Monday, December 22, 2014

109 ఓ బుల్లి కథ 97 -- ఇటలీ లో ఓ వారం -- వెనిస్

"ఫ్లారెన్స్" నుంచి "వెనిస్" ట్రైన్ రైడ్ లో "రిజర్వేషన్" ఉండటం తో అందరం ఒక చోట కూర్చున్నాము. గుర్తు పెట్టుకునేవి ఏమీ జరగలేదు. కాకపోతే "వెనిస్" దగ్గరకొస్తుంటే ట్రైన్ సముద్రం మధ్య లోంచి పోతున్నట్టు ఉంటుంది. అటుపక్క ఇటుపక్కా నీళ్ళు, దూరంలోనూ దగ్గరా పెద్ద పెద్ద నౌకలు, పట్టపగలు, నీల ఆకాశం, దానిలో తెల్లటి మబ్బులు, ఏదో స్వర్గం లోకి ప్రవేశించు తున్నట్లు అనిపిస్తుంది.

"వెనిస్" కొన్ని ద్వీప సమూహంలో ఒక ద్వీపం. స్వతంత్రంగా చాలాకాలం రాజరికం లో ఉంది. చుట్టూతా సముద్రం ఉండటం మూలాన నౌకలు కట్టటం ఉపయోగించటంలో నిష్ణాతు లైనారు. దానితో వారి నౌకా సైన్యము ప్రపంచ విదితము. చికాగో మిచిగన్ లేక్ లో ప్రతీ సంవత్సరం "వెనీషియన్ నైట్" అని ఉంటుంది. ప్రపంచంలో ప్రసిద్ధ నౌకలన్నీ అక్కడకి వస్తాయి. చుట్టూతా నీళ్ళు ఉండటం మూలంగా ఉప్పెనలోస్తే తట్టుకునే విధంగా భవంతులన్నీ గట్టి పునాదులతో కట్టారు. దాదాపు అన్నీ 100 ఏళ్ళ క్రిందట కట్టినవే. చాలా వరకు  భవంతులన్నీ నీళ్ళతో ఆడుకుంటూ
ఉంటాయి. ఊరంతా కాలవలతో కలిపేశారు. ఉప్పెన లాంటివి వస్తే నీళ్ళు కాలవల ద్వారా సముద్రం ఒక వేపు నుండి ఇంకొక వేపుకు వెళ్లి పోతాయి. ఇక్కడ వీధులు కాలవలు. "Grand Canal" ముఖ్య వీధి. దానిలోనుండి చిన్న చిన్న కాలువలు ద్వీపం లోపల ఉన్న భవంతులకు తీసికు వెళ్తాయి. భవంతుల మధ్య ఉండేది సందులూ గొందులే. ఊళ్ళో తిరగటం పద్మ వ్యూహమే. నేనయితే వంటరిగా బయటికి వెళ్ళటానికి సాహసించలేదు. దాదాపు రోజు అవసరాలకి కావలసినవి అన్నీదొరుకుతాయి. వంటకి మాకు కావాల్సిన కూరలు ఇక్కడే కొనుక్కున్నాము. రెస్టోరెంటులు, కాఫీ షాపులు చిన్నవీ పెద్దవీ  చాలా ఉన్నాయి. దాదాపు కావలసినవన్నీ దొరుకుతాయి.

ఇక్కడికి చూడటానికి వచ్చే యాత్రికులు ఎక్కువ. నా ఉద్దేశంలో రోజుకి ఈ ఊరి జనాభా అంత మంది, యాత్రికులుగా వస్తారు. అందుకని ఇక్కడి మునిసిపాలిటీ ఒక రూల్ పాస్ చేసింది. 2015 నుండీ ఇక్కడి రోడ్లమీద (సందులూ గొందులూ) మీద చక్రాలున్న సూట్ కేస్ లు లాగుతూ తీసుకు వెళ్ళకూడదు. రాత్రీ పగళ్ళ లో ఆ శబ్దానికి ఆ ఊర్లో నివసించే ప్రజలకి నిద్రపట్టటల్లేదుట. దీనిని అతిక్రమిస్తే $500 జరిమానా. చూడండి ఎంతమంచి ప్రభుత్వమో.

ఇక్కడికి మనలాంటి వాళ్ళ నుంచి ఆగర్భ శ్రీమంతులు దాకావెకేషన్ కి వస్తారు. అందుకనే ఇక్కడ  "7 స్టార్ హోటల్" ఉంది. ధన కనక వస్తు వాహనాల నుండీ "ఫర్ కోట్లు" దాకా అన్నీ దొరుకుతాయి.

మేము ట్రైన్ స్టేషన్ లో దిగింతరువాత మా పాట్లు మొదలయినాయి. మా అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళే అమ్మాయి రెండు గంటలకి ఒక చోటుకి రమ్మంది. ఆ చోటుకు వెళ్ళాలంటే బోటు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ టాక్సీ లు లేవు రిక్షాలు
లేవు. సందులు గొందులూ తప్ప రోడ్లు కూడా లేవు. స్టేషన్ ఎదురుకుండా ఒక బోటు స్టేషన్ ఉంది (లాంచీ ఎక్కే చోటు). మాకింకా మా అపార్ట్మెంట్ కి వెళ్ళటానికి రెండు గంటల సమయము ఉన్నది. సరే సామాను లాగుకుంటూ అక్కడున్న సందుల్లో కొట్లు చూసుకుంటూ తిరిగాము. ఆకలవుతోంది. అక్కడ చాలా రెస్టోరెంటులు ఉన్నాయి. బయట నుంచుని మా రెస్టోరెంటు లో తినండి అని అడుగుతూ ఉంటారు. బయట ఉన్న మెన్యూ చూసుకుని ఒక రెస్టోరెంట్లో చతికిల పడ్డాము. ఇక్కడ చాలా రెస్టోరెంటులు, బయట షామినా వేసి క్రింద బల్లలూ కుర్చీలు వేసినవి. మేము తీరిగ్గా భోజనం చేసి లాంచీ ఎక్కి గమ్య స్థానానికీ చేరేటప్పటికి రెండు గంటలు దాటింది. మేము టైముకి రాలేదని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సరే ఆ అమ్మాయిని బ్రతిమాలాడితే ఒకగంటలో వచ్చింది. అప్పటిదాకా లాంచీ స్టేషన్ దగ్గర బికారుల్లాగా సామాను పెట్టుకు కూర్చున్నాము.

 సరే ఆ అమ్మాయి వచ్చి సందులూ గొందులూ తిప్పుకుంటూ మా అపార్ట్మెంట్ కు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ 100 ఏళ్ల క్రింద కట్టినవి. ఇక్కడ రోడ్లు లేవు. ఆ పిల్ల గబగబా వెళ్ళిపోతోంది. పెద్ద పెద్ద ఆవరణలూ వాటి చుట్టూతా బిల్డింగ్ లు. ఒక ఆవరణ లోనుండి ఇంకొక ఆవరణలోకి వెళ్ళటానికి సందులు. నాకయితే మాత్రం ఇది ఒక పద్మ వ్యూహం లాగా ఉంది. మా యపార్త్మెంట్ రిమోడల్  చేయటం తోటి చాలా మోడర్న్ గ  ఉంది. సరే కాసేపు విశ్రమించి తిరగటానికి బయల్దేరాము. మేము వెళ్ళాల్సిన చోటుకి టాక్సీ ని పిలిచాము. అక్కడ ఉండే వన్నీ వాటర్ టాక్సీలు. పక్క నున్న పిల్ల కాలవ దగ్గరకి రమ్మన్నాడు. మీరు మాత్రం టాక్సీలని పిలవకండి. డబ్బులు చాలా అవుతాయి.

"రైల్టో బ్రిడ్జి" (Railto Bridge ) దగ్గర టాక్సీ దిగాము. ఇది చాలా ఫేమస్ ఎందుకో నాకు తెలియదు. కాసేపు ఫోటోలు తీసుకుని పక్క నున్న షాపులు చూడటానికి బయల్దేరాము. ఈ షాపులు బయటినుండి చూడటానికే గానీ లోపలికి  వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి దాదాపు ప్రపంచం లోని కుబేరులందరూ వస్తారు. మనం వెళ్ళచ్చు పరవాలేదు అనుకున్న ఒకటి రెండు షాపులలోకి వెళ్ళి, ఒక అరగంట తిరిగి చిన్నవస్తువులేవో కొనుక్కుని లాంచీ ఎక్కి ఇంటికి చేరాము.

ఒకప్పుడు "వెనిస్" చిన్న రాజరికం. మంచి నౌకా దళం ఉంది. చుట్టుపక్కలకి పోయి యుద్ధాలు చేసే వాళ్ళు. రాచనగరూ వాళ్ళ పాలెస్ (Doge's Palace) చూడటానికి మర్నాడు పొద్దున్న బయల్దేరాము. నన్ను ఒక
చోట కూర్చోబెట్టి (మేము అమెరికా నుండి ఒక పోర్ట బుల్ కుర్చీ తెచ్చుకున్నాము) మా ఆవిడా పిల్లలూ పాలెస్ టిక్కెట్లు తీసుకు రావటానికి (తిరగటానికి) వెళ్ళారు . ఎప్పుడూ నసిగే వాళ్ళ తోటి ఎంతసేపు ఉంటారు! మా ఆవిడ నేను నసుగుతాను అంటుంది. కానీ నేను నసగను. మీరు నసిగినా ఎవ్వరూ పట్టించుకోరు అందుకని వెకేషన్ లో నసగటం అంత మంచిది కాదు.

పాలెస్ భవనాలు ఒక పెద్ద ఆవరణ చుట్టూతా ఉన్నాయి. కట్టడాలు నిజంగా చాలా బాగున్నాయి. రాజ ఠీవి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజరికం లేదు కాబట్టి ఆవరణలో చుట్టూతా రెస్టోరెంటులు ఉన్నాయి. వాటిల్లో ఆడుతున్నారు పాడుతున్నారు. అక్కడ కూర్చుని కాఫీ తాగితే అయిదు యురోలు టిప్ ఇవ్వాలిట. అది అక్కడ ఆడుతూ పాడుతున్న వాళ్లకి వెళ్తుంది. మధ్యలో పావురాలు చాలా తిరుగుతున్నాయి. వాటికి పిల్లలు గింజలు వేస్తున్నారు. పిల్లలున్నారు కాబట్టి పిల్లల ఆటవస్తువులు, తినే పదార్ధాలూ అమ్మే బళ్ళూ ఉన్నాయి. ఆవరణ అంతా చూడటానికి వచ్చిన జనంతో నిండి పోయింది. నిజంగా చెప్పాలంటే అదొక పెద్ద తిరణాల (Carnival ) లాగా ఉంది.

ఆ రాజు పాలెస్ చూశాం. వాళ్ళు ధరించే దుస్తులూ నగలూ నాణ్యాలూ చూశాం. ఆకాలంనాటి శిల్ప సౌందర్యాలు చూశాం. అంతా చూసిన తర్వాత రెస్టోరెంటులో భోజనం చేశాం. అలా తిరుగుతుంటే "ఆపరా" (Opera) అని కనపడితే  సంగతేమిటో కనుక్కోమని  "డిస్కౌంట్ క్వీన్" మా ఆవిడని పంపించాము. పిల్లలకి "ఆపరా" ఇష్టం. నేనెప్పుడూ వెళ్ళలేదు. డబ్బులు బాగా వదులుతాయి. "డిస్కౌంట్ క్వీన్" మా ఆవిడ శుభవార్త తో తిరిగి వచ్చింది. అక్కడున్న మేనేజర్, 50% డిస్కౌంట్ తో టిక్కెట్లు ఇస్తాను, రెండుగంటల్లో బాక్స్ ఆఫీసు ఓపెన్ చేస్తారు నేనిక్కడే ఉంటాను వచ్చి టిక్కెట్లు తీసుకొమందిట. రెండుగంటలు ఏమి చెయ్యాలి? ఇంకా తిరిగే ఓపిక
లేదు. మేము పొద్దున వచ్చే టప్పుడు లాంచీ లలో తిరగటానికి "డే టిక్కెట్" కొనుక్కున్నాము. 24 గంటల్లో ఎన్నిసార్లయినా లాంచీలలొ తిరగొచ్చు. మేము వచ్చిన వైపు కాకుండా ఇంకొకవైపుకి వెళ్ళే లాంచీలో ఎక్కాము. సాయం సమయం, ప్రశాంత వాతావరణం, చక్కటి గాలి, సూర్యాస్తమం సముద్రంలో(aedriatic sea) కళ్ళారా చూశాము. ఇంతలోకే ఆపరా గుర్తు కొచ్చింది. వెంటనే దిగి అటు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఆపరాకి సమయం అయిపోతోంది ఈ లాంచీ ప్రతి చోటా ఆగుకుంటూ నెమ్మదిగా పోతోంది. చివరికి తెలిసిందేమంటే రెండురకాల లాంచీ లున్నాయిట . "ఎక్స్ప్రెస్" అయితే అన్నిచోట్లా ఆగదు కానీ మేము ఎక్కింది అన్ని చోట్లా ఆగే పాసింజర్ లాంచీ. ఇంతకీ చెప్పొచ్చే దేమంటే నేను నా మొదటి  "ఆపరా" చూడటం పడలేదు. ఇంటికి జేరుకున్నాము. మర్నాడు పొద్దున్నే లేచి ట్రైన్ లో "రొమ్" కి బయల్దేరాము.

కొన్ని నెలల క్రిందట "క్లూనీ" (George Clooney, ప్రఖ్యాత హాలీవుడ్ యాక్టర్) "వెనిస్" లో పెళ్లి చేసుకున్నాడు. క్రింద వీడియో లో ఆయన వాటర్ టాక్సీ లో పెళ్ళికి వెళ్ళే వైభవం  చూడండి. కాకపోతే 7 స్టార్ హోటల్ కి వెళ్ళలేదు గానీ, ఆ ప్ర దేశాలన్నీ మేమూ చూశాము.

 

4 comments:

 1. Telugu lo Rayadaniki:
  http://alllanguagetranslator.blogspot.in/2013/05/blog-post.html

  ReplyDelete
 2. Srirama Dronamraju
  8:14 AM (55 minutes ago)

  to me

  Ayya Lakkaraju Mastaru!

  మీ వెన్నీసు వైభొగ వర్ణన చాలా చాల బాగుంది. మీ రోము నగర వర్ణన కై ఎదురు తెన్నులు చూస్తున్నాము!

  Ramakrishnudu

  ReplyDelete
 3. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

  టపాలోని వివరాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. అయితే, ఒక ప్రశ్న. యూరోప్ దేశాలు, అమెరికా, కెనడా, ఇటు జపాన్ ఈ దేశాలన్నీ యుద్ధ ప్రభావాల్ని ( తమ దేశాలపై వేరే దేశాలవారి యుద్ధం; తాము ఇతర దేశాలపై చేసిన యుద్ధాలు ) చవిచూసినవే. అయితే, నేడు ఆ దేశాలన్నీ అన్నిరకాలుగా అభివృద్ధి చెందాయి. మరి మన భారతదేశ విషయానికి వస్తే, ఎంతో ప్రతిభావంతులైన వారు మనకి వున్నప్పటికీ ఆ దేశాలతో పోలిస్తే, చాలా వెనకిబడే వున్నాము. ఎందుకని అంటారు.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
  Replies
  1. మనం కొన్ని వందల సంవత్సరాలు విదేశీయులచే పరిపాలించ బడ్డాము. వాళ్ళేమీ ప్రేమతో పరిపాలించలేదు. వారికి ఇష్టమయినవీ అవసరమయినవీ తీసుకున్నారు. వాళ్ళ పేరుకి, తెలివితేటలకి అడ్డువచ్చేవన్నీ రూపు రేఖలు కనపడకుండా నాశనం చేశారు (systematic destruction). అది తెలిసి ఉండి కూడా స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కూడా మనల్ని పరిపాలించమని కాళ్ళకి మొక్కుకుని వాళ్ళ చేతుల్లోనే పెట్టాము. వీటన్నిటి మూలాన జరిగింది ఒకటే, మన చరిత్రా, సంస్కృతి మనకి తెలియదు (వాళ్ళు చెప్పింది తప్ప) . తెలుసుకోటానికి కూడా ప్రయత్నించం. ఎందుకంటే ఏళ్ళ బానిసత్వం మన బుర్రని పాడు చేసింది (Brainwash).
   మార్పులు వస్తున్నాయి కానీ ఈ బానిసత్వపు మనస్తత్వం ఇంకా మారలేదు. అది పోయి మన శక్తి సామర్ధ్యాల మీద నమ్మకం తో ముందికి సాగినప్పుడే అభివృద్ధి కనపడుతుంది.
   మీ ప్రశ్నకి ఒక పెద్ద పోస్ట్ వ్రాయచ్చు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

   Delete