Thursday, March 19, 2015

110 ఓ బుల్లి కథ 98-- ఇటలీ లో ఓ వారం - మళ్ళా రోమ్

వెనిస్ నుండి రోమ్ వెళ్ళటానికి మేము ఎక్కిన ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. సీట్లో కూర్చుని ఉంటే పక్కనున్న పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ లో ఇళ్ళూ, పొలాలూ, పచ్చిక బయళ్ళూ, ఊళ్లూ, సినీమా లో లాగా పక్కనించి మెల్లగా జారి పోతూ ఉంటాయి. టాప్ స్పీడ్ 250 km. ట్రైన్ ఎంత స్పీడ్ లో పోతోందో ఎదురుకుండా కనపడుతుంది. మధ్యలో కొన్ని స్టేషన్ల లో ఆగటం వల్ల, ఎప్పుడో కొంత సేపు తప్ప 250 km స్పీడ్ రాలేదు.

సరీగ్గా మధ్యాహ్న సమయానికి రోమ్ చేరుకున్నాము. టాక్సీ కోసం క్యూ లో నుంచున్నాము. మా ముందర నుంచున్న అమ్మాయి చాలా exite అయిపోయి మాట్లాడుతోంది. 30 ఏళ్ళ క్రిందట ఆస్ట్రేలియా వెళ్ళి ఇప్పుడు మళ్ళా ఇటలీ వచ్చిందిట. ఏదో ఏదో మాట్ల్లడేస్తోంది. నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఇండియా వచ్చినప్పుడు అల్లాగే ఫీల్ అయ్యాను. మాతృ భూమి కదా! ఇంతలో మా టాక్సీ వచ్చింది అపార్ట్మెంట్ కి బయల్దేరాము.

అపార్ట్మెంట్ అమ్మాయి మాకోసం wait చేస్తోంది. వాళ్ళు మొదట అపార్ట్మెంట్ అంతా ఏవి ఎక్కడో చూపెట్టి, తాళాలు ఇచ్చి వెళ్తారు. ఇక్కడ బిల్దింగ్లన్నీ చాలా పాతవి. కొత్తగా రిమోడాల్ చేశారల్లె ఉంది, అపార్ట్మెంట్ చాలా కొత్తగా ఉంది. హై సీలింగ్స్, దానికి తగ్గట్లు పెద్ద పెద్ద ద్వారాలు, పెద్ద పెద్ద గ్లాస్ విండోస్. కొంచెం మేము జాగర్తగా చూసుకోవలసింది "కరెంట్" వాడకం అని చెప్పింది. "ఇటలీ" లో "కరెంట్ " ఉత్పత్తి చెయ్యరుట. వాళ్ళు కొనుక్కుంటారుట. అందుకని ప్రభుత్వం ఒక్కొక్క అపార్ట్మెంట్ కి ఇంతే వాడుకోవాలని చెబుతుందిట. పొరపాటున అంతకన్నా ఎక్కువ వాడితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంతా చీకటి. అప్పుడు ఏమి చెయ్యాలో కూడా చెప్పింది. ఇక్కడ పిక్ పాకెట్లు ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగర్తగా ఉండండి అని కూడా చెప్పింది. ఆ అమ్మాయి పక్క పల్లెటూరు లో ఉంటుందిట ప్రాబ్లం వస్తే పిలవచ్చు గానీ తను రావాలంటే రెండు గంటలు పడుతుందని చెప్పి వెళ్ళిపోయింది.

మేమందరం కాసేపు విశ్రమించిన తరువాత బయటికి వెళ్లాలని అనుకున్నాము. అప్పుడే కొంచెం కునుకు పడుతోంది. "మీది see through బాత్ రూం", "చ !" అని ఇంకో కంఠం. ఏమిటో అర్ధం కాలా. మా బాత్రూం గోడ లో షవర్ వైపు సగం పై భాగం గ్లాస్ తో ఉంది. ప్రస్తుతం చర్చిస్తున్నది దాని గురించి. మొదట అదేదో కొత్త ఫాషన్ అనుకున్నాను, కానీ అసలు సంగతి తెలిసిన తరువాత కొంచం గాబరా పడ్డాను. నిజంగా సంతోష ఆశ్చర్యాలతో గాభరా పడ్డాను. "మోడరన్ బెడ్ రూమ్ లో ఉన్నందుకు ఒక క్షణంలో సంతోషం ఇంకొక క్షణంలో ఇది దేనికి దారి తీస్తుందో అన్న గాభరా. ఎవరన్నా బాత్ రూం ఉపయోగిస్తుంటే ఇంకోళ్ళు గదిలో ఉండకూడదు అని ఒక రూల్ పాస్ చేసి, "సీత్రు" బాత్ రూం ప్రాబ్లం సాల్వ్ చేశాము. నేను ఇంతగా ఆశ్చర్య పోయింది ఒక సారి కాలిఫోర్నియాలో మా ప్రసాద్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది. బాత్ రూం షవర్లో రెండు వేపులా షవర్ హెడ్ లు చూసి ఆశ్చర్యపోయాను. ఇంటాయిన నడిగితే చెప్పినదేమంటే "ఇద్దరూ ఒకసారి షవర్ చేస్తే టైము కలసివస్తుంది" అని. మేము టెస్ట్ చేస్తే, మాకేమీ టైం సేవ్ అయినట్లు కనపడలేదు కాగా పోగా 10 నిమిషాల షవర్ అరగంట తీసుకుంది. అసలు ఉద్దేశం, షవర్ కోసం ఎవరు ముందర వెళ్ళాలి అని మొగుడూ పెళ్ళాం మధ్య  తగువులు రాకుండా ఉండటానికి అనుకుంటాను (విడాకుల రాజ్యంలో జాగర్తగా ఉండాలి మరి).

ఈ తడవ మేమున్న అపార్ట్మెంట్ పెద్ద సందులో ఆరవ అంతస్తులో ఉంది. మీరు అపార్ట్మెంట్ బుక్ చేసుకునే టప్పుడు ఎలివేటర్ ఉందొ లేదో తెలుసుకుని బుక్ చెసుకొండి. లేకపోతే ఈసురోమంటూ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఎదురుకుండా ఉన్న భవంతిలో మ్యూజిక్ స్కూల్ ఉంది. సందులో అడుగడుగుకీ ఒక రెస్టోరెంట్ ఉంది. రెస్టోరెంట్ అంటే ఒక రూం దానిముందర ఒక షామియానా దానికింద ఒక నాలుగు టేబుల్స్, కుర్చీలు.

ఒక కునుకు తీసి లేచి ఊరు చూడటానికి బయల్దేరాము. మొదట వెళ్ళింది "లేవి ఫౌంటెన్". టాక్సీ వాడు చెబుతూనే ఉన్నాడు  "అక్కడ ఏమీలేదు చూడటానికి దాన్ని బాగు చేస్తున్నారు" అని. కానీ వెళ్ళాము. ఫౌంటెన్ బాగు చేస్తున్నారు పనిచేయ్యటల్లేదు. దాని చుట్టూతా నడవటానికి వాక్ వే కట్టారు. మాలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. క్యూ లో నుంచుని  వెళ్తుంటే "ఫౌంటెన్ పని చేయకున్నా మీరు డబ్బులు వెయ్యచ్చు" అనే బోర్డ్ కనపడింది.. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఒక కోరిక కోరుకుని వెనక్కి తిరిగి ఫౌంటెన్ లో డబ్బులువేస్తే ఆ కోరిక తీరుతుందని. చాలా ఇంగ్లీష్ సినీమాలలో ఇక్కడ అమ్మాయిలు వెనక్కి తిరిగి డబ్బులు వేసి వాళ్ళు కోరిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు.

సాయం సంధ్య నెమ్మదిగా నడుచుకుంటూ, సోవనీర్స్ అమ్మే బడ్డీ కొట్లు, రెస్టోరెంట్ లు దాటుకుంటూ దగ్గరలో ఉన్న ప్లాజా వేపు వెళ్ళాము. మన ఊళ్ళల్లో రోడ్డు పక్క వేరుశనగ కాయలు పొయ్యిమీద వేయిస్తూ అమ్మినట్లు, ఇక్కడ పొయ్యిమీద వేయిస్తూ చెస్ట్ నట్స్ అమ్ముతున్నారు. నాకెందుకో తినాలని అనిపించింది. కొనుక్కుని తిన్నాము. ఎప్పుడూ అవి తినలేదు కానీ రుచి ఎప్పుడో తిన్నట్లు గా ఉంది. తరవాత ఎవరో చెప్పారు అవి పనస గింజల రుచిట.

ప్లాజా అంటే ఒక పార్క్ లాంటిది కాకపోతే పచ్చిక ఉండదు సిమెంట్ నేల. మధ్యలో ఒక పెద్ద ఫౌంటెన్. ఫౌంటెన్ చుట్టూతా నగ్న శిల్పాలు. నగ్న శిల్పాలు చూడకుండా రోమ్ లో తిరగటం చాలా కష్టం. ఇక్కడ బోలెడంత మంది జనం. చాలా మంది మాలాగా టూరిస్టులు.
 దొంగలున్నారు మీ వస్తువులు జాగర్త అని చాలా చోట్ల వ్రాసి ఉంది. పక్క పోలిస్ వాన్ కూడా ఉంది. మేము జిలాటో ఐ స్క్రీం కొనుక్కుని తింటూ కూర్చున్నాము. ఇంతలోకే కరెంట్ పోయింది. అయిదు నిమిషాల్లో మళ్ళా వచ్చింది కానీ ఏదో గలాటా మొదలయింది. పోలీసులు కూడా వచ్చారు. ఎవ్వరో అమ్మాయిది పర్స్ పోయిందిట.

అక్కడి నుండి నడుచుకుంటూ డిన్నర్ కి ఒక రెస్టోరెంట్ కి వెళ్తూ

 దారిలో ఒక సోవ నీర్ బడ్డీ కొట్టు దగ్గర ఆగాము. కొట్టు మూసెయ్యబోతున్నాడు అందుకని ఇదివరకు 5 యురోలు చెప్పినది ఒకటిన్నర యురోలకే ఇచ్చేశాడు. దాదాపు ఈ సావోనీర్స్ అమ్మే చాలా మంది మన దగ్గర దేశాల నుండి వచ్చిన వాళ్ళే. రెస్టోరెంట్ దగ్గర సీటింగ్ కోసం కొంచెం సేపు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.
ముందరే ఈ రెస్టోరెంట్ బాగుంటుందని మా కోడలు సెలక్ట్ చేసింది. అనుకున్నట్లు మా వాళ్ళు రెస్టోరెంట్ లో పీజ్జా, పాస్తా చాలా బాగున్నాయని లొట్టలేస్తూ తిన్నారు. నేను మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ తో సరిపెట్టుకుకున్నాను. ఇక్కడ అన్ని పిజ్జా లు Thin Crust  Pizzas  అంటే చాలా పల్చగా పెద్ద చపాతీ ల్లాగా ఉంటాయి. మీరు రోమ్ కి వెళ్తే ఇక్కడ తప్పకుండా తినండి. ధరలు తక్కువ, పదార్ధాలు చాలా రుచికరంగా ఉంటాయి. మీరు తాగకుండా ఉంటే, తక్కువ బిల్లుతో బయటికి రావచ్చు. తాగితే బిల్లు మోపెడవుతుంది. అక్కడనుండి టాక్సీ లో ఇంటివేపు మళ్ళాము.

మర్నాడు పొద్దున్న చక్కటి  తియ్యటి సువాసనల తో మెళుకువ వచ్చింది. క్రింద రెస్టోరెంట్ లో  "క్రోసాంట్ లు " బేక్ చేస్తున్నారల్లె ఉంది. కాల కృత్యాలు తీర్చుకుని చూస్తే పిల్లలు ఇంకా లేవలేదు. బయటికి వెళ్ళాలని నిర్ణయించు కున్నాము.

అప్పుడే జనసంచారం మొదలవుతోంది. ఎదురుకుండా ఉన్న "సెయింట్ లూ ఇస్ మ్యూజిక్ స్కూల్" కి విద్యార్ధులు వాళ్ళ వాళ్ళ వాయిద్యాలు తీసుకుని  వస్తున్నారు. కొందరు ఎదురుకుండా నుంచుని సిగరెట్లు కాఫీ తాగుతున్నారు. ట్యూనప్ చేసుకుంటున్నా రల్లె ఉంది, కొన్ని వాయిద్యాల శబ్దాలు వినపడుతున్నాయి. కుడివేపు వెళ్దామా ఎడమవేపు వెళ్దామా అని ఆలోచిస్తున్నాను ఇంతలోకే మా ఆవిడ కుడి వైపు వున్న షాప్ లోకి వెళ్ళింది. వెల్, ఎటువెళ్ళాలో క్షణంలో తేలిపోయింది. ఆ షాప్ చూస్తే Internet Cafe షాప్. ఇంట్లో IPAD, Computer, WIFI ఉన్నాయి ఎదుకు వెళ్లిందో అర్ధం కాలేదు. ఎంతసేపటికీ రాక పోతే నేను కూడా లోపలికి  వెళ్ళాను. ఎదురుకుండా కౌంటర్ మీద ఒక పది చిన్న కత్తెరలు పోసి ఉన్నాయి. ఆవిడ ఏది తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చిందో అసలు సంగతి గుర్తుకు వచ్చింది. కస్టమ్స్ తో ప్రాబ్లం అనుకుని ఈ తడవ నేను కత్తెర తెచ్చుకోలేదు, మీసాలు పెరిగినాయని రోజూ కంప్లైంట్ చేస్తోంది కానీ ఇంత అర్జెంట్ అని నేను అనుకోలేదు. అయినా Internet Shop లో కత్తెరలు ఎలా ఉంటాయని ఊహించిందో. ఆ షాప్ ఓనర్ కూడా మన భాయే. కాకపోతే పక్క దేశం పాకిస్తాన్ నుండి వచ్చాడు. సరే కత్తెర కొనుక్కుని బయటపడ్డాము.

కుడివేపు నడవటం మొదలెట్టాము. చిన్న చిన్న రెస్టోరెంట్లు చాలా ఉన్నాయి. ఒక చోట మొగుడు పెళ్ళాం కూర్చొని బోర్డ్ మీద ఆరోజు మెన్యు వ్రాస్తున్నారు. ఇక్కడ రెస్టోరెంట్ ముందర ఆరోజు మెన్యు, వాటి ధరలు ఉంటాయి. ఒక షాప్ డిస్ప్లే లో కేక్ లు ఉంటే దానిలోకి వెళ్ళాము. చిన్న కేక్ ఇరవై యురోలు చెప్పారు. ఆర్గానిక్ షాప్ ట. అక్కడ ఒక శాంపిల్ చాకొలేట్ ముక్క తిని కాఫీ తాగి బయటపడ్డాము. వీధి చివరికి వచ్చాము. అక్కడ కూరగాయల షాప్ ఉంటే లోపలి వెళ్లి ఒక పెరుగు డబ్బా, బంగాళ దుంపలు కొనుక్కుని ఇంటికి బయల్దేరాము. ఈ షాప్ ఓనర్ కూడా మన భాయే. కాకపోతే పక్క దేశం బంగ్లాదేష్ నుండి వచ్చాడు. నడుస్తుంటే వెనకాలనుండి "యువర్ డ్రెస్ ఈస్ బ్యూటిఫుల్" అనే మాట వినపడింది. నేను పాంట్ షర్టు వేసుకున్నాను అంత ఆకర్షణీయంగా ఏముందా అనుకుని మాట్లాడకుండా ముందరికి వెళ్తున్నాము. ఇంతలోకే ఒక ఆవిడ పరిగెత్తుకు వచ్చి మా ఆవిడతో "ఓహ్ క్యుట్ డ్రెస్" అంది. మా ఆవిడ సాదా చీర కట్టుకుంది. ఇది రెండో సారి బజారులో ఆవిడకి పొగడ్తలు రావటం. సరే థాంక్యు  చెప్పి గబగబా నడుచుకుంటూ ఇంటికి జేరాము. అప్పటికి ఇంట్లో అందరూ లేచారు. ఇవ్వాళ చాలా హేక్టిక్ షెడ్యుల్. ఫుల్ డే రోమ్ లో తిరగటం.

అందరం రోమ్ లో ఆకర్షణలన్నీ చూడటానికి బస్ టూర్, Big Bus దగ్గరకి జేరుకున్నాము. వీళ్ళు క్రెడిట్ కార్డులు తీసుకోరు (ఫోనులో తీసుకుంటామని చెప్పినా సరే). అందరి దగ్గరా ఉన్న చిల్లర ఉపయోగించి టిక్కెట్లు తీసుకున్నాము. వీళ్ళ బస్సులు రోమ్ చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. చూడటానికి ఒక చోట దిగి, అది చూసిన తరువాత ఇంకో బస్ లో ఎక్కచ్చు.

మా మొదటి స్టాప్ కోలీజియం (colleseam). రోమన్ సామ్రాజ్యంలో వందల ఏళ్ళ క్రిందట రాజులు, ప్రజలకోసం దీనిని కట్టించారు. ఇది ఒక విధంగా కమ్యునిటీ సెంటర్ లాంటిది. దీని శిధిలాలు చూడటానికి జనం తండోప తండాలుగా వస్తారు. ఆనాడు ప్రజలకోసం ఇంత పెద్ద కట్టడం కట్టా రంటే మెచ్చుకో తగిందే . పక్కనున్న ఫొటోలు, కట్టినప్పుడు ఎల్లా ఉండేది, శిధిలాలు గ ఇప్పుడెల్లా ఉన్నాయో చూపుతాయి. అక్కడ ఎప్పుడు  ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో ముందరే చెబుతారుట. అందరూ పిల్లా జేల్లాతో వచ్చి పిక్నిక్ చేసుకుంటారు. ఇక్కడ వంటలు చేసుకుని తినటానికి పెద్ద స్థలం. వినోద కార్యక్రమాలు జరపటానికి పెద్ద సభా స్థలం. దాని ముందర కూర్చుని చూసి ఆనందించటానికి తగిన సౌకర్యాలు. ప్రేక్షకులు సభా ప్రాంగణం లోకి రావటానికి వారి వారి హోదాలని బట్టి ముఖ ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల ఆనందంకోసం ప్రొద్దుటనుండీ సాయంత్రం దాకా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఏరోజు ఏమి జరుగుతుందో ముందరే చెప్పే వాళ్ళుట . కొన్ని కొన్ని కార్యక్రమాలు చూడటం సంగతి అలా ఉంచి, అసలు వినటానికి గూడా చాలా కష్టంగా ఉంటాయి. ఇద్దరికి కత్తులిచ్చి కొట్టుకోమని ఎవరు గెలిస్తే వారిని వీరుడు అనటం (మన కోడి పందాలు గుర్తుకు వస్తాయి). ఖైదీలని తీసుకు వచ్చి క్రూర మృగాలతో పోరాడించటం. వగైరా వగైరా. ఇక్కడ ఒక అంతస్తు మొత్తం ఆనాటి నాగరికతని ప్రతిభింబించే ప్రదర్సన శాల ఉంది. ఆనాటి రాజులూ, శిల్పకళ ప్రాముఖ్యాలూ. ఆనాటి
రచయితలూ వారు వ్రాసిన రచనలూ. ఆ ప్రతుల్ని ఒక చోట పెట్టి అందరికీ అందుబాటు లో ఉంచాలనే ఆలోచనా. గ్రంధాలయ మనే దాని ఆవిష్కరణ. మొదటి గ్రంధాలయంలో రచనలని చదవటానికి అందరికీ అందుబాటులో ఎల్లా ఉంచే వాళ్ళు. చాలా అబ్బురమైన సమాచారం. చూడటం అయిపోయిన తరువాత బస్సుకోసం ఆగకుండా దగ్గరలో ఉన్నవి చూడటానికి నడుచుకుంటూ బయల్దేరాము.

మా నెక్స్ట్ స్టాప్ దగ్గర పెద్ద క్యూ ఉంది అందుకని మేము ఆగలేదు. ఇక్కడ నోరు తెరిచిన ఒక శిల్పం ఉంది. ఆ శిల్పం నోట్లో చెయ్యి పెడితే, అబద్దాలు చెప్పే వాళ్ళయితే చేతిని కరుస్తుంది. ఇక్కడ చాలా మంది దంపతులు క్యూ లో నుంచున్నారు. బహుశా ఎవరు అబద్దాలు కోరో నిర్ణయించు కోటాని కేమో .

ఇక్కడ మళ్ళా బస్సు ఎక్కాము. ఊరంతా తిప్పింది. ప్రతి ఊళ్లో లాగా అంతా మామూలే. ధనవంతులు ఉండే చోటు ధనవంతులు తినే చోటూ వగైరా వగైరా.
 నాకు బాగా ఆకర్షించింది ఒక రాజు స్థూపం. దేశాన్ని చిట్ట చివర పరిపాలించిన రాజు. చిన్న చిన్న సామ్రాజ్యాలన్నీ కలిపి ఇటలీ అనే దేశాన్ని ఆవిర్భ వించటానికి కారకుడు. అక్కడ దిగి ఆ పాలెస్ చూశాం. ఇంతటితో టూర్ అయిపొయింది. బస్సు దిగి ఇంటికి బయల్దేరాము.

నా కేందోకో ఇంటికి వెళ్ళేటప్పుడు సబ్వే లో వెళ్లాలని అనిపించింది. ఇక్కడ భూమి క్రింద రెండస్తుల్లో రైళ్ళు వెళ్తాయి. నడుచుకుంటూ స్టేషన్ కి జేరాము. ఆ రోజు ఆదివారం పెట్టెలు తక్కు వేస్తారు. జనం. జేబులు కొట్టే వాళ్ళు ఎక్కువ అని ముందరే చెప్పారు. ట్రైన్ ఎక్కడో ఆగింది. పరిగెత్తుకు వెళ్లి ఎక్కాల్సి వచ్చింది. రెండు స్టేషన్ల తరువాత మా స్టేషన్ వచ్చింది. సెంట్రల్ స్టేషన్ లో ఎలివేటర్స్ ఉన్నాయి కానీ మేము దిగిన స్టేషన్ లో రెండంతస్తులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చివరికి ట్రైన్లో ఎందుకు వచ్చామా అనిపించింది. మీరు ఇటువంటి కోరికలు పెట్టుకో వోకండి.

రాత్రికి అన్నం, చింతకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు, పెరుగు. పొద్దున్నే చికాగో వెళ్ళటానికి టాక్సీ తీసుకున్నాము. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వాడితో కొంచెం వాగ్వివాదం అయ్యింది. మేము రెండు నిమిషాలు, క్రిందకి లేటుగా వచ్చాముట అందుకని డబ్బులు ఎక్కువ ఇవ్వాలిట. సరే పెద్దగా గొడవ పెట్టుకోకుండా అడిగినది ఇచ్చి ఏర్పోర్ట్ లోకి వెళ్ళాము. ఇండియాలో రిక్షా వాళ్ళతో గొడవ గుర్తుకు వచ్చింది. ప్రపంచమంతా ఒకటే. ప్లేన్ ఎక్కి పదిగంటల్లో చికాగో జేరుకున్నాము.

(మీరు Roman Holiday అనే ఇంగ్లీష్ సినిమా చూస్తే, రోమ్ లో మేము చూసినవన్నీ మీరూ చూడవచ్చు.దీనిలో  కధ:  రోమ్ రాజకుమారి పాలస్ నుండి తప్పించుకుని బయటపడి అదృష్టవశాత్తూ ఒక అమెరికన్ రిపోర్టర్ ని కలుస్తుంది. సినిమా అంతా వాళ్ళు ఆ రోజు రోమ్ లో ఎలా సరదాగా తిరిగారో చూపెడుతుంది. అసలు మా ఇటలీ ట్రిప్ కి మూలకారణం మా ఆవిడ్ ఆ సినీమా చూడటం. చూసిన తరువాత రొమ్ ని తప్పకుండా చూడాలనే కోరిక ఆవిడకి కలగటం. మేము ఆవిడని వెంటేసుకు రావటం. ఏమిటో అంతా మాయ.)

మా ఇటలీ ట్రిప్ మీద నేను వ్రాసిన పోస్ట్ లు క్రింద ఇస్తున్నాను. వీలయితే చదవండి.
105 ఓ బుల్లి కథ 93 -- ఇటలీ లో ఓ వారం - పారిస్
106 ఓ బుల్లి కథ 94 -- ఇటలీ లో ఓ వారం - రోమ్
107 ఓ బుల్లి కథ 95 -- ఇటలీ లో ఓ వారం -- పీసా
108 ఓ బుల్లి కథ 96 -- ఇటలీ లో ఓ వారం -- ఫ్లారెన్స్
109 ఓ బుల్లి కథ 97 -- ఇటలీ లో ఓ వారం -- వెనిస్
110 ఓ బుల్లి కథ 98-- ఇటలీ లో ఓ వారం - మళ్ళా రోమ్