ఏప్రిల్ చివర్లో మా పెరటి చెట్లు |
తెల తెల వారుతుండగా పక్షులు "చిక్ చిక్, చిక్ చిక్ " అంటూ శబ్దం చెయ్యటం మొదలుపెడతాయి. ఉదయాన్నే ఉడతలు నేల మీద పరుగెడుతూ తినటానికి ఎదో వెతుక్కుంటూ ఉంటాయి. మధ్యాహ్నం కుందేళ్లు అప్పుడే చిగురించిన లాన్ మీద గడ్డిని కొరుక్కు తింటూ ఉంటాయి. చలికాలంలో మోళ్ళు గా మారిన చెట్టు కొమ్మలు, చిన్న చిన్న మొగ్గలతో పలకరిస్తాయి. మొన్న పక్కనున్న చెరువు లోనుండి బాతులు మా లాన్ మీద వయ్యారంగా నడుచుకుంటూ పోతున్నాయి. ఇది మా పెరట్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో జరిగే వసంతోత్సవం. దీనికోసం చలికాలంలో వణుకుతూ ఎదురు చూస్తూ ఉంటాము. ఏప్రిల్ అయిపోగానే "మే " లో అంతా పచ్చదనంతో నిండి పోతుంది.
ఇవే చికాగో దగ్గర మా ఇంటి ఎదుట ప్రతి ఏటా జరిగే పరిణామాలు. నలభై ఏళ్ళబట్టీ "ఏప్రిల్" కోసం, పక్షులు చేసే మేలుకొలుపులకోసం ఎదురు చూడటం అది వెళ్లి పొగానే అప్పుడే వెళ్లిపోయిందా అనుకోవటం మామూలే. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ వస్తుంది , "వసంతం" తెస్తుంది. ఇది తాత్కాలమని తెలిసినా ఉన్నంతసేపూ ఆనందించటం అలవాటయి పోయింది. పై ఫోటో అప్పుడే చిగురించిన ఆకులతో విరాజిల్ల బోతున్న మా పెరటి చెట్లు.
అసలు రెండు నెలల బట్టీ వ్రాద్దామనుకుంటున్నది ఈ సంవత్సరం ఫిబ్రవరి లో జరిగిన సంఘటన గురించి. ఎంత వ్రాద్దామని ప్రయత్నించినా "మెంటల్ బ్లాక్" తో వ్రాయటం కుదరలేదు. ఇంకోటి ఏమన్నా వ్రాద్దామనుకుంటే నాగురించి రాస్తేగానీ వదలను అని మొరాయించింది. దాని గురించి వ్రాద్దామనుకుంటే ఇంకో సంగతి నా గురించి వ్రాయవా అంటూ ముందుకి వచ్చింది. ఈ రెండింటికీ నాకు పడ్డ శిక్ష ఒకటే. "లెంపలేసుకోవటం".
ఇది చాలా కాలం క్రిందట జరిగింది కానీ అప్పుడప్పుడూ మనస్సులో "కిలిక్" మంటూ ఉంటుంది. అప్పుడే ఫ్లారిడా "ఓర్లాండో" నుండి చికాగో "ఓ హే ర్ " ఏర్పోర్ట్ లో దిగాము. సామాను తీసుకోటానికి మా ఇంటావిడ తిరిగే బెల్టు దగ్గరకు వెళ్ళింది. అల్లాగే మాతో పాటు ప్లేన్ లో వచ్చిన ఒక జంటలో ఆయన సామాను తెచ్చు కోటానికి వెళ్ళాడు. నేను వంటరిగా ఉన్న ఆవిడతో మాటలు కలిపి పిచ్చాపాటీ మాట్లాడు తున్నాను. అది సూట్కేసు తీస్తున్న మా ఆవిడ కంటబడింది. రమ్మని ఒక కేక తో గర్జించింది. కోపంతో వణికి పోతోందల్లేవుంది, ఆవిడ చేతులో ఉన్న ఫోన్ కిందపడి పగిలి పోయింది. మమ్మల్ని ఇంటికితీసుకు వెళ్ళటానికి వచ్చిన, "సెల్ లాట్" లో ఉన్న, "లిమో" ని పిలవాలంటే ఫోన్ కావాలి. కోపంతో ఉన్న ఆవిడతో మాట్లాడటం చాలా కష్టం. ఆవిడ పబ్లిక్ ఫోన్ కోసం వెతుకుతుంటే నేను మాట్లాడకుండా ఫాలో అయ్యాను. ఆవిడకి ఫోన్ నంబర్లు కంఠతా వచ్చు దానితో బతికిపోయాము లేక పోతే ఏమయ్యేదో. ఆ రోజునుండీ ఇతర స్త్రీలతో మాట్లాడకూడదని (మా ఆవిడ ఎదురుకుండా ఉంటే ), లెంపలేసుకున్నాను.
"వేడి నీళ్ళన్నీ మీరే పోసేసుకున్నారా?" అనే మాట వినే సరికి నేను కొంచెం గాభరా పడ్డాను. ఎందుకు ఇల్లా అంటోందో మొదట అర్ధం కాలా. "మీరే" అని వత్తి పలకడంలో నేనేదో తప్పు చేసినట్లు చెబుతూ, మర్యాదగా చెబుతున్నట్లు గా చివరలో "రా " తగిలించింది. ఈ "రా " , "ఏరా", "పోరా", "వెళ్ళి రా", "బుజ్జిరా" లాంటి వాటిల్లో "రా " కాదు. ఇది గౌరవిస్తున్నట్లు కనిపిస్తూ కఠినంగా కోపంతో చెప్పే "రా".
ఎదో తప్పుచేసిన వాడిలా క్షమించ మని చెప్పాలా? లేక ఆవిడకు ఇష్టమయినది ఎమన్నా చెయ్యాలా? అంతు పట్టలా. మాకు నలభయ్ గాలెన్ల వేడి నీళ్ళ ట్యాంక్ ఉంది. ఇంట్లో ఉన్నది ఇద్దరు. నేను రోజూ ఒక అరగంట స్నానం చేసినా ఎప్పుడూ ఈ ప్రశ్న రాలా.
సరే నీ స్నానమయిందిగా వేడి నీళ్ళ సంగతి రేప్పొద్దున చూద్దాములే అని చెప్పి ఆ పూటకి ఆ సమస్య పరిష్కరించాను.
ఆరోజు సాయంత్రమే "సియాటిల్" నుండి ఇంటికి వచ్చాము. అది ఫిబ్రవరి మిడ్ చికాగో వింటర్ . ఇంట్లోకి రాంగానే ఇంట్లో వేడి సరీగ్గా ఉందో లేదో, వేడి నీళ్ళ హీటర్ సరీగ్గా పనిచేస్తుందో లేదో చూశాను . ఇంట్లో వేడి గానే ఉంది, వాటర్ హీటర్ బ్లింక్ అవుతోంది అంటే అది పనిచేస్తోందన్నమాట. కాకపోతే వెళ్ళేటప్పుడు ఉష్ణోగ్రత తగ్గించి పెడతాము, వాటిని సరిచేయమని ఆవిడకి సూచించాను.
రాత్రంతా ఆలోచించాను. నాకు తెలుసు ఇది రేపు పెద్ద సమస్య అవుతుందని. ఫిబ్రవరి మిడ్ వింటర్ లో, బయట వాతావరణం జీరో డిగ్రీలు ఉన్నప్పుడు, పెళ్ళాం చేత చల్ల నీళ్ల స్నానం చేయించటం సరికాదు, అది తెలీకుండా చేసినా సరే. రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు ఎల్లా ఉండాలో నిర్ణయించుకున్నాను. ఎక్కువ మాట్లాడ కూడదు. వీలయినంతవరకూ మౌనంగా ఉండటం మంచిది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు "లే లో " అన్నారు ఇంగిలీషు వాళ్ళు. అదీ పద్ధతి.
తెల్లారింది కాఫీలు తాగాము. "వాటర్ హీటర్" సంగతి చూడాలని నిర్ణయించటం జరిగింది. అది "బ్లింక్" అవుతోంది. నాకు తెలిసినంత వరకూ "బ్లింక్" అవుతుంటే పనిచేస్తున్నట్లే. మరి ఎందుకు చల్ల నీళ్లు వచ్చాయి? నా దగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పటం సరిగాదు అని నిర్ణయించు కున్నా. ముఖ్యులు ఇది తప్పు అని నిర్ణయిస్తే, అది ఫైనల్. ఎదురు సమాధానం చెప్పటం అంత మంచిది కాదు.
ఇప్పుడు అన్నీ పనిచేసేవి కంప్యూటర్లతో కాబట్టి, కంప్యూటర్ "రీసెట్" లాగా "ఆఫ్" చేసి "ఆన్" చేద్దామని నిర్ణయించటం జరిగింది. నేను తల ఊపాను. వాటర్ హీటర్ ఆఫ్ చేశాము. మళ్ళా "ఆన్" చెయ్యటానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఎన్ని సార్లు చేసినా అది "ఆన్" అవలేదు. పక్కింటి వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళకీ కుదరలేదు. "వేడి నీళ్లు" లేవు అని తలుచుకోటానికే భయంగా ఉంది. ఆవిడ వర్క్ కి వెళ్ళాలి. స్టవ్ మీద నీళ్లు కాచుకుని, మేడమీదికి తీసుకు వెళ్లి స్నానం చేసి నీ సంగతి నువ్వు చూసుకోమని వెళ్లి పోయింది.
మిడ్ వింటర్ లో చల్ల నీళ్ల స్నానం. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎందుకు గంగిరెద్దు తలూపినట్లు వాటర్ హీటర్ ఆఫ్ చెయ్యటానికి వప్పుకున్నాను. "బ్లింక్" అవుతుంటే పనిచేస్తున్నట్లే కదా. మరి చల్ల నీళ్లు ఎందుకు వచ్చాయి. చలికాలంలో మొదట చల్ల నీళ్లు కాకుండా వేడి నీళ్లు వస్తాయా? చెప్పే ధైర్యంలేదు. మౌనంగా ఊరుకుంటే వచ్చే తిప్పలు ఇలాంటివే.
"బ్లింక్" చేస్తూ నేను పనిచేస్తున్నాను మొర్రో అని మొత్తుకుంటున్నా వాటర్ హీటర్ ని "ఆఫ్" చెయ్యటానికి ఎందుకు తలూపానా అని పెద్దగా లెంపలేసుకున్నాను.
రెండు రోజుల్లో కొత్త హీటర్ పెట్టటం జరిగింది. అనుకోకుండా వెయ్యి డాలర్లు ఖర్చు. పాత వాటర్ హీటర్ పోయినందుకు పెద్ద బాధ పడలేదు. పదమూడేళ్ళు పని చేసింది చాల్లే అని సంతోషించాను.