Tuesday, March 24, 2020

157 ఓ బుల్లి కథ --కాలం గాని కాలంలో అమెరికా


రెండు రోజుల క్రితం అమెరికాలో వసంతకాలం వచ్చింది. చెట్లు చిగిర్చి పువ్వులు పూయాలి. కానీ చికాగో లో కాలంగాని  కాలంలో  స్నో పడింది .  ఇంకా సూర్య భగవానుడు రాలేదు. పైన ఫొటోలో కనపడేది మా పెరటి తోట. కలికాలం ఇది. వసంత కాలంలో స్నో పడటం, "కరోనా వైరస్ "  లాంటి రోగాలు రావటం.

 "కరోనా వైరస్ ",  బయట తిరగొద్దు  అని  చెప్పటంతో వారం రోజులబట్టీ ఇంటిపట్టునే ఉంటున్నాము. ఇంట్లో ఉన్న ఇద్దరం  లైబ్రరీ లో పనిచేస్తాము. ఇంటావిడ ఉద్యోగం అక్కడ ఇంటాయనకి వాలంటీర్ పని.పెళ్ళయిన నలభై ఏళ్ళ తర్వాత 24 గంటలూ ఒక చోట ఇద్దరమూ  గడపటం ఇదే మొదటిసారి.

మనుషుల అభిప్రాయాలు సామాన్యంగా వారు పెరిగిన వాతావరణం బట్టి ఉంటాయి . భార్యా భర్తలు వీటికి అతీతం కాదు. అభిప్రాయ బేధాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అందులో 24 గంటలూ ఇంటిపట్టున ఇద్దరూ  ఉండాలంటే కొంచెం కష్టమే. వారం రోజులు జుట్టూ జుట్టూ   పట్టుకోకుండా ప్రశాంతంగా గడిచి పోయిందంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏమైంది అని నాలో నేనే ప్రశ్నించుకుంటే కొన్ని విశేషాలు బయటికి వచ్చాయి. మీకు కూడా అవి పనికి వస్తాయని వాటిని మీతో పంచుకుంటున్నాను.

మొదటిది చాలా ముఖ్యమయినది ఇంట్లో ఇద్దరే ఉండటం మూలంగా "ప్రైవసీ" ఉండదు.  అందుకని రోజూ ఒక గంట ముందర లేస్తాను. ఆ గంట మీ సొంతం ఎంతో హాయిగా ఉంటుంది. నేనయితే నేను కాఫీ పెడతాను. ప్రశాంతంగా కాఫీ తాగుతాను. మా డిష్ వాషర్  పై అరలో వున్న వన్నీ తీసి బయట పెడతాను. అవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టక పోతే ఆవిడకి కోపం వస్తుంది. అందుకని నేను సద్దను. డిష్ వాషర్ లో రెండొవ అర ఆవిడకి వదిలిపెడతాను. పని ఇద్దరికీ సమానంగా ఉంటుంది అందుకని పోట్లాటకి తావుండదు. లేచే సరికి కాఫీ గూడా తయారు చేసి పెడతా కదా సంతోష పడుతుంది. కాకపోతే కాఫీ పల్చగా ఉందనో స్ట్రాంగ్ గా ఉందనో అంటుందనుకోండీ. ఇటువంటివి పట్టించుకోను.

ఆవిడ కాఫీ తాగి స్నానం చేసి పూజా అవీ చేసుకునే టప్పటికి గంటలు పడుతుంది. ఆ సమయ మంతా మీదే. హాయిగా ప్రశాంతంగా పనులు చేసుకోండి. నేనయితే ఇంటర్నెట్ తో కంప్యూటర్ మీద ఉంటాను. సమయం గుర్తు వచ్చేసరికి సరికి లంచ్ టైం దగ్గర పడుతుంది.

వీలయినంత వరకూ ఇంట్లో సహాయము చేస్తున్నట్లు కనపడండి. నేను సామాన్యంగా తేలికగా లంచ్ తయారు చేస్తాను. నేను తయారు చేసేవి "అటుకుల ఉప్మా" "సేమ్యా ఉప్మా " లాంటివి. మీకు ఇటువంటివి చెయ్యటం రాక బోతే నేర్చు కుంటాను అని ఆవిడ చేత చేయించండి. భర్త బుద్దిగా నేర్చుకుంటా నంటే నేర్పటం వాళ్లకి చాలా ఇష్టం. ఇలా నేర్చుకుంటూ రోజులు గడపొచ్చు.

లంచ్ అయిన తర్వాత నిద్దర వస్తే నిద్దర పోండి. లేదూ U -Tube లో పాత తెలుగు సినిమాలు పెట్టండి. మూడు గంటలు అలా మాట్లాడకుండా గడపొచ్చు. మచ్చుకి మేము చూసిన తెలుగు సినిమాలు "కొంటె మొగుడు పెంకి పెళ్ళాం","శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్", "చిల్లరి మొగుడు అల్లరి కొడుకు", "మా ఇంటాయన కధ ", "పెళ్లి చేసి చూడు" "థాంక్యూ సుబ్బారావ్" లాంటి తెలుగు చిత్ర రాజములు.

నువ్వు పెట్టిన టీ చాలా బాగుంటుందని చెప్పి టీ పెట్టించుకుని తాగండి. ఇంతలో వార్తల టైం అవుతుంది. టీవీ లో వార్తల ఛానల్స్ (CNN వగైరా) చూడండి. తర్వాత ఆవిడకి TV  ఇచ్చేసి తనకి ఇష్టమయిన షోస్ చూసుకోమనండి . ఇలా కొన్ని గంటలు గడిచిపోతాయి.

ఇంతలో డిన్నర్ టైం దగ్గరపడుతుంది. మీరు లంచ్ చేశారు గనక డిన్నర్ ఆవిడే చేస్తుంది. మీరు ఆవిడ డిన్నర్ వండుతుంటే మీ వంతు ఒక పని తప్పకుండా చెయ్యాలి, అన్నం వండండి తేలిక. రైస్ కుక్కరో ప్రెషర్ కుక్కారో వాడండి. గిన్నెలో రెండు కప్పుల బియ్యానికి మూడు న్నర కప్పుల నీళ్ళు పొయ్యటమే. తర్వాత ఆవిడకి సహాయం చెయ్యండి. వీలయితే ఒక గరిటె తీసుకుని భగుణ లో కూర తిరగ తిప్పండి.

డిన్నర్ కి టేబుల్ మీద మంచినీళ్లు ప్లేట్లు పెట్టండి. వంట బాగుందని చెప్పండి.

డిన్నర్ అయిన తర్వాత U - ట్యూబ్ లో మరల తెలుగు సినిమాలు పెట్టండి. మూడు గంటలు గడిపెయ్యోచ్చు. నిద్దరొస్తే మధ్యలో కునుకు తీయండి. తెలుగు సినిమా చూస్తూ కునుకు తీయటం పెద్ద తప్పేమీ కాదు. తర్వాత నిద్దర టైం అవుతుంది.

ఇందులో ముఖ్యంగా గమనించ వలసింది close encounters రాకుండా జాగర్తగా ఉండటమే. ఒకవేళ నోరు జారటం సంభవిస్తే "Honey I love you " అనటానికి సంకోచించ వోకండి. All the best during lockout.

P.S
విన్నకోట వారూ, నీహారిక గారూ, శ్యామలీయం గారూ ముక్త కంఠం తో చెబుతున్నారు అన్నం వండటానికి నేను వ్రాసినట్లు కాకుండా బియ్యం,నీళ్ళు ఒకటికి రెండని. నేను అన్నం వండటంలో చివరి ముఖ్య పని మాత్రమే చేస్తాను అందుకని నాకు ఈ ప్రిపరేషన్ సంగతి తెలియదు. మా ఆవిడ ఇచ్చిన గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చెయ్యటం మాత్రమే నా పని. ఒక అరగంటకి అన్నం ఉడుకుతుంది. ఇది పెద్ద కష్టమయిన పని కాదు. వీరు చెప్పిన సంగతి తప్పో ఒప్పో తెలియక మా ఇంట్లో ఎక్సపర్ట్ కన్సల్టెంట్ మా ఆవిడని సలహా అడిగాను.

ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే నేను అన్నము మెత్తగా ఉన్నదని గొడవచేస్తే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం మెలికలుగా(పలుకుగా ) ఉన్నదంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం వండటం ఇంత క్లిష్టమని అనుకోలేదు. మీకు అన్నీ చెప్పాను. మీ కిష్టమయిన విధంగా అన్నం వండుకోండి.

13 comments:

  1. మీ అనుభవాల నుండి చాలా నేర్చుకోవచ్చండి 👌😁.

    అవునండీ, రెండు కప్పుల బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు మాత్రమే పోస్తారా? ఆ నీళ్ళల్లో బియ్యం పూర్తిగా మునగనైనా మునుగుతుందా 🤔?

    ఏమిటో సర్, వంట విషయంలో నేనే కాస్త నయమేమో అనిపిస్తోంది 😎.

    ReplyDelete
  2. విన్నకోటవారూ,
    నేను కూడా ఇదే అడుగుదామనుకున్నా. ఒకటికి రెండు కదా ?

    ReplyDelete
    Replies
    1. అబ్బా, ఈసారికి క్షమించేసెయ్యండీ. మిగిలిన విషయపరంపర అంతా సరిగ్గానే వ్రాసారుకదా. బియ్యౖం, నీళ్ళల్లో ఏది ఎన్ని కప్పులూ అన్నది పొరబడ్డారు.ఒకసారి చేస్తే కదా తెలిసివచ్చేది. మహా ఐతే పాయసం అన్నా అవుతుంది లేదా గిన్నైనా మాడుతుంది. అంతే కదా.

      ఒక పాత కార్టూన్ ఉండాలి బాపూది. ఒకమ్మాయి ఎదురింటి పిన్నిగారిని అడుగుతున్నది "వండేముందు బియ్యం కడగాలీ అన్నారు పుస్తకంలో. సబ్బెట్టి కడగాలా, సర్ఫ్ పెట్టి కడగాలా పిన్నిగారూ" అని.

      Delete
    2. అంతే కదా నీహారిక గారూ, ఒకటికి రెండు అన్నదే స్టాండర్డ్ ✅. .

      Delete
  3. విన్నకోట వారూ  నిహారిక గారూ శ్యామలీయం గారూ 
    మీకు వెంటనే సమాధానం ఇద్దామనుకున్నా గానీ తప్పేమిటో  తెలియలేదు అడగటానికి మా ఆవిడ పూజలో ఉంది ఆలేస్యమయ్యింది క్షమించండి. రెండు కప్పుల బియ్యం బదులు ఒక కప్పు బియ్యం అంటే సరిపోతుందిట.  మీరు నాలాగా తప్పులు చెయ్యవోకండి. థాంక్స్.

    ReplyDelete
    Replies
    1. నేనింకా అప్రెంటిస్ హోదాలోనే ఉన్నానండీ, దశాబ్దాలుగా. ప్రస్తుతం గిన్నెలు కడిగిపెట్టటంలో డిప్లొమా వచ్చేసింది.

      అవసరం లేదని డ్రైవరును నేను మాన్పించేసాను. పాపం పదేళ్ళ అనుబంధం వదులుకుందుకు ఉభయపక్షాలకూ బాధగా అనిపించినా తప్పలేదు. ఇంట్లో ఉండి సహాయం చేసే మనమ్మాయి, ఊరికి వెళ్ళి ఒక క్వార్టర్ గడిచింది - అంటే ఇక రాదన్నమాట. అందుచేత నేనో డిప్లొమా చేయక తప్పలేదు. మెల్లగా మిగతావీ పూర్తి చేసి డిగ్రీ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను.

      Delete
    2. తప్పులు చేసి తిట్లు తినటం స్టేజి దాటిపోయింది. ఎదో చేస్తున్నాడులే అని సరిపెట్టుకునే రోజులివి.

      Delete
  4. విన్నకోట వారూ నీహారిక గారూ శ్యామలీయం గారూ
    ఈ క్రింది పేరా నా పోస్టుకి చివర వ్రాశాను.Thanks for your input.
    P.Sవిన్నకోట వారూ, నీహారిక గారూ, శ్యామలీయం గారూ ముక్త కంఠం తో చెబుతున్నారు అన్నం వండటానికి నేను వ్రాసినట్లు కాకుండా బియ్యం,నీళ్ళు ఒకటికి రెండని. నేను అన్నం వండటంలో చివరి ముఖ్య పని మాత్రమే చేస్తాను అందుకని నాకు ఈ ప్రిపరేషన్ సంగతి తెలియదు. మా ఆవిడ ఇచ్చిన గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చెయ్యటం మాత్రమే నా పని. ఒక అరగంటకి అన్నం ఉడుకుతుంది. ఇది పెద్ద కష్టమయిన పని కాదు. వీరు చెప్పిన సంగతి తప్పో ఒప్పో తెలియక మా ఇంట్లో ఎక్సపర్ట్ కన్సల్టెంట్ మా ఆవిడని సలహా అడిగాను.
    ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే నేను అన్నము మెత్తగా ఉన్నదని గొడవచేస్తే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం మెలికలుగా ఉన్నదంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోస్తుందిట. నేను అన్నం వండటం ఇంత క్లిష్టమని అనుకోలేదు. మీకు అన్నీ చెప్పాను. మీ కిష్టమయిన విధంగా అన్నం వండుకోండి.

    ReplyDelete
    Replies
    1. మీ expertise and contribution బాగున్నాయండీ 😁😁.

      Delete
  5. విన్నకోట వారూ: మీరంతగా పొగిడేస్తుంటే నాకు కాలరెత్తుకోవాలని ఉంది కానీ ఇంటి పట్టున ఉన్న వాడిని అణిగి మణిగి ఉండాలి కనీసం ఇంకో రెండు వారాలు.. 

    ReplyDelete
  6. Glaas గిన్నె అయితే కుక్కర్ లో పెట్టాల్సిన పని లేదు. మైక్రోవేవ్ లో పెట్టి 500వాట్స్ పవర్ వద్ద 20నిముషాలు ఉడికిస్తే సారి. నీళ్లు మాత్రం ఒక కప్పు రైస్ కి అంతే పరిమాణం ఉన్న కప్పుతో రెండింతలు.

    ReplyDelete
  7. ఏమిటోనండీ సూర్యగారూ నాకు మైక్రోవేవ్ తో వంట చెయ్యాలంటే కష్టం. బోలెడన్ని బటన్స్. మా అమ్మ నా చిన్నప్పుడు "ఎసరు" పెట్టి అన్నం వండేది. అదేంటో నాకు గుర్తు లేదు. మీ వ్యాఖ్యకు ధన్య వాదములు. 

    ReplyDelete