Monday, August 30, 2021

173 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 4 (Ishopanishad)

మనకున్న వేదాలు నాలుగు. ప్రతీ వేదం శాంతి మంత్రం తో మొదలవుతుంది. శాంతి మంత్రం ఆ వేదంలో చర్చించబోయే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. దానిలో ఉన్న ఉపనిషత్ చర్చాంశాన్ని  వివరంగా చెబుతుంది. వేదముల లోని విషయాలూ చర్చలూ సంస్కృత పదాలతో అల్లిన శ్లోకాలతో మృదువుగా గుంభనగా గోప్యంగా ఉంటాయి. వాటి ముడులు విప్పి సౌరభాలు ఆస్వాదించాలంటే నిష్ణాతులైన గురువులు అవసరం. ఈశావాస్య ఉపనిషత్ లో ఇటువంటి శ్లోకాలు 18 ఉన్నాయి.

ఈ సృష్టికి కారణం పరమాత్మ అనీ ఆయన అంశం ఆయన సృష్టించిన ఈ జగత్ లో జీవులన్నిటిలోనూ  జీవాత్మగా ఉంటుందనీ, చూడటానికి, తాకటానికి అది అతీతమని చెప్పే శాంతి మంత్రం తో శుక్ల యజుర్వేదం మొదలవుతుంది.

నిర్గుణ నిర్వికార అనంత మూర్తి జీవాత్మను సంభోదించేది "ఓం" కారం తోనే. ధ్యానించేది "ఓం" కారం తోనే. అలా ధ్యానం చేస్తూ మనలో ఉన్న ఆత్మ  తో మమేకమై ఆ ఆనందంతో మైమరచిపోతే జీవితం ఆధ్యాత్మిక తో ఆనందంగా గడపవచ్చును. ఇదే మొదటి శ్లోక సారాంశం.

ఏ కారణము చేత నయినా తనలోని జీవాత్మని భౌతిక శరీరాన్ని విడివిడిగా చూడలేక పోతే, వంద ఏళ్ళు బ్రతికి తోటి జీవులకి తోడుగా ఉంటూ, తనలోని ఆత్మని అందరిలో చూస్తూ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ జీవించాలని నిర్ణయించుకోవాలి. ఇదే రెండవ శ్లోక సారాంశం.

భౌతికశరీరము  లోని పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ, కామినీ కాంచన కీర్తికోసం పరితపిస్తూ  జీవితం గడిపితే చనిపోయిన తరువాత కారుచీకటి లోకం "అసుర" లో తనలాంటి తోటి జీవులతో ఇంకొక దేహం కోసం వేచి ఉండి మరల మరల భువి మీద జన్మించాల్సి ఉంటుంది. ఇదే మూడవ శ్లోక సారాంశం.

శ్లోకాలు 4 నుంచీ 14 దాకా ఆత్మ (ఈశ ) గురించి వర్ణించటం జరుగుతుంది. మనము సామాన్యంగా "నేను" అనేది మన శరీరం, దానిలోఉండే పంచేంద్రియాలూ, అవిచేసే విన్యాసాలుగా గుర్తిస్తాము. అవే మనని కామినీ కాంచన కీర్తుల కోసం పరితమించమని చెబుతాయి. ఈ విన్యాసాలకు (మన కోరికలకు) అంతు ఉండదు ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంతులేని వాటికోసం పరితపిస్తూ ఒకటి తరువాత ఒకటి కోరికలు తీర్చుకుంటూ (తీర్చుకోలేక విషాదంతో కుమిలిపోతూ) జీవితం గడుపుతూ ఉంటాము. ఇవే సుఖ దుఃఖాలకి కారణాలు. 

మనం గనక ఈ భౌతిక శరీరాన్నీ (దానిలోని పంచేంద్రియాల్తో సహా ) నడిపించే ఆత్మ (conscious ) మీద కేంద్రీకరిస్తే, మనలో దాని ఉనికిని గ్రహిస్తే, దానితో మమేకమయితే, ఈ భౌతిక శరీరం  గుప్పించే విన్యాసాలకు అతీతం అవుతాము. మనము చెయ్యాల్సిన పనిని చేస్తాము కానీ ఆకర్షణలకు లొంగము. సినిమా హాల్లో తెల్లటి తెర ఉంటుంది. ఆ తెరమీద రంగురంగుల సినిమాలు ఎన్నో వేస్తుంటారు. దానికి ఏ రంగూ అంటదు. అటువంటిదే మన ఆత్మ. దానితో మమేక మయితే భౌతిక శరీర విన్యాసాలకు అవి కురిపించే సుఖ దుఃఖాలకి మనం అతీతల మవుతాము. ఇక్కడ గమనించ వలసినది మనం ముందర మన కర్తవ్యకర్మ చేసిన తరువాతే ఆత్మ జ్ఞానము మీద కేంద్రీకరించాలి.

శ్లోకాలు 15 నుండీ 18 దాకా సూర్య ప్రార్ధన శ్లోకాలు. శుక్ల యజుర్వేదము రచయిత యాజ్ఞవల్క్య  ముని సూర్య ప్రార్ధన ఫలితమే ఈశా వ్యాస ఉపనిషత్ అని కూడా అంటారు. 

శ్లోకం 15:

హిరణ్మయేన పాత్రేణ            బంగారపు మూతతో 

సత్య శ్యాపి హితం ముఖం   "సత్యం" ముఖం కప్పి ఉన్నది 

తత్వం పూషణ్ అపా వృణో     ఓ సూర్య దేవా!  ఆ మూత తీసివేయి 

సత్య ధర్మాయ దృష్టయే   సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది 

ఓ సూర్య దేవా (పూషణ్ ) బంగారపు మూతతో "సత్యం" కప్పి ఉన్నది. ఆ బంగారపు మూత తీసివేయవా. సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది. ( శ్లోకం 15)

(పూషణ్  అంటే పోషక కర్త. సూర్య దేవుడు సముద్రమునుండి నీరు తీసి మేఘముల ద్వారా వర్షము కురిపించి ఆహారము కొరకు పంటలుపండిస్తూ , సముద్రమును నింపుతూ జీవత్వము కొనసాగే విధంగా చేఇస్తున్నాడు. అంతే కాదు మన శరీరతత్వం కూడా సూర్యోదయము , సూర్యాస్తమయం  మీద ఆధారపడి ఉంటుంది.) 

నీవిచ్చిన ప్రాణం తోటి ఈ శరీరం ద్వారా ఇప్పటిదాకా "సత్యం" గా జీవితం గడిపాను. నా చరమ దశ ఆసన్నమైంది. ఈ నా శరీరాన్ని భస్మం చేసి  నువ్విచ్చిన నాలోని ప్రాణాన్నితీసుకుని నన్ను నీతో కలుపుకో .  శ్లోకం 17.

ఈ క్రింది చివరి ప్రార్ధన శ్లోకం మన అందరికోసం వ్రాసింది :

శ్లోకం 18:

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్  మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో  మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ    నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా  నీకు నన్ను నేను అర్పించుకోవటమే. శ్లోకం 18.

Summary written in English for people who do not know how to read Telugu.

The devotee is praying sun God, who is responsible for our existence and survival on this earth, to bless him to see his true figure so that he can show his gratitude. The Sun is actually instrumental for our existence on this earth by absorbing water from the Ocean , creating clouds and rain, which in turn fill the Ocean and raises crops and provide food for our survival. The Sun rise and Sun set are somewhat closely mingled with our biological system and daily activities.

నా మాట:

దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి

1.Swami Aparajitananda

2. The Upanishads





4 comments: