Monday, December 30, 2024

211 ఓ బుల్లి కధ --- చికాగో లో క్రిస్టమస్

 

మ్యూజియం క్రిస్మస్ ట్రీ 


ఇండియా క్రిస్మస్ ట్రీ 

మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ 

అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్ లో వచ్చే థాంక్స్ గివింగ్ దగ్గర నుండీ డిసెంబర్ లో వచ్చే   క్రిస్మస్ - న్యూ ఇయర్ దాకా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉంటాయి . సామాన్యంగా ప్రతీ ఇంట్లోనూ క్రిస్మస్ ట్రీ ,  ఇంటిముందు డెకొరేషన్స్, రంగు రంగుల  దీపాలూ సర్వ సాధారణం .  ఈ సమయంలో బంధువుల మధ్య స్నేహితుల మధ్య  బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతూ ఉంటాయి . ఇంట్లో పిల్లలకి చాలా సంబరంగా ఉంటుంది . క్రిస్మస్ ముందురోజు రాత్రి శాంటా క్లాస్ వచ్చి వాళ్ళ ప్రెజెంట్స్ క్రిస్మస్ ట్రీ క్రింద పెట్టి వెళ్లి పోతాడు .  క్రిస్మస్ రోజున పొద్దున లేచేసరికి క్రిస్మస్ ట్రీ కింద ప్రెజెంట్స్ కనపడంగానే పిల్లలకి ఎంత ఆనందమో .   కొందరు పిల్లలయితే రాత్రిపూట  శాంతా క్లాస్ కి పాలూ బిస్కట్లు కూడా పెట్టి ఉంచుతారు మంచి మంచి ప్రెజంట్స్ కోసం  . ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్, సంవత్సరంలో వచ్చే చాలా పెద్ద పండగ .  పిల్లలూ పెద్దలూ వాళ్లకి కావాల్సిన ప్రెజెంట్స్ గురుంచి బాహాటంగా చెబుతూ ఉంటారు .  వాళ్లకి కావాల్సినవి రాకపోతే , కొంచెం నిరాశ ఉన్నా వచ్చే సంవత్సరానికి వస్తుందిలే అనుకుని వచ్చిన దాంతో తృప్తి పడతారు . 

మా ఇంట్లో ప్రతీ సంవత్సరం క్రిస్మస్ ట్రీ పెడతాము . ప్రెజెంట్స్ కూడా  దాని క్రిందకి వస్తూ ఉంటాయి . మా మనవరాలికి కూడా శాంతాక్లాస్ ఈ సంవత్సరం క్రిస్మస్ ట్రీ కింద ప్రెజెంట్స్ పెట్టి పోయాడు . మన మనసంప్రదాయాలు ఎలాఉన్నా మన పిల్లల సంప్రదాయాలు , ప్రేమలూ వాళ్ళు పెళ్లి చేసుకునే  వాళ్ళని  బట్టి ఎలా మారతాయో  చెప్పలేము కాబట్టి గుంపులో గోవిందా అనుకుంటూ విభిన్న సంప్రదాయాల గురించి తెలుసుకోవటంమంచిది .  

ఈ సంవత్సరం క్రిస్మస్ టైం లో మేము ముఖ్యంగా చూసినది /చేసినది చికాగో లో ఉన్న సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియంకి వెళ్ళటం . అక్కడ క్రిస్మస్ సమయంలో అన్ని దేశాల క్రిస్మస్ ట్రీస్ ఆయా దేశాల డెకొరేషన్స్ తో పెట్టి చూపిస్తారు . మా పిల్లల్ని వాళ్ళ చిన్నప్పుడు అక్కడకి తీసుకు వెళ్లాము. ఇప్పుడు  వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకు వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకు వెళ్లారు . 

ఈ సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియం 1890 లో అనుకుంటాను వరల్డ్ ఫెయిర్ అప్పుడు నిర్మించారు .   అప్పటినుండీ ఇప్పటిదాకా  ఎప్పటికప్పుడు కాలాన్నిబట్టి మార్పులూ చేర్పులూ చేస్తూ అధునాతకంగా ఉంచుతారు .  ఇప్పుడు దాని పేరు గ్రిఫ్ఫిన్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియం. బహుశా  గ్రిఫిన్ గారు కొన్ని మిల్లియన్స్ డబ్బులు దీనికి  ఇచ్చి ఉంటారు .  నేను చెప్పటం మర్చి పోయాను , సామాన్యంగా  క్రిస్మస్ సమయంలో అందరూ  ఎవరికి  తోచినంత వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు . 

ఈ మ్యూజియం గురించి తలచుకున్నప్పుడల్లా  నా మనస్సు ఎక్కడికో వెళ్లి పోతుంది . పాత జ్ఞాపకాలు బయటికి వస్తాయి .  యాభై ఏళ్ళ  క్రిందట దాదాపు రోజూ ఈ మ్యూజియంకి సాయంత్రం భోజనం చేసిన తరువాత వెళ్ళే  వాణ్ని. నేను చికాగో యూనివర్సిటీ లో పని  చేసినప్పుడు ఇంటెర్నేషనల్  హౌస్ లో ఉండేవాణ్ణి .  అది ఇక్కడికి చాలా దగ్గిర. అప్పుడు దీనికి ఎడ్మిషన్ ఫీ  కూడా ఉండేది కాదు .  రోజుకో సెక్షన్ చూసే వాణ్ని .  ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క సైన్స్ పుస్తకం . అక్కడ ఎక్జిబిట్స్  చదువుతూ చూస్తూ ఉంటే సైన్సు  పుస్తకాలు చదవక్కర్లా.  నేను అక్కడ చాలా సంగతులు తెలుసు కున్నాను .  కోల్ మైన్స్ ఎల్లా ఉంటయ్యి , భూమిలోంచిపెట్రొల్ ఎల్లా తీస్తారు ,  రైలు ఇంజను కార్ ఇంజన్లు ఎల్లా పని చేస్తాయి . ట్రాన్సిస్టర్ లు ఎల్లా తయారు చేస్తారు, ఎల్లా పనిచేస్తయ్యి .  పూర్వ కాలంలో అమెరికాలో వీధులు ఎల్లా ఉండేవి . ఇక్కడ చూడటానికి రెండవ ప్రపంచ యుద్ధంలో పట్టుబడ్డ uboat జర్మన్ సబ్మేరీన్ కూడా ఉంది .దీనిలో ఉన్న IMAX థియేటర్లో సినిమాలు కూడా చూశాను .  మీరు కూడా సినీమా తో పాటు తిరుగుతున్న భావన కలుగుతుంది . ఇక్కడ ఒక పెండ్యులం రెండవ అంతస్థు నుండి క్రిందకి వేళ్లాడుతూ ఆగకుండా అప్పటి  టైం చూపెడుతూ ఉంటుంది. ఎప్పటినుండో  ఉన్న ఈ  పెండ్యులం ని  , భావి  తరాల వారు ఎంతమంది దాన్ని చూడబోతున్నారో .  

ఈ తడవ కొత్త ఎక్జిబిట్ , ఫైటర్  పైలట్ .  మీరు ఫైటర్ ప్లేన్ లో  కూర్చుని గన్సు ఫైర్ చెయ్యాలి . దానికి ఒక పది నిమిషాలు ట్రైనింగ్ కూడా ఉంటుంది . ప్లేన్ ఉల్టాసీదా కూడా అవుతుంది .  నేను దానిలోకి వేళ్ళ లేదు కానీ , మా ఇంట్లో ఎడ్వెంచరర్స్ మా అమ్మాయి వాళ్ళమ్మా  వెళ్లారు. నేను మనవరాలిని తో బయట ఉన్నాను . 

మా మానవరాల్ని అక్కడి పిల్లల కోసం వేసిన మైదానంలో ఆడించి,  ఇంటినుండి తెచ్చుకున్న (గోంగూర ముద్ద  ) తిని  కాఫీ తాగి ఇంకా కొన్ని ఎక్సిబిట్స్ చూసి  , పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు ఎల్లా రోబోలు తయారు చేస్తయ్యో చూసి ,  ప్రపంచంలో ,  ప్రకృతిలో  కనపడే వాటిల్లో గోల్డెన్ రెష్యు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుని అక్కడే ఉన్న అమెరికాలో మొదటి లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసి  సాయంత్రానికి ఇంటికి చేరాము .   

మ్యూజియం గూగుల్ ఫోటో 


No comments:

Post a Comment