అమెరికాలో డిసెంబర్ అంటే పండగ రోజులు. ప్రతి సంవత్సరం అందరూ ఉత్కంఠతతో ఎదురు చూసే క్రిస్మస్ ఈ నెలలో వస్తుంది. ఇంటి ముంగిళ్లన్నీ లైట్ల తోరణాలతో అలంకరిస్తారు. సామాన్యంగా ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ ఉంటుంది. దానికి కూడా అలంకరణలు చేస్తారు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే క్రిస్మస్ రోజున శాంటాక్లాస్ ఇంట్లోవాళ్లందరికీ ప్రజంట్స్ తెచ్చి క్రిస్మస్ ట్రీ కింద పెడతాడు. క్రిస్మస్ ట్రీకి దీపాలంకరణలు చేస్తే త్వరగా గుర్తించి ట్రీ కింద బహుమతులన్నీపెట్టేసి వెళ్ళిపోతాడు. ట్రీ లేకపోతే శాంటా క్లాస్ రాడు. ప్రజంట్స్ ఉండవు. పిల్లల చిన్నప్పుడు మేమూ క్రిస్మస్ ట్రీ పెట్టేవాళ్ళం. నేను శాంటా క్లాస్ గా, తెలవారు ఝామున లేచి ప్రజంట్లు పెట్టి గంట గలగలా వాయించే వాడిని.
ఈ సమయంలోనే షాపుల వాళ్లకి పండగ. సంవత్సరం అమ్మకాల్లో 40 శాతం ఈ నెలలోనే జరుగుతాయి. సామాన్యంగా ఇళ్ళల్లో అందరూ అందరికీ ప్రజంట్లు ఇచ్చుకుంటారు. సాక్సు బనీనుల దగ్గర నుండీ ఇంటికి వంటికీ కావాలసిన సామాన్లన్నీ ఇప్పుడే కొంటారు. Christmas ముందర అమ్ముడు పోనివన్నీ షాపులవాళ్ళు వస్తువుల ధరలు తగ్గించి after Christmas sale అని పెడతారు. అప్పుడు చూడాలి లైన్లలో జనం. కొందరు తమకి వచ్చిన ప్రజెంట్ల ని తిరిగి ఇచ్ఛేసి వారికి కావలసినవి తీసుకుంటారు. కొందరు వస్తువులు చవకగా ఉంటాయని కొనుక్కోటానికి వస్తారు. షాపు లన్నీ చాలా రద్దీగా గందరగోళంగా ఉంటాయి.
డిసెంబర్ 21న వింటర్ మొదలవుతుంది. చలికాలం. చెట్లన్నీ ఆకులు రాలి మూగబోయి నట్లుగా ఉంటాయి. సామాన్యంగా ఈ నెలలో స్నో పడుతుంది. స్నో లో నడుచు కుంటూ వెళ్లి క్రిస్మస్ షాపింగ్ చెయ్యటం అనేది అందరికీ ఇష్టం. అందుకనే దీనిని white Christmas అంటారు. కొన్ని సంవత్సరాలలో ఈ సమయంలో స్నో పడకపోతే అందరూ డీలా మొహాలతో ఉంటారు. మేము చికాగో దగ్గర ఉంటాము అందుకని స్నో ఎక్కువ. కానీ అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో స్నో పడదు( California, Hawaii etc ). అక్కడివాళ్లు స్నో మిస్ ఆవరనుకోండి. వాళ్లకి white క్రిస్మస్ అంటే ఏమిటో తెలియదు.
పై ఫోటో మా ఇంటి ముందర తీసినది. మాకు Dec 4, ఆదివారం పొద్దున్ననుండీ సాయంత్రం దాకా స్నో పడుతూనే ఉంది. స్నో చెట్ల కొమ్మల మీద పేరుకు పోయి చూడటానికి అందంగా ఉంటుంది. క్రిందిది మా ఇంటి వెనక ఫోటో. స్నో పడుతుంటే తీశాను అందుకని క్లియర్ గా లేదు.
మా ఇంటి వెనక వేసంకాలంలో ఎల్లా వుండెదో చూడండి.
స్నో పడుతున్నప్పుడు చూడటానికి బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్లాలంటేనే గొడవ. కార్ల మీద స్నో పేరుకు పోతుంది. అదంతా తియ్యాలి. ఒక వేళ కారు గరాజ్ లో పెడ్తే కారు బయటికి తియ్యాలంటే డ్రైవ్ వే మీద స్నో అంతా తియ్యాలి. ఇప్పుడే స్నో బ్లోయర్లు బయటికి తీసి స్నో తీసేస్తారు. తియ్యలేని నాలాంటివాళ్ళు ఎవర్నన్నా పెట్టుకుంటారు. మా వాడు స్నో పడటం ఆగంగానే వచ్చి తీసేస్తాడు. అల్లాగే మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద స్నో ని పక్కకు నెట్టి కార్లు వెళ్ళేటట్లు చూస్తారు. లేకపోతే పనులకు వెళ్ళటం కష్టం కదా.
ఈ డిసెంబర్ లో ఇప్పటికి "సైబీరియన్ ఎక్స్ ప్రెస్ " వచ్ఛేసి వెళ్లి పోయింది. "పోలార్ వర్టెక్స్ " రెండో సారి వచ్చింది. ఆ పేర్లు మంచు తుపాన్లకి పెట్టిన పేర్లు. సామాన్యంగా రోజూ వారీ పనులు ఆగవు. రోడ్లు అన్నీ క్లిన్ చేస్తారు. కార్లు నడుస్తూ ఉంటాయి. ఆఫీసులు పనిచేస్తూ ఉంటాయి. స్కూల్ కి పిల్లలు వెళ్తూ ఉంటారు. ప్లేన్లు ఎగురుతూ ఉంటాయి దిగుతూ ఉంటాయి. ఈ నెల నేను మూడు రోజులు ఆసుపత్రిలో కూడా ఉండి వచ్చాను.
ఇవ్వాళ Dec 19, స్నో పడటల్లేదు కానీ బయట ఉష్ణోగ్రత 5 డిగ్రీల F అంటే ఇండియాలో -15C అన్నమాట. నీళ్లు గడ్డకట్టుకునేది 0 డిగ్రీస్ అంటే దానికన్నా ఇంకా తక్కువగా ఉందన్నమాట. ఎంత చల్లగా ఉందో బయట. మా యింట్లో ఇవ్వాళ వేడి నీళ్ళు రావటల్లేదు. రాత్రి సన్నగా నీళ్ళు వదలటం మరచిపోయాము. పైపులో నీళ్ళు గడ్డకట్టుకు పోయాయల్లే ఉంది. వాటిని బాగు చేయించాలి.
ఇంట్లో నుండి తీసిన కింద ఫోటోలు చూడండి. బయట ఎండ ఎంత అమాయకత్వంగా కనపడుతోందో.
ఇంకో నాలుగు నెలలు ఓపిక పడ్తే మార్చిలో మళ్ళా వసంతకాలం వస్తుంది చెట్లు చిగిర్చి పూలు పూసి అంతా ముచ్చటగా ఉంటుంది. మనిషి ఆశాజీవి.
Warm Christmas Greetings to all the readers.
No comments:
Post a Comment