Sunday, April 10, 2016

123 ఓ బుల్లి కథ 111--- బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర



 బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ బుల్లి కాబేజీ ల్లాగా ఉంటాయి. చెట్టుకి మొగ్గల్లాగా కాస్తాయి. చలికాలం లో గానీ  స్ప్రౌట్స్ (మొగ్గలు) చెట్టునుంచి బయటకు రావు. ఇది నాకు బాగా తెలుసు, క్రిందటి సంవత్సరం "మే" లో పెరట్లో వేస్తే డిసెంబర్ కి గానీ బుల్లి కాబెజీలు రాలేదు. అందుకనే సామాన్యంగా క్రిస్మస్ డిన్నర్లో ఇది ఒక సైడ్ డిష్. కొంచెం ఉప్పేసి ఉడక పెట్టి ప్లేట్లో పెడతారు. ఎవరింటికో క్రిస్మస్ డిన్నర్ కి వెళ్తే వీటితో నాకు పరిచయం అయింది. కాబేజీ తో కూర చేసే టప్పుడు వీటితో ఎందుకు చెయ్య కూడదని మొదలు పెట్టి సాధించాము. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. ఇరవై ఏళ్ళ బట్టీ అవి సేల్ లో పడినప్పుడల్లా కొని కూర చేసుకుంటూ ఉంటాము. ఇవి తింటే చేసే మంచి గురించి కింద ఇచ్చిన లింకు లో చదవవచ్చు. 

కావలసిన వస్తువులు:

1. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ పది
2. రెండు టేబుల్ స్పూన్ (tb) కంది పప్పు.
3. రెండు పచ్చి మెరపకాయల ముక్కలు.
4. ఒక అర స్పూన్ అల్లం.
5. ఒక అర స్పూన్ ఉప్పు.
6. చిటికెడు పసుపు.
7. చిటికెడు ఇంగువ.



మొదట కంది పప్పుని ఒక చిన్న గిన్నె నీళ్ళల్లో నాన వేసిన తరువాత,  బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ ని సన్నగా తరుక్కోవాలి.  తరిగిన కూరలో  కంది పప్పుని కలిపి గిన్నెలో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి మరగ నివ్వాలి ( మీరు ప్రెజర్ కుక్కర్ లో స్టీం కూడా చెయ్యొచ్చు కాకపోతే గుజ్జు అవకుండా జాగర్తగా చూసుకోవాలి ). కొద్దిగా ఉడకంగానే (రెండు మూడు నిమిషాలు) తీసి ఒక భగుణె లో పోపులో వేసి నీళ్ళు పోయేంత వరకూ వేయించాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1/4 కారం వేసి చక్కగా కలిపితే  బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర తినటానికి రెడీ.



తిరగమోత లేక పోపు చేయు విధానము:

ఒక భగుణె లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి స్టవ్ మీడియం లో ఉంచాలి  (ఆలివ్, కార్న, వెజిటబుల్ ఏవైనా ). దానిలో ఒక స్పూన్ మినప్పప్పు, నాలుగు మెంతి గింజలూ వెయ్యండి. మినప్పప్పు వేగి బ్రౌన్గా అవుతున్న సమయంలో 1/4 స్పూన్ జీలకర్ర 1/4 స్పూన్ ఆవాలు వెయ్యండి. ఒక అర మెరపకాయ తుంచి వెయ్యండి. ఇప్పుడు అల్లం పచ్చి మెరప ముక్కలు చిటికెడు పసుపు చిటికెడు ఇంగువా వెయ్యండి. రెండు రెబ్బలు కరేపాకు కూడా తుంచి వేసుకోవచ్చు. ఇదంతా రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు.

ఇక్కడ పెట్టిన ఫోటోలు IPAD తో మా ఆవిడ తీసినవి. అందుకు నా కృతజ్ఞతలు. 

1. What's New and Beneficial About Brussels Sprouts

No comments:

Post a Comment