Thursday, June 25, 2015

114 ఓ బుల్లి కథ 102 --- మా పెరటి తోటతో ఇక్కట్లు

అమెరికాలో మేముండే ప్రాంతంలో ఏప్రిల్ మొదటి వారంలో బయట చెట్లన్నీ ఆకులూ గట్రా లేకుండా భూతాల్లాగా ఉంటాయి. ఏప్రిల్ చివరి వారం వచ్చేసరికి అవే చెట్లు ఆకులతో పువ్వులతో పచ్చగా నవ నవ లాడుతూ వుంటాయి. మాకు పెరటితోట వేసుకుని ఆనందించే భాగ్యం సంవత్సరానికి సెప్టెంబర్ లో చలి వచ్చే దాకా, మహా అయితే నాలు గైదు నెలలు మాత్రమే. అందుకని ఇంట్లో పెరిగిన మొక్కల్ని గార్డెన్ లో వేస్తే త్వరగా పంటని అనుభవించ వచ్చు అని, విత్తనాలు కొని ఏప్రిల్ లో ఇంట్లో నారు మడిలాగా వేశాం. మేము ఇంట్లో పెట్టిన గింజలన్నీ, టమాటో బీన్స్ సొరకాయ వంకాయ బెల్ పెప్పర్ అన్నీ మొక్కలుగా వచ్చాయి. ఇంకేం ఆనందం పరమానందం. కానీ ఇంతలో మొక్కల్ని వదిలేసి రెండు వారాలు న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చి చూసే సరికి ఆలనా పాలనా లేకపోయినా  మొక్కలన్నీ పచ్చగా బాగున్నట్లే ఉండటంతో చాలా సంతోషం వేసింది.

ఇక్కడ మామూలుగా మే మొదటి వారం లో వచ్చే "మదర్స్ డే" తో మొక్కల్ని పెరటి తోటలో వెయ్యటం మొదలెడుతారు. మా పెరట్లో ఒక పెద్ద "maple tree" ఉండటంతో ప్రతి సంవత్సరం "మే" వచ్చేసరికి అది  బోలెడన్ని విత్తనాలు వెదజల్లు తుంది. తన జాతిని  అభివృద్ది చేసుకోవాలనే కోరికని మనము కాదన లేము కానీ మన మొక్కలు వేసే ప్రదేశంలో maple tree విత్తనాలుంటే ఇంతే సంగతులు. అందుకని పెరట్లో  మొక్కలు వేసేముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి తోడు వాతావరణం సహకరించటల్లేదు. పగలు కొద్దిగా వెచ్చగా ఉన్నా రాత్రి ఫ్రీజింగ్ వాతావరణం, లేకపోతే రోజంతా వర్షం. అటువంటి సమయంలో మొక్కలు పెడితే బతకటం చాలా కష్టం అందుకని చాలా రోజులు waiting mode లోకి వెళ్ళాల్సి వచ్చింది.

వాతావరణానికి తోడు, గార్డెన్ లో ఇద్దరం కలసి పని చెయ్యాలనే షరతు ఉండటం తోటి, త్వరగా గ్రౌండ్ ని ప్రిపేర్ చెయ్యటం కుదరలేదు. ఇంట్లో పెంచిన మొక్కలు పచ్చగా ఉన్నాయి గానీ చాలా బలహీనంగా ఉన్నాయి. మొత్తం మీద రెండు వారాలకి ఇంట్లో మొక్కలని తీసి గార్డెన్లో వేశాము. వేసేటప్పుడు కలుపు మొక్కలు రాకుండా "weed and feed " కూడా వేశాము. అంతే ఒక వారంరోజుల్లో వేసిన మొక్కలన్నీ కాలంలో కలసిపోయాయి.

ఇంక ఏమి చెయ్యటం? నీదంటే తప్పు, నీదంటే తప్పు అని వాదించుకున్నా సమస్య పరిష్కారం కాదు కాబట్టి వెంటనే వెళ్ళి కొత్త మొక్కలని కొనుక్కుని వచ్చి వేశాం. స్నేహితులు ఇచ్చిన  ఆనపకాయ, బీరకాయ  విత్తనాల గూడా గార్డెన్ లో పెట్టాము. ఈ తడవ  weed and feed వాడలేదు. మొక్కలు త్వరగా పెరగటానికి "Miracle Grow" కూడా వేశాం. వేసి రెండు వారాలయింది. ఇప్పుడిప్పుడే మొక్కలు బతికి బట్ట కడుతున్నాయి.

 పై ఫోటో ప్రస్తుతం మా పెరటి తోటది. మీకు ఒక సంగతి చెప్పటం మరిచి పోయాను. ఫోటోలో ఎక్కువగా కనపడుతున్న మొక్కలు క్రిందటి సంవత్సరం వేసిన తోటకూర సంతానం. ఈ సంవత్సరం వెయ్యకపోయినా బోలెడన్ని తోటకూర మొక్కలు వచ్చాయి. అడవిలా అంతటా పెరిగింది. ఇప్పటికి మూడు సార్లు ఆకులు కోసి స్నేహితులతో పంచుకున్నాము. చూద్దాం ఏమవుతుందో, ఈ సంవత్సరం పెరటి లో పండిన కాయ గూరలు తినే భాగ్యం ఉందో లేదో. 

ఈ సంవత్సరం అనుభవం మీద తెలుసుకున్నవి, ఏప్రిల్ నెలలో గార్డెన్ మీద ఒక పట్టా వేస్తే maple tree విత్తనాలు త్వరగా వేరెయ్య వచ్చు, రెండొవది weed and feed గార్డెన్ లో వాడకూడదు, మూడవది ఇంట్లో నారుమడి వెయ్యటం కుదరదు (రోజూ నారుకి నీరు పొయ్యాలి), నాల్గవది గార్డెనింగ్ చేసేటప్పుడు భార్యా భార్తల సహకారం చాలా ముఖ్యం (భర్త చెప్పిన మాట భార్య వింటే చాలా బాగుంటుంది ).  

No comments:

Post a Comment