Monday, September 20, 2021

176 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-1 (Mundakopanishad )

ముండకోపనిషత్ అధర్వణ వేదం నుండి తీసికొన బడినది. ఇది మనకున్న పది ముఖ్య ఉపనిషత్ లలో ఒక ముఖ్య ఉపనిషత్. దీనిలోని 65 శ్లోకాలు 3 భాగాల్లో ఉన్నాయి. ఒక్కొక్క భాగమూ మళ్ళా రెండు ఖండాలుగా గ విభజించబడ్డాయి. 1-1-3 అంటే  మొదటి ముండకం లోని మొదటి ఖండంలో 3వ మంత్రం. దీనిలో భాగాన్ని ముండకం అంటారు.

సామాన్యంగా ఉపనిషత్ లు శిష్యుడి ప్రశ్నతో మొదలయ్యి దానికి గురువుగారి సమాధానంతో ముగుస్తుంది. ఇక్కడ శిష్యుడు శౌనికుడనే గృహస్థు, గురువుగారిపేరు అంగీరసుడు.

గృహస్థయిన శౌనికునికి తాను చెయ్యవలసిన కర్మకాండలు, యజ్ఞ యాగాదులూ అన్నీ చేసినా ఇంకా ఏదోమిగిలిపోయిందన్న దిగులు. దగ్గర ఆశ్రమంలో ఉన్న అంగీరసుడనే మహాముని దగ్గరకు వెళ్ళి తన అసంతృప్తిని చెప్పి జీవితంలో ఏవి చదివితే అంతా తెలిసిపోయి ఇంకా  చదవవలసిన/చెయ్యవలసిన అవసరము ఉండదో చెప్పమని అర్ధిస్తాడు .

ముండకం 1 ఖండం 1 మంత్రం 3  (1-1-3):

శౌనకో హ వై మహాశాలో ఆంగీరసం   : శౌనికుడనే మహాశాలి అంగీరసుని 

విధివధుప్రసన్న హ  పప్రచ్చ           : శాస్త్రోక్తరీత్యా సమీపించి ప్రశ్నించాడు 

కాస్మిన్ను భగవో విజ్ఞతే                       : దేనిని తెలుసుకుంటే భగవంతుడూ 

సర్వమిదం విజ్ఞాతం భావతీతి           : ఈ సర్వస్వమూ  తెలిసికోబడుతుంది అని 

ముండకం 1 ఖండం 1 మంత్రం 4 (1-1-4):

తస్మై స  హోవాచ           : అతనితో అతను చెప్పాడు 

ద్వే విద్యే వేదితవ్యే ఇతి : రెండు విద్యలు  తెలుసుకోవలసినవి అని 

హ స్మ యద్                        : అవి 

బ్రహ్మవిదో వదన్తి                : మహాత్ములు చెబుతారు 

పరా చైవాపరా చ                 :  పరా విద్య అపరా విద్య 

శౌనికుడు యజ్ఞ యాగాదులు చేస్తూ సౌభాగ్యవంతమైన జీవితం గడుపుతున్న ఒక గొప్ప గృహస్థు . అంగీరసుడు వారసత్వముగా బ్రహ్మజ్ఞానము తెలిసికొనిన గురుపరంపరలో ఏడవ వ్యక్తి. 

వేసిన ప్రశ్న: ఏది తెలుసుకుంటే అంతా తెలుకున్నట్లు అవుతుంది? (ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవటానికి ఇంకేమీ ఉండదు అని)

ఈ ప్రశ్నకిసమాధానం 4 వ మంత్రంలో గురువుగారు చెబుతారు. పర విద్య, అపరా విద్య అని రెండు విద్యలు ఉన్నాయి అవి నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్లే అని మహాత్ములు చెబుతారు అని.

శౌనికుని ప్రశ్న మనం సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్నాళ్ళీ చదువు? ఈ  చదువులన్నీ ఎప్పుడు ఆపెయ్యాలి ? పిల్లలు అడిగే ఈ ప్రశ్నకి మనం సామాన్యంగా సమాధానం చెప్పం కానీ గురువుగారు శౌనికుని ప్రశ్నకి సమాధానం చెప్పటం ప్రారంభించారు. 

విద్యలు రెండు రకాలు పరా విద్య , అపరా విద్య . ఇంతవరకూ నీవు నేర్చుకున్న వన్నీ అపరా విద్యలు (వేదాలూ ఉపనిషత్తు లతో సహా ), నువ్వు గనక పరా విద్య కూడా నేర్చుకుంటే ఇంకేమీ  నేర్చుకోవక్కరలేదు, అని శిష్యుడు శౌనికుని తో చెబుతారు గురువుగారు అంగీరసుడు.

ముండకం 1 ఖండం 1 మంత్రం 5 (1-1-5):

తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో  అథర్వవేదః : వాటిలో అపరా విద్య ; ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం

శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్దో జోతిషమితి  :   శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం ఇవి 

అథ పరా యయా తదక్షరమథి గమ్యతే  : ఇక దేనిచేత ఆ అక్షరం బ్రహ్మ ; పొందుతారో; పరావిద్య 

ఇప్పటివరకూ చదివిన  ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం అవన్నీ అపరావిద్య కిందకు వస్తాయి;  బ్రహ్మ జ్ఞాన సముపార్జన  పరావిద్య; అని గురువుగారు చెబుతారు. 

నా మాట:

మనలో చాలామంది "నేను" అంటే తన పంచేంద్రియాలూ అవి పనిచేసే పనులు అనుకుంటారు. ఇంకొంచెం ముందుకు పోయిన  వారు "మనసుని" గుర్తించి దాని పోకడల మీద, ప్రేమ పాటలు, విరహ పాటలూ, పాడుకుంటూ ఉంటారు. "నేను" అంటే ఇదేనా ! 

కాదు కాదు అంటారు పండితులు. ఇంకా మనకి తెలియనిది ఉంది మనలోఉన్న అంతఃకరణ (Conscience ) అని అంటారు. దానిని అర్ధం చేసుకోటానికి  ప్రపంచంలో  పెద్దపెద్ద తలకాయలు (Columbia , Harvard , MIT మేధావులు) కుస్తీ పడుతున్నారు. 

రాబోయే పోస్టుల్లో మన శాస్త్రాలు (ఉపనిషత్తులు) లో చెప్పిన పరా విద్య కి Conscience కి సంబంధం ఉందేమో తెలుసుకుందాము.

ఉపనిషత్తుల మీద తెలుగులో వ్రాసిన ఈ క్రింది ఉపన్యాసాలు చాలా ఉపయోగపడతాయి:

ఉపనిషత్

Monday, September 13, 2021

175 ఓ బుల్లి కథ -- అమెరికాలో మా తోట

   


అమెరికాలో సెప్టెంబర్ మొదటి సోమవారం "లేబర్డే" వస్తుంది. ఆ రోజు అందరికీ శలవ. అధికారికంగా వేసవి వెళ్లిపోయినట్లు లెక్క. వాతావరణం కూడా చల్లబడుతుంది. పెరట్లో వేసిన మొక్కలు కి కూడా ఇది చివరి నెల. అన్నీ వాడిపోయి విడిపోయి రాలిపోతాయి. ఈ సంవత్సరం గోంగూర, దోసకాయ, బీరకాయ, చిక్కుడు, టమాటో, ఎల్లో స్క్వాష్ వేశాము. దోసకాయలు బాగా వచ్చాయి. గోంగూర బాగా వచ్చింది. ఒక పది బీరకాయలు వచ్చాయి. మిగతావన్నీ నామకః పెరిగాయి గానీ ఉత్పత్తి చాలా తక్కువ. 
పెరట్లో తోట ఉంటే ఆ కిక్ వేరు. గోంగూర పచ్చడి ఎన్ని సార్లో చేసుకున్నాము. దోసకాయలతో చాలా చేశాము. దోసకాయ పచ్చడి ఎక్కువగా చేశాము , దోసకాయకూర, పప్పు వారానికి ఒకసారి. రెండేళ్ల క్రిందట మా మరదలు పద్మ రోజూ పెరట్లోకి వెళ్ళి ఏదో కోసుకువచ్చి కూరో పప్పో పచ్చడో చేసేది. పచ్చి  టమాటో తో పచ్చడి చాలా బాగుంటుంది. రెండు బీరకాయలు ఒకపూట కూరకి సరిపోతాయి. లేత బీరకాయ కూర లేత తాటి ముంజలు తిన్నట్లు ఉంటుంది. రాత్రి పూట లేత బీరకాయలతో చేసిన కూర తింటూ ఉంటే "కఠెవరం" లో చిన్నప్పటి రాత్రిళ్ళు బాసీపెట్టు వేసుకుని బయట కూర్చుని కంచాల్లో అన్నం తిన్న రోజులు గుర్తుకువచ్చాయి. మాఇంట్లో ఎందుకో బీరకాయ కూర రాత్రిళ్లే చేసేవాళ్ళు. ఎల్లోస్క్వాష్ పప్పు చాలాబాగుంటుంది. చిక్కుడే సరీగ్గారాలేదు. కాకరకాయ వేశాముగానీ మొక్కే రాలేదు. వేసవిలో grandkids వస్తే కుండీలో గుమ్మడి గింజలు నాటించి మొక్కలు వస్తే తోటలో వేయించాము. మొక్కలు మాత్రం బాగా పెరిగాయి గానీ పెద్ద గుమ్మడి కాయలు రాలేదు. పిందెలు మాత్రం ఉన్నాయి. 

ఇంకా రెండు నెలల్లో చెట్ల ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడులు అవుతాయి. ఆ తరువాత "స్నో" , చలి. మళ్ళా  అందరం ఏప్రిల్ కోసం ఎదురు చూడటం. విత్తనాలు ఇంట్లో వేసి మొక్కలని పెంచటం. "మే" లో వాటిని తోటలో నాటి రోజూ నీళ్ళుపోసి ఎంతవరకూ పెరిగాయో చూడటం. జీవితమే ఒక రంగుల రాట్నం అలా "ఆశా" "నిరాశ" లతో కదిలిపోతూ ఉంటుంది. 


Monday, September 6, 2021

174 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 5 ముగింపు (Ishopanishad)

దాదాపు రోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. మన పని రోజు మొదలవుతుంది. అలాగే సాయంత్రం అస్తమిస్తాడు. మన పని రోజు ఆగిపోతుంది. రాత్రి మొదలవుతుంది.

రాత్రిపూట చంద్రుని వెలుగులో విశ్రమిస్తాము. అది కూడా సూర్య భగవానుడు మనకోసం ఇచ్చిందే. స్వయంగా చంద్రునికి కాంతి నిచ్చే శక్తి  లేదు. సూర్యునికి మనమీద ఎందుకు అంత  ప్రేమ ? 

సూర్యుడు సముద్రాలూ నదులలో నీళ్ళని ఆవిరిగా మార్చి మేఘాలుగ చేసి మన వేపు తీసుకు వచ్చి వర్షాలు కురిపించి పంటలు పండిస్తాడు. ఎందుకలా సూర్యుడుచెయ్యాలి ?

మనం బతకాలంటే గాలి లోని ప్రాణవాయువు పీల్చాలి. బొగ్గుపులుసు గాలిని వదలాలి. మళ్ళా  గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువు తో నింపటానికి సూర్యుడు కావాలి. చెట్ల ఆకులద్వారా బొగ్గుపులుసు వాయువు తీసుకుని దానిని మార్చి ప్రాణవాయువు గాలిలోకి పంపుతాడు. 

ఇంతెందుకు మన జీవితం సుఖంగా గడపటానికి కావలసిన విటమిన్ డి ఇచ్చేది కూడా సూర్యుడే. శరీరానికి కొంత సేపు ఎండ తగిలితే చాలు. 

మనం గుర్తించినా గుర్తించక పోయినా మన జీవితం అంతా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు మనకి అవన్నీ ఎందుకు చేయాలి ?. తన కర్తవ్యం కాబట్టి. 

అందుకే యాజ్ఞవల్క్య మహా ముని రోజూ సూర్య భగవానుని ఆరాధించే వాడు. అప్పుడు  తన మనసులో మెదిలిన భావాలతో కూర్చినదే, ఈశా వాస్య  ఉపనిషత్. దానిలో కొన్ని ముఖ్య మంత్రాలు.

శాంతి మంత్రం:

 ఓం పూర్ణ మదః  పూర్ణమిదం  : అది పూర్ణం ఇది పూర్ణం 

పూర్ణా పూర్ణ ముదశ్చతే      : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినది 

పూర్ణస్య  పూర్ణమాదాయ పూర్ణ మేవా  వశిష్యతే  : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినా ఆ పూర్ణం పూర్ణమే 

ఓం శాంతి  శాంతి శాంతిః॑

పరమాత్మ పూర్ణం. ఆ పూర్ణం నుండి వచ్చిన ఈ జగత్ పూర్ణం. అంతేకాదు ఈ పూర్ణం ఆ పూర్ణం నుండి రావటం మూలాన ఆ పూర్ణం ప్రతిభ ఏమీ తగ్గలేదు అది ఇంకా పూర్ణముగానే ఉంది. 

ఇక్కడ పూర్ణం అంటే సంపూర్ణం అని అర్ధం తీసుకుంటే మనకి శ్లోకం తేలిగ్గా అర్ధం అవుతుంది. ఉదాహరణకి: ఒక గింజ మొక్కగా మారుతుంది. అదే పెద్దదయి పూవులు కాయలు గాచి గింజలు తయారుచేసి ఎండిపోయి నశిస్తుంది. మళ్ళా ఆ గింజల నుంచి మళ్ళా మొక్కలు చెట్లు వస్తున్నాయి. మొక్క జీవితం ఒక స్వయం ప్రవర్తక క్రియ (automatic ). నిదానించి చూస్తే ప్రకృతిలో ఇటువంటివి ఎన్నో.

మనతో సహా ఈ జగత్ ఆ పరమాత్మ నుండి పుట్టింది కాబట్టే, ఆ "పూర్ణం"నుండి వచ్చిన ఈ "పూర్ణం", స్వ  "పూర్ణం"  మన ప్రమేయం లేకుండా, రోజూ తన పని తాను చేసుకుపోతుంది.

సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాలు కురుస్తున్నాయి , పంటలు పండుతున్నాయి. మనం జీవించటానికి ఆహారం, నీళ్ళు, గాలి లభ్యమవుతున్నాయి. జీవులు పుడుతున్నారు. పోతున్నారు. మన ప్రమేయంలేకుండా నే కాలచక్రం ముందుకు కదిలిపోతూ ఉంది ఎందుకంటే మనమూ మనని సృష్టించిన పరమాత్మ రెండూ  సం "పూర్ణం"(Complete ) మరియూ స్వ "పూర్ణం"(automatic ) కూడా. 

మొదటి మంత్రం:

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  :   తప్పకుండా(వాస్య) పరమాత్మ(ఈశా) అని గుర్తించు 

యత్కించ  జగత్యామ్  జగతు     :       ప్రపంచంలో నీకు కనపడేదంతా

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)      :      ఈ కొత్త దృక్పధంతో చూడటం నేర్చుకుని (జీవితం) ఆనందంగా గడుపు

మాగృతః  కస్య  సిద్దనం                :     ఇంకొకళ్ళ ధనం కావాలని కోరుకోకుండా 

ప్రపంచంలో కనపడే అన్ని జీవులలోనూ పరమాత్మ అంశాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఇంకొకళ్ళ సంపదకు ఆరాటపడకుండా జీవితం ఆనందంగా  గడుపు. 

ఇక్కడ ఆనందంగా గడుపు అంటే బార్లకి, క్లబ్బులకి వెళ్ళి తాగి తందనాలాడమని కాదు. పరమాత్మను స్మరిస్తూ ప్రార్ధిస్తూ జీవితం ఆనందంగా గడపమని. అలాచేయలేము అనుకుంటే క్రింది శ్లోకంలో చెప్పినట్లు చెయ్యమని ఉపనిషత్ చెబుతోంది..

రెండవ మంత్రం  :

కురువం నేవేహ కర్మాణి  నువ్వు వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి.

జిజీ విషేచ్చతకం సమాః  : ఇతరులకు సహాయపు పనులు చేస్తూ.

ఏవం త్వయ్  నాణ్యథె థొస్తి  : నీలాంటి వాళ్లకి ఇదొక్కటే మార్గం.

నకర్మ లిప్యతే  నరే  : ఆ (సహాయము చేసిన) పనులు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టవు.

నువ్వు మొదట వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఇతరులకు సహాయపడే పనులు చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా,  దేవునికి అర్పణబుద్ది తో జీవిస్తే నువ్వు చేసిన ఆపనులు నిన్నెప్పుడూ బాధపెట్టవు. నీలాంటి వాళ్లకి  (ధ్యాన మార్గము కుదరని వారికి) ఇదొక్కటే మార్గం. 

ఇక్కడ ఎటువంటి పనులు చేయాలి అనే సమస్య వస్తే  భగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:

1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.

2. దేవ  యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రత్త గా చూచుట.

3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .

4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.

5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.

మన జీవితంలో మనం చేసే పనులు చాలావరకు ఇతరులతో చెయ్యవలసి ఉంటుంది. అందరినీ అన్నిటినీ మనం కట్టుబాటులో ఉంచలేము. వారి వారి కర్మ ఫలాల ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చెయ్యగలిగినదల్లా మంచి జరగాలని ప్రార్ధించటమే.

చివరి పద్దెనిమిదవ మంత్రం :

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్ :  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్ : మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో : మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ :   నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా నీకు నన్ను నేను అర్పించుకోవటమే.