Tuesday, December 15, 2009

11. ముకుంద ప్రియ ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు


నా చిన్న కథ డిసెంబర్ 1998 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
కథ విధంగా మొదలవుతుంది
ముకుందం MBA ఇంక పెళ్లి చేసుకుందామని తీర్మానించుకున్నాడు. జీవితంలో న్నీ నుకున్నట్లు జరుగుతున్నాయి. చదువు అయిపొయింది. చదువుతున్నప్పుడే ఉద్యోగం వచ్చింది. తనకోసం కంపెనీలు గద్దల్లా తన్నుకుంటూ ఉంటే ఆశ్చర్య మేసింది.తను  ఇంత  గొప్ప వాడినని ఇంతవరకు తెలిసికోలేదు.

ఇక మీరు క్లిక్ చేసి చదవండి.
మీరు చదివేటప్పుడు, టూల్ బార్ మీద ఉన్న view, దానినుంచి వచ్చే zoom, zoomin, zoomout ఉపయోగించండి. తేలికగా చదవచ్చు.

Monday, November 30, 2009

10. త్రివిక్రమ సంసారం ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కథ ఆగుస్టు 1994 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
ప్రింటు బాగా లేని కారణాన్న కథని నేనే రోజుకి కొద్ది కొద్దిగా టైపు చేస్తూ పూర్తి చేశాను . కథ మళ్ళా రాస్తున్నట్టు ఉంది. చాలా చోట్ల మార్పులు చేశాను.

త్రివిక్రమ సంసారం ---- రచన : లక్కరాజు శివరామకృష్ణ రావు

మెట్రో ట్రైన్ అప్పుడే చికాగో పొలిమేరలు దాటుతూ ఉంది. పేపరు లో నాకున్న నాలుగు స్టాక్సు క్లోసింగ్ ప్రైసులు చూసేసాను. సాయంత్రం పేపరు లో కొత్త విశేషాలు ఏమి లేవు. పేపరు మడిచి పక్కన పెట్టాను. ఎదురుకుండా త్రివిక్రమ కుర్చుని వున్నాడు. ఆశ్చర్య పోయాను. నన్ను చూడంగానే ఉలిక్కిపడ్డాడు.

"త్రివిక్రమా నువ్వేనా" అని అడిగాను. మనిషి గుర్తు పట్టలేకుండా బాగా చిక్కిపోయాడు.

"అవునండీ మాస్టారు మిమ్మల్ని చూసి చాలారోజులైంది " అని గిల్టీగ ఫీల్ అయ్యాడు .

త్రివిక్రమా నేనూ రోజు ట్రైన్ లో కలుసుకునే వాళ్ళం. ఏదో పిచ్చాపాటి మాట్లాడు కుంటుంటే టైము తేలికగా గడచి పోయేది.
మా మా స్టేషనులు రాంగానే దిగి పోయే వాళ్ళం. ఈ సంవత్సరం మొదట్లో ఇండియా వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చి కాపురం పెట్టాడు. అప్పటినుండి కనపడటం మానేసాడు. ఆడవాళ్ళూ మొగవాళ్ళ జీవితాల్లో ప్రవేశించి భలే మార్చేస్తారు !. ఏదో కొత్తకాపురం మోజులే ఆని నేనూ కూడా పెద్ద పట్టించు కో లేదు. పట్టించుకుని మాత్రం మనం చేసేది ఏమీ లేదు. ఈ జీవిత ప్రయాణం లో కొందరు మిత్రులు కొత్తగా కలుస్తూ వుంటారు, కొందరు విడిపోతూ ఉంటారు. కానీ మన ప్రయాణం కొనసాగు తూనే ఉంటుంది.

"త్రివిక్రమా చిక్కిపోయావు" అన్నాను. మాట్లాడలేదు. మనస్సులో ఏదో బాధ పడుతున్నట్లు కనపడుతూనే ఉంది.
'కొత్త సంసారం ఏలా ఉన్నది' అని అడిగాను. మళ్ళా మౌనవ్రతం. మనసులో ఉన్నదేదో చెప్పుకోవాలనే ప్రయత్నం ఉన్నది.
బయటికి మాత్రం రావటల్లేదు.

నాలుగు ప్రశ్నలు వేస్తే లోపలిదంతా బయటికి వస్తుంది అనిపించి " భార్య నిన్ను బాగా చూసుకుంటున్నదా" అన్నాను.

ఇంక మనిషి ఆగలేక పోయాడు. "మేస్టారు మీరు ఏమి అనుకోకుండా ఉంటే మీ ఇంటికి భోజనానికి వస్తాను" అని బెణుకులేకుండా చెప్పేసాడు. "త్రివిక్రమా మా ఇంటికి తప్పకున్దా రా. కానీ నేను ప్రస్తుతం స్వయంపాకం. పిల్లలు, ఇంటి ఆవిడా పుట్టింటికి వెళ్లారు". అన్నాను. అయితే మీరే మాయింటికి రండి అని నాలిక కరుచుకున్నాడు.

"త్రివిక్రమా ముసుగులో గుద్దులాట ఏందుకు, అసలు సంగతేమిటో చెప్పు" అన్నాను.

"కొత్త కాపురం అంటే నాకెమిటో తెలియదు, మా అవిడ నాతో మాట్లాడటం మానేసింది. నాకు రొజూ చారు అన్నమే గతి " అని బావురుమన్నాడు.

తను వంటరిగా ఉన్నా రోజుల్లో ప్రతి ఆదివారం వచ్చి చక్కగా పప్పు, కూర , పచ్చడి వేసుకుని సుష్టుగా భోజనం చేసేవాడు. మా ఆవిడని వంట బాగా చేస్తారని తెగ పొగిడేవాడు. దానితోటి ఆవిడ మహాదానందపడిపోయి జాగర్తగా వంట చేసేది. చక్కగా వేగిన కందిపప్పుతో చేసిన కందిపచ్చడి, చిక్కని కలగాయ పులుసు యెంత బాగుండేవో. మళ్ళా ఆరోజులేప్పుడు వస్తాయో నాకు !

ఇటువంటి భోజనప్రియుడు, ఏదో పెళ్లి చేసుకుని సుఖపడుదామని అనుకుంటే జరిగినది ఇది. ఎంత కొత్త పెళ్లామయినా హద్దు పద్దు తెలియకుండా మొదటిసంవత్సరం కాపురంలోనే మొగుడి మొహాన చారు అన్నం కొట్టడం నాకు నచ్చలేదు.
నాలాంటి వాళ్ళయితే ఏదో ఇదంతా మన మంచికే, ఈవిధంగా అయినా నాలుగు పౌన్లు తగ్గచ్చని ఊరుకుంటారు.

కొత్తకాపురం లో ఈవిధంగా జరగటం బాగుండలేదు. అందుకనే మనవాళ్ళు కోడలు కాపురానికి వచ్చినప్పుడు అత్తగారు తప్పకుండ ఇంటిలో ఉండాలంటారు. ఇటువంటిది పెళ్ళయిన అయిదారేళ్ళకి జరిగితే పెద్ద పట్టించుకోవలసిన అవసరం ఉండదు. అది మాములుగా జరిగే వ్యవహారమే. దీనిలో లోగుట్టు ఏదో ఉంది. పాపం అమాయకుడిని పట్టుకుని ఆడిస్తోంది. ఇటువంటి సమయాల్లోనే బాధలు పంచుకోవటానికి దగ్గరవాళ్ళు గుర్తుకు వస్తారు. నెలల తరబడి కనపడని మనిషి అమాంతంగా వెతుక్కుంటూ వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు.

మనం బాధ చూడలేక కలిపించుకుని ఏమన్నా సలహా చెపుదామన్నా ఇది భార్య భర్తల మధ్య వ్యవహారం. ఒకే మంచం మీద పడుకుంటారు కదా !. నాలుగు రోజుల తర్వాత హార్మోన్స్ వాటికవే కిక్ చేస్తాయి. కలిసిపోతారు. సలహాలు ఏమిచెప్పినా మనం శత్రువులమౌతాము. మనల్ని తిప్పి తప్పించుకు తిరుగుతారు మనమేదో తప్పు చేసినట్లు. భార్య భర్తల కి సలహాలు ఇవ్వటంలో చాల జాగర్తగా ఉండాలి.

అందుకే "త్రివిక్రమా ఇదేదో భార్యాభర్తల మధ్య గొడవ లాగా ఉంది. నేను సామాన్యంగా ఇటువంటి వాటిల్లో పట్టించుకోను . కానీ నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. ఏమి చెయ్యాలో తోచటం లేదు" అని ఖచ్చితంగా చెప్పేసాను.

"మేష్టారు మీరు పెద్దవాళ్ళు. జగమెరిగిన బ్రాహ్మణులు. మన సంస్కారం ప్రకారం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండాలి. మీకన్నా దగ్గర వాళ్ళు నాకెవ్వరూ లేరు. దయచేసి మీరే నాకు కొంచం ఏదన్నా సలహా ఇవ్వండి. నేను అసలు సంగతి తెలియక చాలా బాధపడుతున్నాను" అన్నాడు.

"సరే త్రివిక్రమా నేనే ఒకటి అడుగుతాను చెప్తావా" అన్నాను.

"మీరేమడిగినా చెప్తాను. నేను ఇంట్లో ఈ మౌనవ్రతాన్ని భరించలేను. నన్నీ బాధ నుండి విముక్తుణ్ణి చేయండి" అన్నాడు.

నాకు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వటమంటే చాలా ఇష్టం. నా అనుభవాలన్నీ వాటిల్లో గుత్తించి చెప్పచ్చు. మొదట మా ఆవిడకి సలహా లివ్వటం మొదలెట్టాను. అది ఏన్ని రోజులో సాగలేదు. ఇప్పుడు దాన్ని గురించి చెప్పటం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ తనంతట తనే అడగటం తోటి నా సంతోషానికి అడ్డు లేదు. గారెల బుట్ట ఎదురుగ తన్నుకుంటూ వచ్చినట్లయ్యింది. ఇంక నా పరిశోధన ప్రశ్నలు ప్రారంభించాను. ఇది కొంచం సున్నిత మయిన వ్యవహారం. జాగర్తగా కనుక్కోవాలి అసలు సంగతేమిటో.

చూచాయగా పరిస్థితులు తెలుస్తాయని వెంటనే "త్రివిక్రమా రాత్రిపూట మీరు ఒకే మంచం మీద పడుకుంటున్నారా ?" అని అడిగాను. భార్య భర్తల మధ్య ఎంత సివియర్ ప్రోబ్లామో తెలుసుకోవాలంటే ఇటువంటిది మొదటి ప్రశ్నగ వెయ్యాలి.

"పడుకోటం లేదండి . నాకు క్రింద కార్పెట్ మీద పడుకోవటం అలవాటు. ఆవిడని పడుకోమంటే అమెరికాలో కూడా తనకి క్రింద పడుకునే ఖర్మ మేమిటి? ఇష్టం లేదు అన్నదండి' అని అన్నాడు.

వీరిద్దరి మధ్య ఘర్షణ కొంచం క్లిష్టం గానే ఉన్నట్టు కనపడుతోంది. కొత్త కాపురం కలసి పడుకోటల్లేదంటూంటే నాకు కొంచెం బాధ వేసింది. వెంటనే గోప్యంగా "పిల్ల లక్కర లేదను కున్నారా" అని అడిగాను.

"అబ్బే అదేమీలేదండి, నెలల తరబడి ప్రయత్నం చేస్తున్నాము గాని ఫలితం కలగలేదు" అన్నాడు.

అయ్యగారు కార్పెట్ మీద పడుకుని, అమ్మగారు మంచం మీద పడుకుని ఏన్ని సంవత్సరాలు ప్రయత్నించినా ఫలితం వస్తుందని నేను అనుకోవటల్లేదు. అందుకనే సుతిమెత్తగా చెప్పను " త్రివిక్రమా కొన్ని దగ్గిర దారులున్నాయి. గుర్తుపెట్టుకో. మన పనులు అయ్యేదాకా మనం తగ్గాలి. ఆవిడ నిద్దర పోయే దాక ఆవిడా దగ్గర పడుకో. సరససల్లాపాలు, అన్నీ పనులు అయిపోయి ఆవిడ నిద్ర పోయిన తరువాత లేచి వెళ్లి కార్పెట్ మీద పడుకో. పిల్లలూ పుడతారు పట్టుదలలు తగ్గుతాయి. గడకర్ర లాగా నీ బ్యాక్ ఉంటుంది." అన్నాను.

త్రివిక్రమ చెప్పింది జీర్ణించు కుంటూ ఉన్నాడల్లె ఉంది, మౌనంగా ఉన్నాడు. " త్రివిక్రమా ఇంకొక అరగంటలో మన స్టేషనులు వస్తాయి. నేను సూటిగా ప్రశ్నలు వేస్తాను చెప్పు. ఆవిడ ఏన్ని రోజుల బట్టి నీకు చారు అన్నము పెడుతోంది. ఆవిడ కూడా నీతో పాటు తింటోందా?" అని అడిగాను.

" నెల రోజుల బట్టీ ఈ చారు అన్నమే గతి అండి. ఆవిడ గూడా నాతోపాటే తినేది కానీ వరం రోజుల బట్టి ఏదో వ్రతం చేసుకుంటోందిట, భర్తకు పెట్టి గాని భార్య తినగూడదని తను తినటం మానేసిందండి" అన్నాడు.

"పతివ్రత లాంటి భార్యను తెచ్చుకున్నావు త్రివిక్రమా, ఏంత పుణ్యం చేసుకున్నవో" అన్నాను.

"మాస్టారూ అల్లా అనవోకండి , ఆవిడా మధ్యాన్నం వంట సుబ్బరంగా చేసుకుని తింటోందని నా అనుమానం. రొజూ ఆకలవటల్లేదని మజ్జిగాతగి పడుకున్న, మనిషి వీసమంత చిక్కినట్లు కనపడటల్లేదు" అన్నాడు.

రాను రాను విషయం కమ్ప్లెక్ష్ అవటం తప్పించి, సులభంగా సరిదిద్దే వ్యవహారం లాగా లేదు. కొంచం ఆలోచించి "త్రివిక్రమా మీరు ఏప్పుడైనా పోట్లాడుకున్నారా ? నీకు గుర్తు ఉన్నంత వరకు చెప్పు. నీకు చిన్న విషయం ఆవిడకి పెద్ద విషయం అవ్వచ్చు. జీవితాంతం అవ్వే పట్టుకు సాధిస్తారు" అన్నాను.

"పోట్లాడుకోవటం ఆంటూ ఏప్పుడూ జరగలేదు కానీ మాకు డిఫెరెంసు ఆఫ్ ఒపినియన్స్ ఉన్నాయి. కింద పడుకోవటం నాకు అలవాటు, ఆ అలవాటుని మానుకోవటం నాకు ఇష్టంలేదు. మీరు ఏమి అనుకోకుండా ఉంటే చెప్తాను. తను ప్ల్యెబోయ్ , పెంతౌసే గురించి విన్నదిట. చూడాలి తీసుకురమ్మన్నది. మూడు పూటలా సంధ్యావందన చేసేవాడిని ఎల్లా తీసుకు వచ్చేది. మీరే చెప్పండి. కాదన్నాను. అంతే ఇంక ఎంత ఆలోచించినా ఏమి కనపడటల్లేదు. కాకపోతే రెండుమూడుసార్లు సినిమాలకి వెళ్దామంటే పడలేదు". అన్నాడు.

"త్రివిక్రమా ప్ల్యెబోయ్ , పెంతౌసే లకీ సంధ్యావందనానికీ ఏమి సంబంధం లేదు. వేటి పరిధిల్లో అవి ఉంటాయి. ట్రైన్ స్టేషన్ నూస్ స్టాండ్ లో అమ్ముతారు వెళ్లి కొని ఆవిడ కోర్కె తీర్చు. పుస్తకం విప్పాక నీకూ నచ్చుతుందిలే. నువ్వు అంతగా బాధపడే వాడి వయితే మర్నాడు ఆవిడనికూడా తీసుకుని గుడికి వెళ్లి దండం పెట్టుకో. మన గుళ్ళూ మన ఆచారాలు ఎందుకు ఉన్నాయనుకుంటున్నావు ?".

"అయినా త్రివిక్రమా ఆవిడ సినిమాకి తీసుకువెళ్ళ్ల్లమంటే చిలుకాగోరింకల్లాగా వెళ్ళాక ఎందుకు కాదన్నా వోయి" అని అడిగాను.

" మాస్టారూ నేను చెప్పేది మీరు నిజంగా నమ్మరు. తను "ఆర్" రేటెడ్ సినిమాలకి తప్ప రాదట. చిన్నప్పటినుంచి పౌరాణికాలు, మామూలు సినిమాలు చూసి బోరు కొట్టిందట. మొన్నటికి మొన్న 'ఇండీసెంట్ ప్రొపొసల్' సినిమాకి వెల్లుదామన్నది . అది మనము చూసేది కాదు అని చెప్పను. అన్నట్టు నిజంగా ఆలోచిస్తే అప్పటినుండే ఈ చారు భోజనం" నేను నోరు వెళ్ళబెట్టుకుని వింటున్నాను. " రోజూ ఒకే చారు కాదండీ, వడియాల చారు, ధనియాల చారు, మిరియాల చారు, వంగపేళ్ళ చారు, నాబొందచారు నాబోలెచారు. చారుల్లో ఇన్ని రాకలున్నాయని నాకు ఇంత వరకు తెలియదు" అన్నాడు.

వంగపేళ్ళ చారు అనగానే ప్రాణం లేచివచ్చింది. ఏన్ని సంవత్సరాలో అయ్యింది రుచు చూసి. వంగపేళ్ళు చేయటమే ఒక పెద్ద ప్రాసెస్స్. వంకాయలని తరగటం, రొజూ ఎండ పెట్టడం, వరుగులు చెయ్యటం. మద్య మధ్య లో వర్షం వస్తే ఇంట్లోకి చేర్చటం. వేసవి కాలం శలవలలో ఈ పనులన్నీ తగిలేవి. చూస్తుంటే ఈ అమ్మాయి కొంచం గడుసు దాని లాగే ఉంది. త్వరగా ఏదో ఉపాయం ఆలోచించి వాళ్ళింటికి వెళ్ళి ఆ చారు రుచి చూడాలి.

వెంటనే "త్రివిక్రమా ప్రతి వాళ్ళకీ ఏవో కోరికలంటూ ఉంటాయి. అందులో కొత్తకాపురం. వీలయినంతవరకూ సతుల కోర్కెలని సరదాగా సరసాలతో తీర్చడానికి ప్రయత్నించాలి నాయనా" అన్నాను.

"మేష్టారూ మీరు చెప్పింది బాగానే ఉంది కాని తన కోర్కెలు తీర్చ టల్లేదని మొగుడికి రోజూ చారు అన్నం తగలేయ్యటం అమానుషం" అన్నాడు. నాకు వెంటనే చిన్న అనుమానము వచ్చింది. "త్రివిక్రమా నీకు వంట రాదని మీ ఆవిడకి ఏమన్నా చూచాయగా చెప్పవా ?" అన్నాను. "లేదండి" అన్నాడు. థాంక్ గాడ్ అనుకున్నాను మనసులో.

వంగ పేళ్ళ చారు రుచి మనసులో గుల గుల మంటోంది. ఇంక నా లెక్చర్ ఒక చిన్న నిట్టూర్పు తీసి మొదలెట్టాను "త్రివిక్రమా నువ్వు గ్రహించావో లేదో మీ ఇంట్లో ప్రస్తుతం సాధింపు అనే ప్రక్రియ జరుగుతోంది. ఇది మామూలే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. పెళ్ళయిన మొదటి సంవత్సరం మొగుడు పెళ్ళా లిద్దరూ వారి వారి బలాలు చూసుకుంటారు. ఎవరు ఎవరు కంట్రోల్ లో వుండాలి అనేది ఇప్పుడే నిర్ధారణ అవుతుంది. నువ్వు గనక తికమక పడిపోయి ఆ కులుకులకి, ఆ పలుకులకి భ్రమ పడి పోయి ఇది నీకు వచ్చు అది నీకు రాదు అని చెప్పావో, జీవితాంతం నీ జుట్టు వాళ్ల చేతికి ఇచ్చేసినట్టే. ఎంతమందో అమాయకులు ఈ విషయం తెలియక మోసపోయారు "

"నాయనా త్రివిక్రమా నువ్వు చాల అమాయకుడివి. ఆడవాళ్ళూ స్వతహాగా తెలివైనవాళ్ళు. ఏదో విధంగా మొగుణ్ణి కంట్రోల్ లోకి తీసుకుంటారు. ఇది ఏప్పటికయినా తప్పదు. నేనొక సలహా ఇస్తాను తప్పక పాటించు. ఇది తాత్కాలికం అనుకో కానీ పనిచేస్తుంది. నెమ్మదిగా నువ్వే ఆవిడకి కంట్రోల్ ఇవ్వటం మొదలెట్టు. సతీమణీ స్నానం చెయ్యమంటావా? భార్యామణీ భోజనం పెడతావా? ఇటువంటి చిన్న చిన్నవి అడుగుతూ ఉండు. మొగుడు తన కంట్రోల్ లో ఉన్నాడని భ్రమ కలిగించు. ఆవిడకి తృప్తిగా ఉంటుంది. ఈవిధంగా సాగినంత వరకూ సాగనీ, నీ జీవితం బాగుంటుంది" అని చెప్పాను.

"మేష్టారూ నాకు జ్ఞానోదయం అయ్యింది, ఇకనుండి మీరు చెప్పినట్లే జాగర్తగా నడుచుకుంటాను. ప్రస్తుతం ఈ చారు నీళ్ళ నుండి ఏదోవిధంగా బైటికి లాగండి నన్ను" అన్నాడు.

ఇదే మంచి సమయం. కుర్రవాడు వినే పద్ధతిలో ఉన్నాడని ఒక చిన్న ఉపన్యాసం మొదలెట్టాను. "చూడు నాయనా మనకి తెలియని వాటి గురించి మనమెన్నో కోరికలు, ఆశలు పెట్టుకుంటాం కాని అవి నిజమౌతయ్యో కాదో మనకి తెలియదు. నిజం తెలియాలంటే మనం వాటిని ఎక్స్పిరియంస్ చెయ్యాలి. నేను అమెరికా వెళ్తే రెండు సంవత్సరాల కొక కొత్త కారు, మూడు సంవత్సరాలకొక కొత్త పెళ్ళాం వస్తుందని అనుకునే వాణ్ణి. అది నిజామా ! నాకు 1982 కారు 1976 పెళ్ళాం. " అంటుండగా త్రివిక్రమ ముసిముసి నవ్వులు నవ్వు తున్నాడు. నాకు చిరు కోపం వచ్చింది అయినా తట్టు కున్నాను ఎలాగయినా వంగ పేళ్ళ చారు తాగాలి.

అందుకనే అన్నాను " త్రివిక్రమా అసలు తప్పంతా నీదే. ఆవిడ తన వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వేదో ఉద్ధరిస్తావని వస్తే ఏమిచేశావు? కనీసం సినిమా కి కూడా తీసుకు పోలేదు. ఆవిడకి కాదు నీకు మానవత్వం లేదు " అని మెత్తగా చివాట్లు పెట్టాను.

"మేష్టారూ నన్ను క్షమించండి, తప్పంతా నాది లాగానే కనపడుతోంది. ఏదోవిధంగా నన్నీ సుడిగుండం లోనుండి బయటికి తీయండి' " అన్నాడు.
"నువ్వు కొత్తగా పెళ్లి చేసుకుని ఈ పరిస్థితిలో ఉన్నావు. మనమనుకున్న వన్నీ జరగవు, ఇంట్లో అయినా సరే. ముందుచూపు చూడాలంటే మనం ఇప్పుడు ఏ స్టేజి లో ఉన్నామో తెలుసుకోవాలి. నీకు వంట రాదని ఈ విధంగా సాధిస్తోంది. ఏదో విధంగా ఆవిడకి నీకు వంట బాగా వచ్చు అనే ఇమ్ప్రేషన్ కలిగిచ్చాలి. దానితో వంటతో నిన్ను సాధించటం కుదరదని తెలిసిపోతుంది" .

"త్రివిక్రమా రేపటితో నీ చారు బాధ తప్పుతుంది. మీ ఇంటికి రేపు భోజనానికి వస్తాను. మనం వంటలగురించి మాట్లాడుకుందాం. నువ్వు పెద్ద వంటగాడివని ఇమ్ప్రేషన్ కలిగిద్దాము. రేపు మాత్రం వంగపేళ్ళ చారు చేయించు" అన్నాను.

"మేష్టారూ నాకు వంట రాదు. రేపు ఆవిడ వంట చెయ్యమంటే ఏమిచేయ్యాలి అని భయంగా ఉంది" అన్నాడు.

"త్రివిక్రమా నీకు వంట రాదని నాకు తెలుసు. మనము నీకు వంట వచ్చు అనే ఇమ్ప్రేషన్ కలిగిస్తున్నాం అంతే. అటువంటి ఇరకాటంలో గనక పడితే వెంటనే నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను స్వీట్హార్ట్ -- అని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకో".

"ఎందుకైనా మంచిది మీఆవిడని హనీ బోనీ అంటూ ఉండు అప్పుడప్పుడు. ఈ కాలం పిల్లలకి అలా పిలుపించుకోటం ఇష్టంట" అన్నాను.

"మేష్టారూ 'నేపర్విల్' దగ్గర కోస్తోంది రేపు నేనేమి చెయ్యాలో త్వరగా చెప్పండి" అన్నాడు.

"త్రివిక్రమా మీ ఆవిడకి నన్ను పెద్ద పాక శాస్త్ర ప్రవీణుడిగా పరిచయం చెయ్యి. మా ఆవిడా నా దగ్గరే వంట నేర్చు కున్నట్లుగా కూడా చెప్పు. కొచం ఎక్కువ చేసి చెప్పు. మా ఆవిడా ప్రస్తుతం వూళ్ళో లేదు కాబట్టి క్రోస్స్ చెకింగ్ ఉండదు మన కేమీ ఫరవాలేదు. నువ్వేదో మా ఇంటికి వస్తూ పోతూ ఉండటం మూలంగా కొద్దిగా వంటలో ఫైనెర్ పాయింట్స్ నేర్చు కున్నట్లు కుడా చెప్పు. మిగతావి నేనే చూసుకుంటాను. కాపురం చెయ్యాలంటే కొంచం లౌక్యం కూడా ఉండాలి నాయనా!"

"అన్నట్టు చూడు త్రివిక్రమా రేపు ఆ వంగపేళ్ళ చారు చేసేటప్పుడు ఒక చిటికెడు బెల్లం వేయించు. మంచి రుచి వస్తుంది" అంటూ స్టేషన్ లో దిగటానికి లేచాను. ఏదో విధంగా త్రివిక్రమ కాపరాన్ని సవ్యం చెయ్యాలి అనుకుంటూ ఇంటిముఖం పట్టాను.

Friday, November 27, 2009

9. పరంధామయ్య పెళ్లి ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కథ ఆగుస్టు 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
కథ ఇలా మొదలవుతుంది
"పరంధామయ్య కోసం గత అయిదు నిమిషాల నుండి ఎదురు చూస్తున్నాను. పెళ్లి గురించి చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. "
ఇక మీరు పక్క బొమ్మని క్లిక్ చేసి చదవండి


Saturday, November 21, 2009

8. మానసలీల ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కథ మార్చ్ 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.

కథ ఇలా మొదలవుతుంది
మురహరిరావు గారి అమ్మాయి లీల అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం
ఇక మీరు క్లిక్ చేసి చదవండి
Monday, November 2, 2009

7. మాఇంటి పెళ్లి ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు


ఈ నా చిన్న కవిత మార్చ్ 1991 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.

ఇలా మొదలవు తుంది
వెంకటగిరి పట్టుచీరలో
వచ్చింది పెళ్ళికూతురు
ఇంక మీరు క్లిక్ చేసి చదవండి

Sunday, November 1, 2009

6. మోహినీప్రియ ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కవిత డిసెంబర్ 1989 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.

ఇలా మొదలవు తుంది
వేసంగి వచ్చింది
వెచ్చగా ఉంది
ఇంక మీరు క్లిక్ చేసి చదవండి

Thursday, October 29, 2009

5. మేఘ సందేశం ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కవిత జూన్ 1989 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
ఇలా మొదలవు తుంది
నేనిస్తా నీకో
కానుక
ఇంక మీరు క్లిక్ చేసి చదవండి

Monday, October 26, 2009

4. నువ్వంటే నాకెంతో ఇష్టం ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు


ఈ నా చిన్న కవిత జనవరి 1989 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.


ఇలా మొదలవు తుంది
నువ్వంటే నాకెంతో
ఇష్టం
కమ్మగా చెప్పాను
సత్యం
ఇంక మీరు బొమ్మని క్లిక్ చేసి చదవండి

Thursday, October 22, 2009

3. కాలం మారింది ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావుఈ నా చిన్న కవిత 1988 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
1980's లో విసిఅర్ లు మనం కొనే ధరలలో వాస్తున్నాయి కానీ, ఇంకా అందరికీ ఇవి లేవు.

ఇలా మొదలవు తుంది
మా ఇంట్లో విసిఅర్ ఉంది
మీరు రండి మాఇంటికి
ఇంక మీరు క్లిక్ చేసి చదవండి

Friday, October 9, 2009

2. నా చిన్న కథ ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కథ అక్టోబర్ 1987 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు
కథ ఇలా మొదలవుతుంది
కొందరు పనులన్నీక్లుప్తంగా
చేసినా చెయ్యకపోయినా గుప్తంగా చేస్తారు.
కొందరు చేద్దామనుకున్న పనులు చేసినా
చేయకపోయినా ఊరు వాడ ఏకం చేస్తారు.
ఇక మీరు పక్క బొమ్మని క్లిక్ చేసి చదవండి
Friday, September 25, 2009

1. గతం గతః --- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

నా రచన ఏప్రిల్ 1987 తెలుగు వెలుగు లో (చికాగో తెలుగు అసోసియేషన్) ప్రచురించ బడినది.
మీరు బొమ్మని క్లిక్ చేస్తే అది పెద్దదౌతుంది.

గేయం ఇలా మొదలవుతుంది :
మేల్విల్ ఇండియానా లో
కాపురముండే
మెలిండా తోర్గినావ్ కి
ముద్దులొలికే మగడు కావాలని
మనసారా ప్రేమించాలని
కన్నె వయసులో తీరని కోరిక
ఇక మీరు క్లిక్ చేసి చదవండి

Sunday, September 20, 2009

నా తెలుగు రచన

లక్కరాజు శివ రామకృష్ణా రావు రచనలు

ఇట్చట నేను ప్రచురించిన రచనలు కొన్ని, తరువాత కొత్తగ వ్రాసిన రచనలు కొన్ని ఉంచుతాను. మీరు చదివి ఆనందించండి . మీరు చదివేటప్పుడు, టూల్ బార్ మీద ఉన్న view, దానినుంచి వచ్చే zoom, zoomin, zoomout ఉపయోగించండి. తేలికగా చదవచ్చు.

నా మనవి
నేను ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగు లో కనుపిస్తుంది కాబట్టి కొన్ని తప్పులు దొర్లవచ్చు కనుక క్షమించండి. మీకు తెలుగులో కనపడక పోతే మీరు తెలుగు ఫాంట్స్ ని డౌన్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.

If you do not see Telugu script, you have to download Telugu Fonts.