అమెరికాలో చలికాలం అయిపోయి వేసవి కాలం వచ్చింది. పొద్దునపూట అయిదు గంటల కల్లా కిచ కిచలతో పక్షులు నిద్రలేపటం మొదలయ్యింది. ప్రతిరోజూ వాతావరణం లో వేడి పెరుగుతూ వస్తోంది. సమయం పొద్దునపూట ఎనిమిది గంటలు. కాఫీ తాగుతూ పోర్టికోలో కూర్చున్నాను.
పక్కింటి పరమేశం హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనగారి మొహం జీవితంలో ఎదో గెలిచినవాడి మొఖంలా వికసించిపోతూ ఉంది. ముఖద్వారం కొద్దిగా ముందుకి తోసి "ఒక కాఫీ" అని అరిచాను. "దేదీప్య మనంగా వెలిగిపోతున్నావు -- ఏమిటి సంగతి" అని అడగాలని పించింది కానీ నేను అడగలేదు. ఎవరి ముఖమైనా దివ్యంగా వెలిగిపోతూ ఉంటే వాళ్ళని మనం ఏమీ ఎందుకూ అని అడగాల్సిన పని లేదు. వాళ్ళే చెప్పేస్తారు.
ఇంటావిడ కాఫీ తీసుకువచ్చింది. పరమేశానికి ఆవిడ చేతికాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతూ మొదలెట్టాడు.
"జీవితంలో కొన్ని మనమనుకున్నట్లు జరుగుతాయి కొన్ని జరుగవు". ఎందుకు ఇల్లా మొదలెట్టాడో అర్ధం కాలేదు. ఇవన్నీ అందరికీ మామూలే. ఎవరి జీవితంలో నయినా "పర్ఫెక్ట్" గ అన్నీ మనమనుకున్నట్లు జరగవు. అసలు సంగతి ఏమిటని అడిగాను. అదే చెప్పబోతున్నా నన్నాడు.
"నిన్న నామనసులో ఒక మెరుపుమెరిసింది" అన్నాడు. "నా జీవితంలో ఫైల్యూర్స్ ఎందుకు వచ్చాయో తెలిసిపోయింది. జీవితంలో గెలవాలంటే ఏమి చెయ్యాలో కూడా తెలిసి పోయింది." అన్నాడు. ఆ మెరుపు సంగతి మాకు కూడా వినిపించు అన్నాను.
"మనం చేసే పనుల్లో మనం మూడు సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే గెలుపెప్పుడూ మనదే" అన్నాడు.
పరమేశం చెప్పినవి క్లుప్తంగా మూడు అవి : What to Do . How to Do . When to Do .
లోతుగా చూస్తే అవి:
1. మనము ఏమి చేద్దామనుకుంటున్నాము. (What we are going to do ). మొదట దీనిని నిర్ధారించు కోవాలి.
2. దానిని ఎలా చేద్దామనుకుంటున్నాము . (How we are going to do it ). దీనిని గురించి బాగా ఆలోచించాలి.
3. ఎప్పుడు చేద్దా మనుకుంటున్నాము. (When we are going to do it ). Timing . ఇది చాలా ముఖ్యం.
ఓ పని మొదలెట్టే ముందు ఈ మూడు సూత్రాలూ సరీగ్గా అధ్యయనం చేస్తే మనకి తిరుగంటూ ఉండదు. నా జీవితంలో "ఫైల్యూర్ " అయినవన్నీ నా తప్పిదాలే. ఈ మూడు సూత్రాలూ సరీగ్గా చెయ్యలేక పోవటం మూలానే అలా జరిగాయి. అని చెప్పాడు.
నాకు చాలా ఉత్సాహము ఎక్కువయ్యింది. మనం జీవితంలో ఓటమి ఎదురయినప్పుడల్లా దానికి కారణం వెంటనే ఇంకొకళ్ళ మీదికి నెట్టేస్తాము. మన అందరికీ జయాలకన్నా అపజయాలు ఎక్కువగా బాధిస్తూఉంటాయి. అవి ఒక పట్టాన మనసులోంచి పోవు. ఈ పని చేయకపోతే ఎంత బాగుండేదో కదా. ఇలా కాకుండా ఆలా చేస్తే బాగుండేదే. ఈ ప్రశ్నలూ సమాధానాలూ మన దైనందిన జీవితాల్లో ఒక భాగం. కానీ పరమేశం థియరీ ప్రకారం అలా జరగటం అంతా మన ప్రతాపమే.
జీవితంలో చాలా మందికి ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలియక తప్పటడుగులు వేస్తూ ఉంటారు. వెంటనే ఆలోచించాను ఒక పుస్తకం వ్రాసేస్తే చాలా మందిని ఆ బాధల నుండి విముక్తి చేయొచ్చు కదా అని. వెంటనే పరమేశంతో మనమో పుస్తకం వ్రాసేద్దామని చెప్పేశాను. ఎప్పుడయినా బంగారం లాంటి ఆలోచనలు వస్తే వాటిని వెంటనే ఆచరణ చెయ్యటానికి ప్రయత్నించాలి.
పరమేశం నీ జీవితంలో జరిగిన సంఘటనలను పై మూడు సూత్రాలతో అన్వయించి చెప్పావంటే , వాటిని ఉంటంకిస్తూ ఒక పుస్తకం వ్రాసేద్దాము. దానికి నోబెల్ పీస్ ప్రైజ్ రావచ్చు అని చెప్పాను. పరమేశం వెంటనే నాతో పుస్తకం వ్రాయటానికి అంగీకరించాడు. అనుకున్న వెంటనే ఆ పని చేస్తే మీన మేషాలు లెక్క చెయ్యక్కర లేదుట. ముహూర్తాలు పెట్టవలసిన అవుసరం లేదుట.
వెంటనే గుమ్మం వేపు తిరిగి , "ఏమేవ్ ఒక పెన్నూ పేపరూ త్వరగా పట్టుకురా " అంటూ అరిచాను. మా ఆవిడ నేను అడిగినప్పుడల్లా ఎదురు ప్రశ్నించకుండా చెప్పిన పనులు చేస్తుంది. నాకు నోబెల్ వస్తే ఆవిడ పేరు నా నోబెల్ లెక్చర్ లో తప్పకుండా చెప్పాలని తీర్మానించు కున్నాను.
రిటైర్మెంట్ లో ఇంత ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ రాలేదు. ఎంత మంది జీవితాల్లోనో ఆనందం నింప బోతున్నానో. పుస్తకం పబ్లిష్ చేసిన వెంటనే "నెమలికన్ను" మురళి గారి చేత రివ్యూ వ్రాయించాలని కూడా అనుకున్నాను.
పెన్నూ పేపర్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలోకి పరమేశం మొబైల్ మోగింది. పరమేశానికి కొంచెం శ్రవణ గ్రహణం. సరీగ్గా వినపడటం కోసం శబ్దాన్ని ఎక్కువగా పెట్టుకుంటాడు. దానిలోనుంచి "కూరలు తరగాలి తొందరగా రా" అనే సందేశం పెద్దగా వినపడింది.
పరమేశం నేనింటికి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. నా నోబెల్ ప్రైజ్ కలలు నిమిషంలో కరిగి పోయాయి.
మళ్ళా పరమేశం వచ్చినప్పుడు ఆ పుస్తకం సంగతేదో చూడాలి. నాకు ఆ పుస్తకం పూర్తి చేస్తే, నా నోబెల్ ప్రైజ్ కన్నా ఎందరి జీవితాల్లో నో ఆనందం నింపిన సంతృప్తి ఉంటుంది. మీరు పుస్తకం కోసం ఎదురుచూడకుండా, ఇప్పటినుండే ఆ మూడు సూత్రాలూ పాటిస్తూ ఉంటే, జీవితం మూడు పువ్వులూ ఆరు కాయలుగా ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. జై పరమేశం.