Monday, December 30, 2013

98 ఓ బుల్లి కథ 86 --- జర్సీ సిటీ లో ఓ వారం


అప్పుడప్పుడే తెలవారుతోంది.  నెమ్మదిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సన్నగా శబ్దం వినబడుతోంది.  ఏమిటా అని కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాను. ఇదీ దృశ్యం. హడ్సన్ రివర్  అలలు వడ్డుని అమాయకంగా సుతిమెత్తగా స్ప్రుసిస్తున్నాయి. ఇవే అలలు 6 నెలల క్రిందట "Sandy Storm " అనే పేరుతో భీభత్సాన్ని సృష్టించి భీకరంగా ప్రవర్తించాయి. వాటి తట్టుడికి అదిరి చెదిరిపోయిన ఈ బిల్డింగ్ క్రింది భాగం ఇంకా బాగు చేస్తూనే ఉన్నారు. క్రిందటి సంవత్సరం వందమంది ప్రయాణీకులు ఉన్న ప్లేన్ రెండు ఇంజిన్ లు చెడిపోతే పైలెట్ హడ్సన్ రివర్ మీద ఆపటం మూలంగా అందరూ ప్రాణాలతో బయట పడ్డారు. ఇంజిన్లు చెడిపోటానికి కారణం. పక్షులు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ రన్వే మీద నుంచి ప్లేన్ లేస్తుంటే పక్షులు ఇంజిన్ లో దూరాయి. అంతపెద్ద ప్లేన్ ని నాలుగు పక్షులు disable చేశాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 

నిన్న రాత్రి చికాగో నుండి ఓ వారం రోజులు పిల్లల దగ్గర ఉండటానికి న్యూజెర్సీ వచ్చాము. ఇది మార్చి నెల చలికాలం పోయి వసంతకాలం వస్తోంది.

( మేము జర్సీ సిటీ కి మార్చ్ లో వెళ్ళాము. వెళ్ళి ఆరు నెలల పైన అయ్యింది. వ్రాద్దామని అనుకుంటూ ఉండగానే కాలం గడిచి పోయింది.)

ఫోటోలో ఎడమ పక్క న్యూ యార్క్ సిటీ, కుడి పక్క జర్సీ సిటీ మధ్య నిశ్సబ్దంగా పారుతున్న హడ్సన్ రివర్. న్యూ యార్క్ స్టేట్, న్యూ జర్సీ స్టేట్ లు అమెరికాలో పక్క పక్కన ఉండే రెండు రాష్ట్రాలు. ఆ రెండు రాష్ట్రాలనీ విడతీసే నది హడ్సన్ రివర్. హడ్సన్ రివర్ వెళ్ళి దగ్గరలో సముద్రంలో కలుస్తుంది.

మీకు ఎడమ పక్క పొడుగ్గా బిల్డింగ్  కనపడుతోందే అదే ట్విన్ టవర్స్ ఉన్న చోటు. ఆ శిధిలాలని తీసివేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారు (1 World Trade Center). పైన సన్నగా కనపడుతున్నది క్రేన్. పైన క్రేన్ అటూ ఇటూ తిరుగుతూ క్రింద నించి సామాను చేరవేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. అంతస్తులన్నీ పైనున్న ఈ క్రేన్ లే కడతాయి. ఒక్కొక్క అంతస్తూ కడుతూ క్రేన్ లు పై అంతస్తు మీదకి వెళ్తూ ఉంటాయి. జీవితంలో పైకి ఎదగాలంటే క్రేన్ లా ఒక్కక్క అంతస్తూ కట్టుకుంటూ పోయి ఎదగాలి. నేను చూస్తున్నప్పుడు ఒక హెలికాప్టర్ పొడుగాటి వస్తువుని తీసుకు వచ్చింది. దానిని నిలబెట్టడం ద్వారా ఎత్తు పెరిగి అమెరికాలో ఎత్తయిన భవనంగా మారిపోయింది (1,776 feet tall). చికాగో వాళ్ళు వప్పుకోటం లేదనుకోండి (మొన్నటిదాకా అమెరికాలో ఎత్తు అయిన భవనం చికాగో లో ఉండే విల్లిస్/సేర్స్ టవర్.)

క్రింద బోట్ క్లబ్, స్వంత పడవలు పెట్టుకునే చోటు, పడవల పార్కింగ్ . పడవలు మీద ఊళ్లు తిరిగే వాళ్ళు అక్కడ పడవలు ఆపుకుని క్లబ్లొ సేద తీర్చుకుని ఊరు చూట్టానికి వెళ్తారు. క్రిందటి సంవత్సరం వచ్చిన sandy ఉప్పెన మూలంగా కొంత భాగం కొట్టుకు పోయింది. బోటు రాక పోకలు కూడా చాలా తగ్గి పొయాయిట. అసలయితే ఆ బోటు స్టేషన్ ఎప్పుడూ కిటకిట లాడుతూ కళకళ లాడుతూ ఉంటుందిట.

చూడటానికి ఈ ఊళ్ళో ఏమీ లేవు న్యూయార్క్ వెళ్ళాల్సిందే.  వెళ్ళటానికి కారు కావాలి లేకపోతే ట్రైన్ లో వెళ్ళాలి. సామాన్యంగా ఇక్కడ ఉండే వాళ్లకి కార్లు ఉండవు. వాటిని పార్క్ చెయ్యటానికి చాలా డబ్బులు అవుతాయి. మేము zip car ఒకటి తీసుకున్నాము. zipcar కంపెనీ వాళ్ళ కార్లు ఒక చోట పెట్టి ఉంటాయి. మనుషులెవరూ ఉండరు. అక్కడి మీటర్లో డబ్బులు వేసి కారు తీసుకుని మన పని అయిపోయిన తరువాత తీసుకు వచ్చి అక్కడే పార్కు చెయ్యాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే కార్లు అద్దెకిచ్చే చోటు.

న్యూయార్క్ లో ఉన్న guggenheim museum కి వెళ్ళాము. ఈ museum,  spiral case లాగా ఉంటుంది. క్రింద మొదలెట్టి చుట్టూతా తిరుగుతూ నడుచుకుంటూ చూసుకుంటూ పై అంతస్తుకి వెళ్తాము. నడవలేని వారికి lift ఉంది. ఇక్కడ ఒకే ఆర్టిస్ట్ ప్రదర్శన కొన్ని రోజులు ప్రదర్శిస్తారు. ఆరోజు ఒక జపనీస్ ఆర్టిస్ట్ ప్రదర్శన. నేను వాటిని చూసి ఆనందంతో గంతులు వెయ్యలేదు కానీ మాట్లాడ కుండా అన్నీ చూశాను. న్యూయార్క్ లో museum లన్నీ ఈ వీధిలోనే ఉన్నాయి. ఇంకా museum లు చూసే ఓపిక లేక ఇంటికి చేరుకున్నాము.

రాత్రి భోజనాలయిన తరువాత cast away on the moon (2009) అనే ఒక korean movie english subtitles తో చూశాము. చాలా విచిత్రమైన సినీమా. ఒక software engineer లాంటి technocrat వచ్చే డబ్బులతోటి సరిపెట్టుకోలేక credit card ల తో చాలా అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చలేక పోవటంతో అప్పులవాళ్ళు వెంటపడతారు. ఈ బాధలను భరించలేక జీవితం మీద ఆశ వదులుకుని మనస్సు చెడిపోయి ఒక పెద్ద bridge మీద నుండి క్రిందకి దూకుతాడు. మర్నాడు bridge కింద ఉన్న ద్వీపం వడ్డున మెలుకువ వస్తుంది. పైన తను దూకిన బ్రిడ్జి మీద కార్లు పోతూ ఉంటాయి. దూరంగా ఆ కాలువలో పర్యాటకులను షికారుకి తీసుకు వెళ్ళే బొట్లు పోతూ ఉంటాయి. తన సెల్ ఫోన్ పని చెయ్యటం లేదు. పిలుస్తాడు అరుస్తాడు జుట్టు పీక్కుంటాడు, ఎవ్వరూ సహాయం చేసే పరిస్థితి లేదు. తనకు నాగరికత ఆమడ దూరంలో ఉంది కానీ అందుకోలేడు.  చివరికి ఇసక మీద HELP అని వ్రాసి,  మళ్ళా ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆకులూ అలములూ తింటూ ఆ ద్వీపంలో సెటిల్ అయిపోతాడు. ఒక రోజు instant noodles పాకెట్ లో ఉండే మసాలా ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. ఆ మసాలా తో నూడుల్స్ తినాలనే కోరిక పుడుతుంది. అవి తయారు చెయ్యటానికి బీన్స్ కావాలే ఎలా వస్తాయి ? ఆలోచించగా ఆలోచించగా ఒక ఉపాయం తడుతుంది. ఆ ద్వీపం లోకి చాలా పక్షులు వచ్చి రెట్టలు వేస్తాయి. పక్షులు తినేవి గింజలు కదా ఆ రెట్టలలో అరగని గింజలు ఉండవచ్చు. ఆ రెట్టలని పోగుచేసి పాతి పెట్టి మొక్కలని పెంచి వాటినుండి బీన్స్ తీసుకుని నూడుల్స్ చేసి వండుకుని మసాలా వేసుకుని తింటాడు. అప్పుల బాధలు అవీ లేకుండా జీవితం సుఖంగా గడిచి పోతూ ఉంటుంది. ఈ ద్వీప వాసి పరిస్థితి అంతా దూరంగా ఉన్న ఒక భవనం నుండి టెలిస్కోప్ తో ఒక అమ్మాయి రోజంతా చూస్తూ ఉంటుంది.  ఆ అమ్మాయి ఇంట్లో తన గది వదలి బయటికి వెళ్ళదు. ఆ అమ్మాయికి బయటి ప్రపంచం అంటే భయం. వాళ్ళమ్మ తనకు కావలసినవి అన్నీ తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇల్లా రోజులు గడిచిపోతూ ఉంటాయి.

ఒక రోజు ఆ ద్వీపం inspect చెయ్యటానికి మునిసిపాలిటీ వాళ్ళు పడవల మీద వస్తారు.వాళ్ళని చూడంగానే మన హీరోగారు దాక్కుంటారు. చివరికి వాళ్ళు తనని వెతికి వెతికి పట్టుకుంటారు. శత్రువు కాదు అని తెలిసిన తరువాత వాళ్ళు హీరో గారిని తీసుకు వచ్చి బ్రిడ్జి మీద వదిలేస్తారు. టెలిస్కోప్ లో ఇదంతా గమనిస్తున్న ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చి అతన్ని చేరుతుంది. దానితో సినీమా సుఖాంతంగా ముగుస్తుంది. నా కెందుకో ఇది నచ్చింది అందుకని క్లుప్తంగా కధ వ్రాశాను. మీకు వీలయితే చూడండి.

రాత్రి internet లో ఏదో వెతుకుతుంటే దగ్గరలో రోజుకి $11 dollar rent a car దొరుకుతోందని తెలిసింది. రోజుకి పదకొండు డాలర్లకి కారు ఇస్తుంటే తీసుకోకుండా ఎల్లా ఉంటాము? కారు తీసుకుని Edison అనే ఊరు వెళ్ళాము. అది ఒక మినీ ఇండియా. అంతకన్నా ఆశ్చర్య పడటానికి ఏమీ కనపడలేదు. ఇంటికి చేరే సరికి రాత్రి పది అయ్యింది. ఇంకా మా కష్టాలు మొదలయ్యాయి. కారుని రాత్రి ఎక్కడ పెట్టటం ? ఫోనుల మీద ఫోనులు చెయ్యగా తెలిసింది పక్కనున్న ఫినిక్స్ యూనివర్సిటీ పార్కింగ్ లో పెట్టవచ్చు అని. కాకపోతే ఇరవై డాలర్లు అవుతుంది. మళ్ళా పొద్దున్నే వెళ్లి తీసుకు వచ్చాము. మళ్ళా అదే సమస్య కారు ఎక్కడ పెట్టాలి (చవకగా ). మా యింటి ఎదురుకుండా రెండు గంటలకన్నా ఎక్కువ పెట్టటానికి వీల్లేదు . రెండుగంటల కొకసారి కారు ఇంకొక చోటికి మార్చాలి. లేకపోతే జరిమానా చాలా ఎక్కువగా ఉంటుంది. వంటి గంటకి భోజనాలు చేసి హడ్సన్ రివర్ మీద బోటు లో తిరగటానికి వెళ్ళాము. మొదట వెచ్చగానే ఉంది కానీ రాను రాను చలి ఎక్కువ అయ్యింది . లోపల కాబిన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికొచ్చేసి కారు తిరిగి ఇచ్చేసాము.

మర్నాడు Spice Market అనే New York రెస్టో రెంట్ లో dinner. ఈ అద్దె కారు గొడవ పడలేక Limo మాట్లాడుకున్నాము. తీసుకువెళ్ళి రెండు మూడు గంటల తరువాత ఇంటికి తీసుకు రావటం. ఇది ఒక fusion  రెస్టో రెంట్. అంటే రెండు మూడు రకాల (దేశాల ) ఆహారాలని కలిపి తయారు చేసే వంటకాలు అక్కడ చేస్తారు. అక్కడకి పద్నాలుగు మంది కలిసి వెళ్తే మనకు కావలసింది చేయించుకోవచ్చు. కానీ మా పార్టీలో కొందరు రానందున మాకు కావలసినవి చేయించుకోవటం కుదరలేదు. నేనయితే నేను అరిటాకులలో చుట్టిన ఉప్మాలాంటి పదార్ధము తరువాత కొన్ని ఆకులు (ఏ దేశం వో తెలియదు) తిన్నాను. తినటాలు తాగటాలకి రెండు మూడు గంటలు పట్టింది. రాత్రి పదకొండు అవుతోంది లోపలకు రావటానికి జనం క్యు లో నుంచున్నారు. దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ ని మూసేసి అక్కడ చెట్లువేసి పార్క్ లా చేశారుట, అర్దరాత్రి న్యూయార్క్ లో పార్క్ కి వెళ్ళటం నాకు నచ్చక, నేను తప్ప అందరూ దానిని చూడటానికి నడుచుకుంటూ వెళ్ళారు. ఒంటి గంటకి Limo లో బయల్దేరి ఇంటికి చేరాము.

ఇంకా చెప్పుకోవాల్సినవి ఏమీ లేవు. మర్నాడు ప్లేన్ లో చికాగో వచ్చేశాము.

నా ఘోష:
సంవత్సరం లో ఏవేవో చేద్దాం అనుకుంటాము. సంవత్సరం అలా గడిచి పోతుంది. ఒక్కక్కప్పుడు ఎందుకు మనము ఆపనులు చెయ్యాలి అని కూడా ప్రశ్న వేసుకుంటాము. చాలా ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉండవని కూడా అనిపిస్తుంది. కానీ జీవిత గమనంలో కాలం గడపటానికి ఏవో పనులు మనం చేస్తూ ఉండాలి. ఆ చేసే పనులు చాలా వరకు మనకోసం  మన ఆనందం కోసం చేసుకుంటూ ఉంటాము. వాటిల్లో కొన్నిఇంకొకళ్ళ కోసం వాళ్ళు అడగ కుండా చెయ్యాలని ప్రయత్నం. మనం సుఖంగా జీవించటానికి ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసి ఉంటారు. ఎందుకంటే మనం సంఘజీవి ఒంటరిగా మనం జీవించలేము. ఈ సంవత్సరం దాదాపు అయిపొయింది. వచ్చే సంవత్సరంలో తప్పకుండా ఇంకొకరి ఆనందం కోసం కొన్ని పనులన్నా చెయ్యాలి. వచ్చే సంవత్సరమన్నా చేద్దామనుకున్నవి చెయ్యగాలుగుతానేమో.


7 comments:

  1. చాలా కాలం తరువాత టపాను వ్రాసారు.
    ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు మరియు
    మీకు మీ కుటుంబసభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

    ReplyDelete
  2. @anrd గారూ జెర్సీ సిటీ తర్వాత అమెరికాలో చాలా ఊళ్లు తిరిగాము (సియాటిల్ షార్లేట్ ఓర్లాండో) కానీ వ్రాయటానికి పడలేదు (జర్సీ సిటీ కే ఇన్ని నెలలు పడితే అవి వ్రాయటానికి ఎన్ని నెలలు పడుఇతుందో!). అవి ప్రతీ సంవత్సరమూ వెళ్ళేవి కాబట్టి తర్వాత వ్రాద్దాములే అనిపిస్తుంది.

    ఈ కొత్త సంవత్సరం ని కొత్తగా meditation group నుండి ఆహ్వానించ బోతున్నాము. కొత్త సంవత్సరంలో మీకు ప్రతీ రోజూ నిత్య నూతనంగా ఉండాలని కోరుకుంటూ మీకు మా శుభాకాంక్షలు.

    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. నమస్కారము
    చాలా రోజుల తర్వాత చాలా చక్కగా మీ ప్రయాణాన్నీ సినిమానీ చక్కగా చదివించారు. చాలా బాగుంది ధన్య వాదములు
    మీకు మీకుటుంబ సభ్యు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు

    ReplyDelete
  4. రాజేశ్వరి నేదునూరి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మీరు కొత్త సంవత్సరంలో ఉత్సాహంగా శంకరాభరణం పద్యాలు వ్రాస్తూ నిశ్చింతగా ఉండాలని కోరుకుంటా.

    ReplyDelete
  5. నమస్కారమండీ! నేను ఈ మధ్యనే మీబ్లాగు చూసాను.చాలా బావుంది .వరుసపెట్టి ఇంచుమించు గా మొత్తం పోస్టులు చదివేసాను.ఆరోగ్యం,ప్రయాణాలు, విశ్లేషణలు ఇంకా ఇంకా ,చాలా విషయాలు చాలా బాగా చెబుతున్నారు .2012 డిసెంబర్ 25న మేము న్యూయార్క్ లో ఉన్నాం.షార్లెట్ లోఉన్న మా అబ్బాయి దగ్గరకు వెడితే క్రిష్టమస్ న్యూయార్క్ లో బావుంటుందని తీసికెళ్ళాడు.మేము అమెరికాలో ఉన్నది కేవలం నెలరోజులు.ఆ కాస్త సమయంలోనే ,మమ్మల్ని కారులో పదకొండు రాష్ట్రాలు తిప్పాడు అప్పటికి నాకు బ్లాగుల్తో పరిచయం లేదు,ఆ అనుభవాలు నేను ఎవరితోనూ పంచుకోలేకపోయాను.మీ పోస్టు చదువుతూ ఉంటే నాకు అవన్నీ గుర్తు కొస్తున్నాయి.మళ్ళీ అమెరికా వెళ్లి వచ్చినట్లుందండీ!థ్యాంక్యూ.

    ReplyDelete
    Replies
    1. @ నాగరాణి గారూ నెలరోజుల్లో పదకొండు రాష్ట్రాలు వావ్. మీ ఓపికకు మెచ్చుకొవాలి. మీకు నా పోస్ట్లు నచ్చినందుకు ధన్యవాదములు. చదువుతూ ఉండండి చాలా వరకు కొత్త సంగతులు చెప్పటానికి ప్రయత్నిస్తాను.

      Delete