Monday, December 16, 2019

156 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్ - 2019

దివాలీ వెళ్ళి దాదాపు రెండునెలలవుతోంది, ఇప్పుడు దాన్ని గురించి వ్రాస్తున్నాడేమిటా అని అనుకుంటున్నారా. వ్రాయకుండా ఉండటానికి ప్రయత్నించాను గానీ మనస్సు ఒప్పుకోవటల్లేదు. ఇది పూర్తి అయ్యేదాకా  ఇంకొక  విషయం గురించి వ్రాయలేక పోతున్నాను. దానినే mental block అంటారల్లే ఉంది.

అసలు దీపావళి, అంటే దీపాల వరస, దివాలీ గ ఎల్లా మారిందో నాకు అర్ధం కాదు. ఒకటి మాత్రం నిజం "దివాలీ" అంటే అమెరికన్స్ కి తెలుస్తుంది కానీ దీపావళి అంటే తెలియటం కష్టమే.

అమెరికాలో రెండు ముఖ్య పండగలు. ఒకటి నవంబర్లో వచ్చే Thanks Giving , డిసెంబర్ లో వచ్చే Christmas. ఈ వరస లోకి దాదాపు అక్టోబర్ లో వచ్చే "దివాలీ" చేరిపోయింది. వైట్ హౌస్లో దీపం వెలిగించటం దగ్గరనుంచీ మా  ఊళ్ళో ఉన్న లైబ్రరీ దాకా అమెరికాలో దీపావళి పండగ చేసుకుంటున్నారు.

చికాగో నుండి ప్లేన్ దిగి ఇంట్లోకి రాగానే రేపు మెన్హాటన్ లో ఒక రేడియో స్టేషన్లో దివాలీ ప్రోగ్రాంకి మనం వెళ్తున్నాము అన్నారు. నేను మెన్హాటన్ వెళ్ళటానికి కొంచెం సంకోచిస్తాను.

అక్కడ ధియేటర్స్ మ్యూజియంస్ అన్నీ బాగుంటాయి కానీ వెళ్ళటానికి  కొన్ని ఇబ్బందులు భరించాల్సి వస్తుంది. చివరికి చేసేది లేక సరే అన్నాను.

సరే అన్నాను కానీ లోపల కొంచెం బెరుకు గానే ఉంది.  జెర్సీ సిటీ,  మెన్హాటన్, హడ్సన్ రివర్ కి ఇరు పక్కలా ఉంటాయి. మెన్హాటన్ కి వెళ్ళాలంటే మేమున్న చోటునుంచి సొరంగం ద్వారా కాలవ దాటటమే. దగ్గరే, మూడు నాలుగు మైళ్ళు ఉంటుంది కానీ ట్రాఫిక్ తో గంట పట్టిన రోజులున్నాయి. సరే దాటాము పో కార్ పార్క్ చెయ్యటం పెద్ద గొడవ. మనం వెళ్ళే చోట దగ్గరలో పార్కింగ్ దొరుకుతుందని చెప్పలేము. సరే పార్క్ చేసి ప్రోగ్రాం కి వెళతాం , రెండు మూడు గంటల ప్రోగ్రాం అయిన తర్వాత ఎదో తినాలి కదా దగ్గరలో సరి అయిన రెస్టారెంట్ ఉంటుందని చెప్పలేము. ఫ్యూషన్ రెస్టారెంట్లు, ఇటాలియన్ రెస్టారెంట్లు , వేగన్ రెస్టారెంట్లు ఉంటాయి కానీ  తినగలమో లేదో చెప్పటం కష్టమే. నేను వేగన్ ని కాను ఇటాలియన్ ఫుడ్ తినను థాయ్ ఫ్యూడ్ అసలే నచ్చదు ఫ్యూషన్ ఫుడ్ దగ్గరకి పోను. ఆ రెస్టారెంట్లలో తిని ఇంటికొచ్చి తిట్లూ శాపనార్ధాలతో మాగాయ ముద్ద కలిపించుకుని తిన్న రోజులు చాలా ఉన్నాయి.

బెరుకుగానే ఇంటినుండి బయలుదేరాను. ఆరోజు వేళా విశేషమేమిటో గానీ వెళ్లాల్సిన ప్రదేశానికి పావు గంటలో జేరుకున్నాము. ఎదురుకుండా పార్కింగ్ దొరికింది. ప్రోగ్రాం ఒక రేడియో స్టేషన్ లో. నేను చిన్నప్పుడు చూసిన బెజవాడ(విజయవాడ) రేడియో స్టేషన్ కి దీనికి చాలా తేడా ఉంది. లోపలికి వెళ్ళి ఒక చిన్న థియేటర్లో కూర్చున్నాము.

 పై ఉన్న ఫోటో మెన్హాటన్ లో ఉన్న WQXR రేడియో స్టేషన్ లో తీసింది. ఆ రోజు దివాలీ సందర్భంగా talent show జరుపు తున్నారు. థియేటర్  దాదాపు నిండి పోయింది, యాభై మంది ఉంటారు. ఆ రోజు కార్యక్రమాన్ని బయటి  ప్రేక్షకుల కోసం streaming చేస్తున్నారు. ఇక్కడ బ్రాడ్వే కి చుట్టుపక్కల, ఇటువంటి చిన్న చిన్న థియేటర్స్ చాలా ఉన్నాయి. బ్రాడ్వే లో ప్రదర్శించటానికి నోచుకోని నాటకాలని ఇటువంటి థియేటర్ల లో ప్రదర్శిస్తూ ఉంటారు. దాదాపు పెద్ద నటులందరూ చిన్న చిన్న నాటకాలు వేసి బ్రాడ్వే లోకి వెళ్ళి పేరు తెచ్చుకున్నవాళ్ళే. మేమూ చిన్నప్పుడు ఎవరో ఒకరింట్లో చిన్న స్టేజి కట్టి నాటకాలు వేసే వాళ్ళం. మేము ఎవరమూ యాక్టర్స్ అవలేదు. ఎవరో నూటికో కోటికో ఒకళ్ళు అవుతారు. కానీ ధీటుగా స్టేజి మీద మాట్లాడటం అలవాటు అవుతుంది.

ప్రోగ్రాం మొదలెట్టారు. ఆరోజు అరుణ్ వేణుగోపాల్( NPR radio) సభ నడుపుతున్నారు. ప్రోగ్రాం ఎల్లా నడుస్తుందో చెప్పి జడ్జెస్ ని పరిచయం చేశారు ( DJ Rekha and comedian Aparna Nancherla). ప్రోగ్రాం అంతా ఇంగ్లిష్ లో జరిగింది. టాలెంట్ షో కాబట్టి సామాన్యంగా బయటి పరిశీలకులు వస్తారు. వాళ్ళకి నచ్చితే  artists ని ఇంకొక చోట బుక్ చేసుకుంటారు. మొత్తం ప్రోగ్రాంలో, ఇద్దరు comedians వాళ్ళ నేర్పు ప్రదర్శించారు , ఒక తమిళ ఆవిడ రాజస్థాన్ folk song పాడింది, ఒకళ్ళు డాన్స్ చేశారు, ఒక డాన్స్ ట్రూప్ భారతంలో ఒక ఘట్టం ప్రదర్శించారు. వీళ్ళు తర్వాత ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేయబోతున్నారో కూడా చెప్పారు. ప్రదర్శన అయిపొయింది. జడ్జెస్ ఎవరు గెలిచారో చెప్పారు. ఆర్టిస్టులు అందరూ ప్రేక్షకులలోకి వచ్చి కలిసి పోయి మాట్లాడుతున్నారు. నాకు మాత్రం ధ్యాస అంతా  రాత్రి భోజనం మీద ఉంది.

బయటకు వచ్చాము. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మృదువుగా వీస్తున్న చక్కటి గాలి. అప్పనంగా వచ్చిన పార్కింగ్ ని వదలలేక, చుట్టుపక్కల ఏమన్నా రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని కొంత దూరం అటుపక్కా ఇటుపక్కా తిరిగి చూశాము. తాగి తందానాలేసేవి తప్ప కూర్చుని తినేవి చూడలేదు. ఫోన్ లో వెదికితే  కొంత దూరం లో ఒక diner కనపడింది. వెతకాలే గానీ మన అవసరాలకి ఎప్పుడూ ఏదో ఒక కొట్టు New York లో ఎల్లవేళలా తెరిచి ఉంటుంది. అది 24 hour  రెస్టరెంట్ , అదృష్టం బాగుండి  మళ్ళా ఎదురుకుండా పార్కింగ్ దొరికింది. ఇక్కడ అమెరికాలో,(గోర్మే రెస్టారంట్ కాకుంటే), భోజనం బాగా పెడతారు. నేను సుబ్బరంగా frittata లాగించేశాను. తృప్తిగా ఇంటికి చేరుకున్నాము.

ఒక వారం తరువాత అక్టోబర్ లో చికాగో వచ్చేశాము. వెంటనే  చికాగో  వింటర్ చవిచూశాము. క్రింది ఫోటో ఓ అక్టోబర్ ఉదయాన కనిపించిన మా ఇంటి పెరటితోట. అక్టోబర్ నెల లో నాకు తెలిసినంతవరకూ ఎప్పుడూ చికాగోలో స్నో పడలేదు. ఏమిటో కాలం మారిపోతోంది.



PS : Talent  Mela లో పాల్గొన్న వారి పేర్లు వ్రాద్దామనుకున్నా గానీ నేను తెచ్చిన ప్రోగ్రాం కాగితం ఎంత వెదికినా కనపడలేదు. ఇంట్లో నేను దాచి పెట్టుకున్న కాగితాలు ఇంట్లో ఉన్న ఇద్దరికీ తెలియకుండా మాయమయి పోతూ ఉంటాయి. ఏమిటో చిత్రం.