ చేస్తే ఇంగ్లీష్ భాగంలో అంతులేని మ్యూజిక్ రావటం మొదలెట్టింది, ఫోనులో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా పోర్టర్ ఫోన్ తీసుకుని ఫ్రెంచ్ బట్టన్ నొక్కగానే వెంటనే మనిషి పలికారు. లెస్సన్ నంబర్ వన్ ఇక్కడ జనానికి ఇంగ్లీష్ వచ్చు గానీ మాట్లాడారు. నో స్పీక్ ఇంగ్లీష్ అంటారు. ఇంతకీ తేలిందేమంటే మాకు రిజర్వేషన్ ఉంది గానీ ఎవరో కాన్సిల్ చేశారుట. అక్కడ కూర్చుని వాదించటం దండగ. సరే ఇంకొక టాక్సీ తీసుకుని ఇంటికి చేరాము.

"ఇల్లు" అనంగానే మీకు ఇంకొక భావన రావచ్చు. మాకు నిజంగా పారిస్ లో ఇల్లు లేదు. మాది ఒక రోజు ఇల్లు.  ప్రపంచంలో ఏ పెద్ద ఊర్లో అయినా సరే హోటల్లో ఉండాలంటే తడిసి మోపెడవుతుంది. ఇప్పుడు రోజూవారీ అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకోవచ్చు. హోటల్ కన్నా సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. దాదాపు మన ఇంట్లో సౌకర్యాలన్నీవంట గిన్నెలతో సహా ఉంటాయి. అర్ధ రాత్రి పూట కాఫీ తాగాలనుకుంటే కలుపుకుని తాగవచ్చు. మేము వెళ్ళే అన్నిఊళ్ళల్లో ఉండటానికి అపార్ట్మెంట్లు తీసుకున్నాము. అన్ని వివరాలూ తెలిపే ఆ వెబ్ సైట్ పేరు airbnb.com.

ఇంటికి వస్తూంటే దారిపొడుగునా అప్పుడప్పుడే కాఫీ దుకాణాలు తెరుస్తున్నారు.  ఇక్కడ breakfast ఫుడ్స్ crepes, croissants. క్రేప్స్ అంటే పల్చటి తీపి దోశలనుకోండి croissants అంటే మరీ తీపి కాని కేక్ లాంటి బ్రెడ్. పక్కనున్న ఫోటో పారిస్ లో మా వీధి. ఇంకో ఫోటో మా ఎదురుకుండా ఉన్న ఇల్లు. ప్రతీ బాల్కనీలో పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ! ఇక్కడి ఇళ్ళు ఎప్పుడో కట్టినవి. వీధులు కూడా ఎప్పుడో వేసినవి. రాజ వీధులు తప్ప, అన్ని వీధుల్లోనూ రెండువేపులా కార్లు పార్క్ చేస్తారు. సామాన్యంగా వీటిల్లో one way ట్రాఫ్ఫిక్. "నేను లోపలికి రావటం కుదరదు ఇది one way" అని వీధి మొదట్లో టాక్సీ వాడు దింపేశాడు. సామాను మోసుకుంటూ ఇంట్లోకి జేరుకున్నాము. ఇళ్ళు పాతవిగా కనపడ్డా లోపల remodel చెయ్యటం మూలంగా లోపల ఉన్నఅపార్ట్మెంట్లు అన్నిసౌకర్యాలతోటి ఉంటాయి.

మాకు 12:30 కి ఐఫుల్ టవర్ అప్పాయింట్మెంట్ ఉంది. మేము అక్కడ ఆ సమయానికి ఉంటే ఒకళ్ళు వచ్చి మమ్మల్ని క్యూలో నుంచోకుండా  ఐఫుల్ టవర్ లోపలకి తీసుకు వెళ్తాడు (లేకపోతే కనీసం రెండు గంటలు క్యూలో నుంచోవాల్సి వస్తుంది). కాకపోతే కొంచెం ధర ఎక్కువ. మేము 11 గంటలకల్లా ఇంట్లో రెడీ అయ్యాము. సరే అక్కడ చుట్టు పక్కల తిరగొచ్చని. uber car కోసం iPhone లో చూస్తే 5 నిమిషాలలో కారు వచ్చే టట్లా ఉంది. కారెక్కి  ఐఫుల్ టవర్ కి వెళ్ళాము.

ఇక్కడ కొన్ని సంగతులు చెప్పాలి. మా దగ్గర international calls చెయ్యగలిగే  iPhone ఉంది. ప్రపంచంలో పెద్ద పట్టణాలలో uber అనే సర్వీస్ ఉంది. (uber.com). వాళ్ళ కార్లు ఊరంతా తిరుగుతూ ఉంటాయి, వాటిని సెల్ ఫోన్ లో చూడవచ్చు. మనకు దగ్గరలో ఉన్న కారుని రమ్మంటే, వచ్చి మనము వెళ్ళ వలసిన చోటికి తీసుకు వెళ్తారు. ఇంకొక సంగతి చెప్పాలి. ఇక్కడ పారిస్ (యూరోప్) లో జేబు దొంగలు ఎక్కువ. చాలా జాగర్తగా ఉండాలి. నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన విధంగా పర్స్ జేబుకి పిన్నీసు పెట్టుకున్నాను.


ఒక గంటసేపు ఐఫుల్ టవర్ చుట్టూతా తిరిగాము.  ఫౌంటైన్స్, పార్క్ లు, సావనీర్ షాపులూ చాలా ఉన్నాయి. ఆ షాపుల్లోనూ, బయట అమ్మేవాళ్ళూ (మంచినీళ్ళు వగైరా) అందరూ ఇండియన్స్ లాగా కనపడే వాళ్ళే (ఇండియా శ్రీలంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్). సరీగ్గా 12:30 కి ఒకళ్ళు వచ్చి ఐఫుల్ టవర్ ఎలివేటర్ దగ్గరకి తీసుకు వెళ్ళాడు. మీరు మెట్లెక్కి వెళ్ళా లనుకుంటే ఇంకో ద్వారం ద్వారా టిక్కెట్ తీసుకుని వెళ్ళవచ్చు  (క్యూ దాదాపు ఉండదు). పైన ఎలివేటర్ దిగి ఐఫుల్ టవర్ మీద నుంచి చుట్టూతా తిరిగి చూడవచ్చు. Spectacular view of Paris. ఏమన్నా తినాలనుకుంటే అక్కడ రేస్టోరెంట్ కూడా ఉంది.


 ఐఫుల్ టవర్ నుండి దిగిన తరువాత పారిస్ మధ్య ప్రవహించే నది మీద క్రూజ్ కి వెళ్దా మనుకున్నాము కానీ చాలా మెట్లు దిగాలి, ఎక్కాలి. అందుకని బస్ టూర్ కి మార్చుకున్నాము. బస్ టూర్ "హాప్ ఆన్ హాప్ ఆఫ్". అంటే అది ఆగిన చోట ఎక్కడైనా సాయంత్రం లోపల ఎక్కవచ్చు దిగవచ్చు. గంటన్నరలో ఊరంతా తిప్పుతారు. పెద్దపెద్ద ఫ్రెంచ్ రాజ వీధులగుండా, ఫ్యాషన్, పర్ఫ్యూమ్స్ కంపెనీ లన్నీ చూస్తూ వెళ్ళొచ్చు.

పారిస్ మధ్యలో ప్రవహించే నదిని sein river అంటారు . దానికి వడ్డుకి రెండు వేపులా సిమెంట్ చేశారు. మీరు దాని మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చు కూర్చుని చల్లగాలిని ఆనందించవచ్చు. నడుస్తూ పోతూ ఉన్న చాలా మంది ప్రేమికులు కనపడతారు. చాలా మంది ప్రేమికులు పబ్లిక్ గా ప్రేమ చూపిస్తూ ఉంటారు. బాగా మైంటైన్ చేస్తారు కాబట్టి ఎప్పుడూ జనం తిరుగుతూనే ఉంటారు. మీరు చాలా ఇంగ్లీష్ సినీమాలలో ఈ sein river ప్రేమికులు ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ చెట్టా పట్టా వేసుకుని  చిందులాడటం చూసే ఉంటారు. ఇంకా ప్రేమ ఊరుతుంటే మెట్లెక్కి రోడ్డుమీదకి వచ్చి padlock కొనుక్కిని వాళ్ళ పేర్లు రాసుకుని అక్కడున్న ప్రేమికుల panel కి తాళం వేసి, తాళం చెవి నదిలో పారేసి వెళ్లి పోవచ్చు. మీరు అటువంటివి చెయ్యాలనుకుంటే త్వరగా వెళ్ళటం మంచిది. నాకు ఈ మధ్య తెలిసిన వార్త ఏమిటంటే ప్రేమికులు ఎక్కువవటం మూలంగా తాళాలు వెయ్యకుండా ఉండేటట్లు అక్కడ గ్లాస్ పానల్స్ పెడతారట.


నేను గమనించింది ఏమంటే ప్రపంచంలో అందరూ ఊళ్లు నిర్మించి ఏదో ఒక మూల పార్కులు కడతారు. కానీ పారిస్ లో ఏమనిపిస్తుందంటే ఒక పెద్ద పార్క్ నిర్మించి దానిలో కొన్ని చోట్ల ఇళ్ళూ కట్టారని. ప్రతి ఇంటి బాల్కనీలో ముచ్చటగా పూలు చూస్తారు. ఇక్కడ రాజరికం ఉన్నకాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు వస్తూ ఉండేవి. గెలిచినప్పుడల్లా రాజులు ఒక స్థూపమో, నది మీద ఒక బ్రిడ్జో, లేక పోతే ఒక ఫౌంటెన్ కట్టించేవారు (మన రాజులు గుళ్ళు కట్టించిన విధంగా). అవన్నీ వరసగా బస్ టూర్ లో చూడవచ్చు. మేము రెండు సార్లు ఊరు చుట్టూతా తిరిగి ఒక రేస్టోరెంట్ దగ్గర ఆగి భోజనం చేసి ఇంటికి జేరుకున్నాము.

అప్పుడే చీకటి పడుతోంది. పోద్దుటనుండీ తిరిగాము కదా నాకు కొంచెం బడలికగా ఉంది. ఇంతలోకే అమ్మా కూతురూ బయటికి వెళ్లాలని నిర్ణయించు కున్నారు. హటాత్తుగా అడిగితే నేను రానని చెప్పాను. నేను ఎంతసేపు నిద్రపోయానో తెలియదు కానీ తలుపు తీసే శబ్దమయితే లేచాను. అమ్మా కూతురూ ఆపిల్స్ తీసుకు వచ్చారు. దేశంగాని దేశంలో ఇంత సేపు ఏమి చేసారబ్బా అని మనసులో అనుకోకుండా పైకి అనేశాను. క్లుప్తంగా తేలిందేమంటే కాసేపు బజారులలో తిరిగారుట తరువాత ఐఫుల్ టవర్ రాత్రిపూట ఎల్లా ఉంటుందో చూడాలనిపించి ubar టాక్సీ పిలిచి వెళ్లి చూసి వచ్చారుట. నేను మళ్ళా అప్పుడు వెళ్ళే పరిస్థితి లో లేను. సరే అది మిస్ అయ్యాను. అనుకోకుండా ఆవిధంగా మిస్ అయిన దాన్ని, మొన్న ఒక హిందీ సినీమా లో చూశాను. దానిలో హీరోయిన్ రాత్రి పూట ఐఫుల్ టవర్ కి వెళ్లి చూస్తుంది. మీరు కూడా ఐఫుల్ టవర్ రాత్రిపూట ఎల్లా ఉంటుందో చూడాలనుకుంటే Queen అనే హిందీ సినిమాలో చూడవచ్చు.

సరే పొద్దున్నే లేచాము. అందరికీ ఆకలి దంచేస్తోంది. నడుచుకుంటూ ఒక హోటలికి వెళ్ళి breakfast కానిచ్చాము. మెనూ లో ఫ్రెంచ్ కింద ఇంగ్లిష్ కూడా ఉంటుంది కాబట్టి ఆర్డర్ చెయ్యటం తేలిక. మీకు మంచి నీళ్ళు కావాలంటే కూడా ఆర్డర్ చెయ్యాలి. లేకపోతే ఇవ్వరు. నీళ్ళల్లో రకాలు Tap water, sparkling water, Gas water (సోడా), మొదలయినవి. Tap water కి డబ్బులు ఇవ్వక్కర లేదు. అల్లాగే కాఫీ కూడా. espresso, cappuccino(కాపచినొ), americano. మీకు మన కాఫీ లాంటిది కావాలంటే "అమెరికానో" ప్లస్  క్రీమ్ ఆర్డర్ చెయ్యండి.

ఇంటికి వచ్చి బట్టలు సద్దుకుని Rome వెళ్ళటానికి Orly airport కి టాక్సీ తీసుకు వెళ్ళాము.

గమనిక: ఫోటోలు చాలావరకు మా ఆవిడ iPad తో తీసినవి. చాలా తీశాము గానీ పోస్ట్ లో ఎక్కువగా పెడితే, పోస్ట్ Internet లో రావటానికి చాలా టైం పడుతుందని ఎక్కువగా పెట్టలేదు. 

Monday, September 22, 2014

104 ఓ బుల్లి కథ 92-- అమెరికాలో ఐఫెల్ టవర్ ఉందా?

ఉంది. మనం రోజూ ఎన్నెన్నో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాటిలో కొన్ని ప్రపంచంలో ప్రశస్థ మైన వాటిని చూడాలని అనిపిస్తుంది. అవి వివిధ దేశాల్లో ఉంటే వెళ్ళాలంటే చాలా డబ్బు శ్రమతో కూడిన పని. అందుకని అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చాలా వాటికి డూప్లికేట్ లు తయ్యారు చేశారు. వాటి లిస్టు క్రింద ఇస్తున్నాను. మీరు వాటికి దగ్గరలో ఉంటే చూడటానికి ప్రయత్నించండి. కొంత కాకపోతే కొంతయినా త్రుప్తి పడవచ్చు. నేను కొన్ని ఊళ్ళకి వెళ్ళానుగానీ అవి ఉన్నయ్యని తెలియక వాటిని చూడలేదు. పక్కనున్న రెండు ఫోటోలు మొన్నీమధ్య (ఈ నెలలో Paris, France Pisa, Itali) తీసినవి. నా ఫోటో చాతుర్యం వలన ఐఫెల్ టవర్ వంగి నట్టు కనపడుతుంది గానీ నిజంగా వంగలేదు.

1. Eiffel Tower: Paris, Texas USA
అసలుది Paris, France లో ఉంది. అమెరికాలో  Texas రాష్ట్రంలో ఉన్న Paris అనే ఊళ్ళో ఉంది. అసలు దానికన్నా కొంచెం ఎత్తు ఉండాలని దీనిపైన ఒక టోపీ కూడా పెట్టారు.

2. The leaning tower of Pisa: Niles, Illinois USA
అసలుది Pisa, Italy లో ఉంది. దీనిని 1934 లో కట్టారు. అసలు దానిలో సగం సైజు ఉంటుంది. ఈ రెండు కట్టడాలు కట్టిన కారణాలు వేరు. పీసా లో కట్టినది పక్కనున్న చర్చ్ బెల్స్ ఉంచటానికి కాకపోతే Niles లో కట్టింది చూడ ముచ్చట కాని పక్కనున్న water tanks ని దాచి పుచ్చటానికి. 

3. The Parthenon: Nashville, Tennessee  USA
అసలుది Greece లో ఉంది. ఇది Nashville’s Centennial Park లో ఉంది. దీనిని Tennessee’s 1897 Centennial Exposition కోసం కట్టారు.

4. London Bridge: Lake Havasu City, Arizona USA
"లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ " అనే పాట మీరు చిన్నప్పుడు పాడి ఉంటారు లేకపోతే కనీసం వినయినా ఉంటారు.1968 లో ఈ బ్రిడ్జి అవసాన దశలో ఉంటే దాదాపు 2. 5 మిలియన్ డాలర్లకి లండన్ సిటీ దీనిని అమ్మింది. కొనుక్కున్న వాళ్ళు దాని రాళ్ళన్నీ జాగర్తగా తీసుకువచ్చి అమెరికాలో ఆరిజోనా రాష్ట్రంలో దీనిని కట్టారు.

5. The Titanic: Branson, Missouri USA
అసలుది సముద్రపు అడుగున ఎక్కడో ఉంది. ఇది టైటానిక్ కి కాపీ. దీనిలో ఆ షిప్ గురించి ఒక మ్యూజియం కూడా ఉంది.

6. Stonehenge: Natural Bridge, Virginia USA
అసలుది England లో ఉంది. దీన్ని అంతా Styrofoam తో చేశారు. అందుకనే దీన్ని Foamhenge అని కూడా అంటారు. ఇది Blue Ridge Mountains లో,  Natural Bridge అనే ఊళ్ళో Virginia రాష్ట్రంలో ఉంది.


మాతృక
https://www.yahoo.com/travel/copycat-travel-icons-across-the-usa-92756797352.html

Monday, September 15, 2014

103 ఓ బుల్లి కథ 91 --- అమెరికాలో మా పెరటి తోట

అప్పుడే సెప్టెంబర్ వచ్చేసింది ఇంక చలిమొదలెడుతోంది. చికాగోలో అలా చలి రోజు రోజుకూ పెరుగుతూ, ఉష్ణోగ్రత తగ్గుతూ జనవరి వచ్చేసరికి స్నో కురుస్తూ, అప్పుడప్పుడూ తుఫానులుగా వస్తూ, వింటర్ ప్రభావం చూపిస్తూంది. ఏప్రిల్ నుండీ మళ్ళా వెచ్చదనం మొదలెడుతుంది. అప్పటినుండీ ఆగస్ట్ దాకా వేడి  పెరుగుతూ ఉంటుంది. తోట పనులు చేసుకునే కాలం ఏప్రిల్ నుండీ ఆగస్ట్ దాకా. ఏకాలంలో చెయ్యాల్సిన పనులు ఆ కాలంలో చేయ్యా లాంటారే అది ఇక్కడ చాలా నిజం.

దాదాపు ఈ సంవత్సరానికి తోట తో పని అయిపోయినట్లే. ఇంకో నెల రోజుల్లో మీరు చూస్తున్న మా తోట ఫోటో ఇల్లా ఉండదు. వడలిపోయి నల్లగా నిర్మానుష్యంగా తయారు అవుతుంది. మళ్ళా తోటపనికి ఏప్రిల్ దాకా ఆగాల్సిందే.

ఇక్కడ మొక్కలు వెయ్యటం "మే" మొదటి వారంలో ప్రారంభ మవుతుంది. అసలు మార్చ్ ఏప్రిల్ లోనే ఇంట్లో విత్తనాలు వేసి మొక్కలని పెంచుతారు. మా లాంటి వాళ్ళయితే మేనెలలో షాపుల కెళ్ళి మొక్కలు కొనుక్కు వచ్చి పెరటి తోటలో వేసుకుంటారు. దాదాపు అన్నికూరలమ్మే కొట్ల దగ్గరా పూలు, కూరగాయల మొక్కలు అమ్ముతారు.

మేము ఈ సంవత్సరం మా తోటలో వేసినవి: టొమాటో, బెల్ పెప్పర్, థాఇ పెప్పర్ (సీమ పచ్చిమెరప), బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బీన్స్, వంకాయ, బీరకాయ, సొరకాయ, cucumber (కీరా), పెరుగు తోటకూర.

ఫోటోలో మధ్యలో ఎత్తుగా పెరిగినవి, brussels sprout చెట్లు. నాకు బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ అంటే ఇష్టం. అవి మినీ కాబేజీల్లా ఉంటాయి. ఒక పది తరిగి, నాన బెట్టిన ఒక స్పూన్ కందిపప్పు వేసి కొద్దిగా స్టీమ్ చేసి తిరగమోతతో మిళాయించి కూర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అదొక్కటే ఇంతవరకూ ఏమీ కాయలేదు. బహుశా డిసెంబర్ దాకా ఆగాలేమో. ఎక్కువగా వీటిని క్రిస్మస్ అప్పుడు ఉడకేసి డిన్నర్ లో తింటారు.

కుడివైపు పల్చగా ఉన్న చోట cucumber (కీరా) వేశాము. ఈ సమ్మర్ లో కొన్ని రాత్రుళ్ళు బాగా చల్ల పడ్డాయి. దానితో వాటికి  "ఫంగస్" పట్టుకుంది. ఆకులు పాడయి పోయాయి. "ఫంగస్" కి విరుగుడుగా baking soda నీళ్ళు చల్లాము గానీ పాడయిన ఆకులన్నీ తుంచి వేయటము మూలంగా ఎక్కువగా కాయలు కాయలేదు.

మీకు prominent గ కనపడేది పెద్ద ఆకులతో అల్లుకున్న సొర చెట్టు. అది టమాటో చెట్లు, బీరకాయ తీగల మీద పాకి తోటంతా ఆక్రమించుకుంది. దానికింద వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. లేత వంకాయలు తోటలోనించి కోసుకు వచ్చి కూర, పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటయ్యో చెప్పలేము.

మేము ఇంట్లో ఉండేది ఇద్దరం. ఇద్దరికి ఇంత తోట కావాలా అనిపిస్తుంది. కానీ ఆ సంతోషం ఆ త్రుప్తి వేరు. పండిన కూరగాయలన్నీ చాలా మందికి పంచి పెట్టాము. పచ్చి టొమాటోలు మనవాళ్ళకి చాలా ఇష్టం. పెరుగు తోటకూర బాగా వచ్చింది అందరికీ ఇచ్చాము. పెరుగు తోటకూర ఎల్లా చేసినా ఎప్పుడూ బ్రహ్మాండంగా వస్తుంది.

మా నాన్నగారు పొద్దున్నేమొహం కడుక్కోటానికి పెరట్లోకి వెళ్ళివచ్చేటప్పుడు, మా అమ్మకి ఆరోజు వంటకి కూరలు కోసుకు తీసుకు వచ్చేవారు. అప్పుడు అర్ధం అవలేదు. అప్పుడే కోసుకువచ్చిన కూరలతో వంట చేస్తే ఆ రుచే వేరు. చెట్టు నుంచి కోయటం అంటే వాటి పోషక రక్షణ నుండి వేరు చెయ్యటం. వాటిని వాడటంలో సమయ జాప్యం ఎక్కువయిన కొద్దీ వాటిలో రసాయనిక ప్రక్రియలు ప్రారంభమవుతాయి. రుచి తగ్గటానికి ఇది కారణం అవ్వచ్చు.

వచ్చే సంవత్సరం ఏమి వెయ్యాలో కొంచెం ఆలోచించాలి. మరీ దగ్గరలో మొక్కలు పెట్టాము కొంచెం దూరంగా మొక్కలు పెడితే బాగుంటుందేమో. దానికి తోడు కొన్ని మొక్కల నుండి ఎక్కువగా ఉత్పత్తి రాలేదు. వాటిని పెట్టక్కర లేదేమో. ఏదో ఉబుసుపోకకి మీకు చెబుతున్నా గానీ తోటలో నా బాధ్యత నీళ్ళు పోయటం, రోజూ కూరకి పెరిగిన కాయలు తుంచుకు రావటం వరకే. మా ఆవిడ, ఆవిడ సలహాదారులతో సంప్రదిస్తే గానీ వచ్చే సంవత్సరం ఏ మొక్కలు ఎక్కడ వెయ్యాలో తేలదు. పై ఫోటోలో ఉన్న సీతాకోక చిలుకలు మా ఆవిడ స్నేహితులు, సలహాదారులు. ఆ కుందనపు బొమ్మల సలహాలు ఎవరు వినకుండా ఉంటారు ?