Saturday, October 29, 2016

127 ఓ బుల్లి కథ 115 ---- అమెరికాలో భార్గవి రైలు ప్రయాణంఎల్లాగూ న్యూయార్క్ దాకా వచ్చాము. ఎప్పుడూ కుదరటల్లేదు. ఈసారయినా ఇషికాను చూడాలి పార్వతిని చూడాలి తప్పదు అనుకుంది భార్గవి. వీకెండ్ ఇషాన్ బర్తడే ట తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళు నాలుగు వందల మైళ్ళ దూరంలో రిచ్మండ్ అనే ఊళ్ళో ఉంటారు. డ్రైవింగ్ కుదరదు. ప్లేన్ లో వెళ్ళాలంటే మధ్యలో ఆగి ఇంకో ప్లేన్ ఎక్కాలి ట్రైన్ అయితే ఎక్కి కూర్చుంటే అక్కడ దిగొచ్ఛు. దానికి తోడు సీనియర్ డిస్కౌంట్ తో ఖరీదు కూడా చాలా తక్కువ. ఆరు గంటల్లో వెళ్ళి పోవచ్ఛు. అందుకని ట్రైన్ లో వెళదామని సెటిల్ అయ్యింది. నలభై ఏళ్ళు అమెరికాలో ఉన్నాచేసిన రైలు ప్రయాణాల్ని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అవి చికాగో నుండి పిట్స్ బర్గ్ , చికాగో నుండి యాన్ ఆర్బర్, చికాగో నుండి చాం పైన్.  అమెరికాలో రైలు ప్రయాణీకులు తగ్గటంతో, రైలు రోడ్లకి  రాబడి లేక దివాలా ఎత్తితే అమెరికా గవర్నమెంట్ వాటినన్నిటినీ కలిపి AMTRAK  అనే పేరుతో రైళ్ళు నడుపుతోంది.

ట్రైన్ పొద్దున పదకొండున్నరకి. భోజనం చేసి బయల్దేరటం కుదరదు. పక్కన నసపెట్టే మొగుడికి భోజనానికి ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి. జిప్ లాక్ లో మిగిలిన అరటికాయ కూర తో పులిహార కలిపి మూటకట్టుకుంది.

న్యూయార్క్ "పెన్ స్టేషన్" నుండి అమెరికాలో నలుమూలలకి AMTRAK  ట్రైన్ లు వెళ్తాయి. మేముండే జెర్సీ సిటీ నుండి పెన్ ట్రైన్ స్టేషన్( మెన్హాటన్)  కి ఆరు మైళ్ళ దూరం. కానీ ఊబర్ టాక్సీ లో గంట పట్టింది. సామాను "చెక్ ఇన్" చేద్దామని వెళ్తే, రిచ్మండ్  ఊరికి చెక్ ఇన్ సౌకర్యం లేదన్నారు. సామాను రైల్లో పెట్టటానికి సహాయం కావాలి. ఇక్కడ మన రైల్వే కూలీల్లాగా, ప్రయాణీకుల
సౌకర్యం కోసం  "రెడ్ కాప్" సర్వీస్ అని ఒకటుంది. వీళ్ళు "పెన్ స్టేషన్" లో మూడు షిఫ్టుల తో  24 గంటలూ పని చేస్తారు. ఒక్కొక్క షిఫ్టులో వంద మంది ఉంటారుట. వాళ్ళ సహాయంతో అందరికన్నా ముందర ట్రైన్ ఎక్కాము. దిగేటప్పుడు సహాయం చెయ్యమని కూడా ట్రైన్ కండక్టర్ కి చెప్పి వెళ్ళాడు. మనకు సహాయం చేసిన వాళ్లందరికీ టిప్ ఇవ్వటం అమెరికాలో మామూలు. మాకు ఒక ఒక పెద్ద సూట్ కేస్ అందుకని ఒక అయిదు డాలర్లు టిప్ ఇచ్చాము.జనమంతా  రావటం మొదలెట్టారు. సీట్లన్నీ నిండిపోయాయి. మిగిలిపోయిన సీట్లకోసం జనం వెతుక్కుంటూ  ట్రైన్ అంతా తిరుగుతూ ఉన్నారు. ఈ రైలు లో ఏడు పెట్టెలున్నాయి. ఒక మూలనుండి ఇంకొక మూలకి  వెళ్ళ వచ్చు. బయట మబ్బుగా ఉంది. ట్రైన్ 120 మైళ్ళ వేగంతో పరిగెడు తోంది. చెట్లు పుట్టలు నదులు వెనకపడి పోతున్నాయి.అక్టోబర్ అవటం మూలాన చెట్లు రంగు రంగుల ఆకులతో
పరుగెడుతున్నాయి. లంచ్ టైం అయ్యింది అందరూ వాళ్ళు తెచ్చుకున్నవి తింటున్నారు. మేము పులిహార తిని  కాంటీన్ నుండి కాఫీ తెచ్చు కున్నాము. ఇటువంటి ట్రైన్ లన్నిట్లో ఒక చిన్న కాఫిటీరియా కూడా  ఉంటుంది కానీ వాటిల్లో అమ్మేవి కొంచెం ఖారీ దెక్కువ. ట్రైన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది దానితో ట్రైన్ ఏ ఊళ్ళ మీదగా పోతోందో ఎంత స్పీడ్ తో పోతోందో చూడవచ్చు. ఐపాడ్ ద్వారా సినిమాలు చూద్దామని ప్రయత్నించాము గానీ చూడ బుద్ది పుట్టలేదు. బయటికి చూస్తూ కూర్చున్నాము.

రైలు మధ్య మధ్య స్టేషన్ల లో ఆగుతోంది . జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఈ రైల్లో సీట్ రిజర్వేషన్ లేక పోవటం మూలంగా రైలు అంతా వెతుకుతూ ఎక్కడ ఖాళీగా సీటు కనపడితే అక్కడ కూర్చోవటమే .

ఇంతలో వాషింగ్టన్ సిటీ స్టాప్ వచ్చింది. వాషింగ్టన్ అమెరికా రాజధాని. చాలా మంది జనం దిగిపోయారు. ఇక్కడ చాలా సేపు రైలు ఆగింది. బయటకి దిగవచ్చు అన్నారు. మేము దిగలేదు. ఇంత వరకూ రైలు ఎలక్ట్రిక్ ఇంజన్ తో వచ్చింది. ఇక్కడ నుండీ డీజిల్ ఇంజన్ తో వెళ్తుందిట. ఇది మన రైళ్ళకి ఉండే వాటరింగ్ స్టాప్ లాంటిది, సామర్లకోట భోజన శాల సాంబార్ పాకెట్లు తైరు సాదం పాకెట్లు గుర్తుకు వచ్చాయి.

రైలు చివరికి కదిలింది. నెమ్మదిగా పోతోంది. చూస్తే స్పీడ్ 70 మైళ్ళు. సగానికి సగం తగ్గిపోయి నట్లుంది. రైలు మధ్య మధ్య ఊళ్ళల్లో ఆగుతోంది. వాషింగ్టన్ లో ఎక్కిన వాళ్ళందరూ దిగిపోతున్నారు. ఇళ్ళకి పోతున్నారల్లే ఉంది ఉషారుగా నుంచుని మాట్లాడు కుంటున్నారు .వాషింగ్టన్ లో ఇళ్ళ ఖరీదెక్కువ అందుకని అక్కడ పని చేసే వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు.

సాయంత్రం ఆరు గంటలవుతోంది. కండక్టర్ వచ్చి మీ ఊరు రాబోతోంది మీకేమి సహాయం కావాలని అడిగింది. సామాను సంగతి చెప్పాము. మమ్మల్ని ముందరికి తీసుకువెళ్ళి మమ్మల్ని దిగమని సామాను దింపి స్టేషన్ దాకా తీసుకు వచ్చింది. మేము టిప్ ఇచ్చామనుకోండీ. పిల్లలు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. న్యూయార్క్ నుండి రిచ్మండ్ ట్రిప్ సుఖంగా గడిచిపోయింది.

2 comments:

 1. శ్రీ లక్కరాజుగారికి,నమస్కారములు. మీఅందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ రైల్ ప్రయాణం బాగుంది.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
  Replies
  1. మాధవరావు గారికి
   మేము రిచ్మండ్ దగ్గర ఛెస్టర్ అనే ఊళ్ళో ఉన్నాము. ఇక్కడ కూడా దీపావళి పూజలూ ప్రసాదాలూ జరుగుతున్నాయి. స్వామి నారాయణ్ టెంపుల్ కి వెల్దామని అనుకుంటున్నారు. మీ దీపావళి బాణా సంచీ తో బాగా జరిగిందనుకుంటాను. ఈ ఊళ్ళో అవి నిషిద్ధం. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

   Delete