Saturday, October 29, 2016

127 ఓ బుల్లి కథ 115 ---- అమెరికాలో భార్గవి రైలు ప్రయాణం



ఎల్లాగూ న్యూయార్క్ దాకా వచ్చాము. ఎప్పుడూ కుదరటల్లేదు. ఈసారయినా ఇషికాను చూడాలి పార్వతిని చూడాలి తప్పదు అనుకుంది భార్గవి. వీకెండ్ ఇషాన్ బర్తడే ట తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళు నాలుగు వందల మైళ్ళ దూరంలో రిచ్మండ్ అనే ఊళ్ళో ఉంటారు. డ్రైవింగ్ కుదరదు. ప్లేన్ లో వెళ్ళాలంటే మధ్యలో ఆగి ఇంకో ప్లేన్ ఎక్కాలి ట్రైన్ అయితే ఎక్కి కూర్చుంటే అక్కడ దిగొచ్ఛు. దానికి తోడు సీనియర్ డిస్కౌంట్ తో ఖరీదు కూడా చాలా తక్కువ. ఆరు గంటల్లో వెళ్ళి పోవచ్ఛు. అందుకని ట్రైన్ లో వెళదామని సెటిల్ అయ్యింది. నలభై ఏళ్ళు అమెరికాలో ఉన్నాచేసిన రైలు ప్రయాణాల్ని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అవి చికాగో నుండి పిట్స్ బర్గ్ , చికాగో నుండి యాన్ ఆర్బర్, చికాగో నుండి చాం పైన్.  అమెరికాలో రైలు ప్రయాణీకులు తగ్గటంతో, రైలు రోడ్లకి  రాబడి లేక దివాలా ఎత్తితే అమెరికా గవర్నమెంట్ వాటినన్నిటినీ కలిపి AMTRAK  అనే పేరుతో రైళ్ళు నడుపుతోంది.

ట్రైన్ పొద్దున పదకొండున్నరకి. భోజనం చేసి బయల్దేరటం కుదరదు. పక్కన నసపెట్టే మొగుడికి భోజనానికి ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి. జిప్ లాక్ లో మిగిలిన అరటికాయ కూర తో పులిహార కలిపి మూటకట్టుకుంది.

న్యూయార్క్ "పెన్ స్టేషన్" నుండి అమెరికాలో నలుమూలలకి AMTRAK  ట్రైన్ లు వెళ్తాయి. మేముండే జెర్సీ సిటీ నుండి పెన్ ట్రైన్ స్టేషన్( మెన్హాటన్)  కి ఆరు మైళ్ళ దూరం. కానీ ఊబర్ టాక్సీ లో గంట పట్టింది. సామాను "చెక్ ఇన్" చేద్దామని వెళ్తే, రిచ్మండ్  ఊరికి చెక్ ఇన్ సౌకర్యం లేదన్నారు. సామాను రైల్లో పెట్టటానికి సహాయం కావాలి. ఇక్కడ మన రైల్వే కూలీల్లాగా, ప్రయాణీకుల
సౌకర్యం కోసం  "రెడ్ కాప్" సర్వీస్ అని ఒకటుంది. వీళ్ళు "పెన్ స్టేషన్" లో మూడు షిఫ్టుల తో  24 గంటలూ పని చేస్తారు. ఒక్కొక్క షిఫ్టులో వంద మంది ఉంటారుట. వాళ్ళ సహాయంతో అందరికన్నా ముందర ట్రైన్ ఎక్కాము. దిగేటప్పుడు సహాయం చెయ్యమని కూడా ట్రైన్ కండక్టర్ కి చెప్పి వెళ్ళాడు. మనకు సహాయం చేసిన వాళ్లందరికీ టిప్ ఇవ్వటం అమెరికాలో మామూలు. మాకు ఒక ఒక పెద్ద సూట్ కేస్ అందుకని ఒక అయిదు డాలర్లు టిప్ ఇచ్చాము.



జనమంతా  రావటం మొదలెట్టారు. సీట్లన్నీ నిండిపోయాయి. మిగిలిపోయిన సీట్లకోసం జనం వెతుక్కుంటూ  ట్రైన్ అంతా తిరుగుతూ ఉన్నారు. ఈ రైలు లో ఏడు పెట్టెలున్నాయి. ఒక మూలనుండి ఇంకొక మూలకి  వెళ్ళ వచ్చు. బయట మబ్బుగా ఉంది. ట్రైన్ 120 మైళ్ళ వేగంతో పరిగెడు తోంది. చెట్లు పుట్టలు నదులు వెనకపడి పోతున్నాయి.అక్టోబర్ అవటం మూలాన చెట్లు రంగు రంగుల ఆకులతో
పరుగెడుతున్నాయి. లంచ్ టైం అయ్యింది అందరూ వాళ్ళు తెచ్చుకున్నవి తింటున్నారు. మేము పులిహార తిని  కాంటీన్ నుండి కాఫీ తెచ్చు కున్నాము. ఇటువంటి ట్రైన్ లన్నిట్లో ఒక చిన్న కాఫిటీరియా కూడా  ఉంటుంది కానీ వాటిల్లో అమ్మేవి కొంచెం ఖారీ దెక్కువ.



 ట్రైన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది దానితో ట్రైన్ ఏ ఊళ్ళ మీదగా పోతోందో ఎంత స్పీడ్ తో పోతోందో చూడవచ్చు. ఐపాడ్ ద్వారా సినిమాలు చూద్దామని ప్రయత్నించాము గానీ చూడ బుద్ది పుట్టలేదు. బయటికి చూస్తూ కూర్చున్నాము.

రైలు మధ్య మధ్య స్టేషన్ల లో ఆగుతోంది . జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఈ రైల్లో సీట్ రిజర్వేషన్ లేక పోవటం మూలంగా రైలు అంతా వెతుకుతూ ఎక్కడ ఖాళీగా సీటు కనపడితే అక్కడ కూర్చోవటమే .

ఇంతలో వాషింగ్టన్ సిటీ స్టాప్ వచ్చింది. వాషింగ్టన్ అమెరికా రాజధాని. చాలా మంది జనం దిగిపోయారు. ఇక్కడ చాలా సేపు రైలు ఆగింది. బయటకి దిగవచ్చు అన్నారు. మేము దిగలేదు. ఇంత వరకూ రైలు ఎలక్ట్రిక్ ఇంజన్ తో వచ్చింది. ఇక్కడ నుండీ డీజిల్ ఇంజన్ తో వెళ్తుందిట. ఇది మన రైళ్ళకి ఉండే వాటరింగ్ స్టాప్ లాంటిది, సామర్లకోట భోజన శాల సాంబార్ పాకెట్లు తైరు సాదం పాకెట్లు గుర్తుకు వచ్చాయి.

రైలు చివరికి కదిలింది. నెమ్మదిగా పోతోంది. చూస్తే స్పీడ్ 70 మైళ్ళు. సగానికి సగం తగ్గిపోయి నట్లుంది. రైలు మధ్య మధ్య ఊళ్ళల్లో ఆగుతోంది. వాషింగ్టన్ లో ఎక్కిన వాళ్ళందరూ దిగిపోతున్నారు. ఇళ్ళకి పోతున్నారల్లే ఉంది ఉషారుగా నుంచుని మాట్లాడు కుంటున్నారు .వాషింగ్టన్ లో ఇళ్ళ ఖరీదెక్కువ అందుకని అక్కడ పని చేసే వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు.

సాయంత్రం ఆరు గంటలవుతోంది. కండక్టర్ వచ్చి మీ ఊరు రాబోతోంది మీకేమి సహాయం కావాలని అడిగింది. సామాను సంగతి చెప్పాము. మమ్మల్ని ముందరికి తీసుకువెళ్ళి మమ్మల్ని దిగమని సామాను దింపి స్టేషన్ దాకా తీసుకు వచ్చింది. మేము టిప్ ఇచ్చామనుకోండీ. పిల్లలు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. న్యూయార్క్ నుండి రిచ్మండ్ ట్రిప్ సుఖంగా గడిచిపోయింది.

Friday, October 7, 2016

126 ఓ బుల్లి కథ 114 --- పక్కాలా నిలాబాడి ......


నాకు చిన్నప్పట్నుంచీ తెనాలి అంటే చాలా ఇష్టం. నా మొదటి హెయిర్ కట్ అక్కడే చేయించు కున్నాను. నా జీవితంలో మొదటి సినీమా "స్వర్గ సీమ" అక్కడే చూశాను. మొట్టమొదట హోటలికి గూడా అక్కడే వెళ్ళాను. దానికి తోడు అత్తయ్య గారిల్లు  రాముడన్నయ్య ఇల్లు అక్కడే ఉన్నాయి. మేము తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో "కఠెవరం" లో ఉండేవాళ్ళం. తరువాత ఊళ్ళు మారటం అయింది ఎక్కువగా వెళ్ళటా నికి కుదరలేదు.

ఆ తరువాత చాలా ఏళ్ళకి  తెనాలి అత్తయ్య గారింట్లో జయమ్మ పెళ్ళి అంటేను వెళ్ళాము. ఆ రోజు పెళ్ళి అవంగానే పెళ్ళికూతుర్ని అత్తారింటికి పంపారు. తీరిగ్గా పొద్దున్నే లేచి అందరం కాఫీ తాగి హాల్లో కూర్చున్నాము. ఎవరింట్లో వాళ్ళు పెళ్ళి చేసుకునే రోజులవి. ఇంటి ముందర పందిరి ఇంట్లో సందడి ఉండే రోజులు. ఏమిటో పాత జ్ఞాపకాలు బయటకు వస్తున్నాయి.

మా అత్తయ్య గారింట్లో ఇంటి వెనుక పెరడు కన్నా ఇంటి ముందర చాలా ఖాళీ స్థలం. నేను వచ్చినప్పుడల్లా, అత్త య్య పిల్లలతో అక్కడ తొక్కుడు బిళ్ళ నుండీ చెడుగుడు దాకా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం. సాయంత్రం దగ్గరలో ఉన్న చినరావూరు పార్క్ కి వెళ్లే వాళ్ళం.

అత్తయ్య  అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను అమెరికా వెళ్ళి పెద్ద కారు కొని అత్తయ్యని దాన్లో కూర్చోపెట్టి తిప్పాలని చిన్నప్పుడు అనుకునే వాణ్ని. అత్తయ్యది కొంచెం స్థూలకాయం పెద్ద కారు కావాలి అవి అమెరికాలో నే దొరుకుతాయని విన్నాను. అందుకని అమెరికా తప్పకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అమెరికా వెళ్ళాను పెద్ద కారు కొన్నాను కానీ అత్తయ్యని దాన్లో తిప్పలేక పోయాను. అప్పటికే ఆవిడ మన ప్రపంచం నుండి వెళ్ళి పోయింది.

అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను గదా. ఆవిడకి కూడా నేనంటే చాలా ఇష్టం. తమ్ముడు శీనయ్య కొడుకుని కదా. తన తమ్ముడికి పెద్ద కూతర్ని ఇచ్చి పెళ్లి చేసి అల్లుడుగా చేసుకుందామని అనుకుందని అందరూ అంటారు. కానీ మా నాన్నకి అక్కయ్య కూతుర్ని చేసుకోవటం ఇష్టం లేదుట. అందుకని ఆ పెళ్ళి జరగలేదు.

నేను వాళ్ళింటికి వెళ్తే ఆవిడ పెరుగుమీద మీగడ, ఆవిడ పిల్లలకు వెయ్యకుండా నాకు వేసేది. వాళ్ళింట్లో అందరూ నన్ను "క్రిష్ణా " అని పిలిచే వారు. చద్దెన్నంలో అత్తయ్య దోసకాయ పప్పు కలుపుకుని తింటే నిజంగా స్వర్గమే. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇటువంటివి. ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దావిడ పేరు జగదాంబ. తర్వాత రమ, జయమ్మా. వాళ్ళని పెళ్లి చేసుకుందా మనుకున్నా గానీ వాళ్ళు నా కన్నా కొంచెం పెద్ద వాళ్ళు. నేను హైస్కూల్ పాస్ అయ్యే టప్పటికే  అందరికీ  పెళ్ళిళ్ళు అయిపోయాయి.

జగదాంబ వదిన అన్నా నాకు చాలా ఇష్టం . మేము రేపల్లి లో ఉన్నప్పుడు వాళ్ళు బేతపూడి లో ఉండే వారు. నేను సాయంత్రం సైకల్ వేసుకుని రేపల్లి నుండి వెళ్ళేవాడిని. వదినకి చిన్నప్పుడే పెళ్ళి కోసమని వంటా సంగీతం నేర్పారు. తాను నేర్చుకున్నవి వదిలిపెట్టకుండా పిల్లలకి కూడా నేర్పింది. అంతే కాదు ఆవిడకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. అందుకనే వాళ్ళ మామగారు పోయిన తరువాత ఆయన నిత్యార్చన చేసే విగ్రహాలు తీసుకుని రోజూ మడిగట్టుకుని నిత్యపూజలు చేసేది.

జగదాంబ వదినకు అప్పటికి ముగ్గురు అమ్మాయిలు, ప్రమీల, రాజాయ్, వసంత. జగదాంబ వదిన సంగీతం నేర్చుకుంది అని చెప్పాగదా. చక్కటి సన్నటి కంఠం కూడా. బాగా పాడుతుంది. అదే పిల్లలకి కూడా వచ్చింది. అసలు ఇంటి పేరులో "మంగళ" ఉంటే వారు సంగీత కళా నిధులు అవుతారు అనుకుంటాను. వాళ్ళింటి పేరు మంగళగిరి. ఇండియా వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి టేపు రికార్డర్ తీసుకు వెళ్ళేవాణ్ణి. రోజూ భోజనాలు చేసిన తర్వాత సంగీత విభావరి ఉండేది. అందరూ కలిసి పాడేవారు.

లలిత కళలు నేర్చుకునే వాళ్ళు రెండు రకాలు. నేర్చుకున్న కళల్ని ప్రదర్శించి ఇంకొకళ్ళని ఆనంద పరిచే వాళ్ళు, ఆ కళలని గుప్తంగా భద్రంగా దాచుకునే వాళ్ళు. మొదటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం.

వదినా పిల్లలూ మొదటి రకం. మొహమాటం లేకుండా చెబుతున్నాను నేను కూడా అంతే. నేను నేర్చుకున్న కళల్ని వద్దు బాబోయ్ అనే దాకా ప్రదర్శిస్తూ ఉంటాను. అంత దాకా రాదు అనుకోండి, ముందరే మా ఆవిడ వార్ణింగ్ సిగ్నల్ ఇస్తుంది  "ఇంక చాలు ఆపెయ్యండి" అని.

నాకు తెలుసు జగదాంబ వదిన తప్పకుండా పాట ఒకటి మొదలెడుతుందని, అనుకున్నట్లు గానే వదిన త్యాగరాయ కీర్తన అందుకుంది.

                     "పక్కాలా  నిలాబాడి  గొలిచే  ముచ్చటా
                      బాగా  తెల్పరాదా"

అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆ కంఠం వింటే అంతే మరి. పల్లవి పాడుతూ పిల్లల్ని అందుకోమని సైగ చేసింది.

ప్రమీల అనుపల్లవి అందుకుంది

                      "చుక్కాలా  రాయాని  గేరూ మోముగల
                       సుదతీ  సీతమ్మ సౌమీత్రీ  శ్రీరాముని  కిరు (పక్కాలా )"

తర్వాత చరణం రాజాయ్ అందుకుంది

                      "తనువూచే  వందనా  మొనరించు  చున్నారా
                       చనువున  నామ కీర్తనా సేయు చున్నారా"

తర్వాత తన చక్కటి కంఠం తో వసంత పాటని పూర్తి చేసింది

                       "మనసూ నా  దలచి మై  మరచి యున్నారా
                        నెనరుంచి  త్యాగరాజునితో  హరి హరి  మీరిరు (పక్కాలా )"

పాట చివరికి వచ్ఛే సరికి అందరి కంఠాలు కలిశాయి. ఆ అనుభూతిని చెప్పలేం. అది ఒక సిమ్ ఫొనీ.

మీకోసం త్యాగరాజు వ్రాసిన ఈ పాటకి అర్ధం, ఖరహరప్రియ రాగంలో  "చారులతా మణి" చక్కగా పాడిన ఆ కీర్తన, క్రింద ఇస్తున్నాను. విని ఆనందించండి.

పాటకి అర్ధం:
చంద్రుని వంటి మోము గల సీతమ్మా,
సుమిత్రకుమారుడివైన నీవు లక్ష్మణ,
శ్రీ రాముని కిరుపక్కలా నిలబడి ఏమని  కొలుస్తున్నారయ్యా ఆయన్ని?
ఎంత ముచ్చటగా ఉన్నారు మీరు
ఎలా  ఆరాధిస్తున్నా రాయన్ని
ఆయన నామ కీర్తన చేస్తూ  మైమరచి తన్మయత్వంతో  పరవశించి పోతున్నారా?
దయయుంచి ఆవిశేషాలన్నీ ఈ  త్యాగరాజుకి  చెప్పరా?


పక్కాలా  నిలబడి - చారులతా మణి