Monday, September 20, 2021

176 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-1 (Mundakopanishad )

ముండకోపనిషత్ అధర్వణ వేదం నుండి తీసికొన బడినది. ఇది మనకున్న పది ముఖ్య ఉపనిషత్ లలో ఒక ముఖ్య ఉపనిషత్. దీనిలోని 65 శ్లోకాలు 3 భాగాల్లో ఉన్నాయి. ఒక్కొక్క భాగమూ మళ్ళా రెండు ఖండాలుగా గ విభజించబడ్డాయి. 1-1-3 అంటే  మొదటి ముండకం లోని మొదటి ఖండంలో 3వ మంత్రం. దీనిలో భాగాన్ని ముండకం అంటారు.

సామాన్యంగా ఉపనిషత్ లు శిష్యుడి ప్రశ్నతో మొదలయ్యి దానికి గురువుగారి సమాధానంతో ముగుస్తుంది. ఇక్కడ శిష్యుడు శౌనికుడనే గృహస్థు, గురువుగారిపేరు అంగీరసుడు.

గృహస్థయిన శౌనికునికి తాను చెయ్యవలసిన కర్మకాండలు, యజ్ఞ యాగాదులూ అన్నీ చేసినా ఇంకా ఏదోమిగిలిపోయిందన్న దిగులు. దగ్గర ఆశ్రమంలో ఉన్న అంగీరసుడనే మహాముని దగ్గరకు వెళ్ళి తన అసంతృప్తిని చెప్పి జీవితంలో ఏవి చదివితే అంతా తెలిసిపోయి ఇంకా  చదవవలసిన/చెయ్యవలసిన అవసరము ఉండదో చెప్పమని అర్ధిస్తాడు .

ముండకం 1 ఖండం 1 మంత్రం 3  (1-1-3):

శౌనకో హ వై మహాశాలో ఆంగీరసం   : శౌనికుడనే మహాశాలి అంగీరసుని 

విధివధుప్రసన్న హ  పప్రచ్చ           : శాస్త్రోక్తరీత్యా సమీపించి ప్రశ్నించాడు 

కాస్మిన్ను భగవో విజ్ఞతే                       : దేనిని తెలుసుకుంటే భగవంతుడూ 

సర్వమిదం విజ్ఞాతం భావతీతి           : ఈ సర్వస్వమూ  తెలిసికోబడుతుంది అని 

ముండకం 1 ఖండం 1 మంత్రం 4 (1-1-4):

తస్మై స  హోవాచ           : అతనితో అతను చెప్పాడు 

ద్వే విద్యే వేదితవ్యే ఇతి : రెండు విద్యలు  తెలుసుకోవలసినవి అని 

హ స్మ యద్                        : అవి 

బ్రహ్మవిదో వదన్తి                : మహాత్ములు చెబుతారు 

పరా చైవాపరా చ                 :  పరా విద్య అపరా విద్య 

శౌనికుడు యజ్ఞ యాగాదులు చేస్తూ సౌభాగ్యవంతమైన జీవితం గడుపుతున్న ఒక గొప్ప గృహస్థు . అంగీరసుడు వారసత్వముగా బ్రహ్మజ్ఞానము తెలిసికొనిన గురుపరంపరలో ఏడవ వ్యక్తి. 

వేసిన ప్రశ్న: ఏది తెలుసుకుంటే అంతా తెలుకున్నట్లు అవుతుంది? (ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవటానికి ఇంకేమీ ఉండదు అని)

ఈ ప్రశ్నకిసమాధానం 4 వ మంత్రంలో గురువుగారు చెబుతారు. పర విద్య, అపరా విద్య అని రెండు విద్యలు ఉన్నాయి అవి నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్లే అని మహాత్ములు చెబుతారు అని.

శౌనికుని ప్రశ్న మనం సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్నాళ్ళీ చదువు? ఈ  చదువులన్నీ ఎప్పుడు ఆపెయ్యాలి ? పిల్లలు అడిగే ఈ ప్రశ్నకి మనం సామాన్యంగా సమాధానం చెప్పం కానీ గురువుగారు శౌనికుని ప్రశ్నకి సమాధానం చెప్పటం ప్రారంభించారు. 

విద్యలు రెండు రకాలు పరా విద్య , అపరా విద్య . ఇంతవరకూ నీవు నేర్చుకున్న వన్నీ అపరా విద్యలు (వేదాలూ ఉపనిషత్తు లతో సహా ), నువ్వు గనక పరా విద్య కూడా నేర్చుకుంటే ఇంకేమీ  నేర్చుకోవక్కరలేదు, అని శిష్యుడు శౌనికుని తో చెబుతారు గురువుగారు అంగీరసుడు.

ముండకం 1 ఖండం 1 మంత్రం 5 (1-1-5):

తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో  అథర్వవేదః : వాటిలో అపరా విద్య ; ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం

శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్దో జోతిషమితి  :   శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం ఇవి 

అథ పరా యయా తదక్షరమథి గమ్యతే  : ఇక దేనిచేత ఆ అక్షరం బ్రహ్మ ; పొందుతారో; పరావిద్య 

ఇప్పటివరకూ చదివిన  ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం అవన్నీ అపరావిద్య కిందకు వస్తాయి;  బ్రహ్మ జ్ఞాన సముపార్జన  పరావిద్య; అని గురువుగారు చెబుతారు. 

నా మాట:

మనలో చాలామంది "నేను" అంటే తన పంచేంద్రియాలూ అవి పనిచేసే పనులు అనుకుంటారు. ఇంకొంచెం ముందుకు పోయిన  వారు "మనసుని" గుర్తించి దాని పోకడల మీద, ప్రేమ పాటలు, విరహ పాటలూ, పాడుకుంటూ ఉంటారు. "నేను" అంటే ఇదేనా ! 

కాదు కాదు అంటారు పండితులు. ఇంకా మనకి తెలియనిది ఉంది మనలోఉన్న అంతఃకరణ (Conscience ) అని అంటారు. దానిని అర్ధం చేసుకోటానికి  ప్రపంచంలో  పెద్దపెద్ద తలకాయలు (Columbia , Harvard , MIT మేధావులు) కుస్తీ పడుతున్నారు. 

రాబోయే పోస్టుల్లో మన శాస్త్రాలు (ఉపనిషత్తులు) లో చెప్పిన పరా విద్య కి Conscience కి సంబంధం ఉందేమో తెలుసుకుందాము.

ఉపనిషత్తుల మీద తెలుగులో వ్రాసిన ఈ క్రింది ఉపన్యాసాలు చాలా ఉపయోగపడతాయి:

ఉపనిషత్

2 comments: