Wednesday, April 22, 2020

160 ఓ బుల్లి కథ -- మందాకిని

లాక్ డౌన్ లో ఇల్లంతా శుభ్రం చేస్తుంటే పాత కాగితాల్లో నేనెప్పుడో వ్రాసిన గేయం కనపడింది. ఈ గేయం క్రింద నా గురించి రెండు లైనులు వ్రాశారు కాబట్టి ఇది ఎప్పుడో ఎక్కడో అమెరికాలో ఎవరి పత్రిక లోనో పడుంటుందని అనుకుంటున్నాను.

మాతంగిని 

ప్రేమ మాటలు రావు నాకు 

పెద్ద చదువులు చదవలేదు 

పాటు పడి నా సాటి కొస్తే 

ప్రీతిగా సాపాటు పెడతా 


దాచుకోమని హృదయమిస్తే 

కొంగు కొసలో మూటగట్టి

హృదయ పేఠిలో దాచుకుంటా 


నృత్య నాటికలాడలేను 

పాటగట్టి పాడలేను 

ఊసురోమని ఇంటికొస్తే 


చెంగు పరచి చెంతజేరి 

కమ్మగా నిను కౌగాలిస్తా 


మృదువుగా నీ మాటలన్నీ 

మల్లెమొగ్గల మాల కట్టి 

తురిమి జడలో పెట్టుకుంటా 


భావకవితలు చెప్పలేను 

భామ కలాపము చెయ్యలేను

నీదు హృదిలో స్థానమిస్తే 


సన్న జాజుల తల్పమేసి 

సాదరంగా నిన్ను చేరి 

నాతి హృదయపు లోతులన్నీ 

దొంగ చూపులు చూడనిస్తా 


తేల్చుకో నీ కొరికెవరో

మాధవా ! నేనాగలేను 

మరుని ధాటికి తాళలేను 


Sunday, April 19, 2020

159 ఓ బుల్లి కథ -- రెండు పిచ్చుకల కధ

నేను పొద్దునపూట సామాన్యంగా ఏమీ తినను. కాఫీ పెట్టుకుని తాగేసి కూర్చుంటాను. కంప్యూటర్ లో వార్తలు అవ్వీ చూసుకుని  రోజూ లాగే పైకెళ్ళి స్నానం చేసి క్రిందకు వచ్చి దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. మా ఆవిడ నన్ను చూసి నీరసంగా ఉన్నానని గుర్తించింది. పైనుండి క్రిందకి గుడ్డల మూట మోసుకొచ్చాను బహుశా నా నీరసానికి అది కారణం అయిఉండచ్చు ( ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటాము).నేను ఎవరన్నా సింపథీ చూపిస్తుంటే మాట్లాడకుండా దీనంగా మొహం పెడతాను. తప్పకుండా ఎదో  బోనస్ వస్తుంది. నేను గుమ్ముగా చొక్కాలూ లాగూలు వాషింగ్ మెషిన్లో వేస్తున్నాను. "ఆమ్లెట్ వేస్తున్నాను వెళ్ళి ఆ కంప్యూటర్ ముందు కూర్చోకండి" అన్న మాట వినిపించింది.

అమెరికాలో ఇది వసంత కాలం. చలికాలం వస్తోందని ఉష్ణ  ప్రదేశాలకి  వెళ్ళిన పక్షులు వాటి వాటి గూళ్ళకి తిరిగి వస్తున్నాయి. మా పెరట్లొ పిచ్చుకలూ గోరింకలూ కుందేళ్ళు అప్పుడప్పుడూ బాతులు కూడా వస్తూ ఉంటాయి. ఉడతలు సరే సరి అన్ని కాలాలలోనూ  చెట్లమీద గంతులేస్తూ ఉంటాయి.

ఆమ్లెట్ శాండ్విచ్ తింటూ కిటికీ లోంచి చూస్తున్నాను. ఎదురుకుండా ఫెన్స్ మీద రెండు పిచ్చుకలు ఎదురెదురు గా కూర్చుని నోటితో (ముక్కుతో ) ఏదో అందించుకుంటున్నాయి. రెండూ ఒకే సైజు లో ఉన్నాయి. ఎదురుకుండా కూర్చుని తింటున్నాయి.  ఆహా ఎంత ప్రేమో అనిపించింది. గాఢ ప్రేమికులో అన్యోన్య దంపతులో అయి ఉండాలి అని అనుకున్నాను.

క్షణాలు గడిచాయి. తినటం అయిపొయింది. ఒక క్షణం ఎదురుగుండా నుంచుని ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నాయి. ఇద్దరూ రెండడుగులు అభిముఖంగా వేసి దూరంగా జరిగి తిరిగి ఒకళ్ళ నొకళ్ళు చూసుకున్నాయి. ఒక పిచ్చుక ఎందుకో ఒక అడుగు వెనక్కి తిరిగి వచ్చింది. విడిపోటం కష్టంగా ఉందల్లే ఉంది. రెండొవ పిచ్చుక కూడా తిరిగి వస్తుందనుకున్నాను. రాలేదు సరికదా ఎగిరి పోయింది. రెండవ పిచ్చుక ఎగిరి పోతున్న పిచ్చుకని ఒక క్షణం చూసి తానూ ఎగిరి పోయింది.

నా శాండ్విచ్ తినటం అయిపొయింది కానీ కుర్చీ లోనుండి లేవ లేక పోయాను. ఏమైంది ఆ పిచ్చుకలకి. ఏమిటో తెలియని బాధ నన్నావరించింది. రెండూ పోట్లాడుకుని విడిపోయాయా ? లేక ప్రేమగా విడిపోయాయా? ఏదీ తెగక ఆలోచిస్తున్నాను.

రెండడుగులు వేసి  ఒకళ్ళ నొకళ్ళు చూసుకున్నారు.  ప్రేమతో  బై చెప్పటానికి చూసుకున్నారంటే ఒకళ్లే రెండడుగులు వెనక్కి తిరిగి ఎందుకు వచ్చారు ? విరహ బాధతో వచ్చింది అనుకుంటే ప్రేమలేని ఆ మొదటి పిచ్చుక తన ఎదురుకుండా తుర్ మని ఎగిరిపోతే ఎంత బాధ పడిందో!! పోనీ పోట్లాడుకుని విడిపోయారనుకుంటే, తప్పెవరిదైనా కానీ అనుకుని రెండవ పిచ్చుక కాంప్రమైజ్ అవుదామని తిరిగి వస్తే  అంతమాత్రం జ్ఞానం లేదా ప్రియురాలు చూస్తుండంగా  అలా తుర్ మని ఎగిరి పోవటమేనా ? పాపం ఆ పిచ్చుక ఎంత ఏడ్చిందో  !!

ఏమిటో మన మనుషుల మనస్తత్వాలతో పిచ్చుకల గురించి ఆలోచిస్తున్నాను. పిచ్చుకలు ప్రేమ అల్లాగే చూపిస్తాయేమో అనుకుంటూ భారంగా కుర్చీ లోంచి లేచి నేను ఆవేళ చెయ్యాల్సిన పనులకి ఉపక్రమించాను.

P.S: పై ఫోటో తీసింది మా ఆవిడ. డైనింగ్ టేబుల్ మీద ఉన్నది నా లాప్టాప్, నా సరంజామా. ఫోటో తీయమంటే నసుగుతూ ఐపాడ్ తీసుకొస్తే డైనింగ్ టేబుల్ సరి చెయ్యటానికి కుదర లేదు. మా డైనింగ్ టేబుల్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకోవద్దు.

Thursday, March 26, 2020

158 ఓ బుల్లి కథ -- నాకు నచ్చిన సినీమా - 1

కరోనా Lockout తోటి ఇంట్లో కూర్చుని యూట్యూబ్ సినిమాలు చూడటం మొదలెట్టాను. చూసిన తర్వాత వాటిమీద నా అభి ప్రాయాలు వ్రాయాలని పించింది. నేను వ్రాసే విధానం కొత్తగా ఉండచ్చు. గాభరా పడవోకండి.

సినిమా పేరు: 
ముగ్గురు అమ్మాయిల మొగుడు.

ముఖ్య నటీనటులు:
చంద్రమోహన్, అరుణ, విజ్జి, సాధన.
నటీనటులు అన్నప్పుడు నటీమణుల పేరు ముందర పెట్టాలా ? తెలియదు.

సంక్షిప్తం గా కధ :
హీరో(చంద్రమోహన్)  "ఎం ఏ" పాస్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుని టైంపాస్ చేస్తుంటే వాళ్ళ నాన్నపెళ్ళి చేసుకోమంటాడు. హీరోకి ఇష్టం లేదు. తనకి ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని కోరిక. కానీ వాళ్ళ నాన్న బందరులో ఉన్నవాళ్ళ బాల్య మిత్రునికి, ఆయనకున్న ముగ్గురు కుమార్తెలలో ఒకరిని తన కొడుకుకి చేసుకుంటా నని మాటిచ్చాడు. ఉద్యోగం లేక ఇంటిపట్టున ఉన్న హీరోకి ఏమి చెయ్యాలో తోచక, ప్రేమించటానికి ఆ ఊర్లో ఎవరూ లేక, తండ్రికి చెప్పలేక, తీర్థ యాత్రలు చేసొస్తాను రెండు నెలలు టైం ఇమ్మంటాడు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుంటా ననటం తోటి తండ్రి కొడుకు కోరికకు అంగీకరిస్తాడు.

హీరో గారు కాబోయే భార్యని ప్రేమించటానికి తన తండ్రి మిత్రుడి ఊరుకు జేరుకుని ఆయన ఇంట్లో (తన మిత్రుని సహాయంతో)  మకాం వేస్తాడు. అక్కడున్న ముగ్గురు ఆడ పిల్లలలో ఎవరిని ఎల్లా ప్రేమించాలో తెలియక తికమక పడతాడు. చివరికి ఆ ముగ్గురు ఆడపిల్లలలో ఇద్దరు వేరే వాళ్ళని ప్రేమించటం మూలంగా సమస్య తేలిపోయి చివరికి మిగిలిన అమ్మాయితో సెటిల్ అయిపోతాడు. ఈ చిత్రంలో మామూలుగా ఉండే హీరో హీరోయిన్ డాన్సులు ఒక చిన్న రౌడీలతో  కొట్లాట కూడా ఉన్నాయి.

నా కెందుకు నచ్చింది : 
నేను హీరో హీరోయిన్  ఇంటర్వెల్ ముందర పెళ్ళి చేసుకుంటే సినిమా చూడను. అంతటితో సినీమా ఆపేస్తాను. లేకపోతే సినీమా అయ్యేదాకా వాళ్ళ బాధల గాధలు చూడాల్సి వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత డాన్సులు గట్రా ఉండవని మనకు తెలిసినదే కదా.

ఈ సినిమా లో పెళ్ళి చివర జరుగుతుంది. ఈ మధ్యలో డాన్సులు ప్రేమాయణాలు గట్రా ముగ్గురు అమ్మాయిలతో జరుగుతాయి. దీనిలో ప్రేమించటంలో హీరో కన్నా ఆ ముగ్గురు ఆడపిల్లలే బెటర్. సినిమా బాగుంది. చూడవచ్చు.
Tuesday, March 24, 2020

157 ఓ బుల్లి కథ --కాలం గాని కాలంలో అమెరికా


రెండు రోజుల క్రితం అమెరికాలో వసంతకాలం వచ్చింది. చెట్లు చిగిర్చి పువ్వులు పూయాలి. కానీ చికాగో లో కాలంగాని  కాలంలో  స్నో పడింది .  ఇంకా సూర్య భగవానుడు రాలేదు. పైన ఫొటోలో కనపడేది మా పెరటి తోట. కలికాలం ఇది. వసంత కాలంలో స్నో పడటం, "కరోనా వైరస్ "  లాంటి రోగాలు రావటం.

 "కరోనా వైరస్ ",  బయట తిరగొద్దు  అని  చెప్పటంతో వారం రోజులబట్టీ ఇంటిపట్టునే ఉంటున్నాము. ఇంట్లో ఉన్న ఇద్దరం  లైబ్రరీ లో పనిచేస్తాము. ఇంటావిడ ఉద్యోగం అక్కడ ఇంటాయనకి వాలంటీర్ పని.పెళ్ళయిన నలభై ఏళ్ళ తర్వాత 24 గంటలూ ఒక చోట ఇద్దరమూ  గడపటం ఇదే మొదటిసారి.

మనుషుల అభిప్రాయాలు సామాన్యంగా వారు పెరిగిన వాతావరణం బట్టి ఉంటాయి . భార్యా భర్తలు వీటికి అతీతం కాదు. అభిప్రాయ బేధాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అందులో 24 గంటలూ ఇంటిపట్టున ఇద్దరూ  ఉండాలంటే కొంచెం కష్టమే. వారం రోజులు జుట్టూ జుట్టూ   పట్టుకోకుండా ప్రశాంతంగా గడిచి పోయిందంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏమైంది అని నాలో నేనే ప్రశ్నించుకుంటే కొన్ని విశేషాలు బయటికి వచ్చాయి. మీకు కూడా అవి పనికి వస్తాయని వాటిని మీతో పంచుకుంటున్నాను.

మొదటిది చాలా ముఖ్యమయినది ఇంట్లో ఇద్దరే ఉండటం మూలంగా "ప్రైవసీ" ఉండదు.  అందుకని రోజూ ఒక గంట ముందర లేస్తాను. ఆ గంట మీ సొంతం ఎంతో హాయిగా ఉంటుంది. నేనయితే నేను కాఫీ పెడతాను. ప్రశాంతంగా కాఫీ తాగుతాను. మా డిష్ వాషర్  పై అరలో వున్న వన్నీ తీసి బయట పెడతాను. అవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టక పోతే ఆవిడకి కోపం వస్తుంది. అందుకని నేను సద్దను. డిష్ వాషర్ లో రెండొవ అర ఆవిడకి వదిలిపెడతాను. పని ఇద్దరికీ సమానంగా ఉంటుంది అందుకని పోట్లాటకి తావుండదు. లేచే సరికి కాఫీ గూడా తయారు చేసి పెడతా కదా సంతోష పడుతుంది. కాకపోతే కాఫీ పల్చగా ఉందనో స్ట్రాంగ్ గా ఉందనో అంటుందనుకోండీ. ఇటువంటివి పట్టించుకోను.

ఆవిడ కాఫీ తాగి స్నానం చేసి పూజా అవీ చేసుకునే టప్పటికి గంటలు పడుతుంది. ఆ సమయ మంతా మీదే. హాయిగా ప్రశాంతంగా పనులు చేసుకోండి. నేనయితే ఇంటర్నెట్ తో కంప్యూటర్ మీద ఉంటాను. సమయం గుర్తు వచ్చేసరికి సరికి లంచ్ టైం దగ్గర పడుతుంది.

వీలయినంత వరకూ ఇంట్లో సహాయము చేస్తున్నట్లు కనపడండి. నేను సామాన్యంగా తేలికగా లంచ్ తయారు చేస్తాను. నేను తయారు చేసేవి "అటుకుల ఉప్మా" "సేమ్యా ఉప్మా " లాంటివి. మీకు ఇటువంటివి చెయ్యటం రాక బోతే నేర్చు కుంటాను అని ఆవిడ చేత చేయించండి. భర్త బుద్దిగా నేర్చుకుంటా నంటే నేర్పటం వాళ్లకి చాలా ఇష్టం. ఇలా నేర్చుకుంటూ రోజులు గడపొచ్చు.

లంచ్ అయిన తర్వాత నిద్దర వస్తే నిద్దర పోండి. లేదూ U -Tube లో పాత తెలుగు సినిమాలు పెట్టండి. మూడు గంటలు అలా మాట్లాడకుండా గడపొచ్చు. మచ్చుకి మేము చూసిన తెలుగు సినిమాలు "కొంటె మొగుడు పెంకి పెళ్ళాం","శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్", "చిల్లరి మొగుడు అల్లరి కొడుకు", "మా ఇంటాయన కధ ", "పెళ్లి చేసి చూడు" "థాంక్యూ సుబ్బారావ్" లాంటి తెలుగు చిత్ర రాజములు.

నువ్వు పెట్టిన టీ చాలా బాగుంటుందని చెప్పి టీ పెట్టించుకుని తాగండి. ఇంతలో వార్తల టైం అవుతుంది. టీవీ లో వార్తల ఛానల్స్ (CNN వగైరా) చూడండి. తర్వాత ఆవిడకి TV  ఇచ్చేసి తనకి ఇష్టమయిన షోస్ చూసుకోమనండి . ఇలా కొన్ని గంటలు గడిచిపోతాయి.

ఇంతలో డిన్నర్ టైం దగ్గరపడుతుంది. మీరు లంచ్ చేశారు గనక డిన్నర్ ఆవిడే చేస్తుంది. మీరు ఆవిడ డిన్నర్ వండుతుంటే మీ వంతు ఒక పని తప్పకుండా చెయ్యాలి, అన్నం వండండి తేలిక. రైస్ కుక్కరో ప్రెషర్ కుక్కారో వాడండి. గిన్నెలో రెండు కప్పుల బియ్యానికి మూడు న్నర కప్పుల నీళ్ళు పొయ్యటమే. తర్వాత ఆవిడకి సహాయం చెయ్యండి. వీలయితే ఒక గరిటె తీసుకుని భగుణ లో కూర తిరగ తిప్పండి.

డిన్నర్ కి టేబుల్ మీద మంచినీళ్లు ప్లేట్లు పెట్టండి. వంట బాగుందని చెప్పండి.

డిన్నర్ అయిన తర్వాత U - ట్యూబ్ లో మరల తెలుగు సినిమాలు పెట్టండి. మూడు గంటలు గడిపెయ్యోచ్చు. నిద్దరొస్తే మధ్యలో కునుకు తీయండి. తెలుగు సినిమా చూస్తూ కునుకు తీయటం పెద్ద తప్పేమీ కాదు. తర్వాత నిద్దర టైం అవుతుంది.

ఇందులో ముఖ్యంగా గమనించ వలసింది close encounters రాకుండా జాగర్తగా ఉండటమే. ఒకవేళ నోరు జారటం సంభవిస్తే "Honey I love you " అనటానికి సంకోచించ వోకండి. All the best during lockout.

P.S
విన్నకోట వారూ, నీహారిక గారూ, శ్యామలీయం గారూ ముక్త కంఠం తో చెబుతున్నారు అన్నం వండటానికి నేను వ్రాసినట్లు కాకుండా బియ్యం,నీళ్ళు ఒకటికి రెండని. నేను అన్నం వండటంలో చివరి ముఖ్య పని మాత్రమే చేస్తాను అందుకని నాకు ఈ ప్రిపరేషన్ సంగతి తెలియదు. మా ఆవిడ ఇచ్చిన గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చెయ్యటం మాత్రమే నా పని. ఒక అరగంటకి అన్నం ఉడుకుతుంది. ఇది పెద్ద కష్టమయిన పని కాదు. వీరు చెప్పిన సంగతి తప్పో ఒప్పో తెలియక మా ఇంట్లో ఎక్సపర్ట్ కన్సల్టెంట్ మా ఆవిడని సలహా అడిగాను.

ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే నేను అన్నము మెత్తగా ఉన్నదని గొడవచేస్తే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం మెలికలుగా(పలుకుగా ) ఉన్నదంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం వండటం ఇంత క్లిష్టమని అనుకోలేదు. మీకు అన్నీ చెప్పాను. మీ కిష్టమయిన విధంగా అన్నం వండుకోండి.

Monday, December 16, 2019

156 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్ - 2019

దివాలీ వెళ్ళి దాదాపు రెండునెలలవుతోంది, ఇప్పుడు దాన్ని గురించి వ్రాస్తున్నాడేమిటా అని అనుకుంటున్నారా. వ్రాయకుండా ఉండటానికి ప్రయత్నించాను గానీ మనస్సు ఒప్పుకోవటల్లేదు. ఇది పూర్తి అయ్యేదాకా  ఇంకొక  విషయం గురించి వ్రాయలేక పోతున్నాను. దానినే mental block అంటారల్లే ఉంది.

అసలు దీపావళి, అంటే దీపాల వరస, దివాలీ గ ఎల్లా మారిందో నాకు అర్ధం కాదు. ఒకటి మాత్రం నిజం "దివాలీ" అంటే అమెరికన్స్ కి తెలుస్తుంది కానీ దీపావళి అంటే తెలియటం కష్టమే.

అమెరికాలో రెండు ముఖ్య పండగలు. ఒకటి నవంబర్లో వచ్చే Thanks Giving , డిసెంబర్ లో వచ్చే Christmas. ఈ వరస లోకి దాదాపు అక్టోబర్ లో వచ్చే "దివాలీ" చేరిపోయింది. వైట్ హౌస్లో దీపం వెలిగించటం దగ్గరనుంచీ మా  ఊళ్ళో ఉన్న లైబ్రరీ దాకా అమెరికాలో దీపావళి పండగ చేసుకుంటున్నారు.

చికాగో నుండి ప్లేన్ దిగి ఇంట్లోకి రాగానే రేపు మెన్హాటన్ లో ఒక రేడియో స్టేషన్లో దివాలీ ప్రోగ్రాంకి మనం వెళ్తున్నాము అన్నారు. నేను మెన్హాటన్ వెళ్ళటానికి కొంచెం సంకోచిస్తాను.

అక్కడ ధియేటర్స్ మ్యూజియంస్ అన్నీ బాగుంటాయి కానీ వెళ్ళటానికి  కొన్ని ఇబ్బందులు భరించాల్సి వస్తుంది. చివరికి చేసేది లేక సరే అన్నాను.

సరే అన్నాను కానీ లోపల కొంచెం బెరుకు గానే ఉంది.  జెర్సీ సిటీ,  మెన్హాటన్, హడ్సన్ రివర్ కి ఇరు పక్కలా ఉంటాయి. మెన్హాటన్ కి వెళ్ళాలంటే మేమున్న చోటునుంచి సొరంగం ద్వారా కాలవ దాటటమే. దగ్గరే, మూడు నాలుగు మైళ్ళు ఉంటుంది కానీ ట్రాఫిక్ తో గంట పట్టిన రోజులున్నాయి. సరే దాటాము పో కార్ పార్క్ చెయ్యటం పెద్ద గొడవ. మనం వెళ్ళే చోట దగ్గరలో పార్కింగ్ దొరుకుతుందని చెప్పలేము. సరే పార్క్ చేసి ప్రోగ్రాం కి వెళతాం , రెండు మూడు గంటల ప్రోగ్రాం అయిన తర్వాత ఎదో తినాలి కదా దగ్గరలో సరి అయిన రెస్టారెంట్ ఉంటుందని చెప్పలేము. ఫ్యూషన్ రెస్టారెంట్లు, ఇటాలియన్ రెస్టారెంట్లు , వేగన్ రెస్టారెంట్లు ఉంటాయి కానీ  తినగలమో లేదో చెప్పటం కష్టమే. నేను వేగన్ ని కాను ఇటాలియన్ ఫుడ్ తినను థాయ్ ఫ్యూడ్ అసలే నచ్చదు ఫ్యూషన్ ఫుడ్ దగ్గరకి పోను. ఆ రెస్టారెంట్లలో తిని ఇంటికొచ్చి తిట్లూ శాపనార్ధాలతో మాగాయ ముద్ద కలిపించుకుని తిన్న రోజులు చాలా ఉన్నాయి.

బెరుకుగానే ఇంటినుండి బయలుదేరాను. ఆరోజు వేళా విశేషమేమిటో గానీ వెళ్లాల్సిన ప్రదేశానికి పావు గంటలో జేరుకున్నాము. ఎదురుకుండా పార్కింగ్ దొరికింది. ప్రోగ్రాం ఒక రేడియో స్టేషన్ లో. నేను చిన్నప్పుడు చూసిన బెజవాడ(విజయవాడ) రేడియో స్టేషన్ కి దీనికి చాలా తేడా ఉంది. లోపలికి వెళ్ళి ఒక చిన్న థియేటర్లో కూర్చున్నాము.

 పై ఉన్న ఫోటో మెన్హాటన్ లో ఉన్న WQXR రేడియో స్టేషన్ లో తీసింది. ఆ రోజు దివాలీ సందర్భంగా talent show జరుపు తున్నారు. థియేటర్  దాదాపు నిండి పోయింది, యాభై మంది ఉంటారు. ఆ రోజు కార్యక్రమాన్ని బయటి  ప్రేక్షకుల కోసం streaming చేస్తున్నారు. ఇక్కడ బ్రాడ్వే కి చుట్టుపక్కల, ఇటువంటి చిన్న చిన్న థియేటర్స్ చాలా ఉన్నాయి. బ్రాడ్వే లో ప్రదర్శించటానికి నోచుకోని నాటకాలని ఇటువంటి థియేటర్ల లో ప్రదర్శిస్తూ ఉంటారు. దాదాపు పెద్ద నటులందరూ చిన్న చిన్న నాటకాలు వేసి బ్రాడ్వే లోకి వెళ్ళి పేరు తెచ్చుకున్నవాళ్ళే. మేమూ చిన్నప్పుడు ఎవరో ఒకరింట్లో చిన్న స్టేజి కట్టి నాటకాలు వేసే వాళ్ళం. మేము ఎవరమూ యాక్టర్స్ అవలేదు. ఎవరో నూటికో కోటికో ఒకళ్ళు అవుతారు. కానీ ధీటుగా స్టేజి మీద మాట్లాడటం అలవాటు అవుతుంది.

ప్రోగ్రాం మొదలెట్టారు. ఆరోజు అరుణ్ వేణుగోపాల్( NPR radio) సభ నడుపుతున్నారు. ప్రోగ్రాం ఎల్లా నడుస్తుందో చెప్పి జడ్జెస్ ని పరిచయం చేశారు ( DJ Rekha and comedian Aparna Nancherla). ప్రోగ్రాం అంతా ఇంగ్లిష్ లో జరిగింది. టాలెంట్ షో కాబట్టి సామాన్యంగా బయటి పరిశీలకులు వస్తారు. వాళ్ళకి నచ్చితే  artists ని ఇంకొక చోట బుక్ చేసుకుంటారు. మొత్తం ప్రోగ్రాంలో, ఇద్దరు comedians వాళ్ళ నేర్పు ప్రదర్శించారు , ఒక తమిళ ఆవిడ రాజస్థాన్ folk song పాడింది, ఒకళ్ళు డాన్స్ చేశారు, ఒక డాన్స్ ట్రూప్ భారతంలో ఒక ఘట్టం ప్రదర్శించారు. వీళ్ళు తర్వాత ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేయబోతున్నారో కూడా చెప్పారు. ప్రదర్శన అయిపొయింది. జడ్జెస్ ఎవరు గెలిచారో చెప్పారు. ఆర్టిస్టులు అందరూ ప్రేక్షకులలోకి వచ్చి కలిసి పోయి మాట్లాడుతున్నారు. నాకు మాత్రం ధ్యాస అంతా  రాత్రి భోజనం మీద ఉంది.

బయటకు వచ్చాము. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మృదువుగా వీస్తున్న చక్కటి గాలి. అప్పనంగా వచ్చిన పార్కింగ్ ని వదలలేక, చుట్టుపక్కల ఏమన్నా రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని కొంత దూరం అటుపక్కా ఇటుపక్కా తిరిగి చూశాము. తాగి తందానాలేసేవి తప్ప కూర్చుని తినేవి చూడలేదు. ఫోన్ లో వెదికితే  కొంత దూరం లో ఒక diner కనపడింది. వెతకాలే గానీ మన అవసరాలకి ఎప్పుడూ ఏదో ఒక కొట్టు New York లో ఎల్లవేళలా తెరిచి ఉంటుంది. అది 24 hour  రెస్టరెంట్ , అదృష్టం బాగుండి  మళ్ళా ఎదురుకుండా పార్కింగ్ దొరికింది. ఇక్కడ అమెరికాలో,(గోర్మే రెస్టారంట్ కాకుంటే), భోజనం బాగా పెడతారు. నేను సుబ్బరంగా frittata లాగించేశాను. తృప్తిగా ఇంటికి చేరుకున్నాము.

ఒక వారం తరువాత అక్టోబర్ లో చికాగో వచ్చేశాము. వెంటనే  చికాగో  వింటర్ చవిచూశాము. క్రింది ఫోటో ఓ అక్టోబర్ ఉదయాన కనిపించిన మా ఇంటి పెరటితోట. అక్టోబర్ నెల లో నాకు తెలిసినంతవరకూ ఎప్పుడూ చికాగోలో స్నో పడలేదు. ఏమిటో కాలం మారిపోతోంది.PS : Talent  Mela లో పాల్గొన్న వారి పేర్లు వ్రాద్దామనుకున్నా గానీ నేను తెచ్చిన ప్రోగ్రాం కాగితం ఎంత వెదికినా కనపడలేదు. ఇంట్లో నేను దాచి పెట్టుకున్న కాగితాలు ఇంట్లో ఉన్న ఇద్దరికీ తెలియకుండా మాయమయి పోతూ ఉంటాయి. ఏమిటో చిత్రం.

Tuesday, October 8, 2019

155 ఓ బుల్లి కథ -- రోజుకో దోసకాయ నాలుగు చిక్కుళ్ళ కధ


అప్పుడే తెల తెల వారు చుండెను. పక్షులు కిల కిలా రావములు చేయుచుండెను. బయట మలయ మారుతము వీచు చుండెను. నా మనస్సు ప్రశాంతముగ నుండెను. అప్పుడు సమయము చూడగా తెల్లవారు ఝాము నాలుగున్నర గంటలయ్యెను. నిశ్శబ్దముగా కాలకృత్యములు తీర్చుకొని మేడ మీది నుండి దిగి కాఫీ ప్రయత్నములు చేసితిని.

అవి ఆరు నెలల క్రిందటి రోజులు. త్వరలో వేసవి వచ్చునని ఆనందించిన రోజులు. వసంత కాలమూ వేసవి కాలము వచ్చి వెళ్ళిపోయెను. ప్రస్తుతము ఇది అక్టోబర్ నెల. పక్షుల కిలకిలా రావములు లేవు. మలయమారుతములూ లేవు. బయట ఉష్ణోగ్రత రోజురోజుకీ తగ్గిపోవుచుండెను. చెట్ల మీది ఆకుల రంగులు మారు చుండెను. ఇంకొక నెల రోజులలో ఆకులు అన్నియూ రాలి   నేలమీద పడి చెత్త బుట్టల లోకి వెళ్ళును. ఇక త్వరలో చలికాలము వచ్చునని వాటి సూచన. నాకు గ్రాంధిక భాష వచ్చుచుండెను. ఎంతవరకూ సాగునే చూచెదను.

ఉదయము ఆరు గంటలకు లేచుదమనుకుని ఏడున్నర గంటలకు లేచితిని. ఇంట్లో చలిగా ఉండెను. ఇంటిలోకి వేడి గాలి పంపే కొలిమిని (furnace ) ని మొదలెడుదామనుకుంటిని గానీ భార్యాగారికి అది చేసే శబ్దము నిద్రాభంగము కలుగునని భయపడి వణుకుచూ  కాఫీ ప్రయత్నములు చేసితిని. ఇంట్లో మొదట లేచి కాఫీ ప్రయత్నములు చేయునది నేనే. నాకూ ఇది సమ్మతమే. ఉదయమున కనీసము రెండు గంటలు ఎవరి ప్రకంపనలూ లేకుండగ   కాలము గడపవచ్చును.

వంటశాల (kitchen ) కిటికీ నుండి పెరటిలోకి చూసితిని. బిక్కు బిక్కు మంటూ ఎండి పోవు చున్న మా పెరటి తోట కనపడెను. దానికి ఈ సంవత్సరము సరి అయిన న్యాయము చెయ్యలేదని నా మనస్సులో బాధగా ఉండెను. పది మందికి కూరగాయలు పంచిన తోట ఈ సంవత్సరం కాసిని దోసకాయలు చిక్కుళ్ళతో సరిపెట్ట వలసి వచ్చినది కదా అని మనసులో బాధ వేసినది. పరిస్థుతుల ప్రభావం మార్చలేము కదా. వాతావరణం మనం చెప్పినట్లు వినదు కదా అని సరిపెట్టు కుంటిని గానీ మిత్రులు వారి పెరటి తోట నుండి వంకాయలు,టొమాటోలు, సొరకాయలు, కుకుంబర్, మిరపకాయలు తెచ్చి ఇస్తుంటే "పుండు మీద కారం చల్లినట్లో లేక దేనిమీదో ఆజ్యం పోసినట్లో" ఇంట్లో పరిస్థితి ఉండును. వాతావరణము అందరికీ ఒకటే కదా వారి తోట పెరుగుట ఏల మన తోట పెరగకపోవుట ఏల అనే ఇంటావిడ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఏదో నా బాధని వినేవారులేక, మీతో పంచుకుని కొంచెం ఉపశమనం పొందుదమని ఇక్కడ వ్రాయుచుంటిని. నా కెందుకో బాధల్లో వ్రాయుటకు గ్రాంధికము వచ్చును.

అమెరికాలో మేముండే ప్రాంతములో (చికాగో) బయట వాతావరణం వెచ్చ పడుట ఏప్రిల్ నుండీ ప్రారంభమగును. "మే" మొదటి వారములో పెరట్లో మొక్కలు వేయుదురు. అంతకు ముందు వేసిన మొక్కలు బతికి బట్టకట్టవు. ఈ సంవత్సరము కొంచెము బద్దకం, కొంచెం వాతావరణము అనుకూలించక పోవుట వలన  (ఎడతెగని వర్షాలు ) మా పెరట్లో మొక్కలు వెయ్యలేదు. పక్కింట్లో మొక్కలు పెరుగుతుంటే ఇంట్లో గొణుగుడు మొదలయింది. కానీ ఏమి చేయగలను? నేనూ మనిషినే. భర్త అయినంత మాత్రమున నా ఇష్టా ఇష్టములు మానగలనా?  నాకూ ఇష్టాయిష్టములు ఉన్నవి. నేను సూర్యుడు ఉన్న గానీ బయట పని చేయను. నేను చేద్దా మనుకున్నప్పుడు సూర్యుడు ఉండడు. ఈ సంవత్సరం దాదాపు వేసవి యంతయూ ఈ సమస్యతో  కాలము గడిచిపోయెను. మేము మొక్కలు వేయుచోట గడ్డి పెరుగుట మొదలిడెను.

నేను సరేలే ఈ సంవత్సరం పెరటి తోట మర్చి పోదాము అనుకున్నాను. కానీ మా పక్కింటి చిట్టెమ్మ "టామీ" కి మా పెరట్లో మొక్కలు వెయ్యక పోవటం నచ్చలేదు ఆ ప్రదేశంలో గడ్డిపెరగటం అసలు నచ్చలేదు. తాను సహాయం చేస్తానని ఎప్పుడో మా ఇంటావిడకి చెప్పెందిట, ఆవిడ లేనప్పుడు వచ్చి మొక్కలు వేసేచోట కూచుని గడ్డి పీకటం మొదలెట్టింది. నాకు స్వతహాగా ఆడవారు కష్ట పడటం చూడలేని హృదయం గనుక వెంటనే వెళ్ళి నువ్వు కష్టపడద్దమ్మా నాగలి తీసుకు వచ్చి దున్నుతాను నువ్వు నాకు సహాయం చెయ్యి చాలు అనిచెప్పాను. నేను గారేజ్ లోనుండి electrical cultivator (tiller ) తీసుకువచ్చి దున్నితిని. తాను ఎలక్ట్రికల్ వైర్ సంగతి చూసుకుంది. తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళం వెళ్లి పోవుట జరిగెను.

మళ్ళా వర్షాలు మొదలయ్యాయి. వర్షములో మొక్కలు వెయ్యలేము కదా. నేను మొక్కలు వేద్దా మనుకున్నప్పుడు సూర్యుడు రావటల్లేదు. సూర్యుడు ఉన్నప్పుడు నాకు తీరిక దొరకటల్లేదు. తీరిక దొరకటానికి మీరేమి వెలగ పెడుతున్నారని మా ఆవిడ అంటుంది గానీ అది నిజం కాదు. ప్రతీ మనిషికీ ఏదో చెయ్యాలనే తపన ఉంటుంది. ఆ తపన తోటి రోజులు గడిచిపోతుంటాయి. అది సాధించాడా అనేది ముఖ్యం కాదు. ఆ కారణము వలన మొక్కలు పెట్టలేదు.

ఇంతలోకే మా బావమరిది, వాళ్ళ అమ్మాయి పార్వతి తో మా యింటికి వస్తున్నారని తెలిసింది. ఈ సంవత్సరం మా పెరటితోట వారితో ఎందుకు ప్రారంభించ కూడదు అనే బ్రహ్మాండమయిన ఆలోచన నాకు వచ్చెను. వాళ్ళు ఒక్కరోజే ఉండుదురు గనుక వారు వచ్చిన వెంటనే తోట ప్రారంభోత్సవం గురించి చెప్పితిని. బయట సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగుచుండెను. వారు వెంటనే అంగీకరించి పనిముట్లు తీసుకుని సిద్ధమయితిరి.

మా దగ్గర ఉన్న దోసకాయ గింజలూ చిక్కుడు కాయ గింజలూ తోటలో వేసితిరి. మా ఆవిడ "నేను పని "ఎగ్గొట్టి" వాళ్ళ చేత చేయించానని అంటుంది గానీ అది నిజము కాదు. వాళ్ళకి హస్త వాసి ఉందని నేను గ్రహించి గింజలు నాటించితిని. అందుకనే ఒక వారము రోజుల్లో మొక్కలు బయటకి వచ్చెను.

ఆలాస్యంగా మొక్కలు వెయ్యటం మూలంగా మాకు పంట ఆగస్టు లో గానీ చేతికందలేదు.మొదటి ఫోటో లో ఉన్న దోసకాయ నాలుగు చిక్కుళ్ళతో మొదలుపెట్టి  దాదాపు  దోసకాయతో రోజూ ఏదో చేసుకుని తింటూనే ఉన్నాము (దోసకాయ పప్పు, కూర, పులుసు,  పచ్చడి). ఇంటి చిక్కుడు కాయ, వంకాయ తో కలిపి కూర చేస్తే చాలా బాగుంటుంది. అల్లాగే చిక్కుడు బంగాళాదుంప కూర కూడా బ్రహ్మాండం.

చివరి ఫోటో లో మాకిచ్చిన మా పక్కింటి టామీ పెరటి తోటలో పండించిన మిరపకాయలు. ఆవిడ వాటిని ఓవెన్లో ఎండబెట్టి బ్లెండర్ తో క్రష్ చేసి సంవత్సరానికి పనికొచ్చేలా దాచిపెట్టుకుంటుంది. అమెరికన్లు మన వంటని "స్పైసీ" అని సన్నాయి నొక్కులు నొక్కుతారు గానీ వాళ్ళు crushed red pepper పిజ్జా మీద వేసుకుని రోజుతూ తింటారు.

రమణా, పార్వతీ, పక్కింటి "టామీ" మీరు కల్పించుకోపోతే ఈ సంవత్సరం మా పెరటి తోట ఉండేది కాదు. తోటలో దోసకాయలకీ చిక్కుళ్ళకీ మీకు థాంక్స్ చెప్పాలి.

PS : మధ్య ఫొటోలో  "ఇదిగో ఫోటో తీసుకో" అని ఒక కాగితం పెట్టుంది గమనించారో లేదో. మీరేమీ అనుకోకండి. ఆరోజు నేను మా ఆవిడ మాట్లాడు కోటల్లేదు. "పుస్తకం హస్త భూషణం " లాగా   "మౌనం భర్త భూషణం" అని నేను కొన్ని రోజులు భార్యతో మాట్లాడను.

Wednesday, September 18, 2019

154 ఓ బుల్లి కథ -- ఆరోగ్యంగా ఉండాలంటే - Part 3

జీవత్వం ఉన్న ప్రతి వ్యక్తికీ గాలి,నీరు,ఆహారం చాలా ముఖ్యం. కాకపోతే ఎవరి ఇష్టాఇష్టాలకి అనుగుణంగా వాటిని మార్చుకుంటూ ఉంటాము. ఉదాహరణకి మనం బ్రతకటానికి కాఫీ త్రాగ వలసిన అవసరం లేదు, సారాయి త్రాగవలసిన అవసరం లేదు, సిగరెట్ పొగ పీల్చ వలసిన అవుసరం లేదు, పంచ భక్ష పరమాన్నాలతో భోజనము చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి దూరంగా ఉన్నవాళ్ళు కూడా మనతోపాటు జీవిస్తున్నారు కనుక.

ఏ గాలి పీల్చాలి , ఏ నీరు తాగాలి, ఏ ఆహారం తినాలి అనేవాటిని సామాన్యంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏమన్నా అవకతవకలు కనిపిస్తే వాటిని పైకెత్తి చూపటం, వాటిని సరిచేయించటం, వినకపోతే శిక్షించటం కూడా వాళ్ళ పనే. అమెరికాలో అయితే ఆ పదార్ధాలని వెంటనే అమ్మకాలలోనుండి తీసివేస్తారు, గాలి లో పోలెన్ ఎక్కువగా ఉంది జాగర్త అని సూచనలు ఇస్తారు, ఈ నీరు కలుషితం తాగొద్దని చెబుతారు.

ఎన్ని జాగర్తలు పాటించినా మనం కొన్ని సార్లు అస్వస్థతకు గురి అవుతాము. కలుషిత వాతావరణం లో పెరిగిన సూక్ష్మ జీవులు (దోమలు, ఈగలు మొదలైనవి) కుట్టి రక్తంలోకి  కల్మషాలు పంపటం మూలంగా, కలుషిత ఆహార పదార్ధాలు తినటం తాగటం వలన, కలుషిత మందులు వేసుకోవటం (మొన్ననే Zantac / Ranitidine గురుంచి వార్త),శరీర తత్వం  Lactose intolerant, allergy, virus వగైరా, కారణం ఏ వయినా కావచ్చు.డాక్టర్ దగ్గరకు వెళ్తాము మందులిస్తారు తగ్గితే మంచిది లేకపోతే ఆయన మనమీద అలా practice చేస్తూనే ఉంటారు.

మనం అనుకోకుండా మన తృప్తి కోసం, రుచి కోసం ఆగలేక ఇష్టపడి తిన్నవాటితో కూడా మనకి అనారోగ్యం కలగ వచ్చు. దీనికి కారణం "రుచి" అని మనము ఆనందించే ప్రక్రియ మన మనస్సుకి అందే రెండు సంకేతాల కలయిక,మన నాలిక మీద "taste buds " నుండి వచ్చే సంకేతాలు, మన ముక్కు నుండి వచ్చే వాసనల సంకేతాలు. శాస్త్రజ్ఞులు మనం ఆనందించే  పదార్ధపు "రుచి" అనే అనుభవం 85% దాని  "వాసన"  మీద ఆధార పడి ఉంటుందని కూడా తేల్చారు.

దీనిమూలాన  "flavorists " అనే వాళ్ళు పుట్టుకు వచ్చారు. వాళ్ళు చేసేపని పరిశోధన శాలలో కూర్చొని రసాయనాలు కలిపి మనకు ఇష్టమయిన వాసనలు తయారు చెయ్యటం. వాటిని తిండి పదార్ధాల మీద ప్రయోగించటం. ఉదాహరణకి పొటాటో చిప్స్ అన్ని flavors లో రావటానికి కారణం అదే (అమెరికాలో కనీసం మామూలు షాపుల్లో పది రకాల పొటాటో చిప్స్ ఉంటాయి). వచ్చిన గొడవేమిటంటే అన్ని flavors (chemicals ) మన దేహానికి సరిపోతయ్యని చెప్పలేము. తింటే అనారోగ్యానికి కారణం అవ్వచ్చు.

ఇప్పుడు ఎక్కడ చూసినా దేనిలో చూసినా additives ఉంటాయి. ప్రతీ దానిలోనూ ingredients ఏమున్నాయో చూసుకుంటూ ఉండాలి. తినటం ఆపలేము కాబట్టి, ఏపదార్ధాలు తింటున్నామో గమనించి అవి తిన్న తర్వాత అనారోగ్యమునకు దారితీస్తే వెంటనే వాటిని తినటం మానెయ్యాలి.  అందరి శరీర తత్వాలు ఒక విధంగానే ఉండవు  కాబట్టి, ఏవి తినాలో ఏవి తిన కూడదో, ఎవరికి వారు తయారు చేసుకోవలసిన ప్రణాళిక.

మనం ఎంత జాగత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అస్వస్థతకి గురి అవుతూ ఉంటాము. అస్వస్థతగా ఉన్నప్పుడు మన శరీరం ఆ అస్వస్థతకు కారణాన్ని గమనించి సరిచెయ్యటానికి ప్రయత్నిస్తుంది. అటువంటి పరిస్థుతులలో దాని పనికి(immunity) అడ్డు రాకుండా తేలికగా అరిగే (శరీరం కష్టపడకుండా అరిగే ) పదార్ధాలని తినాలి. దానినే మా చిన్నప్పుడు అమ్మలూ అమ్మమ్మలు "పథ్యం భోజనం" అనే వారు.

నాకయితే నాకు మా అమ్మలూ అమ్మమ్మలూ నేర్పిన పథ్యం భోజనం -- అన్నంలో, కారప్పొడి, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, చారు, మజ్జిగ. తినే పరిస్థితిని బట్టి వాటిలో ఏవి తినాలో నిర్ణయించకోటమే. మీరు కూడా మీ శరీరానికి అరుగుదలలో శ్రమ తగ్గించే "పథ్యం" భోజనం  నిర్ణయించుకోండి. ఇది చాలా ముఖ్య మయినది.

Reference:
1. Taste and Digestion (2018), Edited by Joanne Randolph, Enslow Publishing, New York, NY
   
Disclaimer: This article is not intended to provide medical advice, diagnosis or treatment. Consult your doctor for advice.