House with ADU |
ADU లో పడుకుని ఆలోచిస్తున్నాను. " ఇవ్వాళ ఎండగా ఉంది బయటికి వచ్చి కూర్చోండి" అన్న మా అబ్బాయి మాటలు వినటానికి బాగున్నా నేను మాత్రం బయటికి వెళ్ళ లేదు. నా లాంటి వాళ్ళకి ఇంకా బయట చలిగానే ఉంది. కొన్ని కొన్ని ఊళ్ళల్లో రోజూ ఎండ రావటం ఒక వరం. సియాటిల్ ఆ ఊళ్ళల్లో ఒకటి. చికాగో నుండి ఈ ఊరు వచ్చి నాలుగు రోజులయింది. ప్లేన్లో నాలుగు గంటల ప్రయాణం. అంటే దాదాపు 2,000 మైళ్ళు దూరం. వచ్చిన రోజు కొంచెం ఎండ పొడ ఉన్నా తర్వాత రోజులన్నిట్లో ఎప్పుడో ఒకప్పుడు వర్షం కురుస్తూనే ఉంది.
ప్రతీ దానికీ మంచీ చెడూ, బొమ్మా బొరుసూ ఉంటాయి. వాటిని గ్రహించి జీవితం గడుపుతుంటే జీవితం ఆనందంగా హాయిగా ఉంటుంది. లేకపోతే జీవితంలో తరచు ఉరుములూ మెరుపులతో వర్షాలు కురుస్తూనే ఉంటాయి.
రోజూ వర్షం మూలంగా ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం. చుట్టూతా ఎప్పుడో ఎవరో వేసిన చెట్లు నిటారుగా ఆకాశంలోకి చూస్తూ ఉంటాయి. పెరట్లోనూ ఇంటిముందూ ఎక్కడ చూసినా పూల చెట్లు. దాదాపు ఈ ఊరంతా కొండల మీద మలిచిందే. పచ్చటి నేల మీద ఎటువైపు చూసినా రకరకాల పూల చెట్లతో , ఎత్తు పల్లాలలో సన్నగా పొడుగ్గా ఉన్న పెద్ద పెద్ద వృక్షా లతో, నేల మీద ఒక పెద్ద పెయింటింగ్ పరిచినట్లుగా ఉంటుంది.
ఆకాశానికి తాకుతున్న చెట్లు |
కనులకు విందయిన పచ్చదనాన్ని ఆస్వాదించటానికి ఇక్కడ ఇళ్ళు కూడా అల్లాగే కడతారు.ఇల్లంతా కిటికీల మయం. పడుకుని ఏ కిటికీ లో నుండి చూసినా చూడటానికి బ్రహ్మాండ మయిన పైంటింగ్స్ . ఊరంతా కొండలని మలచి కట్టింది కాబట్టి ఎత్తూ పల్లాల తో ఉంటుంది. చుట్టూతా పెరట్లో చెట్లు. చెట్లు అనే కంటే వృక్షాలంటే బాగుంటుందేమో. అంత పెద్దవి ఎన్నేళ్ల క్రిందట ఎవరు నాటారో ! చల్లటి వాతావరణం కనక ఇక్కడ పెరట్లో పళ్ళ చెట్లు బాగా పెరుగుతాయి. పళ్ళన్నీ వాళ్ళే తినలేరు కదా, అందరికీ పంచిపెడతారు. మాకు "ప్లమ్స్ " అల్లాగే పక్కింటి వాళ్ళు ఇచ్చారు. సామాన్యంగా ప్రతి ఇంటి ముందరా,పెరట్లో, పచ్చగడ్డి, పూల చెట్లు.
మీకు ADU అంటే ఏమిటో చెప్పలేదు కదూ. దాని అర్ధం Accessory ( Additional) Dwelling Unit. ఇంటి ఆవరణలో ఇంకొక చిన్న ఇల్లు ఉంటుంది. తల్లి తండ్రులో, అత్తామామలో వస్తే ఉండటానికి పనికొస్తుంది. వాళ్ళని స్వతంత్రంగా ఉంటుందని చెప్పి, బేస్మెంట్ లో పడేయకుండా, పక్కనే ఉంచుకోటానికి బాగుంటుంది. పైన ఫొటోలో వన్ కార్ గ్యారేజ్ తో ఉన్న చిన్న ఇల్లు ADU. పెళ్ళైన వాళ్ళు ఏకాంతం కోరుకున్నప్పుడు దానిలోకి వెళ్ళి దాక్కోవచ్చు. ఇక్కడి మునిసిపాలిటీ వాటిని ప్రోత్సహించు తుందిట. మాకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళ అమ్మకోసం పెరట్లో ఒక ADU కట్టించారు. కావలసిన పర్మిషన్స్ అన్నీ చెక చెకా వస్తాయి. TSLA మస్క్ గారు కూడా SpaceX ఆఫీసుకి కి అరిజోనా వెళ్ళినప్పుడు ఇటువంటి దానిలోనే ఉంటారుట. దాని ఖరీదు చిన్నది దాదాపు $80,000 ఉంటుంది.
మా ఇంటి ADU లో మేడమీద గదిలో పడుకుని చూస్తున్నాను. ఈ గదికి మూడు కిటికీలు ఉన్నాయి. రెండు చిన్నవి సన్నవి. మూడోది దాదాపు ఆ రెండూ కలిపిన దానికి సమానంగా ఉంటుంది. కిటికీల ఎత్తు దాదాపు గోడలో సగం ఉంటుంది. పెద్ద కిటికీ లోంచి చూస్తే, సర్వి చెట్లు. దాని ఆకులు పచ్చగా సూదుల్లా ఉంటాయి. పొద్దున్నే సూర్యకిరణాలు వాటిల్లోనుండి దూసుకు వస్తుంటే చూడటానికి సూర్య భగవానుడు మనని ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. అది తెల్లటి ఆకాశం మీద ప్రకృతి సృష్టించిన ఓ వర్ణ చిత్రం. మిగతా రెండు కిటికీల్లో దృశ్యాలు రెండు వైవిధ్య వర్ణ చిత్రాలు. ఒక కిటికీలో దృశ్యం మెలికలు తిరిగిన చెట్ల కొమ్మలపై అల్లుకు పోయిన ఆకులు. రెండవ కిటికీలో కనపడేది, కొండ మీద పచ్చటి మైదానం దాని మీద రెండు పెద్ద పెద్ద చెట్ల బోదెలు వాటి మధ్య పచ్చటి గడ్డి మీద విరచిన పూల మొక్కలు. అది ఒక 3D పిక్చర్. వాటిని చిత్రాలుగా వర్ణించి మీ కళ్ళలో కనిపించేటట్లు చేసే శక్తి నాకు లేదు.
గోడల మీద పెయింటింగ్స్ పెట్టవలసిన అవసరం లేదు. కిటికీలే పెయింటింగ్స్. రోజంతా కిటికీల వేపు చూస్తూ గడిపేయ వచ్చు. అలా చూస్తూ ఉంటే ఏమిటేమిటో ఆలోచినలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఎదో ఒక కొత్త పని క్రియేటివ్ గా చెయ్యాలనిపిస్తుంది.
అందుకనే కొత్త కొత్త వాటికి ఈ ఊరు పుట్టినిల్లు. "అమెజాన్" "మైక్రోసాఫ్ట్" "బోయింగ్" "స్టా ర్బ క్స్" ,"కాస్టుకో(Costco )". ఎదో చెయ్యాలనే కోరిక ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు చెయ్యటానికి వీలుగా అనుకూలమయిన సమయం వస్తుంది. చెయ్యొచ్చు. ఆ చేద్దామనే కోరిక మాత్రం నిరంతరం ఉండాలి.
ఇక్కడ ఒకటే ఒక పెద్ద ప్రాబ్లమ్. ఎప్పుడో ఒకప్పుడు చలికాలంలో ఒక రోజు ఒక అంగుళం స్నో పడుతుంది. అంతే దాదాపు జీవితం స్థంభించి పోతుంది. స్నో తీసే పరికరాలు లేక రోడ్లన్నీ స్నోతో నిండి పోయి ఉంటాయి. సందులు గొందుల్లో గార్బేజ్ తీసుకు వెళ్లే బళ్ళు కదలటానికి వీల్లేక అవి రావు. కార్లు స్నోలో నడపటం చాలామందికి చేతకాదు. అందుకని ప్రమాదాలు. రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగి స్నో అంతా కరిగిపోతుంది. అప్పటిదాకా జీవితం కొంచెం మందగిస్తుంది. చికాగోలో సంవత్సరాలు గడిపిన నాలాంటి వాళ్ళకి ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది.
ఇంకో విచిత్రం ఇక్కడ మీరు ఇంట్లో కూరగాయలు తరుగు తున్నప్పుడు పారవేసే వ్యర్ధ పదార్ధాలని మునిసిపాలిటీ వాళ్ళు తీసుకుని "కంపోస్ట్" క్రింద మారుస్తారు. ప్రతి వారం గార్బేజ్, రీసైకిల్ తో పాటు మునిసిపాలిటీ వాళ్ళు దీనిని వేరే డబ్బాలో వేస్తే తీసుకుంటారు.చికాగో తిరిగి వెళ్ళటానికి పెట్టెలు సర్దుకుంటున్నాము. జీవితంలో మనం అనుకోని సంఘటనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకరినుండి ఒకరికి సోకి ఇంటావిడ నలత పడింది. దానితో క్వారంటైన్ . ADU లో నా వంట. చిన్నప్పుడు ఇంట్లో నేర్చుకున్న మాటలు, స్కిల్స్ (అన్నం వండటం వగైరా ) బాగా ఉపయోగపడ్డాయి. "మంచి నీళ్లు పోస్తా గ్లాస్ బయట పెట్టు", "కాఫీ, టిఫిన్ తలుపు దగ్గర పెట్టాను. తీసుకో", "భోజనం గుమ్మం దగ్గర పెట్టాను. తీసుకు తిను". "ఇవ్వాళ కూర లేదు పచ్చడి ముద్దే". "స్నానం చేసి బట్టలు ఉతికి ఆరేసుకో, వాటిని అన్నిటితో కలపవోకు ", ఈ మాటలన్నీ చిన్నప్పుడు ఇంట్లో నాన్న అంటూ ఉంటే నేర్చుకున్నవే. అన్నీ వాడుకున్నాను.తిరుగు ప్రయాణానికి కొన్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని , ఇంకో ప్లేన్ లో టికెట్స్ కొనుక్కొని, వారం అనుకున్నది పది రోజుల తర్వాత, ప్లేన్ లో మాస్కులు పెట్టుకుని, జాగర్తగా ఇంటికి జేరాము.