కరోనా Lockout తోటి ఇంట్లో కూర్చుని యూట్యూబ్ సినిమాలు చూడటం మొదలెట్టాను. చూసిన తర్వాత నాకిష్టమయిన వాటిమీద నా అభి ప్రాయాలు వ్రాయాలని పించింది. నేను వ్రాసే విధానం కొత్తగా ఉండచ్చు. గాభరా పడవోకండి.
సినిమా పేరు: Movie Name:
శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
Sri kanakamahalakshmi recording dance troupe
నటీనటులు:
గోపాలం (నరేష్), సీత (మాధురి), దొరబాబు (భరణి).
నటీనటులు:
గోపాలం (నరేష్), సీత (మాధురి), దొరబాబు (భరణి).
ఇంకా చాలామంది ఉన్నారు గానీ, కధంతా ఈ ముగ్గురి మీదా నడుస్తుంది.
సంక్షిప్తంగా కధ :
ఒక అమాయక పిల్లోడు (నరేష్) తన మేనమామ టిఫిన్ సెంటర్లో సహాయం చేస్తూ తనకి ఇష్టమయిన డాన్స్ ట్రూపులో నటిస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు. ఈ డాన్సు ట్రూప్ ఒక డొక్కు బస్సులో ఊరుఊరికీ తిరుగుతూ కార్యక్రమాలు జరుపుతూ ఉంటుంది.
ఆ ఊళ్ళో ఉన్న ఒక కన్నెపిల్ల సీత(మాధురి) అమాయక పిల్లోడు గోపాలం (నరేష్) మీద కన్నేస్తుంది. కానీ తన ఇష్టం తెలపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమాయక పిల్లోడు తెలుసుకోటల్లేదు. ప్రియుణ్ణి వలలో వేసుకోటానికి తను గోపాలం కనుసన్నలలో దగ్గరగా ఉంటేనే సాధ్యమవుతుందని, గోపాలం ఎక్కువగా గడిపే నాటక కంపెనీ లో హీరోయిన్ గా జేరుతుంది.
సిగ్గు బెరుకులతో ఉన్న గోపాలాన్ని "వెన్నెలై పాడనా", "నువ్వునా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జివ్వుమంటుంది మనసు, రివ్వు మంటుంది వయసూ ", అంటూ మురిపిస్తే కాముడి తాళికి ఆగలేక పిరికి గోపాలం సీత నిద్రపోతున్నప్పుడు సీత మెడలో పసుపుకొమ్ము తాళి కడతాడు. ఆ తర్వాత "ఏనాడు విడిపోని ముడివేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపుతాడు" అనుకుంటూ "ఏ జన్మ స్వప్నాల అనురాగమో మూసినదినేడు ఈ పసుపుతాడు " అంటూ ఆనందంగా పాడుకుంటారు . కానీ వచ్చిన గొడవ ఏమిటంటే ఇద్దరూ పరాధీనులు, స్వంతంగా ఏనిర్ణయం తీసుకోలేని వాళ్ళు.
ఇదిలా నడుస్తూ ఉండగా నాటక కంపెనీ ఓనర్(కోట శ్రీనివాసరావు ) మేనల్లుడు దొరబాబు సీత మీద కన్నేస్తాడు. ఎలాగయినా సీతని దక్కించుకోవాలని సీతను తనవైపు తిప్పుకోవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతాడు.
తనకు ఇష్టమయిన ఆభరణాన్ని దక్కించుకోటానికి ఒక సీత, ఒక దొరబాబు వేసే పన్నాగాలే ఈ సినిమా.
చివరగా గోపాలం సీత నిజం పెళ్ళి ఘట్టం చాలా నాటకీయం గా జరిగి సుఖాంతం అవుతుంది.
ఆడపిల్లలూ మగపిల్లలూ, ఒక సమస్యని పరిష్కరించటానికి ఎంత విభిన్నంగా ప్రయత్నిస్తారో కన్నులకి కట్టినట్లు కనపడుతుంది ఈ సినిమాలో.
నా కెందుకు నచ్చింది :
మనుషుల్లో ఇష్టాఇష్టాలూ ప్రేమానురాగాలూ ఎల్లా పుడతాయో (వస్తాయో) చాలావరకు తెలియదు. వాటికోసం తపన పడి సాధించుకునే వాళ్ళు ఉంటారు మధ్యలో విసుగొచ్చి వదిలేసేవాళ్ళూ వుంటారు. ఈ సినీమాలో ప్రేమ మొదటి కోవకి చెందినది. అందుకే నాకిష్టం.