Tuesday, October 30, 2018

146 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్న్యూయార్క్ దరిదాపుల్లోకి వెళ్ళినప్పుడల్లా మెన్హాటన్ కి వెళ్ళటం ఒక అలవాటై పోయింది. మెన్హాటన్ డౌన్ టౌన్ న్యూయార్క్. న్యూయార్క్ కి "Town never sleeps " అనే పేరుంది. మనకు అవసరాలకు కావలసిన కూరగాయాల నుంచీ హెయిర్ కట్ దాకా ఎప్పుడూ ఎక్కడో ఒక షాపు తెరిచే ఉంటుంది. ఇక్కడ బ్రాడ్వే వీధి నాటకాలకి ప్రసిద్ధి. మేము వచ్చినప్పుడల్లా ఎదో నాటకానికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వెళ్తాము. కాకపోతే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. ఇంతదానికి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చిందే అని బాధ పడాల్సి వస్తుంది. ఒకరోజు రాత్రి సినీమా అయిన తరువాత (ఆదో పెద్ద గాథ ) ఆకలయి రెస్టారంట్ కోసం చూస్తే ప్రతి చోటా జనం క్యూ లో నుంచున్నారు. చివరికి ఒక "వేగన్" రెస్టారెంట్ లో సీట్లు దొరికాయి. నిజంగా చెప్పాలంటే పచ్చ గడ్డి పెట్టి వంద డాలర్లు తీసుకున్నాడు. అందుకనే ఈ రోజు భోజనం చేసి బయలుదేరాము.

ఈ తడవ "LA LA Land " అనే సినిమాకి వెళ్ళాము. ఈ సినీమాకి oscars లో తప్పు చదవటం మూలంగా ఒక క్షణం "Best Picture " అయింది. అబ్బాయి మమ్మల్ని సినిమా హాల్ దగ్గర దింపి, మన పేరు మీద సీట్లు రిజర్వ్ చేశాను టిక్కెట్స్ తీసుకోండి అని కారు పార్క్ చెయ్యటానికి వెళ్ళాడు. నాకు ఎప్పటినుండో కోరిక, టిక్కెట్లు, రిజర్వ్ డ్  కౌంటర్ దగ్గర తీసుకోవాలని, పెద్ద వాళ్ళలాగా ఫీల్ అవ్వచ్చు. సామాన్యంగా ఎడ్వన్చెరస్ పనులకి మా ఆవిడని పంపిస్తూ ఉంటాను. ఆవిడ ఎడ్వన్చెరస్ అని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మొగుడు తాళి కట్టి అమెరికాకి వెళ్తే, మూడునెలల తరువాత తను వీసా పుచ్చుకుని అమెరికా వంటరిగా వచ్చింది. ఇది నలభై ఏళ్ళ క్రిందటి మాట. అప్పుడు ప్లేన్లు అమెరికాకి అంచెలంచెలుగా వచ్చేవి. వస్తూంటే మధ్యలో పారిస్ లో ప్లేన్ ఆగిపోయింది "mechanical failure ". సరే అది బయల్దేరి మర్నాడు న్యూయార్క్ చేరేముందర న్యూయార్క్ airport (Kennedy ) లో బస్సు హైజాక్ చేసి రన్వే మీద పెడితే ప్లేన్లు లాండ్ అవటం గొడవయింది. ఇంకొకటి, ఒక ఇరవై ఏళ్ళ క్రిందట దేశం కాని దేశం హాంకాంగ్ లో subway టిక్కెట్లు కొనుక్కురమ్మని పంపించాను. విజయవంతంగా తీసుకు వచ్చింది. అందుకని ఈ మిషన్ కి ఆవిడే తగినదని నిర్ణయించుకున్నాను. వెళ్ళి అడిగింది ఇవ్వనన్నాడు. ఎందుకని అడిగింది. ఏ క్రెడిట్ కార్డు మీద రిజర్వ్ చేశారో చెప్పమన్నాడు. అబ్బాయి ఏకార్డు ఉపయోగించాడో తెలియదు. టిక్కెట్లు రాలేదు. అబ్బాయి కారు పార్క్ చేసి వచ్చి టిక్కెట్లు తీసుకున్నాడు. మా ఆవిడ గొప్పలు చెప్పటానికీ, నేను గొప్పగా ఫీల్ అవటానికీ ఇవాళ అవకాశం లేదు.

"LA LA Land" అంటే అది ఒక విధంగా కృత్రిమ ప్రదేశం అనే అర్ధమొస్తుంది. LA అంటే లాస్ ఏంజెలెస్, "హాలివుడ్" ఉన్న చోటు. ఈ సినీమా ఒక musical. అంటే పాటలు ఉంటాయన్న మాట.ఈ అర్ధంతో చూస్తే మన తెలుగు సినీమాలన్నీ musicals. ఇది "My fair lady ", "Fiddler on the Roof", "Sound of Music" లాంటి musical  కాదు కాకపోతే చాలా పాటలు ఉన్నాయి. మొదటి పాట "LA " హైవే మీద ట్రాఫిక్ జామ్ లో మొదలవు తుంది. అక్కడే అమ్మాయి అబ్బాయి  కలుసుకుంటారు కూడా. అమ్మాయి త్వరగా కారు ముందుకి నడపదు. వెనక కారులో ఉన్న అబ్బాయికి కోపమొచ్చి తన కారు పక్క లైన్ నుండి తెచ్చి అమ్మాయి కారు పక్కకి పెట్టి, డ్రైవర్లు పంచుకునే భీకర సౌజ్ఞలతో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించటం. ఎవరి అభిరుచుల ప్రకారం వారు ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకోవటం. ఈ నిర్ణయం తో చివరికి వారాల  తరబడి అమ్మాయి గారు  ఒక చోట, అబ్బాయి గారు దేశంలో ఇంకోచోటా, ఉండటంతో, అమ్మగారు అలిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. అబ్బాయి గారు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి గారు ఉండరు. కానీ అమ్మాయి గారిని ఒక సినీమా కోసం audition కు రమ్మనే మెసేజ్ ఉంటుంది. అమ్మాయిగారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి ఆ మెసేజ్ ఇచ్చి ఆడిషన్ కి వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. మిగతా కధంతా మామూలే. అమ్మాయిగారు పెద్ద నటి అయి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని పిల్లాజెల్లా తో హాయిగా ఉంటుంది. అబ్బాయి గారు రెస్టారంట్ లో పియానో వాయించే రోజూ వారీ పనివాడుగా మిగిలిపోతాడు.

సినీమా అవగానే వెతుక్కుంటూ కారు దగ్గరకి వెళ్ళి ఇంటికి జేరాము. రాత్రి పూట వెతికితే మెన్హాటన్ లో కూడా వీధి పార్కింగ్ దొరుకుతుంది. లేకపోతే సినీమా కన్నా పార్కింగ్ కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది.

(ఇది సంవత్సరం కింద ఎప్పుడో వెయ్యాల్సిన పోస్ట్. ఇప్పటికి వెలుగు చూసింది)


No comments:

Post a Comment