Monday, December 19, 2016

129 ఓ బుల్లి కథ 117 ---- 2016 డిసెంబర్ లో అమెరికాఅమెరికాలో డిసెంబర్ అంటే పండగ రోజులు. ప్రతి సంవత్సరం అందరూ ఉత్కంఠతతో ఎదురు చూసే క్రిస్మస్ ఈ నెలలో వస్తుంది. ఇంటి ముంగిళ్లన్నీ లైట్ల తోరణాలతో అలంకరిస్తారు. సామాన్యంగా ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ ఉంటుంది. దానికి కూడా అలంకరణలు చేస్తారు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే క్రిస్మస్ రోజున శాంటాక్లాస్ ఇంట్లోవాళ్లందరికీ ప్రజంట్స్ తెచ్చి క్రిస్మస్ ట్రీ కింద పెడతాడు. క్రిస్మస్ ట్రీకి దీపాలంకరణలు చేస్తే త్వరగా గుర్తించి ట్రీ కింద బహుమతులన్నీపెట్టేసి వెళ్ళిపోతాడు. ట్రీ లేకపోతే శాంటా క్లాస్ రాడు. ప్రజంట్స్ ఉండవు. పిల్లల చిన్నప్పుడు మేమూ క్రిస్మస్ ట్రీ పెట్టేవాళ్ళం. నేను శాంటా క్లాస్ గా, తెలవారు ఝామున లేచి ప్రజంట్లు పెట్టి గంట గలగలా వాయించే వాడిని.

ఈ సమయంలోనే షాపుల వాళ్లకి పండగ. సంవత్సరం అమ్మకాల్లో 40 శాతం ఈ నెలలోనే జరుగుతాయి. సామాన్యంగా ఇళ్ళల్లో అందరూ అందరికీ ప్రజంట్లు ఇచ్చుకుంటారు. సాక్సు బనీనుల దగ్గర నుండీ ఇంటికి వంటికీ కావాలసిన సామాన్లన్నీ ఇప్పుడే కొంటారు. Christmas ముందర అమ్ముడు పోనివన్నీ షాపులవాళ్ళు వస్తువుల ధరలు తగ్గించి after Christmas sale  అని పెడతారు. అప్పుడు చూడాలి లైన్లలో జనం. కొందరు తమకి వచ్చిన ప్రజెంట్ల ని తిరిగి ఇచ్ఛేసి వారికి కావలసినవి తీసుకుంటారు. కొందరు వస్తువులు చవకగా ఉంటాయని కొనుక్కోటానికి వస్తారు. షాపు లన్నీ చాలా రద్దీగా గందరగోళంగా ఉంటాయి.

డిసెంబర్ 21న వింటర్ మొదలవుతుంది. చలికాలం. చెట్లన్నీ ఆకులు రాలి మూగబోయి నట్లుగా ఉంటాయి. సామాన్యంగా ఈ నెలలో స్నో పడుతుంది. స్నో లో నడుచు కుంటూ వెళ్లి క్రిస్మస్ షాపింగ్ చెయ్యటం అనేది అందరికీ ఇష్టం. అందుకనే దీనిని white Christmas  అంటారు. కొన్ని సంవత్సరాలలో  ఈ సమయంలో స్నో పడకపోతే అందరూ డీలా మొహాలతో ఉంటారు. మేము చికాగో దగ్గర ఉంటాము అందుకని స్నో ఎక్కువ. కానీ అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో స్నో పడదు( California, Hawaii etc ). అక్కడివాళ్లు స్నో మిస్ ఆవరనుకోండి. వాళ్లకి white క్రిస్మస్ అంటే ఏమిటో  తెలియదు.

పై ఫోటో మా ఇంటి ముందర తీసినది. మాకు Dec 4, ఆదివారం పొద్దున్ననుండీ సాయంత్రం దాకా స్నో పడుతూనే ఉంది. స్నో చెట్ల కొమ్మల మీద పేరుకు పోయి చూడటానికి అందంగా ఉంటుంది. క్రిందిది మా ఇంటి వెనక ఫోటో. స్నో పడుతుంటే తీశాను అందుకని క్లియర్ గా లేదు.


మా ఇంటి వెనక వేసంకాలంలో ఎల్లా వుండెదో చూడండి.స్నో పడుతున్నప్పుడు చూడటానికి బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్లాలంటేనే గొడవ. కార్ల మీద స్నో పేరుకు పోతుంది. అదంతా తియ్యాలి. ఒక వేళ కారు గరాజ్ లో పెడ్తే  కారు బయటికి తియ్యాలంటే డ్రైవ్ వే మీద స్నో అంతా  తియ్యాలి. ఇప్పుడే స్నో బ్లోయర్లు బయటికి తీసి స్నో తీసేస్తారు. తియ్యలేని నాలాంటివాళ్ళు ఎవర్నన్నా పెట్టుకుంటారు. మా వాడు స్నో పడటం ఆగంగానే వచ్చి  తీసేస్తాడు. అల్లాగే మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద స్నో ని పక్కకు నెట్టి కార్లు వెళ్ళేటట్లు చూస్తారు. లేకపోతే పనులకు వెళ్ళటం కష్టం కదా.

ఈ డిసెంబర్ లో ఇప్పటికి "సైబీరియన్ ఎక్స్ ప్రెస్ " వచ్ఛేసి వెళ్లి పోయింది. "పోలార్ వర్టెక్స్ " రెండో సారి వచ్చింది. ఆ పేర్లు మంచు తుపాన్లకి పెట్టిన పేర్లు. సామాన్యంగా రోజూ వారీ పనులు ఆగవు. రోడ్లు అన్నీ క్లిన్ చేస్తారు. కార్లు నడుస్తూ ఉంటాయి. ఆఫీసులు పనిచేస్తూ ఉంటాయి. స్కూల్ కి పిల్లలు వెళ్తూ ఉంటారు. ప్లేన్లు ఎగురుతూ ఉంటాయి దిగుతూ ఉంటాయి. ఈ నెల నేను మూడు రోజులు ఆసుపత్రిలో కూడా ఉండి వచ్చాను.

ఇవ్వాళ Dec 19, స్నో పడటల్లేదు కానీ బయట ఉష్ణోగ్రత 5 డిగ్రీల F అంటే ఇండియాలో -15C అన్నమాట. నీళ్లు గడ్డకట్టుకునేది 0 డిగ్రీస్ అంటే దానికన్నా ఇంకా తక్కువగా ఉందన్నమాట. ఎంత చల్లగా ఉందో బయట. మా యింట్లో ఇవ్వాళ వేడి నీళ్ళు  రావటల్లేదు. రాత్రి సన్నగా నీళ్ళు వదలటం మరచిపోయాము. పైపులో నీళ్ళు గడ్డకట్టుకు పోయాయల్లే ఉంది. వాటిని బాగు చేయించాలి.

ఇంట్లో నుండి తీసిన కింద ఫోటోలు చూడండి.  బయట ఎండ ఎంత అమాయకత్వంగా కనపడుతోందో.
   
ఇంకో నాలుగు నెలలు ఓపిక పడ్తే మార్చిలో మళ్ళా వసంతకాలం వస్తుంది చెట్లు చిగిర్చి పూలు పూసి అంతా ముచ్చటగా ఉంటుంది. మనిషి ఆశాజీవి.Warm Christmas Greetings to all the readers.

Friday, November 11, 2016

128 ఓ బుల్లి కథ 116 ---- హెర్మన్ హెస్ - సిద్దార్ధ


ఎప్పుడో పిల్లలు చదివి పడేసిన పుస్తకాలని ఇప్పుడు చదవటం కొంచెం చిన్నతనంగా ఉండచ్చు కానీ చదివిన తరువాత అవి ఇచ్చే తృప్తి వేరు. ఇదివరకే ఎందుకు చదవ లేదనిపిస్తుంది. నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడల్లా ఎదో ఒక పుస్తకం చదవటం అవుతోంది. ఈ తడవ చదివిన పుస్తకం "హెర్మన్ హెస్" వ్రాసిన  "సిద్దార్ధ".

హెర్మన్ హెస్ జర్మనీ లో Claw అనే ఊళ్ళో జులై  2, 1877 పుట్టారు. జర్మన్ భాషలో చాలా నవలలు వ్రాశారు. ఆయన నవలలు చాలా భాషలలో అనువాదాలుగా వచ్చాయి. అమెరికాలో "సిద్దార్ధ" ఇంగ్లీష్  అనువాదం స్కూల్ పిల్లలందరూ చదువుతారు. హెర్మన్ హెస్ కి 1946 లో రచయితగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. Aug 9, 1962 లో ఈయన చనిపోయారు.

నోబెల్ ప్రైజ్ వచ్చిందని పుస్తకం చదవలేదు కానీ నవల పేరుని బట్టి "బౌద్ధ సిద్ధాంతాల" గురుంచి తెలుసుకుందామని మొదలెట్టాను. మొదట ఉపోద్గాతం లో హెస్ చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ నుండి పారిపోయాడని చదివాను. అల్లా చదువుకి తిరకాసు పెట్టినవాడు నోబెల్ ప్రైజ్ వచ్ఛే నవలలు ఎల్లా వ్రాశాడబ్బా అని ఆశ్చర్యపోతూ చదివాను.

వ్రాసిన శైలి పటిమ గురించి నేను చెప్పలేను కానీ కధ సూక్ష్మంగా చెబుతాను. కధలో హిందూ తత్వం కనపడితే అది జర్మన్ గా పుట్టి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ సూత్రాలూ (అనువాదాలుగా చదివి ) ఒంట పట్టించుచుకున్నహెర్మన్ హెస్ గొప్పే. జీవితంలో మనకు తారస పడే ప్రతి దానిలోనూ మంచి చెడూ ఉంటుంది. మంచి చూసి సంతోషించే వాళ్ళు ఒకళ్ళు, చెడుని చూసి ఏడ్చే వాళ్ళు ఒకళ్ళు. జీవితంలో మనం నవ్వాలా ఏడవాలా అనేది అంతా మన జీవన దృక్పధం లోనే ఉంది.

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన "సిద్దార్ధ" ఈ నవలలో హీరో. సమాజంలో ఒక క్రమ శిక్షణ కోసం రూపొందించిన వర్ణ వ్యవస్థ లో బాల్యం అంతా గడిపాడు. తన తండ్రి దగ్గరనుండి తెలుసుకోవాల్సిన వన్నీ తెలుసుకున్నాడు. ఇంకా తనకు తెలియనివి చాలా ఉన్నాయని గ్రహించాడు. ఆ గ్రహింపుతో సాగిన జీవిత యాత్రే  "సిద్దార్ధ". సిద్దార్ధ జీవన యానంలో ఏదో ఒక మూల మన జీవన యాత్ర కూడా దోబూచులాడుతూ కనపడుతూ ఉంటుంది.

********************************************************************************

"నేను రేపు అడవుల్లోకి వెళ్ళి సన్యాసుల్లో కలుస్తాను. మీ అనుమతి కావాలి " అన్న సిద్దార్ధుని మాటలకి తండ్రి నిర్ఘాంత పోయి అక్కడనునుండి వెళ్లి పోతాడు. మర్నాడు పొద్దున వచ్చి చూస్తే ఇంకా కొడుకు అల్లాగే అక్కడ నుంచుని ఉంటాడు. ఇంక చేసేది లేక "సరే వెళ్ళు. వెళ్ళే ముందర అమ్మకి కూడా చెప్పి వెళ్ళు" అంటాడు. తండ్రి అనుమతి విన్న తరువాత నెమ్మదిగా కదిలి తల్లికి నమస్కరించి అడవుల్లోకి బయల్దేరాడు సిద్దార్ధ. ఊరి చివర తన బాల్య మిత్రుడు గోవిందుడు కూడా తనతో కలుస్తాడు.

ఇద్దరు మిత్రులూ కొన్ని నెలలలో సన్యాస సంస్కృతికి అలవాటు పడతారు. స్నాన జపాదులు, ఉపోషాలూ, ఉపాసనాలూ వగైరా. వారికి ఒకటే కోరిక, మనస్సు సూన్యం(empty) చేసుకోవాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. కోరికలూ,  రాగ ద్వేషాలూ, సుఖ సంతోషాలూ మనస్సులోకి రాకూడదు. కొంతవరకూ వాటిని సాధించారు కానీ ఇంకా ఏమిటో వెలితి కనపడుతోంది. సమాజంలో బాధలూ భయాలూ కష్టాలూ ఎందుకొస్తున్నాయి ? వీటిని అధికమించే మార్గం లేదా? మరల మరల జన్మించి ఈ బాధలను అనుభవించ వలసిన దేనా? జన్మ రాహిత్యం (నిర్వాణ) పొందే రహశ్య మున్నదా ?

ఈ ప్రశ్నలన్నిటికీ దగ్గరలో బోధిసత్వుడు అనే ఆయన సమాధానం చెబుతున్నాడని విని, ఇద్దరు మిత్రులూ  సన్యాసుల సంపర్కంవదలి అక్కడకి బయల్దేర్తారు. బోధిసత్వుని మాటలు గోవిందునకు నచ్చి తను వారిలో చేరిపోతాడు. సిద్దార్ధ కి మాత్రం ఇంకా తెలియని లోటు ఎదో కనిపించింది. దానికోసం బౌద్ధ ఆశ్రమం వదిలి బయల్దేర్తాడు.

ప్రియ మిత్రుని వదిలి సిద్దార్ధ గమ్యంలేని బాటలో ప్రయాణం మొదలెట్టాడు. మూడేళ్ళ సన్యాసుల సంపర్కంతో నేర్చుకున్న విషయాలు చాలా ఉపకరించాయి. తనకి ఆలోచించే శక్తి ఉన్నది. తనకు కావలసిన వాటి కోసం ఎంతకాలమయినా ఆగ గలడు. అన్న పానాదులు మానివేసి ఎన్ని రోజులయినా గడప గలడు. తనదంటూ ఈ ప్రపంచెంలో ఏదీ లేదాయె. ఎవరన్నా ఇస్తే తింటాడు లేకపోతే లేదు.

వెళ్ళే దోవలో నది అడ్డంగా ఉంది. దాటటానికి పడవ మీద ఎక్కాడు. పడవ నడిపేవాడు ఎదో మాట్లాడు తూనే ఉన్నాడు. తాను నదిఒడ్డున ఒక గుడిసెలో ఉంటాడుట. జల జల పారే నదే తన మిత్రుడుట. ఎప్పుడూ తనతో మాట్లాడుతూ సలహాలు చెబుతూ ఉంటుందిట. తాను సన్యాసిని, తన దగ్గర నదిని దాటించినందుకు ఇవ్వటానికి ఏమీ లేవు అని సిద్దార్ధ అంటే  "మీ పూజల్లో నన్ను గుర్తుంచుకోండి చాలు" అంటాడు పడవవాడు.

గమ్యం లేని ప్రయాణం సాగుతోంది. దారిలో ఒక ఊరి బయట చాకలి బట్టలు ఉతుకుతోంది. ఎందుకో మనస్సు అటు పోయింది. నవయౌవ్వనవతి , బట్టలుతుకుతూ పెల్లుబికే తన  బిగువులు చూపెడుతోంది. ఆకర్షితు డయ్యాడు. సన్యాసిగా నివురుకప్పిన తన కోరికలు కెలికినట్లయ్యింది. దగ్గరకి వెళ్ళాడు. పలకరించి మాటలు కలిపి "సన్యాసులంటే తన కిష్టం" తనతో రమ్మంది. ఎందుకో సిద్దార్ధుని మనస్సు "అటువైపు  వెళ్లొద్దు" అని చెబుతోంది. ఆకర్షణ వదలి తన గమ్యం కొన సాగించాడు.

కొద్ధి దూరంలో ఇంకోవూరి పొలిమేర్లలోకి వచ్చాడు. పల్లకీలో ఎవరో వస్తున్నారు. పక్కకు తొలిగి చూశాడు. పల్లకీలో చక్కటి సుందరాంగి. ఎందుకో ఆకర్షితు డయ్యాడు. కనుక్కుంటే తెలిసింది ఆ నెరజాణ ఆ ఊరి వేశ్య,పేరు కమల అని. ఊరి బయట తన తోటకి వెళ్తోంది అని. ఆమెని పరిచయం చేసుకోవాలని అనిపించింది. మర్నాడు అదే సమయానికి అక్కడకి చేరుకున్నాడు. పరివార మంతా వెళ్ళిపోయినతరువాత చివరి సేవకుడితో తాను అమ్మగారికోసం వచ్చాను వెళ్ళి చెప్పి రమ్మన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి సిద్దార్దని లోపలి తీసుకు వెళ్ళాడు.

ఎందుకు వచ్చావు అంది ఆవిడ. మీ దగ్గర "ప్రేమ" గురించి తెలుసుకోవాలని వచ్చాను అంటాడు. సరే నీ దగ్గర ఏముంది? అని అడుగుతుంది . నేను సన్యాసిని నా దగ్గర ఏమీ లేదు అంటాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సెంటు పూసుకుని మంచి దుస్తులతో జేబులో డబ్బుతో వస్తారు. నువ్వేమిటీ ఇలా వచ్చావు?  ఇంకేమన్నా చేయగలవా? అని అడుగుతుంది. తను ఎన్ని రోజులయినా ఉపవాసము ఉండగలనని చెబుతాడు (I can think. I can wait. I can fast). దానికి ఆవిడ నవ్వి ఇంకేమయిన చెప్పమంటుంది. అది అంత గొప్పగా లేదని తెలుసుకొని వెంటనే తనకు గేయాలు వ్రాయటం కూడా వచ్చు అని చెబుతాడు. అయితే నా మీద పద్యం చెప్పు అంటుంది ఆవిడ. పద్యం చెబుతాను గేయాని కొక ముద్దిస్తావా అని అడుగుతాడు. సరే అంటుంది ఆవిడ.

"ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి కమలనయన. దేముడిని కొలవటం కన్నా ఆ కమలని కొలవటం ఆహ్లదకరం" అని చెబుతాడు . ఆ వేశ్య గేయానికి ఆనందించి కౌగలించి ముద్దిస్తుంది. నా దగ్గరకి వచ్చేవాళ్ళు డబ్బులతో రావాలి, నీకు చదవటం వ్రాయటం వచ్చంటున్నావు కదా నీకొక ఉపాయం చెబుతాను రేపొచ్చి కలవ మంటుంది.

మర్నాడు సిద్దార్ధ కమలను కలుసుకున్నాడు. ఆవిడ "కామస్వామి" అనే ఆ ఊళ్ళో పెద్ద వ్యాపారిని కలుసుకోమని చెబుతుంది. "నేను నీ గురించి అంతా చెప్పాను. ఆయన దగ్గరనుండి వ్యాపార రహస్యాలు తెలుసుకుని పెద్ద వ్యాపారి వై డబ్బులు సంపాయించి నా దగ్గరకురా" అని చెబుతుంది.

మర్నాడు కామస్వామిని కలుసుకుంటాడు. తన ఇంట్లోనే ఉండి వ్యాపార రహస్యాలు తెలుసుకోమంటాడు. సిద్దార్ధ కామస్వామికి చేదోడు వాదోడుగా అక్కడే ఉంటూ కామస్వామికి వ్యాపారంలో భాగస్తుడై ధనవంతు డవుతాడు. వీలున్నప్పుడల్లా కమలతో గడుపుతూనే ఉన్నాడు. ఏళ్ళు గడచి పోతున్నాయి. కలసి వచ్చిన డబ్బుతో భవంతులూ తోటలూ కొని కోమలాంగులతో  విలాసవంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు.

ఒక రోజు సాయంత్రం ఊరిబయట ఉన్న తన తోటలో ఒక చెట్టు క్రింద సేద తీరటానికి కూర్చున్నాడు. ఏవేవో అంతులేని ఆలోచనలు వస్తున్నాయి. తాను ఏమనుకొని ఇంటినుండి బయటకు వచ్చాడు, విలాస వంతుడిగా ఇప్పుడేమి చేస్తున్నాడు. వీటికి ఏమన్నా అర్ధముందా? దీనికి అంతం అంటూ ఉన్నదా? చీకటి పడింది. తన జీవితానికి అర్థమేమిటో అర్ధంకాలా? తానే ఈ విలాస జీవితానికి స్వస్థి చెప్పాలి అని నిర్ణయించు కున్నాడు. కట్టు బట్టలతో తన తోట నుండి బయటపడ్డాడు. అన్నీ వదిలేసి చీకటిలో గమ్యంలేని గమ్యానికి నడక మొదలెట్టాడు.

దారిలో నది అడ్డంగా ప్రవహిస్తోంది. అక్కడవున్న పడవ వాడిని అవతల వడ్డుకి తీసుకు వెళ్ళమన్నాడు. మధ్యదారిలో ఇవ్వటానికి తన దగ్గర డబ్బులేమీ లేవు అన్నాడు. దానికి పడవవాడు ఆశ్చర్య పోతాడు. అంత ఖరీదయిన బట్టలు కట్టుకున్న వాడివి నీ దగ్గర డబ్బులు లేవంటా వేమిటి? అన్నాడు. సిద్దార్ధ సంగతంతా చెప్పి నన్ను గుర్తు పట్టావా ? కొన్ని సంవత్సరాల క్రిందట నీ గుడిసెలో ఆశ్రయ మిచ్చి ఈ నదిని దాటించావు అన్నాడు. పడవవాడు గుర్తు పట్టి ఇంకెక్కడికి వెళ్తావు, నా భార్య చనిపోయింది నాతో పాటు నా గుడిసెలో ఉండు అంటాడు. అనుకోని దాతృత్వానికి సంతోషించి నీతో వుండి పోతానన్నాడు.

పడవ వాని పేరు వాసుదేవుడు. వసుదేవుడి నుండి పడవలు బాగు చెయ్యటం. వాటిని నడిపే మెళుకువలు నేర్చు కున్నాడు. తోటలో తినటానికి ఆహారాలు పండించటం నేర్చుకున్నాడు. ఇద్దరూ పడవ నడిపే వాళ్ళు. బాటసారు లందరికీ వారితో నది ఎట్లా మాట్లాడుతుందో, తమకి ఎట్లా సూచనలిస్తుందో. కష్ట సుఖాల్లో సలహాలు ఎల్లా ఇస్తుందో చెప్పే వాళ్ళు. సంవత్సరాలు గడిచి పోతున్నాయి ఇద్దరు మిత్రులూ ముసలి వాళ్ళవుతున్నారు.

కొన్నిరోజులనుండీ నది దాటే జనం ఎక్కువవడం గమనించారు. ఆరా తీస్తే దగ్గర వనంలో బోధిసత్వుడు చనిపోయే చివరి దశలో ఉన్నాడని తెలిసి, చివరి చూపుకోసం జనం వెళ్తున్నారని తెలిసింది. ఒక రోజున నది వడ్డున తల్లికి పాముకుట్టిందని పిల్లవాడు కేక లేస్తుంటే, వాళ్ళని వాసుదేవుడు ఇంటికి తీసుకు వచ్చి నాటు వైద్యం చేస్తాడు. అప్పుడే వచ్చిన సిద్దార్ధ, ఆ తల్లి ఒకప్పుడు తనను చేరదీసి దోవ చూపిన కమల అని గుర్తిస్తాడు. తన ఆస్తి అంతా  బౌద్ధ సన్యాసులకు ఇచ్చి, తాను చివరి దశలో ఉన్న బోధిసత్వుని చూడటానికి వెళ్తున్నట్లు ఆమె చెబుతుంది. తనతో ఉన్న పిల్లాడు నీ కొడుకు అని కూడా సిద్దార్ధ కు చెప్పి కమల చనిపోతుంది.

హఠాత్తుగా వచ్చిన  పరిణామాలతో సిద్దార్ధ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. తండ్రిగా తాను ఏమిచేయాలో అర్ధం కాదు. ఇంట్లో పనులకు చేదోడు వాదోడుగా ఉంటాడని పిల్లవాణ్ణి పనులు చెయ్య మంటే మోండికెత్తి కూర్చుంటున్నాడు తప్ప చెయ్యటల్లేదు.సేవకులతో సర్వ సుఖాలకి అలవాటుపడిన తనయుడి చేత ఇంటి పనులు చేయించటం కష్ట సాధ్య మని తెలుసుకున్నాడు. ఒక రోజు పిల్లవాడు ఇంట్లో ఉన్న సొమ్ము తీసుకుని మాయమవుతాడు. వెదుకుదామని అనుకుంటాడు కానీ తాను ఒకప్పుడు చేసిన పని కూడా అదే కదా అని మానుకుంటాడు. వాసుదేవుడు కూడా తన సమయం దగ్గర పడిందని సిద్దార్దని వదిలి అడవుల్లోకి వెళ్ళి పోతాడు.

ఇద్దరు నావికులు బాటసారులతో వేదాంతం చెబుతున్నారనే వదంతి, ఆనోటా ఆనోటా పాకి, కమల తోటలో ఉన్న బౌద్ధ సన్యాసులకు తెలుస్తుంది. అక్కడే ఉన్న గోవిందుడు సంగతి ఏమిటో తెలుసు కుందామని వస్తాడు. మొదట గుర్తు పట్టలేక పోయినా, ఆ నావికుడు బాల్య మిత్రుడు సిద్దార్ధ అని తెలుసుకుంటాడు. మాటా మంచీ అయినా తరువాత  తన ఇన్ని సంవత్సరాల జీవన పయనం లో తెలుసుకున్న జీవిత సత్యాలగురించి సిద్దార్దని చెప్పమని అడుగుతాడు.

ఇద్దరు మిత్రులూ జీవిత సత్యాల గురించి చర్చించు కుంటారు. చాలా వరకు గోవిందుడు వినటమే. చర్చ చివరి దశలో , నిర్యాణము చెందిన తన గురువు "గౌతమ బుద్ధ" వర్చస్సు, సిద్దార్ధలో చూస్తాడు. తన్మయుడై సిద్దార్థునికి ప్రమాణాలు అర్పిస్తాడు. తరువాత మిత్రులు విడిపోటంతో నవల ముగుస్తుంది.

నాకు ఈ ఇద్దరి మిత్రుల సంభాషణ బాగా నచ్చింది. వాటిలో  కొన్ని :

1. "There were a number of thoughts, but it would be hard for me to communicate them to you. Listen, my Govinda, this is one of my thoughts that I have found: Wisdom cannot be
communicated. Wisdom that a wise man tries to communicate always sounds foolish."

2. I am telling you what I have found. Knowledge can be communicated, but not wisdom. We can find it, we can live it, we can be carried by it, we can work wonders with it, but we cannot utter it or teach it.

3. "This here,"he said playfully, "is a stone, and perhaps at a certain time it will be soil and will, from soil, become a plant, or an animal or a human being. But in the cycle of transmutations it can also become a man and mind. This stone is a stone, it is also an animal, it also god, it is also Buddha, I love and honor it not because it could become this or that someday, but because it is everything long since and always.

4. Words are not good for secret meaning, everything instantly becomes a bit different when we utter it, a bit adulterated, a bit foolish - yes, and that too is very good and appeals to me, I also very much agree that one man's treasure and wisdom always sound like foolishness to another.

*********************************************************************************

అమెరికాలో హైస్కూల్లో బహుశ పిల్లలకి మంచి పుస్తకాలని పరిచయం చెయ్యటం కోసం దీనిని చదవమని పెట్టివుంటారు. నవలలో ప్రతి చోటా జీవిత వేదాంతం కనపడుతూ ఉంటుంది. హైస్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు గమనించ లేక పోవచ్చు గానీ మధ్య వయసులో చదివితే ఎదో ఒక భాగంలో ఎదో ఒక కోణంలో పాఠకుడి కి తన జీవిత చిత్రం కనపడుతుంది. ఇంకొంచెం విశ్లేషణతో చదివితే మనం నిమిత్తమాత్రులమే ననీ జీవితం ఒక గలగల పారే నదిలా సంతతం ప్రవహిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటుందని తెలుసుకుంటాము. మనం ఓపికతో అది చెప్పేవి వినటానికి ప్రయత్నించాలి. అంతే.

మీరు ఈ పుస్తకం చదవాలంటే ఈ క్రింద లింక్ ద్వారా చదవచ్ఛు :

సిద్దార్ధ పుస్తకం

Saturday, October 29, 2016

127 ఓ బుల్లి కథ 115 ---- అమెరికాలో భార్గవి రైలు ప్రయాణంఎల్లాగూ న్యూయార్క్ దాకా వచ్చాము. ఎప్పుడూ కుదరటల్లేదు. ఈసారయినా ఇషికాను చూడాలి పార్వతిని చూడాలి తప్పదు అనుకుంది భార్గవి. వీకెండ్ ఇషాన్ బర్తడే ట తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళు నాలుగు వందల మైళ్ళ దూరంలో రిచ్మండ్ అనే ఊళ్ళో ఉంటారు. డ్రైవింగ్ కుదరదు. ప్లేన్ లో వెళ్ళాలంటే మధ్యలో ఆగి ఇంకో ప్లేన్ ఎక్కాలి ట్రైన్ అయితే ఎక్కి కూర్చుంటే అక్కడ దిగొచ్ఛు. దానికి తోడు సీనియర్ డిస్కౌంట్ తో ఖరీదు కూడా చాలా తక్కువ. ఆరు గంటల్లో వెళ్ళి పోవచ్ఛు. అందుకని ట్రైన్ లో వెళదామని సెటిల్ అయ్యింది. నలభై ఏళ్ళు అమెరికాలో ఉన్నాచేసిన రైలు ప్రయాణాల్ని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అవి చికాగో నుండి పిట్స్ బర్గ్ , చికాగో నుండి యాన్ ఆర్బర్, చికాగో నుండి చాం పైన్.  అమెరికాలో రైలు ప్రయాణీకులు తగ్గటంతో, రైలు రోడ్లకి  రాబడి లేక దివాలా ఎత్తితే అమెరికా గవర్నమెంట్ వాటినన్నిటినీ కలిపి AMTRAK  అనే పేరుతో రైళ్ళు నడుపుతోంది.

ట్రైన్ పొద్దున పదకొండున్నరకి. భోజనం చేసి బయల్దేరటం కుదరదు. పక్కన నసపెట్టే మొగుడికి భోజనానికి ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి. జిప్ లాక్ లో మిగిలిన అరటికాయ కూర తో పులిహార కలిపి మూటకట్టుకుంది.

న్యూయార్క్ "పెన్ స్టేషన్" నుండి అమెరికాలో నలుమూలలకి AMTRAK  ట్రైన్ లు వెళ్తాయి. మేముండే జెర్సీ సిటీ నుండి పెన్ ట్రైన్ స్టేషన్( మెన్హాటన్)  కి ఆరు మైళ్ళ దూరం. కానీ ఊబర్ టాక్సీ లో గంట పట్టింది. సామాను "చెక్ ఇన్" చేద్దామని వెళ్తే, రిచ్మండ్  ఊరికి చెక్ ఇన్ సౌకర్యం లేదన్నారు. సామాను రైల్లో పెట్టటానికి సహాయం కావాలి. ఇక్కడ మన రైల్వే కూలీల్లాగా, ప్రయాణీకుల
సౌకర్యం కోసం  "రెడ్ కాప్" సర్వీస్ అని ఒకటుంది. వీళ్ళు "పెన్ స్టేషన్" లో మూడు షిఫ్టుల తో  24 గంటలూ పని చేస్తారు. ఒక్కొక్క షిఫ్టులో వంద మంది ఉంటారుట. వాళ్ళ సహాయంతో అందరికన్నా ముందర ట్రైన్ ఎక్కాము. దిగేటప్పుడు సహాయం చెయ్యమని కూడా ట్రైన్ కండక్టర్ కి చెప్పి వెళ్ళాడు. మనకు సహాయం చేసిన వాళ్లందరికీ టిప్ ఇవ్వటం అమెరికాలో మామూలు. మాకు ఒక ఒక పెద్ద సూట్ కేస్ అందుకని ఒక అయిదు డాలర్లు టిప్ ఇచ్చాము.జనమంతా  రావటం మొదలెట్టారు. సీట్లన్నీ నిండిపోయాయి. మిగిలిపోయిన సీట్లకోసం జనం వెతుక్కుంటూ  ట్రైన్ అంతా తిరుగుతూ ఉన్నారు. ఈ రైలు లో ఏడు పెట్టెలున్నాయి. ఒక మూలనుండి ఇంకొక మూలకి  వెళ్ళ వచ్చు. బయట మబ్బుగా ఉంది. ట్రైన్ 120 మైళ్ళ వేగంతో పరిగెడు తోంది. చెట్లు పుట్టలు నదులు వెనకపడి పోతున్నాయి.అక్టోబర్ అవటం మూలాన చెట్లు రంగు రంగుల ఆకులతో
పరుగెడుతున్నాయి. లంచ్ టైం అయ్యింది అందరూ వాళ్ళు తెచ్చుకున్నవి తింటున్నారు. మేము పులిహార తిని  కాంటీన్ నుండి కాఫీ తెచ్చు కున్నాము. ఇటువంటి ట్రైన్ లన్నిట్లో ఒక చిన్న కాఫిటీరియా కూడా  ఉంటుంది కానీ వాటిల్లో అమ్మేవి కొంచెం ఖారీ దెక్కువ. ట్రైన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది దానితో ట్రైన్ ఏ ఊళ్ళ మీదగా పోతోందో ఎంత స్పీడ్ తో పోతోందో చూడవచ్చు. ఐపాడ్ ద్వారా సినిమాలు చూద్దామని ప్రయత్నించాము గానీ చూడ బుద్ది పుట్టలేదు. బయటికి చూస్తూ కూర్చున్నాము.

రైలు మధ్య మధ్య స్టేషన్ల లో ఆగుతోంది . జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఈ రైల్లో సీట్ రిజర్వేషన్ లేక పోవటం మూలంగా రైలు అంతా వెతుకుతూ ఎక్కడ ఖాళీగా సీటు కనపడితే అక్కడ కూర్చోవటమే .

ఇంతలో వాషింగ్టన్ సిటీ స్టాప్ వచ్చింది. వాషింగ్టన్ అమెరికా రాజధాని. చాలా మంది జనం దిగిపోయారు. ఇక్కడ చాలా సేపు రైలు ఆగింది. బయటకి దిగవచ్చు అన్నారు. మేము దిగలేదు. ఇంత వరకూ రైలు ఎలక్ట్రిక్ ఇంజన్ తో వచ్చింది. ఇక్కడ నుండీ డీజిల్ ఇంజన్ తో వెళ్తుందిట. ఇది మన రైళ్ళకి ఉండే వాటరింగ్ స్టాప్ లాంటిది, సామర్లకోట భోజన శాల సాంబార్ పాకెట్లు తైరు సాదం పాకెట్లు గుర్తుకు వచ్చాయి.

రైలు చివరికి కదిలింది. నెమ్మదిగా పోతోంది. చూస్తే స్పీడ్ 70 మైళ్ళు. సగానికి సగం తగ్గిపోయి నట్లుంది. రైలు మధ్య మధ్య ఊళ్ళల్లో ఆగుతోంది. వాషింగ్టన్ లో ఎక్కిన వాళ్ళందరూ దిగిపోతున్నారు. ఇళ్ళకి పోతున్నారల్లే ఉంది ఉషారుగా నుంచుని మాట్లాడు కుంటున్నారు .వాషింగ్టన్ లో ఇళ్ళ ఖరీదెక్కువ అందుకని అక్కడ పని చేసే వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు.

సాయంత్రం ఆరు గంటలవుతోంది. కండక్టర్ వచ్చి మీ ఊరు రాబోతోంది మీకేమి సహాయం కావాలని అడిగింది. సామాను సంగతి చెప్పాము. మమ్మల్ని ముందరికి తీసుకువెళ్ళి మమ్మల్ని దిగమని సామాను దింపి స్టేషన్ దాకా తీసుకు వచ్చింది. మేము టిప్ ఇచ్చామనుకోండీ. పిల్లలు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. న్యూయార్క్ నుండి రిచ్మండ్ ట్రిప్ సుఖంగా గడిచిపోయింది.

Friday, October 7, 2016

126 ఓ బుల్లి కథ 114 --- పక్కాలా నిలాబాడి ......


నాకు చిన్నప్పట్నుంచీ తెనాలి అంటే చాలా ఇష్టం. నా మొదటి హెయిర్ కట్ అక్కడే చేయించు కున్నాను. నా జీవితంలో మొదటి సినీమా "స్వర్గ సీమ" అక్కడే చూశాను. మొట్టమొదట హోటలికి గూడా అక్కడే వెళ్ళాను. దానికి తోడు అత్తయ్య గారిల్లు  రాముడన్నయ్య ఇల్లు అక్కడే ఉన్నాయి. మేము తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో "కఠెవరం" లో ఉండేవాళ్ళం. తరువాత ఊళ్ళు మారటం అయింది ఎక్కువగా వెళ్ళటా నికి కుదరలేదు.

ఆ తరువాత చాలా ఏళ్ళకి  తెనాలి అత్తయ్య గారింట్లో జయమ్మ పెళ్ళి అంటేను వెళ్ళాము. ఆ రోజు పెళ్ళి అవంగానే పెళ్ళికూతుర్ని అత్తారింటికి పంపారు. తీరిగ్గా పొద్దున్నే లేచి అందరం కాఫీ తాగి హాల్లో కూర్చున్నాము. ఎవరింట్లో వాళ్ళు పెళ్ళి చేసుకునే రోజులవి. ఇంటి ముందర పందిరి ఇంట్లో సందడి ఉండే రోజులు. ఏమిటో పాత జ్ఞాపకాలు బయటకు వస్తున్నాయి.

మా అత్తయ్య గారింట్లో ఇంటి వెనుక పెరడు కన్నా ఇంటి ముందర చాలా ఖాళీ స్థలం. నేను వచ్చినప్పుడల్లా, అత్త య్య పిల్లలతో అక్కడ తొక్కుడు బిళ్ళ నుండీ చెడుగుడు దాకా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం. సాయంత్రం దగ్గరలో ఉన్న చినరావూరు పార్క్ కి వెళ్లే వాళ్ళం.

అత్తయ్య  అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను అమెరికా వెళ్ళి పెద్ద కారు కొని అత్తయ్యని దాన్లో కూర్చోపెట్టి తిప్పాలని చిన్నప్పుడు అనుకునే వాణ్ని. అత్తయ్యది కొంచెం స్థూలకాయం పెద్ద కారు కావాలి అవి అమెరికాలో నే దొరుకుతాయని విన్నాను. అందుకని అమెరికా తప్పకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అమెరికా వెళ్ళాను పెద్ద కారు కొన్నాను కానీ అత్తయ్యని దాన్లో తిప్పలేక పోయాను. అప్పటికే ఆవిడ మన ప్రపంచం నుండి వెళ్ళి పోయింది.

అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను గదా. ఆవిడకి కూడా నేనంటే చాలా ఇష్టం. తమ్ముడు శీనయ్య కొడుకుని కదా. తన తమ్ముడికి పెద్ద కూతర్ని ఇచ్చి పెళ్లి చేసి అల్లుడుగా చేసుకుందామని అనుకుందని అందరూ అంటారు. కానీ మా నాన్నకి అక్కయ్య కూతుర్ని చేసుకోవటం ఇష్టం లేదుట. అందుకని ఆ పెళ్ళి జరగలేదు.

నేను వాళ్ళింటికి వెళ్తే ఆవిడ పెరుగుమీద మీగడ, ఆవిడ పిల్లలకు వెయ్యకుండా నాకు వేసేది. వాళ్ళింట్లో అందరూ నన్ను "క్రిష్ణా " అని పిలిచే వారు. చద్దెన్నంలో అత్తయ్య దోసకాయ పప్పు కలుపుకుని తింటే నిజంగా స్వర్గమే. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇటువంటివి. ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దావిడ పేరు జగదాంబ. తర్వాత రమ, జయమ్మా. వాళ్ళని పెళ్లి చేసుకుందా మనుకున్నా గానీ వాళ్ళు నా కన్నా కొంచెం పెద్ద వాళ్ళు. నేను హైస్కూల్ పాస్ అయ్యే టప్పటికే  అందరికీ  పెళ్ళిళ్ళు అయిపోయాయి.

జగదాంబ వదిన అన్నా నాకు చాలా ఇష్టం . మేము రేపల్లి లో ఉన్నప్పుడు వాళ్ళు బేతపూడి లో ఉండే వారు. నేను సాయంత్రం సైకల్ వేసుకుని రేపల్లి నుండి వెళ్ళేవాడిని. వదినకి చిన్నప్పుడే పెళ్ళి కోసమని వంటా సంగీతం నేర్పారు. తాను నేర్చుకున్నవి వదిలిపెట్టకుండా పిల్లలకి కూడా నేర్పింది. అంతే కాదు ఆవిడకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. అందుకనే వాళ్ళ మామగారు పోయిన తరువాత ఆయన నిత్యార్చన చేసే విగ్రహాలు తీసుకుని రోజూ మడిగట్టుకుని నిత్యపూజలు చేసేది.

జగదాంబ వదినకు అప్పటికి ముగ్గురు అమ్మాయిలు, ప్రమీల, రాజాయ్, వసంత. జగదాంబ వదిన సంగీతం నేర్చుకుంది అని చెప్పాగదా. చక్కటి సన్నటి కంఠం కూడా. బాగా పాడుతుంది. అదే పిల్లలకి కూడా వచ్చింది. అసలు ఇంటి పేరులో "మంగళ" ఉంటే వారు సంగీత కళా నిధులు అవుతారు అనుకుంటాను. వాళ్ళింటి పేరు మంగళగిరి. ఇండియా వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి టేపు రికార్డర్ తీసుకు వెళ్ళేవాణ్ణి. రోజూ భోజనాలు చేసిన తర్వాత సంగీత విభావరి ఉండేది. అందరూ కలిసి పాడేవారు.

లలిత కళలు నేర్చుకునే వాళ్ళు రెండు రకాలు. నేర్చుకున్న కళల్ని ప్రదర్శించి ఇంకొకళ్ళని ఆనంద పరిచే వాళ్ళు, ఆ కళలని గుప్తంగా భద్రంగా దాచుకునే వాళ్ళు. మొదటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం.

వదినా పిల్లలూ మొదటి రకం. మొహమాటం లేకుండా చెబుతున్నాను నేను కూడా అంతే. నేను నేర్చుకున్న కళల్ని వద్దు బాబోయ్ అనే దాకా ప్రదర్శిస్తూ ఉంటాను. అంత దాకా రాదు అనుకోండి, ముందరే మా ఆవిడ వార్ణింగ్ సిగ్నల్ ఇస్తుంది  "ఇంక చాలు ఆపెయ్యండి" అని.

నాకు తెలుసు జగదాంబ వదిన తప్పకుండా పాట ఒకటి మొదలెడుతుందని, అనుకున్నట్లు గానే వదిన త్యాగరాయ కీర్తన అందుకుంది.

                     "పక్కాలా  నిలాబాడి  గొలిచే  ముచ్చటా
                      బాగా  తెల్పరాదా"

అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆ కంఠం వింటే అంతే మరి. పల్లవి పాడుతూ పిల్లల్ని అందుకోమని సైగ చేసింది.

ప్రమీల అనుపల్లవి అందుకుంది

                      "చుక్కాలా  రాయాని  గేరూ మోముగల
                       సుదతీ  సీతమ్మ సౌమీత్రీ  శ్రీరాముని  కిరు (పక్కాలా )"

తర్వాత చరణం రాజాయ్ అందుకుంది

                      "తనువూచే  వందనా  మొనరించు  చున్నారా
                       చనువున  నామ కీర్తనా సేయు చున్నారా"

తర్వాత తన చక్కటి కంఠం తో వసంత పాటని పూర్తి చేసింది

                       "మనసూ నా  దలచి మై  మరచి యున్నారా
                        నెనరుంచి  త్యాగరాజునితో  హరి హరి  మీరిరు (పక్కాలా )"

పాట చివరికి వచ్ఛే సరికి అందరి కంఠాలు కలిశాయి. ఆ అనుభూతిని చెప్పలేం. అది ఒక సిమ్ ఫొనీ.

మీకోసం త్యాగరాజు వ్రాసిన ఈ పాటకి అర్ధం, ఖరహరప్రియ రాగంలో  "చారులతా మణి" చక్కగా పాడిన ఆ కీర్తన, క్రింద ఇస్తున్నాను. విని ఆనందించండి.

పాటకి అర్ధం:
చంద్రుని వంటి మోము గల సీతమ్మా,
సుమిత్రకుమారుడివైన నీవు లక్ష్మణ,
శ్రీ రాముని కిరుపక్కలా నిలబడి ఏమని  కొలుస్తున్నారయ్యా ఆయన్ని?
ఎంత ముచ్చటగా ఉన్నారు మీరు
ఎలా  ఆరాధిస్తున్నా రాయన్ని
ఆయన నామ కీర్తన చేస్తూ  మైమరచి తన్మయత్వంతో  పరవశించి పోతున్నారా?
దయయుంచి ఆవిశేషాలన్నీ ఈ  త్యాగరాజుకి  చెప్పరా?


పక్కాలా  నిలబడి - చారులతా మణి


Sunday, September 25, 2016

125 ఓ బుల్లి కథ 113--- మా పెరటి తోట - 2016

ఈ నెలతో మాకు వేసవి కాలం అయిపోయి "Fall" (ఆకురాలు కాలం ) మొదలయింది. అమెరికాలో మేము ఉండే ప్రాంతంలో (Chicago దగ్గర ) కాల మార్పిడి స్పష్టంగా కనపడుతుంది. వసంత కాలంతో(మార్చి నెల) చిగిర్చిన చెట్లు, ఫాల్ లో ఆకులన్నీ రాల్చేసి మోడు లవుతాయి. డిసెంబర్ నుంచీ మార్చి దాకా మంచు తుఫానులూ, చలి. మాకు పెరట్లో కూరగాయ మొక్కలు వేసుకుని, పండిన కూరలు వండుకుని తిని ఆనందించే భాగ్యం సంవత్సరానికి ఆరు నెలలు (ఏప్రిల్  - సెప్టెంబర్ ) మాత్రమే. ప్రతీ సంవత్సరం "ఇక్కడ ఇన్నేళ్ళు ఎల్లా ఉన్నాము" అనిపిస్తూ వుంటుంది .

పై ఫోటో వరలక్ష్మీ వ్రతం రోజున మా పెరట్లో అతిథులతో తీసిన ఫోటో. కొన్ని సంవత్సరాల బట్టీ,  వరసగా  పెరట్లో తోట వేస్తున్నాము. ప్రతి సంవత్సరం కలుపు తీసి మొక్కలు నాటడం కొంచెం కష్టంగా ఉంటోంది. అందుకని ఈ సంవత్సరం ఒక electric నాగలి (cultivator ) కొన్నాము. రెండు మూడు సార్లు మట్టిని తిరగ తీశాము. అన్ని సార్లూ నేను చెయ్యలేదు. నామీద కోపమువఛ్చి మా ఇంటావిడ కూడా నాగలి పట్టింది. ఏ మొక్కలు ఎక్కడ నాటాలి అనే దాని మీద కూడా మాకు అభిప్రాయ భేదాలే. మొత్తం మీద కొట్టుకుంటూ తిట్టుకుంటూ పాదులు వేశాము, ఎలాగయితేనేం చివరికి  మొక్కలు బతికి బట్టకట్టాయి. నేను చెప్పుకో కూడదు గానీ వాటి సంరక్షణ అంతా నాదే. దాదాపు వాటికి రోజూ నీళ్ళు నేనే పోసే వాడిని. నిజం చెప్పొద్దూ అప్పుడప్పుడూ మా ఆవిడ కూడా పోసేదనుకోండీ , మా పక్కింటి ఆవిడ కూడా మేము New York వెళ్ళినప్పుడు మొక్కలకి నీళ్ళు పోసింది.

ఈ సంవత్సరం పెరటితోటలో పండిన వాటితో వంట చేసుకోవటం, తోటకూర తో ప్రారంభమయ్యింది. కొన్నేళ్ళ క్రిందట తోటకూర వేస్తే ప్రతీ సంవత్సరం గింజలు నాటకుండానే వస్తోంది. దాదాపు కొన్ని వారాలు తోటకూర పప్పు, తోటకూర కూర, తోటకూర పులుసు కూర.

ఈ సంవత్సరం beefsteak tomato మొక్కలు వేశాము. చాలా బాగా వచ్చాయి. పచ్చి టొమాటోల తోటి (ఉల్లితో కలిపి) కూర, పప్పు, పులుసూ తనివి తీరా చేసుకుని తిన్నాము. పచ్చి టొమాటోల తోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చి టొమాటోలు సామాన్యం గా దొరకవు. దొరికినప్పుడు చాలా ఖరీదు. మేము తినటమే కాదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్లకి కూడా ఇచ్చాము. ఈ సంవత్సరం pole beans (చిక్కుడు) వేశాము. చాలా బాగా వచ్చాయి. నేను ఈనెలు తీసి ముక్కలు చేసి చాలా సార్లు కూర కూడా చేశాను.

ద్రోణంరాజు రామకృష్ణ గారు వాళ్ళ పెరట్లో స్థలం లేదని వంకాయ, బెండకాయ మొక్కలు ఇచ్చారు. ప్రతీ సంవత్సరం ఆయన పెరట్లో, ఆయన పిల్లలకూ తనకూ కూరగాయలు పండిస్తారు. ఆయనదంతా హైటెక్. మొక్కలకి నీళ్లు పోయటం వగైరా అంతా ఎలక్ట్రానిక్ సెన్సార్స్. ద్రోణంరాజు గారి భాగ్యమా అని పండిన వంకాయలతో చిక్కుడు కలిపి కూర చేసుకున్నాము. బ్రహ్మాడం. చిక్కుడూ బంగాళాదుంప కూర కూడా బాగుంటుంది.

ఆనపకాయ వేశాము. ఎక్కువ రాలేదు. అల్లాగే సొరకాయ విత్త నాలు చాలా లేటుగా దొరికితే వేశాము. అవి కూడా రాలేదు. ఎక్కువ మొక్కలు వేశాము. మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే రావల్లే ఉంది. మా ఇంటిదగ్గర ఒక నర్సరీ కి వెళ్తే దోసకాయ లాంటి విత్థనాలు కనపడ్డాయి. వాటి పేరు cucumber lemon . అవి వేశాము. చాలా కాయలు వచ్చాయి. దోసకాయలు లాగానే ఉన్నాయి కానీ అవి చివరికి దోసకాయ లాగా గుండ్రంగా ఉండే కీరా దోసకాయ. చెక్కు మాత్రం దోసకాయ పసుపు రంగు. వాటితో పప్పు,  పులుసూ బాగా వచ్చా యి. పక్క బొమ్మలో టొమాటోల పక్కన ఉన్నాయి చూడండి.

ఈ సంవత్సరం బీరకాయలు చాలా వచ్చాయి. బీరకాయ పప్పు, కూర, పై తొక్కు తో పచ్చడి. మొదటి తడవ బీరకాయ చెక్కుని ఎండబెట్టి పొడి చేశాను (కరివేపాకు పొడి లాగా). మొదటి తడవే బాగా వచ్చింది (నా ఉద్దేశంలో). ఈ వేసవిలో  చాలా రోజులు పథ్యం తిండి. జుకీనీ వేశాం, మొక్క చాలా పెద్దదయింది కానీ ఒక కాయ కాసి ఎండిపోయింది.

ఈ నెలతో ఈ సంవత్సరానికి  పెరటి తోట అయిపోయినట్లే. వచ్చే వారం రాత్రి ఉష్ణోగ్రత 50F (10C)  డిగ్రీలు అవుతుందంటున్నారు. ఇక మొక్కలన్నీ వాడిపోటం  మొదలెడ తాయి. తీగెలన్నీ తెంపి లాన్  బాగ్ లో పెట్టి బయట పెడితే గార్బేజ్ వాళ్ళు తీసుకు వెళ్తారు.

వచ్చే సంవత్సరం వేసే మొక్కల లిస్ట్ తయారు చేసుకున్నాను. తోటకూర ఎల్లాగూ వస్తుంది. beefsteak or heirloom tomatoes, బీరకాయ, poll beans, butternut squash (నరసింహారావు గారింట్లో బాగా వచ్చిందిట ), lemon cucumber, Thai పచ్చిమెరప, సొరకాయ,

ఇంటావిడ సహకరిస్తే ఈ సంవత్సరం cultivator  తో వాడిపోయిన  మొక్కలని మట్టితో కలిపి ఎరువు చేద్దా మనుకుంటున్నాను. వచ్ఛే సంవత్సరానికి మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ వింటర్ చివర్లో ఇంటావిడని కొంచెం మంచి చేసుకోవాలి (ఒక నెలరోజుల ముందర చాలు అని అనుకుంటున్నాను). తోటలో మొక్కలు పెట్టటానికి కొంచెం సహాయం చేస్తుంది. దేనికయినా ముందుచూపు ఉండాలి కదా.

Wednesday, June 8, 2016

124 ఓ బుల్లి కథ 112--- మన్హాటన్ (Manhattan ) లో ఒక పూట

New York Skyline
మేము న్యూయార్క్ వేపు వెళ్ళినప్పుడల్లా Manhattan లో ఒక కాన్సర్ట్ కో, ఒక బ్రాడ్వే షోకో, ఒక మ్యూజియం కో, ఒక పెద్ద రెస్టో రెంట్ కో వెళ్తాము. మా ఇంటి పక్కన ఉన్న Liberty Park కు తప్పకుండా వెళ్తాము. పై బొమ్మ అక్కడనుండి కనపడే న్యూయార్క్ స్కై లైన్. పై బొమ్మలో ఎత్తుగా ఉన్న భవనం Twin Towers  శిధిలం అయిన తరువాత దాని బదులు కట్టినది. 

ఈ తడవ Rubin Museum కి వెళ్డామన్నారు. నాకు స్వతహాగా మ్యూజియం లంటే పెద్ద వెళ్ళాలని ఉండదు. చికాగో లో ఒక్కరోజులో  Art Institute, Field Museum, Oriental Institute చూసిన ఘనత కల వాడిని. కాకపోతే నేను యూనివెర్సిటీ చికాగోలో ఉన్నప్పుడు రోజూ సాయంత్రం పూట Museum of Science and Industry కి వెళ్తూ ఉండే వాడిని (ఆ కాలంలో ప్రవేశ రుసుము ఉండేది కాదు ). రోజుకో సెక్షన్ చూసేవాడిని. 

అందరూ వెళ్దా మంటున్నారు కాబట్టి వెళ్ళక తప్పదు. Rubin Museum లో ఉన్నవన్నీ Himalayan Paintings ట. అమెరికాలో డబ్బున్న వాళ్ళందరూ చాలామంది ఇలా Museum లు అవీ కట్టిస్తూ ఉంటారు. New York వీటికి ప్రసిద్ది. నాకు Museum కన్న ఆ తరువాత వెళ్ళే Michelin three - star cook వంట చేసే రెస్టోరెంట్ మీద ఆశ పడింది. కాగా పోగా అది Indian Restaurant కూడాను.

ఈ మధ్యన Burnt(2015) అనే ఇంగ్లీష్ సినీమా చూసినతరువాత తెలిసింది  Michelin three - star cook అంటే ఏమిటో. దాని కోసం ఎంతమంది తాపత్రయ పడతారో. 

ఇక Michelin three - star cook చేసిన వంట అంటారా - మెన్యు లో మిరపకాయ బజ్జీ లాంటిది ఉంటే ఆర్డర్ చేశాము. ఒక ప్లేటులో నాలుగు సన్నటి మిరపకాయల మీద పల్చటి పిండి కోటింగ్ వేసి ఫ్రై చేసి తీసుకు వచ్చాడు. ప్లేట్ decoration చాలా బాగుంది. ఆకలికి ప్లేట్ తిన లేము కదా. కాకపోతే మేము ఆర్డర్ చేసిన "నాన్" చాలా బాగుంది. దానితో కడుపు నింపుకున్నాము. ఆ రెస్టోరెంట్ ఎంత గొప్పదంటే మేము లాబీ లో కూర్చుంటే కొందరు అక్కడ కెళ్ళామని చెప్పుకోటానికి సేల్ఫీలు తీసుకుని అక్కడ తినకుండా వెళ్ళిపోయారు. కొంచెం ఖరీదు అయిన దయ్యుంటుంది. నేనయితే మా బిల్లు ఎంతయినదో చూడలేదు.  

Rubin Museum లో ఉన్న paintings అన్నీ బౌద్ద మతము మీద వివిధ దేశాలలో వేసిన చిత్రాలు. చాలా చాలా పాతకాలంవి. నాకు బుద్దుడు హిందూ దేశంలో బౌద్ద మతం స్థాపించాడని తెలుసు కానీ దాని గురించి తెలిసినది, చదివినది చాలా తక్కువ. ఈ చిత్రాలలో ఉన్నది అంతా బౌద్ద మతము, వాళ్ళు ఆరాధించే దేముళ్ళు, వాళ్ళ గుళ్ళ గురించి. దేముళ్ళందరూ  హిందూ దేముళ్ళే, వాళ్ళ పేర్లు కూడా హిందూ పేర్లే. నాకు ఎప్పుడూ అనిపించే ప్రశ్న: ఆ మతం హిందూ దేశంలో పుట్టినప్పటికీ ఇక్కడ ఎక్కువగా లేదెందుకని (శిధిలాలు తప్ప) ?

నాకు Buddhism గురించి ఏమీ తెలియదు నాన్నా అని ఒక్కొక్క పెయింటింగ్ చూసినప్పుడల్లా అంటూ ఉంటే ఇంటికి వెళ్ళిన తరువాత మా అబ్బాయి ఒక పుస్తకం ఇచ్చాడు. "The Hindu Religious Tradition" by Hopkins. ఈ పుస్తకం 1971 లో వచ్చింది కాబట్టి Aryan Invasion తరువాత Vedas వచ్చాయని చెబుతారు. కానీ 1980 లో అనుకుంటాను Aryan Invasion అంటూ ఏమీ జరగలేదు అంతా తెల్ల వారి మాయ అని నిరూపించారు. అది వదిలేస్తే ఈ పుస్తకంనుండి నాకు తెలియని సంగతులు చాలా తెలుసుకున్నాను.

అసలు బౌద్ద మతము గురించి దేముడెరుగు హిందూ మతమంటే ఏమిటి అంటే ఏమి చెబుతాము? నన్నడిగిన వాళ్ళందరికీ నేను చెప్పినది "It Is A Way of Life" అది ఒక  " జీవన విధానం" అని. మనం నేర్చుకున్నది పాటిస్తున్నది అంతా తరతరాలుగా మన ఇళ్ళల్లో పాటిస్తున్న కట్టుబాట్లే. ఆ కట్టుబాట్లే మన మతం అంటాము. 

నా ఉద్దేశంలో మతం (ఏ మతమయినా ) చేసిన గొప్ప పని అచ్చట ఉన్న ప్రజలలో ఒక క్రమ పద్ధతి లో జీవింప చెయ్యటం. ఆ క్రమం అప్పటి దేశ కాల పరిస్తుతులని బట్టి ఉంటుంది. ఆ పరిస్థుతులు మారినప్పుడు సమాజము మారుతుంది దానికి అనుగుణంగా మతములో మార్పులు వస్తూ వుంటాయి. అలా వీలు లేనప్పుడు కొత్త మతాలు పుట్టుకు వస్తాయి. 

Indus Civilization "సరస్వతీ" నదీ ప్రాంతాన 3000 B.C (Before Christ ) నుండీ 1500 B.C దాకా నడిచింది (Harappa and Mohanjodaro శిధిలాలు చెబుతున్నాయి) . ఆ నాగరికత ఎందుకు పతనమయింది అనే దానికి ఒక పెద్ద కారణం "సరస్వతీ" నది ఎండిపోవటంగా చెబుతున్నారు. దాదాపు ఇదే సమయంలో "వేదాలు" క్రోడీకరించటం జరిగింది అని చెప్పవచ్చు. కారణం అప్పటి పద్దతులు పూజలూ పునస్కారాలూ, యజ్ఞాలూ, ప్రకృతిని పూజిచటం వగైరా లన్నీ వేదాల్లో ఉన్నాయి. 

ఆకాలంలో printing press లు వగైరా లేవు కాబట్టి తమ రచనలు శబ్దం (ఉచ్ఛారణ, నోటి మాట) ద్వారా జాగ్రత్త చెయ్యాలని నిర్ణయించారు. నోటి మాట ద్వారా వ్యాప్తి చెందాలంటే నోటికి కొరుకుడు పడాలి కదా ! అందుకే ఛందస్సు, Rhythm ( ఒక క్రమబద్దం లో పాడటం) కనుగొన్నారు. కొందర్ని కూర్చోపెట్టి వాటిని వల్లె వేయించారు. రోజూ కూర్చుని ఎవరు వల్లె వేస్తారు? కొందర్ని నియమించి ఇదే మీ పని అన్నారు. వారే priests. వారే వేదాలకి కర్తలు కర్మలు క్రియలు. వీరికి తిండీ వ్యవహారం చూడాలికదా. అందుకే సమాజంలో మిగతా వ్యవస్థలు వాడుకలోకి వచ్చాయి.  

వేదాలు మనదాకా రావటానికి ఇదే కారణం. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో, ఆశ్రమాల్లో పిల్లలు (కాబోయే priests) పొద్దున పూట వేదాలు, మంత్రాలు వల్లె వేయటం వింటూనే ఉంటాము. అందుకనే వేదభాషని (సంస్కృత), శబ్దం (ఉచ్ఛారణ, నోటి మాట) ని వ్రాయగలిగే అన్ని భాషలలోనూ (తెలుగు, హిందీ వగైరా  phonetic భాషలు) లలో వ్రాయ వచ్చు, వేదాలు పుట్టినప్పుడు ఎలా ఉచ్చరించారో అలా ఉచ్చరించవచ్చు. 

ఈ priests, మామూలు ప్రజలకి వేద రహస్యాలు చెబుతూ ఉండే వారు. అందులో మళ్ళా మళ్ళా పుట్టటం (reincarnation) ఒకటి. ప్రజలకి తమ సంసార బాధలకి తరుణోపాయం కనపడటల్లేదు, అందులో మళ్ళా మళ్ళా పుట్టి బాధలతో జీవితం గడపటం ఎవరికి ఇష్టం ఉంటుంది. ప్రజలకన్నీ ప్రశ్నలే. మాకు సంసార దుఃఖాలు బాధలు ఎందు కొస్తున్నాయి? వీటిని తప్పించుకోలేమా? వీటికి సమాధానాలుగా కొత్త మతాలు పుట్టుకు వచ్చాయి. వాటిల్లో చివరికి మిగిలినవి Buddhism, Jainism.

Buddhism చెప్పేదేమిటంటే నీ బాధలకి కారణం నీ తెలివి తక్కువదనం దానికి తోడు నీ గొంతెమ్మ కోరికలు (is the result of ignorance and desire: ignorance of the impermanence of all existence, and desire for attachment and continuing individual existence. Duhkha can be ended only by enlightenment and nirvana, the "blowing out" or "extinction" of desire a complete calm and detachment). Buddhism దుఃఖానికి కారణం చెప్పింది గానీ దానిని తప్పించుకోటానికి ఎంతమంది కోరికలు లేకుండా ఉండగలరు? అందుకనే మనదేశం లో Buddhism కు ఆదరణ తగ్గి వెళ్ళి పోయిందనుకుంటాను. 

ఈ కొత్త మతాలు పుట్టుకు రావటం ప్రజలు వాటిల్లో జేరటం తో హిందూ మత పెద్దలు (priests) కి కనువిప్పు కలిగి తాము ప్రజలకి దూరంగా ఉన్నామని తెలిసికొని ప్రజల దగ్గరకి రావటానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అందుకే ఉపనిషత్ లు బ్రాహ్మణాలూ ఇతిహాసాలూ పురాణాలూ  యజ్ఞాలూ యాగాలూ వ్రతాలూ ఇంట్లో పూజలూ వచ్చాయి. ఆరోగ్యానికి ఆయుర్వేదం, మనస్తాపాలు తగ్గటానికి meditation, శరీర శక్తికి యోగా, ప్రజలు ఆనందించటానికి మన పండుగలు క్రతువులు, ఇవన్నీ హిందూ మతం కనిపెట్టినవే. ఇవన్నీ ప్రజలని కష్టాల నుండి గట్టెక్కించి నిర్వాణం (Nirvana) పొందటానికే.     

హిందూ మతం మిగతా మతాలు మంచివి కాదని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ప్రజల దైనందిన జీవితంలో ఇమడటం మూలంగా ఇతర మతాలు లాగా మత ప్రాచుర్యత లేక పోయినా తరతరాలబట్టీ నిలబడింది. 

ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళాను. చూడండి Rubin Museum ఎంత పని చేసిందో. 1. The Hindu Religious Tradition by Thomas J. Hopkins (1971)
     Wadsworth Publishing Company
      Belmont, California USA

Sunday, April 10, 2016

123 ఓ బుల్లి కథ 111--- బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ బుల్లి కాబేజీ ల్లాగా ఉంటాయి. చెట్టుకి మొగ్గల్లాగా కాస్తాయి. చలికాలం లో గానీ  స్ప్రౌట్స్ (మొగ్గలు) చెట్టునుంచి బయటకు రావు. ఇది నాకు బాగా తెలుసు, క్రిందటి సంవత్సరం "మే" లో పెరట్లో వేస్తే డిసెంబర్ కి గానీ బుల్లి కాబెజీలు రాలేదు. అందుకనే సామాన్యంగా క్రిస్మస్ డిన్నర్లో ఇది ఒక సైడ్ డిష్. కొంచెం ఉప్పేసి ఉడక పెట్టి ప్లేట్లో పెడతారు. ఎవరింటికో క్రిస్మస్ డిన్నర్ కి వెళ్తే వీటితో నాకు పరిచయం అయింది. కాబేజీ తో కూర చేసే టప్పుడు వీటితో ఎందుకు చెయ్య కూడదని మొదలు పెట్టి సాధించాము. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. ఇరవై ఏళ్ళ బట్టీ అవి సేల్ లో పడినప్పుడల్లా కొని కూర చేసుకుంటూ ఉంటాము. ఇవి తింటే చేసే మంచి గురించి కింద ఇచ్చిన లింకు లో చదవవచ్చు. 

కావలసిన వస్తువులు:

1. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ పది
2. రెండు టేబుల్ స్పూన్ (tb) కంది పప్పు.
3. రెండు పచ్చి మెరపకాయల ముక్కలు.
4. ఒక అర స్పూన్ అల్లం.
5. ఒక అర స్పూన్ ఉప్పు.
6. చిటికెడు పసుపు.
7. చిటికెడు ఇంగువ.మొదట కంది పప్పుని ఒక చిన్న గిన్నె నీళ్ళల్లో నాన వేసిన తరువాత,  బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ ని సన్నగా తరుక్కోవాలి.  తరిగిన కూరలో  కంది పప్పుని కలిపి గిన్నెలో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి మరగ నివ్వాలి ( మీరు ప్రెజర్ కుక్కర్ లో స్టీం కూడా చెయ్యొచ్చు కాకపోతే గుజ్జు అవకుండా జాగర్తగా చూసుకోవాలి ). కొద్దిగా ఉడకంగానే (రెండు మూడు నిమిషాలు) తీసి ఒక భగుణె లో పోపులో వేసి నీళ్ళు పోయేంత వరకూ వేయించాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1/4 కారం వేసి చక్కగా కలిపితే  బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర తినటానికి రెడీ.తిరగమోత లేక పోపు చేయు విధానము:

ఒక భగుణె లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి స్టవ్ మీడియం లో ఉంచాలి  (ఆలివ్, కార్న, వెజిటబుల్ ఏవైనా ). దానిలో ఒక స్పూన్ మినప్పప్పు, నాలుగు మెంతి గింజలూ వెయ్యండి. మినప్పప్పు వేగి బ్రౌన్గా అవుతున్న సమయంలో 1/4 స్పూన్ జీలకర్ర 1/4 స్పూన్ ఆవాలు వెయ్యండి. ఒక అర మెరపకాయ తుంచి వెయ్యండి. ఇప్పుడు అల్లం పచ్చి మెరప ముక్కలు చిటికెడు పసుపు చిటికెడు ఇంగువా వెయ్యండి. రెండు రెబ్బలు కరేపాకు కూడా తుంచి వేసుకోవచ్చు. ఇదంతా రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు.

ఇక్కడ పెట్టిన ఫోటోలు IPAD తో మా ఆవిడ తీసినవి. అందుకు నా కృతజ్ఞతలు. 

1. What's New and Beneficial About Brussels Sprouts

Monday, February 15, 2016

122 ఓ బుల్లి కథ 110 --- బయో మెడిసిన్

భూమి మీద స్వయం శక్తితో బ్రతికే శక్తి మొక్కలకి (plants ) మాత్రమే ఉంది. అవి పైనుండి  గాలినీ, సూర్యరశ్మినీ,  భూమినుండి నైట్రోజన్ లాంటి పదార్ధాలని తీసుకుని బతకటానికి శక్తిని సంపాదించుకుని, వాటి జాతి అభివృద్ధి కోసం కాయలూ విత్తనాలు తయారు చేసుకుంటాయి . మనుషులతో సహా మిగతా జంతువులుబ్రతకాలంటే ఒకటే మార్గం, మొక్కలు  తిని బతకటమో లేక ఆ మొక్కలను తిని జీవించే వాటిని చంపి తిని బతకటమో చెయ్యాలి.

మనుషులకు శక్తి రావాలంటే, తను తినే ఈ రెండురకాల ఆహారాల నుండీ వచ్చిన పదార్ధాలని( carbohidrates, fats , Proteins) అరిగించుకుని (digestion), శక్తిని బయటకు తీయాలి. ఈ ప్రక్రియ మనం నోట్లో ఆహారం పెట్టుకుని నవలటం మొదలపెట్టగానే  saliva (లాలాజలం) తో మొదలవుతుంది. అప్పుడే amylase అనే enzyme కూడా ఉత్పత్తై saliva తో కలసి carbohydrates అరుగుదలను ప్రారంభిస్తుంది. కొంత సేపటికి తిన్న ఆహారం ముద్దయి మింగటం ద్వారా పొట్ట లోకి వస్తుంది.

పొట్టలోని కండరాలు ఈ ఆహారపు ముద్దని gastrin అనే enzyme ద్వారా ఆవిర్భవించిన hydrochloric acid ని, pepsin అనే enzyme  తో కలపి మనము తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా (blender లాగా ) తయారు చేస్తుంది. దీనిలో renin అనే enzyme కూడా కలిసి milk protein  మీద పని చేస్తుంది. మొత్తం మీద మనం తిన్న పదార్ధం ద్రవ పదార్ధంగా తయారు అయి (chyme ), కండరాల ద్వారా చిన్న ప్రేవులలోకి నెట్టబడుతుంది. మన పొట్టలో పనంతా  acidic వాతా వరణంలో జరుగుతుంది.

చిన్న ప్రేవులలో పని alkaline వాతా వరణంలో జరుగుతుంది. ఇక్కడ tripsin, chimotripsin, aminopeptidase, dipeptidase అను ఎంజైములు chyme మీద పనిచేసి తిన్న ప్రోటీన్స్ అన్నిటినీ పగలగొట్టి జీవత్వానికి కావలసిన న్యూట్రియంట్స్, amino acid ముక్కలని తయ్యారు చేస్తుంది. చిన్న ప్రేవులు వీటి నన్నిటినీ రక్తం లోకి తీసుకుని చెత్తని పెద్దప్రేవుల్లోకి పంపిస్తుంది.

మన శరీరం తనకు కావాల్సిన ప్రోటీన్స్ ని( ఎంజైములు అన్నీ ప్రోటీన్లే) రక్తంలోనుండి amino ఆసిడ్స్ ని తీసుకుని అదే తయారు చేసుకుంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే, మనం protein తింటే అది అమాంతంగా కండరాల్లోకిపోదు.

ఎంజైములు (proteins )తయారు చెయ్యటానికి కావలసిన మూలపదార్ధాలు ఒక 20 ఎమినో యాసిడ్స్. ఈ ఎమినో యాసిడ్స్ కూర్పు ఏ ఎంజైములకి ఎల్లా ఉండాలి అని నిర్ణయించేది మన DNA లోని జీన్. ఈ enzyme ఇప్పుడు కావాలి అనే నిర్ణయం మన శరీరం తీసుకున్న వెంటనే DNA లో ఆ జీన్ ఉన్న చోటుకి సంకేతం వెళ్ళి ఆ తయారు చేసే ఫార్ములా బయటికి వస్తుంది. Proteins ఎల్లా తయారు అవుతయ్యి అనే దానిమీద ఇదివరకు రెండు పోస్టులు వ్రాశాను. క్రింద వాటి లింకులు ఉన్నాయి చూడండి.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమి టంటే మనం చేసేదల్లా ముద్ద నోట్లో పెట్టుకోవటం వరకే. మిగతా పనులన్నీ వాటంతట అవే అవసరం ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ఎంజైములు కావాలో నిర్ణయించటం. అవి తయారు చెయ్యటానికి కావలసిన పరిజ్ఞానం(రెసిపీ) కోసం DNA కి సంకేతాలు పంపించటం, వాటిని తయారు చేసి కావలసిన చోట అందించటం అనేవి చక చకా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఎటువంటి సంకేతాలు DNA లో ఏ భాగంకి వెళ్తాయో వాటి సమాచారం ఎల్లా బయటికి వస్తుందో కనుక్కుని  ఒక డేటాబేస్ లాంటిది తయారు చేశారు.

మన శరీరంలో అవయవాలు పని చెయ్యటానికి మన ప్రమీయం లేకుండా జరిగే ప్రక్రియలు కో కొల్లలు. ఉదాహరణగా, మనం తిన్న ఆహరం జీర్ణ ప్రక్రియ గురించి చెప్పాను. ఇంత కట్టుదిట్టంగా మన ప్రమేయం లేకుండా శరీర ప్రక్రియలు జరుగుతున్నప్పుడు మనకి రోగాలు రొస్టులు ఎందుకు వస్తున్నాయి?  మన చేతిలో ఉన్నది మన ప్రమేయం తో చేస్తున్న పని తినటం ఒకటే. అది మనం సరీగ్గా చెయ్యటల్లేదా !  లేక  మన శరీరం, తాను చెయ్యాల్సిన పని తను సరీగ్గా చెయ్యటల్లేదా?

ఒక విధంగా చూస్తే మన శరీరం ఒక రసాయనిక పరిశోధనా కేంద్రం. ఎన్నో రసాయనిక పదార్ధాలు అవసరాన్ని బట్టి తయారు అవుతూ ఉంటాయి. ఇవి తయారు అవటానికి ఒకటే కారణం : శరీరంలో జీవత్వం కొనసాగుతూ ఉండాలి. జీవించటానికి మనం చేస్తున్న పని ఒకటే, తినటం.  ఆ తినటంలో, రుచి కోసమో లేక మార్పు కోసమో  మనం తయారు చేసుకున్న రసాయనిక పదార్ధాలు (additives ) తింటూ  తాగుతూ ఉంటే శరీరం లోని రసాయనిక లోకంలో ఏమి జరుగుతుందో మనమేమి చెప్పగలం ? రోగాలకి ఇది కారణం అవ్వచ్చా?

జీవించే వాటన్నిట్లోనూ జీవించటానికి మూలకారణం ఒకటే. అదే కణము (Cell ). శక్తి తయారు చేసేదదే (mitochondria ) ఎంజైములు తయారు చేసేదదే (ribosomes ) శక్తిని వినియోగించేది అదే. వాటిని మనం ఉత్త కంటితో చూడలేక పోయినా, అవి కొన్ని బిలియన్లు మన దేహంలో ఉండటం మూలంగా శక్తి కూడబడి, నడవగలుగు తున్నాము మాట్లాడగలుగు తున్నాము ఏపనయినా చేయగలుగు తున్నాము.

ప్రతీ కణం తనకు తానే విభజించుకుంటూ ఉంటుంది(mitosis ). జీవిత్వం అంటే ఇదే మార్పు. ఒక క్రమం ప్రకారం పాత వాటి నుండి కొత్తవి పుట్టుకు వచ్చి పాతవి పోతూ వుంటాయి. ఈ కణవిభజనలో duplicate ఎప్పుడూ సక్రమంగా రాకపోవచ్చు. విభజింప బడిన కణం DNA లో పొరపాట్లు దొర్లి ఉండ వచ్చు (Mutation). చిన్న చిన్న పొరపాట్లయితే, జీవించటానికి అడ్డురాని వయితే సద్దుకు పోతుంది, duplicate మరీ పాడయితే తానంతట అదే చంపుకుంటుంది (Programmed Cell Death). ఇంట్లో ఎప్పుడూ చేసే కూర చేస్తున్నాము, ఒక రోజు కారం ఉప్పూ తగ్గితే సద్దుకు పోతాం అదే మాడితే తీసి అవతల పారేస్తాం అల్లాగన్న మాట.

ఈ సర్డుకుపోటాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. మనుషుల ఆకారాలు తేడాగా ఉండటానికి ఇదే కారణం, కణ విభజన లో తేడాలు ఉన్నాయి కానీ అవి  జీవత్వానికి అడ్డురావు (safe )అనిపిస్తే అవి నిలబడతాయి,  కానీ  అడ్డు వచ్చేవని అది అనుకుంటే తనంతట తాను చచ్చి పోతుంది ( Apoptosis).

ఈ safe గ ఉన్న కణాలు రెండు విధాలుగా ఉండవచ్చు. మార్పులు ఉన్నాయి కానీ అవి జీవించటానికి అడ్డు వచ్చేవి కాదు. మనుషుల ఆకారాలు తేడాగా ఉండటానికి ఇదే కారణం. లేదా మార్పులు ప్రస్తుతం ప్రమాదకరమని గుర్తించటానికి వీల్లేకుండా ఉన్నాయి (Cancer పుట్టించే కణాలు ఈ రకమునకు చెంది ఉండవచ్చు). ఈ మార్పులు DNA జీన్స్ లో అయితే, DNA  నుండి  వచ్చే ఎంజైము రెసిపీ లు తప్పుగా రావచ్చు కదా.  ఆ తప్పుల తడికెలతో రెసిపీలు వచ్చినప్పుడు మనపని గోల్మాల్ అవుతుంది.

కణవిభజన జరిగేటప్పుడు రసాయనిక వాతావరణం మనం తినే తిండి మూలాన మారి పోయిందేమో!  రో గాలకి ఇది కారణం అవ్వచ్చు కదా? రోగ నిర్ధారణ, DNA మార్పులు మీద చాలా పరిశోధనలు చేస్తున్నారు, కొన్ని నిర్ధారణలు జరిగినవి కూడా. అందుకనే కొందరు DNA analysys చేయించుకుని వారికి రాబోయే జబ్బులగురించి ముందుగా తెలుసుకుని జాగర్తలు తీసు కుంటున్నారు (Angelina Jolie మొదలగు వారు ).

సరే DNA లో తప్పు తెలిసినప్పుడు దాన్ని బాగు చెయ్యొచ్చు కదా (DNA  repair). దీనిమీద పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. క్రిందటి సంవత్సరం (2015) రసాయనిక శాస్త్రం(chemistry ) లో మూడు Nobel Prize లు వచ్చాయి. DNA ద్వారా రోగాల్ని కనిపెట్టటం DNA Repair ద్వారా వాటిని రాకుండా చూడటం. ఇదే Bio Medicine.**** 85 ఓ బుల్లి కథ 73 --- రోజుకి మనకెంత ప్రోటీన్ కావాలి ?
******86 ఓ బుల్లి కథ 74 --- ప్రోటీన్స్ విషయంలో శాకాహారులు మోసపోయారా ?

1. Scientists map proteins produced in human body

2. Mapping our differences. A catalog of Variation in human gene expression pp618,640,648
    Science 8 May 2015. Sciencemag.org

3. Digestion The Human Body  By Dr. Gordon Jackson and Dr. Philip Winfield
    TORSTAR Books  300 E. 42nd Street New York, NY 10017 (1984)

4. Mutation

Thursday, January 28, 2016

121 ఓ బుల్లి కథ 109 --- రోజుకి తీపి ఎంత తినవచ్చు ?

ఈ మధ్య WHO (World Health Organization) వాళ్ళు ప్రపంచ జనాభా మీద పరిశోధనలు జరిపి, ప్రతి ముగ్గిరిలో ఒకరు స్థూలకాయులు (BMI  30 or more ) అని తేల్చారు. స్థూలకాయం అనారోగ్యానికి కారణం అవుతుంది. దీనికి ఒక కారణం మనం తీపి పదార్ధాలు ఎక్కువగా తినటం అవ్వచ్చు.

మనం తీపి పదార్ధాలని చాలా ఇష్టంగా తింటాం. మితంగా తింటే అన్నీ మంచివే కానీ మితానికీ ఇష్టానికీ సఖ్యత ఉండదు. ఎప్పుడూ కొట్లాడు కొంటూ ఉంటాయి. తినటం తగ్గించ లేము.

అసలు ఈ పోస్ట్ వ్రాయటానికి కారణం, స్థూల కాయానికి, డయాబెటీస్ , గుండె జబ్బులకి ఒక విధంగా షుగర్ కారణం కావచ్చని పరిశోధకులు నిర్ణఇంచటమే.

మామూలుగా మనం షుగర్ని రెండువిధాలుగా తీసుకుంటాము. మామూలు షుగర్ గా (కాఫీ లోగా ), పళ్ళు కూరగాయలు తినటం మూలంగా  లేక షుగర్ వేసి చేసిన పదార్ధాలు (కేక్ లు, జాంగ్రీలు వగైరా) తినటం మూలంగా. ఏవిధంగా తిన్నా అది షుగరే. షుగర్ ఒక కార్బో హైడ్రేట్, మనకి శక్తీ నిచ్చేది అదే. కానీ మన శరీరానికి తగ్గట్టు కొన్ని పరిమితుల లోనే తినాలి. ఎక్కువతింటే అనారోగ్యాలకి కారణం అవ్వచ్చు.

శక్తిని కాలరీ లలో కొలుస్తారు. మనము షుగర్ మాత్రమే కాకుండా మిగతావి కూడా తింటాము కాబట్టి, మనకి రోజుకి 2000 కాలరీలు (calories) కావాలను కుంటే వాటిలో 200 కాలరీలు మాత్రమే (10%) షుగర్ మూలంగా రావచ్చని నిర్ణయించారు.

The American Heart Association వాళ్ళు ఇంకా దీనిని తగ్గించారు. రోజుకి ఆడవాళ్ళకి 100 మగవాళ్ళకి 150 కాలరీలు మాత్రమే షుగర్ ద్వారా రావటం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. అంటే ఒక టీ స్పూన్ షుగర్ లో 16 కాలరీలు ఉన్నాయనుకుంటే ఆడవాళ్ళు రోజుకి 6 టీ స్పూనులు మగవాళ్ళు రోజుకి 9 టీ స్పూనులు మాత్రమే తీసుకో వచ్చు అన్న మాట. 

ఇంకా తేలికగా అర్ధం అవ్వాలంటే మామూలు ఒక 12 ఔన్సుల సాఫ్ట్ డ్రింక్ తాగితే 160 కాలరీలు వస్తాయి. అంటే పది స్పూనుల షుగర్ అన్నమాట. ఒక సాఫ్ట్ డ్రింక్ తాగితే ఆ రోజు మీ షుగర్ కోటా అయిపొయింది అన్నమాట. మీరు బరువు తగ్గాలంటే నూ ఆరోగ్యంగా ఉండాలంటేనూ షుగర్ జాగర్తగా వాడటం మొదలెట్టండి. షుగర్ తో కూడిన సాఫ్ట్ డ్రింక్స్ చేసే చేటు గురించి క్రింద రెండోవ మాతృక చదవండి.  

 1. Healthy Eating
 http://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/in-depth/added-sugar/art-20045328/?utm_source=newsletter&utm_medium=email&utm_campaign=housecall

2.The Drink That Kills 184,000 People Every Year