Monday, December 12, 2011

76 ఓ బుల్లి కథ 64 --- బ్రెయిన్ - జీవాత్మలో పరమాత్మ

ముందుమాట: పరిణామ క్రమం (Evolution) గురించి చదివిన తరువాత నాకు రెండు ప్రశ్నలు మనస్సుని కెలుకుతున్నాయి. వీటి గురించి వ్రాయక పోతే ముందుకి సాగలేక పోతున్నాను. వాటిని ఇక్కడ వ్రాశాను. ఇక చదవండి. నా సందేహాలు తీర్చండి.


1. మిలియన్ల సంవత్సరాలు పట్టినా, ఓపికగా ఏక కణ జీవి నుండి కణ రూపంతరములు చెంది కొత్త కణములు సృష్టించుకొని, మానవుడి సృష్టి జరిగింది. మానవుని సృష్టించే పనిలో మధ్య మధ్య  ఎన్నో అవతారాలు (చెట్లు, జలచరాలు, జంతువులూ,పక్షులు) సృష్టించ బడ్డాయి.  శాస్త్రజ్ఞులకు తెలిసినంత వరకూ ఇది ఒక ఎడతెగకుండా ముందుకు పోయే పరిణామ క్రమం. రాబోయే కాలంలో ఇంకా ఎన్ని అవతారాలు సృష్టిలోకి వస్తాయో మనము ఊహించలేము.

కణాలకి జీవించ గల శక్తి ఉంది. ఆ జీవ శక్తికి ఒక మొదలు ఉంది ఒక చివర ఉంది. ఆ మధ్య కాలంలో దాని జాతిని పెంపొందించుకునే జీవ శక్తి ఉంది (duplication).  దీనినే జీవాత్మ అంటామా?. ఆ జీవాత్మను మనము సృష్టించ గలమా? కణాలకి ఆ జీవశక్తి ఇచ్చిన దెవరు? దానిని ఇచ్చిన వారిని పరమాత్మ అంటామా?. ఈ రెండు శక్తులనీ సృష్టించటం నాకు తెలిసినంత వరకూ మన చేతులో లేదు . ఈ  అపురూప శక్తి కారకుడిని మనము దేముడు అంటామా?

2. ఈ అనంతమయిన సృష్టిలో ఏ ఒక్కటి ఇంకొక దానితో పోలి ఉండదు. కారణం వాటిల్లో జన్యువు (DNA) ఒక్కటిగా ఉండదు. ( DNA టెస్టింగ్ చేసే కారణము ఇదే. కొద్దో గొప్పో మనలో కలిసి ఉండేది అమ్మ నాన్నల DNA .)

మానవుల తత్వాలని నిర్ధారించేది DNA  అయినప్పుడు, మన అందరిలో  DNA  ఒకటి కానప్పుడు, ఏపని కలిసి చేసినా మన అందరిలో సమానత్వం ఎక్కడనుండి వస్తుంది? మనలో సామరస్యం ఎక్కడ ఉంటుంది?

చివరిమాట: అసమత్వాల మనుషులతో సమానత్వాలని చూసికుని జీవించా లంటే కష్టమే. ఏ అడ్డంకులు లేకుండా ఏదీ ప్రశాంతంగా జరగదు. గుంపు ఎక్కువయిన కొద్దీ గుద్దులాట తధ్యం.

ఈ పోస్ట్ పాత పోస్ట్ కి ఉప భాగము (Continuation) :
75 ఓ బుల్లి కథ 63 --- బ్రెయిన్ - సృష్టిలో న్యురాన్ పుట్టుక

20 comments:

  1. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

    `జీవ-శక్తి'; `జీవాత్మ-పరమాత్మ'
    పై రెండు పదాలను పరిశీలిస్తే, ఇట్లా చెప్పవచ్చును: `జీవ-ఆత్మ'; `పరమాత్మ-శక్తి' జీవుడు అంటే, శరీరం కలిగివున్నవాడు, కొంతకాలం మాత్రమే వుండవచ్చు; కానీ, జీవిలో వుండే శక్తి నిత్య-సత్యమైనది. దీనినే, పరమాత్మ, పరమాత్మ శక్తిగా చెప్పబడింది. పరమాత్మను `దేవత' అనికూడా అంటారు. `దివ్ ' అనే సంస్కృత పదం నుంచి వచ్చిన అర్ధం ఇది. అంటే , దివ్యమైనది లేదా ప్రకాశవంతమైనది అని. ఇది స్వయం ప్రకాశమైనది కాబట్టి నిత్య-సత్యా మైనది. దీనిని ఎవరూ సృష్టించలేరు.

    ``మానవుల తత్వాలని నిర్ధారించేది DNA అయినప్పుడు, మన అందరిలో DNA ఒకటి కానప్పుడు, ఏపని కలిసి చేసినా మన అందరిలో సమానత్వం ఎక్కడనుండి వస్తుంది? మనలో సామరస్యం ఎక్కడ ఉంటుంది?

    అని మీరు అన్నారు''. -- DNA ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వుండవచ్చు. నిజమే. అయితే, తత్త్వ రహస్యం, మరియు తత్త్వ దృష్టితో చూడవలసింది ఏమిటి అంటే : అన్నీ DNAs లో కూడా వున్నది పరమాత్మచేత ఇవ్వబడిన/ సృష్టింపబడిన `జీవశక్తి'. ఇది సమముగా వుంటుంది. ఇట్టి సమానత్వాన్నే మనం అందరిలో `సూక్ష్మ దృష్టితో' ( SUBTILITY ) చూడవలసి వుంటుంది.

    మీరన్న సమానత్వ విషయాన్నే శ్రీ బొందలపాటి అనే ఆయన, తన వ్యాసం `సమానత్వం-తాత్విక దృష్టి కోణం' లో చర్చించారు. దానిపై, నేను చెప్పిన సమాధానాలు క్రింద చదవండి:


    We are all similar but we are not identical అని అన్నారు. కానీ దీనిని నేను మరొక రకంగా చెబుతాను: We are all Identical but look dis-similarly (outwardly ). దీనికి ఒక ఉదా:- Identical అనే దానికి `మట్టి’ ని తీసుకోండి; dis-similar అనే దానికి `మట్టితో చేసిన అనేక రూపాలుగా పాత్రలని తీసుకోండి. ఇప్పుడు, పాత్రలు అనేక రూపాలుగా కనిపించినా, అన్నింటిలో వున్నది మట్టే గదా!! కాబట్టి, మనుషులను మట్టి పాత్రలుగా ; వారందరిలో వున్నది ఒకేఒక `చైతన్య పదార్ధమే !

    “నేను” అనేది ఆధ్యాత్మికంగా ` పరమాత్మ తత్త్వాన్ని’ సూచిస్తుంది. మనం చెప్పుకునే నేను అనే అర్ధాన్ని మరచి/వదలి వేదార్ధాన్ని తెలుసుకోమని పెద్దలు చెబుతున్నారు. `నేను ‘ అనేది ఎల్లప్పుడూ వుండేది. ఉదా:- నేను, ఒక నాటకంలో తండ్రి పాత్రను వేస్తున్నాను. నాటకం మొదలుకావటానికి ముందు, `నేను’ వున్నాను; నాటకంలో తండ్రి పాత్రలోనూ `నేను’ వున్నాను; నాటకం తరువాతకూడా `నేను’ వున్నాను. కనుక, ఈ విధంగా, నేను ని అర్ధం చేసుకోవాలి.

    `చైతన్యశక్తి’ ఒక్కటే అయినా (మట్టిలాగా), అనేక ప్రాణులుగా ఆవిష్కరింప బడుతూ వుంటుంది.

    సంకుచిత/limited అర్ధంలో మనం అనుకునే `నేను’ అనే స్థితిని (plane ) దాటి, అహం బ్రహ్మస్మి అనే ఉన్నత స్థితిని దర్శించమని ఋషులు చెప్పారు. అది నానుండి మొదలై, ఒక దీపం వెయ్యి దీపాల్ని వెలిగించి నట్లుగా, సమస్త జనానికి అర్ధమవుతే , సమానత్వం వస్తుంది.



    రూపాలు, విలువలు, గౌరవం, ప్రయోజనం మొదలైనవన్నీ మనం ఏర్పరచుకున్నవి. తెలివితేటలు కలిగిన మనిషి స్వార్ధం వలన అసమానతలు, అశాంతిని కొనితెచ్చుకున్నాడు కదా! తెలిసే చేతులారా చేసుకుంటున్నాడు. చేసిన తప్పులను సరిదిద్దుకొనే తెలివితేటలుకూడా మనిషికి వున్నాయి. “రూపాలు వెరైనా, అన్నీ మట్టితో చేసినవే అనే స్పృహని మనం కలిగించుకొన్నప్పుడు/కలిగినప్పుడు అన్నీ రూపాలలోనూ కేవలం మట్టిని మాత్రమే చూస్తామెకానీ, విలువలు….మొదలైనవి కనిపించవుకదా! అప్పుడు అంతటా సమానత్వమే కనిపిస్తుంది. ఇదే ఋషులు మనల్ని తెలుసుకొమంటున్నవి.

    కొంత నీటిని, రక,రకాల రూపం వున్న పాత్రలలో పోసినప్పుడు, నీటికి రూపం మారుతుంది. అంతమాత్రాన, నీరు వేరు,వేరుగా అయిపోయింది అనలేముకదా. అన్నింట్లో వున్నది నీరే. * రక,రకాల ఆకృతులలో ఆభరణాల్ని తయారుచేసినా, మనం చూడవలసింది అన్నింట్లో బంగారాన్ని మాత్రమే!
    * ఒక మిరప మొక్కను, ఒక మామిడి మొక్కను భూమిలో ప్రక్క ప్రక్కనే నాటితే, మిరపకాయని తింటే కారంగా వుంటుంది; అదే మామిడి కాయని తింటే తియ్యగా వుంటుంది. మిరప గింజ, మామిడి టెంక రెండు వేరువేరు జీవులు అని అనుకుంటే, వీటి జీవశక్తికి మూలమైనది `భూమి' దానినే `పరమాత్మగా' చెప్పుకోవచ్చు. మరొకమాటగా చెప్పుకోవాలంటే, భూమి, తనలో అన్నింటినీ కలిగివుండి, వేటికి ఏవీ కావాలో అవి ఇస్తుంది;అలాగే, పరమాత్మ కూడాను.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. I am 100% agree with madhavarao Sir's Comment

    ?!

    Nice Tapa Nice Comment

    ReplyDelete
  3. శక్తి' జీవుడు అంటే, శరీరం కలిగివున్నవాడు, కొంతకాలం మాత్రమే వుండవచ్చు;
    -----------
    @మాధవరావు గారూ నేను చేస్తున్న పనల్లా సైన్స్ చెప్పే దానిని నాకు కొద్దో గొప్పో తెలిసిన మన సంస్కృతికి అన్వయించ టానికి ప్రయత్నించటమే. మీ వ్యాఖ్య చాలా ఆలోచనలని రేకెత్తించింది. పార్టు పార్టు గా తప్ప నేను సమాధానం వ్రాయలేను.

    జీవత్వం, ప్రకృతి లోని జీవిలో కొంత కాలమే ఉండచ్చు కానీ ప్రకృతి ఆ జీవికి ఎనలేని కానుక ఒకటిచ్చింది. తన శక్తిని తన జీవిత కాలంలో ఇంకొకళ్ళకి సంక్రమింప చెయ్య వచ్చు అని (by duplication). ఆ జీవశక్తి నిరంతరం వ్యాపిస్తూనే ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ జీవికి ఆ శక్తిని ప్రసాదించింది పరమాత్మ అనచ్చేమో. ఆ రెండు శక్తుల్నీ మనం సృష్టించ లేము కనుక మనకి అతీతము. చూసి అబ్బురపడి ఆనందించటమే.

    ReplyDelete
  4. అందుకేనేమో మనలోనే పరమాత్ముడు ఉన్నారని చెబుతారు.

    ReplyDelete
  5. చక్కటి పోస్ట్ అండి. ఇప్పుడే చూశాను. పోస్ట్....వ్యాఖ్యలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి.

    పరిణామ క్రమం అంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్తుందో లేదో చెప్పలేము. మనిషి పుట్టిన తరువాత పెరగటం యవ్వనం తరువాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చేస్తుంది. సృష్టి....స్థితి ....లయ. ఇలా జరుగుతుందనిపిస్తుంది.

    నాకు తోచినంతలో ఈ భూమి మీద పరిణామక్రమం అంతం లేకుండా జరుగుతుందని అనిపించటం లేదండి.... .

    ReplyDelete
  6. @మాధవరావు గార్కి
    ప్రపంచములో మనము చూస్తూనే ఉన్నాము, ఏ ఒక్కరి రూపమూ ఒక్కటి కాదు, ఏ ఒక్కరి ఆలోచనలూ ఒకటి కావు, అందరూ ఒక విధంగానే భూమి మీదికి వచ్చారు, ఒక విధంగానే పోతారు. ఎందుకీ వైవీధ్యం? ఎలా వచ్చింది ఈ వైవీధ్యం?. ప్రస్తుతం శాస్త్ర పరంగామనకి తెలిసినంత వరకూ DNA రూపాంతరాలు వలన కలుగుతున్నాయని. వచ్చే కాలంలో కొత్త సంగతులు తెలిస్తే ఈ సిద్ధాంత ములలో మార్పులూ చేర్పులూ జరగవచ్చు.

    "`చైతన్యశక్తి’ ఒక్కటే అయినా (మట్టిలాగా), అనేక ప్రాణులుగా ఆవిష్కరింప బడుతూ వుంటుంది. " అన్నారు మీరు. అదే నేనంటున్నది కూడా అదే DNA . కాకపోతే ఆ చైతన్యశక్తి కి కూడా చైతన్యశక్తి(తనలో తాను మార్పు చెందే శక్తి by mutation) కూడా ఉన్నదని అంటున్నాను. అంతా ఒక చైతన్య శక్తి నుండి వచ్చిందే కాకపోతే చివరి రూపాంతరాలు వేరు వేరు. అందుకనే మన రూపు రేఖలు, ఇష్టా ఇష్టాలు, అభిరుచులు వేరుగా ఉంటాయి.

    "రూపాలు, విలువలు, గౌరవం, ప్రయోజనం మొదలైనవన్నీ మనం ఏర్పరచుకున్నవి." అని మీరన్నారు. నేను ఒప్పుకుంటాను. కానీ అవి ఆవిర్భవించింది చైతన్యశక్తి రూపాంతరాల మూలానే. ఉదా: మనమందరమూ ఒకే చైతన్య స్థితి నుండి వచ్చాము నాకు జావా ప్రోగ్రామర్ ఉద్యోగం ఇమ్మంటే ఇవ్వరు.

    ప్రపంచములోని మతాలు, జపాలు, తపాలు, పరమార్ధ సాధనాలు (వగైరా వగైరా) వచ్చినవన్నీ చైతన్య శక్తిని ఇంకొక రూపంలో (వేదాంత) అర్ధము చేసుకోటానికి, స్వాధీనము చేసుకోటానికి మనము చేసే ప్రయత్నాలని నా ఉద్దేశం.

    ReplyDelete
  7. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

    పైన మీరు చెప్పిన విషయాలతో నేనుకూడా ఏకీభవిస్తాను. అందరిలోని చైతన్య శక్తి ఒక్కటి అయినా, అనేక రూపాలు; విలువలు; ఇష్టాలు.. ఏర్పడుతున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? అనే ప్రశ్నకు పెద్దలు చెప్పిన సమాధానం: పూర్వజన్మ వాసనలు అని. అయితే, ఈ సమాధానం నాకు పూర్తిగా నచ్చలేదు. దీనిపై, ఇంకా నేను ఆలోచిస్తున్నాను. అయితే, మనలోని మనస్సు అన్నింటికీ మూలం. ప్రతి విషయంలోనూ ఇది రెండు రకాలుగా ఆలోచిస్తుంది: మన ఆంతరింగ విషయంలో ఒకరకంగా; బాహ్యంలో ఇతరులపట్ల ఒకరకంగా. ఈ రెండిటి మధ్య వున్న సున్నితమైన ఈ బేధాన్ని మనకు మనమే తుడిచివేయగలిగితే అన్నింటా సమానత్వాన్ని చూడగలము.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  8. సార్ , ఈ పోస్ట్ చూసిన తరువాత నాకు ఎన్నో సందేహాలు వచ్చాయి. అసలు మనిషి కోతి నుండి పరిణామం చెందటం అనేది ఎంతవరకూ సరైనదో ? అనిపించిందండి. అలా ఏ ఆధారాల వల్ల అనుకున్నారు ? వగైరా ఆలోచనలు వచ్చాయండి.

    ReplyDelete
  9. * రెండిటి మధ్య వున్న సున్నితమైన ఈ బేధాన్ని మనకు మనమే తుడిచివేయగలిగితే*
    జీవితకాలం మీరు ప్రయత్నించినా విజయం సాధిస్తామని అనుకుంట్టున్నారా? మనసు అనేది క్షణ క్షణం మారిపోతూ ఉంట్టుంది,గందరగోళానికి గురి అవుతూ ఉంట్టుంది, క్లారిటీ కోసం ప్రయత్నిస్తూ ఉంట్టుంది. ఆధ్యాత్మిక జీవనం వైపుకు పోవాలనుకొనే వారు దృడనిశ్చయం కలిగి ఉండాలి. వారి ప్రశ్నలకి త్వరగా సమాధానాలు వెతుక్కోవాలి. అయినా ఆ బేధం తుడిచి వేసిన తరువాత ఎలా ఉంట్టుంది అని ఒకసారి ఆలోచించుకోండి. గురువుల దగ్గర అంతమంది ఆకర్షితులు కావటానికి ఒకటే కారణం, వారి దగ్గర ఉన్న జ్ణానం కాదు, వారు అందరి పట్ల చూపే ప్రేమ అందులోని సమభావం. కనుక ఆత్మవిచారణ,సాధన ఇవి వీలు కానపుడు,కష్ట్టం అనిపించినపుడు, పురోగతి కనపడని చేయదగినది ఒక్కటే తనప్రేమని భేద భావం లేకుండా అందరికి పంచి పెట్టటం, అనేది ప్రతి రోజు చేయటం మొదలు పెట్టాలి.
    End of the knowledge (IAM) is Love.

    ReplyDelete
  10. @Rama గారు , Enduko Emo గారు మీ వ్యాఖ్యలకు దాన్యవాదములు.

    @Anonymous గారు మీరన్నట్లు సమానత్వం సాధించటం చాలా కష్టం. ఇంట్లోనే చాలా కష్టం. మీరన్నట్లు " చేయదగినది ఒక్కటే తనప్రేమని భేద భావం లేకుండా అందరికి పంచి పెట్టటం,"
    చెయ్యటం కూడా కష్టమే గానీ ప్రయత్నం మీద సాధించవచ్చు.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  11. అనానిమస్ గారికి, నమస్కారములు.

    నా వ్యాఖ్యాపై మీ సమాధానం బాగుంది. అయితే, మీరు వేసిన ప్రశ్నలలోనే సమాధానం కూడా వున్నది. ప్రయత్నం ద్వారా సాధించలేనిది ఏదీలేదు. మీరు ప్రేమను `బేధ భావం' లేకుండా పంచితే చాలు అని అన్నారు. ఇక్కడకూడా అదే సమస్య కదా! నా వారి పట్ల ప్రేమ; ఇతరుల పట్ల ప్రేమ. ఈ రెండిటి మధ్యకూడా ఒక సున్నితమైన రేఖ వున్నది. దాన్ని అధిగమించాలి కదా. ఇక్కడకూడా మనస్సుదే ముఖ్యమైన పాత్ర. ఇదే నేను నా వ్యాఖ్యలో చెప్పింది.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  12. @anrd గారూ మీ ప్రశ్న "అసలు మనిషి కోతి నుండి పరిణామం చెందటం అనేది ఎంతవరకూ సరైనదో ?" కి సమాధానం కొంచెం క్లిష్టం కానీ సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను.
    శాస్త్రజ్ఞులు జీవాలన్నిటికీ మూలము DNA అని గుర్తించారు. మానవుల DNA , చింపాంజీ DNA కి దగ్గరగా ఉన్నదని గుర్తించారు.
    Scientists have sequenced the genome of the chimpanzee and found that humans are 96 percent similar to the great ape species.
    http://news.nationalgeographic.com/news/2005/08/0831_050831_chimp_genes.html

    Allan C. Wilson and Vincent Sarich were pioneers in the development of the molecular clock for humans. Working on protein sequences they eventually determined that apes were closer to humans than some paleontologists perceived based on the fossil record.[note 2]

    Allan C. Wilson గారు ఏవిధంగా మానవుల చింపాంజీ వారసత్వాని గ్రహించారో వారి క్రింది చరిత్రలో విశదీకరించారు.
    http://en.wikipedia.org/wiki/Allan_C._Wilson

    ఈ వాదనని నమ్మని వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. విల్సన్ గారి వాదనని "Evolutionism" అంటారు. దీనిని వ్యతిరేకించే వాళ్ళ వాదనని "Creationism" అంటారు. Big Bang Theory లాంటిది . ఒక దెబ్బ తోటో ఒక మాట తోటో అన్నీ ఏర్పడినవి అని, చాలా వరకు మతము తో సంభందించిన వాదన.
    అమెరికాలో రెండిటినీ నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ పుస్తకాల్లో మాత్రం "Evolutionism" కి ప్రాధాన్యం ఇస్తారు. మీరు గూగుల్ చేస్తే వారి వారి వాదనలు వినవచ్చు.
    మీ సందేహాలను తీర్చాను కుంటున్నాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  13. @మాధవరావు గారూ,anrd గారూ, Rama గారూ, Enduko Eemo గారూ, Anonymous గారూ మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

    ReplyDelete
  14. *నా వారి పట్ల ప్రేమ; ఇతరుల పట్ల ప్రేమ. ఈ రెండిటి మధ్యకూడా ఒక సున్నితమైన రేఖ వున్నది. ఇక్కడకూడా మనస్సుదే ముఖ్యమైన పాత్ర.*
    మాధవరావు గారు,
    మీకు సమాధానం ఇచ్చేముందు నేను ప్రధానం గా మీ వయసును దృష్ట్టిలో ఉంచుకొని చెప్పాను. మీకు ఇప్పటివరకు తత్వంఎక్కువగా తెలుసు అని, క్లారిటి కూడా బాగా ఉంది. మనిషి జీవితం బాగా పరిశిలిస్తే అతను చేసే ఎక్కువగా చేసె పనులు రోటీన్/అలవాటు, వాటిని మానుకోలేడు. మీరు ఉద్యోగ విరమణ చేసిన సినియర్ సిటిజన్. అంతో ఇంతో మెరుగైన ఆర్ధిక పరిస్థితి ఉండివుంట్టుంది. మనసు పేరుతో, మీలో ఉండే మానలేని అలవాట్లు/మీకు నచ్చని గుణాల మీద ఫోకస్ చేసేకన్నా , చేయగలిగిన మంచి పనులు ఎక్కువ గా చేస్తె చాలు. ఇక్కడ మంచి పనులు అంటే ఏపని చేస్తే ఆపని మాత్రం పూర్తి అయ్యి దానివలన రెండవ పని పుట్టకుండా ఉండటం. ( ఉదా|| ఇంట్లో పోయి మీద పాలు కాచే పనే ఉందనుకోండి. దానిని చేస్తూన్నపుడు పాలు పొగకుండా చూసుకోవటం ద్వారా మీరు రెండవ పని లేకుండా చేసిన వారౌతారు. అదే పాలు పొంగితే గాస్ ను కడగటం, తుడవటం ఇటువంటి వేన్నో పనులు చేయవలసివచ్చి, కాలాపహరణ, చికాకును కలుగ జేస్తాయి). ప్రపంచంలో ఉండే అనవసరమైన చేత్తను ఎక్కువగా తలకెత్తుకోకుండా ఉండటం. తత్వ చింతన(ఆలోచించటం) చాలా శక్తిని మనుషులదగ్గర నుంచి లాగేస్తుంది. ఒకానొక సందర్భంలో విసుగుచెందిన సాధకుడు, ఇంతకి నేను చేసినది ఎమీ అని ప్రశ్నించుకొంటే అంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంట్టుంది. ప్రగతి ఎమీ లేనట్లు ఉంట్టుంది. కావున మనుషులు ప్రేమని ఆచరించటం ద్వారా కనీసం అతని వలన ఉపయోగం పొందిన నలుగురు కళ్ళ ముందు కనిపిస్త్తుంటారు. అతనికి తన ఆధ్యాత్మిక అభివృద్ది వారి రూపంలో స్పష్ట్టం గా కనిపిస్తుంది. మీరు గృహస్తులు,పెద్దవారు కనుక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, యు జి లాంటి వారి మార్గం అనుసరణీయం కాదు. కాకపోతే ఎప్పుడైనా వారి పుస్తకాలు అవగాహన కోసం, ప్రశాంతత కోసం చదువుకోవచ్చు. చెట్టుకి ఆకులు, ఆకుకి ఆకు పచ్చ రంగు ఎలా ఉంట్టుందో, మనిషి అన్నవాడికి మనసు ఉంట్టుంది. దానిని మీరు మనసుదే ముఖ్యపాత్రా అని భావిస్తూ ఉంటే దాని పాత్ర,ఇంకా ఎంతో పెరిగి పోతుంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ *నేను ఎవరు* అని చింతన చేయటమే,మీరు మరింత ఎక్కువగా, "నేను" అనే భావాన్ని సృష్ట్టిచుకొంట్టున్నారు. మీకు ఇటువంటి వివరణలు చెప్పవలసిన అవసరంలేదు. అవి మీకే ఎన్నో తెలుసు. మీరు గుర్తించ వలసినది ఒక్కటే జ్ణానం/నాలేడ్జ్ అపరిమితం. కనుక మీకు( మైండ్ క్లారిటి పేరుతో), మీరు దానికొరకు పాకులాడకుండా స్వచ్చందంగా ఆగి పోవటం ముఖ్యం(ఆత్మ విచారణ పేరు తో ఎక్కువ భగం క్లారిటి కొరకు విషయాలు తెలుసుకొంట్టు, పుస్తకాలు చదువుతూ జ్ణానని పోగు చేస్తాం).
    _______________________________
    మీకే మైనా ఆధ్యాత్మిక అనుభవాలు ఉండి వుంటే, అవి పదే పదే కలుగుతూ ఉంటే, మీకు నిజంగా గురువు అవసరం అని మీరనుకొంటే తప్పక మీ గురువు మీమ్మల్ని కలుస్తాడు.

    ReplyDelete
  15. మీకే మైనా ఆధ్యాత్మిక అనుభవాలు ఉండి వుంటే, అవి పదే పదే కలుగుతూ ఉంటే, మీకు నిజంగా గురువు అవసరం అని మీరనుకొంటే తప్పక మీ గురువు మీమ్మల్ని కలుస్తాడు.

    It's 100% true

    Thanks allot for this comment dear

    Anonymous


    ?!

    ReplyDelete
  16. నమస్కారములు .
    ఇంత మంచి ఆర్టికల్ని అందించి నందుకు ధన్య వాదములు . మేధావులు అందరు ఇంత చక్కగా విశ్లేషణ చేసాక ఇంక కొత్తగా నాకేమి మిగల లేదని పిస్తోంది. వారందరూ వ్రాసినవి అక్షర సత్యాలు . లక్కరాజు గారూ ,మీ కలం నుంచి ఇంకా ఇంకా మరిన్ని ఆలోచించ వలసిన వ్యాసములు జాలు వారాలని కోరుతూ అభినందన మందారాలు.

    ReplyDelete
  17. @రాజేశ్వరి గారు మన చుట్టూతా జరుగుతున్నది అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ ముందుకు పోవటానికి ప్రయత్నించటమే మనము చెయ్య గలిగేది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete