అప్పుడే సెప్టెంబర్ వచ్చేసింది ఇంక చలిమొదలెడుతోంది. చికాగోలో అలా చలి రోజు రోజుకూ పెరుగుతూ, ఉష్ణోగ్రత తగ్గుతూ జనవరి వచ్చేసరికి స్నో కురుస్తూ, అప్పుడప్పుడూ తుఫానులుగా వస్తూ, వింటర్ ప్రభావం చూపిస్తూంది. ఏప్రిల్ నుండీ మళ్ళా వెచ్చదనం మొదలెడుతుంది. అప్పటినుండీ ఆగస్ట్ దాకా వేడి పెరుగుతూ ఉంటుంది. తోట పనులు చేసుకునే కాలం ఏప్రిల్ నుండీ ఆగస్ట్ దాకా. ఏకాలంలో చెయ్యాల్సిన పనులు ఆ కాలంలో చేయ్యా లాంటారే అది ఇక్కడ చాలా నిజం.
దాదాపు ఈ సంవత్సరానికి తోట తో పని అయిపోయినట్లే. ఇంకో నెల రోజుల్లో మీరు చూస్తున్న మా తోట ఫోటో ఇల్లా ఉండదు. వడలిపోయి నల్లగా నిర్మానుష్యంగా తయారు అవుతుంది. మళ్ళా తోటపనికి ఏప్రిల్ దాకా ఆగాల్సిందే.
ఇక్కడ మొక్కలు వెయ్యటం "మే" మొదటి వారంలో ప్రారంభ మవుతుంది. అసలు మార్చ్ ఏప్రిల్ లోనే ఇంట్లో విత్తనాలు వేసి మొక్కలని పెంచుతారు. మా లాంటి వాళ్ళయితే మేనెలలో షాపుల కెళ్ళి మొక్కలు కొనుక్కు వచ్చి పెరటి తోటలో వేసుకుంటారు. దాదాపు అన్నికూరలమ్మే కొట్ల దగ్గరా పూలు, కూరగాయల మొక్కలు అమ్ముతారు.
మేము ఈ సంవత్సరం మా తోటలో వేసినవి: టొమాటో, బెల్ పెప్పర్, థాఇ పెప్పర్ (సీమ పచ్చిమెరప), బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బీన్స్, వంకాయ, బీరకాయ, సొరకాయ, cucumber (కీరా), పెరుగు తోటకూర.
ఫోటోలో మధ్యలో ఎత్తుగా పెరిగినవి, brussels sprout చెట్లు. నాకు బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ అంటే ఇష్టం. అవి మినీ కాబేజీల్లా ఉంటాయి. ఒక పది తరిగి, నాన బెట్టిన ఒక స్పూన్ కందిపప్పు వేసి కొద్దిగా స్టీమ్ చేసి తిరగమోతతో మిళాయించి కూర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అదొక్కటే ఇంతవరకూ ఏమీ కాయలేదు. బహుశా డిసెంబర్ దాకా ఆగాలేమో. ఎక్కువగా వీటిని క్రిస్మస్ అప్పుడు ఉడకేసి డిన్నర్ లో తింటారు.
కుడివైపు పల్చగా ఉన్న చోట cucumber (కీరా) వేశాము. ఈ సమ్మర్ లో కొన్ని రాత్రుళ్ళు బాగా చల్ల పడ్డాయి. దానితో వాటికి "ఫంగస్" పట్టుకుంది. ఆకులు పాడయి పోయాయి. "ఫంగస్" కి విరుగుడుగా baking soda నీళ్ళు చల్లాము గానీ పాడయిన ఆకులన్నీ తుంచి వేయటము మూలంగా ఎక్కువగా కాయలు కాయలేదు.
మీకు prominent గ కనపడేది పెద్ద ఆకులతో అల్లుకున్న సొర చెట్టు. అది టమాటో చెట్లు, బీరకాయ తీగల మీద పాకి తోటంతా ఆక్రమించుకుంది. దానికింద వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. లేత వంకాయలు తోటలోనించి కోసుకు వచ్చి కూర, పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటయ్యో చెప్పలేము.
మేము ఇంట్లో ఉండేది ఇద్దరం. ఇద్దరికి ఇంత తోట కావాలా అనిపిస్తుంది. కానీ ఆ సంతోషం ఆ త్రుప్తి వేరు. పండిన కూరగాయలన్నీ చాలా మందికి పంచి పెట్టాము. పచ్చి టొమాటోలు మనవాళ్ళకి చాలా ఇష్టం. పెరుగు తోటకూర బాగా వచ్చింది అందరికీ ఇచ్చాము. పెరుగు తోటకూర ఎల్లా చేసినా ఎప్పుడూ బ్రహ్మాండంగా వస్తుంది.
మా నాన్నగారు పొద్దున్నేమొహం కడుక్కోటానికి పెరట్లోకి వెళ్ళివచ్చేటప్పుడు, మా అమ్మకి ఆరోజు వంటకి కూరలు కోసుకు తీసుకు వచ్చేవారు. అప్పుడు అర్ధం అవలేదు. అప్పుడే కోసుకువచ్చిన కూరలతో వంట చేస్తే ఆ రుచే వేరు. చెట్టు నుంచి కోయటం అంటే వాటి పోషక రక్షణ నుండి వేరు చెయ్యటం. వాటిని వాడటంలో సమయ జాప్యం ఎక్కువయిన కొద్దీ వాటిలో రసాయనిక ప్రక్రియలు ప్రారంభమవుతాయి. రుచి తగ్గటానికి ఇది కారణం అవ్వచ్చు.
వచ్చే సంవత్సరం ఏమి వెయ్యాలో కొంచెం ఆలోచించాలి. మరీ దగ్గరలో మొక్కలు పెట్టాము కొంచెం దూరంగా మొక్కలు పెడితే బాగుంటుందేమో. దానికి తోడు కొన్ని మొక్కల నుండి ఎక్కువగా ఉత్పత్తి రాలేదు. వాటిని పెట్టక్కర లేదేమో. ఏదో ఉబుసుపోకకి మీకు చెబుతున్నా గానీ తోటలో నా బాధ్యత నీళ్ళు పోయటం, రోజూ కూరకి పెరిగిన కాయలు తుంచుకు రావటం వరకే. మా ఆవిడ, ఆవిడ సలహాదారులతో సంప్రదిస్తే గానీ వచ్చే సంవత్సరం ఏ మొక్కలు ఎక్కడ వెయ్యాలో తేలదు. పై ఫోటోలో ఉన్న సీతాకోక చిలుకలు మా ఆవిడ స్నేహితులు, సలహాదారులు. ఆ కుందనపు బొమ్మల సలహాలు ఎవరు వినకుండా ఉంటారు ?
లక్కరాజు వారూ మీ పెరటితోట విశేషాలు బాగున్నాయి. అంత శ్రద్ధ గానూ పెంచిన పెరటితోట నేను అట్లాంటా లోని (స్వర్గీయ) డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాల రావు గారింట్లో చూసాను. ఏమైనా అమెరికాలో ఉంటున్న భారతీయులకి ఇటువంటి విషయాల్లో ఉత్సాహం బాగా ఉన్నట్లుంది. స్వదేశానికి ఎంతో దూరంలో ఉంటున్నప్పటికీ కొన్ని స్వదేశీ కూరగాయల విత్తనాలు కూడా సంపాదించి పెరట్లో వేసి పెంచటానికి చాలా ఉత్సాహం, ఓర్పు కావాలి. మీ కృషి మెచ్చుకోదగినది.
ReplyDeleteమీరు చికాగో దగ్గర అరోరాలో ఉంటున్నారా? వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరేనా? ఆ గుడికి నేను ఓ మూడు సార్లు వచ్చాను. నేపర్విల్ కూడా వచ్చాను; అక్కడ మా పెదనాన్న గారి మనవడు ఉండేవాడు (ఈ మధ్యన మాడిసన్ కి మారాడు). నేను అమెరికా వాసిని కాను, సందర్శకుడిని మాత్రమే.
మీ బ్లాగ్ ఇంటరెస్టింగ్ గా ఉంది.
విన్నకోట నరసింహా రావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మేము అరోరాలో మా ఇంట్లో 27 ఏళ్ళ బట్టీ ఉంటున్నాము. మీరు ఈ వైపు వస్తే ఒక కామెంట్ వెయ్యండి కలుసుకుందాం.
ReplyDeleteశ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
ReplyDelete``అప్పుడు అర్ధం అవలేదు. అప్పుడే కోసుకువచ్చిన కూరలతో వంట చేస్తే ఆ రుచే వేరు. చెట్టు నుంచి కోయటం అంటే వాటి పోషక రక్షణ నుండి వేరు చెయ్యటం.'' -- అక్షరాలా నిజం. నా అనుభవం కూడా ఇదే.మన తోట, మనం పండించిన కూరగాయలూ; వాటితో వండిన వంట! ఎంతో ఆనందంగా వుంటుంది. మీ తోటపై కల్లుకుట్టకపోయినా, ఈర్ష్యగా మాత్రం వున్నది. ఎందుకంటే, మీకు వుంది, మాకు లేదుకాబట్టీ!!.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవరావు గారూ ఆహ హ అంతే కదండీ మరి మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDelete